అమ్మ జ్ఞాపకాల కబుర్లు
చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.
అందమైన బాల్యం
మధురమైన జ్ఞాపకాలతో అందమైన బాల్యాన్ని నా సొంతం చేసినందుకు అమ్మానాన్నలకు ఎప్పుడూ ఋణపడి ఉంటాను. మొదటి సంతానాన్నవడంతో నేనాడిందే ఆట పాడిందే పాట అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళినా మా ఇంట్లో అయినా అపురూపంగా గడిచింది. పాడుకున్న పాటలు, ఆడుకున్న ఆటలు, స్కూల్ ఎగ్గొట్టడానికి వేసిన వేషాలు, తిన్న చిరుతిళ్ళు, నాన్న వేలు పట్టుకుని కొట్టిన షికార్లు, 16mm సినిమాలు కబుర్లు ఇక్కడ చదవచ్చు.
ఇంటర్మీడియెట్ హాస్టల్ కబుర్లు
నూనూగు మీసాల నూత్న యవ్వనం అమ్మానాన్నలకు దూరంగా నాదంటూ ఓ స్వంత ప్రపంచం. అప్పటివరకూ ప్రతి చిన్న పనికి వాళ్ళమీద ఆధారపడి ఒక్కసారిగా నాకు నేనే నెగ్గుకు రావాల్సిన పరిస్థితులను తలుచుకుని దిగులు. అంతలోనే చుట్టూ ఉన్న స్నేహితులతో నేస్తం కట్టేసి చేసిన అల్లర్లు, పరోఠాల బిజినెస్సులు, చెరకుతోట దొంగతనాలు, ఆడ్మినిస్ట్రేటర్ కి మస్కాగొట్టి చూసిన సినిమాలు, సరదా కొంటె కబుర్లు ఇక్కడ చూడండి.
ఇంజనీరింగ్ కాలేజ్
ఇంటర్మీడియెట్ కి రెసిడెన్షియల్ హాస్టల్ కనుక పంజరంలో పక్షిలా బతికితే ఇంజనీరింగ్ కాలేజ్ యూనివర్సిటీ హాస్టల్స్ లోకి వచ్చేసరికి ఒక్కసారిగా జూలోనుండి పచ్చని అడవిలోకి వదిలేసిన జింక పరిస్థితే అయింది, ఎక్కడికి పరుగులెట్టినా ఏం చేసినా అడిగేవాళ్ళులేరు. అసలు హాస్టల్ బిల్డింగ్ లో నిరంతరం కాపుకాసే వార్డెన్ ఉండడనే విషయం నాకు డైజెస్ట్ కావడానికి నెలపట్టింది :-) నిజమా అలా ఎలా సాధ్యం అని ఇప్పటికీ అనిపిస్తూనే ఉంటుంది. అంతటి స్వేఛ్చాప్రపంచంలో చేసిన అల్లర్లు కొన్ని కబుర్లు ఇక్కడ.
సినిమాలు రివ్యూలు..
నాకున్న అతి పెద్ద వ్యసనం సినిమా చూడడం రిలీజైన ప్రతి అడ్డమైన సినిమా చూసేసి ఈబొమ్మలో చూపించినట్లు తెలుగు సినిమాని భుజాల మీద మోసేవాళ్ళలో నేనొకడ్ని. చూసి ఊరుకోకుండా ఇది ఇందుకు బాలేదు అది అందుకు బాగుంది అంటూ పేద్ద వంద సినిమాలు తీసేసి విశ్రమిస్తున్న మేధావిలా చేసే విశ్లేషణలు :-) హహహ చదివిన ఒకరిద్దరు అలా తిడతారు కానీ నా దృష్టిలో ఒక సాధారణ సినీ ప్రేక్షకుడు చూసొచ్చి మిత్రులతో చెప్పే కబుర్ల లాంటి నా సినీ రివ్యూలు ఇక్కడ చదవండి. ఆరెంజ్, ఖలేజా, కృష్ణం వందే జగద్గురుం లాంటివి కొన్ని ఎక్కువమంది ఆదరణ పొందాయ్.
శనివారం, ఫిబ్రవరి 01, 2014
కౌముది లో నేను...
బుధవారం, జనవరి 22, 2014
అమ్మ పెంపకం...
ఒకోసారి అమ్మ సమయానికి వచ్చేది కానీ "ఈ రోజు సినిమాకి వెళ్ళట్లేదు రేపు వెళ్తున్నాం" అని చెప్పేది ఎందుకంటే "అదంతే నేను మనసు మార్చుకున్నాను ఈరోజు నాకు చూడాలని లేదు" అనేది లేదంటే నాన్నకి ఏదో ఒక పని చెప్పి బయటకి పంపి ఇక ఈరోజుకి కుదరదనేది. ఇంకొంచెం పెద్దయ్యాక నన్ను ఒక్కడ్నే సినిమాకి పంపిస్తానని చెప్పి తర్వాత నాన్నని కూడా తోడు తీస్కెళ్ళమనేది లేదంటే పంపిస్తానన్న రోజు కాక మరుసటి రోజో కొన్నాళ్ళు ఆగో వెళ్ళమనేది. ముఖ్యంగా హైస్కూల్ కి వచ్చాక ఇలా జరుగుతుండేది.
అమ్మ మాటలు విన్నాక స్థిమితంగా కూర్చుని ఆలోచించి చూస్తే నిజమే కదా అనిపించింది ఆ తర్వాత ఎలాంటి నిరాశనైనా సమర్దంగా ఎదుర్కోగల ఆత్మస్థైర్యం అలవర్చుకున్నాను పెద్ద పెద్ద డిజప్పాయింట్మెంట్స్ కి కూడా అంత తీవ్రంగా బాధపడలేదు ఇక చిన్న చిన్న వాటినైతే పట్టించుకోవడం కూడా మానేశాను. అంతేకాక సరదాగా అప్పుడప్పుడు నన్ను నేను టెస్ట్ చేస్కోడానికి ఒకోసారి లాస్ట్ మినిట్ లో నేనే పోస్ట్ పోన్ చేసేసేవాడ్ని.
