బుధవారం, జులై 02, 2008

మరికొన్ని కాలనీ కబుర్లు

నిన్న చెప్పిన ఆటలలో కొన్ని చాలా బాగా ఎంజాయ్ చేసే వాడ్ని కాని మా తాత గారి ఇంట్లో అన్నింటికన్నా ఎక్కువ నాకు సంతోషాన్ని ఇచ్చే విషయం మాత్రం. సాయంత్రం పూట చీకటి పడిన తర్వాత చాల్ల గాలికి ఆరు బయట నులక మంచం మీద తాతయ్య పక్కన పడుకుని తను చెప్పే కబుర్లు వినడం. తను రామాయణ మహా భారతాలలో చిన్న చిన్న పిట్ట కధ లు, మిలట్రీ కధలు, ఊరిలో బాంబుల గొడవలు అలా ఎక్కడెక్కడి వింతలు విశేషాలు బోలెడు కబుర్లు చెప్తుండే వారు. తను పెద్ద గా చదువుకో లేదు చందమామ లాంటి పుస్తకాలలో పురాణ కధలు కూడ బలుక్కుని మెల్లగా చదివే వారు అందుకని నేను కొంచెం పెద్దయ్యి బాగా చదవడం వచ్చేసిన తర్వాత చందమామ, బాల మిత్ర లాంటి పుస్తకాలలో కధలు నా చేత చదివించుకుని వింటూ వాటికి తన వ్యాఖ్యానాన్ని జోడించి దానిలో నీతిని గురించి చక్క గా అర్ధం అయ్యేలా చెప్తుండేవారు.

మరీ చిన్నప్పుడు కాదు కాని కొంచెం పెద్దయిన తర్వాత సాయంత్రం అలా ఆరుబయట నులక మంచం మీద వెల్లకిలా పడుకుని గుండెల మీద బేటరీ రేడియో పెట్టుకుని వినడం కూడా చాలా ఇష్టం. ఇలాంటి నా అందమైన సాయంత్రాలలో ఒక అపశ్రుతి మా పక్కింటి అంకుల్, ఆయన అందరితో నవ్వుతూ గౌరవం గా మాట్లేడే వారు ఎప్పుడైనా ఎదురు పడితే "ఏం బాబు బావున్నావా" అంటూ ఆప్యాయం గా పలకరిస్తారు, చాలా మర్యాదస్తుడు కాకపోతే సాయంత్రం ఆరింటి వరకే. అది దాటిందంటే "ఏం బాబు" కాస్తా "ఏరా కుర్ర నాకొడకా" లోకి మారిపోతుంది. ప్రతి రోజు ఫుల్ల్ గా మందు కొట్టేసి నానా యాగీ చేస్తుండే వారు, నేను కొంచెం పెద్దయిన తర్వాత నవ్వుకునే వాడ్ని కాని చిన్నపుడు ఆయన అరుపులు అవీ విని చాలా భయం వేసేది. మేం వెళ్ళినప్పుడు కూడా ఒకో సారి తాత గారు నాతో ఆడకుండా వాళ్ళ గొడవలు తీర్చాల్సి వచ్చేది.

కారంపుడి గురించి చెప్తూ కోడి పందాల గురించి చెప్పుకోక పోతే అసంపూర్తి గానే ఉండి పోతుందేమో. సాధారణం గా సంక్రాంతి, దసరా లాంటి పండగలకి మేము తాతగారి ఊరు వెళ్ళేవాళ్ళం మరీ బాలకృష్ణ సినిమాలో చూపించినట్లు కాదు కాని కోళ్ళ పందాలు జరిగేవి, నాకు ఒక సారి చూసినట్లు గుర్తు. మరి నేను చిన్న పిల్లాడ్ని కదా అటు వెళ్ళనివ్వరు అనమాట. అప్పట్లో మా ఇంట్లో కూడా ఒక కోడి ని పెంచే వాళ్ళు, కువ కువ లాడుతూ దాని వెనకాలే తిరిగే బుజ్జి బుజ్జి పిల్లల్ని చూడటం అంటే నాకు ఎంత సరదానో. అప్పుడప్పుడు అపురూపం గా ఆ చిన్న చిన్న కోడి పిల్లల్ని పట్టుకుని తెగ మురిసి పోయే వాడ్ని వెచ్చగా ఉండే వాటి స్పర్శ ఇంకా నాకు అలానే గుర్తుండి పోయింది.

