భయం భయంగా చుట్టూ చూస్తూ.. హస్టల్ ముందున్న సిమెంట్ బెంచీల మీద కూర్చున్న సీనియర్స్ ని “నన్నా సార్” అని అడిగాను.
“ఆ నిన్నేరా.. నువ్వుకాకుండా ఇంకెవరున్నారు అక్కడ.. బాగా తెలివిమీరారురా” ఒకతను జవాబిచ్చాడు.
నా కాళ్ళలో శక్తి మొత్తం ఎవరో లాగేసుకున్నట్లు కాళ్ళలో వణుకు మొదలైంది అడుగు ముందుకు పడటం లేదు “చచ్చాంరా బాబు.. ఏం పని లేనట్లు వీళ్ళిక్కడే తగలడాలా నేనైనా చూసుకోవచ్చుగా.. ఇప్పుడు ర్యాగింగ్ అంటూ ఏమేం విచిత్రమైన ఫీట్లు చేయించి చస్తారో ఏంటో.. అసలే ఈ హాస్టల్ మెయిన్ రోడ్ కి దగ్గర ఆ రోడ్లో అమ్మాయిలు కూడా తిరుగుతుంటారు ఒకళ్ళు చూసినా పరువంతా పోయినట్లే..” అని ఫీల్ అవుతూ ఎలాగో కష్టపడి వాళ్లదగ్గరకి వెళ్ళాను.
“ఫస్టియరా ?”
“అవునండి..”
“అండి ఏంటిరా మొగుడ్ని పిలిచినట్లు, సార్ అనాలని చెప్పలేదా ఎవరూ.. ఏ బ్రాంచ్ ?”
“Instrumentation సార్”
“ఓహో.. అవునూ సీనియర్స్ ఇక్కడ కూర్చుని ఉంటే కనపడటం లేదారా విష్ చేయకుండా సైలెంట్ గా అలా వెళ్ళిపోతున్నావ్ ?”
“రూం కి వెళ్ళాలన్న తొందరలో చూస్కోలేదు సార్”
“ఏం పీకాలేంటి అంతతొందరగా వెళ్ళి రూంలో ?”
“చదువుకోవాలి సార్..” (అది పచ్చిఆబద్దమని తెలిసిన నాఅంతరాత్మ గాడు కింద పడి గిలగిల కొట్టుకుంటూ నవ్వసాగాడు వాడ్ని బలవంతంగా ఊరుకోబెట్టి మొహంలో సీరియస్ నెస్ పోకుండా జాగ్రత్తపడ్డాను)
“ఎగస్ట్రాలెక్కువేరా నీకు..” అంటూ సరదాగా ఒకడు పొట్టమీద గుద్దాడు..
ఒకడుగు వెనక్కేసి బ్యాలన్స్ చేసుకుంటూ “హి హి హి హి..” అని ఏడవలేక ఒక వెధవ నవ్వు నవ్వాను.
“సరే ఇప్పుడేం చేసి మమ్మల్ని ఎంటర్ టైన్ చేస్తావ్..”
“మీ ఇష్టం సార్..” (మనసులో: నేనేమైనా సర్కస్ జోకర్నేంటిరా మిమ్మల్ని ఎంటర్ టైన్ చెయడానికి ఒక ఏడు ముందు పుట్టి సీనియర్స్ అని మాతో ఏం ఆటలాడుకుంటున్నార్రా!!)
“రాక్ అండ్ రోల్ తెలుసా ?”
“తెలుసు సార్..”
“ఎలా తెలుసు ?”
“మైఖేల్ మదన కామరాజు సినిమాలో చూశాను సార్..” (ఈసినిమానే ఎందుకు గుర్తొచ్చిందని నన్నడక్కండి)
“అబ్బో.. ఏం తెలుసో చూపించు..”
వెంటనే ఈస్ట్మన్ కలర్ లో నాకళ్ళముందు ఆ సినిమాలో కమల్ వేసిన స్టెప్పులు కనిపించాయ్.. “బంబం ఆరంభం.. భంభం ప్రారంభం.. ఆరేడు రోజులాయె కాదే..నీ మీద మనసుపడ్డ నాకు నిదురలేదే..” అంటూ పాట అందుకొని నడుము ట్విస్ట్ చేస్తూ ఓ ఊపేస్తూ సగం గోడకుర్చీ వేసిన ఫోజులోకి వంగి మెల్లగా మళ్ళీ నిటారుగా నిలబడుతూ ఇలా నాకు తోచిన డ్యాన్స్ మొదలెట్టాను :-)
“హ హ హ నువ్వలా ఊగుతుంటే చూడటానికి భలే ఉందిరా.. ఐనా దీన్ని రాక్ అండ్ రోల్ అంటారు అని ఎవరు చప్పారు రా” అని కామెంట్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఎంతకీ ఆగమని చెప్పడంలేదు.