ఇలా చాలా విషయాలలో మమ్మల్ని అమ్మ గారం చేస్తూనే కొన్ని విషయాలలో అంతే స్ట్రిక్ట్ గా కట్టడి చేస్తూ జాగ్రత్తగా పెంచిందనిపిస్తుంటుంది. కానీ అప్పుడంత కఠినంగా ఉన్నా అమ్మమీద ఎంత కోపమొచ్చినా అలకొచ్చినా కొంచెం సేపటిలోనే మొత్తం కరిగిపోయేది... ఎలా తెప్పించేదో అలాగే ఏదో ఒక మాయ చేసేసి ఆ కోపాన్ని అలకని కూడా తగ్గించేసేది. కానీ ఐదేళ్ళక్రితం సరిగ్గా ఇదే రోజు జనవరి 22 న మమ్మల్ని శాశ్వతంగా వదిలి వెళ్ళిపోయి తెప్పించిన దిగులుని మాత్రం ఎంతగా అలిగినా ఇంతవరకూ తగ్గించలేకపోయింది. ఐదేళ్ళైనా అపుడపుడు తలచుకున్నపుడు ఇంత పెద్దవాడ్నికూడా ఈ సినిమాలో ఈషాన్ అంత అయిపోయి "भीड़ में, यूँ ना छोड़ो मुझे... क्या इतना बुरा हूँ मैं माँ... क्या इतना बुरा मेरी माँ" అని అడగాలనిపిస్తుంటుంది. Music By: शंकर एहसान लॉय
Lyrics By: प्रसून जोशी
Performed By: शंकर महादेवन
బుధవారం, జనవరి 01, 2014
నూతన సంవత్సర శుభాకాంక్షలు :-)
మంగళవారం, నవంబర్ 19, 2013
నమస్తే తెలంగాణ పేపర్ లో నేను
శనివారం, నవంబర్ 02, 2013
నల్లజర్ల రోడ్ గురించి నేను
శనివారం, అక్టోబర్ 05, 2013
అత్తారింటికి దారేది
పవన్ ని కూడా అతని గత చిత్రాలలోలాగా అక్కర్లేని సీన్స్ లో కూడా ఎగురుతూ గెంతుతూ హైపర్ ఎనర్జీతో యాక్ట్ చేయనివ్వకుండా ఎక్కడ తన కోపాన్ని ప్రదర్శించాలో ఎక్కడ తగ్గి ఉండాలో కాలిక్యులేటెడ్ గా చాలా బాలెన్స్డ్ గా నటింపచేశాడు. ఇక క్లైమాక్స్ సీన్స్ లో అయితే తన నటనతో డైలాగ్ డెలివరీతో త్రివిక్రమ్ పదునైన డైలాగ్స్ తో రాసిన ఎమోషనల్ క్లైమాక్స్ ని యథాతథంగా మనముందు పెట్టి చూపించి అందరినీ మెప్పించగలిగాడు.
ఈ సినిమాపై త్రివిక్రమ్ అభిమానులు చేస్తున్న మేజర్ కంప్లైంట్ పక్కవాడ్ని కొట్టి కామెడీ పుట్టించడమేంటి అని. త్రివిక్రమ్ హీరోలెపుడూ తమ కారెక్టరైజేషన్ ని బట్టి నడుచుకుంటూ ఉంటారు, నువ్వేనువ్వేలో కుర్రాడు ఫిలాసఫీలు చెప్పినా, అతడులో హిట్మాన్ తక్కువ మాటాడినా, ఖలేజా లో టాక్సీ డ్రైవర్ అయిన హీరో బూతులు మాట్లాడినా తన పాత్రకి తగ్గట్టు సహజంగా ప్రవర్తించారు. “లక్ష కోట్లా !! ఎన్ని సున్నాలుంటాయ్ ?” “వాడి వాచ్ అమ్మితే మీ బ్యాచ్ సెటిలైపోద్ది చాలా..”“గాలొస్తుందని మనమే తలుపు తెరుస్తాం.. దాంతో పాటే దుమ్ముకూడా వస్తుంది..”“బుల్లెట్ అరంగుళమే ఉంటుంది కానీ ఆరడుగుల మనిషిని చంపుతుంది.. అదే బుల్లెట్ ఆరడుగులుంటే ఎలా ఉంటుందీ.. నా మనవడు గౌతం నందా అలా ఉంటాడు.”“నీ టెబుల్ మీద యాపిల్ తింటే బలమొస్తుందిరా అదే పక్కనోడి యాపిల్ కొట్టేద్దామంటేనే ఇదిగో ఇలా బలవంతంగా తీసుకు రావాల్సొస్తుంది.”“ఆనందం ఎలా ఉంటుందిరా.. వెతుకు.. డబ్బులో ఉంటదా.. అమ్మాయిలు తిరిగే క్లబ్బులో ఉంటదా లేదంటే వాళ్ళ ఒంటిమీద జారే సబ్బులో ఉంటదా..”“రేయ్.. సింహం పడుకుందికదా అని చెప్పి జూలుతో జడేయకూడదురా.. అలానే పులి పలకరించింది కదా అని పక్కన నిలబడి ఫోటో తీయించుకోకూడదు రోయ్..”“ఆడపిల్లరా అదీ.. అభిమానముంటుంది..” “కొడుకుని నాన్నా నేను.. కోపముంటుంది”“వద్దనుకుని వదిలేసి ఒడ్డుకెళ్ళి ఏడుద్దామా.. కొంచెం కష్టమైనా సరే మోస్కుని తీస్కెళ్ళి జీవితాంతం నవ్వుదామా?”“ఇదే సార్ హైడ్రాబాడ్.. ఇక్కడ ట్రాఫిక్ చాలా బాడ్.. పెద్దమ్మతల్లి ఫేమస్ గాడ్”“ఇదివరకూ ఉంగరాల జుట్టుండేది.. ఇపుడు ఉంగరాలన్నీ వేళ్ళకొచ్చేసి జుట్టు ప్లెయిన్ అయిపోయింది”“రాముడు సముద్రం దగ్గరికి వెళ్ళాక బ్రిడ్జెలా కట్టాలో ప్లాన్ చేశాడు కానీ అడివిలో కూర్చుని బ్రిడ్జిప్లాన్ గీస్కుని సముద్రం దగ్గరికి వెళ్ళలేదు..”“అత్తని తీస్కురావడమెలాగ అని నేనేమైనా పుస్తకం రాశానా.. ఏవనిపిస్తే అది చేస్కుంటూ వెళ్ళిపోడమే..”“డబ్బిస్తే కారిచ్చేస్తారా?" "ఏం వార్నింగ్ కూడా ఇవ్వాలా?”“మంచి వాళ్ళని హర్ట్ చేస్తే ఏడుస్తారు.. నాలాంటి వెధవల్ని హర్ట్ చేస్తే ఏడిపిస్తారు.. దానిదగ్గర ఖర్చీఫ్ లేని టైం చూస్తాను డెఫినెట్ గా కన్నీళ్ళు పెట్టిస్తాను.”