బుధవారం, నవంబర్ 17, 2010

రక్త చరిత్ర - 1

"నా సినిమాలో హింసా రక్తపాతం మాత్రమే ఉంటాయి అవి చూడాలనుకున్న వాళ్ళె ఈ సినిమాకు రండి మిగతావాళ్ళు చూడకపోయినా పర్లేదు" అంటూ వర్మ స్పష్తం చేశాక కూడా రక్త చరిత్ర సినిమా చూడాలా అసలే మనకి హింసాత్మక సినిమాలను భరించడం కష్టం. రక్త చరిత్ర సినిమా విడుదలైన రోజు నా ఆలోచనలు ఇవి కానీ వర్మ మీదున్న అపారమైన అభిమానం తో అసలు కథేమిటో ఎలా తీసాడో తెలుసుకోడానికి ఒక్క సారైనా చూడకపోతే ఎలా అని తెలుగు వర్షన్ కోసం వెతికాను కానీ బెంగళూరు లో రిలీజ్ అవ్వలేదు ఆహ సర్లే ఈ విధంగా తప్పించుకున్నాం అనుకుని ఇక ఆ ఆలోచన వదిలేశాను. అనుకోకుండా ఓవారం క్రితం షో టైమింగ్స్ చూస్తుంటే బెంగుళూరు లో తెలుగు వర్షన్ కూడా విడుదల అయి ఉండటం గమనించిన వెంటనే పరుగున వెళ్ళిపోయాను. థియేటర్ లోపలికి అడుగుపెట్టి పరికించి చూస్తే ఒక మోస్తరు పెద్ద ఆడిటోరియం సగానికి నిండటమే కాక అందులో సగం మహిళా ప్రేక్షకులు ఉండటం నన్ను ఆశ్చర్యపరచింది. ఎంత పిచ్చినా____ని అని తనకు తానే చెప్పుకున్నా, ఎలాంటి సినిమాలు తీసినా వర్మకు ఉన్న అభిమానుల సంఖ్య తగ్గే ప్రసక్తే లేదు అనుకుని నవ్వుకుంటూ నా సీట్లో సెటిలై సినిమా చూడటంలో లీనమయ్యాను.


ఆంగ్ల చిత్రాలు ఒరిజినల్ డివిడి చూసే అలవాటున్న వారు ఎడిషనల్ లాంగ్వేజ్ ఆప్షన్ లో డైరెక్టర్స్ కామెంటరీ అన్న ఆప్షన్ చూసి ఉంటారు ఇందులో సినిమా డైలాగ్ లు చిన్నగా వినిపిస్తూ ఆ షాట్ ఎలా ప్లాన్ చేసిందీ ఎంత కష్టపడింది ఇంకా ప్రేక్షకులు అక్కడ గమనింఛవలసిన అంశాలు ఇత్యాది వివరాలు సినిమా డైరెక్టర్ తన స్వరంతో చెప్తూ ఉంటాడు. ఒకవిధంగా దర్శకుడు దగ్గరకూర్చోబెట్టుకుని తన పాయింట్ ఆఫ్ వ్యూ లో మనకు సినిమా చూపించినట్లనమాట. నాకు ఒక సారి చూసిన సినిమాలు ఇలా డైరెక్టర్స్ కామెంట్ తో చూడటం చాలా ఇష్టం బహుశా దీన్ని చూసి ప్రేరణ పొందారో ఏమో కానీ వర్మ తన వ్యాఖ్యానంతో సినిమా ప్రారంభించారు. చాలాచోట్ల ఈ వ్యాఖ్యానం బాగానే సహాయ పడింది కాని ఒకటిరెండు సార్లు మాత్రం అక్కడ జరుగుతుంది మళ్ళీ ఈయన చెప్పాల్సిన పనేముంది అనిపించింది. ఆమాత్రం విసుగైనా మనకి కలగడానికి కారణం తన కంఠస్వరం. అదే వ్యాఖ్యానాన్ని మరికాస్త ట్రిం చేసి సాయికుమార్ లాంటి మరో గంబీరమైన స్వరం ఉన్న నటుడితో చెప్పించి ఉంటే ఇంకా చాలా బాగుండేది.