సంక్రాంతి టైం లో అనుకుంటా మా ఊర్లో బండ లాగుడు పోటీ లు జరిగేవి. ఒక పెద్ద పొడవాటి బండకి అటు ఇటు జోడెడ్లని కట్టి ఆ బండ మీద నుంచుని ఎడ్లని అదుపు చేస్తూ లాగించాలి. ఆ పోటీలు చూడటనికి జనం బాగా వచ్చే వాళ్ళు. అసలు సంక్రాంతి అంటే 3 రోజులకూ మూడు ప్రత్యేకతలతో పండుగ బ్రహ్మాండం గా జరిగేది. ఇంటి ముందు ముగ్గులు, హరిదాసు లు, గంగిరెద్దులు, ఇంకా భోగి మంటలు ఇవేవీ మర్చిపోలేను. కాలేజి కి వచ్చాకా చాలా తక్కువ సంక్రాంతి పండగలకి ఇంట్లో ఉన్నాను ఒక వేళ వున్నా అప్పటి సందడి ఇప్పుడు ఎక్కడ లెండి ఏదో అతిధి ఫుడ్స్ నుండి పిండి వంటలు, పులిహార తో సహా కొనుక్కుని వచ్చి పండగ అయింది అనిపించే వాళ్ళని చాలా మందిని చూస్తున్నాను. నేనూ అంతే వాళ్ళలో ఒకడ్ని, అసలు ఇక్కడ అమెరికా లో ఉంటే అందరికీ ఫోన్ చేసి విష్ చేయడమే పండగ అనే స్తితి కి వచ్చేసా అనుకోండి అది వేరే విషయం.

అన్నట్లు కారంపుడి అంటే ఇంకో చిన్న విషయం చెప్పాలి, ఇప్పటికీ ఇంకా వేస్తున్నారో లేదో తెలీదు కాని అప్పట్లో అంత్రం వేసే వాళ్ళు అని వుండేవారు, కారంపుడి లో కూడా ఒకతను ఉండే వాడు. నాకు చిన్నప్పుడు ఎపుడో ఒంట్లో బాగా లేకపోతే అతని దగ్గరకి తీసుకు వెళ్ళి అది కట్టించారు. అంత్రం/తాయత్తు అంటే చిన్న రాగి సిలిండర్ లాగా ఉంటుంది medical capsule కన్నా కొంచెం పెద్ద సైజు లో రెండు పక్కలా చదును గా మూతల లాగా వుండి మధ్య లో తాడు కట్టడానికి చిన్న రింగులు వుండేవి. మనకి మొదటి సారి అది కట్టించినప్పుడు అసలే మనకి curiosity ఎక్కువ రిపేర్లు అంటే సరదా కదా సో దానిలో ఏముంటుందా అని నానా కష్టాలు పడి విరగొట్టి తీసి చూసేసాను లోపల ఏమీ లేదు. ఒక పలచని రాగి రేకుని అలా ఆ షేప్ లో చుట్టి ఇచ్చాడు అంతే...

సో అలా దాన్లో ఏదో ఉంటుంది అని మనం చేసిన ఎక్స్పరిమెంట్ తుస్సనడమే కాకుండా దాని వల్ల అమ్మ చేతిలో గాఠ్టిగా ప్రైవేటు చెప్పించుకోవాల్సొచ్చింది. అవునూ! అసలు మీకు ప్రైవేటు చెప్పించు కోడం అంటే తెలుసా... లేదంటే లాభం లేదు బుడుగు చేత మీకు ప్రైవేటు చెప్పించేయాల్సిందే...

సరేనండీ కారంపుడి గురించి దాదాపు నాకు గుర్తున్నంత వరకూ వ్రాసేసాను ఇంకా ఏమన్నా గుర్తొస్తే మధ్య మధ్య లో వ్రాస్తుంటాను. రేపు మరో విషయం మీద మాట్లాడుకుందాం అంత వరకూ శలవా మరి.

--మీ వేణు.