“ఐదుకిలోమీటర్లు వెళ్తే ఇంకా మంచి హాస్పటల్ ఉంది అక్కడ జాయిన్ చేయచ్చుగా.. రెండుకిలోమీటర్ల లోపు స్మశానం కూడా ఉంది.. కొంచెం లేటైతే అక్కడకెళ్ళాల్సొచ్చేది.. కరెక్ట్ టైంకి తీస్కొచ్చాడు, యూ బెటర్ థాంక్ హిమ్”“చేతులు పట్టుకు థాంక్స్ చెబుతుందనుకున్నాను కాలర్ పట్టుకుని కరిచేస్తందేంటండీ ?" "ఆవిడ ఆగి ఆలోచించే మనిషైతే మనం ఇంతదూరం రావాల్సిన అవసరమేముంది బాలూ.”“అంత పొసెసివ్ అయితే ఆడపిల్లలని కనకూడదండీ ఒకవేళ కన్నా డాన్సులవీ చేయించకూడదు.. వాళ్ళు చూపిస్తేనేమో గ్లామరూ.. మేం చూస్తేనేమో వల్గరూ.. ప్రాణాలు తోడేస్తున్నారనుకోండి”“ఇలాగే కంట్రోల్ చేసి చేసి ఏ ఐఐటీ ఇంజనీరో అని ఏ శాడిస్ట్ కో ఇచ్చి కట్టబెడతారు.. వాడు తెలివితేటలన్నీ వీళ్ళని టార్చర్ చేయడానికి ఉపయోగిస్తాడు.. అప్పుడు తెలిసొస్తది”“అబ్బో మీ ఐ బ్రోస్ అండీ రివర్స్ లో ఉన్న నైకీ సింబల్ లా ఏం తిప్పారండీ”“ఆల్టర్నేటివ్స్ లేనపుడు పక్కనోళ్ళని క్రిటిసైజ్ చేయకూడదు రోయ్ కాలిపోద్ది”“జీతాలిచ్చేవాడి మీద జోకులేస్తే ఇలాగే జీవితం తలకిందులైపోద్ది”“నేను కత్తిలాంటోడ్నిరా కూరగాయలూ తరుగుతా మెడకాయలూ నరుకుతా నాకు ఎమోషన్స్ ఉండవు డ్యూటీ తప్ప”“ఏడిస్తే ఎత్తుకున్నాను కదా అని ఎదిరిస్తే తోలు తీసేస్తాను”“తెగిపోయేటప్పుడే దారం బలం తెలుస్తుంది.. విడిపోయేటప్పుడే బంధం విలువ తెలుస్తుంది”“నీ అదృష్టం మెయిన్ డోర్ తట్టిందిరా.. కానీ దరిద్రం మాష్టర్ బెడ్రూంలో ముసుగుతన్ని పడుకునుంది”“ఆ కళ్ళు చూడండి.. ఆకళ్లలోకి ఏ మగాడికైనా సరే లప్ అని దూకి ఫుల్లుగా ఈత కొట్టేయాలనిపిస్తుంది”“సగం కట్టేసి వదిలేసిన బిల్డింగ్ లాంటి నీకే అంత పొగరుంటే ఏడంతస్థులమేడని నాకెంత పొగరుండాలి”“ఏయ్ శశి.. రాక్షసి.. గిన్నెకి పట్టిన మసి..”“భయమున్నోడు అరుస్తాడు.. బలమున్నోడు భరిస్తాడు”“అమ్మితే కొనుక్కో అది వ్యాపారం.. లాక్కోవద్దు అది దౌర్జన్యం..”“ఆడికి మనిషిని చంపేంత ధైర్యంలేదు మనిషికోసం చచ్చేంత కమిట్మెంటూ లేదు”“ఒంట్లో పట్టు తగ్గగానే మీ తాతకి పట్టుదల తగ్గిందా”“నాకు మీమీదేం కోపం లేదు.. ఎందుకంటే అందుకు మిమ్మల్ని నేను గుర్తుపెట్టుకోవాలి.. అది నాకు ఇష్టంలేదు”“ఫ్లడ్ లైట్లేసున్న స్టేడియంలో దాగుడు మూతలాడుతూ దొరికిపోయాం”“ఈ ఆడపిల్లలకి అసలు టేస్ట్ లేదురా టీవీ యాంటెన్నాకి టీషర్టేసినట్లున్నాడు వెళ్ళి ఆడ్ని లవ్ చేస్తుంది”“అది ఎదురైతే దరిద్రం.. తగిల్తే తద్దినం”“నిజం డివిడిలో సినిమాకాదండీ, ఎప్పుడుపడితే అపుడు పాజ్ నొక్కేయడానికి.. థియేటర్లో సినిమా.. ఒక్కసారి మొదలెట్టామంటే శుభంకార్డ్ పడేదాకా తెరదించకూడదు అంతే”“నిజం నిప్పులాంటిది చెప్పేవాడికి కాల్తది కానీ వినేవాడికే వెచ్చగా ఉంటది” (నిజం తెలిసిన విలన్స్ అటాక్ చేశాక) “ఇప్పుడర్ధమైందా.. నిజం చెప్పేవాడికి కాలుద్దీ.. వినేవాడికి మండుద్ది..”“ఆగిపోయే పెళ్ళికి హడావిడెక్కువ అనీ..”“చదరంగంలో రాజు కూడా నీలాగే ముసలాడు ఎటేపైనా ఒక్కడుగు మాత్రమే వేయగలడు అయినా వాడ్నే కింగ్ అని ఎందుకన్నారంటే పక్కనే పవర్ఫుల్ మినిస్టర్ ఉన్నాడు కాబట్టి”“ఇది నా పొగరు.. దాన్ని ముట్టుకుంటే నన్ను కొట్టినట్టే.. పెట్టుకుంటే సచ్చినట్టే”“పాము పరధ్యానంగా ఉందని పడగమీద అడుగేయకూడదు రోయ్..ఆ..”“ఒక్కడ్ని కొడితే అయినట్లేనా.. నాదగ్గర ఉన్నోళ్ళు ఒక్కొక్కడు కరెంట్ తీగతో ఉయ్యాలూగుతాడొరేయ్..”“కానీ పవర్ ప్లాంట్ తో పేకాడకూడదురోయ్ పేలి పోతారు”“నీ బిడ్డది పెళ్ళే.. కానీ ఆ బిడ్డది చావు.. ఏది పెద్దకష్టం?... నా కొశ్చన్ లో క్లారిటీ ఉంది నీ ఆన్సర్ లో షూరిటీ ఉంటుందా?”“చూడప్పా సిద్దప్పా.. నేనోమాట చెప్తాను పనికొస్తే ఈడ్నే వాడుకో గుర్తుకొస్తే ఏడ్నైనా వాడుకో.. నేను సింహం లాంటోడ్నబ్బా.. అది గడ్డం గీస్కోలేదు నే గీస్కుంటాను అదొక్కటే తేడా.. మిగతా అంతా సేం టు సేం... ఆ... అయినా లాస్ట్ పంచ్ మనదైతే దానికొచ్చే కిక్కే వేరబ్బ”“నా బతుకు దూదికంటే చులకనా నీటికంటే పలచన ఐపాయే”“పలావు మిగిలిపోతే పాలేర్లు తింటారు సార్.. కానీ ఆడపిల్ల పుట్టింట్లో మిగిలిపోతే మీరు ప్రశాంతంగా ఒక్క ముద్ద కూడా తినలేరు..”