శుక్రవారం, ఆగస్టు 14, 2020

గుంజన్ సక్సేనా...

"కలలు కనండి సాకారం చేసుకోండి" అనే అబ్దుల్ కలాం గారి కొటేషన్ కు నిలువెత్తు రూపం ఫ్లైట్ లెఫ్ట్ నెంట్ గుంజన్ సక్సేనా. భారతవాయుసేన తరఫున యుద్దంలో పాల్గొన్న తొలి మహిళా పైలట్ తను. 1999 లో జరిగిన కార్గిల్ యుద్దంలో తన చీతా హెలికాప్టర్ సాయంతో శత్రు స్థావరాలను గుర్తించడం, సైనికులకు ఆహారం, ఆయుధాలను సరఫరా చేయడమే కాక ఎందరో క్షతగాత్రులను యుద్దభూమినుండి సురక్షిత ప్రాంతాలకు తరలించి రక్షించారు. తన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం శౌర్య చక్ర బిరుదుతో సత్కరించింది, ప్రజలు మరియూ డిపార్ట్మెంట్ కార్గిల్ గర్ల్ గా పిలుచుకునే ఆ గుంజన్ కథే ఇటీవల నెట్ఫ్లిక్స్ లో విడుదలైన ఈ "గుంజన్ సక్సేనా, ది కార్గిల్ గర్ల్" సినిమా.

1984 లో విమానంలో విండో సీట్ లో కూర్చున్న అన్న తనని మేఘాలు చూడనివ్వకుండా బ్లైండ్స్ వేసేస్తున్నాడని అలిగిన పదేళ్ళ గుంజన్ ని చూసిన ఎయిర్ హోస్టెస్ ముచ్చట పడి కాక్ పిట్ లోకి తీస్కెళుతుంది. అక్కడనుండి కనిపించే అందమైన దృశ్యాన్ని చూసిన గుంజన్ ఆ క్షణమే పైలట్ కావాలని నిర్ణయించుకుంటుంది.

ఆ నిర్ణయాన్ని అన్నతో చెప్తే తను "అమ్మాయిలు పైలట్ అవలేరు ఎయిర్ హోస్టెస్ లు మాత్రమే అవగలరు" అని ఆటపట్టిస్తుంటే చూసిన తండ్రి సక్సేనా(పంకజ్ త్రిపాఠి) "ఎవరు చెప్పారు కాలేరని, అసలు తనని ఎవరు నడుపుతున్నారన్నది విమానమే పట్టించుకోనపుడు నీకేంటి నొప్పి" అని అతన్ని మందలించి, "విమానం నడిపేది ఆడైనా మగైనా పైలట్ అనే అంటారు నువ్వు తప్పకుండా పైలట్ అవుదువుగాని ముందు చదువు మీద శ్రద్ధ పెట్టు" అని గుంజన్ ని ప్రోత్సహిస్తాడు. 

రియల్ అండ్ రీల్ గుంజన్ సక్సేనా
అలా మొదలైన తన కలని గుంజన్ ఎలా సాకారం చేస్కుంది, అప్పటివరకూ పూర్తిగా మగవాళ్ళే ఆధిపత్యం వహిస్తున్న ఆ రంగంలో మొదటి సారి కాలు మోపి మహిళల కోసం మార్గం ఎలా సుగమం చేసింది. ఆ ప్రోసెస్ లో ఏఏ అడ్డంకులు ఎదుర్కొంది ఎలాంటి సపోర్ట్ అందుకుంది. రక్షణ/సేఫ్టీ పేరుతో అడుగడుగుకు వెనక్కి లాగుతున్న తన అన్నని ఎలా ఎదుర్కొంది. ఈ విజయం సాధించడానికి కొండంత అండగా తన తండ్రి తనతో ఎలా నిలబడ్డాడు అనేది తెలుసుకోవాలంటే గుంజన్ సక్సేనా సినిమా చూడాలి. 

