మంగళవారం, జనవరి 04, 2011

హాస్టల్ - 8 (అనగనగా ఓ రాత్రి!!)

“వేణుగా వర్మ సినిమారా.. చాలా బాగుందంటరా.. అసలు సౌండ్ ఎఫెక్ట్స్ కోసమైనా చూసితీరాలంటరా..” అంటూ ఉదయం క్లాసుల మధ్య ఇచ్చిన బ్రేక్ లో మా భరత్ గాడు మొదలెట్టాడు.
“అవునంటరా మొన్న క్యాంటీన్ లో పేపర్ లో చూశాను ఏదో కొత్త సౌండ్ సిస్టం అన్నారు అదేంట్రా..” అడిగాను నేను.
“6 ట్రాక్ స్టీరియోఫోనిక్ సౌండ్ బే, అదికూడా తెలియదు సినిమా చూట్టానికి రెడీ ఐపోయాడు..” నవ్వుతూ అంటూ ఇంకో పక్కనుండి బాజీ గాడు ఓ టెంకిజెల్ల ఇచ్చాడు.
“తెలుసా సినిమాలో బస్సు కుడిపక్కనుండి ఎడంపక్కకు మన వెనకగా నిజంగా వెళ్తున్నట్లు అనిపిస్తుందంట.. ఇలాంటి ఎఫెక్ట్స్ ఇంకాబోలెడంట..” అంటూ భరత్ కంటిన్యూ చేశాడు.

ఆరోజే రిలీజ్ అయిన రామ్ గోపాల్ వర్మ “రాత్రి” సినిమా గురించి మా డిస్కషన్.. శివ, క్షణంక్షణం ప్రభావంతో వర్మ సినిమాలు అంటే మాస్టర్ పీస్ లు అనే నిశ్చితాభిప్రాయానికి వచ్చేసిన నాకూ భరత్ గాడికీ ఎలాగైనా ఆ రోజే ఆ  సినిమా చూసేయాలని ఉంది. కానీ మా కాలేజ్ లో ఆదివారం తప్ప మధ్యలో ఔటింగ్ సంపాదించడమంటే చాలా కష్టమైన పని, అలాగని ఎవరూ వెళ్ళరు అని కాదు కానీ కాస్త బలమైన కారణం ఉండాలి.
“వార్డెన్ ని మ్యానేజ్ చేసి డిన్నర్ అయ్యాక గోడదూకి వెళ్దాంరా, మనకి దగ్గరలో అంటే కామయ్యతోపులో ఆడుతుంది.. సెకండ్ షోకి అందుకోవచ్చు” మా భరత్ గాడు తీర్మానించేశాడు. 

“ఒద్దురా అది చాలా రిస్క్ దొరికితే వీపంతా వాతలు తేల్తాయ్.. అదీకాక సౌండ్ కోసం చూడాలంటే రాజ్/యువరాజ్ లోనే చూడాలి, దగ్గరలోని లోకల్ హాళ్ళలో ఐతే అంత సీన్ ఉండదు చూట్టం వేస్ట్..” అంటూ నేను వాడి తీర్మానాన్ని వీటో చేసేశాను. దెబ్బలుతింటామన్న భయంకన్నా A.O. గారి దగ్గర ’రాముడు మంచి బాలుడు’ అని నాకున్న ఇమేజ్ డ్యామేజ్ అవుద్దని నా బాధ. 