“ఏంట్రా కత్తులు చూపిస్తున్నావ్.. ఇవున్నది పంటలు కోయడానికి పీకలు కోయడానికి కాదు”“హా.. సరిపోయింది.. హీరో విలను కొట్టుకుని కమెడియన్ ని చంపేసినట్టు నామీద పడాతారేంటి వీళ్ళు”“వీళ్ళు మంచోళ్ళు కాబట్టి మజ్జిగిచ్చి మాట్లాడతన్నారు నాన్నా మన్లాంటాళ్ళైతే మనుషుల్ని పెట్టి బయటకి గెంటేసే వాళ్ళు”“మీకు డబ్బిస్తాం అనడం తప్పు.. పోయిన మీ పరువుకి బదులుగా మా ఇంటి మర్యాదని మా రెండో అమ్మాయిని మీ అబ్బాయికిస్తాం”“మంచి విషయాలు కూడా ఎందుకు వదులుకోవాలో నాకిప్పుడు అర్ధమవుతుంది.. రావి చెట్టుకి పూజ చేస్తాం.. దేవుడంటాం.. అదే మనింటి గోడలో మొలిస్తే.. పీకేస్తాం... నీవల్లే పెళ్ళిళ్ళు జరుగుతున్నాయ్ కానీ రేపా పెద్దాయన నీవల్ల ఏదైనా ఇరిటేట్ అయితే అవే పెళ్ళిళ్ళు ఆగిపోతాయ్. నువు మెడిసిన్ లాంటోడివి సిద్దూ.. కానీ దానికి కూడా ఒక expiry date ఉంటుంది.”“గెంటితే గేట్ కూడా డబల్ స్పీడ్ లో వస్తుంది..”“నా దగ్గరనుండి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చెప్పండి..?”“కొంచెం సంస్కారం..”“అదేంటయ్యా లక్ష్మీ దేవి ఇంటికొస్తుంటే.. రోడ్డుకి లెఫ్ట్ సైడ్ రావాలి.. రెడ్ సిగ్నల్ ఏస్తే ఆగాలని రూల్స్ చెప్తాడేంటి”“ఆకలి తీరింది కదా అని అడుక్కోడం మానేస్తామా స్వామీ”“మదిలో మీరుండగా నదికి మేమెలా పోగలం”“ఈ నెక్లెస్ అమ్మినా సంవత్సరం పాటు రెక్లెస్ గా బతికేయచ్చు”“నీకు ఉర్దూ వచ్చా..?” “వాడు కొట్టేది చూస్తే చైనీసూ చిత్రలేఖనం కూడా వచ్చుండాది”“కార్లో ముందు సీట్ కీ వెనక సీట్ కీ మధ్య దూరం ఎవ్వరూ తగ్గించ లేరు”“మీది ప్రేమ.. అవతల వాళ్ళది వ్యామోహం.. మీరు చేస్తే ఆదర్శం.. వేరే వాళ్ళు చేస్తే ఆవేశం.. మీరరిస్తే మమకారం మా తాత అరిస్తే మటుకు అహంకారం..”“జీవితంలో ప్రతీ సమస్య మనిషికి రెండు దారులిస్తుంది.. ఒకటి ప్రేమతో ఉన్నది, రెండు ద్వేషంతో నిండింది”“కంటికి కనపడని శత్రువుతో బయటకి కనపడని యుద్దం చేసేవాడ్ని”“బాగుండడం అంటే బాగా ఉండడం కాదు.. నలుగురితో ఉండడం, నవ్వుతూ ఉండడం”“కుదిరితే క్షమించు.. లేదంటే శిక్షించు.. కానీ మేం ఉన్నామని గుర్తించు.. దయచేసి గుర్తించు..”“ఎక్కడ నెగ్గాలో కాదురా.. ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు..”ఇది సినిమా చివర్లో ఎండ్ క్రెడిట్స్ తో వచ్చే నేపధ్య గీతం. దేవదేవం భజే పాట లోని రెండో చరణం.ఆఆఆఅ...కనుల తుది అంచునొక నీటి మెరుపూ..కలలు కలగన్న నిజమైన గెలుపూ..పెదవి తుది అంచునొక తీపి పిలుపూ..సెగల ఏడబాటుకది మేలి మలుపూ..భళ్ళున తెల్లారే తళ తళ తూరుపులావెలుగులు కురిసిందీ ఈ ఆనందం..ఋతువులు గడిదాటే చెరగని చైత్రములానవ్వులు పూసిందీ ఈ ఆనందం..జీవమదె మాధురిగ మమతలుచిలికెను మనసను మధువనం.దేవ దేవం భజే దివ్య ప్రభావందేవ దేవం భజే దివ్య ప్రభావంరావణాసుర వైరి రణపుంగవంరామందేవ దేవం భజే దివ్య ప్రభావం
బుధవారం, ఆగస్టు 28, 2013
మిస్సవకూడని 2 సినిమాలు
ఆదివారం, ఆగస్టు 18, 2013
చీమలు దోమలు ఈగలు - చిట్కాలు
చీమలు : ఇదివరకటి రోజుల్లో ఇంట్లో గచ్చు చేసో నాపరాళ్ళు పరచో ఉంటే ఆ గచ్చుపగిలిన చోటో లేక బండలమధ్యో కొంత ప్లేస్ చేస్కుని చీమలు మనమీద దండయాత్ర చేసేవి అలాంటపుడు వాటి ఆరిజిన్ కనిపెట్టి అక్కడ కాస్త గమేక్సినో ఏదో కొట్టేస్తే వాటి బెడద వదిలేది. కానీ ఇపుడు అపార్ట్మెంట్స్ లోనూ మామూలు ఇళ్ళలోకూడా ఆ సౌకర్యంలేదు, మార్బుల్ ఫ్లోర్ వెట్రిఫైడ్ టైల్స్ ఉన్నా ఎక్కడ నుండి వస్తాయో తెలీదు. ఒకసారి దాడి మొదలెట్టాక స్వీటూ, హాటు, అన్నం, పప్పు, ఫర్నిచర్, లాప్ టాప్ అని తేడా లేకుండా ఎడతెరిపి లేకుండా ఎక్కాడపడితే అక్కడ తిరిగేస్తాయ్.
నిజానికి నేను మా వంటగది కిటికీలో వీటికోసం చిన్న ప్లేట్లో పంచదార వేసి విడిగా పెడతాను ఎపుడూ, సాధారణంగా బుద్దిగా అది మాత్రం తిని మిగతా చోట్లకి దాడిచేయవు. అక్కడ అదిపెట్టడానికి కారణం అదే అబండెంట్ సోర్స్ ఉన్నపుడు వెతుక్కుని మిగిలిన చోట్లకి రావుకదా అని. కానీ మొన్న వేసవిలో మాత్రం మమ్మల్ని బానే ఇబ్బందిపెట్టాయి ముఖ్యంగా సోఫాలకి కూడా పట్టేసేవి అవి ఎండలో పెట్టి దులిపినా రెండురోజులకి మళ్ళీ సిద్దం. వాటిమీద గమాక్సిన్ లాంటివి కూడా చల్లలేము, సోఫాలో కూర్చుంటే కుట్టి అల్లాడిస్తాయి కనుక వదిలేయనూలేము.
