శుక్రవారం, సెప్టెంబర్ 04, 2020

మణియారయిలె అశోకన్ & c u soon...


ఈ 2020 లో కాస్తో కూస్తో లాభ పడిన వాటిలో మలయాళ సినీ పరిశ్రమ ఒకటి అని చెప్పచ్చేమో. తెలుగు సినిమాలు పూర్తిగా ఆగిపోవడంతో ఆన్లైన్ అండ్ ఓటీటీ తెలుగు ప్రేక్షకులు పూర్తిగా మలయాళ సినిమాల బాట పట్టారు. దానికి తగ్గట్లే హ్యూమన్ ఎమోషన్స్ కి విలువిస్తూ కథకు పెద్ద పీట వేసి తీస్తున్న ఆ సినిమాలు కూడా బావుంటున్నాయి. ఓటీటీలలో అందుబాటులో ఉంటున్న సబ్ టైటిల్స్ భాష తెలియకపోయినా సులువుగా చూసేయడానికి సహాయపడుతున్నాయ్.    

ఈ మలయాళ సినిమాల గురించి సోషల్ మీడియా అంతా కోడై కూస్తున్నా కూడా నా బాషాభిమానం అడపాదడపా ఒకటి రెండు తప్ప నన్ను ఆ సినిమాలని ఎక్కువ చూడనివ్వలేదు. కానీ కొన్ని సినిమాల్లోని కంటెంట్ చివరకు నన్నూ ఆ సినిమాలకి ఎడిక్ట్ చేసేసింది. అలా ఈ మధ్య చూసిన రెండు మంచి సినిమాల గురించే ఇపుడు మీకు చెప్పబోతున్నది. 

ఈ రెండు సినిమాలు రెండూ ఉత్తర దక్షిణ ధృవాలు. "మణియారయిలె ఆశోకన్" పూర్తిగా ఒక చిన్న ఊరిలో పచ్చని వాతావరణంలో అందమైన సినిమాటోగ్రఫీతో స్వచ్చమైన మనుషుల మధ్య భావోద్వేగాలతో చిత్రీకరించుకుని అమ్మ ఒడిని గుర్తు చేస్తే. "c u soon" దుబాయ్ నేపథ్యంలో పూర్తి టెక్నాలజీ అండ్ ఇంటర్నెట్ బేస్ చేసుకుని కొందరు వ్యక్తుల ఆన్లైన్ జీవితాలని కళ్ళకి కడుతూ రహస్య ప్రేయసిని తలపిస్తుంది.

మణియారయిలె అశోకన్ :
ప్రకృతి పచ్చదనంతో వాతావరణంలోనే ప్రేమ నిండి ఉన్న ఒక చిన్న ఊరిలో గవర్నమెంట్ ఆఫీస్ లో క్లర్క్ గా పని చేస్తుంటాడు అశోకన్. తన ఈడు వారందరికీ పెళ్ళిళ్ళైపోతుంటాయ్ కానీ తన టర్న్ మాత్రం ఎంతకీ రాదు. ఒకటి రెండు అరేంజ్డ్ మారేజెస్ కోసం ప్రయత్నించినా బెడిసి కొడుతుంటాయి. ఇలాంటి టైమ్ లో అతికష్టం మీద ఒక పెళ్ళి సంబంధం కుదురుతుంది. 

పెళ్ళైన మొదటి రాత్రే పెళ్ళి కూతురు "మీకిది రెండో పెళ్ళనీ ఆల్రెడీ ఇద్దరు పిల్లలున్నారనీ విన్నాను నిజమేనా" అని అడుగుతుంది. ఆ ప్రశ్నకి జవాబే ఈ సినిమా, తన పెళ్ళికి ముందు అశోకన్ జీవితంలో ఏం జరిగింది? ఆ పవాదు నిజమేనా? ఇందులో తన మిత్రుడు అర్జున్(దుల్కర్) పాత్రేంటి అనేది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలి. 