నేను హిందీ సినిమాలు తక్కువే చూస్తాను. పెద్ద హీరోలు పెద్ద అంచనాలు ఉండి హిట్ అయిన సినిమాలు క్రిటిక్స్ ఆదరణ పొందిన సినిమాలు మాత్రమే చూస్తుంటాను. అక్కడి నటీనటులు కూడా నాకు పెద్దగా తెలియరు. ఐతే ఈ కథ గురించి విన్నపుడు చూడాల్సిన సినిమా అనిపించింది. అలాగే శ్రీదేవి కూతురు "జాన్వి" నటించిందన్న కారణం కూడా ఒకటి తోడైంది. ఐతే తన మొదటి సినిమా నేను చూడలేదు. ఈ సినిమానే నేను చూసిన తన మొదటి సినిమా. నాకైతే తన నటన నచ్చేసింది. 

కెరీర్ తొలిదశలోనే ఇలాంటి పాత్రలు దక్కడం తన అదృష్టం అయితే ధైర్యంగా ఒప్పుకుని మెప్పించడం మాత్రం జాన్వి గొప్పదనమే. తనని అప్పుడే శ్రీదేవితో పోల్చి చూడలేం కానీ పాతికేళ్ళ పైలట్ గా ముగ్ధత్వం అమాయకత్వం బేలతనం ఎలా కళ్ళతోనే ప్రదర్శించిందో తన మొండితనం, పట్టుదల, కార్యదక్షతలను అంతే చక్కగా ప్రదర్శించింది. తను పడిన ప్రతి కష్టాన్ని చూసి ఎంత చలించి పోతామో అందుకున్న ప్రతి విజాయాన్ని చూసి అంతే  ఆనందపడతాం. ఆ అనుభూతిని మనకి అందివ్వడంలో జాన్వీ, పంకజ్ త్రిపాఠిల నటన ఆయా సన్నివేశాలని రాసుకున్న దర్శకుని ప్రతిభ ముఖ్యంగా చెప్పుకోవలసినవి. 

పంకజ్ త్రిపాఠి పాత్ర మనకి గుర్తుండి పోతుంది. తండ్రిగా తను ప్రోత్సహించే పద్దతి ఎక్కడా డ్రమటైజ్ చేయకుండా సహజంగా చాలా బావుంది. ఆ ప్రాసెస్ లో తను చెప్పే మాటలు కూడా చాలా బావున్నాయ్ కోట్స్ గా మిగిలిపోతాయ్. ఆ తండ్రీ కూతుళ్ళ బంధం చూసినపుడు ఖచ్చితంగా మన ఇంటి అమ్మాయిలను మనం ఎంత వరకూ ఎలా ప్రోత్సహిస్తున్నాం అనే విషయం ప్రశ్నించుకుంటాం. అలాగే ప్రతి అమ్మాయి అలాంటి నాన్న కావాలని కోరుకుంటుంది. ఆల్రెడీ ఉండి ఉంటే ధీమాగా మరోసారి హత్తుకుని గువ్వపిట్టలా తన చేతులలో ఒదిగిపోతుంది.      

ఇతర నటీనటుల మరియూ టెక్నీషియన్ల పేర్లు నాకు తెలియవు కనుక చెప్పలేకపోతున్నాను. ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి నటీనటులంతా తమ తమ పాత్రలలో మెప్పించారు. సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. అలాగె నేపధ్యసంగీతం అవసరమైన చోట్ల సన్నివేశాలని ఎలివేట్ చేస్తూ ఎమోషన్స్ కి కనెక్ట్ చేయడానికి తోడ్పడింది. వార్ సన్నివేశాలు అవసరం మేరకు పరిమితంగానే తీసినా, ఉన్నంతవరకూ బాగానే ఆకట్టుకుంటాయి. దర్శకుడు శరణ్ శర్మకు ఇది తొలి చిత్రం అంటే నమ్మలేం.  

ఐతే తొలి మహిళా పైలెట్ అనే పాయింట్ ని పండించడానికి సినిమాటిక్ లిబర్టీస్ తీస్కుని కొన్ని సన్నివేశాలని మరీ ఎక్కువ డ్రమటైజ్ చేశారేమో అనిపిస్తుంది. డిసిప్లిన్ కి మారుపేరైన ఆర్మీ ఆఫీసర్స్ అలా ప్రవర్తిస్తారా ? గుంజన్ అన్నయ్యతో సహా అందర్నీ కావాలనే అలా విలన్స్ ని చేస్తున్నారా అనే చిన్న సందేహం మనకి ఏ మూలో వస్తుంది. కాకపోతె మనిషి సహజంగానే మార్పుకు వ్యతిరేకత చూపిస్తాడు. ఒక రిథమ్ లో సాగుతున్న జీవితంలో మార్పును అంత సులువుగా స్వాగతించలేడు. 