చెప్తున్నా వినకుండా “నాలుగు రోజులు రావాలికదా” అంటూ అమ్మ లూజుగా కుట్టించిన నా ప్యాంట్ ఎక్కడ ఊడి జారిపోతుందో అనే టెన్షన్ ఒక వేపు.. అప్పటికే భయంతో శక్తిలేకుండా బలహీనంగా తయారైన నా కాళ్ళు ఎక్కడ సహకరించడమ్ మానేసి నన్ను కిందపడేస్తాయోననే గాబరా మరో వేపు.. నాకు నేనుగా ఆపేస్తే సీనియర్స్ ఏమంటారో అని భయం మరోవేపు తినేస్తుండగా ఇక చేయలేక సంశయిస్తూనే ఆపేశాను.
అదుగో అలాంటి విపత్కరమైన పరిస్థితులలో మొదటిసారి విన్నాను Elvis Presley పేరు
“ఇక చాలులేగానీ నీకు ఎల్విస్ ప్రెస్లీ తెలుసారా ?” పక్కనున్న మరో సీనియర్ అడిగారు.
“తెలీదు సార్.. ఎవరు సార్ ఆయన ?”
“కింగ్ ఆఫ్ రాక్ అండ్ రోల్ రా.. మహానుభావుడు చచ్చిబ్రతికిపోయాడుకానీ తను నీ రాక్ అండ్ రోల్ డ్యాన్స్ చూసుంటే ఇప్పుడు గిటార్ తీగల్తో ఉరేసుకుని మరీ చచ్చిపోయేవాడు.. ఇంకెప్పుడు ఎవరన్నా అడిగినా చేయబాక అంతగా అంటే నాపేరు చెప్పి ఆసార్ చేయద్దన్నారని అని చెప్పు.. ఇక పో రూంకి” అన్నారు.
ఎల్విసో ఎవరో మహానుభావుడు..” పైనెక్కడున్నావో కానీ నన్ను ర్యాగింగ్ నుండి రక్షించినందుకు నీకు థ్యాంక్స్ బాసు” అని మనస్ఫూర్తిగా చెప్పుకుని బ్రతుకుజీవుడా అనుకుంటూ సంధించిన బాణంలా ఒక్క పరుగులో వెళ్ళి రూంలో పడ్డాను.
కట్ చేస్తే...
నేను అమెరికా వెళ్ళిన మొదటి రోజులు.. అట్లాంటాలోని ఒక థియేటర్ లో టాంహ్యాంక్స్ నటించిన కాస్టెవే(The Castaway) సినిమా చూస్తున్నాను. సినిమా మొదట్లోనే చాలా వైవిధ్యమైన గొంతుతో “I am in Love” సాంగ్ ప్లే అవుతుంది నా పక్కన కూర్చున్న నేస్తం తన కాలు మీద దరువేస్తూ పాటను ఎంజాయ్ చేస్తున్నాడు. “ఇదేంపాట బాస్ నీకు తెలుసా ?” అని అడిగాను.. “ఏల్విస్ తెలీకపోవడమేంటి సూపర్ సాంగ్ అసలు.. ఇంటికెళ్ళాక వినిపిస్తాను లే..” అని చెప్పాడు. అదే సినిమాలో మరోచోట ఒక చిన్న పిల్లవాడికి సిడి ప్లేయర్ బహుకరిస్తూ “Listen to Elvis Presley’s CDs.. 50 million fans can’t be wrong” అని అంటాడు హీరో.. ఇంటికి వచ్చి కాస్త రీసెర్చ్ చేశాక ఆమాటలు చాలా కరెక్ట్ అనిపించింది.
Elvis Presley గురించి అప్పుడు మరికొంత తెలిసింది కానీ అప్పటికి ఇంకా ఇప్పటంతగా అంతర్జాలం మరియూ యుట్యూబ్ ప్రచారంలోకి రాలేదు కనుక కేవలం ఫ్రెండ్స్ దగ్గరో లేక లైబ్రరీలో కలెక్ట్ చేసిన సిడిలూ గట్రా వినేవాడ్ని తర్వాత వీడియోలు కూడా చూడగలిగే అవకాశం వచ్చింది. గమ్మత్తైన స్వరంతో ఉర్రూతలూగించే స్వరాల్తో స్ఫురద్రూపంతో ఆకట్టుకునే ఎల్విస్ కు 50 మిలియన్ ఫ్యాన్స్ పెద్ద నంబరేమీ కాదు అనిపించింది. తన సంగీతం ఇప్పుడున్న ప్రసారమాధ్యమాల నడుమ ఐతే మరింతమందిని చేరుకుని ఇంకా ఎక్కువ ప్రాచుర్యం పొంది ఉండేదని అనిపించింది. తన రూపమే మెస్మరైజింగ్ ఐతే కొన్నిపాటలకు సింపుల్ గా కులుకుతూ చేసే డ్యాన్స్ మరికొన్ని రాక్ సాంగ్స్ కు మనిషి అంతా చిత్రవిచిత్రంగా కదిలిపోతూ చేసే డ్యాన్స్ ఆకట్టుకుంటుంది. మన షమ్మీకపూర్ గారి డ్యాన్సులు చాలావాటికి ఎల్విసే పెద్ద ప్రేరణ అనుకుంటాను.
