శుక్రవారం, ఫిబ్రవరి 12, 2010

నేనూ .. బ్రిటానియా ..

అసలు చిరుతిళ్ళనూ, చాక్లెట్లు బిస్కెట్లు లాటి తినుబండారాలనూ ఇష్టపడని పిల్లలు చాలా అరుదుగా ఉంటారేమో. అందుకే 1892 లో 295 రూపాయల పెట్టుబడితో కలకత్తాలో ఒక మూల ప్రారంభమైన ఒక చిన్న బిస్కట్ కంపెనీ నేడు వందకోట్ల టర్నోవర్ దాటడమే కాక ప్రపంచంలోని మొదటి రెండువందల చిన్న కంపెనీలలో ఒకటిగా స్థానం సంపాదించుకుంది. ఇండియాలో నమ్మదగిన బ్రాండ్ల లో రెండవ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంది. అయితే ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా క్వాలిటీ తగ్గకుండా చూసుకోవడం ఒకటే కాక. ఎప్పటికప్పుడు వినూత్నమైన మార్కెటింగ్ పద్దతులతో మారుతున్న ప్రజల అభిరుచులకు తగిన విధంగా మార్పులు చేర్పులతో ముందుకు  వెళ్ళడం కూడా ఈ కంపెనీ ఇంకా హాట్ ఫేవరిట్ గా నిలబడడానికి ఒక ముఖ్య కారణం. "Eat healthy, think better" లాంటి క్యాప్షన్స్ తెలియకుండా సృష్టించే ప్రభావం అంతా ఇంతా కాదు.

నా దృష్టిలో బిస్కట్ అంటే బ్రిటానియానే.. పార్లేకు కూడా చాలా మంది  అభిమానులు ఉన్నా (ఈ మధ్యే గమనించిన విషయం ఏమిటంటే సౌత్ ఇండియాలో బ్రిటానియా నార్త్ లో పార్లేకి ఎక్కువ మార్కెట్ ఉందట, లెక్కల్తో నిరూపించలేను కానీ నాకు తెలిసిన నార్త్ ఇండియా ఫ్రెండ్స్ ని గమనిస్తే అర్ధమైన విషయం ఇది.) న్యూట్రిన్, హార్లిక్స్, సన్ ఫీస్ట్ లాటి ఉత్పత్తులు ఎన్ని ఉన్నా నాకు ఎందుకో బ్రిటానియా బిస్కట్లకు ఉన్న రుచి మరి వేటికీ రాదు అనిపిస్తుంది. నా మొదటి పరిచయం మిల్క్ బికీస్ తోనే ఇప్పుడు దాని కవర్ పై అన్నిరంగులు నింపేసి డిజైన్ చేసినా అప్పట్లో కేవలం కుంకుమ మరియూ తెలుపు రంగులతో వెడల్పాటి భాగం అంతా పెద్ద అక్షరాలతో బ్రిటానియా అనే పేరు ప్రింట్ చేసి మిగిలిన వివరాలను నల్లని అక్షరాలతో సన్నని పక్క భాగాలలో ప్రింట్ చేసి వచ్చే బిస్కట్ ప్యాకెట్ చూడగానే నోరూరేది.

ఇక ఈ పక్క ఫోటోలో చూపించినట్లు బిస్కట్ అంచు వెంబడి పూలూ మధ్యలో ఎలివేటెడ్ ఫాంట్ లో బ్రిటానియా అనే ఆంగ్ల అక్షరాలు మహా అద్భుతంగా అనిపించేది. నిజం చెప్పద్దూ ఈ బిస్కట్ తినడం ఒక కళ :-) హడావిడిగా మొత్తం బిస్కట్ అలా నోట్లో కొరికేసి నమిలేస్తే మజా ఉండదు. ఇప్పుడంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళతో ప్రతి బైట్ నీ ఎంజాయ్ చేస్తూ తినండి అని చెప్పించుకోవాల్సి వస్తుంది కానీ చిన్నతనంలో ఏ కోర్సులు లేకుండానే అలా తినే వాడ్ని. ముందుగా నాలుగు వైపులా అంచు వెంబడి ఉన్న పూలను కొంచెం కొంచెం కొరికి చప్పరిస్తూ తినేసే వాడ్ని, ఆపై చదును గా ఉన్న బిస్కట్ పై దాడి చేసి చాలా శ్రద్దగా అక్షరాలు ఏమాత్రం డ్యామేజ్ అవకుండా భద్రంగా మిగతా బిస్కట్ అంతా తినేసిన తర్వాత చివరగా ఒక్కో అక్షరం అలా మెల్లగా కొరికి చప్పరిస్తుంటే ఆహా ఆ మజానే వేరు.  ఇప్పుడు ఎన్ని కేకులూ బిస్కట్లు తిన్నా అంత ఆనందం రాదు. ఇప్పుడు అసలు ఆ రూపమే మార్చేశాడు. కవర్ పై రంగులు ఒంపేశాడు బిస్కట్ పై అక్షరాలను తీసేసి గళ్ళను పెట్టాడు, ఇప్పుడే బాగుందోయ్ టీ లో ముంచుకున్నపుడు విరగ కుండా ఉంటుంది ఈ కొత్త డిజైన్ వల్ల అని ఎవరో అంటే విన్నాను మరి నాలాగా అస్వాదిస్తూ తినేవాళ్ళ పరిస్థితి ఏమిటో ఎవరూ ఆలోచించలేదల్లే ఉంది. అన్నట్లు ఇంకో విషయం అండోయ్ డిజైన్ లో ఎన్ని మారినా బిస్కట్ అడుగున డిజైన్ మాత్రం అప్పటికీ ఇప్పటికీ అన్ని రకాల బిస్కట్స్ అడుగునా ఒకే రకమైన డిజైన్ ఉంటుంది, మరి దాని వెనక కథ ఏమిటో !