ఇంకా సినిమా చూడని వారు సినిమా చూసే ఉద్దేశ్యమున్న వారు నీలిరంగులో ఉన్న ఈ మూడు పేరాల సినిమా కథ చదవకుండా ఉండడం ఉత్తమం. నరసింహారెడ్డికి ముఖ్య అనుచరుడైన వీరభద్రయ్య ఎదుగుదలను చూసి ఓర్వలేని నాగమణి రెడ్డి నరసింహా రెడ్డికి అతనిపై లేనిపోనివి చెప్పి వారిద్దరిని విడదీయడమే కాక నరసింహారెడ్డే వీరభద్రయ్యని నరికేయమని పురమాయించేలా చేస్తాడు. ఎన్నికలలో వీరభద్రయ్య వర్గానికి సానుభూతి దక్కకూడదని వీరభద్రయ్య కుడిభుజమైన మందాని బెదిరించి అతనిచేతే వీరభద్రయ్యని అవినీతిపరుడని ఆరోపింప చేసి దారుణంగా చంపిస్తాడు నాగమణి. తన తండ్రిని చంపింది మందా అయినా చంపించింది నాగమణి, నరసింహ అని తెలుసుకున్న శంకర్ అడవిలో దాక్కుని ఒక్కొక్కరినీ చంపుతూ ఉంటాడు. తండ్రి చావుతో గ్రామానికి వచ్చిన ప్రతాప్ తన అన్న శంకర్ ను కూడా ఎన్ కౌంటర్ పేరిట పోలీసులు పొట్టనపెట్టుకోవడంతో చలించిపోయి తన పట్నంచదువు పక్కన పెట్టి ప్రతీకారంగా నరసింహా, మందా, నాగమణి ముగ్గురిని చంపేస్తాడు. 

నాగమణి కొడుకూ నరరూపరాక్షసుడు ఐన బుక్కారెడ్డి ప్రతాప్ ను వెదికి చంపడానికి చేసిన ప్రయత్నాలు వృథాఅవ్వగా ప్రతాప్ పాపులారిటీకి గండి కొట్టాలని తన పలుకుబడిని పెంచుకోవాలని అధికారం కోసం తన అన్నను ఎన్నికలలో నిలబెడతాడు. కొత్తగా పార్టీ పెట్టి ఆ ఊరిలో సభపెట్టటానికి వచ్చిన సినీనటుడు శివాజీరావు ను బాంబులతో బెదరగొట్టి వెనక్కి వెళ్ళేలా చేస్తాడు బుక్కారెడ్డి. దాంతో అహం దెబ్బతిన్న శివాజీ రావు బుక్కారెడ్డిని ఎదుర్కోగల ప్రతాప్ ని చేరదీసి "నువ్ చేస్తున్న చెడులో కూడా మంచిని చూసాను కానీ నువ్ అధికారంలేకుండా కేవలం అయుధంతో ఏమీ చేయలేవు బ్రదర్ కనుక నా పార్టీ తరపున బుక్కారెడ్డి అన్నకు పోటీగా ఎన్నికలలో నిలబడు" అని ఆఫర్ చేస్తాడు. నరసింహ ని చంపితే నాగమణి అతన్ని చంపితే బుక్కా ఇలా ఎవరో ఒకరు పుడుతున్నారు కనుక సిస్టం ను బాగు చేయాలంటే తనే సిస్టం అవ్వాలి అని నిర్ణయించుకున్న ప్రతాప్ ఎన్నికలలో నిలబడతాడు.
ఎన్నికలలో ఘన విజయం సాధించిన ప్రతాప్ కు శివాజీరావు మంత్రిపదవి ఇచ్చి గౌరవిస్తాడు. ఘోరమైన ఓటమిని భరించలేక దుఖిస్తున్న బుక్కారెడ్డిని అతను ఎన్నికల సమయంలో చేసిన హత్యల కేసుల్లో అరెస్టు చేయడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ అశ్వని ని చంపేసి జైలు పాలవుతాడు. అలా పోలీసుల కళ్ళెదుట మరో పోలీసాఫీసర్ను చంపి జైలులో ఉన్న బుక్కారెడ్డిని అతనికి ప్రతాప్ పై ఉన్న పగని వాడుకుని తమ పార్టీ ఎదుగుదలకు అడ్డంపడిన ప్రతాప్ ని అంతంచేయాలని పెద్దసారు మరో పెద్దచేతుల త్రినాథరావు సాయంతో బెయిల్ పై విడుదల చేయిస్తాడు. హైదరబాద్ మహేశ్వరి కాంప్లెక్స్ లో ఎవరికీ తెలియకుండా నివసిస్తూ ప్రతాప్ హత్యకు పథకాలు రచిస్తున్న బుక్కారెడ్డిని శివాజీరావు అనుమతితో తన మనుషులను పురమాయించి అతి కౄరంగా హత్య చేయిస్తాడు ప్రతాప్. ఈ హత్యతో శివాజీరావు పార్టీలో కొందరు అసమ్మతి వర్గం ప్రతాప్ ఒక గూండా అని హత్యలు చేసే అతన్ని పార్టీలో ఉంచడానికి వీలు లేదని గొడవచేస్తారు. వారికి సమాధానంగా చంపినది ఒక రావణుడి లాంటి కౄరుడిని అని ప్రతాప్ నారాముడు అని సమర్ధించడమే కాక "శివాజీ రావ్ రాజ్యంలో లో గూండాయిజమనేది కనిపించకూడదు అది అణచి వేయడం మరో పెద్ద గూండా వల్లనే అవ్తుతుంది అది నువ్వే బ్రదర్" అని శివాజీరావ్ ప్రతాప్ కి పూర్తి అధికారం కట్టబెట్టటంతో రాష్ట్రంలో ఒక తిరుగులేని శక్తిగా ఎదుగుతాడు ప్రతాప్. అలా ఎదురు లేకుండా రాష్ట్రాన్ని ఏలుతున్న ప్రతాప్ కు అనుకోని ఒక అడ్డంకి ఎదురైంది ఆ కథ ద్వితీయపర్వంలో అని వర్మ చెప్తుండగా రక్త చరిత్ర-2 ట్రైలర్ తో మొదటి భాగం ముగుస్తుంది.

