శనివారం, సెప్టెంబర్ 28, 2019

వాల్మీకి...

వాల్మీకి నుండి "గద్దలకొండ గణేష్" గా ఈ సినిమా పేరు మార్చిన విషయం అందరికీ తెలిసినదే ఐనా నేను కొత్త పేరుతో సినిమాని పిలవదలచుకోలేదు. ఈ విషయంలో సినిమాకి అన్యాయం జరిగిందని అంటాను నేను. కేవలం ఒక సినిమాకి పేరు పెట్టడం వలన దెబ్బతినే ప్రతిష్ట కాదు వాల్మీకి మహర్షిది. ఈ విషయం ఆయన వారసులమని చెప్పుకుంటున్న వారికే తెలియక పోవడం శోచనీయం.

ఇలా చివరి నిముషంలో సినిమా రిలీజ్ ఆపేయడం వందలమంది సినీ కార్మికులకూ డిస్ట్రిబ్యుటర్స్ కూ నష్టం కలిగిస్తుంది. అందుకే ఇలాంటి అధికారం ఎవరికీ లేకుండా ఉండేలా ఒక చట్టం వస్తే బావుంటుందని నా అభిలాష. సినిమాలోని ఇలాంటి అభ్యంతరకరమైన విషయాల గురించి నిర్ణయాలు తీస్కోవడానికే కదా సెన్సార్ బోర్డ్ ఉన్నది. ఆ విషయాన్ని విస్మరించి అసలు సినిమాలో ఏముంటుందో తెలియకుండా ఎవరి ఇష్టానికి వాళ్ళు మనోభావాలు దెబ్బతీస్కోవడం, సినిమా రిలీజ్ ను ఆపేయ గలగడం సరికాదు. 

సరే అది పక్కనపెట్టి సినిమా విషయానికి వస్తే... దర్శకుడు కావాలనే తన కలను నిజం చేస్కోడానికి చిత్రసీమలో ప్రయత్నాలు చేస్తున్న అభిరామ్ (అధర్వ మురళి) అనుకోని పరిస్థితులలో ఓ సినీ దర్శకుడితో సంవత్సరం తిరిగేలోగా మంచి సినిమా తీసి చూపిస్తానని ఛాలెంజ్ చేస్తాడు. రొటీన్ సినిమాలు కాక విభిన్నమైన కథ కోసం ప్రయత్నిస్తూ గద్దలకొండ అనే ఊరిలో గణేష్ (వరుణ్ తేజ్) అనే ఓ కరడుగట్టిన రౌడీ గురించి తెలిసి అతని కథ ఐతే తన సినిమాకి సరిగ్గా సరిపోతుంది అనుకుంటాడు.

గణేష్ కథను వివరంగా తెలుసుకునే ప్రయత్నంలో అతని గ్యాంగ్ లోని వారితో పరిచయం పెంచుకోవడనికి ప్రయత్నిస్తూ తన గురించి ఆచూకీ తీస్తూ ఉండగా అనుమానాస్పద పరిస్తితులలో గణేష్ చేతికి చిక్కుతాడు. ఆ తర్వాతేమైంది గణేష్ అభిని చంపేశాడా లేదా అభి కన్విన్స్ చేసి గణేష్ కథ తెలుసుకుని సినిమా తీశాడా ఇత్యాది విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాలి.

వాల్మీకి పూర్తిగా వరుణ్ తేజ్ సినిమా. ’ముకుంద’ తో మొదలు పెట్టి వైవిధ్యమైన కథలు ఎన్నుకుంటున్నా కానీ ఇప్పటి వరకూ తొలిప్రేమ, కంచె, ఫిదా లాంటి పోష్ యూత్ రోల్స్ వేసిన వరుణ్ ఒక్కసారిగా నలభై నలభైఐదేళ్ళ రౌడీగా మారిపోయిన తీరు చూసి మెచ్చుకోని వారు ఉండరు. పాత్ర కోసం తన ఆహార్యం అభినయం మార్చుకున్న తీరు హ్యాట్సాఫ్. ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించి తీరుతుంది.