మిల్క్ బికీస్ తర్వాత నాకు బాగా ఇష్టమైనవి చిన్న బిస్కట్లు. పావలా సైజులో మిల్క్ బికీస్ మందంలో B అనే అక్షరం తో ఉండే చిన్న చిన్న బిస్కట్లు పెద్ద పెద్ద అల్యూమినియం డబ్బాల్లో వచ్చేవి అవి కేజీల్లెక్కలో సరుకులతో పాటు కొని తెచ్చుకుని ఇంట్లో సీసాల్లో నింపుకుని అప్పుడు కొన్ని అప్పుడుకొన్ని అలా తింటుండడం ఎప్పటికీ మర్చిపోలేను. ఇప్పుడు ఇవి అస్సలు రావడం లేదనుకుంటాను. వాటి తర్వాత నాకు బాగా ఇష్టమైన బిస్కట్స్ bourban. నాకు చాక్లెట్ ఫ్లేవర్ అంతగా నచ్చదు కాని ఈ బిస్కట్ విషయం లో మాత్రం ప్రత్యేకం. బిస్కట్ అంతా చాక్లెట్ ప్లేవర్ మధ్యలో జ్యూసీ క్రీమ్, ఇక బిస్కట్ పైన నక్షత్రాల్లా మెరిసే పంచదార పలుకులు. ఆహా తలచుకుంటేనే నోరూరుతుందంటే నమ్మండి. క్రీమ్ బిస్కట్స్ కూడా ప్రత్యేకంగా తినాలి :-) కొన్ని బిస్కట్స్ ఏమో రెండూ కలిపి కొంచెం కొంచెం కొరికి తిన్నా. కనీసం సగం ప్యాకెట్ అయినా రెండు బిస్కట్స్ ని వేరు చేసి ముందు క్రీమ్ అంతా నాలుక పై కరిగించేసి ఆ రుచి ఆస్వాదిస్తూ ఆపై ఒట్టి బిస్కట్ తినేయాలనమాట :-)

వీటి తర్వాత నచ్చేవి లిటిల్ హార్ట్స్, "ప్రేమించుకుందాం రా" సినిమా దర్శకుడి పుణ్యమా అని వీటి గిరాకీ మరింత పెరిగింది అనుకుంటాను ఇవి కూడా మంచి హార్ట్ షేప్ లో ఫ్లఫ్ఫీగా ఉండి రుచిగా ఉంటాయి. వీటి తర్వాత 50-50 రుచి కూడా అమోఘం. వాటిలో మసాలా ప్లేవర్స్ అంతగా నాకు నచ్చలేదు కానీ మొదట వచ్చిన ప్లెయిన్ నాకు ఇప్పటికీ ఇష్టమే.. వీటి తర్వాత మ్యారీ నాకు అంతగా నచ్చదు కేవలం విటా మ్యారీ మాత్రమే కాస్త కర కర లాడుతూ బాగుంటుంది మిగతావి అంత బాగోవు. ఆ తర్వాత వచ్చిన వాటిలో "గుడ్ డే" ప్రస్తుతం నేను కొనాల్సి వస్తే మొదట వెతికే బిస్కట్స్ ఇవే... క్యాషూ ఫ్లేవర్ మాత్రమే అని వచ్చే బిస్కట్స్ మధ్య ప్రతి బిస్కట్ లోనూ జీడి పప్పుకనిపించేలా జాగ్రత్త తీసుకుని అదే కమర్షియల్స్ కు వాడుకుని మాంచి పేరు సంపాదించాడు ఈ బ్రాండ్ తో. ఇక వీళ్ళ బార్బన్ తప్ప మిగతా క్రీం బిస్కట్స్ (ట్రీట్ సిరీస్) నేను అంతగా తినలేదు పెద్దగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. ఇంకా వీరి ఫ్రూట్ కేక్స్ కూడా నాకు అంతగా నచ్చవు, కానీ ప్రయాణాలలో భోజనానికి సమయం లేనపుడు రక్షిస్తుంటాయి. ఇంకా ప్రస్తుతం వస్తున్న మల్టీ గ్రెయిన్ న్యూట్రీ ఛాయిస్ బిస్కట్స్ కూడా బాగానే ఉంటున్నాయి ఊరికే విరిగిపోవడం కాస్త ఇబ్బందైనా ఆరోగ్యం రుచి దృష్ట్యా అది పెద్ద అవరోధం అనిపించలేదు. వందేళ్ళకు మించిన చరిత్ర ఉన్న వీరి ప్రోడక్ట్స్ లో నేను స్పృశించిన వెరైటీలు కొన్నే అయి ఉండవచ్చు, కానీ ఇవి నాకు తెలిసినా నచ్చినా వెరైటీలు.

నా బ్రిటానియా అభిమానానికి మచ్చుతునకలు కొన్ని ఏమిటంటే.. బ్రిటానియా యాడ్స్ లో చివర్న వచ్చే "టింగ్‍టింగ్‍టిటింగ్" అనే టోన్ ప్రస్తుతం నా మెసేజ్ రింగ్ టోన్ :-) అది మీకు కావాలంటే ఇక్కడ నొక్కి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నాకు బెంగళూరు లో ఉద్యోగం వచ్చిన కొత్తలో పాత ఎఇర్ పోర్ట్ రోడ్ లోని గోల్డెన్ టవర్స్ లో ఉండేది మా ఆఫీస్. మొదటి రోజు ఆఫీస్ దగ్గరపడే కొద్దీ ఆటోలో ఉన్న నా దృష్టిని మా ఆఫీస్ బోర్డ్ కన్నా ఆ పక్కనే ఉన్న బ్రిటానియా బోర్డ్ అత్యంత ఆకర్షించింది. తెల్లని బోర్డ్ పై మెరూన్ అక్షరాలతో బ్రిటానియా అనే పేరు మా ఆఫీస్ పక్కనే చూసి మనసు పులకించి పొయింది. ఓ క్షణం "ఆహా మధ్యాహ్నాలు రోజూ అన్నం మానేసి వీళ్ళ ఫ్యాక్టరీకి వెళ్ళి వేడి వేడి బిస్కట్లు ఓవెన్ లోనుండి డైరెక్ట్ గా తీసుకుని తినచ్చేమో" అని సినిమాస్కోప్ లో కలలు కన్నాను కానీ ఒకసారి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించి భంగపడి ఆ ఆలోచనను విరమించుకున్నాను :-) ఈ మధ్యనే మళ్ళీ వాళ్ళ వెబ్ సైట్ ద్వారా "మీ ఫ్యాక్టరీ లో వేల కొలదీ బిస్కట్లు ఎలా తయారు చేస్తారో చూడాలని ఉంది ఎలా చూడాలీ" అని అడుగుతూ మెయిల్ రాశాను, "త్వరలో మీకు జవాబిస్తాం" అని వెంటనే రిప్లై ఇచ్చారు కాని ఆ తర్వాత మళ్ళీ సౌండ్ లేదు. ఒకవేళ వెళ్ళడం కుదిరితే ఫోటోలకు అనుమతిస్తే ఆ విశేషాలను మరో టపాలో రాస్తాను. అంతవరకూ మాంచి కరకరలాడే గుడ్ డే బిస్కట్స్ తో "హవ్ ఎ గుడ్ డే" :-)

