బుధవారం, నవంబర్ 26, 2014

రౌడీఫెలో...

నారా రోహిత్ నాకు నచ్చే నటులలో ఒకరు. తెలుగులో ఇతర కమర్షియల్ హీరోలకి భిన్నంగా తనకంటూ ఒక పంథా సృష్టించుకోవాలని తపనపడే ఇతని స్టోరీ సెలక్షన్ బాగుంటుంది. మొదటి చిత్రం 'బాణం' లోనే తన ప్లస్ పాయింట్స్ ని సరిగా క్యాచ్ చేసి వాటిని హైలైట్ చేసే కథతో వచ్చి మంచి మార్కులేయించుకున్నాడు. తరువాత ఒక లవ్ స్టోరీ (సోలో), ఒక ఫ్యామిలీ రివెంజ్ డ్రామా(ఒక్కడినే), ఒక సోషల్ మెసేజ్ ఫిల్మ్ (ప్రతినిధి) ఇలా ఏం చేసినా మినిమమ్ గ్యారెంటీ ఔట్ పుట్ ఇచ్చే ప్రామిసింగ్ హీరో అనిపిస్తాడు నాకు. కమర్షియల్ సక్సెస్ ఎలా ఉన్నా కానీ ఇతని సినిమాలు ఖచ్చితంగా వైవిధ్యంగా తప్పక ఒకసారైనా చూడాలనిపించేలా ఉంటాయి.

పాటల రచయిత 'కృష్ణ చైతన్య' దర్శకత్వంలో నారా రోహిత్ హీరోగా వచ్చిన కొత్త చిత్రం ఈ 'రౌడీఫెలో'. దర్శకులుగా మారే రచయితల సినిమాలు అంతత్వరగా డిజప్పాయింట్ చేయవనే నమ్మకాన్ని మరోసారి నిలబెట్టింది ఈ చిత్రం. నెరేషన్ విషయంలో కాస్త నెమ్మదిగా ఉన్నట్లనిపించినా అది కూడా సినిమాకి ఒక స్టైల్ ని యాడ్ చేసింది ఇక డైలాగ్స్ విషయంలో అయితే చాలా చక్కగా రాసుకున్నాడు. సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలు తను తీసిన విధానం వాటి ఫ్రేమింగ్ ప్రేక్షకులతో "ఆహా ఏం తీశాడ్రా" అని అనిపిస్తాయి. అఫ్ కోర్స్ వాటికి ’సన్నీ’ ఇచ్చిన నేపధ్య సంగీతం, ఓం సినిమాటోగ్రఫీ, నటీనటుల చక్కని పెర్ఫార్మెన్స్ కూడా తోడయ్యాయనుకోండి.

కథ విషయానికి వస్తే లెక్కలేనంత ఆస్థి, మంచి మనసు ఉన్నా నిలువెల్లా ఇగో తో నిండిపోయిన ఒక అహంకారి రాణా ప్రతాప్ జయదేవ్( నారా రోహిత్). తన కాలర్ పట్టుకున్నందుకు మూడేళ్ళ తర్వాత కూడా మర్చిపోకుండా అమెరికా నుండి వచ్చి వాడ్ని కొట్టి తన అహాన్ని తృప్తిపరచుకునే రకం. ఒక ఎస్పీతో(ఆహుతి ప్రసాద్) అయిన గొడవలో అహం దెబ్బ తిన్న రాణా పోలీస్ డిపార్ట్మెంట్ లోనే చేరి ఆ ఎస్పీకి పక్కలో బల్లెంలా తయారవాలని నిర్ణయించుకుంటాడు. అయితే కొల్లేరు ఎస్సై గా ఛార్జ్ తీసుకున్నాక ఓ కేస్ ఇన్వెస్టిగేషన్ లో అక్కడి బీదల బ్రతుకులతో చెలగాటమాడుతూ వారినుండి మనిషిగా జీవించే హక్కును సైతం లాగేసుకుంటున్న లోకల్ ఎంపీ అసురగణ దుర్గా ప్రసాద్ (రావు రమేష్) గురించి తెలుసుకుంటాడు. రాణా కేస్ ఇన్వెస్టిగేషన్ ఏమైంది ఆ ఎంపీకి ఎలా బుద్దిచెప్పాడు అనేది మిగిలిన కథ.