రెండుగంటల నిడివి గల ఈ సినిమాలో ఒక్క డబ్బున్నోడా పాట తప్ప మరే ఇతర అనవసరమైన సన్నివేశం లేకుండా శరవేగంగా నడిచే కథనంతో ఆద్యంతం ఎక్కడా బోరుకొట్టకుండా నడిపించడంలో వర్మ సఫలమయ్యాడు. అప్పుడే ఇంటర్వెల్ వచ్చిందా అపుడే సినిమా ఐపోయిందా అని అనుకున్నాను. ఈ మధ్య కాలంలో నాకు ఇలా అనిపించిన సినిమాలు చాలా అరుదు. ఇక రక్తపాతం హింస గురించి  ముందునుండీ ప్రచారంలో ఊదరగొట్టడం వలననేమో నాకు మరీ అంత ఎక్కువ అనిపించలేదు, కొన్ని సీన్స్ నెగటివ్ లో చూపించడం,  లాంగ్ షాట్స్, డైరెక్ట్ సబ్జెక్ట్ ని చూపకుండా శబ్దం, చిందిన రక్తం, నటుల హవభావాలతో భీభత్సాన్ని పలికించడం లాటి వర్మ ప్రత్యేకమైన షాట్స్ తో నాకు సగటు ఫ్యాక్షన్ సినిమాలలో ఉన్నహింస కన్న ఏమీ ఎక్కువ లేదు అనిపించింది. ద్వితీయార్ధంలో వయొలెన్స్ పాళ్ళు తక్కువ ఉండటం కూడా నాకిలా అనిపించడానికోకారణం. ఇక విభిన్నమైన కెమెరా యాంగిల్స్, వర్మ స్టైల్ ఆఫ్ టేకింగ్ ప్రతి ఫ్రేమ్ లోనూ కనిపిస్తూ వర్మ అభిమానులను అలరిస్తుంది. ఒక పీరియడ్ ఫిల్మ్ గా వర్మ తీసుకున్న జాగ్రత్తలు అభినందించదగినవి అట్టహాసంగా సుమోలు స్కార్పియోలూ ఉపయోగించకుండా స్కూటర్లు జీప్ లు ఉపయోగించడం ద్వారా చాలా సహజంగా మనం సినిమా కాక ఆసన్నివేశం లో దూరంగా నిలబడి చూస్తున్నామా అన్న అభిప్రాయాన్ని కలిగిస్తాడు. అలానే డిఐ, కాస్ట్యూమ్స్ మరియూ మేకప్ కూడా సహజత్వాన్ని ప్రతిభింబించాయి. ఇవన్ని వర్మ సినిమాలో మినిమం ఎదురుచూసే స్టాండర్డ్స్ వీటిగురించి ప్రత్యేకంగా రాయనక్కర్లేదు అంటారా ఏదో చూసిన సంతోషంలో చెప్తున్నా...