37 వ్యాఖ్యలు:

 1. ముందుగా నాలుగు వైపులా అంచు వెంబడి ఉన్న పూలను కొంచెం కొంచెం కొరికి చప్పరిస్తూ తినేసే వాడ్ని, ఆపై చదును గా ఉన్న బిస్కట్ పై దాడి చేసి చాలా శ్రద్దగా అక్షరాలు ఏమాత్రం డ్యామేజ్ అవకుండా భద్రంగా మిగతా బిస్కట్ అంతా తినేసిన తర్వాత చివరగా ఒక్కో అక్షరం అలా మెల్లగా కొరికి చప్పరిస్తుంటే ఆహా ఆ మజానే వేరు.

  This is exactly how I used to eat them.
  మీ పోస్ట్ చదవడం మొదలుపెట్టగానె, నేను చిన్నప్పుడు ఈ బిస్కెట్లు ఎలా తినేదాన్నొ వెంటనే గుర్తొచ్చింది.కామెంట్లో రాద్దాం అనుకున్నాను. రెండొ పేరాలొ మీరు రాసింది చూసాక, రాయకుండా కాపీ పేస్ట్ చాలు అనుకున్నా.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. ఇది చిల్లీఫెలోలపై ప్రతిదాడి. తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ ధోరణి మార్చుకోకపోతే బ్లాగు సంక్షోభం సృష్టిస్తాం.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. రాణి గారు నెనర్లు, హ హ ఆ బిస్కట్లు చాలా మంది అలానే తినేవారేమో అనిపిస్తుంది ఇపుడు. అప్పట్లో నేనొక్కడ్నే క్రియేటివ్ అనుకునే వాడ్ని :-) బ్లాగ్ లో ఇదే నన్ను ఆకట్టుకునే అంశం మీలాటి కామెంట్స్ చూసినపుడు "ఆహా నాలాగా ఎందరో" అనిపిస్తుంది.

  అబ్రకదబ్ర గారు నెనర్లు, ఆహా అవునా మేమేనా తక్కువ తిన్నది మేమూ సంక్షోభం సృష్టిస్తాం, రాజీనామాలు చేస్తాం, నిరంతరాహారదీక్షలు చేస్తాం. ఇంకా మాట్లాడితే మీ వాటర్ టాంకుల్లో పంచదార పాకం కలుపుతాం, మీ ఇంటికి చాక్లెట్ సిరప్ తో పెయింట్ వేస్తాం ఖబడ్దార్ :-)

  ప్రత్యుత్తరంతొలగించు
 4. ఇప్పుడు పిల్లలు బిస్కెట్లు తగ్గించేసి కుర్కురెలు , చిప్స్ వంటివి తింటున్నారనుకుంటా....అయినా మనలాంటి పెద్దలుంటే బిస్కెట్లకు ఏం నష్టంకలుగుతుంది చెప్పండి . టపా చదువుతుంటే అర్జెంటుగా ఇవన్నీ తెచ్చేసుకోవాలనిపిస్తోంది ముఖ్యంగా బ్రిటానియా అలా తినడంలోని మజా ఏంటో స్వయంగా తెలుసుకోవాలనిపిస్తోంది :)మళ్ళీ అలా బాల్యంలోకి లాక్కెళ్ళిపోయారు మీ టపాతో ..

  ప్రత్యుత్తరంతొలగించు
 5. చిన్నపిల్లలకి సరే!! మనం తినేప్పుడు తప్పక న్యూట్రీషియస్ విలువలు చూస్కుని తినటం మంచిది. ముఖ్యంగా *గుడ్ డే*...

  ప్రత్యుత్తరంతొలగించు
 6. చిన్నప్పుడు అందరం ఇంచుమించుగా మీరు చెప్పిన స్టైల్ లోనే తినెవాళ్ళం అనుకుంటా బిస్కెట్స్..నాకు మాత్రం బట్టర్ బిస్కెట్స్ భలె ఇష్టం లిట్ట్లె హార్ట్స్,ఇంకా గుడ్ డే బాగుంటాయి రుచికి.. ఇప్పుడెందుకో తీపి మీద ఇంట్రెస్ట్ కాస్త తగ్గింది ..బహుశా కోరుకున్న వెంటనే కొనుక్కోగల శక్తి వచ్చేసినందుకేమో..చిన్నప్పటి రోజులే వేరు లేండీ..అమ్మనో నాన్ననో బ్రతిమాలుకోవాలిగా :)

  ప్రత్యుత్తరంతొలగించు
 7. ఇదే ...కరక్ట్ గా ఇలానే తినేవాళ్ళం.. మా అమ్మగారు ఒక పేకెట్ కొనేవారు .. అవి జాగ్రత్తగా (?) నలుగురు పిల్లల్లం పంచుకుని అచ్చు ఇలాగే తినేవాళ్ళం.. . కొన్ని పడుకున్నప్పుడు మిగతా వాళ్ళని ఊరిస్తూ తిందామని జేబులొ పెట్టుకుని దాచెవాడిని.. అప్పుడప్పుడు మర్చిపొయి నిద్రపొతే పొద్దున్నకి మొత్తం బిస్కట్ పొడుం పొడుం :-)) ..కొన్నాళ్ళకి టైగర్ బిస్కట్లని కొద్ది తక్కువ రేట్ లొ దొరికేవి (అది కూడా బ్రిటానీయా వే అనుకుంటా )... ఇప్పుడు బిస్కట్ అంటే గుడ్ డే నే.. బర్బన్ బిస్కట్లు .కాఫీ తొ మాంచి కాంబినేషన్..

