ప్రతి ఏడు ఈ పుస్తకోత్సవాల గురించి వినడమే కానీ వెళ్ళడానికి అస్సలు కుదిరేది కాదు. ఈ సారి ఎలాగైనా వెళ్ళాలి అని సెల్ లోనూ క్యాలెండర్ లోను రక రకాల రిమైండర్లు పెట్టుకుని ఎట్టకేలకు ఈవేళ వెళ్ళిరాగలిగాను. నిజంగా ఇదో మహా ఉత్సవం అద్భుత ప్రపంచం కొన్ని పాత పుస్తకాల స్టాల్స్ తోపాటు కొందరు పబ్లిషర్స్ స్టాల్స్, కొన్ని పుస్తకాల షాపుల స్టాల్స్, కొన్ని ఇంటర్నేషనల్ ప్రత్యేక స్టాల్స్, రామకృష్ణ మఠం స్టాల్, ఇస్కాన్ స్టాల్, ఖురాన్ కి సంభందించిన స్టాల్ మరియూ ఇస్లాం స్టూడెంట్స్ కు ప్రత్యేకమైన స్టాల్. ఇంకా మధ్యలో అక్కడక్కడ పుస్తక పఠనానికి సంబందించిన టూల్స్ స్టాల్, స్టేషనరీ స్టాల్, ఇంటర్నేషనల్ డివిడిల స్టాల్ లాంటి పుస్తకాలకు సంభందించిన వైవిధ్యభరితమైన ప్రదర్శనలతో బాగా ఆకట్టుకుంది. సమయాభావం వలన నేను రెండు గంటలకు మించి గడపలేకపోయాను కానీ కాస్త తీరిక చేసుకుంటే అన్ని భాషల (హిందీ,ఇంగ్లీష్, తెలుగు) పుస్తకాలపై ఇష్టం ఉన్నవారు చాలా సమయం గడపవచ్చు.
డిస్కౌంట్స్ పరంగా గొప్పగా ఉన్నట్లైతే ఏమీ కనిపించలేదు ఇంటర్నేషనల్ స్టాల్ లో మాత్రం యాభై మరియూ వంద రూపాయలకు మంచి కలర్ ఫుల్ ప్రింటింగ్ ఉన్న పుస్తకాలు ఉన్నాయి కానీ వాటిలో నాకు అంతగా ఆసక్తికరమైనవేమీ కనిపింఛలేదు వివరంగా చూడలేదనుకోండి నేను మరికాస్త సమయం గడిపి ఉంటే మరిన్ని వివరాలు ఇవ్వగలిగి ఉండేవాడ్ని. ఏర్పాట్లు అంటే స్టాల్స్, లైటింగ్, కార్పెట్ లాటివి అన్నీ బాగున్నాయి కానీ మొదటి పావుగంట కరెంట్ లేకపోవడం కాస్త విసుగు తెప్పించింది. మంచినీటి సౌకర్యం కూడా నాకు బయటకు వచ్చేముందు లాంజ్ లోతప్ప ఎక్కడా కనిపించలేదు. బయటకి వచ్చేముందు లాంజ్ లోని చిన్న కేఫ్ లాంటి సెటప్ లో స్నాక్ ఐటంస్, స్వీట్స్, శాండ్విచ్, కార్న్ లాంటివి దొరుకుతున్నాయి.
ఇక తెలుగుకు సంభందించి ఇక్కడ మూడు స్తాల్స్ ఉన్నాయి, ఠాగూర్ పబ్లికేషన్స్, విక్టర్ పబ్లికేషన్స్, విశాలాంధ్ర పబ్లికేషన్స్. ఇంకా ఇస్కాన్ మరియూ రామకృష్ణ మఠం స్టాల్స్ లో అతి కొన్ని తెలుగు రచనలు ఉన్నాయి. కింద ఇచ్చిన బొమ్మలో తెలుగు పుస్తకాల స్టాల్స్ ఎక్కడ ఉన్నాయో మార్క్ చేశాను గమనించ గలరు. అన్ని షాపులకు సరైన అవకాశం ఇవ్వడానికి ఎంట్రన్స్ మరియూ ఎక్సిట్ ను ప్రతిరోజూ మారుస్తారు (బొమ్మలో ఎరుపు రంగుతో entrance/exit అని రాసి ఉన్నవి) అందుకే టిక్కెట్ కౌంటర్ రిఫరెన్స్ గా తీసుకుని మీరు వెళ్ళిన దారిని బట్టి ఈ స్టాల్స్ ఎక్కడ ఉన్నది సరిగా అంచనా వేసుకోవచ్చు. ఠాగూర్ పబ్లిషర్స్ ది సింగిల్ స్టాల్ కానీ ఇతర పబ్లిషర్స్ నుండి కూడా మంచి పుస్తకాలే ఉన్నాయి. విక్టర్ వారిదాన్లో పెద్దబాలశిక్షకు నిఘంటువులకు పెద్ద పీట వేశారు ఇంకా భక్తి, యోగా, తంత్ర, జ్యోతీష్యం కి సంభందించిన పుస్తకాలు ఎక్కువ ఉన్నాయి.