అలాంటి టైంలో ఓ చిట్కా గురించి తెలిసింది, ఇల్లు తుడిచేప్పుడు ఆ నీళ్ళలో ఉప్పుకలిపితే ఫలితం బాగుంటుందని అన్నారు. నేను ఆల్రెడీ ఖరీదైన క్లీనర్స్ కలుపుతాను అనో, మేం అసలు ఇల్లు తుడిచేదే బోరింగ్ లో వచ్చే ఉప్పునీళ్ళతో అనో చెప్పకండి :-) ఇపుడందరూ వాడే అయొడైజ్డ్ టేబుల్ సాల్ట్ కాకుండా ఒకప్పుడు వాడే సాధారణ ఉప్పు కల్లుప్పు తెలిసే ఉంటుంది కదా. షాప్ లో క్రిస్టల్ సాల్ట్ / కల్లుప్పు అని అడిగితే ఇస్తారు. పేరు చూసి ఖంగారుపడకండి అది కల్లునుంచి ఏం తయారుచేయరు సముద్రపు నీటినుండే తయారుచేస్తారు. ఈ ఉప్పు కొంత నీళ్ళలో కలిపి ఒక వారం రోజులు తుడిస్తే చాలా ఆశ్చర్యకరంగా చీమలు అన్నీ మాయం వాటిని చంపామన్న బాధ లేకుండా వాటంతటవే వెళ్ళిపోయాయి.
దోమలు : చీమలు మనకి హాని చేసేది తక్కువే కనుక వాటి పట్ల జాలి చూపించినా దోమల పట్ల మాత్రం నిర్దాక్షిణ్యంగా వ్యవహరించకపోతే అనేక జబ్బులకు కారకమవుతాయి. ఇంటిచుట్టూ మురుగు నీటి నిలవలు లేకుండా జాగ్రత్త పడడం ఇంట్లో కూడా దోమలు చేరగలిగేలా చెమ్మతో కూడిన చీకటి ప్రదేశాలు లేకుండా చూసుకోవడం ద్వారా కొంత నివారించవచ్చు. కిటికీకి మెష్ లూ, మంచాలకి దోమ తెరలూ, మార్కెట్లో రకరకాల బ్రాండ్ల మస్కిటో కాయిల్సూ, రిపెల్లెంట్సూ, వెతికి పట్టుకుని ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి చంపే మస్కిటో జాపర్స్ ఇన్ని పరికరాలున్నా అవి అందుబాటులో లేని సమయంలో కానీ కాయిల్స్ రిపెల్లెంట్స్ పడని వాళ్లుగానీ ఈ సింపుల్ హోం రెమెడీ వాడచ్చు.
దోమలు మనుషులు వదిలే కార్బన్ డై ఆక్సైడ్ వాసనని బట్టి మన ఉనికిని కనిపెడతాయట. సో ఆ ఎబిలిటీని మనం నిర్వీర్యం చేయడం ద్వారా దోమలు మనల్ని కనిపెట్టకుండా చేయచ్చు. ఇదే ఫార్ములా ఉపయోగించుకుని షర్టుకి అంటించుకు తిరిగే ఒక పాచ్ తయారు చేస్తున్నారు ఆ వివరాలు ఇక్కడ క్లిక్ చేసి చూడచ్చు. అయితే ఇంచుమించు ఇదే పనిని హారతి కర్పూరం (Camphor) కూడా చేస్తుంది. షర్ట్ గుండీల పరిమాణంలో దొరికే కర్పూరం టాబ్లెట్స్ రెండు తీస్కుని వాటిని ఒక చిన్న వెడల్పాటి గిన్నెలో నీళ్ళు పోసి అందులో వేసి బెడ్ దగ్గర పెట్టుకుంటే రాత్రంతా అవి నీటితో పాటు ఆవిరై కర్పూర పరిమళాన్ని గదంతా వ్యాపింప చేస్తూ దోమలను ఇంకా వర్షాకాలంలో వచ్చే చిన్న చిన్న కీటకాలను కూడా దూరంగా తరిమేస్తుంది.
లేదంటే పాత మస్కిటో మాట్ పరికరాలుంటే బొమ్మలో చూపినట్లు రెండు టాబ్లెట్స్ వేసి వేడి చేయడం ద్వారా కూడా ఇదే ఫలితాన్ని పొందచ్చు. ఐతే కర్పూరానికి మండే గుణం ఉంది కనుక ఈ పరికరం వాడేప్పుడు అప్రమత్తంగా ఉండడం అవసరం. నీటిలో వేయడం సేఫ్ నేను ప్రయత్నించి చూశాను బాగా పని చేస్తుంది. అలమారలలో వేసే మాత్/నాఫ్తలిన్ బాల్స్ వేరు ఈ హారతి కర్పూరం వేరు కన్ఫూజ్ అవకండి నేను చెప్పేది కర్పూరం గురించి. అలాగే యూకలిప్టస్, మెంథాల్, లవంగ వాసనలంటే కూడా దోమలకు పడదంటారు అవికూడా ఉపయోగించ వచ్చట.
ఈగలు : వానాకాలంలో ఇవి కూడా ఎక్కువే వస్తాయి, ఫినాయిల్ లేదా లైసాల్ లాంటి క్లీనింగ్ లిక్విడ్స్ చాలా వరకూ పని చేసినా ఒకోసారి అలా శుభ్రం చేసే వీలు లేని కొండొకచో ఎంత శుభ్రంగా ఉన్నాకూడా ఫర్నిచర్ పైన మనుషుల పైనా వాలుతూ ఈ క్లీనింగ్ సొల్యూషన్ ఎఫెక్ట్ మాకేమాత్రం లేదని విర్రవీగుతుంటాయి. అలాంటి సమయంలో ఒక చిన్న బౌల్ లో పుదీనా ఆకులని నలిపి పెడితే మంచి వాసన రావడమే కాక ఈగలు బయటకు వెళ్ళిపోతాయి. ఒకవేళ వీటికి అలవాటు పడ్డాయనిపిస్తే లవంగాలు పొడిచేసి కొంచెం వార్మ్ వాటర్ లో వేసి ఉంచితే ఆ వాసనకి కూడా ఈగలు పోతాయని అంటారు. ఈ చిట్కాలు ఈగ సినిమాలో విలన్ సుదీప్ కి ఎవరూ చెప్పినట్లు లేరు పాపం :-) ఈమధ్య ఈ సమస్య ఫేస్ చేయలేదు కానీ లాస్ట్ ఇయర్ వేరే ఇంట్లో ఉన్నపుడు ఇవి నేను ప్రయోగించి చూశాను విజయవంతంగా పని చేశాయి.