  ఆ బ్రిటానియా కి ఎదురుగా వుండే ఎస్ బి ఐ కి వచ్చినప్పుడల్లా నేను అనుకునేవాడిని లొపలికి వెళ్ళనిస్తారా అని.. ఒక నెలలొ మీకు అనుమతి దొరికితె నన్ను తీసుకెళ్ళండి..

  అబ్రకదబ్ర : :-)) మీరు ఎస్ ఎఫ్ ఒ నే కదా.. ఒకసారి మీతొ ఒకసారి చిల్లి పొటికి రావాలి..

  ప్రత్యుత్తరంతొలగించు
 8. అర్జంటుగా ఓ నాలుగు packets పంపించండి :-D

  ప్రత్యుత్తరంతొలగించు
 9. ఇక ఈ పక్క ఫోటోలో చూపించినట్లు బిస్కట్ అంచు వెంబడి పూలూ మధ్యలో ఎలివేటెడ్ ఫాంట్ లో బ్రిటానియా అనే ఆంగ్ల అక్షరాలు మహా అద్భుతంగా అనిపించేది. నిజం చెప్పద్దూ ఈ బిస్కట్ తినడం ఒక కళ :-) హడావిడిగా మొత్తం బిస్కట్ అలా నోట్లో కొరికేసి నమిలేస్తే మజా ఉండదు. ఇప్పుడంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళతో ప్రతి బైట్ నీ ఎంజాయ్ చేస్తూ తినండి అని చెప్పించుకోవాల్సి వస్తుంది కానీ చిన్నతనంలో ఏ కోర్సులు లేకుండానే అలా తినే వాడ్ని. ముందుగా నాలుగు వైపులా అంచు వెంబడి ఉన్న పూలను కొంచెం కొంచెం కొరికి చప్పరిస్తూ తినేసే వాడ్ని, ఆపై చదును గా ఉన్న బిస్కట్ పై దాడి చేసి చాలా శ్రద్దగా అక్షరాలు ఏమాత్రం డ్యామేజ్ అవకుండా భద్రంగా మిగతా బిస్కట్ అంతా తినేసిన తర్వాత చివరగా ఒక్కో అక్షరం అలా మెల్లగా కొరికి చప్పరిస్తుంటే ఆహా ఆ మజానే వేరు
  *** *** ***

  ME TOO ME TOO ME TOO

  ప్రత్యుత్తరంతొలగించు
 10. నేనైతే ఏ బిస్కట్ అయినా..ఆ మాటకొస్తే లోకల్ కంపెనీల అయిదు పైసలకు వచ్చే బిస్కట్ల నుండి కంపెనీ బిస్కట్ల వరకూ అన్నింటినీ మీరు తిన్న పద్దతిలోనే తినేవాడ్ని. ఇంచుమించు అందరూ ఇదే విధంగా తింటారనుకుంటా...
  మీకు గుర్తుందా! చిన్నప్పుడు రకరకాల జంతువులు,పక్షుల ఆకారాల్లో బిస్కెట్లు వచ్చేవి...లాజుగా అమ్మేవాళ్ళు...వాటినైతే మొదట మెడకాయ..తర్వాత ఓ కాలు..తర్వాత తోక..ఈ విధంగా లాగించేవాడిని...
  నాకూ చాక్లట్ ఫ్లేవర్ నచ్చదుగానీ బోర్బన్ మాత్రం నచ్చుతుంది...సాయింత్రం ఆఫీస్లో ఇచ్చే స్నాక్స్ లో నా మెదటి ప్రిఫరెన్స్ బోర్బన్ కే..
  బ్రిటానియా కంపనీ మీద మీ అభిమానం భలే ఉందండి...మిమ్మల్ని కంపెనీలోనికి రానీయ్యలేదా? ఓ వారం రోజులు బ్రిటానియా బిస్కట్లు తినటం మానేయండి...దెబ్బకు నష్టభయంతో వాళ్ళే మీ కాళ్ళ బేరానికి వస్తారు(ఊరికే సరదాగా..)..:-)

  ప్రత్యుత్తరంతొలగించు
 11. బిస్కెట్ల మీద పెద్ద రీసేర్చే చేశారు..డాక్టరేట్ ఇవ్వచ్చునన్నమాట. చాలా బాగా రాశారండీ..యెంత పెద్దవాళ్ళకైనా చిన్న పిల్లలుగా మారిపోయి ఇప్పటికిప్పుడు బిస్కెట్లు తినేయ్యలనిపిన్చేంత టెంప్టింగ్ గా వుంది మీ టపా.
  కానీ అదేంటో గానీ "అసలు చిరుతిళ్ళనూ, చాక్లెట్లు బిస్కెట్లు లాటి తినుబండారాలనూ ఇష్టపడని పిల్లలు చాలా అరుదుగా ఉంటారేమో..." అనే ఈ అరుదైన జాబితాలో నేను మొదటి దాన్నండీ. ఊహ తెలిసాక ఇంతవరకూ నేను తిన్న బిస్కెట్లు కానీ చాక్లెట్లు కానీ బహుశా వేళ్ళ మీద లెక్కించవచ్చు.