విశాలాంధ్ర బుక్ స్టాల్ లో మంచి కలక్షన్ తోపాటు వారి హాస్పిటాలిటీ చాలా బాగుంది వీరి పుస్తకాలు ఎలా అమ్మాలో వీరికి బాగా తెలుసు అని ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పాల్సిన పనిలేదు కానీ మిగతా చోట్ల కన్నా వీరి రిసెప్షన్ మరియూ సందర్శకులకు సహాయం చేసే పద్దతి నాకు బాగా నచ్చింది. నాషాపింగ్ అంతా విశాలాంధ్రలోనే చేశాను, ప్రత్యేకంగా లిస్ట్ ఏమీ పట్టుకెళ్లలేదు లెండి కనిపించినవి ఏవో కొన్ని కొనేశాను. వీరు అనంతపురం నుండే కాక హైదరాబాద్ నుండి కూడా రోజూ పుస్తకాలు తెప్పిస్తున్నారు కనుక మీరు ఏవైనా పుస్తకాలు ప్రత్యేకంగా కావాలంటే వీరికి చెప్పి తెప్పించుకోవచ్చు. ఇక్కడ మీరు ఎక్కువ పుస్తకాలు కొంటే మాత్రం బిల్లింగ్ పై శ్రద్ద పెట్టండి ఆ డిస్కౌంట్లదేముంది లే పుస్తకం పైన ఉన్న ధర చెల్లిద్దాం అంటే మీ ఇష్తం కానీ మీరు విశాలాంధ్ర మెంబర్ ఐతే (ఏడాది క్రితం నే గుంటూరు లో తీసుకున్నపుడు రెండు సంవత్సరాల సభ్యత్వానికి 25 రూ.లు) మీకు విశాలాంధ్ర పుస్తకాలపై ఇరవై శాతం మరియ ఇతర పబ్లిషర్స్ పుస్తకాలపై పది శాతం రాయితి దొరుకుతుంది. ఈ రాయితీపై వీళ్ళు అసహనం ప్రదర్శించడం వీలైతే స్కిప్ చేయడం గమనించాను అందుకే మీకు గమనించమని ప్రత్యేకంగా చెప్తున్నాను.
ఈ నెల ఇరవై ఒకటి (ఆదివారం Nov 21st) వరకూ సాగే ఈ పుస్తకోత్సవానికి ప్రవేశ రుసుము ఒక్కొక్కరికి ఇరవై రూపాయలు, సమయం ఉదయం పదకొండు గంటలనుండి రాత్రి ఎనిమిది వరకూ. అలానే గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం సరిపడ డబ్బు మీ వెంట తీసుకు వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ ఏ స్టాల్ లోనూ క్రెడిట్ కార్డ్ పై చెల్లించే అవకాశం లేదు, అలానే ఏటియం కూడా చూడలేదు.
మరికొన్ని వివరాల కోసం బుక్ ఫెస్ట్ వెబ్సైట్ ఇక్కడ చూడండి.
విశాలాంధ్ర స్టాల్ లోని పుస్తకాల గురించి మరికొన్ని వివరాలకు పుస్తకం లోని వ్యాసం ఇక్కడ చూడండి.
ఇక నే కొన్న పుస్తకాల జాబితా అంటారా ఎప్పటికి ఇవన్ని చదవడం పూర్తి చేస్తానో కానీ చిట్టా ఇదిగో చిత్తగించండి.
1.నామిని గారి ఇస్కూలు పుస్తకం(ఇస్కూలు పిలకాయల కత, పిల్లల భాషలో అల్జీబ్రా, చదువులా చావులా, అమ్మ చెప్పిన కతలు, పిల్లల్తో మాట్లాడాల్సిన మాటలు) (వీరి పుస్తకాలు నాకు అస్సలు దొరికేవి కావు ఇప్పటికి మొదటి పుస్తకం చదివే వీలు చిక్కింది).
