కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా.. కన్నెపిల్ల కనిపిస్తే నాకోసం పడిఛస్తే నూటొక్క టెంకాయ కొడతానని మొక్కుకున్నా అని దాసరి గారు పాట రాసేశారు కానీ మా కోటయ్య బ్రహ్మచారి దేవుడు. అందుకే ఈ కొండమీద కానీ గుడిలో కానీ పెళ్ళిళ్ళు చేయరట. ఇక్కడి గుడి ముందు ద్వజస్తంభం కూడా ఉండదు. ఇంకా గుళ్ళలో ప్రసాదాలంటే లడ్డూలే గుర్తొస్తాయి కదా మా కోటప్పకొండ ప్రత్యేక ప్రసాదం నేతి అరిశలు. సాధారణంగా సంక్రాంతి రోజుల్లో తప్ప మిగిలిన టైంలో అంతగా వండుకోని ఈ నేతి అరిశలని గుళ్ళో ప్రసాదంగా భక్తులకు పంచి పెట్టడం నాకు తెలిసి ఇంకెక్కడా లేదు మా కోటప్పకొండలో తప్ప.
త్రికోటేశ్వరుడని కూడా పిలుచుకునే మా కోటయ్యంటే మాకు అమితమైన భక్తి. ఆ భక్తి తో పాటు తిరనాళ్ళంటే కూడా బోల్డంత అనురక్తి. ఐతే నేను కొండమీదకి వెళ్ళి స్వామిని దర్శించుకున్నది నాకు గుర్తుండీ రెండు మూడు సార్లకన్నా ఎక్కువ లేదు. మేం నర్సరావుపేటలో ఉన్న నా చిన్నతనంలో పండగంటే నా ఎదురు చూపులూ, నా పండగ అంతా ఊర్లో జరిగే హడావిడి గురించే ఉండేది.
విసనకర్రలకి తిరనాళ్ళకి ఏంటీ సంబంధం అంటారా. ఒకటి తిరనాళ్ళ టైమ్ లో పండగరోజు ఆ రాత్రి కోటప్ప కొండ దగ్గర ఉండే విశాలమైన మైదానంలో పెట్టని కొట్టూ దొరకని వస్తువూ ఉండేది కాదు. పండగ మర్నాడు వాటిలో చాలా కొట్లు తీస్కొచ్చి నర్సరావుపేటలో పెట్టేవారు. మార్కెట్ ఏరియా, చిత్రాలయ దగ్గర మొదలుపెట్టి కోటప్పకొండ రోడ్ లో చాలా దూరం రోడ్డు పక్కన ఈ తాత్కాలిక షాపులు వెలిసేవి. పండగకి రెండు మూడు నెలల ముందునుండే మాకు ఏం కావాలని అడిగినా "తిరణాలలో కొనుక్కుందాంలేరా" అనేసి వాయిదా వేసేసేది అమ్మ.
ఇక అసలు విసనకర్రలు ఎందుకు గుర్తొచ్చాయంటే శివరాత్రికి రెండు రోజుల ముందు నుండే ప్రభలు కొండ దగ్గరకి బయల్దేరేవి అవి ఊరుదాటేప్పుడు తిరిగి వచ్చేటప్పుడూ వాటికోసమని ఆ దారి కవర్ అయ్యే ఏరియాల్లో అన్నిట్లోనూ పగలంతా కరెంట్ తీసేసేవారు. దాంతో శివరాత్రి అంటే తిరణాల సంబరాలతో పాటు నాకు కరెంట్ కష్టాలు కూడా గుర్తొచ్చేవనమాట. ఇపుడు బహుశా ఊరు చుట్టూ రహదారి మార్గం హైటెన్షన్ వైర్లని తప్పించుకువెళ్ళే మార్గం ఏర్పాటు చేస్కుని ఉండి ఉంటారేమో కానీ ఓ ముప్పై ఏళ్ళ క్రితం మాత్రం ఇంతే ఉండేది.