  ప్రత్యుత్తరంతొలగించు
 12. పరిమళం గారు నెనర్లు, నిజమేనండీ బిస్కట్సే జంక్ ఫుడ్ అనుకుంటే ఇపుడు పిల్లలు మరింత జంక్ వైపు మళ్ళారు. తప్పకుండా బార్బన్ తెచ్చుకుని నేను చెప్పిన విధంగా ఎంజాయ్ చేయండి. మిల్క్ బికీస్ కి ఆ అవకాశం లేదులెండి ఎందుకంటే ఇపుడు డిజైన్ మార్చాడు.

  భాస్కర్ గారు నెనర్లు, నిజమే చాలా ముఖ్యమైన విషయమే చెప్పారు కానీ నేను కాస్త చూసీ చూడనట్టు వదిలేస్తుంటా మరి ఇష్టాన్ని చంపుకోలేక :-)

  నేస్తం గారు నెనర్లు, నాకు ఇప్పుడిప్పుడే అదే అర్ధమౌతుందండీ అందరూ ఇలానే ఎంజాయ్ చేసే వారని. నిజమే చిన్నపుడు అమ్మ ఊరించి ఊరించి ఒక్క బిస్కట్ ఇస్తే దాన్ని ఎంజాయ్ చేసినంతగా ఇపుడు కొనుక్కుని తిన్న బిస్కట్ ఎంజాయ్ చేయలేం.

  మంచుపల్లకీ గారు నెనర్లు, హ హ మరే నేను కూడా అలా సాయంత్రం లేట్ గా తిందామని దాచిపెట్టుకున్న బిస్కట్లు జేబులో పిండి పిండి అయిపొతే బిక్కమొహం వేసే వాడ్నండీ :-) తప్పకుండా ఈ నెలలోపు అనుమతి వస్తే మీకు కూడా తెలియ చేస్తాను :-) బాబోయ్ ఏంటి మీరు చిల్లీ పోటీకి కూడా రెడీనా.. హ్మ్ కత్తికి రెండువైపులా పదునే అనమాట.

  గీతాచార్య గారు నెనర్లు. అలాగే తప్పకుండా ఈమెయిల్ లో వస్తున్నాయ్ అందుకోండి :-) హ హ అవును ఇక్కడ అందరూ మీటూ అనే అంటున్నారు :-)

  శేఖర్ గారు నెనర్లు, నిజమేనండీ బ్రాండెడ్ కాకుండా లోకల్ వి అలా జంతువుల షేప్ లో వచ్చేవి నేను కూడా కొన్ని రోజులు తిన్న గుర్తు మీరు చెప్పినట్లే రాక్షసుడిలా తలా కాళ్ళు తోకా ఇలా తినేవాళ్ళం. హ హ మీ అయిడియా బాగుందండీ. చూద్దాం లేఖకు ఏమన్నా స్పందిస్తారేమో.

  స్వాతి గారు నెనర్లు, వావ్ మీరు అరుదైన జాబితాలో ఉన్నారని తెలుసుకోవడం సంతోషం గా ఉంది ఇప్పటివరకూ అసలు ఎవర్నీ చూడలేదు నేను. హ హ బిస్కట్ల పై కాదులెండి కేవలం బ్రిటానియా పై మాత్రమే నా రీసెర్చ్ పరిమితం.

  ప్రత్యుత్తరంతొలగించు
 13. మిల్క్ బికీస్ ని ఎంజాయ్ చేసే విధానం ఒకటి చెబుతానండీ.. "నువ్వు మనిషివేనా??" అని అడక్కూడదు మరి :):)
  రెండు మిల్క్ బికీస్ ని జాం తో అతికించండి.. అంటే క్రీం బిస్కట్ లా చెయ్యండి.. ఇప్పుడు ఒక కప్పులో పొగలు కక్కే పాలు తీసుకుని ఈ జంట బిస్కట్ ని జస్ట్ అలా ముంచి, క్రిస్ప్ నెస్ పోకుండా వేడిగా తినండి.. ముఖ్యంగా వాతావరణం చలిచలిగా ఉన్నప్పుడు ఒకసారి రుచి చూస్తే (అది మీకు నచ్చితే) మిల్క్ బికీస్ పేకెట్ ఓపెన్ చేసిన ప్రతిసారీ జాం కోసం వెతుక్కుంటారు మీరు.. టపా బ్రెహ్మాండం అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదండీ..

  ప్రత్యుత్తరంతొలగించు
 14. నాకు మాత్రం ఇరానీ చాయ్ కొట్లో దొరికే చాయ్ బిస్కెట్లు ఇష్టం. దురదృష్టవశాత్తూ ఈవి హైదరాబాదుకి బయట దొరకవ్. విజయవాడంతటి మహానగరంలో ఒక్క చోట కూడా దొరకలేదు

  ప్రత్యుత్తరంతొలగించు
 15. మురళి గారు నెనర్లు, హ హ మిల్క్ బికీస్ ఎలాగైనా ఎంజాయ్ చేయచ్చండీ మేము అస్సలు అడగం. కానీ జాం తో అంటే కాస్త ఆలోచించాల్సిందే :-) ప్రయత్నించడానికి.

  కొత్తపాళి గారు నెనర్లు, నిజమేనండీ ఇరానీ కేఫ్ చాయ్ బిస్కట్లు కూడా చాలా బాగుంటాయి. విజయవాడ లో వాటిని ఉస్మానియా బిస్కట్లు అని పిలుస్తారనుకుంటా.