నారా రోహిత్ స్ట్రెంత్స్ లో మొదట నిలిచేది తన డైలాగ్ డెలివరీ.. ఈ సినిమాలో దర్శకుడు దాన్ని పీక్స్ లో ఉపయోగించుకున్నాడు. యారొగెంట్ పోలీసాఫిసర్ గా ఈ పాత్రలో కరెక్ట్ గా సరిపోయాడు. అయితే ఫిట్ నెస్ విషయంలో తన గత చిత్రం ప్రతినిధి కన్నా నయమే అనిపించినా మరింత శ్రద్ద తీస్కోకపోతే ముందుముందు ఇతనిని భరించడం కష్టమయే ప్రమాదం ఉంది. తర్వాత చెప్పుకోవలసింది రావురమేష్ నటన ఇతనికి సరైన పాత్రలు దొరికితే ఎప్పుడూ చెలరేగిపోతాడు. ఇందులో కూడా అలాగే తనకి వచ్చిన అవకాశాన్ని చక్కగ సద్వినియోగ పరచుకున్నాడు. తన సటిల్ పెర్ఫార్మెన్స్, డైలాగ్ డెలివరీ చూస్తే ముందు ముందు మరింత మంచి పేరు తెచ్చుకుంటాడు తన తండ్రి పేరు నిలబెడతాడు అని అనిపించింది.

గొల్లపూడి గారు, తాళ్ళూరి రామేశ్వరి గారు, పరుచూరి వెంకటేశ్వరరావు గారు, జోగి బ్రదర్స్, అజయ్ అందరూ తమ తమ పాత్రలకు తగిన న్యాయం చేశారు. ప్రవీణ్ కి మంచి పాత్ర లభించింది. థియేటర్ ఓనర్ ’సిల్క్’ గా పోసాని కృష్ణ మురళి కామెడీ బాగానే పండించాడు. కమెడియన్ సత్య(స్వామిరారా ఫేం) సునీల్ ని అనుకరించడానికి వృథా ప్రయత్నం చేశాడు, తన ఒరిజినల్ స్టైల్లో చేస్తేనే ఎక్కువ ఆకట్టుకునేవాడేమో అనిపించింది. హీరోయిన్ విశాఖ సింగ్ ఫర్వాలేదు సినిమాలో నెగటివ్ పాయింట్ ఏమైనా ఉందంటే అది హీరోగారి లవ్ ట్రాకే అసలే నెమ్మదిగా నడిచే స్క్రీన్ ప్లేకి ఇది మరికాస్త బ్రేక్ వేసినట్లుగా అయింది. అయితే పాటలు ఒక్క చరణమే చిత్రీకరించడం ఒక ప్లస్ పాయింట్.

కొల్లేరు నేపధ్యంగా అల్లుకున్న ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ కి తక్కువ ప్రాధాన్యతనిచ్చి స్లో నెరేషన్ అయినా తను చెప్పాలనుకున్న పాయింట్ పై మాత్రమే దృష్టినిలిపి నడిపించారు దర్శకుడు. తెలుగులో వచ్చే రొటీన్ లవ్ స్టోరీలూ, బకరా కమెడియన్ కామెడీలూ, నవ్వొచ్చే ఫైటింగ్ యాక్షన్ సినిమాలు చూసి బోర్ కొట్టి కొత్తదనం కోరుకుంటున్న వారికి ఈ సినిమా తప్పక నచ్చుతుంది.

అయితే కమర్షియల్ ఎలిమెంట్స్, లౌడ్ కామెడీ, లవ్ ట్రాక్ లాంటివి సరిగా లేకపోవడం, స్లో నెరేషన్ లోటుగా భావిస్తే మీరు ఈ సినిమాకి దూరంగా ఉండడం మంచిది. సినిమాని ఆస్వాదించడానికి అవి అడ్డంకి కాదని మీరు భావిస్తే వైవిధ్యమైన కథతో, ఆలోచింపచేసే సంభాషణలతో, బిలీవిబుల్ ఫైట్స్, సటిల్ కామెడీ కి తోడు చక్కని సినిమాటోగ్రఫీ, సరైన నేపధ్య సంగీతం, నటీనటుల బెస్ట్ కంట్రోల్డ్ పెర్ఫార్మెన్స్ తో కూడిన ఒక మంచి తెలుగు సినిమా చూసిన అనుభూతి కోసం ’రౌడీ ఫెలో’ చూడండి. సినిమాలో నాకు నచ్చిన కొన్ని డైలాగ్స్ ఇక్కడ ఇస్తున్నాను. 

“అరవై సెకన్లలో డెబ్బైరెండు సార్లు కొట్టుకునే గుండెకే లాజిక్ లేదు ఇక నేను చేసిన పనుల గురించి అడిగితే ఏం చెప్తారా.”

“జంతువులకి చెప్పాలి, మనిషిని అడగాలి, నాలాంటోడ్ని బతిమాలాలి.”