సినిమాలోని ప్రతి పాత్రా ఈసినిమాని తమ నరనరాల్లోకి ఎక్కించుకుని జీవించినట్లు అనిపిస్తుంది ఏంచేశారో కానీ వర్మ అందరినుండీ అలాంటి నటనని రాబట్టుకున్నారు. ప్రతాప్ పాత్రలో వివేక్ లీనమైపోతే బుక్కారెడ్డిగా అభిమన్యు ఒళ్ళు గగుర్పొడిచే కౄరత్వాన్ని పలికించాడు. శివాజీరావు గా శతృఘ్ను అదిరిపోయే మ్యానరిజమ్స్ తో ’బ్రదర్’ ’టాపిక్ ఈజ్ ఓవర్’ లాంటి మాటలు పలకడంలోనూ అలరిస్తారు. నందిని గా చేసిన అమ్మాయి రాధికా ఆప్టే అందం చీరకట్టులో సింపుల్ గా ఉండి ఆకట్టుకుంటుంది, బాణం సినిమాలోని హీరోయిన్ వేదికను గుర్తు చేస్తుంది. కీలకమైన సన్నివేశాలేకాక వీరభద్రయ్య హత్య సన్నివేశంలో మందా వెంటే ఉండి అతనికి రెండో ఆలోచన రానివ్వకుండా అతన్ని ప్రేరేపించడం, భర్తల అకారణ వైరంతో వారి భార్యల మధ్య సంభంధాలు ఎలా మారిపోతాయి, ఫ్యాక్షనిజం రౌడీయిజం రాజకీయ నాయకుల మథ్య సిస్ట్రంలో చేవ ఉన్న పోలీసులు సైతం ఎలా నిస్సహాయులవుతారు ఇలాంటి చిన్న చిన్న సన్నివేశాల చిత్రీకరణ సైతం ప్రత్యేకతతో ఆకట్టుకుంటాయి. సినిమాకు తగిన నేపధ్య సంగీతం సన్నివేశాలకు మరింత ఘాడత చేకూర్చింది కొన్ని చోట్ల రక్త రక్త అంటూ విసిగించినా చాలాచోట్ల ఉపయోగించిన వాయిద్యాలు కానీ శ్లోకాలు కానీ సరైన ఇంపాక్ట్ కలుగజేసాయి అనడంలో ఏమాత్రం సందేహంలేదు. ఇక పాటలంటారా ఇది మాటల సినిమా ఆమాటకొస్తే చేతల సినిమా పాటల సినిమా కాదు కనుక ఆ విషయానికి అంతగా ప్రాముఖ్యత ఇచ్చినట్లు కనిపించదు.

శివాజీరావు పాత్ర గురించి అంతగా గొడవ చేయాల్సిన అవసరం కూడా నాకు ఏం కనిపించలేదు. ఆ పాత్ర అలా ప్రవర్తించడానికి ప్రతాప్ కు సపోర్ట్ చేయడానికి వర్మ సరైన జస్టిఫికేషన్ ఇచ్చాడు. ముల్లును ముల్లుతోనే తీయాలి అన్న సూత్రం అందరికీ తెలిసిందే అందరూ పాటిస్తున్నదే అదే పని శివాజీరావు కూడా చేశాడు. అలాంటి పని అతని గొప్పతనాన్ని ఎందుకు తగ్గిస్తుందో నాకు అర్ధంకాలేదు. నొబడీ ఈజ్ పర్ఫెక్ట్ ఆయన మహానుభావుడైనంత మాత్రాన ఎన్నో మంచి పనులు చేసినంతమాత్రానా ఆ మంచి చేయడనికి అడ్డుపడుతున్న రాక్షసులను తొలగించడానికి పోరాటమార్గాన్ని ఎంచుకోవడం తప్పెలా అవుతుంది. అది కూడా ఒక లీడర్షిప్ లక్షణం అని ప్రజలు ఎందుకు ఒప్పుకోలేకపోతారో నాకెప్పటికీ అర్ధం కాదు. ప్రజాస్వామ్య రాజ్యంలో పోలీసుల అండతో కూడా ఒక ఊరిలోకి అడుగుపెట్టలేని నిస్సహాయ స్థితిలోకి తనని నెట్టివేసిన ఒక రాక్షసుడిని ఎదుర్కోవడానికి ఆయనకి అంతకన్నా మార్గం లేకపోయింది.
మొత్తానికి మరో మంచి సినిమా చూసిన సంతోషం నా మొహంలో ప్రతిఫలిస్తుండగా వర్మ శకంలో పుట్టి అతని సినిమాలు చూస్తూ ఎదుగుతున్నందుకు మరోసారి గర్వపడుతూ ధియేటర్ నుండి బయటకు వచ్చిన నేను ఆ క్షణం నుండే రక్త చరిత్ర రెండవభాగం ఎప్పుడు విడుదల అవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూడటం మొదలు పెట్టాను.