  ప్రత్యుత్తరంతొలగించు
 16. పావళా సైజులో వుండే చిన్న బిస్కట్లు అంటే గుర్తొచ్చింది....వేసవి సెలవుల్లో మధ్యాహ్నం పూట[పెద్దవాళ్ళు కునుకు తీసే టైం] గోల చెయ్యకుండా ఆడుకుంటే ఒక పెత్తాతయ్య ఈ బిస్కట్లు పంచేవారు.లెక్కపెట్టి ఐదేసి ఇచ్చేవారు.వాటికోసం పిల్లలంతా ఎంతగా ఎదురుచూసేవాళ్ళమో.నాకు బిస్కట్లంటే ప్రాణం.ఈ అమెరికాలో దొరికేవి తింటే విరక్తి పుడుతుంది.క్రేకర్సు,కుకీసు అంటూ ఏదో చెత్త.గుడ్డే,లిటిల్ హార్ట్స్ మా అబ్బాయికని కొని నేనే తింటాను.అందుకే బలం గా వుంటాను :)

  ప్రత్యుత్తరంతొలగించు
 17. వేణు బాగుంది మీ బ్రిటానియోపాఖ్యానం. చాలా నే రిసెర్చ్ చేసేరే బిస్కత్తుల మీద, నాకు కొత్తపాళి గారికి మల్లే ఇరాని బిస్కత్తు లు ఇష్టం.మురళి గారు చెప్పిన విధానమేదో కొత్త గా వుంది.
  ఐనా కొత్తపాళి గారు మీరు మరీ మా విజయవాడ ను ఇలా తీసి పారెయ్యటం.. హుమ్.. మా వూరోళ్ళందరం వూరుకోమండోయ్. పేర్లు తెలుసుకోవాలి అంతే కాని డెట్రాయట్ కొట్లో కెళ్ళి ఇరాని బిస్కట్ ఇమ్మంటే ఇరాన్ వెళ్ళమంటాడు. ;-)
  రాధిక మా అబ్బాయి కి అర్ధం కూడా కాదు నాకు ఎందుకు ఆ లిటిల్ హార్ట్ అంటే ఇష్టమో. చిత్రం గా చూస్తాడు నేను లొట్టలేసుకుంటూ తింటుంటే... (బలం గా వుంటానని చెప్పక్ర్లేదేమో).

  ప్రత్యుత్తరంతొలగించు
 18. రాధిక గారు నెనర్లు, నిజమే తాత గార్లు పంపిణీ చేసేవారు ఈ బిస్కట్లు భలే గుర్తు చేశారు. హ హ మరే అమెరికన్ కుకీస్ నాకు కూడా అస్సలు నచ్చవండీ. లిటిల్ హార్ట్స్ సూపర్.

  భావన గారు నెనర్లు, హ హ రీసెర్చ్ అంతా బ్రిటానియా తోనే ఆగిపోయిందండీ. మరే మురళి గారి పద్దతి చాలా వెరైటీ గా ఉంది. హ హ కొత్తపాళీ గారు కంటి చూపుతో కనిపెట్టేద్దామని ప్రయత్నించి ఉంటారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 19. మొన్నే మా దగ్గరి ఇండియన్ స్టోర్ లో ఒక బ్రిటానియా బిస్కట్ పాకెట్ కొనుక్కొని, ఇంటికెళ్ళే పది నిమషాలలో పాకెట్ ఖాళీ చేసేసా.

  మళ్ళా నోరూరించారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 20. వేణూ, ఎక్కడికో తీసుకెళ్ళిపోయారుగా!! అసలు ఇదెప్పుడు రాశారు.. నేనిన్నాళ్ళు ఎలా మిస్సయ్యాను చెప్మా! మీ టపాతోపాటు మన బ్లాగ్మిత్రుల అనుభవాలు కూడా భలే పసందుగా ఉన్నాయి! ఇండియన్ స్టోర్ కి వెళ్ళినప్పుడు మావారికి ప్రతీదీ పేరూ, సైజ్, పైన బొమ్మలతో సహా గీసి లిస్ట్ ఇస్తే గానీ సరిగ్గా తీసుకురారు.. ఒక్క బ్రిటానియా మాత్రం నేనస్సలు లిస్ట్ లో రాయనే అక్కర్లేదు :)) ఇప్పటికీ ప్రతిరోజూ తింటాను.. మిల్క్ బికీసే నా ఆల్టైం ఫేవరెట్.. కానీ రింగ్ టోన్ కూడా పెట్టుకున్నారంటే మాత్రం మీకు వీరాభిమాని పతకం ఇవ్వాల్సిందే! :-)

  ప్రత్యుత్తరంతొలగించు
 21. చాలా బాగుందండి, మీ బిస్కటోపాఖ్యానం. ఎంతైనా మీ పద్ధతే వేరు. బ్రిటానియా బిస్కెట్లు టీ లో తిన్నా నా కిష్టమే. చిన్నప్పుడు పాలల్లో తినే వాళ్ళం. అవి ముంచంగానే విరిగిపోయి అందులో పడిపోయేవి. చెంచాతో పాలల్లో కలిపేసుకొని తాగేసే దాన్ని. ఎందుకో ఆ టేస్ట్ కూడా నాకు చాలా బాగా నచ్చేది. ఇంక క్రీం బిస్కెట్లేమో విడదీసి, క్రీం నాకేసి, బిస్కట్లు విడివిడిగా తినటం. అదికూడా బాగానే మజా ఒచ్చేది. మీ పోస్ట్ చదవంగానే ఎన్ని తీపిగుర్తులో సినిమాల్లో ఫ్లాష్బాక్ లాగా గింగిరాలు తిరిగిపోతున్నాయి.

  ప్రత్యుత్తరంతొలగించు
 22. బాటసారి గారు నెనర్లు, హ హ మరే బిస్కట్ల లో ఉండే అడ్వాంటేజ్ అది ఒకటి కదండీ ఎక్కడైనా ఎప్పుడైనా రెడీ స్నాక్ :)

  నిషిగంధ గారు నెనర్లు, అయ్యొ మీరు ఒక్క రోజే ఆలశ్యమండీ అంతే, ఇది నేను శుక్రవారమే రాశాను. హ హ మిల్క్ బికీస్ తనకి కూడా అంత అలవాటు చేసేశారనమాట. థాంక్యూ థాంక్యూ తప్పక మీ పతకం స్వీకరిస్తాను :-) రింగ్ టోన్ చాలా క్రిస్పీ గా భలే ఉంటుందండీ. నిజమే కదా నాకు కూడా మన బ్లాగ్ మిత్రుల అనుభవాలు చదువుతుంటే i am not alone అనిపిస్తుంది.