నా చిన్నతనంలో వీటిని చూడ్డానికి మా నాన్న గారి చేయి పట్టుకుని చిత్రాలయ దగ్గరకి వెళ్ళడం ఎప్పటికీ మర్చిపోలేను. అక్కడ ఆ జనం హడావిడిలో వందలమంది ఉన్నా క్రమశిక్షణతో ఏ తొక్కిసలాట లేకుండా ప్రభలను జాగ్రత్తగా తీస్కెళ్ళేవాళ్ళు. గులామ్ లు చల్లుకుంటూ డప్పులు కొట్టుకుంటూ డాన్సులు వేసుకుంటూ వీటిని తీస్కెళ్ళే జనాన్ని ఆ కోలాహలాన్ని చూడ్డానికి నాకు రెండు కళ్ళూ సరిపోయేవి కాదు. ఇక కొండదగ్గరైతే చుట్టూ విశాలమైన మైదానంలో ఇసకేస్తే రాలనట్లుగా ఎటు చూసినా జనం, వాళ్ళమధ్యలో అక్కడక్కడా నుంచుని పైకి ఠీవిగా చూసే వందల కొద్ది ప్రభలను ఒకే చోట చూడడం ఓ అద్భుతం అంతే.
ఇలా ముందు రోజు సాయంత్రం ప్రభలను చూడ్డానికి వెళ్ళడం ప్రతి పండగకీ ఉంటుంది. ఒక సంవత్సరం మాత్రం నాన్నగారితో కలిసి కోటప్ప కొండ తిరణాలకి వెళ్ళడం ఒక మరిచి పోలేని అనుభవం. మామూలుగా ఉండే బస్ స్టాండ్ కి కొంచెం దూరం గా ఒక పెద్ద గ్రౌండ్ లో ప్రత్యేకం గా కర్రలతో కట్టిన క్యూలు, జనాన్ని కంట్రోల్ చేయడానికి పోలీసులూ వాలంటీర్లు ఏర్పాటు చేసి గుడి దగ్గరకి వెళ్ళే బస్సులకోసం ప్రత్యేకంగా ఓ మినీ బస్టాండ్ కట్టేసేవారు ఆ కొద్ది రోజులు. ఇక అక్కడ వాలంటీర్లు పోలీసులు చేసే హడావిడి ఆ ఎఱ్ఱ బస్సులు అవన్నీ ఓ అద్భుతమే అప్పట్లో.
మొత్తం మీద రాత్రంతా నిద్రమేలుకుని అక్కడక్కడే తిరిగేసి తెల్ల వారు ఝామున విపరీతమైన నిద్ర మత్తుతో జోగుతూ తిరుగు బస్ లో ప్రయాణం మొదలు పెట్టేవాళ్ళం. తెల్లగా తెల్లారాక పొద్దున్న పూజ అయ్యే వరకూ నిద్ర పోకూడదురా అని అంటూ నాన్నగారు నన్ను నిద్ర పోనివ్వకుండా బస్సు వెళ్తుంటే ఆ చుట్టు పక్కల తగిలే ఊర్లను చూపిస్తూ వాటి గురించి, అక్కడ వాళ్ళ అలవాట్ల గురించి, కొండ గురించి, తిరణాల గురించి, బస్ గురించి, కండక్టరు గురించీ, డ్రైవరు అదే పనిగా ఉపయోగించే గేర్ రాడ్ గురించీ ఒకటేమిటి సమస్తం కబుర్లు చెప్తూ నన్ను ప్రశ్నలు వేస్తూ మెలకువతో ఉంచేవారు.
