బుధవారం, మార్చి 13, 2013

భయం !!

చేస్తున్న పని ఆపి వేళ్ళు విరుచుకుంటూ సిస్టం ట్రే లో టైం చూశాను 1.36 AM.

దదాపు గంటనుండి నిరంతరాయంగా మోగుతున్న ఇళయరాజా ప్లేలిస్ట్ ని పాజ్ చేసి రెండు చెవుల్లోనుండి ఇయర్ ఫోన్స్ తీసి తలతిప్పి గదిలో నాలుగు పక్కలకి చూశాను.. లోయస్ట్ బ్రైట్ నెస్ సెట్టింగ్ లో లాప్ టాప్ స్క్రీన్ నుండి వస్తున్న వెలుగు ఒక ప్రొజెక్టర్ లైట్ లా నా వెనక తెల్లని గోడ మీద నలుచదరంగా పలచగా పరచుకుంది..

స్క్రీన్ కి ఎదురుగా కూర్చున్న నానీడ గోడపై ఆ వెలుగులో అస్పష్టంగా తెలుస్తుంది. నేను తల తిప్పి తన వైపు చూడడంతో నానీడ కూడా తలతిప్పి నన్ను పరికించి చూస్తున్నట్లు అనిపించింది.

ఇంకానయం గదిలో ఎవరూ లేరు ఎవరైనా ఈపాటికే పడుకుని ఉంటే నిద్రలో సడెన్ గా కళ్ళు తెరచి నానీడని చూస్తే దెయ్యమని భయపడే వారేమో అనిపించింది.

ఇంత చీకటిలో లాపీతో పని చేయకూడదు అంటారు కదా అనుకుంటూ తిరిగి లాప్టాప్ వైపు చూశాను స్క్రీన్ వెనక టేబుల్ పై మిణుకు మిణుకుమంటున్న నైట్ లాంప్ తన అస్థిత్వాన్ని తెలియజేయడానికి అష్టకష్టాలు పడుతుంది.

“ఈ ట్యూబ్ లైట్ రిపేర్ అయ్యేవరకూ ఒక చిన్న CFL బల్బ్ అన్నా పెట్టుకోవాలి రేపటినుండి” అనుకున్నాను.

తలతిప్పి కిటికీలోనుండి బయటకి దృష్టి సారించాను, అమావాస్యేమో చిక్కని చీకటి, బిగించిన తలుపుల అద్దాల బయట కాస్తంత వెలుతురు కూడా కనపడలేదు. స్క్రీన్ వెలుతురు చూడడానికి అలవాటు పడిన కళ్ళు చీకటికి అలవాటు పడడానికి టైం తీస్కుంటున్నట్లున్నాయ్. ఒక సారి కళ్ళు మూసి తెరిచాను. గదిలోపల బయట కూడా చీకటి... నేను నా గదిలో కాక అనంతమైన శూన్యంలో కూర్చున్నానా అనిపించేట్లు చుట్టూ నల్లటి చీకటి తప్ప ఇంక వేరే ఏమీ కనపడడం లేదు. 

“అవునూ అదేంటి బయట వీధి దీపాల వెలుగు కొంచమైనా కనిపించాలే బొత్తిగా ఏం లేదేంటి?”

“ఏదైనా ప్రాబ్లం వలన వెలగట్లేదా లేక ఏ దొంగోడో వీధి దీపాలు పగల గొట్టాడా ??”

“ఈ ఏరియాలో దొంగతనాలు అంతగా జరగవులే.. అయినా మన జాగ్రత్తలో మనం ఉండడం ఎందుకైనా మంచిది.”

“ఏంటో ప్రశ్నా జవాబూ రెండూ నావేనా ? ఇవే బయటికి వినిపించేట్లు పెద్దగా మాట్లాడితే నన్ను పిచ్చోడనుకుంటారేమో.. అదీ ఈ టైంలో నాలోనేను మాట్లాడుకోడం చూస్తే ఏ దెయ్యమో పూనిందనుకుంటారేమో !!”

“అబ్బా ఏంటో ఎంత కాదనుకున్నా ఈ దెయ్యాల ఆలోచనలు మాత్రం రాకుండా ఉండవు కదా.. ఇంత రాత్రిపూట వాటి గురించి ఎందుకులే కానీ దొంగల గురించి ఆలోచిస్తే బెటరేమో..” 