పై మూడూ నేను ప్రయత్నించి చూసిన చిట్కాలైతే మరో చిన్న చిట్కా ఇంకా ప్రయత్నించనిది ఇది ఎలుకలకి పని చేస్తుందట. ఎలుకని బోన్ లో బంధించాలన్నా మందుపెట్టి చంపాలన్నా అయ్యో పాపం అనుకునే వాళ్ళు ఈ చిట్కా ప్రయత్నించి చూడచ్చు. ఎలుకలకు కూడా స్ట్రాంగ్ స్మెల్ పడదట ఒక చిన్న కాటన్ బాల్ ని పెప్పర్ మింట్ ఆయిల్ లో ముంచి దాన్ని ఎలుకలు ఇంట్లోకి వస్తున్నాయి అన్న అనుమానమున్న చోట ఉంచితే రావట. అలాగే పలావు ఆకులని కిచెన్ లో ఉంచడం ద్వారా కూడా వీటిబాధను తప్పించుకోవచ్చట, బట్టల కప్ బోర్డ్స్ లో వేసే మాత్/ నాఫ్తలిన్ బాల్స్(కలరా ఉండలు) ఉన్నచోటకు కూడా ఎలుకలు రావని అంటారు. అలాగే అవి మీఇంటి బయట గోడల దగ్గర ఎక్కువ తిరుగుతున్నాయనిపిస్తే అవి తిరిగే చోట పుదీనా మొక్కలు పెంచినా కూడా వీటిభారినుండి తప్పించుకోవచ్చు అని విన్నాను. అవండీ ప్రస్తుతానికి నాకు గుర్తొచ్చినవి మీకేవైనా తెలిసినవి ఉంటే కామెంట్స్ లో పంచుకోండి.
ఆదివారం, ఆగస్టు 04, 2013
ఓ ప్రయాణం
ఖాళీగా ఉన్న ఒక సీట్ కాస్త మురికిగా ఉందనిపించి ఒకసారి చేత్తో దులిపాను, బంద్ మహిమ అనుకుంటాను ఒక పెద్ద ధూళి మేఘం ఇంతెత్తున ఎగసింది, ఖర్చీఫ్ తీసి ముక్కుకి అడ్డం పెట్టుకుని మళ్ళీ దులిపాను అదే రేంజ్ లో మళ్ళీ దుమ్మొచ్చింది. నేను ఓపికగా ఎన్ని సార్లు దులిపినా నన్నుసవాల్ చేస్తున్నట్లు అదే రేంజ్ లో దుమ్ము వస్తుండేసరికి వెనక సీట్ లో కూర్చున్న ఒక పెద్దాయన “ఎంత దులిపినా అంతే వస్తుంది దానికన్నా అలాగే కూచుని ఇంటికెళ్ళాక మీ ఫాంట్ శుభ్రంగా దులుపుకోడం బెటర్” అని నవ్వుతూ సలహా ఇచ్చారు, బదులుగా నేనూ ఓ నవ్వు నవ్వి కొంచెం శుభ్రంగా కనిపించిన వెనక సీట్లో కూలబడ్డాను.
డ్రైవర్ ఎక్కాక “బస్ చెంచుపేట వరకే వెళ్ళుద్దండీ బంద్ కదా తెనాలి బస్టాండ్ కి తాళాలేశారుట” అని అనౌన్స్ చేశాడు. “హ్మ్ అక్కడనుండి ఎలా వెళ్ళాలో ఆటోలన్నా తిరుగుతున్నాయో లేదో” అనుకుంటూ కాస్త ఉక్కగా చిరాకుగా ఉండటంతో గాలికోసం కిటికీ సాధ్యమైనంత మేర తెరచి పాటలు పెట్టుకుని వింటూ సీట్ కి చేరగిలబడి పైన లగేజ్ ర్యాక్ కేసి చూస్తూ అలా ఆలోచనలలోకి వెళ్ళిపోయాను. తీరా తెనాలి వెళ్ళాక ప్రశాంతంగానే ఉందని తెలియడంతో నేను ఎప్పుడూ దిగే పాయింట్ దగ్గరే దించేశాడు.
బస్సు దిగి వంతెన మీద నడుస్తుంటే రోడ్డుకిరు వైపులా చిన్న చిన్న గంపలలో పెట్టుకుని పుట్టగొడుగులు/ పుట్టకొక్కులు/ మష్రూంస్ అమ్మే వాళ్ళు స్వాగతం పలికారు. నాకు వానాకాలం అనగానే గుర్తొచ్చే వాటిలో ఇవి కూడా ఒకటి, ఈ కూరంటే నాకు బోలెడంత ఇష్టం అయితే మాములుగా ఫాంస్ లో పెంచిన పుట్టగొడుగులు నాకు నచ్చవు. వానాకాలంలో ఇలా పల్లెల్లో కోసుకుని వచ్చి అమ్మేవి పూర్తిగా విచ్చని మొగ్గలు చిన్న చిన్నగా ఉండి మహా రుచిగా ఉంటాయి. సూపర్ మార్కెట్స్ లో దొరికే పెద్ద పుట్టగొడుగులు వండుకుని ప్లస్ రెస్టారెంట్స్ లో దొరికే కూరలు ప్రయత్నించి అనేకసార్లు భంగపడ్డాక ఇక ఇలా లాభంలేదని వానాకాలం కోసం ఎదురు చూడడానికి అలవాటుపడ్డాను. దారిన మాములుగా మాట్లాడుకుంటూ వెళ్ళేవాళ్ళు సైతం ఆగి అప్పటికప్పుడు నిర్ణయించుకుని ఆ గంపల వేపు నడిచి బేరాలాడడం చూసి నవ్వుకుని ముందుకు సాగాను. చిన్నపుడు వర్షం పడిన ప్రతిరోజు “అమ్మా ఈరోజు పుట్టగొడుగులు మొలిచి ఉంటాయంటావా” అంటూ అమ్మని వేధించిన రోజులు గుర్తొచ్చాయి.
