శుక్రవారం, డిసెంబర్ 31, 2010

హాస్టల్ - 7 (న్యూ ఇయర్)

ఈ టపానూ ఇంకా కొత్త సంవత్సరం పై బ్లాగరులు రాసిన మరికొన్ని చక్కని టపాలను సుజన మధుర గారి e-బుక్ లో ఇక్కడ చదవండి. సర్వర్ లో డౌన్లోడ్ అవకపోతే గూగుల్ డాక్స్ లో ఇక్కడ నుండి దింపుకోండి.

మిగతా పండగలు చేసినా చేయకపోయినా ఆగస్ట్ 15 కాక మా కాలేజ్ లో ముఖ్యంగా చేసేవి మూడు పండగలు. ఒకటి దీపావళి -  పెద్ద సంఖ్యలో బాణాసంచా తెప్పించి ఇళ్ళకు వెళ్లకుండా హాస్టల్లోనే ఉండిపోయిన పిల్లలతో కాల్పించేవారు. రెండోది కాలేజ్ యానివర్సరీ - ఒక చీఫ్ గెస్ట్ ను పిలిపించి పెద్ద సభ జరిపి, సాంస్కృతిక కార్యక్రమాలు, రెండువారాలుగా జరిగిన వివిధ పోటీలలో విజేతలకు బహుమతిప్రదానం, మెస్ లో ఫీస్ట్ ఏర్పాటులతో ఘనంగా జరిగేది. ఇక మూడోది న్యూయియర్ - డిశంబర్ 31 న మధ్యాహ్నం నుండి కాలేజ్ లో మా తరగతి గదులను బెలూన్లు, రంగుకాగితాలు, తగరపు కాగితాలు, మెలికల కాగితాలతో శక్తిమేరకు ముస్తాబు చేసే వాళ్లం. ఆరోజు సాయంత్రం ఫీస్ట్ ఇక రాత్రి డాబా పైన క్లాస్ రూంస్ ముందున్న ఖాళీ స్థలంలో అందరినీ సమావేశపరచి మా డైరెక్టర్ కేక్ కట్ చేసేవారు. రోజూ ఒకటే దినచర్యతో చప్పగా గడిచే హాస్టల్ జివితంలో ఈ ప్రత్యేకమైన రోజులు తెచ్చే సందడి అంతా ఇంతా కాదు. ఆ కార్యక్రమాలు ఎలా ఉన్నా పుస్తకాలు ముట్టుకునే పనిలేదన్న సంతోషం ఎంత అరిచి అల్లరి చేసినా ఎవరూ ఏమీ అనరు అనే ధైర్యంతో నిజంగా పండగ వాతావరణం ప్రతి విద్యార్ది మొహంలో ఆనందంగా ప్రతిఫలించేది.

కాలేజ్ డెకరేషన్ ప్లాన్స్ ఒక వారం ముందునుండే ప్రారంభమౌతాయి కావాల్సిన సామాగ్రికోసం స్పెషల్ ఔటింగ్ పర్మిషన్ తెచ్చుకోవడం ఎలా చెయ్యాలో అందరం కూర్చుని చర్చించుకోవడం మంచి సరదాగా ఉండేది. మాలో కొందరం ఈ ప్లానింగ్ లో ఉంటే కాస్త రౌడీ బ్యాచ్ సమావేశమై మరో ప్లానింగ్ లో ఉండేది. ఏమిటయ్యా అది అంటే కొంతమంది వార్డెన్స్ స్టూడెంట్స్ తో ఫ్రెండ్లీగా ఉండేవారు కానీ ఒకళ్ళిద్దరు మాత్రం వాళ్ళు పైనుండి దిగివచ్చిన దేవుళ్ళలా మేమంతా వాళ్ళని పీడించుకు తినడానికి పుట్టిన రాక్షసుల్లా బిల్డప్ ఇచ్చేవాళ్ళు. అలాంటివాళ్ళ లిస్ట్ ఒకటి తయారు చేసి వాళ్ళలో ఎక్కువ తప్పులు చేసిన ఒకవార్డెన్ ని ఎన్నుకునేవాళ్ళు (ఠాగూర్ సినిమా లోని ACF రేంజ్ అనమాట). ఇక 31 రాత్రి డిన్నర్ అయ్యి A.O గారు ఇంటికి వెళ్ళాక కారిడార్ లోనో(పైన ఫోటోలో చూపించినట్లే ఉండేది మా కారిడార్ అటు ఇటు రూంస్ తో) లేదంటే బాత్రూంస్ దగ్గరో ఆ వార్డెన్ ని పట్టుకుని లైట్లు ఆపేసి దుప్పటి ముసుగేసి కసితీరా కొట్టే వాళ్ళు. సో వార్డెన్ ని బయటకి ఎవరు తీసుకు రావాలి, లైట్స్ దగ్గర కంట్రోల్ ఎవరిది, దుప్పటి ఎవరెవరు పట్టుకోవాలి, ఎవరెవరు కొట్టాలి ఇత్యాదులన్నీ ప్లానింగ్ లో భాగమనమాట.