“ఆగాగు... ఆ శబ్దం ఏంటి??” మరో సారి జాగ్రత్తగా చెవులు రిక్కించి విన్నాను. ఎక్కడినుండో లీలగా సన్నగా మ్మ్..మ్మ్...మ్....మ్.మ్.మ్.మ్.... అని వినిపిస్తుంది. 

“ఎవరిదో మనిషి మూలుగులాగా ఉంది కదా..”

“కానీ అంత చిన్నగా వినిపిస్తుందంటే... మనిషి కాదేమో మరైతే ఏంటి ?? దెయ్యమా !!

“ఛఛ అయి ఉండదు అదైతే ఇలా ఎందుకు భయపెడుతుంది.. డైరెక్ట్ గా అరిచి గీపెట్టి భయపెట్టచ్చు కదా.”

“మురళి చెప్పిన దెయ్యమేదో ఉంది ఏంటది మిమిక్రి దెయ్యం.. హా.. జాకర్ దెయ్యం కదా అది ఇలాగే చిన్న పిల్లలని జంతువులని అనుకరించి అరుస్తుందని అన్నారు కదా.”

“ఇపుడొచ్చింది అదేనేమో.. బయట నుండి అరుస్తుందేమో నేను భయపడి దాన్ని చూశాక నన్ను పట్టేసుకుంటుందేమో !! ఇపుడెలా..”

“ఆ మనవన్నీ అనవసర భయాలు దెయ్యాలు లేవ్ భూతాల్ లేవ్.”

“ఒకవేళ ఇంట్లోనే ఎవరైనా..!!” సందేహం వచ్చినదే తడవు భయాలనన్నిటినీ పక్కకి తోసేసి ఒక్కుదుటున లేచెళ్ళి ఇంట్లో నిద్ర పోతున్న మిగతా కుటుంబ సభ్యులనందరిని చెక్ చేశాను. అందరూ ప్రశాంతంగా పడుకుని ఉన్నారు ఏ డిస్ట్రబెన్సూ లేకుండా. కుదుటపడిన హృదయంతో హాల్  లోకొచ్చి చుట్టూ చూశాను. కాషాయ వర్ణంలో బెడ్ లైట్ కాంతి హాలంతా పరుచుకుని ఉంది.

డైనింగ్ ఏరియాకి ఒక మూల గోడకి దగ్గరగా నాలుగడుగుల ఎత్తున్న సన్నని వెలుగు రేఖ అర ఇంచి వెడల్పు ఉంటుందేమో ఉన్నచోట ఉన్నట్లే అలలు అలలు గా కదులుతూ కనిపించింది. దాని చుట్టూ ఒక అరడుగు మేర ఒక అరా లాగా క్లౌడ్ లా పలచని వెలుతురు పరుచుకుని ఉంది. అందులో కూడా ఏవో అస్పష్టంగా కదులుతున్నట్లు అనిపించింది.

ఒక్కసారిగా ఒళ్ళు జలదరించింది... వెన్ను లోపల సరసర ఏదో పాకినట్లనిపించింది... పొద్దున్న చంపిన కాళ్ళ జెర్రి గుర్తొచ్చింది, రోజు మస్కిటో బాట్ తో పదుల సంఖ్యలో చంపే దోమలు గుర్తొచ్చాయ్. వాటికి కూడా ఆత్మలు ఉంటాయా వాటిల్లో ఒకటేనా ఇపుడు నా మీద పగ దీర్చుకోడానికి వచ్చింది. నాకాళ్ళు బలహీనమవడం తెలుస్తుంది పడిపోతానేమో అనిపించింది ఓ క్షణం. 

“అవునూ మల్లాది తన పుస్తకంలో ఆత్మల సూక్ష్మ శరీరం రెండంగుళాలు ఉండచ్చని రాశాడు కదా మరి ఇదేంటి ఇంచుమించు నాలుగడుగుల ఎత్తు ఉందీ”... 