అక్కడ పని అయిపోయాక అయిదున్నరకే కాస్త చల్లబడడంతో బస్టాండ్ వైపు నడక సాగించాను, సాధారణంగా క్యూలేకుండా టిక్కెట్ తీస్కునే అవకాశం ఎపుడూ కల్పించని తెనాలి బస్టాండ్ బంద్ వలన అనుకుంటాను ఖాళీగా ఉంది డైరెక్ట్ గా వెళ్ళి టిక్కెట్ తీస్కుని బస్సెక్కాను. ఈ సారి పట్టుమని పదిమంది కూడా లేరు కానీ చెంచుపేట స్టాప్ దగ్గరకి వచ్చే సరికి బస్సు నిండిపోయింది. వాతావరణం చల్లగా చాలా ఆహ్లాదంగా ఉంది మెత్తని గాలులు వీస్తూ తన సృష్టినంతటినీ భగవంతుడు సంప్రోక్షణము చేస్తున్నాడా అన్నట్లు ఆగి ఆగి కురుస్తున్న చిరుజల్లులు శరీరాన్నే కాదు మనసును కూడా పులకరింప చేస్తున్నాయి. వాతావరణం ప్లస్ మనసు కూడా ప్రశాంతంగా ఉండటం వల్లో లేక ఈ మధ్య బయట ఎక్కువ తిరగకపోవడం అదీ పల్లెల మీదుగా ప్రయాణం చేయకపోడం వలనో తెలియదు కానీ ఈ తిరుగు ప్రయాణంలో బస్సు ముందుకు వెళ్ళేకొద్ది కనిపించే ప్రతి చిన్న దృశ్యం కూడా ఒక్కో జ్ఞాపకాన్ని కదిలిస్తూ నన్ను వెనక్కి గతంలోకి ప్రాయాణం చేయించింది. కాలవలలో సమృద్దిగా నీరు నిండి ఉండడం చూసి మనసు నిండిపోయింది. చెట్లమధ్య బస్సు పరుగులు తీస్తుంటే అప్పటివరకూ ఉన్న ఎండకి తోడు పచ్చని చెట్లపై అప్పుడే పడిన వర్షంవల్ల కాబోలు గాలి నాకు ఇష్టమైన కమ్మటి మట్టి వాసనతో పాటు మొక్కల నుండి వచ్చే ఒకరకమైన పసరు వాసనని కూడా మోసుకొస్తుంది ఆ గాలినీ ఆ పరిమళాన్నీ గుండెనిండుగా ఎంత పీల్చినా తనివి తీరలేదు.
ఇక ఊళ్ళోనే ఏదో ఒక సెంటర్ లో బోలెడన్ని పనసకాయలు పదులు ఇరవైలలో కాదు వందల కొద్దీ పనసకాయలు ఒకే చోట గుట్టగా పోసి అమ్ముతుండడం చూస్తే భలే అనిపించింది. వైజాగ్ లో చదువుకునే రోజుల్లో కాలేజ్ కి వెళ్ళేప్పుడు గోదారి జిల్లాల్లోనో విశాఖ జిల్లాలోనో దారిమధ్యలో రోడ్ పక్కన గుట్టలుగా పోసి అమ్మేవారు అవి గుర్తొచ్చాయి. అంతెందుకు అప్పట్లో మా డిపార్ట్మెంట్ లో ఒక పనస చెట్టు ఉండేది క్లాస్ బయటకు వస్తే ఎదురుగా కనిపిస్తూ పలకరించేది. ఇదివరకు గుంటూర్లోనే క్వార్టర్స్ లో ఉన్నపుడు మా కాంపౌండ్ లో కూడా పనసచెట్టు ఉండేది, శలవలకి వచ్చినపుడు ఎన్నికాయలు వచ్చాయి వివరాలు కనుక్కుని దానిని మురిపెంగా ఒకసారి చూసుకునే వాడ్ని, అవన్నీ వరుసగా గుర్తొచ్చాయ్.
![]() |
| నేను చూసిన గంపలు ఇంకా వెడల్పుగా ఉన్నయ్. |
ఇక అలా కొంచెం ముందుకు వెళితే కొంత దూరం వెళ్ళాక ఒక చోట కట్టెల అడితి కనిపించింది, దీనిని కూడా నేను చూసి చాలా ఏళ్ళవుతుంది, ఈరోజుల్లో పూర్తిగా వీటి వాడకం పోయిందనుకున్నాను కానీ పెద్ద అడితి చూస్తే ఆ ఏరియాలో బాగానే డిమాండ్ ఉన్నట్లనిపించింది. నేను చిన్నపుడు మాది కట్టెలపొయ్యే అప్పట్లో వీధికో అడితీ ఉండేది చిన్నపిల్లలం కనుక మనకి ముట్టుకోడానికి నిషిద్దం కానీ ఆటలాడడానికి ఇంట్లో చూడకుండా వాటిని తీయడం చేతుల్లో ఎక్కడో అక్కడ పేళ్ళు గుచ్చుకుపోతే పడేబాధ తర్వాత తినే తిట్లూ ఇప్పటికీ గుర్తున్నాయ్. ఈ పొయ్యిల్లోకే పిడకలు కూడా వాడేవాళ్ళం.
![]() |
| ఇందులోనే ఊదుగొట్టం కూడా గమనించవచ్చు |
ఇక వంటయ్యాక ఉండే నిప్పులలో గెణుసుగెడ్డలు/ చిలకడదుంపలు మొక్కజొన్న పొత్తులు, ఉల్లిపాయలు కాల్చుకుని తింటూంటే ఆహా ఆ రుచి అమోఘం. ఇక రాత్రుళ్ళు ఆ బూడిదలో వెచ్చగా ఉంటుందికదా పిల్లులు వచ్చి చేరి పడుకునేవి. అందుకే తిండిలేక పస్తులుండటాన్ని చెప్పడానికి "రెండ్రోజులుగా పొయిలో పిల్లిలేవలేదు" లాంటి వాడుక సామెతలు పుట్టాయి. అలాంటి పొయ్యిల మీదే ఒకప్పుడు పెద్ద పెద్ద వంటలు కూడా ఎలా చేసేసేవాళ్ళో తలచుకుంటేనే అమ్మో అనిపిస్తుంది. పిడకలంటే గుర్తొచ్చింది కొన్ని ఊర్లలో పాడి సంపదా, చెట్లకీ గోడలకీ కొట్టిన పిడకలు కూడా నా కళ్ళకి ఇంపుగా కనిపించాయండోయ్.
మరికాస్త ముందుకెడితే బుడంపాడు చెరువు దగ్గర అనుకుంటా బస్టాపు పక్కనే కూరగాయల మార్కెట్టు కూడా చిన్నపుడు నరసరావు పేటలో నాన్నతో కలిసి తిరిగిన మార్కెట్టుని గుర్తుచేసింది. పెద్దాయ్యాక సూపర్ బజార్ కి వెళ్ళడమే కానీ కూరగాయల మార్కెట్టుకో రైతుబజార్ కో వెళ్ళడం తక్కువే నేను. ఒక వేళ వెళ్ళినా అక్కడ ఇరుకు సందులు మురికి మధ్యలో కొనడం కొంచెం చిరాకుపెట్టేవి. కానీ ఈ మార్కెట్ వాటికి భిన్నంగా వరుసగా చక్కగా పక్కాగా కట్టిన కొట్లలో నీట్ గా అరలు అరలుగా కూరగాయలను సర్ది శుబ్రత కూడా పాటిస్తూ చూడగానే దిగి కొనుక్కోవాలనిపించేంత అందంగా స్పేషియస్ గా ఉండి భలే నచ్చేసింది.