ఇక శ్రీనివాసరావుగారని డైనింగ్ హాల్ సూపర్ వైజర్ ఒకాయన ఉండేవారు తను ఫుడ్ విషయంలో క్వాలిటీ సంగతి పట్టించుకున్నా పట్టించుకోకపోయినా పెరుగు కప్పుల దగ్గర మాత్రం నిక్కచ్చిగా ఉండేవారు. చిన్న చిన్న కప్పుల్లో డైరెక్ట్ గా తోడుపెట్టేవారు పెరుగు, అది ఎవరికీ సరిపోయేది కాదు కనుక ఏమాత్రం అవకాశమున్నా మేం ఏదో ఒక మాయ చేసి అదనంగా సంపాదించడానికి ప్రయత్నించేవాళ్ళం ఒకవేళ జ్వరం లాటివి వస్తే మాత్రం మిగతా కూరలు తినం కాబట్టి అదనంగా శాంక్షన్ చేసేవారు. ఆయన ఫీస్ట్ రోజు ఐస్క్రీం కప్పుల మీద ఆ నిఘా ఏర్పాటు చేసేవారు. చిన్న చిన్న ప్లాస్టిక్ కప్పులలో చెక్క స్పూన్స్ తొ సహా వచ్చే ’క్వాలిటీ’ వెనిలా ఐస్క్రీం రుచి భలే ఉండేది. ఒక కప్పు సరిపోక  మేమంతా కలిసి “I scream.. You scream.. We scream.. For Ice cream..” అని గోల గోల చేసేవాళ్ళం. ఓ సారి అలాఅరుస్తుంటే ఓ చిరంజీవి దురభిమాని “ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ చిరంజీవి మెగా స్టార్” అని అరిచాడు. ఏంట్రా నీ గోల అంటే మొన్న చిరంజీవి సినిమాకిఇలానె అరిచాంరా మీరు స్లోగన్స్ ఇస్తున్నారు కదా అని నే కూడా ఇచ్చాను అన్నాడు. “ఆహా అలాగా ఒరే వీడి కప్పుకూడా లాక్కోండ్రా చిరంజీవి వచ్చి వీడికి ఐస్క్రీం తినిపిస్తాడు” అని వాడి మీద పడ్డాం :-)