“మూగవాడిది ఒక విధమైన మౌనమైతే పేదవాడిది మరొక విధమైన మౌనం. మూగవాడు మాటల్రాక మాట్టాడ్డు, పేదవాడికి అన్నీ తెలిసినా మట్లాడలేడు.”

“ద్రౌపది నవ్వినపుడు దుర్యోదనుడు లైట్ తీస్కుని ఉంటే మహాభారతం ఉండేదా? సీత నవ్వుని రావణాసురుడు పట్టించుకోకపోతే రామాయణం ఉండేదా? పురాణాలన్నీ ఇగో ప్రాబ్లమ్సేననమాట.”

“కోపం బాగా కాస్ట్లీ అనమాట మాటి మాటికీ వాడకూడదు.”

“నేను సాయం చేయను న్యాయం చేస్తాను.”

“చరిత్ర ఎక్కువగా చెడ్డవాళ్ళనే గుర్తుంచుకుంటుంది.”

హీరో : “నాకు పెద్దగా ఆశలూ లేవు ఆకలంటే తెలీదు...”
ఒక పెద్దాయన : “ఆశకీ ఆకలికి మధ్య అవసరం ఉంటుంది అది ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికీ తెలీదు.”

“మనిషిని చూసి మనిషి ఎందుకు భయపడాలి ?”

“మంచి విషయాలు గొప్పోళ్ళు చెప్పారంటే విలువిస్తారు కానీ నువ్వు నేనూ చెప్పామంటే ఎవరూ పట్టించుకోరు.”

“ప్రెపంచకంలో మనిషి గురించి ఆలోచించే ప్రతివాడూ పిచ్చోడే కదా.”

“మీకంటే బెంజ్ ఉంది కాబట్టి ఇన్నోవా వద్దన్నారు అదే పాత స్కూటర్ మీద తిరిగేవాడైతే కావాలనుకుంటాడు.”

“చేపలుపట్టే వలలో తిమింగలాలు పడవు.”

“నువు మనుషులను భయపెట్టగలవేమో అక్షరాలను కాదు.”

“ఆకలితో ఉన్న జంతువు కన్నా ఆశతో ఉన్న మనిషే ప్రమాదకరం.”

“ఇండియాలో గాంధీ గారి మాట కన్నా నోటుకే విలువెక్కువ.”

8 కామెంట్‌లు:

 1. very detailed review..and a very good promoter to the movie too venuji..

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. హహహ థాంక్స్ శాంతి గారు :-) అరుదుగా వచ్చే మంచి సినిమాలను చిన్న చిన్న లోపాలున్నా ప్రమోట్ చేయాలి కదండీ మరి :-)

   తొలగించు
 2. కొంచెం శల్య పరీక్ష చెయ్యనా వేణు గారూ ,
  72 మాట్లు కొట్టుకుంటే గుండెకి లాజిక్ లేదని అర్ధమా?
  “జంతువులకి చెప్పాలి, మనిషిని అడగాలి, నాలాంటోడ్ని బతిమాలాలి.”
  అంటే వీరు జంతువూ కాదు మనిషీ కాదు అని అర్ధమా? మరెవరు?
  ఉత్తినే, సరదాగా.....దహా.
  ఈ సినిమా మీకు బాగా నచ్చింది అని అర్ధం....అంతే అంతే.......దహా.

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. హహ అంతే అంతే గురూజీ.. మొత్తం మీద సూక్ష్మం గ్రహించారు :-)) థాంక్స్ ఫర్ ద కామెంట్.

   తొలగించు
 3. చూసొచ్చానండీ.. థాంక్యూ.. థాంక్యూ..

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. వావ్ థాంక్స్ మురళి గారు.. మీరు థాంక్స్ చెప్పారంటే మీకూ సినిమా నచ్చిందనే అనుకుంటున్నాను :-) చూసొచ్చి ఇక్కడ ఆ విషయం పంచుకున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు :-)

   తొలగించు
 4. సినిమా లో బెస్ట్ ఏంటి అంటే , నారా రోహిత్ డైలాగ్ డెలివరీ . డైరెక్షన్ , సౌండ్ మిక్స్ అండ్ ఫోటోగ్రఫీ టాప్ నాచ్ . సూపర్ స్టైలిస్ మేకింగ్. క్లైమ్యాక్స్ లో వ్యాచ్ డైలాగ్ మిస్ కావద్దు.

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. ఎస్ పవన్ గారు అగ్రీ విత్ యూ.. థాంక్స్ ఫర్ ద కామెంట్.

   తొలగించు

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.