ఎలా ప్లాన్ చేయాలా అని ఆలోచిస్తూ మెల్లగా క్లాసులకి వెళ్ళిపోయాము, నేను క్లాస్ లో కూర్చున్నానన్నమాటే కానీ ఆలోచనలన్నీ వర్మ చుట్టూ రాజ్/యువరాజ్ లోఆడుతున్న రాత్రి సినిమా చుట్టూ తిరుగుతూ ఉన్నాయ్. మధ్య మధ్యలో శివలోంచీ క్షణంక్షణంలోంచీ కొన్ని సీన్స్ నామెదడులోంచి ఎదురుగా ఉన్న బ్లాక్ బోర్డ్ మీదకి ప్రొజెక్ట్ ఐ అక్కడ  రన్ అవుతున్నాయ్... ఇంతలో రెండుకళ్ళమధ్య ముక్కుదూలం మొదట్లో మంటగా అనిపించింది. “ఛస్ దీనెంకమ్మ కళ్ళజోడు దీనివల్ల ఉపయోగమేమో కానీ దీని బరువుకి వాచిపోతుంది” అని దాన్ని తిట్టుకుంటూ తీసి టేబుల్ మీద పెడుతూ యధాలాపంగా దానికేసి చూశాను... అంతే ఫ్లాష్ వెలిగింది.. దానితో పాటే నా మొహంలో కూడా వెయ్యిమతాబాల వెలుగునిండింది. హుర్రే !! అనుకుని ఆ ఐడియా మావాళ్లతో షేర్ చేస్కోడానికి ఎప్పుడెప్పుడు లంచ్ బ్రేక్ వస్తుందా అని ఎదురు చూడటం మొదలెట్టాను.
అప్పట్లో నాకు భయంకరమైన షార్ట్ సైట్ ఉండేది దాన్ని కాంపెన్సేట్ చేయడానికి -16D పవర్ ఉన్న కళ్ళద్దాలు వాడేవాడిని. ఒకో కంటిఅద్దం ఇంచుమించు ముప్పావు అంగుళం మందం ఉండేది. నాజూకుగా ఉండే మెటల్ ఫ్రేం వాటికి సరిపోదని బరువైన ఆ అద్దాలను ఆపలేదనీ చెప్పి పైన ఫొటోలో చూపించినలాంటి వెడల్పాటి షెల్ ఫ్రేం వేసేవాడు మా ఆప్టీషియన్. ఈ ఫ్రేం మధ్యలో ఒక గాడి ఉంటుంది అద్దం చుట్టూమధ్యలో కోసుగా చేసేవాడు దాన్ని తీసుకువెళ్ళి ఆ గాడిలో అమరేలా బిగిస్తే అద్దం కదలకుండా ఫ్రేంలోనే ఉంటుంది. ఆ రోజు నేను కళ్ళద్దాలు తీసి డస్క్ మీద పెడుతున్నపుడు ఒక మూలన అద్దం ఆఫ్రేంగాడిలోనుండి బయటకు వచ్చి కనిపించింది. చాలా పాతబడడం వల్ల ఫ్రెం లూజ్ అయ్యి ఇలా అప్పుడప్పుడు జరుగుతుంది దాన్ని మళ్ళీ జాగ్రత్తగా లోపలికి నెట్టేసి వాడుకునే వాడ్ని. కానీ ఆ రోజు జాగ్రత్తగా కొంచెం ఫోర్స్ ఉపయోగించి అద్దానికీ ఫ్రేంకి డామేజ్ జరగకుండా అద్దాన్ని ఫ్రేం నుండి విడదీయగలిగాను. కొద్ది ప్రయత్నంతో దాన్ని తిరిగి యధా స్థానానికి చేర్చగలనని నిర్ధారించుకున్నాక మావాళ్లకి విషయం చేరవేశాను.

సరే ప్లాన్ వర్కవుట్ అవ్వాలంటే ముందుగా ఊడదీసిన అద్దాన్ని దాచిపెట్టాలి, నా ట్రంక్ లో దాస్తే పొరపాటున మా A.O. కి డౌట్ వచ్చి వెతికిస్తే దొరికిపోతాం కనుక మా రూముకు నాలుగు రూముల అవతల మాకంతగా పరిచయంలేని ఒకడ్ని పట్టుకుని వాడి ట్రంకు పెట్టెలో బట్టలమధ్య ఆ అద్దాన్ని బద్రంగా దాచిపెట్టాను. ఆపై సాయంత్రం 4గంటలకి క్లాసులు అవ్వగానే ఒకఅద్దంలేని ఆఫ్రేంతో మా A.O. గారి దగ్గరకు వెళ్ళి మెట్లుదిగుతుంటే కళ్ళద్దాలు జారిపడిపోయాయనీ ఒక అద్దం పగిలిపోయిందనీ.. అది లేకపోతే బొత్తిగా కనపడదు కనుక వెంటనే విజయవాడ వెళ్లి అద్దం వేయించుకుని వస్తాను అని చెప్పాను. మనకున్న మంచి ఇమేజ్ మూలంగా మా సార్ వెంటనే నమ్మేసి ఎక్కువ ప్రశ్నలు అడగకుండానే నాకూ ప్లస్ నాకుకనపడదు కనుక నాకుతోడుగా ఉండటానికి మా భరత్ గాడికీ పర్మిషన్ ఇచ్చేశారు. వెంటనే ఏమాత్రం ఆలశ్యం చేయకుండా దాచిపెట్టిన అద్దం తీసుకుని దాన్ని దాన్ని కొత్తగా కనిపించేలా శుబ్రంగా సబ్బునీళ్ళతో కడిగి అంచులవెంబడి మెరిసేలా పేపర్ తో పాలిష్ చేసి దాన్ని జోబులో వేసుకుని మళ్ళీ ఎవరి కంటపడకుండా వెనకదారిగుండా బయటపడి రోడ్డెక్కాము. థియేటర్ కి వెళ్ళేవరకూ మాతెలివితేటలకి మేమే నవ్వుకుంటూ జోకులేసుకుంటూగడిపాం..