20 వ్యాఖ్యలు:

 1. బ్రదర్, సినిమా చూశాక నాకు ఎలా అనిపించిందో అలాగే ఉంది రివ్యూ. థ్యాంక్స్. టాపిక్ ఈజ్ ఓవర్ ;-)

  ప్రత్యుత్తరంతొలగించు
 2. cool.., as you suggested didn't read the one one blue..!

  Where did you see it B'lore.., I couldn't find it.. :-(

  ప్రత్యుత్తరంతొలగించు
 3. వర్మ వ్యాఖ్యానం మాత్రం నాకస్సలు నచ్చలేదండి, ఇంతకు ముందెప్పుడైనా చెప్పాడో లేదో తెలియదు.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. You might have sen it. First day First show.

  https://www.blogger.com/comment.g?blogID=770684322654275941&postID=533128660365149585

  :D

  >>>"మొత్తానికి మరో మంచి సినిమా చూసిన సంతోషం నా మొహంలో ప్రతిఫలిస్తుండగా వర్మ శకంలో పుట్టి అతని సినిమాలు చూస్తూ ఎదుగుతున్నందుకు మరోసారి గర్వపడుతూ ధియేటర్ నుండి బయటకు వచ్చిన నేను ఆ క్షణం నుండే రక్త చరిత్ర రెండవభాగం ఎప్పుడు విడుదల అవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూడటం మొదలు పెట్టాను."

  Me too

  ప్రత్యుత్తరంతొలగించు
 5. I did not expect you will go for it... :) బాగా ప్రిపేర్ అయి వెళ్ళారు కనుక సరిపోయింది కానీ, నాకైే చెప్పా కదా, చాలా కష్టపడాల్సి వచ్చింది

  ప్రత్యుత్తరంతొలగించు
 6. అయ్యబాబొయ్ మీరు ఈ సినిమ చూసారా? మీరు చాలా ధైర్యవంతులండీ...నేను రాంగోపాల్ సినిమా దరిదాపులకు కూడా పోను :D

  ప్రత్యుత్తరంతొలగించు
 7. చీకటి గారు నెనర్లు, మీ కామెంట్ బాగుంది :-)

  అజ్ఞాత గారు నెనర్లు, అవునండి నేను బెంగళూరు లోనే చూశాను. ప్రస్తుతం పివిఆర్ లోనూ త్రిభువన్ లోనూ ఆడుతుంది. వివరాలకు ఈ లింక్ చూడండి http://www.nowrunning.com/rakta-charitra/bengaluru/7793/movie-showtimes.htm వీకెండ్ టైమింగ్స్ మారుతుంటాయి మరోసారి చెక్ చేసుకుని వెళ్ళండి.

  గీతాచార్య నెనర్లు, మీ రివ్యూ చూశానండి, బేసిక్ గా వర్మ మీద అభిమానం నడిపించిందండీ అదీకాక రెండవభాగం సూర్య+వర్మ కనుక అసలు మిస్ అయ్యే చాన్స్ లేదు అందుకే చూశాను. కానీ మీరన్నట్లు ప్రిపేర్ అయినందువల్లేమో నాకు మరీ అంత ఘోరంగా అనిపించలేదు.