తెలుగు సినిమాల్లో కామెడీగా ఉపయోగించుకున్న ఒక చిన్న పాయింట్ పై చాలా సెన్సిబుల్ గా హ్యూమన్ ఎమోషన్స్ కు విలువ ఇస్తూ ప్లజంట్ స్క్రీన్ ప్లేతో చిత్రీకరించిన సినిమా ఇది. ఇదో పాత్ బ్రేకింగ్ సినిమా అని చెప్పలేం కానీ ఓ మంచి ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మానసిక సమస్య గురించి వారి పాయింటాఫ్ వ్యూలో చూపించిన సినిమా అనిపించింది.

సినిమా పూర్తయ్యాక తప్పకుండా చిన్న చిరునవ్వును పూయిస్తుంది. టెక్నికల్ గా సినిమాటోగ్రఫీ చాలా బావుంది. అశోకన్ గా చేసిన జాకబ్ గ్రెగరీ గుర్తుండి పోతాడు, నిజానికి సినిమా పూర్తయ్యేసరికి అశోకన్ అభిమానిగా మారిపోడానికి కారణం ఆ పాత్ర పోషించిన గ్రెగరీనే. అలాగె డుల్కర్ రోల్ తన గెటప్ బావుంది తను ఉన్న రెండు కీలకమైన సీన్స్ చాలా బావున్నాయి. గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చిన దుల్కర్, అనుసితార, నజీరియా, అనుపమ పరమేశ్వరన్ అదనపు ఆకర్షణగా నిలిచారు.

కథా కథనాలలో వేగం, కమర్షియల్ ఎలిమెంట్స్ లాంటి వాటి గురించి పట్టించుకోకుండా ప్రశాంతమైన అలలా హాయిగా సాగిపోయే సినిమాలు నచ్చేవారికి ఈ సినిమా కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో ఇక్కడ చూడవచ్చు. ప్రోమో యూట్యూబ్ లో ఇక్కడ చూడవచ్చు. 

~*~*~*~*~*~*~*~*~*~*~*~

c u soon :
అమెజాన్ ప్రైమ్ లో ఉన్న ఈ సినిమా ఓ మంచి థ్రిల్లర్. అందుకే కథ గురించి నేనేం చెప్పదలచుకోలేదు. వీలైతే మీరూ కథ తెలుసుకోకుండా సినిమా చూడండి. కథగా చూస్తే ఇది ఒక చిన్న పాయింటే కానీ ఈ సినిమా చిత్రీకరించిన విధానం దానికి రాసుకున్న స్క్రీన్ ప్లే మాత్రం  అద్భుతం. 

టేకింగ్ లో హాలిఉడ్ సినిమా సెర్చింగ్ ని పోలిన ఈ సినిమా ఖచ్చితంగా ఇండియన్ సినిమాకి ఓ వైవిధ్యమైన ప్రయత్నం. సోషల్ డిస్టెన్సింగ్ ని సోషల్ నెట్వర్కింగ్ ని భలే ఉపయోగించుకుని తీశారు, సినిమా మొత్తం ఐఫోన్ పై చిత్రీకరించారట. కేవలం ఒక కంప్యూటర్ స్క్రీన్ చాట్ విండోస్ వీడియో కాల్స్ మాత్రమే చూపిస్తూ దదాపు గంటా నలభై నిముషాల పాటు కూర్చోపెట్టడం మామూలు విషయం కాదు. 

ఇంటర్నెట్ లైఫ్, ఛాటింగ్, వీడియో కాలింగ్ యాప్స్, వీడియో కాల్స్ లాంటి వర్చువల్ ప్రపంచంతో బొత్తిగా పరిచయం లేని వారికి ఈ సినిమా అర్థంకాకపోవచ్చు కానీ వాటితో పరిచయం ఉన్నవారికి మాత్రం ఈ సినిమాని దర్శకుడు ప్లాన్ చేసుకున్న విధానం కొన్ని సీన్స్ చూపించిన పద్దతి వాటికి ఆ ఆన్లైన్ టూల్స్ తోనే వాడిన చిన్న చిన్న ట్రిక్స్ అన్నీ కూడా చాలా ఆకట్టుకుంటాయి. 