తీరా రాజ్ యువరాజ్ కి వెళ్ళేసరికి మొదటిఆటకి టిక్కెట్లు అయిపోయాయన్నారు, కనీసం బ్లాక్ లో కూడా దొరకలేదు సరే ఇంత కష్టపడి వచ్చి చూడకుండా ఏం వెళతాం అని సెకండ్ షొకి వెళ్దాం అని నిర్ణయించుకుని డిన్నర్ చేసి గాలికి తిరిగి ఎలాగైతేనేం రెండోఆటకి టిక్కేట్లు సంపాదించాం. మేం కోరుకున్నట్లుగానే థియేటర్ మధ్యలో సీట్లు దొరికాయి.. సినిమా మొదలైంది స్క్రీన్ అంతా నల్లని నలుపు.. ఉన్నట్లుండి వెనకనుండి దయనీయంగా ఓ స్త్రీ ఏడుపు మొదలైంది ఓ క్షణం ఒళ్లుజలదరించింది... ఇంతలో తెరపై సన్నని వెలుగు.. అదేమైఉంటుందా అని ఆలోచిస్తూ టైటిల్స్ గమనిస్తుండగా నేపధ్యంలో సన్నగా ఆ స్త్రీ ఏడుపుకి తోడు భయం గొలిపే మిస్టరీ శబ్దాలు.. ఉన్నట్లుండి హఠాత్తుగా పెద్దశబ్దంతో తలుపులు తెరుచుకున్నాయి.. ఆశబ్దం ఎంత సహజంగా ఉందంటే అప్పటివరకూ తెరమీద చూస్తున్నది తలుపులను అని తెలియని నేను ఉలికిపడి అప్రయత్నంగా థియేటర్ తలుపులకేసి ఓ క్షణం చూశాను. అలా కెమేరా ముందుకు వెళ్తుంటే ఊరంతా ఖాళీ.. మొండిగోడలు ఇళ్ళు తప్ప మనుషులు ఎవ్వరూ ఉండరు.. ఇక అక్కడనుండి సౌండ్ & సినిమాటోగ్రఫీ మాయాజాలం మొదలైంది. 

అప్పటివరకూ సగటు సూపర్ హీరోల తెలుగు సినిమాలు తప్ప హిందీ సినిమాలతో కూడా అంతగా పరిచయంలేని నాకు హాలీఉడ్ హార్రర్ సినిమాల గురించి తెలిసే అవకాశం అస్సలు లేదు. దానివల్ల ఆ సినిమా చూస్తున్నంత సేపు పూర్తిగా వర్మ మాయలో పడిపోయాను. ఎక్కడా జుగుప్సకు తావివ్వకుండా సినిమా అంతా నటీనటుల ముఖ కవళికలు, సర్ ప్రైజ్, సౌండ్, కెమెరా యాంగిల్స్ పైనే ఆధారపడి ఒక అద్భుతమైన అనుభూతిని మిగిల్చాడు. గడియారం టిక్ టిక్ సౌండ్, లారీ డోర్, సరిగా మూసుకోని బీరువా తలుపు, మామ్మగారి తెల్లజుట్టు తనుచేసే జపం, తుప్పుపట్టిన స్టోర్ రూం తలుపు చేసే కిర్రు శబ్దాలు, వంటింట్లో మిక్సీ, బాండీలో వేసే పోపూ ఇవీ ఇతను మనని భయపెట్టడానికి ఎంచుకున్న మార్గాలు. వాటినే హఠాత్తుగా వినిపించడం చూపించడం ద్వారా ఉలికిపడేట్లు చేస్తాడు. రేవతి కళ్ళగురించి చెప్పుకుని తీరాలి తను కంటిచూపు తోనే చంపేసింది ఆ సినిమాలో, తనతోపాటు చిన్నపిల్లాడి పెద్ద పెద్ద కళ్ళు కూడా భయపెడతాయ్. అలా మూడు ఆశ్చర్యాలు ఆరు భయాలతో సినిమా చూసి బయట పడ్డాం.


