దృష్టి మళ్ళీ రోడ్ పై నిలిపాను, ఎండ తీక్షణంగా ఉంది, దూరంగా రోడ్ పై నీటి చెలమలు ఉన్నట్లు కనిపిస్తున్నాయ్. బస్ ముందుకు వెళ్ళే కొద్దీ అవి మాయమవడమో మరింత దూరం జరగడమో జరుగుతుంది. ఎండమావులు(Mirage) అంటారు ఇవేనేమో!!, కానీ స్కూల్లో టీచర్ చెప్పిన ప్రకారం అవి ఎడారుల్లో కదా కనిపించాలి, ఊర్లో ఇలా రోడ్ మీద ఎందుకు కనిపిస్తున్నాయబ్బా ఏమోలే.. ఎండమావులు పదం ఈ మధ్యే ఎక్కడో విన్నాను కదా ఎక్కడా ?
"అసలు ఈ రెసిడెన్షియల్ కాలేజిలు ఎండమావులు లాంటివమ్మాయ్ దూరంగా ఉన్నంత సేపు మురిపిస్తాయ్ అంతే.. అక్కడికెళ్తే అసలు బండారం బయట పడుతుంది. అయినా మన బంగారం మంచిదవ్వాలి కానీ అంత డబ్బులు పోసి అక్కడ చదివించినా ఉపయోగం ఏం ఉంటుంది చెప్పు డబ్బు దండగ తప్పించి.." నే వినట్లేదనుకున్నారో లేదా విన్నా పర్లేదనుకున్నారో మొత్తానికి స్పష్టంగా నా చెవిన పడ్డ ఒకాయన అమ్మకిస్తున్న ఉచిత సలహా గుర్తొచ్చింది.
"వాడి కంటి చూపు అంతంత మాత్రమే అంత లావు కళ్ళద్దాలు వేసి అంత దూరాల్లో ఒక్కడ్నే ఉంచి చదివించాల్సిన అవసరం ఉందా.. ఇప్పుడు వాడు చదివి ఎవర్ని ఉద్దరించాలిట. ఏం వాళ్ళ నాన్న బిఎ చదివి మాంచి ఉద్యోగం చేయడం లేదా వాడ్ని కూడా ఏ ఆర్ట్స్ గ్రూపులోనో చేర్చి ఇంటిదగ్గరే ఉంచి చదివించచ్చు కదా.." బంధువుల సలహాలు విని చిద్విలాసంగా నవ్వడమే కానీ పన్నెత్తు మాట మాట్లాడని అమ్మానాన్నలు గుర్తొచ్చారు.అసలు బుద్దిగా చదువుకుంటే ఈ బాధలు ఉండక పోవు కదా అత్తెసరు మార్కులు తెచ్చుకోవడం వల్లనే కదా ఈ కష్టాలన్నీ. "ఎవరు చేసిన ఖర్మ వారనుభవించకా.." మనసులోనే పాడేసుకుంటూ మళ్ళీ రోడ్ పై దృష్టి నిలిపాను.
హాయ్!! దూరంగా అదేమిటి ఎడ్లబండా? ఆ, దగ్గరకు వస్తుంటే క్లియర్ గా తెలుస్తుంది. ఎడ్లు ఏంత ఠీవీగా నడుస్తున్నాయో... ఆస్వాదించేలోపే రయ్ య్ య్... మంటూ మా బస్ దాన్ని ఒక్క క్షణం లో దాటేసింది భలే! హఠాత్తుగా స్వర్ణకమలం సినిమాలో భానుప్రియ వాళ్ళ ఎడ్లబండిని దాటుకుంటూ వెళ్ళే మోటారు వాహనాలు గుర్తొచ్చాయ్ "నిధిచాల సుఖమా.." కీర్తన గుర్తొచ్చింది. ఎలాగైనా విశ్వనాథ్ గారు సినిమాలు బాగా తీస్తారు కదా. విశ్వనాథ్ బాగాతీస్తారు కానీ ఆయన సినిమాల్లో కొన్ని సరిగా అర్ధం కావు. అదే మాబాసు చిరంజీవైతే కామెడీ చేసినా ఫైట్లు చేసినా డ్యాన్సాడినా ఇరగదీస్తాడు కదా. చిరుని తలుచుకోగానే బోల్డంత ఉత్సాహం అంతలోనే నీరసం తన్నుకొచ్చేశాయి.