ఈ సినిమా దర్శకుడి ఆలోచనని ఆచరణలో పెట్టడంలో నటీ నటుల నటన చాలా ముఖ్యమైంది. ఎందుకంటే చాలా భాగం క్లోజప్స్ అవడంతో వాళ్ళ ఎక్స్ప్రేషన్సే ఎక్కువ కనిపిస్తుంటాయ్. వాళ్ళలో ఏ ఒక్కరు ఏ మాత్రం ఫెయిల్ అయినా సినిమా మీద ఆసక్తి పోతుంది. ఫహాద్ ఫాజిల్ గురించి తెలిసినదే అలాగే కపెల్లా లో లీడ్ రోల్ పోషించిన రోషన్ మాథ్యూ కూడా బాగా చేశాడు. అలాగే ముఖ్యమైన స్త్రీపాత్ర పోషించిన దర్శనా రాజేందర్ కూడా ఆకట్టుకుంటుంది. 

ఈ సినిమాలో చెప్పుకోవలసిన మరో ముఖ్యమైన విషయం సౌండ్ డిజైన్, అది చాలా బావుంది. ఆన్లైన్ లైఫ్ గురించి తెలిసిన వాళ్ళకి ఈ సౌండ్ డిజైన్ పై పెట్టిన శ్రద్ధ ప్రత్యేకంగా తెలుస్తుంది. వైవిధ్యమైన సినిమాలు ఇష్టపడే ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా c u soon. ఆ టెక్నిక్ కోసమైనా చూసి తీరవలసిందే. మొదలయ్యాక కాసేపు కేవలం ఓ కంప్యూటర్ తెర మీద జరుగుతున్నవి చూడ్డం కాస్త అసహనానికి గురి చేయవచ్చు కానీ ఒక సారి కథలో లీనమయ్యాక అలవాటు పడిపోతాం. ఈ సినిమా ప్రోమో ఇక్కడ చూడండి. మీకు ఆసక్తి కలిగితే సినిమా అమెజాన్ ప్రైమ్ లో ఇక్కడ చూడండి ఖచ్చితంగా నచ్చుతుంది. 
 

6 కామెంట్‌లు:

  1. నిజమేనండీ..డెఫ్నెట్ గా వాస్తవికతకూ..మనసుకీ దగ్గిరగా అనిపిస్తాయి మాలీవుడ్ మూవీస్..

    రిప్లయితొలగించండి
  2. "మణిమారయిలే.." చూసాను.. మీరన్నట్టు ప్రకృతి పచ్చదనంలోనే ప్రేమ నిండి ఉన్న చిత్రం.

    మన తెలుగు చిత్రాల్లో చూపించే "పొల్లాచ్చి" ఒక్కటే కాకుండా, కేరళలో మిగతా గ్రామాలుకూడా అంతే అందంగా ఉంటాయి అనిపిస్తుంది (నిజమేమో కూడా!) పల్లెటూరి నేపధ్యంలో ఉండే మళయాల చిత్రాలు చూస్తుంటే..!!

    ఇకపోతే, "సీ యూ సూన్" చిత్రం నాతో "సీ యూ సూన్" అంది కాని ఎంత త్వరగానో ఇంకా చెప్పలేదు.. మీరు భేషన్నారు కాబట్టి, ఆ త్వరగా, ఇంకాస్త త్వరగా రావాలని ఆశిస్తున్నా..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అవునండీ కేరళని గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు కదా పచ్చదనానికి కేరళ అంతా లోటుండదనుకుంటాను.
      సీ యూ సూన్ టేకింగ్ ఒక్కటే మోర్ స్పెషల్ అండీ మిగతా కథ మామూలే చెప్పిన విదానానికే నాకు బాగా నచ్చింది. అందులోనూ ఆన్లైన్ ప్రపంచంతో కూడా బాగా పరిచయమున్న మనిషిని కావడంతో ఫెల్ట్ హోమ్ :-) థాంక్స్ ఫర్ యువర్ కామెంట్ రవి కిరణ్ గారూ.

      తొలగించండి


  3. సీ యూ సూన్ చిత్రమ్మును
    ఖాయమ్ముగ చూడదగును కంద జిలేబీ
    ప్రాయంపు కుర్ర కారుల
    హేయంపుబతుకుల తీరు హేల కనబడు‌న్


    జిలేబి

    రిప్లయితొలగించండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.