అర్ధరాత్రి పన్నెండుగంటలు మా మిషన్ - విజయవాడ సెంటర్ లోఉన్న రాజ్/యువరాజ్ నుండి బందరురోడ్లో ఊరిపొలిమేరలకు ఆవలనున్న ఈడ్పుగల్లులొని మా హాస్టల్ కు చేరుకోవడం. ఫిబ్రవరి నెల చలి ఇంకా తగ్గక పోవడంతో ఊరు త్వరగా సద్దుమణిగింది నిర్మానుష్యమైన వీధులు.. కన్నుపొడుచుకున్నా కానరాని చీకటి.. నిశ్శబ్దంగానే ఉన్నట్లున్నా ఏవో చిత్ర విచిత్రమైన శబ్దాలు.. ఎలాగో కష్టపడి బెంజి సెంటర్ వరకూ చేరుకున్నాం అక్కడ చాలా సేపు ఎదురు చూశాక మా కాలేజ్ కి ఒక కిలోమీటర్ ఇవతల వరకూ వెళ్ళే ఒక వ్యాన్ దొరికింది వాడ్ని బతిమిలాడి ఎలాగో అక్కడివరకూ వెళ్ళాం. వాడుమమ్మల్ని మెయిన్ రోడ్ లో దింపేసి లోపలికి వెళ్ళిపోయాడు.

అక్కడ ఒకే ఒక చిన్న టీకొట్టు తప్ప ఇంకేమీ లేవు చుట్టూ పొలాలు చిమ్మ చీకటి.. కీచురాళ్ళ రొదలు.. అప్పటివరకూ సినిమాలో చూపించిన సన్నివేశాలన్నీ కళ్ళముందు కనిపించడం మొదలెట్టాయి పెద్ద చెట్టుని చూసినా భయమే.. కదిలే చిత్తుకాయితాన్ని చూసినా భయమే.. ఆ ప్రాంతంలో మేం ఇద్దరం తప్ప ఒక వాహనం కానీ మరో మనిషి కానీ ఎవరూ లేరు. కాసేపు ఎదురు చూశాక నడవాలి అని నిర్ణయించుకున్నాము. ఒకళ్ళ చేతులు ఒకళ్ళుపట్టుకుని వణుకుతూ భయం భయంగా చుట్టూ ఒకటికి పదిసార్లు చూసుకుంటూ ఎలా హాస్టల్ కి చేరుకున్నామో ఆ దేవుడికే ఎరుక. క్షేమంగా హాస్టల్ కు చేరాక ఇక ఎట్టిపరిస్థితుల్లోనూ హార్రర్ సినిమాలకి సెకండ్ షోలకి వెళ్ళకూడదని ఒట్టు పెట్టుకుని నిద్రోయాం :-) మొదలే భయస్తుడినైన నాకు తెల్లారేసరికి వచ్చిన జ్వరం తగ్గడానికి రెండ్రోజులు పట్టింది.

27 కామెంట్‌లు:

  1. హహహ బావుంది...రాత్రి సినిమా నిజంగానే చాలా బావుంటుంది. అందులో చివర్లో ఓం పురి చెప్పే డైలాగులు సూపరసలు. "భయం అంటే చీకటి..." అని ఏవో చెబుతాడు. నాకు ఇప్పుడు exact గా గుర్తులేదుగానీ చూసినప్పుడు చాలా ఎంజాయ్ చేసాను.