ఇక రాత్రి కేక్ కటింగ్ దగ్గర కేక్ తోపాటు కూల్ డ్రింక్ లూ, సమోసాలో లేదా వెజ్ పఫ్ ఏర్పాటు చేసేవాళ్ళు. ఓ సారి కేక్ కటింగ్ ఆ తర్వాత చిన్న చిన్న స్పీచ్ లూ అయ్యాక కేక్ అందరికీ సర్వ్ చేసేసి ఆపై సాంస్కృతిక కార్యక్రమాలు ఏమీ ప్లాన్ చేయకపోవడంతో ఎవరైనా పాటలు కానీ డాన్స్ లు కాని చేసే వాళ్లుంటే రండిరా అని ఆహ్వానం పలికారు. ఒకడి ఏకపాత్రాభినయం మరొకడి పాట అయ్యాక ఎవరో “సార్ వేణుగాడు కూడా పాటలు బాగా పాడతాడు సార్” అంటూ నన్ను ముందుకు తోశారు. ఎదురుగా డైరెక్టర్, A.O. ఇంకా మిగిలిన స్టాఫ్ అంతా ఉండటంతో కాస్త మొహమాట పడినా కాదనలేక నేను సిరివెన్నెల నుండి “ఈ గాలీ.. ఈ నేల..” పాట మొదలెట్టాను. మొదటి చరణం చివరికి వచ్చేసరికి నా ముందున్న వాళ్ళంతా పాపం శ్రద్దగానే వింటున్నారు కానీ మా డైరెక్టర్, స్టాఫ్ నాపాట పట్టించుకోకుండా ఏవో కబుర్లు మొదలుపెట్టటంతో గోల మొదలైంది. అంతే మనకి వెంటనే శంకరాభరణం శంకరశాస్త్రిగారు గుర్తొచ్చారు... “ఠాట్ నేను పాడుతుంటే వినకుండా గోలచేస్తారా !! వీళ్ళకు నా పాట వినే అర్హతలేదు ఫో !!” అనుకుని పాట ఆపేసి కూర్చుండిపోయాను. మా సార్ ఒకరు “ఏంట్రా ఆపేశావ్?” అని అడిగితే “నాకు అంతవరకే వచ్చండి..” అని చెప్పేసరికి పాపం చేసేది లేక చప్పట్లు కొట్టేశారు.


విజయవాడలోనిది ఒకే బిల్డింగ్ లో గడిపిన ఖైదీ జివితమైతే ఇంజనీరింగ్ కి వచ్చాక ఆంధ్రా యూనివర్సిటీ వైజాగ్ లో అపరిమితమైన స్వేచ్చ... అక్కడ నాకు బాగా గుర్తున్నవాటిలో ఓ ఏడాది 31 రాత్రి సెకండ్ షోకి దదాపు ఒక 15 మందిమి క్లాస్మేట్స్ అంతా కలిసి ’అనగనగా ఒక రోజు’ సినిమాకి వెళ్ళాము. నాకు ఇప్పటికీ గుర్తు చిత్రాలయలో చూశాము ఆ సినిమా మా వాళ్ళు కొందరు ముందువెళ్ళారు మేం ఓ నలుగురం 5 నిముషాలు లేట్ గా వెళ్ళాం మేం థియేటర్ లోకి ఎంటర్ అయ్యే సరికి ఊర్మిళ ఇంట్రడక్షన్ సీన్ వస్తుంది తను చక్రి కోసం వెయిటింగ్ పెద్ద స్క్రీన్ పై తనని చూడటానికి రెండుకళ్ళు చాలడం లేదు. మా వాళ్ళు సీట్లలోంచి “ఒరేయ్ మేం ఇక్కడ ఉన్నాం..” అని అరుస్తున్నా పట్టించుకోకుండా అలానే వాక్వే లో నిలబడి ఆ సీన్ చూశాక వెళ్లి సీట్లలో సర్దుకున్నాం :-) ఆసక్తి ఉన్నవాళ్ళు పై వీడియోలో 6 నిముషాల దగ్గర చూడండి.

ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళడంతో సినిమాలోని కామెడీ చాలాబాగా ఎంజాయ్ చేశాం. సినిమా అయ్యాక క్లాస్మేట్స్ లో అమ్మాయిలను మహరాణిపేట హాస్టల్స్ లో దింపేసి ఆ డౌన్ లో దిగి బీచ్ కు వెళ్ళి బీచ్ రోడ్ వెంబడి నడుచుకుంటూ మా హాస్టల్స్ కు చేరుకోవడం మరిచిపోలేని అనుభూతి దారిలో పెద్ద పెద్దగా అరుస్తూ ఆటోవాలాలకు, బైకుల్లోనూ, కారుల్లోనూ ఎదురైన ప్రతి ఒక్కరికీ గ్రీటింగ్స్ చెబుతూ, కబుర్లు చెప్పుకుంటూ, సినిమాలోని బ్రహ్మానందం ’జాక్సన్ మైఖేల్ జాక్సన్’ కామెడీ సీన్స్ కొన్ని యాక్ట్ చేస్తూ నవ్వుకుంటూ గోల గోలగా గడిపాము. హాస్టల్ దగ్గర టెలిఫోన్ బూత్ నుండి రాత్రి 12:30 కి ఒక ర్యాండమ్ నంబర్ కి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసిన ఆంటీ మొదట కాస్త టెన్షన్ పడినా.. ఇలా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కొంత మందిమి సరదాగా ఒక నంబర్ ట్రై చేశాము అని వివరంగా చెప్తే తర్వాత వాళ్ళ ఇంటిల్లిపాదితో మాట్లాడించడం.. వాళ్ళు కూడా చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యి చాలా సంతోషంగా ఉంది మీతో మాట్లాడటం బాగా ఎంజాయ్ చెయ్యండి అని చెప్పడం కూడా మరిచిపోలేను. ఆ నంబర్ గుర్తులేదు కానీ వాళ్ళ ఇల్లు MVP కాలనీలో ఉంది అని మాత్రం చెప్పారు అపుడు.

"ఆనాటి ఆ స్నేహమానందగీతం ఆ ఙ్ఞాపకాలన్ని మధురాతి మధురం" అని పాడుకోవడమే ఇపుడు మిగిలింది... ఒకవేళ అందరం కలిసినా కార్లు, గ్యాడ్జెట్లు, భయాలు, బాధ్యతలు ఇప్పటి కథేవేరు... ఆరోజుల్లోలా నిర్లక్ష్యంగా ఎంత రాత్రైనా బిందాస్ గా రోడ్లమీద తిరగగలమా... ఏమో!! నాకైతే నమ్మకం లేదు...

బ్లాగ్ మిత్రులందరికీ హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.

24 కామెంట్‌లు:

  1. బాగా రాసారండీ..మీ గానకౌశల ప్రదర్శన కూడా బాగుంది...ఏమైనా ఇంజినీరింగ్ రోజులే వేరు కదండీ...ఆనాటి గుర్తులు ఇప్పుడు మనం మధురం అని అనుకోవాల్సిందే....టపా ఎండింగ్ చాలా బాగా ఇచ్చారు....
    మీక్కూడా...

    రిప్లయితొలగించండి
  2. ముందు కమెంట్ లో విషెస్ పెట్టాను..ఏదో ప్రాబ్లెం వల్ల పోయినట్లుంది..
    :(
    కొత్త సంవత్సరంలో మరిన్ని మంచి టపాలు రాస్తారని ఆశిస్తూ..మీక్కూడా " Advanced Happy and prosperous,joyful new year Wishes"

    రిప్లయితొలగించండి
  3. మీ టపా మళ్ళీ కాలేజీ రోజులకి తీసుకువెళ్లింది. థాంక్ యూ. ఇంతకీ మీది యే BLOCK ? మాది BLOCK-3.
    నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  4. Venu srikanth గారు మీకు మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు . ఈ కొత్త సంవత్సరం సుఖసంతోషాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

    రిప్లయితొలగించండి
  5. హహ్హహ్హా.. భలే ఙ్ఞాపకాలు:) చాలా చాలా బాగుంది టపా:)

    రిప్లయితొలగించండి
  6. చాలా బాగున్నాయి మీ హాస్టల్ అనుభవాలు. పాపం మీ వార్డెన్:) మేమేం పాపం చేసాం...మీ పాట మాక్కూడా వినిపించండి. వేణూ గారు, మీకు హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  7. స్నిగ్ద గారు నెనర్లు, మీరు మరీనండి నా బ్లాగ్ లో అలాకామెంట్లకి పోటీలేమీ ఉండవు :-) మీ శుభాకాంక్షలకు ధన్యవాదాలు మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    రమణ గారు నెనర్లు, నేను 4th Block అండీ.. హాస్టల్ ఆఫీస్ వెనక ఉండే బ్లాక్ కాకపోతే మా డిపార్ట్మెంట్ వాళ్ళంతా 7th బ్లాక్ లో ఉండేవారు నాకు మరికొందరికి అప్పట్లో దొరక్క 4th అలాట్ చేశారు.. అందుకే నేను ఎక్కువ సమయం నా నేస్తాలతో 7th బ్లాక్ లోనే గడిపేవాడ్ని. మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    శివరంజని గారు నెనర్లు, మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    తృష్ణ గారు నెనర్లు, మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    అపర్ణ గారు నెనర్లు :-)