2.శ్రీపాద వారి కలుపు మొక్కలు (మొన్న గుంటూరులో మార్గదర్శి, వడ్లగింజలు, పుల్లంపేట జరీ చీర తో పాటు ఇది దొరకలేదు, ఆలోటు ఇప్పుడు తీరింది).
3.పాలగుమ్మి వారి రచనల మూడవ సంపుటం (బ్రతికిన కాలేజి, చచ్చి సాధించాడు, భక్త శబరి, చచ్చిపోయిన మనిషి నవలలు).
4.బుచ్చిబాబు కథలు మొదటి సంపుటం (వీరి రచనలు చదవడం ఇదే మొదలు).
5.అడివి బాపిరాజు గారి నారాయణరావు నవల.
6.భమిడిపాటి కామేశ్వరరావు గారి రచనలు మొదటి సంపుటం(ఓ 20 తక్కువ 500 జోకులు మరియూ 9 హాస్య కథానికలు:-)
ఇవి కాక ఈ కింది వంశీ రచనలు
7.వెండితెర నవలలు (శంకరాభరణం, సీతాకోకచిలుక, శుభోదయం, అన్వేషణ సినిమాలపై).
8.ఆనాటి వాన చినుకులు (23 కథల సంపుటం).
9.మంచు పల్లకీ.
10.గాలికొండాపురం రైల్వేగేటు.
11.గోకులంలో రాథ.
12.వెన్నెల బొమ్మ.
కుహు కుహూ.. కూసే..
-
డబ్బు డబ్బు డబ్బు చిత్రంలోని ఒక మధురమైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట
ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
ఎంబెడెడ్ వీడి...
3 సంవత్సరాల క్రితం
వేణూ, ఇలా బుక్స్ ఎగ్జిబిషన్ కి వెళ్ళి వచ్చేవాళ్ళ మీద నాకు తెగ కోపం.. పక్కింటావిడ కొత్త బంగారుషాపుకెళ్ళి డైమండ్ నెక్లెస్ కొనుక్కొచ్చిందని విన్నప్పుడు కలిగే లాంటి కుళ్ళు! :-)
రిప్లయితొలగించండినాదో చిన్న సలహా.. మీ లిస్ట్ లో ఉన్న పుస్తకాల్లో 'గాలికొండాపురం రైల్వే గేటు ' ముందు చదవండి.. నవల అంత పెద్దదేమీ కాదు కాబట్టి మొదలు పెట్టిన వెంటనే డింగ్ మని అయిపోతుంది.. ఆ తర్వాత మీ మనసు ఆ రైల్వే గేట్ చుట్టూ గాల్లో చక్కర్లు కొట్టకపోతే నన్నడగండి :-)
హ్మ్! నేను ఎప్పుడూ ఇలాంటివి మిస్ అవుతూనే ఉంటా!గుంటూరు,హైదరాబాద్లో పుస్తకప్రదర్శనలకు వెళ్ళాను కాని ప్రతిష్టాత్మకమైన ఈ బుక్ ఫేర్ కి వెళ్ళడం నాకు అవ్వట్లేదు :(
రిప్లయితొలగించండిఏదో తెలియని ఆనందం అన్ని పుస్తకాలను ఒకేసారి చూస్తే.. ఇవాళ నాకు చాలా బడలికగా ఉండటం వల్ల వెళ్ళలేకపోయాను.. శుక్రవారం సాయంత్రం వెళతాను..
రిప్లయితొలగించండినేను వెళ్ళానండి. విశాలాంధ్ర మా ఊరే కాబట్టి అక్కడ ఎక్కువ సమయం గడపలేదు. వారిదగ్గర చాలామంచి పుస్తకాలు మూలమూల అరలలో దాక్కుని ఉంటాయి. వెతకాలి. ఉదా: కొల్లాయి గట్టితేనేమి? ఈ పుస్తకం పైన కనబడదు.
రిప్లయితొలగించండితెలుగు స్టాల్స్ పెద్దగాలేకపోవడం నిరాశే.