జనవరి 8th ఎల్విస్ ప్రెస్లీ జయంతి(పుట్టినరోజు) సంధర్భంగా శ్రద్ధాంజలిఘటిస్తూ ఈరోజు ఈటపా.. ఇదికాక రేపటినుండి ఒక వారం పాటు నా సరిగమల గలగలలు బ్లాగ్ లో నాకు పరిచయమున్న ఎల్విస్ పాటలలో నాకు బాగా నచ్చిన కొన్ని పాటలు లిరిక్స్ తో సహ పరిచయం చేద్దామని అనుకుంటున్నాను మీరూ ఆబ్లాగ్ లో చూసి/విని ఆనందించండి.
ఈ రోజు ప్రచురించేలా ఈ టపా ముందే స్కెడ్యూల్ చేయడమైనది. మరో రెండు రోజులు నాకు పరిమితమైన నెట్ యాక్సెస్ ఉండటం వలన వ్యాఖ్యలకు జవాబివ్వడం ఆలశ్యమవ్వవచ్చు కనుక వ్యాఖ్యాతలకు ముందస్తు ధన్యవాదాలు.
బాగున్నాయండీ, ర్యాగింగ్ అనుభవాలు, ముందస్తు ధన్యవాదాలు కూడా.
రిప్లయితొలగించండిఅవునూ, ఇక్కడ బ్లాగుల్లో సీనియర్లేవరూ మిమ్మల్ని ర్యాగింగ్ చెయ్యలేదా? :-) :-)
Thanks మురళి. హ హ బ్లాగ్ లోకంలో ఎవరూ ర్యాగింగ్ చేయలేదండి :)
రిప్లయితొలగించండిహహహ! మిమ్మల్ని చేసిన ర్యాగింగి బాగుంది వేణుగారూ! భలే భలే! ఎల్విస్ ప్రెస్లె గురించి విన్నాకానీ నేను యుఎస్ వచ్చిన కొత్తల్లో సమ్మర్ ఫెస్ట్ ఒకటి ఏర్పాటు చేసారు.అందులో ఒక అతను ఎల్విస్ ప్రెస్లీ లాగా గెటప్ వేసుకుని వచ్చి గిటార్ తెగ వాయిస్తూ భీభత్సం చేసాడు.నాకు ఆ పాటలు బాగ నచ్చాయి.సో! ప్రెస్లీ అంతకంటే బాగా పాడేవాడేమో! మీ టపా బాగుంది.ఆయన జన్మదినం గుర్తుపెట్టుకుని మరీ టపా రాసారు :)
రిప్లయితొలగించండిఇక్కడ రాసేసాననుకుంటున్నానండీ..."ఎల్విస్" పాటలు నాన్న చిన్నప్పుడు వింటూంటే మేమూ వినేవాళ్ళం...అప్పటి నుంచీ పరిచయం. "క్లిఫ్ రిచార్డ్స్" పాటలు విన్నారా? అవి కూడా చాలా బాగుంటాయి. వీలైతే వినండి.
రిప్లయితొలగించండిఇందు గారు నెనర్లు, బాగా పేరుపొందిన అమెరికన్ గెటప్స్ లో ఎల్విస్ ది ఒకటండీ.. కొన్ని హోటల్స్ ఇదే థీం తో కట్టినవి కూడా చూశాను ఫ్లోరిడాలాంటి ప్రదేశాల్లో..
రిప్లయితొలగించండితృష్ణ గారు నెనర్లు, క్లిఫ్ రిచర్డ్స్ పాటలు ఏవో కొన్ని విన్నానండీ..
హహహ! మిమ్మల్ని చేసిన ర్యాగింగి బాగుంది వేణుగారూ...పాపం మీరు అమాయకంగా కనిపించి ఉంటారు
రిప్లయితొలగించండిరాగ్గింగ్ పార్ట్ బాగుంది..మీరు ఎక్ష్ప్లైన్ చేసిన స్టైల్ బాగుంది.. :)..
రిప్లయితొలగించండినేను అసలు ఇంగ్లీష్ పాటలు ఎప్పుడు వినలేదు...
మీరు ఇంత explain చేసారు గ ఆయన గురించి..మీ బ్లాగ్ లో ని videos చూసాను..చాల బాగున్నాయి... :)
మీ ర్యాగింగ్ అనుభవాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు. :) నాకు ఇంగ్లీష్ పాటలతో పరిచయం చాలా తక్కువండి. మీవల్ల ఎల్విస్ గురించి తెలుసుకున్నాను.
రిప్లయితొలగించండిశివరంజని గారు నెనర్లు :-) అమాయకంగా కనిపించడమేమీ లేదండి ర్యాగింగ్ టైంలో ఎవరైనా ఒకటే..
రిప్లయితొలగించండికిరణ్ గారు నెనర్లు, ఎల్విస్ పాటలు మీకూ నచ్చినందుకు సంతోషం.
శిశిర గారు నెనర్లు, నేను వినేది తక్కువేనండి.. కొన్ని పాటలను మాత్రం పదే పదే వింటుంటాను.