  ఇందు గారు నెనర్లు :-) మరీ వర్మని అలా తీసేయలేమండీ నేను చాలా సెలెక్టివ్ సినిమాలు చూస్తాను, కంపెనీ, సర్కార్, భూత్, సర్కార్ రాజ్, ఫూంక్, అమితాబ్ రణ్ ఇవన్నీ మంచి సినిమాలే.

  ప్రత్యుత్తరంతొలగించు
 8. అనిర్విన్ గారు హ హ ఇదే మొదటి సారనుకుంటానండి నాకూ అతని వాయిస్ నచ్చలేదు కానీ అలా వాయిస్ ఓవర్ ఇవ్వడం అనే కాన్సెప్ట్ నచ్చింది.

  ప్రత్యుత్తరంతొలగించు
 9. హింసాత్మక సినిమాలను భరించడం కష్టo అని కూడా సినిమా చూసారంటే మీరు చాలా ధైర్యవంతులండీ

  ప్రత్యుత్తరంతొలగించు
 10. శివరంజని గారు నెనర్లు, నాకూ ఈ సినిమా చూశాకే అర్ధమైందండీ నా టాలరెన్స్ లెవల్స్ ఈ మధ్యకాలంలో బాగానే పెరిగాయని.

  ప్రత్యుత్తరంతొలగించు
 11. i read a lot posts in RGV blog that how much effort RGV putting for this movie.
  but after watching movie , it was justified.
  a truly master piece from Varma.
  n telugu, so called faction based film came with star cast but not a film single film shown the ' Emotional Violence' like Rakta charitra did.

  ప్రత్యుత్తరంతొలగించు
 12. Thanks for your comment Pavan. Ya you summed it up "Emotional violence" is the correct word.

  I also liked what ever i am reading about the budget aspect of this film. I am not sure if this is true but looks like both parts were wrapped up under 25Cr and by selling satellite rights in telugu hindi & tamil he got that money back. Now whatever movie collects at BO is profit. Industry really needs people like him with proper planing.

  ప్రత్యుత్తరంతొలగించు
 13. ఒక వర్మసినిమాగా నాకు నచ్చిందిగానీండి, నేటివిటీ మిస్సయ్యిందనిపించింది. దుస్తులు, మేకప్ మొదలగువాటిలో. యాసకూడా కలవలేదు.

  ప్రత్యుత్తరంతొలగించు
 14. Thanks జెబి గారు. యాస విషయంలో ఒప్పుకుంటాను. కానీ వేషధారణ సహజంగానే ఉందనిపించిందండీ నాకు. కానీ నేను అనంతపురం ఏరియాలో పెద్దగా తిరిగినది లేదనుకోండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 15. కామెంటడానికి ఆలస్యమైందండీ,మీ టపా చదివిన తర్వాత సెట్ మాక్స్ వాడు రక్తచరిత్ర World Tv Premier అని యాడ్ వేసాడు.మీరు ఇంత బాగా టపా రాశాక సినిమా చూసి కామెంటుందాము అని ఆగాను. సినిమా బాగుందండీ...నాకెందుకో మీ విశ్లేషణే బాగుందనిపించింది. :) మా కొలీగ్స్ కూడా చెప్పారు మీకు నచ్చకపొవచేమో అని...అందుకే థెయేటర్ కి వెళ్ళి చూళ్ళేదు.:(
  కాని మీ టపా వచ్చిన వేళా విశేషం కాబోలు సెట్ మాక్స్ వాడి పుణ్యమా అని సినిమా చూసేసా...మొత్తమ్మీద సినిమా అంత హింసాత్మకంగా ఐతే లేదు...
  హిందీ లో చూడ్డం వల్ల కాబోలు ఏదో మిస్సయిన ఫీలింగ్....