ఇంగ్లీషులో కొన్ని ఆణిముత్యాలు ఉన్నాయి. సంస్కృతం ఆసక్తి ఉన్నవాళ్ళకు చౌఖాంబా, మోతిలాల్ బనార్సిదాస్ ఉన్నాయి. చౌఖాంబా పుస్తకాలు చాలా చవక.:))
ఇదన్యాయయం.. నేను ఊర్లో లేనప్పుడు చూసి మొదలుపెట్టేశారు బుక్ ఫెయిర్ :(
రిప్లయితొలగించండిఅయినా వచ్చే వారం దాకా ఉంది కదా.. ఈసారైనా విశాలాంధ్రా పుస్తకాల గురించి వ్రాయాల్సిందే ;)
@కార్తీక్: మీరు ఇంకా వెళ్ళలేదా.. ఈపాటికి వెళ్ళి టపా వ్రాసి ఉంటారేమో అనుకున్నా..
@రవి: నిజమే.. అసలు విశాలాంధ్ర షాపు అంటేనే అలా ఉంటుందేమో... విజయవాడ షాపులో కూడా అన్నీ లోపలెక్కడో భద్రంగా దాచిపెడతారు..
Venu garu chala vishayalu chepparu, entry fee Rs 20/- eduku.
రిప్లయితొలగించండిmaaku vijayawada last 20 years gaa jarugutundi Book Festival., Ikkada entry free.
Kalasagar
editor, 64kalalu.com
మీ సమాచారం చదివి నాకేం కుళ్ళు కలగలేదు.మేము కూడా ఓ పది రోజులు మా విశాఖలో పుస్తకాల పండగ చేసుకున్నాం కదా...
రిప్లయితొలగించండినిషి నెనర్లు, హ హ మీ పోలిక బ్రహ్మాండం :-) నిజమే నేను ఇదివరకూ ఆ కుళ్ళుకునే బ్యాచ్ లో ఉండేవాడ్ని ఈ ఏడే పార్టీమార్చే అదృష్తం దక్కింది. గాలికొండపురం రైల్వేగేట్ పేరు నచ్చే కొనేశాను, చదవడం కూడా ఐపోయింది :-) మీరన్నట్లు ఆ ప్రదేశాలు వదిలి రావాలనిపించడం లేదు.
రిప్లయితొలగించండిఇందుగారు నెనర్లు, పుస్తక పఠనం పై ఆసక్తి ఉన్నవారికి అన్ని పుస్తకాలు ఒక చోట చూడటం కంటికి ఇంపుగా చాలా బాగుంటుంది. ఇక బెంగళూరులో తెలుగు పుస్తకాలు అంతగా దొరికే షాపులు లేకపోవడంతో మనవాళ్ళకి నిజంగా ఇక్కడ పండగే.
కార్తీక్ నెనర్లు, చాలా బాగా చెప్పారు, గుడ్ వెళ్ళిరండి మీరుకోరుకున్న పుస్తక ప్రాప్తిరస్తూ :-)
రవి గారు నెనర్లు, నిజమేనండీ మరీ మూడే స్టాల్స్ ఉండటం కాస్త నిరాశ కలిగించినా ఉన్న వాటిలో కలక్షన్ బాగానే మెయింటెయిన్ చేసారు అనిపించింది. అందుకే నేనెప్పుడూ విశాలాంధ్ర వారి హెల్ప్ తీసుకుంటాను వెతికే పని పెట్టుకోకుండా. అన్నట్లు సంస్కృత పుస్తకాల గురించిన వివరాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇంగ్లీషు ఆణిముత్యాల గురించి వీటి గురించి మీరో టపా వేయకూడదు మనవాళ్ళకి సౌలభ్యంగా ఉంటుంది కదా.
మేధగారు నెనర్లు, హ హ మీరు నమ్మరేమోకానీ నేను లోపలికి అడుగుపెట్టగానే మీరే గుర్తొచ్చారండీ "తను విశాలాంధ్రపుస్తకాల గురించిన టపా బాకీ కదా ఈ సారైనా రాస్తారో లేదో" అనుకున్నాను :-) పుస్తకోత్సవం ఈ ఆదివారం సాయంత్రం వరకూ ఉంటుందండి మరి మీరు ఎక్కడున్నా అర్జంట్ గా తిరిగొచ్చి, సందర్శించి ఆ విశేషాలు మాకు అందచేయడమే ఆలశ్యం.
రిప్లయితొలగించండికళాసాగర్ గారు నెనర్లు, ప్రవేశ రుసుము ఎందుకు పెట్టారో కారణం నాకూ సరిగ్గా తెలియదండీ బహుశా జనాలను కట్టడి చేయడానికి నిర్వహణ నిమిత్తమైన ఖర్చులకోసం ఐ ఉండచ్చు కానీ 20 రూపాయలే కనుక పెద్ద భారమనిపించదు.