“అంటే కొంపదీసి ఆత్మల కాలనీనా ? అందుకే అలా ఉన్నచోటే నిట్ట నిలువుగా అలలా కదులుతున్నాయా ఆత్మలన్నీ కలిసి ఒకదానితో ఒకటి కొట్టుకుని తిరుగుతూ అల్లరి చేస్తూ... నా భయాన్ని చూసి నవ్వుకుంటూ గెంతులేస్తూ ఉన్నాయా ??  అందుకేనా ఆ కదలికలు.. ” 

“అయ్యో రామా!! ఇపుడేం చేయాలి ?? హా.. రాముడు.. ఆంజనేయ దండకం చదివితే బెటరేమో కానీ రాదే.. పోనీ వచ్చిన హనుమాన్ చాలీసా చదువుదాం..”

“ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదాం..
లోకాభిరామం శ్రీరామమ్ భూయో భూయో నమామ్యహం.....”

ఓ కన్ను ఓరకంట తెరచి చూసి “హ్మ్ వాటి పొజిషన్ లో ఏమార్పూ వచ్చినట్లు లేదే... పోనీ లైటేసి చూద్దామా.. కానీ స్విచ్ బోర్డ్ అక్కడెక్కడో ఉంది కదా.. అక్కడికి వెళ్ళే లోపు దాడి చేస్తే...”

“హా ఐడియా.. దగ్గరలో ఫ్రిజ్ డోర్ ఉంది కదా ఒక్క అంగలో అందేస్తుంది దాన్ని తెరిస్తే లైటొస్తుంది.. అపుడేమవుతుందో చూద్దాం..”

చూపు ఆ వెలుగు రేఖమీదే ఉంచి రెప్పవేయకుండా అటే చూస్తూ ఫ్రిజ్ వేపు ఒకడుగు వేసి డోర్ పట్టుకుని చప్పుడు కాకుండా మెల్లగా లాగాను... డోర్ తెరుచుకునే కొద్దీ ఆ వెలుగు రేఖ పెద్దదవడం మొదలెట్టింది. నాకు ఒక్క క్షణం ఏం జరుగుతుందో అర్ధంకాలేదు. భయమేసి తలుపు మూసేశాను అలికిడికి అనుకుంటాను ఆత్మల కాలనీ మాయమైంది బెడ్ లైట్ వలన పరుచుకున్న పలచని కాంతి తప్ప అక్కడ ఏం లేదు.

“అవునూ ఫ్రిజ్ డోర్ ఇంత సులువుగా ఓపెన్ ఐపోయిందేంటి కాస్త బలం ఉపయోగించి లాగాల్సి వస్తుంది కదా” అని ఆలోచిస్తూ మళ్ళీ తలుపు కొంచెం తీశాను వెంటనే ఆత్మల కాలనీ మళ్ళీ ప్రత్యక్షమైంది.

అప్పటికి అర్ధమైంది అప్పటి వరకూ నన్ను భయపెట్టిన ఆత్మల కాలనీ మరేదోకాదు సరిగా మూస్కోని ఫ్రిజ్ తలుపు సందులోనుండి గోడమీద పడుతున్న ఫ్రిజ్ లైట్ మాత్రమే అని.

హమ్మయ్యా.. అని ఊపిరిపీల్చుకుని “ఎంత భయపెట్టింది రా” అనుకుంటూ కాసిని మంచినీళ్ళు తాగి తిరిగి బెడ్ రూంలోకి వచ్చాను. లాపీ స్లీప్ మోడ్ లోకి వెళ్ళడంతో చీకటి మరింత చిక్కబడింది. అప్పటి వరకూ మర్చిపోయిన మూలుగు మళ్ళీ వినిపించడం మొదలైంది.
ధైర్యాన్ని మింగేస్తూ భయమ్ బయట పడడం మొదలైంది.. పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది.

వేగంగా ఆలోచించడం మొదలెట్టాను..

“దెయ్యాలు అన్నీ ట్రాష్.. ఇప్పుడే హాల్లో చూశాను కదా ఇది కూడా అలాంటిదే అయి ఉంటుంది..”

“అమాయకుడా అదే నిజమైతే ఈపాటికే విషయం అర్ధమై ఉండేది కదా.. ఇది ఖచ్చితంగా ఏదో అదృశ్య శక్తి పనే..”

“అదృశ్య శక్తీ లేదు ఆవకాయ బద్దాలేదు లెట్ మీ ఫైండౌట్..”