    రిప్లయితొలగించండి
  2. మీ భయం చదివాక నా భయం గుర్తొచ్చింది. పున్నమిరాత్రి అని ఒక సినిమా...అందులో రక్త పిశాచి ఉంటుంది. అందరినీ మెడ కొరికి రక్తం తాగి చంపేస్తూ ఉంటుంది. నా చిన్నప్పుడు నాలుగో, ఐదో చదువుతున్నప్పుడు ఒక సాయంత్రం టీవీలో వచ్చింది. అది చూసి గడగడలాడిపోయాను. దాదాపు యేడాదికిపైన ఆ రక్తపిశాచి నన్ను వెంటాడుతూనే ఉంది. 7.00 దాటితే బయటికెళ్లేదాన్ని కాదు. మా పెరట్లోకి కూడా వెళ్ళేదాన్ని కాదు. ఈరోజుకీ ఆ రక్తపిశాచి బొమ్మ నా బుర్రలో ముద్రితమైపోయి ఉంది...భయం పోయిందిలెండి కానీ బొమ్మ మాత్రం ఉండిపోయింది. :)

    రిప్లయితొలగించండి
  3. సూ...పర్ పోస్ట్ వేణు శ్రీకాంత్ గారు:) కళ్లకు కట్టినట్లు చెప్పారు, మీ సినిమా ప్రహసనం:))

    రిప్లయితొలగించండి
  4. అసలు మీ కళ్లజోడు అయిడియా ఉంది చూసారూ.. హైట్స్ ఆఫ్ ద ఇంటెలిజెన్స్:)) అదే అద్దాన్ని అంతలా భద్ర పరిచి.. కొత్త దానిలా చూపించడం.. సూ...పర్:))

    రిప్లయితొలగించండి
  5. పోన్లేండి క్షేమంగా చేరారు!! అమ్మో అమ్మో మీరేదో చాలా మంచి బాలుడు అనుకుంటున్నా ఇన్నాళ్లు, అయినా ఇలా మెత్తగా ఉండేవాళ్లే ఇలాంటి పనులు చేసేది.

    రిప్లయితొలగించండి
  6. సౌమ్య నెనర్లు, అవునండి రాత్రిసినిమా నాకు కూడా చాలా ఇష్టం. ఓంపురి డైలాగ్ పూర్తిగా గుర్తులేదు కానీ అదే భావం.. “రాత్రి చీకటి పడినపుడు మనం దీపం వెలిగిస్తాం కానీ ఆ వెలుగు కేవలం ఒక చిన్న ప్రాంతంలో చీకట్ని మాత్రమే పారద్రోలుతుంది. కానీ ఆ వెలుతురుకి ఆవల ఉన్న అనంతమైన చీకటిలో ప్రకృతి వేటిని దాచి ఉంచిందో తెలియదు. మనకు అర్ధమైనవాటిని మాత్రమే మనం నమ్ముతాం.. ఆ చీకటిలో ఉన్నశక్తులగురించి మనకు తెలియదు వాటిని కూడా మనిషి తెలుసుకోగల రోజురావచ్చు..” అంటూ ముగిస్తాడు.
    హ హ అంత చిన్నపుడు అలాంటివి బోలెడు భయాలు ఉంటాయి కదా :-)

    శిశిర గారు నెనర్లు.

    అపర్ణ నెనర్లు, హ హ చదువులో పని చేసినా లేకపోయినా ఇలాంటి విషయాల్లో బుర్ర పాదరసంలా పని చేస్తుంది.. ఎందుకంటే ఒకవేళ ఫెయిల్ అయితే బెల్ట్ దెబ్బలు తినాల్సొస్తుందన్న భయం :-)

    సిరిసిరిమువ్వ గారు నెనర్లు, హ హ నాపేరులోఉన్నట్లే నాలోనూ ఇద్దరున్నారండి. అపుడపుడు రాముణ్ణి పక్కకు నెట్టేసి ఇదిగో ఇలా కృష్ణుడు బయటకి వచ్చేస్తుంటాడు :-D

    రిప్లయితొలగించండి
  7. అయ్యబాబోయ్ రాత్రి సినిమా ఇప్పటికీ నేను టి.వి.లోనే చూడలేను.ఇంక హాల్లో చూడటమే. అర్ధరాత్రి దొంగతనంగా పోయి సెకండ్ షో చూస్తే అంతే అవుతుంది మరి:)