మల్లి గారు నెనర్లు, హ హ మీరు కుళ్ళుకోడానికి ఈ టపా రాయలేదండి. కేవలం బెంగళూరులోని తెలుగు వారికి స్టాల్స్ మరియూ ఇతర సమాచారం వివరాలు అందించాలని అంతే. మీ బ్లాగు ఖాళీగా ఉన్నట్లుంది మరి మీ విశాఖలోని పుస్తకోత్సవాన్ని గురించి రాయచ్చు కదా.
ఈ పుస్తక ప్రదర్శనకు వెళ్ళాలనుకునే వారికి బాగా ఉపయోగపడే టపా ఇది. ధన్యవాదాలు. నేను 14న వెళ్ళినపుడు ఈ map ఇవ్వలేదు. పైగా చీకటిగా, అస్తవ్యస్తంగా వుండి ఏర్పాట్లు సరిగ్గా చేయనట్టనిపించింది.
రిప్లయితొలగించండిఅయ్య బాబోయ్ అన్ని పుస్తకాలు కొనేసారా, ఓ పట్టుచీర వచ్చేది అని సన్నాయి నొక్కులు వినిపించడం లేదేమిటి?
రిప్లయితొలగించండిపుస్తకాలు మీరు చదివిన తర్వాత మాకు పరిచయం చెయ్యండి.మీ లిస్టు లో నేను ఎప్పుడో చదివిన పుస్తకాలు కొన్ని ఉన్నాయి. మంచి పుస్తకాలు. మళ్ళీ మళ్ళీ చదవాలనిపించేవే ఎంపిక చేసుకున్నారు.
మనోజ్ఞ గారు వ్యాసకౌముది లో శ్రీపాద వారి కధల గురించి వ్రాస్తున్నారు. ఆ కధల్లో కొత్త కోణాలు తెలుస్తున్నాయి. మీరు కూడా మీ అభిప్రాయాలు తెలియపర్చండి.
Happy reading.
విజయవర్థన్ గారు నెనర్లు, ఈ మ్యాప్ బ్రోచర్ తోపాటు రిలీజ్ చేశారండీ నేను కేవలం తెలుగు స్టాళ్ళు ఎక్కడున్నదీ మార్క్ చేశానంతే. మీరు వెళ్ళినది రెండవరోజేకదా బహుశా ఇంకా ఏర్పాట్లు పూర్తై ఉండవు.
రిప్లయితొలగించండిబులుసు గారు నెనర్లు, మనోజ్ఞ గారి రేంజ్ విశ్లేషణలు నేను చేయలేను కానీ తప్పకుండా కొన్ని పుస్తకాలన్నా పరిచయం చేయడానికి ప్రయత్నిస్తానండీ, మీ విషెస్ కు ధన్యవాదాలు.
మంచి పుస్తకాలు కొన్నారండీ.. నాకిప్పుడు అర్జెంటుగా 'కలుపు మొక్కలు' మళ్ళీ చదవాలనిపిస్తోంది.. వంశీ 'మహల్లో కోకిల' దొరకలేదా? చదివేశారా?? 'నారాయణరావు' మిమ్మల్ని నిరాశ పరచడు.. పాలగుమ్మి వారి గురించి చెప్పేదేముంది చెప్పండి....
రిప్లయితొలగించండిమురళి గారు నెనర్లు, మహల్లో కోకిల దొరకలేదండీ కానీ పేరు వింటే నాకు సితార సినిమా కథలా అనిపించింది. నారాయణరావు పై నాక్కాస్త అనుమానం ఉండింది మీరు చెప్పాక భరోసా వచ్చింది. పాలగుమ్మి వారు చావు గురించి మహబాగా రాస్తారు అందుకే నవలల పేరు చూసి రెండో సంపుటం స్కిప్ చేసి మరీ ఇది తీసుకున్నాను :-)
రిప్లయితొలగించండివేణు,
రిప్లయితొలగించండిమేము మిస్ అయిన పుస్తకమహోత్సవాల్ని ఇలా గుర్తు చేస్తారా? అన్యాయం. నిషి మాటే నాది కూడా.. మా వూర్లో..అదే ఇజివాడ లో ఎంత పెద్ద బుక్ ఫెస్టివల్ జరుగుతుందో...పార్టీ ఏడాది జనవరి 1 నుంది...ఐ యామ్ క్రైయింగ్....