నా ఫోకస్ అంతా దానిమీదే ఉండడం వలననేమో సీలింగ్ కి తిరుగుతున్న ఫాన్ చేసే బర బర గర గర చప్పుళ్ళని సైతం అధిగమిస్తూ స్పష్టంగా వినిపిస్తుంది.. కానీ అదేమిటో అర్ధం కావట్లేదు.. ఒక ఫిక్స్డ్ ఇంటర్వెల్ లో వినిపిస్తుందంటే ఏమై ఉంటుందో “పోనీ కిటికీ తెరచి సౌండ్ పెద్దదవుతుందేమో చూద్దామా అసలు లొకేషన్ ఐడెంటిఫై చేయచ్చు” అనిపించింది.

“కానీ ఒక వేళ అది కిటికీ బయట దాడి చేయడానికి సిద్దంగా ఉండి ఉంటే ??”

“ఊచలు అడ్డంగా ఉన్నాయ్ గా ఏమీ కాదులే తీసి చూడు” భయపడుతూనే చేత్తో మెల్లగా కిటికీ తలుపుని నెట్టాను.
కర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్... మని చప్పుడు చేస్తూ కిటికీ కొద్దిగా తెరుచుకుంది చల్లని గాలి ఒక అలలా మొహానికి కొట్టింది.

“అయిపోయింది ఆ వచ్చింది దెయ్యమే అయి ఉంటుంది అందుకే అంత చల్లగా తగిలింది.. ఇక రేపట్నుండి నీ పిచ్చి చేష్టలు బిగిన్.. న్యూస్ లో కూడా వచ్చేస్తావేమో..”

“నీ మొహం మండా.. బయట వాతావరణం చల్లగా ఉందిరా కావాలంటే చూడు ఇంకా చల్లగాలి వస్తూనే ఉంది. ముందు సౌండ్ ఏమైనా మారిందేమో గమనించు...”

“ఏం మారలేదు.. అంటే సమస్య ఎక్కడో ఇంట్లోనే అనమాట.. కిటికీ వేసేసి ఒక సారి ఫాన్ ఆపి చూద్దాం ఒక వేళ ఫాన్ నుండి వస్తుందేమో ఆ సౌండ్..”

ఫాన్ ఆపేశాక మరింత స్పష్టంగా.. పిక్స్డ్ ఇంటర్వెల్స్ లో పదే పదే మళ్ళీ వినిపిస్తుంది. ఎక్కడో నూతిలోంచి వస్తున్నట్లున్న సౌండ్.. రూం అంతా ప్రతిద్వనిస్తుంది కానీ ఎక్కడ మొదలవుతుందో అర్ధంకావడంలేదు.. 

ఏం చేయాలో అర్ధంకాక చుట్టూ చూస్తున్నాను.. డెకొరేటివ్ కాక్టస్ నైట్ లాంప్ లోనుండి బ్లూ, ఎల్లో, ఆరెంజ్ రంగుల్లో పలచని వెలుతురు రూంలోని గోడలపై ఒకదాని తర్వాత ఒకటిగా పరుచుకుంటూ వింత పాటర్న్స్ సృష్టిస్తున్నాయి.

ఏదో అర్ధమయినట్లు అనిపించింది. నైట్ లాంప్ హౌసింగ్ అంతా పకడ్బందీగా ఏమీ మూవింగ్ పార్ట్స్ లేకుండా ఉంది.. కాని.. దానిని పరీక్షగా చూస్తే లోపల ఒక చిన్న కలర్ డిస్క్ తిరుగుతూ కనిపించింది... ఈ వచ్చే సౌండ్ ఆ డిస్క్ దేనికో తగులుతుంటే రాపిడి వల్ల వస్తున్న సౌండా అని అనుమానం వచ్చింది. వెంటనే లాంప్ ఆపేసి చూశాను. సౌండ్ ఆగిపోయింది. ఒక నిముషం ఆగి లాంప్ మళ్ళీ వేశాను.. కొన్ని సెకన్ల తర్వాత అదే పాటర్న్ తో మళ్ళీ రిపీటెడ్ గా మ్.మ్.మ్మ్మ్మ్..మ్.మ్.మ్.మ్ అని సౌండ్ రావడం మొదలెట్టింది.