  జయ గారు నెనర్లు, మరే మరే అసలు క్రీం బిస్కట్లు అలా విడదీసి వేటికవే తినడమే మజా అండీ.. అసలు అలానే తినాలి మామూలుగా తింటే దోషం :) నా బ్లాగు ముఖ్య ఉద్దేశ్యమే అదండీ, అలా ఫ్లాష్ బాక్ చేయి అసరాగా చేసుకుని నా బాల్యం లోకి ఒక రౌండ్ వేసి రావడం. ఆ టపాలు మిమ్మల్ని కూడా అలా బాల్యం లోకి తీసుకు వెళ్తుంటే అంతకన్నా సంతోషం ఏముంటుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 23. భలే! నా అనుభవాలు మీ వాటికి కాపీ పేస్టే.

  మా ఇంట్లో బిస్కెట్ల వాడకం ఎక్కువే. గుడ్ డే, మ్యారీ, మల్టీ గ్రెయిన్, బౌర్బన్, క్రీమ్ అన్నీ ప్రతీ నెలా దిగాల్సిందే.
  దాంట్లో సింహ భాగం నాదేనని మళ్ళీ చెప్పక్కర్లేదనుకుంటా :-)

  ప్రత్యుత్తరంతొలగించు
 24. ప్రవీణ్ గారు నెనర్లు, మీరు చాక్లెట్ ఫ్యాన్ అని తెలుసు కానీ బిస్కట్స్ కూడానా గుడ్ గుడ్ :-)

  ప్రత్యుత్తరంతొలగించు
 25. బాగా రాశారు. మిత్రుల స్పందనలు చూశాక ఎబ్రాడ్లో ఉన్న తెలుగు వారిని బాల్య స్మృతులు ఎంతగా వెంటాడుతున్నాయో అర్ధం అయ్యింది. చదివిన వారి మోహంలో ఒక నిమిషమైనా నవ్వు పూయించ గలిగిన మీరు ధన్యులు.

  శ్రీనివాస్, హైదరాబాద్.

  ప్రత్యుత్తరంతొలగించు
 26. బాగుంది.ఎంత బాగా గుర్తుంచుకుని రాసారు! బ్రిటానియా చిన్న బిస్కట్స్, న్యూట్రిన్ చాకలేట్లూ ఎవరూ మర్చిపోరు.కొత్త పాళీ గారూ, సాండీస్ (పీనట్ షార్ట్ బ్రెడ్) కొంచెం ఉస్మానియా(ఇరానీ)బిస్కట్స్ కు దగ్గరగా ఉంటాయి రుచిలో.అవి ట్రై చెయ్యండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 27. సునీత గారు నెనర్లు. నేను న్యూట్రిన్ చాక్లెట్ల గురించి కూడా రాద్దామనుకుని చాక్లెట్లన్నీ వేరే టపాకి కేటాయించి ఇందులో వదిలేశాను. నిజమే శాండీస్ కాస్త దగ్గరగా ఉంటాయి కాని వాటి కెలొరిక్ వాల్యూ చూస్తె బొత్తిగా మింగుడు పడవు.

  ప్రత్యుత్తరంతొలగించు
 28. @ sunita .. Sandies .. yes, yum yum. అవి తినడం వల్లనే గ్లాక్సో బేబీ లాంటి నా లుక్సుని కాపాడుకొస్తున్నాను :)

  ప్రత్యుత్తరంతొలగించు
 29. చాక్లెట్ల కన్నా బిస్కెట్లంటే ఇష్టమున్న నాకు చిన్నప్పటినుంచీ ఎంతో ఇష్టమైనవండి బ్రిటానియా మిల్క్ బికీస్. no one can eat just one అని తినేసేదాన్ని.బ్రిటానియా వాళ్ళ "ఫైవ్ గ్రైన్ బిస్కెట్లు" తిన్నారా? ఇప్పుడు కాస్త ఎక్కువ హెల్త్ కాన్షియస్ కాబట్టి అవే కొంటూంటాను . మా పాపకు బ్రిటానియా Treat బిస్కెట్లు ఇష్టం..:)

  ప్రత్యుత్తరంతొలగించు
 30. తృష్ణ గారు నెనర్లు, హ హ నేనూ అంతేనండీ ఒక్కటి తిని ఆపలేను. య ప్రస్తుతం నేను కూడా ఆ ఫైవ్ గ్రెయిన్ బిస్కట్స్ ఎక్కువ తింటున్నాను. మిగిలిన వాటితో పోలిస్తే ఇవి కాస్త ఆరోగ్యానికి మంచిది అని. మీ పాప కూడా బ్రిటానియా బ్రిగేడ్ అనమాట గుడ్ గుడ్ :-)

  ప్రత్యుత్తరంతొలగించు
 31. superb post..!
  మిల్క్ బికిస్ యాడ్ లో మిల్క్ బాటిల్..తరవాత అదే బాటిల్ షేపులో ఉన్న బిస్కెట్లుగా మారిపోయేది. మీకు గుర్తుందా.? చిన్నప్పుడు నేను అది చూసి, ఆ బిస్కెట్లు కొనుక్కుంటే, అలా బాటిల్ షేపులోనే వస్తాయేమో అని తెగ ముచ్చటపడేదాన్ని. తీరా, కొన్నాక అన్ని మాములుగా ఒకే షేపులో, మామూలు బిస్కెట్లాగే ఉన్నాయి :-( అయినా, నాకిష్టమే అనుకోండి తినడానికి ;-)
  నేను అచ్చంగా మీరు చెప్పినట్టే తింటాను బిస్కెట్లు.. మెల్లగా చప్పరిస్తూ.. చుట్టూ ఉన్న పువ్వులు తింటూ ;-) అసలు ఏ బిస్కేట్టయినా అలా తింటేనే బాగుంటుంది. ఇప్పుడు కూడా ఎవరూ నన్ను చూడకపోతే అలా తినడానికి నేను రెడీయే ;-)
  మిల్క్ బికిస్ క్రీం బిస్కెట్లు తెల్సా మీకు? కళ్ళు,ముక్కు, నోరు ఉండి రకరకాల భావాలు పలికిస్తుంటాయి. అది నా ఫేవరేట్. ముందు క్రీం తినేసి.. తరవాత బిస్కెట్ తినాలి. నేను ఇండియా నుంచి వచ్చేప్పుడు ఇది, ఇంకా గుడ్ డే తెచ్చుకుంటాను :-) బార్బాన్ కూడా బాగుంటుంది...మీ పోస్టుతో, అందరిలో ఉన్న బ్రిటానియా ప్రేమని వెలికి తెచ్చారు. టిన్ టింటి టిన్.. ;-)

