నేనున్నానని భరోసానిస్తూ... గట్టిగా పట్టుకుంటే నా చేయి ఎక్కడ కందిపోతుందోనని మృదువుగా నా మణికట్టును తన అరచేతిలో పొదవి పట్టుకున్న అమ్మచేతి నులి వెచ్చని స్పర్శను ఇంకా మరువనేలేదు... మా అమ్మ అచ్చంగా నాకే సొంతమని లోకానికి చాటి చెబుతూన్నట్లుగా.. నా అరచేతిని బలంగా తనచేతివేలి చుట్టూ బిగించి పట్టుకున్న బిగి సడలినట్లే లేదు... తను ఎప్పుడూ నాతోనే ఉండాలన్న నా ఆలోచన గమనించలేదో ఏమో!! అమ్మ నా చేతిని విడిపించుకుని నన్ను వీడి వెళ్ళిపోయి అప్పుడే మూడేళ్ళు గడిచిపోయాయి !!
గడచిన ఈ మూడేళ్ళలోనూ ఏరోజుకారోజు రేపటికన్నా అలవాటౌతుందిలే అని అనుకుంటూ పడుకుంటానే కానీ ఇంతవరకూ ఏ ఒక్కరోజూ ఆ అమ్మలేని తనం ఇంకా నాకు అలవాటు కాలేదు... ఇక ఎప్పటికైనా అలవాటు అవుతుందన్న నమ్మకం కూడా రాను రాను సన్నగిల్లుతుంది. తను లేదన్న నిజం అప్పుడప్పుడు గుచ్చుకుంటున్నట్లుగా తెలిసే కొద్దీ కళ్ళు చెమ్మగిల్లుతూనే ఉన్నాయి...

కానీ అంతలోనే ఆకాశానికేసి చూసినపుడు లెక్కకు మిక్కిలిగా ఉన్న ఆ నక్షత్రాలలో
అమ్మ ఏ నక్షత్రంగా మారి పైనుండి నన్ను మురిపెంగా చూసుకుంటుందో అని
అనిపించి సాంత్వనతో మనసు కుదుటపడుతుంది. తనను సంతోషంగా ఉంచడానికైనా నేను
నవ్వుతు తుళ్ళుతూ ఆనందంగా ఉండాలన్న కర్తవ్యం గుర్తుకొస్తుంది.
అమ్మ మమ్మల్ని వదిలివెళ్ళి నేటికి మూడేళ్ళు(జనవరి22, 2009) అయిన సంధర్భంగా "అమ్మా మేమిక్కడ నీ ఙ్ఞాపకాలతో నీవు నిర్దేశించిన మార్గంలో పయనిస్తూ సంతోషంగా ఉన్నాము.. నువ్వుకూడా ఏలోకాన ఉన్నా నీ ఆత్మకు సుఖశాంతులు చేకూరాలని మనసారా కోరుకుంటున్నాము" అని తనకు చెప్పాలని ఈ పోస్ట్.
వ్యాఖ్యాతలకు గమనిక : ఈ పోస్ట్ కు వచ్చే కామెంట్స్ పబ్లిష్ చేయబడవు....
అప్డేట్ : 28/1/2012 ఈ పోస్ట్ కామెంట్స్ డిజేబుల్ చేయబడినవి మీ వ్యాఖ్యను తెలియజేయాలనుకుంటే ఈ బ్లాగ్ పైన సోషల్ ప్రొఫైల్స్ చివరలో ఇచ్చిన మెయిల్ ఐకాన్ పై క్లిక్ చేసి మెయిల్ చేయగలరు.