డెకొరేటివ్ పీస్ బాగుందని చాలారోజుల తర్వాత నిన్ననే ఆ లాంప్ ని అల్మారాలోనుండి తీసి ఉపయోగిస్తున్నాను అన్న విషయం గుర్తొచ్చింది. భయం మంచులా కరిగిపోయింది. పెదాలపై చిరునవ్వు మొలిచింది.

హోరి దీంతస్సదియ్యా భలే భయపెట్టాయి రెండూ అనుకుంటూ పడుకుని ఎందుకో కిటికీ బయటకి చూశాను. చీకటికి బాగా అలవాటు పడ్డ కళ్ళకి కిటికీ అవతల వీధిలైట్ల వెలుతురు పలచగా కనిపించింది...
చిరునవ్వు నవ్వుకుంటూ ప్రశాంతంగా నిద్రపోయాను. 

~*~*~*~
  
నోట్ :: మొన్న అమావాస్య రోజు పదినిముషాల వ్యవధిలో జరిగిన రెండు చిన్న సంఘటనలని ఆధారంగా చేస్కుని సరదాగా మిమ్మల్ని భయపెట్టాలని చేసిన నా మొదటి ప్రయత్నమిది. :-) 

ఈ సబ్జెక్ట్ పై అమితమైన ఆసక్తి ఉన్న ఒక ప్రియమిత్రునికి నివాళి ఈ టపా.

16 వ్యాఖ్యలు:

 1. Nice attempt Venu ji !కానీ నన్ను భయపెట్టలేకపోయారు :P
  మీరు ఎవరి కోసం రాసారో ఆ రీజన్ కూడా బావుంది !

  ప్రత్యుత్తరంతొలగించు
 2. హ హ.. బావుంది. కానీ, నాక్కూడా భయం ఏమీ కలగలేదు. ఎందుకంటే నేను దీన్ని చదివింది పగలే కదా.. రాత్రయ్యే వరకూ నేను పక్కా నాస్తికుడ్ని, దేవుడ్నీ దెయ్యాలనూ అస్సలు నమ్మను.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. ఆఫీస్ లో చదివాను...ఎమో భయం కలగలేదు ;)
  రూం లో చదివి ట్రై చెయ్యాలి :)

  ప్రత్యుత్తరంతొలగించు
 4. నాక్కూడా అర్ధరాత్రి వేళ ఇలాంటి భయాలు( సరిగా మూస్కోని ఫ్రిజ్ తలుపు సందులోనుండి గోడమీద పడుతున్న ఫ్రిజ్ లైట్, లాంప్ నుంచి వచ్చిన సౌండ్ ) ఎప్పుడో అప్పుడు అనుభవమే వేణు గారు. తరువాత సిల్లీ గా అనిపించినా, ఆ నిమిషంలో మాత్రం భలే భయ్యం వేస్తుందండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. సస్పెన్స్ థ్రిల్లర్. కాలనీ అయిడిలా మాత్రం భలే ఉందండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. Nice attempt Venu ji ! కానీ నన్ను భయపెట్టలేకపోయారు :D
  ఎందుకంటే బేసిక్ గా నేను చాలా ధైర్యవంతున్ని, పెద్దోన్ని కుడా :P

  ప్రత్యుత్తరంతొలగించు
 7. కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్....

  ముందు గా బింగో....

  నిన్న రాత్రి... ఎప్పటి లానే లైట్లాపేసి, కిటికీ తీసి పడుకున్నాం. ఓ గంట తర్వాత ఎందుకో మెలకువ వచ్చి చూసేసరికి మా గోడ మీద ఎవరిదో మనిషి ఆకారం నిలబడి చేతులు ఊపుతూ ఉంది. తుళ్ళి పడ్డాం.. మా గది లోకి ఈ ఆకారం ఎలా వచ్చిందో తెలియక. ఎవరిదో మనిషి నీడ. కిటికీ లోంచి చూస్తే ఎవ్వరూ లేరు. అసలు ఎలా వస్తుందా అని అలా... చూసేసరికి.. మా బిల్డింగ్ కి రెండు ఇళ్ళ పక్కన.. ఒకతను సిగరెట్ కాలుస్తున్నాడు. వీధి చివర ఎక్కడోఓఓఓఓఓఓఓఓఓఓ ఉన్న స్ట్రీట్ లైట్ కి అడ్డంగా ఉండటం వల్ల... అతని నీడ మా కింటికీ ద్వారా గోడ మీద నీడ పడింది...