వరుణ్ తేజ్ మిడిల్ ఏజ్ రౌడీగా మీసాలు గడ్డాలతో క్రౌర్యంగా ఉన్నా కూడా తరచి చూస్తే మొహంలో ఎక్కడో తెలియని సున్నితత్వం కాస్త కనపడుతూ ఉంటుంది. అదే ఈ సినిమా కథకి ప్లస్ అయిందనిపించింది. గణేష్ ఎంత క్రూరుడైనా అతనిలోనూ అమ్మ ప్రేమ కోసం పరితపించే ఓ కొడుకూ, ప్రేమ కోసం అన్నిటిని వదిలేయడానికి సిద్దపడ్డ ప్రేమికుడూ, ప్రేయసిని మర్చిపోలేక ఒంటరిగా మిగిలిపోయిన భగ్న ప్రేమికుడు లాంటి సున్నితమైన ఎమోషనల్ పార్శ్వాలూ ఉన్నాయి. అవే కథ చివరికి వచ్చేసరికి అతనిలోని మనిషి తనలోని రాక్షసుడ్ని గెలవడానికి సహకరించాయి అనిపిస్తుంది. దీనికి అనువైన సీన్స్ కూడా హరీష్ చక్కగా రాసుకున్నాడు.

కామిక్ ఎంటర్టైన్మెంట్ అనేది హరీష్ శంకర్ సినిమాలకి పెట్టని కోట. ’షాక్’ తర్వాత ఇప్పటి వరకు తీసిన సినిమాలన్నిటిలో దీనికే పెద్ద పీట వేశాడు. వాల్మీకి లో కథకనుగుణంగా కాస్త మోతాదు తగ్గించినా తన మార్క్ ఎలివేషన్ సీన్స్, కొన్ని సన్నివేశాల్లో కామెడీ పండించాడు. ఒకటి రెండు చోట్ల వచ్చే అడల్ట్ హ్యూమర్ ఫ్యామిలీ ఆడియన్స్ ని కాస్త ఇబ్బంది పెట్టచ్చు కానీ నవ్వించింది. ఫ్ల్యాష్బాక్ గా వచ్చే పూజా హెగ్డే ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది. ఇక డైలాగ్స్ లో హరీష్ విట్టీ లైన్స్ కి వన్ లైనర్స్ కి లోటే లేదు. అవడానికి ఇది ఒక రౌడీ కథే అయినా ఇందులో సినిమా మేకింగ్ గురించి అదే పాషన్ తో బతికే వారి గురించి రాసుకున్న చాలా సన్నివేశాలకు సినీ రంగంలో ప్రయత్నాలు చేస్తూ ఉన్నవాళ్ళు బాగా కనెక్ట్ అవుతారు అందుకే ఒకరకంగా ఇది సినిమా గురించిన కథ కూడా.

టైటిల్ కార్డ్స్ లో వేటూరి గారి పేరు చూసి ఒక్క క్షణం ఆశ్చర్య పోయి "వాహ్ హరీష్" అని అనుకున్నాను. మాటలు-మార్పులు-దర్శకత్వం హరీష్ అనే టైటిల్ కార్డ్ కూడా ఇంట్రస్టింగ్ గా అనిపించింది. రీమిక్స్ పేరుతో "ఎల్లువొచ్చి గోదారమ్మ" పాటను ఇష్టం వచ్చినట్లు మార్చేయకుండా సుశీల గారి స్వరాన్ని యథాతథంగా వాడుకుని బాలుగారితో మళ్ళీ పాడించి రీమాస్టర్ చేయడమే కాక కొరియోగ్రఫీ కూడా ఒరిజినల్ నే ఫాలో అవడం బావుంది, హరీష్ కి సినిమాల మీద ఉన్న గౌరవాన్ని చూపించింది. దీనికి అనుగుణంగా పాట చుట్టూ అల్లుకున్న సన్నివేశం బావుంది.  

వరుణ్ నటన, హరీష్ టేకింగ్ తర్వాత సినిమాలో ప్రముఖంగా చెప్పుకోవాల్సినది అయనాంక బోస్ సినిమాటోగ్రఫీ చాలా చోట్ల చక్కగా ఆకట్టుకుంటుంది. అలాగే సంగీత దర్శకుడు "మిక్కీ జె మేయర్" ’మహానటి’ సినిమాతో తన వెర్సటాలిటీని ఇదివరకే ప్రూవ్ చేసుకున్నా కానీ తన శైలికి పూర్తి ఆపోజిట్ స్టైల్ లో ఈ సినిమాకి కంపోజ్ చేసిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా సన్నివేశాలని ఎలివేట్ చేసింది. పాటలలో "జర్ర జర్రా" పాట మాస్ ప్రేక్షకులని ఆకట్టుకుంటే "గగన వీధిలో" అనే మెలోడీ మంచి సాహిత్యంతో థియేటర్ నుండి బయటకి వచ్చాక కూడా హమ్ చేయిస్తుంది.