  ప్రత్యుత్తరంతొలగించు
 16. అంటే వేణు ఇందాకే మీ మాటలు విని సినిమా చూసే ధైర్యం చేస్తున్నా(సగం చూసా) .. అంటే కత్తి సీన్ రాగానే ముందుకు ఫార్వర్డ్ చేసేసి చూసా .. అయితే మరీ చెత్త డవుట్స్ అనుకోపోతే .. ప్రతాప్ అంటే పరిటాల రవా?అంటే ఇదంతా నిజంగా జరిగిందా? మరి బుక్కా రెడ్డి అంటే ఎవరు? శివాజీ రావు తెలుసులే .. కొంచం క్లారిటి ఇవ్వండి ప్లీజ్

  ప్రత్యుత్తరంతొలగించు
 17. స్నిగ్ద గారు నెనర్లు, హ్మ్ సెట్ మాక్స్ వాడు అప్పుడే ఈ సినిమా వేసేశాడా. సినిమా మీకు నచ్చినందుకు సంతోషం. సెకండ్ హాఫ్ లో డైరెక్ట్ గా చూపించే హింస ఇంకా తక్కువ ఉంది కదా సో ఓవర్ ఆల్ గా ప్రిపేర్ ఐచూస్తే అంతగా హింస అనిపించదు. నిజమే తెలుగులో చూస్తే వచ్చే ఆనందం హిందీతో రాదు.

  నేస్తం నెనర్లు, హ హ కత్తికనపడినపుడల్లా ఫార్వర్డ్ చేసుకుని చూస్తున్నారా బాగుంది :) అవునండీ ప్రతాప్ అంటే పరిటాల రవి, బుక్కారెడ్డి అంటే ఓబుల్ రెడ్డి అనే అతనుట. ఇతని గురించి సినిమా రిలీజ్ అయ్యే వరకూ నాకూ తెలీదు తర్వాత కొంచెం రీసెర్చ్ చేస్తే సినిమాలో చూపించినంత కిరాతకుడు అని అనంతపుర వాసులు చెప్పారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 18. మీ రివ్యూ చూశాక ధైర్యం చేసి చూశాము.ఆ సినిమా ని మిస్సవకుండా చేసినందుకు మీకు థాంక్స్.
  ఆ బ్యాక్ గ్రౌండ్ లో కథ చెప్పే వాయిస్ రామ్ గోపాల్ వర్మ దేనా?
  ప్రతాప్ అంటే పరిటాల రవి అని అనుకున్నాను కానీ అతడి గురించి మరీ ఎక్కువ చెప్పినట్టు ఉంది కదా.
  రాబోయే రక్త చరిత్రలో సూర్య హీరోగా ట్రేలర్స్లో చూపారు. సూర్యని వేసే పాత్రలో అసలు వ్యక్తి ఎవరండి?

  ప్రత్యుత్తరంతొలగించు
 19. అవునండీ..
  హిందిలో కూడా బాక్ గ్రౌండ్లో వ్యాఖ్యానం ఇచ్చారు..అదీ కూడా అంత ఎఫెక్ట్ కలిగించలేదు. కానీ మొత్తమ్మీద నేనూ రక్తచరిత్ర చూశాను అనే ఫీలింగ్ కలిగింది. చూడాలి రక్త చరిత్ర-2 ఎలా ఉంటుందో ..దాని పై మీ టపా ఎలా ఉంటుందో....

  ప్రత్యుత్తరంతొలగించు
 20. అఙ్ఞాత గారు నెనర్లు, సినిమా మీరు కూడా ఎంజాయ్ చేసినందుకు సంతోషం. అవును ఆ నేపథ్యంలో వచ్చిన స్వరం రామూదే. పరిటాల గురించి కాస్త అతిశయోక్తి జోడించి ఉండచ్చునండి ఎంతైనా సినిమా కదా. కానీ నాకు అతనిగురించి తెలీదు(రాజకీయలలో ఆసక్తి తక్కువేనాకు) కనుక ఇది యథార్థానికి ఎంత దగ్గరగా ఉంది అన్నవిషయం నేను చెప్పలేను. సూర్య నటించే సూర్యం పాత్రం మద్దెలచెరువు సూరి ని ఉద్దేశించి తయారుచేసుకున్నది అంటున్నారండి ఇంకోవారం ఆగితే కానీ నిజానిజాలు తెలియవు.

  స్నిగ్ద గారు నేను కూడా ఎదురుచూస్తున్నానండి రెండవభాగం కోసం.

  ప్రత్యుత్తరంతొలగించు

పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీకామెంట్ రెండు వారాలకు ముందు ప్రచురించిన టపాలో ఐతే పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. Google Chrome Browser లో కామెంట్స్ పబ్లిష్ అవడంలేదు అని కంప్లైంట్ వచ్చింది. సరిచేయడానికి ప్రయత్నిస్తున్నాను. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.