  ఈ ఎక్స్పీరియన్స్ వల్ల... నేను మీ పోస్ట్ తో కనెక్ట్ అయ్యాను. మీరు పోస్ట్ కి ముందు ఇచ్చిన బిల్డప్ వల్ల్ అనుకుంటా జనాలు ఎవ్వరూ భయపడ లేదు.. ;) ;)

  ప్రత్యుత్తరంతొలగించు
 8. I hate దెయ్యాల్లేని దెయ్యం కధలు.
  వేణూ, నిజమైన దెయ్యాల కధలు మరోసారి మొదలెడదామా?

  ప్రత్యుత్తరంతొలగించు
 9. శ్రావ్య, శ్రీనివాస్, శ్రీకాంత్, బంతి, జలతారు వెన్నెల గారు, జ్యోతిర్మయి గారు, ఫోటాన్, రాజ్, మురళి వ్యాఖ్యానించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.

  హ్మ్ మొత్తానికి భయపెట్టలేకపోయాననమాట శ్రావ్యా... రాత్రిపూట ఫ్రిజ్ వాటర్ తాగాల్సొచ్చినపుడు కాలనీ గుర్తొస్తుందిలెండి :-)

  శ్రీనివాస్ నా ధన్యవాదాలను ఊహించి ముందస్తు ధన్యవాదాలు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు :-)

  హహహ శ్రీకాంత్ మీ పద్దతి బాగుంది :-)

  అలాగే బంతి ట్రై చేసి చెప్పండి.

  జలతారు వెన్నెల గారు, నిజమేనండీ మరుక్షణంలో నవ్వుకున్నా ఆ క్షణంలో మాత్రం భలే భయం వేస్తుంది.

  జ్యోతిర్మయి గారు కాలనీ థాట్ కి నాకే నవ్వొచ్చిందండీ తర్వాత :-)

  ఫోటాన్ అవున్లే తులగ పిలగాళ్ళని దెయ్యాలేం జేయవంట :-)

  హహహహ రాజ్ బింగో :-) ఐతే భీభత్సంగా కనెక్ట్ అయి ఉంటావ్ గా మొత్తానికి ధైర్యంగా బాగానే ఇన్వెస్టిగేట్ చేసి విషయం కనిపెట్టారు :-) నిజమే రాజ్ ఇపుడు ఆ హెచ్చరిక ప్లస్ లాస్ట్ సీన్ తీసేశాను... అదిపెట్టింది లాస్ట్ సీన్ కోసమే.. సినిమా పిచ్చి కథలోకి వస్తే అంతే ఉంటుంది మరి :-)))

  హహహ మురళీ అలాగే దెయ్యాలున్న దెయ్యంకథలు కూడా మొదలెడదాం.. నాకిలాంటి దెయ్యంలేని కథలు కూడా ఇష్టమే :-)

  ప్రత్యుత్తరంతొలగించు
 10. హహ్హహ్హా.. బాగు బాగు.. అయితే ఇంకెందుకు ఆలస్యం? దెయ్యాలున్న దెయ్యాల కథలు కూడా మొదలెట్టండి మరి త్వరగా :))

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. థాంక్స్ అప్పూ :-) అమ్మో దెయ్యాలున్న దెయ్యంకథలు రాయాలంటే నాకు బోలెడంత భయం :-))

   తొలగించు
 11. ప్రతి మనిషి లో ఉండే ఈ చిన్ని చిన్ని భయాలు గురించి చాలా బాగా చెప్పారు శ్రీకాంత్ గారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 12. నాకు దెయ్యాల కధలు చాలా సరదా, కానీ మన ఊహాలే దెయ్యాలని నా భావన,ఏదిఏమైనప్పటికి మీ కథా విధానం బాగుంది,ధన్యవాదాలు మీకు...

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. థాంక్స్ ఫర్ ద కామెంట్ అజ్ఞాత గారు... దెయ్యాలనే టాపిక్ పై ఒక అంచనాకి రావడం నాకు ఈ జన్మకి కుదరదేమోనని అనిపిస్తుంటుందండీ..

   తొలగించు

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.