నారాయణరావు నాకు అప్పటికీ ఇప్పటికీ చాలా ఇష్టమైన తెలుగు నవల, కానీ కొత్తగా చదివే కొత్తతరం పాఠకులు కొంచెం ఓర్పుతో చదవాలేమో మొదటిసారి - భాష మీకు అలవాటైన భాషకాదు. ఇంకో ముఖ్య విషయం: ఈ నవలని, కథలో తరవాత ఏమవుతుంది అనే ఉత్కంఠతో కాక, ఈ కథ అంతా 1920లలో జరుగుత్న్నది, అప్పటి ప్రజల జీవనం, ఆలోచనలు, ఆసయాలు ఇలా ఉండేవి - అనే స్పృహతో చదివితే బాగా ఆస్వాదించవచ్చు. ఆధునిక భావాలు, ఆదర్శాలు అన్నీ మనవే అని ఈ కాలపు వాళ్ళు అనుకుంటూ ఉంటారు. సుమారు 90 ఏళ్ళ కిందట ఆంధ్రదేశంలో అనేక విషయాలను గురించి ఎన్ని విచిత్రమైన ఆలోచనలు చెలరేగుతుండేవో ఈ నవలలో చూచాయగా కనిపిస్తుంది. ఆ ఆలోచనల వేగంతో పోలిస్తే మన ఆలోచనలు ఇంకా ఎంత వెనకబడి ఉన్నాయో అని సిగ్గేస్తుంది.
రిప్లయితొలగించండి@ ఇందు .. నిజంగా ప్రతిష్ఠాత్మకమైన పుస్తకాల పండుగ చూడాలంటే జనవరి మొదటివారంలో విజయవాడ వెళ్ళండి. బెంగుళూరు, చెన్నై, హైదరబాదుల్లో పుస్తకాల పండుగలు నేను చూశాను. ఇవేవీ విజయవాడ పండక్కి సాటిరావు.
రిప్లయితొలగించండికల్పన గారు నెనర్లు, హ్మ్ వెళ్ళే అలవాటున్నవారు నిజంగా ఎంత మిస్ అవుతుండి ఉంటారో కదా ఒకోసారి ఏంచేయలేమండి అంతే.. ఓ విజయవాడలొ అంతబాగా జరుగుతుందా, కొత్తపాళీ గారు కూడా అదే ప్రత్రిష్టాత్మకం అంటున్నారు. నేను ఎపుడూ వెళ్ళలేదండి. ఈ సారి కుదురుతుందేమో చూడాలి.
రిప్లయితొలగించండికొత్తపాళీ గారు నెనర్లు,
నారాయణరావు నవల గురించి మరిన్ని వివరాలు, మార్గదర్శకాలు అందించినందుకు నెనర్లు. నిజమేనండీ భాష విషయం కాస్తంత కష్టమే శ్రీపాద వారి కథలు మొదటి సారి చదివేప్పుడు నేను చాలా ఇబ్బంది పడ్డాను, చాలా ప్రత్యేకంగా ఉంది కొన్ని వాడుకలు పదాలు ఇంకా అర్ధంకానివి ఉన్నాయి. ఒక రెండు మూడు కథలయ్యేవరకూ పట్టి పట్టి చదవాల్సి వచ్చేది.
అసలు ఏ రచనకైనా దాని రచనా కాలం తెలియడం చాలా ముఖ్యమనేది నా అభిప్రాయం లేదంటే కొన్ని విషయాల్లొ రచయితని చులకన చేయడమో అపార్ధంచేసుకోవడమో జరుగుతుంది. ఈ నవల రచనాకాలం నాకు తెలియలేదు 1950 లలోది అనుకున్నాను బాపిరాజు గారి చిత్రాలు అవి చూసి. మీరు స్పష్టంగా చెప్పినందుకు నెనర్లు. మీరు సూచించిన విధంగా చదవడానికి ప్రయత్నిస్తాను.
venu srikanth garu chaala thanks andi
రిప్లయితొలగించండిee dec 16-26 varaku mana hyderabad lo kooda book exhibition jarugutondi.
choodali asalu elaa untundo.
mee mitrulu, blogmitrulaki cheppandi deeni gurinchi.
evaraina already velli unte vallani feedback ivvamani cheppandi
thank you
వినయ్ భాస్కర్ గారు నెనర్లు, హైదరాబాద్ పుస్తక ప్రదర్శన గురించిన వివరాలు క్రింద లింకుల్లో చూడచ్చు.
రిప్లయితొలగించండిhttp://manishi-manasulomaata.blogspot.com/2010/12/blog-post_19.html
http://pustakam.net/?p=6025
http://deeptidhaara.blogspot.com/