నటీనటులలో "అధర్వ మురళీ" తెలుగబ్బాయి కాదనే విషయం గుర్తురాదు అంతగా మెప్పించేశాడు. అతని ఫ్రెండ్ గా చేసిన సత్య ఎంటర్టైన్ చేశాడు. డబ్ స్మాష్ స్టార్ "మృణాలిని రవి" బుజ్జమ్మ పాత్రలో క్యూట్ గా ఉండి ఆకట్టుకుంది. ఇక "పూజా హెగ్డే" ఎయిటీస్ లోని టిపికల్ టీనేజ్ అమ్మాయిగా లంగావోణీలలో చాలా బావుంది. "ఎల్లువొచ్చే గోదారమ్మా" పాటలో శ్రీదేవికి సరితూగడం అసాధ్యమైనా కానీ పర్లేదు పాసైపోయింది. ఇక మిగిలిన తారాగణంలో అన్నపూర్ణమ్మ, సుప్రియా పాఠక్, తనికెళ్ళ భరణి, రచ్చ రవి, హాపీడేస్ ఫేం "వంశీ చాగంటి" ప్రత్యేకంగా నిలిచారు. తనికెళ్ళ భరణి గారి సన్నివేశాలు చాలా బావున్నాయ్. రచ్చ రవి కామెడీకే పరిమితమవకుండా మంచి రోల్ లో మెప్పించాడు. బ్రహ్మాజీ కామెడీ ఫర్వాలేదనిపిస్తుంది.
 
ఒక మామూలు మనిషి మహా రుషి గా మారి రామాయణం రాసిన కథ వాల్మీకి మహర్షిదైతే, ఓ కరుడుగట్టిన రౌడీ కళాకారుడిగా మారి తన పేరు చెబితేనే భయంతో పారిపోయే జనాల ప్రేమను గెలుచుకున్న కథే ఈ వాల్మీకి సినిమా. అన్ని కమర్షియల్ హంగులూ సమపాళ్ళలో కుదిరిన ఈ సినిమా కమర్షియల్ ప్రేక్షకులను తప్పక ఎంటర్టైన్ చేస్తుంది. 
 
రొటీన్ ప్రేమ కథలే కాకుండా వైవిధ్యమైన కథలను కూడా కమర్షియల్ ఫార్మాట్ లో తెరకెక్కించవచ్చు అని నిరూపించిన సినిమా వాల్మీకి. జిగర్తండా చూసిన వారికి కాస్త గాడి తప్పినట్లుగా అనిపించినా అందులో తమిళ్ నేటివిటీ మరీ ఎక్కువైందనిపించిన వాళ్ళకి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. అసలు జిగర్ థండా చూడని వాళ్ళకి ఈ సినిమా నచ్చుతుందనడంలో ఏ సందేహం లేదు. ట్రైలర్ ఇప్పటికే చూసి ఉండకపోతే ఇక్కడ చూడవచ్చు.
 

ఈ సినిమాలో నాకు నచ్చిన సంభాషణలను కొన్నిటిని క్రింద పొందుపరుస్తున్నాను. దయచేసి ఈ సినిమా చూడని వాళ్ళు సినిమా చూసేప్పుడు ఫీల్ మిస్ అవ్వకూడదంటే చదవకుండా ఉండటం శ్రేయస్కరం.
"కామెడీ చేయగలిగిన నటుడు  ఏదైనా చేయగలడు."

"డబ్బొచ్చే పని చేస్తే సుఖంగా బతుకుతావ్ నీకు నచ్చిన పని చేస్తే సంతోషంగా బతుకుతావ్."

"అందుకే పెద్దోళ్ళు చెప్పిర్రు నాలుగు బుల్లెట్లు సంపాయిత్తే రెండు కాల్చుకోవాలె రెండు దాచుకోవాలె."

"రేయ్.. నా పైన పందాలేస్తే గెలుస్తరు.. నాతోటి పందాలేస్తే సస్తరు.."

"కళ్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు.. ఏమంటావ్.. ఏమంటానండీ నాకు మాత్రం కళ్యాణమంటే కక్కొచ్చేలా చేశారు.."

"ఏం మనుషులంరా.. సుఖంగా బతుకుడు ఇడిసిపెట్టీ సుఖంగా చస్తే చాలనే కాడికొచ్చినం."

"మనం బ్రతుకుతున్నామని పది మందికి తెలవకపోతే ఇంక బ్రతుకుడు ఎందుకురా."

"మనుషులంతా శానా పైసల్ సంపాయిస్తరు కానీ నేను శానా భయం సంపాయించినా." 