రేపటి నుండి జైలు జీవితమేనటగా ఇకపై నరసరావుపేటలో ఫ్రెండ్స్ ని తరచుగా కలవడానికే కుదరదు, ఇక సినిమాల సంగతి సరే సరి. ఫ్రెండ్స్ అంటే సర్లే ఇక్కడ కూడా కొత్త ఫ్రెండ్స్ తయారవుతారు కానీ సినిమాలు ఒకసారి రిలీజై ఎత్తేస్తే మళ్ళీ ఎలా చూడటం. మహర్షి సినిమా అలాకాదు చూడలేకపోయింది. పరీక్షలకు నెల ముందు రిలీజైనా పబ్లిక్ పరీక్షలు అని చెప్పి ఎంత బతిమిలాడినా చూడనివ్వలేదు. పరీక్షలవేసరికి సినిమా ఎత్తేశారు. చాలామంది బాగాలేదన్నారు కాని నామినేని గాడు "చాలా బాగుంది, నీకు కూడా నచ్చుతుంది" అన్నాడు, కానీ నాకు కుదరలేదు. నేను హాస్టల్ లో ఉన్నపుడు రిలీజైన సినిమాలు ఎలా చూడాలో ఏమిటో :-(
అరె!! ఆలోచనల్లోనే విజయవాడ వచ్చేసిందా! వావ్ ప్రకాశం బ్యారేజ్ ఎంత అందంగా ఉందో కదా. బాబోయ్ నది ఒడ్డునే ఎంత ఇరుకుగా ఇళ్ళుకట్టుకున్నారో, ఎంతైనా పెద్ద ఊర్లంటే అలాగే ఉంటాయ్ ఏమోలే అందరూ ఇక్కడికే వస్తుంటారు కదా. అవునూ విజయవాడ అంటే మంచి రోడ్లు పెద్ద పెద్ద బిల్డింగ్ లూ ఊహించుకుంటే ఇదేమిటీ ఇలా ఉంది?. ఇలా నాలో నేను చూసిన ప్రతి దాన్నీ ప్రశ్నించుకుంటూ ముందుకు సాగుతూనే నాన్న వెంట కాలేజి గేట్ ముందు బస్ దిగాను. ఎదురుగా పెద్ద గేట్ దానికి రెండు పెద్ద పెద్ద నల్లని తలుపులు, ఈ చివర నుంచి ఆ చివరికి నిలువు చువ్వలు,వాటి వెనకగా మందపాటి పెద్ద రేకు ప్రతి చువ్వపైన మొనదేలిన కొసలతో త్రిభుజాకారపు ఆక్రుతులు, బహుశా పిల్లలెవరైన గేటు దూకే ప్రయత్నం చేస్తే అవి గుచ్చుకుని ఆగిపోడానికేమో.
గేటుకి ఒక మూల ఒక మనిషి మాత్రమే పట్టే మరో చిన్న తలుపు. "ఇదేదో అచ్చంగా సినిమాల్లో చూపించే జైలు గేటు లా ఉందే. నిజంగా హాస్టల్ కే వచ్చామా లేక బస్ వాడు పొరబాటున ఏదైనా జైలు ముందు దించేశాడా ?" ఒక వేళ నేను ఇంట్లో ఆబద్దాలు చెప్పి అప్పుడప్పుడూ కొట్టేసిన ఐదు పది రూపాయలకు నాకు జైలు శిక్షవేస్తే నాకు చెప్పకుండా నాన్న ఇక్కడకు తీసుకువచ్చారా ? హబ్బే ఆబద్దాలకి, అదీ ఇంత పెద్ద జైల్లో శిక్ష వేయరేమో లే. అవునూ ఆమూల చిన్న బోర్డేదో కనపడుతుంది కదా చూద్దాం. ఓ సారి కళ్ళద్దాలు సవరించుకుని చదివాను "సిద్దార్థ రెసిడెన్షియల్ స్కూల్, ఈడ్పుగల్లు" హమ్మయ్యా ఇది జైలు కాదు. కానీ నేను కాలేజి లో జాయిన్ అవడానికి కదా వచ్చింది ఇదేంటి నన్ను స్కూల్ కి తీసుకు వచ్చారు ? ("ఈ పక్కన ఫోటోలో చూపింది మా కాలేజ్ గేట్ కాదు లెండి ఇంచు మించు ఇదే స్టైల్ లో ఇంకా ఎత్తుగా ఉండేది మా గేట్")
~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~
నేను విజయవాడ సిద్దార్ధ రెసిడెన్షియల్ కాలేజ్ లో ఇంటర్మీడియట్ చదివాను. ఆ ఙ్ఞాపకాలు ఈ టపాల సిరీస్ ద్వారా పంచుకుందామని నా ఈ చిన్న ప్రయత్నం. ఇది సీరియల్ అని చెప్పను కాని అక్కడక్కడా టపా నిడివి దృష్టిలో పెట్టుకుని రెండు మూడు టపాలకు పొడిగించే అవకాశం ఉంది. అలాగే ఈ సిరీస్ టపాలలో ఒకదానితో ఒకటి కాస్త రిలేషన్ కూడా ఉండచ్చు ఎందుకంటే మా కాలేజ్, క్లాస్ మేట్స్, లెక్చరర్స్, విజయవాడ ఇవి అన్నీ ఏమీ మారవు కదా. సరేనండి త్వరలో మరో టపాలో కలుద్దాం.