ముఫ్ఫై ఏళ్ళ క్రితం కేవలం మగవాళ్ళు మాత్రమే ఉన్న తమ ఎయిర్ బేస్ లో అసలు ఆడవాళ్ళకి ప్రత్యేకంగా వాష్ రూమ్ కట్టించాలన్న స్పృహ కూడా లేని పరిస్థితులలో ఓ మహిళా పైలట్ ను తమతో చేర్చుకోవాల్సి రావడం. తర తరాలుగా పాతుకు పోయిన మేల్ డామినేటెడ్ సొసైటీ నియమాలు, పద్దతులు వారినలా ప్రవర్తించేలా చేశాయి అని మనకు మనమే సర్ది చెప్పుకుంటాము. అన్నయ్య విషయంలో తనకి తానుగా తీస్కున్న పెద్దరికం సేఫ్టీ కన్సర్న్ ఎలాగూ ఉంది.

ఏదేమైనా గుంజన్ సక్సేనా ఒక డిఫరెంట్ మూవీ, అనవసరమైన ప్రేమ సన్నివేశాలు డ్యుయెట్ లు కామెడీ లాంటివి ఇరికించకుండా నిజాయితీగా కథకు మాత్రమే పరిమితమై చెప్పాలనుకున్న విషయాన్ని ఎక్కడా ఫోకస్ తప్పకుండా చెప్తూ తీసిన ఒక మంచి సినిమా. యువతకు స్ఫూర్తినిచ్చే ఆదర్శవంతమైన సినిమా. జాన్వి సద్వినియోగ పరచుకున్న ఒక మంచి అవకాశం. మీరూ మిస్సవకండి వీలుంటే చూడండి. నెట్ఫ్లిక్స్ లో హిందీ, ఇంగ్లీష్, తెలుగు,తమిళ భాషలలో ఇక్కడ చూడవచ్చు. ఈ సినిమా ట్రైలర్ ఇక్కడ చూడవచ్చు. 

4 కామెంట్‌లు:

  1. నిన్నే మూవీ చూశానండీ..సాధారణం గా బయోపిక్స్ నటీనటుల అద్భుతమైన నటన వల్ల రక్తి కడతాయి..ఇక్కడ అటువంటి పాజిబిలిటీ పూర్తిగా శూన్యమైనా మూవీ ఫరవాలేదనిపించడం కేవలం ఫాదర్ కేరక్టర్ వల్లనుకుంటా..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్ శాంతి గారు. అవునండీ ఫాదర్ కారెక్టర్ చాలా బావుంది.

      తొలగించండి
  2. చిత్రం బాగుందండీ. జాహ్నవి కపూర్ నటన నాకూ నచ్చింది, చక్కగా నటించింది. సరే, తండ్రి పాత్రలో పంకజ్ త్రిపాఠి అలవోకగా చేశాడు. ఈ తరం వారు స్ఫూర్తి పొందాలి ఇటువంటి సినిమాలు చూసి.

    బయోగ్రఫీ చిత్రాలంటే నాకు ఒకింత అభిమానం. ఎందుకంటే ఒక ప్రముఖ వ్యక్తి అన్నేళ్ళ జీవితాన్ని ఓ రెండు గంటల సినిమాలో ప్రెజెంట్ చెయ్యడమంటే అంత తేలికైన పని కాదు. ఎలా నిర్మించినా ఏదో ఒక విమర్శ వస్తూనే ఉంటుంది. అయినా అటువంటి చిత్రాలు తీసే వారి ప్రయత్నాన్ని మెచ్చుకోవాలి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్ నరసింహారావు గారు. నిజమేనండీ బయోపిక్స్ ప్రయత్నాన్ని మెచ్చుకోవాలి.

      తొలగించండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.