ఇంటికి వచ్చాక సాయంత్రం కొనాల్సిన బొమ్మల గురించి ప్రాణాలికలు వేసుకుంటూ, అంతక్రితం ఏడాది స్కూల్ లో ఫ్రెండ్స్ దగ్గర చూసినవి, నిన్న రాత్రి కొండ దగ్గిర చూసినవి బోలెడన్ని బొమ్మలు గుర్తు చేసుకుంటూ వాటిలో ఏఏ బొమ్మలు ఖచ్చితంగా కొనాలో మనసులోనే టిక్ పెట్టేసుకుంటూ స్నాన పానాదులు ముగించేసి, "సాయంత్రం బోలెడన్ని మంచి బొమ్మలు ఒక్క కొట్లోనే అదీ మేం రిక్షా దిగిన దగ్గరలోనే దొరికేలా చూడు స్వామి" అని భక్తిగా ఈశ్వరుడికి దండం పెట్టేసుకుని బజ్జుంటే మళ్ళీ మధ్యాహ్నం భోజనానికే అమ్మ నిద్ర లేపేది.
ఇక బొమ్మలు కొన్నాక అమ్మ కోసం గాజులు, బొట్టుబిళ్ళలు, ఇంట్లోకి పసుపు, కుంకుమ లాంటివి తప్పకుండా కొనేవాళ్ళం వాటి సెలక్షన్ అంతా నాన్నదే అనుకోండి. ఆ తర్వాత మన ప్రయారిటీ తిండిమీదుండేది తిరణాలలో దొరికే తిండ్లంటే ఖచ్చితంగా బూందీ, పూసమిఠాయి(కరకజ్జం), పంచదార బెండ్లు, పంచదార చిలకలు మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే. ముఖ్యంగా బెండ్లు తిరణాలలో తప్ప మాములు స్వీట్ షాప్స్ లో ఇంకెక్కడా దొరకవు. ఇవయ్యాక తిరణాళ్ళ షాపింగ్ లో మరిచిపోకుండా ఇంటికి తిరిగి వచ్చేముందు ముఖ్యంగా కొనాల్సింది చెఱకు గెడలు.
అసలు చెఱకు తో నా ప్రణయం ఈనాటిది కాదు మొదటి సారి కోటప్ప కొండ తిరునాళ్ళలోనే మొదలైంది. ఆరోజు నుండీ ఈ రోజు వరకు ఆ ప్రేమ దిన దిన ప్రవర్ధమానమౌతున్నదే కానీ కొంచెం కూడా తగ్గలేదు. కోటప్పకొండ తిరణాళ్ళకు అప్పట్లో ఎక్కడ నుండి తెప్పించే వారో కానీ చెఱకు గెడలు భలే రుచిగా ఉండేవి. సాక్షాత్తు ఉయ్యూరు చక్కెర ఫాక్టరీకి వెళ్ళి తిన్నా కూడా ఆ రుచి మాత్రం నాకు ఇంకెక్కడా దొరకలేదు.

ఇంటికి వచ్చాక కొన్న బొమ్మలని అన్నిటిని అమ్మకి ఎలా ఆడుకోవాలో డిమాన్స్ట్రేట్ చేసి చూపించేసి ఆ తర్వాత చెఱకు పిప్పి వేయడానికి ఓ న్యూస్ పేపర్ పరుచుకుని దాని ఎదురుగా మఠం వేసుకుని కూర్చుని ఓ చెరుకు గెడ ముక్క చేతికందుకునే వాడ్ని. ఆ చెఱకు ముక్క ఒక చివర కచక్ మని కొరికి సర్ర్‍ర్‍ర్ర్ మంటూ చప్పుడొచ్చేలా ఒకేసారి 3-4 కణుపులు మీదుగా ఊడొచ్చేలా చెక్కును లాగేసి. ఆ క్రమంలో దానికి ఎక్కడైనా ఎక్కువ కండ పట్టిందేమో చూసుకుని ఒక వేళ పడితే దాన్ని కూడా నమిలేసి, రసం పీల్చేసే వాడిని.
![]() |
పంచదార బెండ్లు ఇలాగే ఉండేవి. |