4 వ్యాఖ్యలు:

 1. సాయంత్రాలు బాటరీ రేడియో గుండెల మీద పెట్టుకుని వినడం ఒక మధురానుభూతి! అలాంటివి ఒక్కసారైనా అనుభవించాలి. ఇప్పుడు బలవంతంగా వడ వడ వాగే FM జాకీల గోల తప్ప విజయవాడ రేడియో కేంద్రం నుంచి వచ్చే కార్యక్రమాలు ఎవరు వింటున్నారు? బాగుంది వేణూ, నీ టపాలు చదువుతుంటే మా వూరెళ్ళాలనిపిస్తోంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. ఇంచుమించుగా ఇలాంటి జ్ఞాపకాలే నాకూ ఉండేవి వేణూ !

  చలికాలం లో కాదు కానీ, ఎండాకాలం లో మాత్రం రాత్రైతే అందరూ మంచాలు తెచ్చి ఆరు బయట రోడ్ మీద వేసేవారు. బజారంతా అలా మంచాలతో నిండిపోయేది. అరుగుల మీద ఆడవాళ్ళు చేరిపోయేవారు. అరుగంటే గుర్తొచ్చింది. నాకు మా ఊళ్ళో, మా ఇంటి దగ్గగర నాకు బాగా ఇష్ఠమైన ప్లేస్ ఇదే. సంధ్యా సమయానికి, అరుగు మీద కూర్చుని వచ్చే పోయే వాళ్ళని చూస్తూ, పసువులు ఇంటికి చేరుతూ..అమ్మ పక్కనే కూర్చుని మల్లెపూలు కడుతూ చెప్పే కబుర్లు. వా !

  ఇంక రాత్రికి ఆ బజార్ పిల్లలం అంతా దాగుడుమూతలు, ముక్కు గిల్లుడాటలు. పడుకోబోయే ముందు మా రామయ్య తాతయ్య కధలు వింటూ అలా గడిపేసి, ఇంక డాబా ఎక్కేసేవాణ్ణి. అలా జాబిల్లితో కబుర్లు చెప్పుకుంటూ, చుక్కలని లెక్కపెట్టుకుంటూ ఎప్పటికో నిద్రలోకి జారుకునేవాణ్ణి.

  పండుగలంటే, ప్రతి పండుగకీ ఒక్కో ప్రత్యేకం.

  సంక్రాంతికి ముగ్గులు, హరిదాసులు, గంగిరెద్దులు, గొబ్బిళ్ళూ, ఎడ్ల పందాలు.

  శ్రీరామ నవమికి పందిళ్ళు, రేడియో లో వచ్చే భద్రాద్రి సీతారాముల కళ్యాణం కామెంటరీ, వడపప్పు పానకాలు. 7 రోజులు పందిళ్ళలో జరిగే రక రకాల ప్రోగ్రాములు.

  అట్లతద్ది వస్తే ఉయ్యాల పందాలు

  వినాయక చవితికి తెల్లవారు ఝామునే లేచి పత్రి కోసుకుని రావటం,
  ఊరి చెరువులో తెప్ప తిరుణాల, నిమజ్జనం !

  దీపావళికి ఇంక టపాసులు, దివిటీలు..

  ఇలా చెప్పుకుంటూ పోతూనే ఉండొచ్చు ! మంచి విషయాలని పోస్ట్ చేస్తున్నారు. Keep writing !

  :)

  ప్రత్యుత్తరంతొలగించు
 3. శివరాత్రి గురించి చెప్పటం మరిచాను :) కోటప్ప కొండ తిరుణాలలో ఎక్కడో మనం కలిసే ఉంటాం !

  ;)

  ప్రత్యుత్తరంతొలగించు
 4. @సుజాత గారు
  నెనర్లు, ఇంకెందుకాలశ్యం వెంటనే ప్లాన్ చేసుకోండి మరి. నిజమేనండి FM stereo లో సాంకేతిక పరం గా quality వున్నా ప్రసారాలు గందర గోళమే.

  @Venu
  నెనర్లు, చాలా చక్కటి విషయాలు గుర్తు చేసారు, శ్రీరామ నవమి పందిళ్ళూ, అట్లతద్ది, వినాయక చవితి అన్నీ మధురమైన జ్ఞాపకాలే. శివరాత్రి కి నేను కోటప్ప కొండ వెళ్ళింది తక్కువే అండీ ఒక 2-3 సార్లు వెళ్ళుంటానేమో. కాకపోతే కోటప్ప కొండ రోడ్ మొదట్లో చిత్రాలయ హాలు దగ్గర ప్రభలు చూడటానికి మాత్రం వెళ్ళేవాడ్ని :-)

  ప్రత్యుత్తరంతొలగించు

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.