    రిప్లయితొలగించండి
  8. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  9. మొత్తానికీ, ఓ లుక్కేద్దామని వచ్చిన నన్ను చదివించేశారు :D

    >>>"దెబ్బలుతింటామన్న భయంకన్నా A.O. గారి దగ్గర ’రాముడు మంచి బాలుడు’ అని నాకున్న ఇమేజ్ డ్యామేజ్ అవుద్దని నా బాధ"

    ఏంటో మీ బలవంతబ్బుద్ధిమంతనం ప్చ్

    అప్పుడప్పుడన్నా ఇలాంటివి చేస్తుండాలి

    రిప్లయితొలగించండి
  10. క్రొత్త సంవత్సరం, క్రొత్త పోస్టూ, క్రొత్త genre

    రిప్లయితొలగించండి
  11. నాకు అసలే భయం ఎక్కువ .నిద్రపోయేముందు రాత్రి సినిమా గుర్తుచేశారు:(( .మీరు హాస్టల్ కెళ్ళే సీను చాలా బాగా కళ్ళకు కట్టినట్టు రాసారు
    .

    రిప్లయితొలగించండి
  12. అప్పట్లో మేమూ ఆ సినిమాకు సెకెండ్ షోకే వెళ్ళామండీ. నాకు హారర్ సినిమాలంటే భయమైనా చెయ్యి అడ్డం పెట్టుకుని వేళ్ళ సందుల్లోంచి చూసేస్తాను...:) టివీలో అయితే సౌండ్ తగ్గించేసి చూశేస్తా.అప్పుడు భయం వేయ్యదుకాదా..

    రిప్లయితొలగించండి
  13. జయ గారు నెనర్లు, హ హ మరే కానీ ఒక సారి దెబ్బతింటే కానీ తెలీదు కదండి మరి :-)

    గీతాచార్య గారు నెనర్లు, కదా నిజమే అపుడపుడన్నా ఇలాంటివి చేస్తుండాలి కానీ మరి అలా మంచిబాలుడన్న పేరు నిలుపుకోవడం వల్లే కదా కర్రవిరక్కుండా పాము చావకుండా ఇలా నెగ్గుకు రాగలిగింది.

    రాధిక(నాని) గారు నెనర్లు, హ్మ్ అయ్యో ముందు డిస్క్లైమర్ పెట్టుండాల్సిందనమాట.. ఇంతకీ రాత్రి ప్రశాంతంగా నిద్రోయారా లేదా...

    తృష్ణ గారు నెనర్లు, హ హ నిజమే నండి నేను కొన్ని హర్రర్ సినిమాలు అలాగే చూస్తాను వాల్యూం కంట్రోల్ మీద ఒక వేలు రడీగా పట్టుకుని :-)

    రిప్లయితొలగించండి
  14. హహహ బాబోయ్ ఎంత నవ్వానో ........ ఏది ఏమయినా కాని ... అంత .హర్రర్ మూవీ ని ఇంత కామెడీ గా ఎలా చెప్పగలిగారు వేణుగారు ..... ఈ సినిమా నేను చూడలేదు అస్సలు ..మీ పోస్ట్ చదివి ఒకవేల ఇప్పుడు చూసినా నాకు కామెడీగానే ఉంటుందేమో

    రిప్లయితొలగించండి
  15. anta kashTapaDi choosaaraa? koddi roejulu bhayapeTtae cinimayae lenDi idi.

    రిప్లయితొలగించండి
  16. శివరంజని గారు నెనర్లు :-) ఇపుడు చూస్తే కూడా కొన్ని సన్నివేశాలు భయపెట్టినా పైన టపాలో చెప్పిన కొన్నిటిని చూసి ఓర్నీ వీటికా మనం ఉలిక్కిపడింది అని నవ్వేసుకుంటాం అండి.

    పద్మావతి గారు నెనర్లు, నిజమేనండి హార్రర్ సినిమాలంటే డ్రాక్యులా సినిమాలే గుర్తొస్తాయండి.

    రిప్లయితొలగించండి
  17. సునీత గారు నెనర్లు, వర్మ పై ఉన్న క్రేజ్ అలాంటిదండీ ఒక రెండ్రోజులు ఆగడానికి కూడా మనసొప్పలేదు. ముఖ్యంగా మాములుగా ఉన్న పరిస్థితులలోనుంచి భయం పుట్టించడం వలన అలా వెంటాడుతుందండీ సినిమ.