ఈడుపుగల్లు లో చదివారా మీరు..!? ఆ ఊళ్ళో మా ఫ్రెండ్స్ ఉన్నారు.. చాలాసార్లు వచ్చాను అక్కడికి..
రిప్లయితొలగించండిand నేను విజయవాడలోనే చదివాను...
టపాలు గ్యాప్ ఇవ్వకుండా వ్రాయండి.. :)
తర్వాత టపా నుండే అసలైన మజా ఉంటుందనుకుంటా...బాగుంది.
రిప్లయితొలగించండిఈడ్పుగల్లు లో చదివేరా? మొత్తానికి మా విజయవాడ తో పరిచయం వుందన్నమాట. ఐనా 10th క్లాస్ అయ్యాక కూడా పది రూపాయలకు జైలు లో వేస్తారేమో అనే ఆలోచన మెదిలింది అంటే అమాయకులే పాపం. ఇంతకు ఇప్పటికైనా మహర్షి చూసేరా? :-) ఎదురు చూస్తుంటాం తర్వాతి భాగం కోసం.
రిప్లయితొలగించండిమళ్ళి మహర్షి ఎప్పుడు చూసారు ?
రిప్లయితొలగించండితరువాతి భాగం కోసం ఎదురు చూస్తూ ... :)
మేధ గారు నెనర్లు, అవునండీ నేను ఈడుపుగల్లు సిద్దార్ద రెసిడెన్షియల్ లోనే చదివాను. ఓ అవునా గుడ్ గుడ్. అలాగే తప్పకుండా తక్కువ గ్యాప్ తో రాయడానికి ప్రయత్నిస్తాను.
రిప్లయితొలగించండిశేఖర్ గారు నెనర్లు. హ హ మొత్తానికి ఈ టపాలో విషయం లేదన్న విషయం చాలా మెత్తగా చెప్పారు మీదైన పద్ధతిలో :-) అంత మజా ఏమీ ఉండదు లెండి సాధారణ కాలేజ్ ఙ్ఞాపకాలు అంతే.
భావన గారు నెనర్లు, అమాయకత్వం కాదండీ అతి ఆలోచనలు. 80 లలో సినిమాల ప్రభావం ఎక్కువ లెండీ నాపై. బోస్టన్ స్కూలు లో చదివితేనే హీరోలు అని అప్పట్లో ఓ నమ్మకం :-) ఇంకా ఇలాంటి పైత్యపు ఆలోచనలు చాలానే చేసేవాడ్నిలెండి.
చైతన్య గారు నెనర్లు, ఎప్పుడో ఒక సారి టీవీ లో వస్తుంటే మధ్యలో కాసేపు చూశానండీ. పూర్తి సినిమా ఇప్పటికీ చూడలేదు :-) తర్వాత తర్వాత దానిపై క్రేజ్ కూడా తగ్గింది లెండి. పాటలు మాత్రం ఇంకా వింటూంటాను.
వేణు గారూ...హ..హా..మీరు అలా అర్ధం చేసుకున్నారా...మీరు ఈ టపా కాలేజ్ గేట్ దగ్గరే ఆపేశారు కదా..తర్వాత టపాలో లోపల జరిగిని ఫన్నీ ఇన్సిడెంట్లు, మీరు చేసిన అల్లర్లు, సార్లను వేధించటం..లాంటివన్నీ ఉంటాయి అని అనుకుని అలా రాసాను. :-)
రిప్లయితొలగించండిమహర్షి సినిమా చూడాల్సినంత గొప్ప సినిమా ఏమీ కాదండీ..పాటలు ఐతే ఎన్నిసార్లయినా వినొచ్చు.