  ప్రత్యుత్తరంతొలగించు
 32. మధురవాణి గారు నెనర్లు, నిజమేనండీ మిల్క్ బికీస్ లో క్రీం బిస్కట్స్ నేను కూడా చూశాను. స్మైలీలు బాగుంటాయ్ కానీ నాకు అవి పెద్దగా నచ్చలేదు :-) బార్బన్ తర్వాతే క్రీం ఏవైనా. మీ కామెంట్ కిచ్చిన ఫినిషింగ్ టచ్ బాగుంది:-)

  ప్రత్యుత్తరంతొలగించు
 33. హబ్బ! బిస్కట్లలో నాదీ, మీదీ ఒకే టేస్టు...పెద్దబిస్కట్లు మా మావయ్య మా ఇంటికి వచ్చేప్పుడల్లా అన్నయ్యకి,నాకు చెరొక ప్యాకెట్ తెచ్చేవాడు..అవి అరమర్లో లోపల అన్నయ్యకి దొరక్కుండా దాచుకోడం(మరి వాడిది మొత్తం గబగబా తినేసి నాదాని మీద దౌర్జన్యానికి దిగేవాడు..అమ్మకూడా వాడికే సపోర్టు..ఇక దిక్కు తోచక ఎక్కడెక్కడో దాచేవాణ్ణి),రోజుకో బిస్కట్టు స్కూలుకి పట్టుకెళ్ళి ఫ్రెండ్సందరికీ నోరూరిస్తూ,అచ్చు మీరు చెప్పినట్టుగా గంట తినడం.....అలా ముందు డిజైను,తర్వాత ప్లైన్ గా ఉంది తింటుంటే..సూపరు...

  ఇక చిన్న బిస్కట్లంటారా..నా పిచ్చ ఫావరేటు...రూపాయికి ఇరవై వచ్చేవి..బ్యాగులో పోసుకుని స్కూల్లో తింటూ కూర్చునేవాణ్ణి....నాన్న ఇంట్లొ కేజీల్లెక్కన తెచ్చిపెట్టేవారు..వాటిని జామ్ తో ఓ పట్టు పట్టేవాళ్ళం...పుట్టినరోజుకి స్కూల్లో,ట్యూషన్లో పంచేది న్యూట్రిన్ చాక్లేట్లూ, ఈ బుజ్జి బిస్కట్లే...

  నా చిన్ననాటి జ్ఞాపకాల్ని ఇలా మీవల్ల గుర్తు చేసుకుంటున్నాను..
  అన్నట్టు బోర్బన్ కూడా నా బెస్ట్ ఫావరెట్....ః))

  ప్రత్యుత్తరంతొలగించు
 34. కౌటిల్య గారు నెనర్లు,
  నేను బ్రిటానియా చిన్న బిస్కట్లు ప్రొడక్షన్ ఆపేశారు అనుకున్నానండీ, మొన్న గుంటూరు వచ్చినపుడు బేకర్స్ ఫన్ లో ఈ చిన్న బిస్కట్ లు చూడగానే కొన్నాను. దదాపు పదేళ్ళ తర్వాత రుచి చూశానవి ఎంత సంతోషమేసిందో..

  ప్రత్యుత్తరంతొలగించు
 35. మీ ఈ టపా ఎలా మిస్స్ అయ్యానబ్బా!! ఇప్పుడే తృష్ణ గారి బ్లాగులో చూసి ఇటొచ్చాను. మీరు బిస్కట్టు తినే విధానం మాత్రం మస్తుగుంది. స్కూల్లో ఉండగా బ్రిటానియా చిన్న బిస్కట్లు ఆగస్టు15కి జనవరి26కి గుప్పెళ్లు గుప్పెళ్లు పెట్టేవారు. ప్రస్తుతం మా ఇంట్లో మా అబ్బాయి బిస్కట్టు ప్రియుడు. తెఛ్చేది నేనే కాబట్టి కొత్త కొత్తవి ఏమొస్తున్నాయా అని చూసి తెస్తాను..ఎక్కువగా బ్రిటానియానే ఉంటాయిలేండి.

  ఇంతకీ బ్రిటనియా ఫ్యాక్టరీ చూసారా లేదా!!!

  ప్రత్యుత్తరంతొలగించు
 36. సిరిసిరిమువ్వ గారు ఎన్నాళ్ళకెన్నాళ్లకు :) తమరి రాక మాకెంతో సంతోషం సుమండి :-) తృష్ణగారికి కూడా థ్యాంక్స్ చెప్పాలి. నిజమే స్వాతంత్రదినోత్సవం రోజు ఆ బిస్కట్లు గుప్పిళ్ళతో ఇచ్చేవారు, భలే గుర్తు చేశారు :)

  ఇంకా ఫ్యాక్టరీ చూడలేదండీ :( వాడికి రెండుమూడు రిమైండర్లు కూడా పంపించాను కానీ జవాబులేదు, కొన్నికారణాలవల్ల ఈ పని ప్రస్తుతానికి వాయిదా వేశాలెండి కొన్నాళ్ళాగి మళ్ళీ ప్రయత్నించాలి.

  ప్రత్యుత్తరంతొలగించు

పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీకామెంట్ రెండు వారాలకు ముందు ప్రచురించిన టపాలో ఐతే పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. Google Chrome Browser లో కామెంట్స్ పబ్లిష్ అవడంలేదు అని కంప్లైంట్ వచ్చింది. సరిచేయడానికి ప్రయత్నిస్తున్నాను. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.