"జిందగీ మంచిదికాద్ తమ్మీ ఉత్త గీతలే మన చేతిల ఉంటయ్ రాతలు మన చేతిల ఉండయ్."

"అన్నీ మర్చిపోటానికని మందేస్తాం కానీ మందేసినంకనే అన్నీ గుర్తుకస్తయ్."

"ఎక్కువ ఆగం చేసేటోడు ఏదో రోజు ఆగమైపోతాడు."

"నమ్మకం ప్రాణం లెక్క తమ్మీ ఒక్కసారి పోతే మళ్ళా రాదు."

"గవాస్కర్ సిక్స్ కొట్టుడు బప్పీలహరి పాట కొట్టుడు నేను బొక్కలిరగ్గొట్టుడు సేమ్ టు సేమ్ గదే ప్యాసన్."

"నీకు ఆకలేస్తే కోడిని కోస్తావ్ నీ పిల్లలు మా అయ్య మంచోడూ అనుకుంటారు కానీ కోడి పిల్లలు మా అయ్యని చంపిన రాక్షసుడు అనుకుంటాయ్. మర్డర్ ఒకటే తమ్మీ ఇటుసైడ్ న్యాయం అటుసైడ్ అన్యాయం."

"ఆవేశం ఆలోచనలనే గాదు అవకాశాలను కూడా చంపేస్తుంది."

"ప్రతి అవకాశంలోనూ కష్టం ఉంటుంది. మనం కష్టాన్ని దూరం చేయాలనుకుంటాం కానీ మనకు తెలియకుండానే అవకాశం దూరమైపోతుంది."

"ఈ పని మానేసి ఇంకో పని చేయడం కాంప్రమైజ్. ఇదే పనిని ఇంకోలా చేయడం అడ్జస్ట్మెంట్."

"నిజమైన ప్రేమ దొరికితే ఎవరైనా మారిపోతారు."

"మనం బతికినంతకాలం మనకి భయపడేటోళ్ళు మన సావు కోరతారు గానీ బాగు కోరుకోరు."  

"సైన్మా పైసలిస్తదని ఇన్నా, పేరు ఇస్తదని ఇన్నా కానీ ఇంత ప్రేమనిస్తదని ఎప్పుడు ఇన్లా."

10 కామెంట్‌లు:

  1. ఆ రోజుల్లో కాబట్టి మన పెద్ద వంశీగారు బ్రతికిపోయారు..ఇప్పుడైతే "శ్రీ కనక మాలక్షీ రికార్డింగ్ డాన్స్ ట్రూప్" అని పెట్టినందుకు వైజాగ్ వాసులందరూ ధర్నాలు చేసేవారేమో..నైస్ ఆర్టికల్ అండి..బా రాశారు..ఐయాం మోర్ ఫాన్ ఆఫ్ జిగర్తండా..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హహహ అంతేకదండీ మరి బాగా చెప్పారు. నిజమేనండీ జిగర్తండా బాగా నచ్చిన వాళ్ళకి ఈ సినిమా నచ్చకపోవచ్చు. అది మోర్ టువర్డ్స్ ఆర్ట్ ఫిల్మ్ మేకింగ్ స్టైల్ అనిపిస్తుంది ఇది పక్కా మాస్.

      తొలగించండి
    2. అది కూడా ఆర్ట్ ఫిల్మ్ లా లేదు..మాసీ గానే తీశారు..

      తొలగించండి
    3. అర్ట్ ఫిల్మ్ అని కాదండీ నా ఉద్దేశ్యం ఆ స్టైల్ మేకింగ్ అని.. తమిళ్ నేచురాలిటీ నేటివిటీ ఎక్కువ అని.

      తొలగించండి
    4. బైద వే థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారూ..

      తొలగించండి
  2. నాకలా అనిపించ లేదండి..అంతే కాదు..యెల్లువొచ్చి గోదారమ్మ సాంగ్ హరీష్ గారికి పాట పట్ల గౌరవమున్నా..అసలలాంటివి యెటెంప్టే చెయ్యకూడదు అన్నది అనేది నా ఉద్దేశం..ఓవరాల్ మూవీ కూడా బాలేదు..

    రిప్లయితొలగించండి
  3. Good review. The title valmiki was symbolic of a person's transformation. Harish Shankar deserves a pat for such thoughtful title. Limiting a mythological poet to a caste is insane.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. " Limiting a mythological poet to a caste is insane."
      Yes. Also note that the seer Valmiki is incidentally a brahman. He is the son of seer Prachetasa.

      తొలగించండి
    2. పై ఇద్దరు అజ్ఞాతలకు ధన్యవాదాలు.

      తొలగించండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.