హ హ అదేం లేదు శేఖర్ గారూ మీ అసలు ఉద్దేశ్యం అర్ధమైంది. కానీ నాకే అలా ఏమీలేదు అనిపించి మీ వ్యాఖ్యకు ఇలా భాష్యం చెప్పి నా ఆనందం తీర్చుకున్నాను :)
రిప్లయితొలగించండికూల్!! సిద్ధార్ధ రెసిడెన్షియల్ లో చదివారా!! గంగూరు, ఈడుపుగల్లు రోడ్ మధ్యలో ఉంటుంది కదా.. మా అత్తగారు + వాళ్ళ ఖాందాన్ అంతా ఈడుపుగల్లులోనే ఉంటారు.. మహర్షి నేను కూడా రిలీజ్ అయినప్పుడు చూడలేక్పోయాను.. తర్వాత చూసినప్పుడు పాటలు మాత్రం చూసి సినిమా అంతా ఫార్వార్డ్ చేశాను :-)
రిప్లయితొలగించండినిషిగంధ గారు నెనర్లు, అయితే ఖచ్చితంగా మీ అత్తగారి వాళ్ళని నేను చూసే ఉంటానండీ. కాలేజ్ లో ఏమీ తోచక ఒకో సారి ఈడ్పుగల్లు ఊరంతా తిరిగి వచ్చేవాళ్ళం. నిజమే మహర్షి కాసేపు చూసి బోరు కొట్టేసి ఆ తర్వాత పూర్తిగా చూసే ప్రయత్నం చేయలేదు. పాటల మీద ఉన్న ఇష్టం కూడా ఎక్కడ పోతుందో అని.
రిప్లయితొలగించండిమీరు సిద్ధార్ధ కాలేజ్ లో చదివారా? అప్పటికి శ్రీ చైతన్య కాలేజ్ పుట్టలేదేమో! అందుకే మీరు అదృష్టవంతులు లేకుంటే రెండేళ్ళకే పద్నాలుగేళ్ళ జీవిత ఖైదు అనుభవించి వుండేవారు . స్వర్ణ కమలం లో ఎడ్లబండి సేన్ నాకు ఎప్పుడూ గుర్తొస్తుంది. ఆ బండిలో నేనూ మావారూ, పిల్లలూ వుంటాం . ఏంటండీ .....లోకమాంతా ఇంత ఫాస్ట్ గా మారుతుంటే , మనం మాత్రం ఇలా ........(నా డైలాగ్ అన్నమాట)
రిప్లయితొలగించండిఎబ్బెబ్బెబ్బే నాకసలు సీరియల్స్ నచ్చవు ..:P
రిప్లయితొలగించండిమరి నేనూ మీలాగే కధ కాస్త నవల్ ని చేసి పరేసా :) రాయండి రాయండి అప్పుడెకదా మనస్పూర్తిగా అనుకున్నది వ్రాయగలం
లలిత గారు నెనర్లు, నిజమేనండీ అప్పట్లో శ్రీచైతన్య పుట్టకపోవడమో లేదా అపుడే మొగ్గతొడిగుతూనో ఉండి ఉంటుంది. బాగ పేరున్నవి మాత్రం నారాయణ, విఙ్ఞాన్, నలంద, సిద్దార్ధ, గౌతమ్ ఇవే ఉండేవి. హ హ మీ కల బాగుంది :-) ఇంతకీ మీ వారికి చెప్పారా లేదా ఆ విషయం :-)
రిప్లయితొలగించండినేస్తం గారు నెనర్లు, ఎవరండీ అక్కడ నాకసలే సీరియల్స్ నచ్చవు అని చెప్తుంటే వినరేంటి :-p భలే కొట్టారుగా దెబ్బ :-) మరే మరే మనం అనుకున్నదంతా చెప్పాలంటే తప్పదు కదండీ.. అర్ధం చేసుకోరూ..!! అయినా ఇంతటితో సమాప్తం అండీ ఇకపై అమృతం సీరియల్ లా దేనికదే చదువుకునే లా చిన్న చిన్న టపాలలోనే చెప్తాను :-)