    రిప్లయితొలగించండి
  18. yee manchi baaludu goda dooki sinemaaki vellaara....konchem nammadam kastame...
    nenu ippude oka dayyam tapa publish chesi vachchaanu,bhaya padutoo...raayadam raasesaa gaanee chadavaalante bhayam..edit cheyyalante bhayam.yelagola ayipoyindi baboo ani kaasepu hostel kaburlu chadivi bhayam tagginchukodaaniki ikkadikochcha...hahahah..mallee bhayapettesaaru..ippudu nidra padutundo ledo..yentee.idi..deyyaala seasonaa ani naaku doubt vachchindandee...rendu tapaala madhyana...

    రిప్లయితొలగించండి
  19. రాత్రి వేళలో 'రాత్రి' సినిమా చూసిన ఎఫెక్ట్ కలిగింది మీ టపా చదివాక..ఈ సినిమా ఎప్పుడూ చూసినా చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది నాకు...వర్మ టేకింగ్ మహత్యమేమో... మీ కళ్ళజోడు ఐడియా సూపరూ...మొత్తమ్మీద మీరు రామకృష్ణావతారమన్న మాట.... :)

    రిప్లయితొలగించండి
  20. ఎన్నెల గారు నెనర్లు హ హ మరే ఈ మంచిబాలుడు మీరు అనుకున్నంత మంచి బాలుడు కాదనమాట :) అయినా గోడదూకి కాదండి ఈ సినిమాకు ఆబద్దం చెప్పి పర్మిషన్ తీసుకునే వెళ్ళాను :)

    స్నిగ్ధ గారు నెనర్లు, అవునండి ఆ సినిమా నచ్చిన వాళ్ళకి ఇప్పుడు చూసినా ఆ ఫ్రెష్ నెస్ పోదు కానీ హాలీఉడ్ తో బాగా పరిచయం ఉన్నవారికి అంతగా నచ్చకపోవచ్చు. హ హ అవతారాలదాక ఎందుకు లెండి కానీ ప్రస్తుతం మాత్రం అందరికోసం ఒంటరినైన రాముడ్నీ... నిందలు మోస్తూ నవ్వుతున్న కృష్ణుడ్నీ :-)

    రిప్లయితొలగించండి
  21. Hi, Nice post. @sowmya: Even I remember punnami ratri movie, I even remeber the plot, the woman, her thali. Guess I was in 3rd standard when that movies was on doordarshan telecast. I still have that fear lingering when Iam alone at home.

    రిప్లయితొలగించండి
  22. హహహ బాగుంది మీ సినిమా ప్రహసనం, దాని కబుర్లు, వివరణ, విశ్లేషణ, వ్యాఖ్యానం అన్నీ బాగున్నాయి. నాకు ఓం పూరి చివరలో దెయ్యాన్ని పంపించేసేటప్పుడు బొటన వేలుతో భ్రుకుటి దగ్గర గట్టిగా నొక్కుతాడు అక్కడ భయం వేసింది అంతే! అ తరువాత మామూలే! అసలు మనకి భయం ఎక్కువ అవడానికి కారణం మాత్రం భయం వేసిన అంశాన్ని ఎక్కువగా గుర్తు చేసుకోవడమని నా అభిప్రాయం!

    రిప్లయితొలగించండి
  23. ధన్యవాదాలు రసజ్ఞ గారు, మీరు చెప్పినది కరెక్టండి ఎక్కువ సార్లు తలుచుకుని ఎక్కువ భయపడతాం. ఈ సినిమాలో నన్ను భయపెట్టిన అంశాల్లో 90శాతం సాధారణమైన అంశాలే రీరీకార్డింగ్, సర్ ప్రైజ్ ఎలిమెంట్ బాగా భయపెడతాయి.

    రిప్లయితొలగించండి
  24. e nenarlu entandi..ardam kaatledu..by the way post matram superb

    రిప్లయితొలగించండి
  25. అఙ్ఞాత గారు నెనర్లు :-)
    నెనరులు అనేది థ్యాంక్స్ కు తెలుగు పదమండీ... బ్లాగులలోనే విరివిగా వాడుక మొదలుపెట్టాం :-)

    రిప్లయితొలగించండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.