    జయ గారు నెనర్లు :-) మరే మీరేం పాపం చేయలేదనే దయతలచి నాపాట వినే శిక్ష మీకు విధించడం లేదండి :-)
    ప్రస్తుతం నా స్వరం బొత్తిగా బండబారిపోయిందండి.. అదీకాక సాధనలేక రాగాలకు బదులు ఇనప బీరువాలు జరుపు తున్నట్లు, పాతికేళ్ళగా తెరవని కిటికీ తలుపులు తెరుస్తున్నట్లు చిత్ర విచిత్రమైన శబ్దాలు వస్తున్నాయని ప్రజాశ్రేయస్సు ద్రుష్టిలొపెట్టుకుని పాడటం మానేసా.

    రిప్లయితొలగించండి
  8. మీ ఙ్ఞాపకాలు భలే ఉన్నాయండి..అందరికి ఒకసారి కాలేజి జీవితం గుర్తు చేసారు.

    నూతన సంవత్సర శుభాకాంక్షలు

    రిప్లయితొలగించండి
  9. 2011 వ సంవత్సరం మీకూ, మీ కుటుంబ సభ్యులందరికి శుభప్రదం గానూ, జయప్రదంగానూ, ఆనందదాయకం గానూ ఉండాలని మనస్ఫూర్తి గా కోరుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
  10. మీ ఇంటిల్లిపాటికీ
    నూతన సంవత్సర శుభాకాంక్షలు ..

    రిప్లయితొలగించండి
  11. జ్ఞాపకాల నిధి తవ్వినకొలదీ తీపి......:) :)
    మీకు మీకుటుంబ సభ్యులకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు !

    రిప్లయితొలగించండి
  12. చాలా బాగున్నాయి మీ జ్ఞాపకాలు.నా కాలేజి రోజులను గుర్తుతెచ్చారు.మీకు, మీ కుటుంభ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  13. సిరిసిరిమువ్వ గారు, బులుసు సుబ్రహ్మణ్యం గారు, స్వామి గారు, పరిమళం గారు, మాలాకుమార్ గారు, రాధిక (నాని) గారు నెనర్లు.

    రిప్లయితొలగించండి
  14. వేణూగారు ..చాలా బాగున్నాయి మీ జ్ఞాపకాలు..
    నూతన సంవత్సర శుభాకాంక్షలు..

    రిప్లయితొలగించండి
  15. jaackson, micheal jaackson.chaala navvostundi..yee diologue gurtu chesukunte

    evari numberko phone chesaara?aa intlo vaallu saradaaga matladaara..wonderful..adee andhra pradeshamante..adee svatantra bhaarata mante..(too much emotion ayipotunna)..lucky lucky lucky you....

    happy new year sir

    రిప్లయితొలగించండి
  16. వేణూరాం నెనర్లు.

    ఎన్నెల గారు మీరు చెప్పినది నిజమేనండి. భారతీయత అంటే అదే :-)

    రిప్లయితొలగించండి
  17. వేణు గారు అదేమి లేదండీ..ఈ మధ్య అందరూ అలా పెడుతున్నారని నేనూ ట్రై చేసా..
    :)

    రిప్లయితొలగించండి
  18. వేణూగారు,
    బాగున్నాయి మీ జ్ఞాపకాలు. :)
    నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  19. స్నిగ్ద గారు, శిశిర గారు నెనర్లు.

    రిప్లయితొలగించండి
  20. వావ్.. భలే బాగుందండీ.. నిజమే ఆ రోజులు మళ్ళీ రావు :(
    నూతన సంవత్సర శుభాకాంక్షలు..

    రిప్లయితొలగించండి
  21. మురళి గారు నెనర్లు మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.