ఇక వీటితో పాటుగా మబ్బులు పట్టిన ఆకాశంలో చిత్ర విచిత్రమైన వర్ణాలు రూపాలు ఆవిష్కృతమై దారిపొడుగునా ఆకాశంలోకి చూసినపుడల్లా కొత్త కొత్త రూపాలతో అలరిస్తూ నాకు తోడు వచ్చాయి. నిజానికి ప్రయాణంలో నాకు చాలా ఇష్టమైన హాబీ ఇదే, బస్ కిటికీలోనుండి మేఘాలను చూస్తూ వాటికి రకరకాల రూపాలనాపాదించడం. నిన్న నాకు బోర్లా పడుకుని పుస్తకం చదువుకుంటున్న అమ్మాయినుండి డాబాపై ఆరబెట్టిన బియ్యం వడియాల దాకా రకరకాల రూపాలలో కనిపించాయి మేఘాలు. అవండీ నిన్నటి నా బస్సు ప్రయాణం నాతో చేయించిన జ్ఞాపకాలలోకి ప్రయాణం విశేషాలు.
![]() |
| నను గాభరాపెట్టే ఇరుకు మార్కెట్ |
గురువారం, ఆగస్టు 01, 2013
దొంగా - పోలీసూ - ఓ కోర్టు.
సమయం తెల్లవారుఝామున సుమారుగా మూడున్నరై ఉంటుంది, అప్పటికి గంటక్రితమే పడుకున్న నేను నాన్నగారి పిలుపుకు ఉలికిపడి నిద్రలేచాను. తను “వెనుకవేపు తలుపేయడం మరచిపోయావా తీసుంది” అని అడిగారు. నేను “లేదండీ గంటక్రితమే మంచినీళ్ళు తాగుతూ కూడా చెక్ చేశాను వేసే ఉండాలే” అనుకుంటూ హాల్ లోకి వచ్చి తలుపు చూస్తే బార్లా తెరచి ఉంది.
ఒకడుగు బయటకి వెళ్లి ఎవరైనా ఉన్నారేమో చూసి వచ్చి తలుపు వేసి ఎందుకో అనుమానం వచ్చి ఇంట్లో సామాన్లు చెక్ చేయడం మొదలెట్టాను. టేబుల్ మీద ఉండాల్సిన లాప్ టాప్ లేదు, టీవి మీద పెట్టిన స్మార్ట్ ఫోన్, కప్ బోర్డ్స్ లో ఉండాల్సిన మరో మూడు సెల్ఫోన్స్ కూడా లేవు, కొన్ని అల్మారాలలో వస్తువులు చిందరవందర చేసి ఉన్నాయ్. దాంతో ఇంట్లో దొంగతనం జరిగిందని అర్ధమైంది.
వెంటనే మిస్సింగ్ ఫోన్స్ కి రింగ్ ఇవ్వడం మొదలెట్టాం. మూడు ఫోన్లు స్విచ్చాఫ్ అని మెసేజ్ వచ్చింది నాలుగో ఫోన్ రింగ్ ఇంటి బయటనుండి వినిపించడం మొదలైంది. దానితోపాటే ప్లాస్టిక్ షీట్ మీద ఎవరో నడుస్తున్నట్లు అడుగుల చప్పుడు వినిపించింది. మాకు దొంగ అక్కడే ఉన్నాడేమోనన్న అనుమానం వచ్చింది. వెంటనే పోలీసుల కోసం 100 కి ఫోన్ చేసి విషయం చెప్పి అడ్రస్ ఇచ్చి ఎదురు చూడ్డం మొదలెట్టాం.
అడుగుల చప్పుడు ఆగిపోయింది కానీ ఫోన్ రింగ్ మాత్రం అక్కడనుండే వినిపిస్తుంది. ఐదునిముషాలకి కొంచెం ధైర్యం వచ్చి సేఫ్టీకోసం పక్కనే ఉన్న పచ్చడిబండ తీస్కుని మెల్లగా తలుపు తీసి ఫోన్ రింగ్ వచ్చిన వైపు వెళ్ళాను. అక్కడ కాంపౌండ్ వాల్ మీద ఒక ఫోన్ ఉంది. లైట్ వేసి ఆ చుట్టు పక్కల ఇతర ఫోన్లు కానీ లాప్ టాప్ కానీ దొరుకుతుందేమోనని వెతికాను. ఇంకేవీ లేవు, ఫోన్ ఉన్న ప్రదేశాన్ని చాక్ పీస్ తో మార్క్ చేసి దాన్ని లోపలికి తెచ్చేసాను. పదినిముషాలకి పోలీసులు వచ్చారు.
![]() |
| ఇవే టవర్ బోల్ట్స్, మా తలుపు కిటికి ఇంతే ఉంటై. |
పోలీస్ స్టేషన్ లోని క్రైం డిపార్ట్మెంట్ హెడ్ కానిస్టేబుల్ గారికి విషయమంతా వివరించాక అతనూ మరో కానిస్టేబుల్ కలిసి ఇంటికి వచ్చి వివరాలు నోట్ చేస్కుని వెళ్ళారు. ఉన్న వస్తువులేవీ కూడా వేలి ముద్రలు తీస్కోడానికి అనువుగా లేవని వదిలేశారు. ఆ సాయంత్రం మళ్ళీ స్టేషన్ కు రమ్మని చెప్పారు. ఆ సాయంత్రం నేను తెలుగులో రాసిచ్చిన రిపోర్ట్ తోపాటు దానిని వాళ్ళు ఆంగ్లంలోకి తర్జుమా చేసి కంప్యూటర్ లో టైప్ చేసిన FIR కాపీ ఒకటి ఇచ్చారు. కేస్ లో పురోగతి ఉంటే మేమే కాల్ చేస్తామని చెప్పి నంబర్ నోట్ చేస్కుని పంపించేశారు. ఓవరాల్ గా పోలీసుల రెస్పాన్స్ నాకు చాలా బాగా నచ్చింది.
21st April 2013:
మధ్యాహ్నం ఒంటిగంట దాటింది, భోజనానికి కూర్చోబోతుండగా ఒక అన్నోన్ నంబర్ నుండి ఫోన్ వచ్చింది. ఎవరా అనుకుంటూ మాట్లాడితే “మేము ఫలానా పోలీస్ స్టేషన్ నుండి కాల్ చేస్తున్నాం, మీ లాప్ టాప్ దొరికింది వచ్చి ఐడెంటిఫై చేయండి” అని చెప్పారు. నేనూ తమ్ముడూ భోజనం కూడా చేయకుండా పరుగున పోలీస్ స్టేషన్ కి వెళ్ళాం. ఒక లాప్ టాప్ ఆరో ఏడో సెల్ఫోన్స్ తీసుకువచ్చి వీటిలో మీ వస్తువులు గుర్తుపట్టండి అని అడిగారు. లాప్ టాప్, ఒక సెల్ఫోన్ మావే అని చెప్పాం. దొంగ దగ్గర ఈ మాత్రమే రికవర్ చేయగలిగామని నోకియా ఫోన్ లాక్ ఓపెన్ చేయలేక ఫ్రస్టేషన్ తో పగలగొట్టాడనీ మరో ఫోన్ పోయిందంటున్నాడనీ చెప్పారు.
"సర్లెండి ఈ మాత్రమైనా వచ్చాయి మా వస్తువులు మేం పట్టుకుపోతాం" అని చెప్పాం. ఆయన మమ్మల్ని పిచ్చివాళ్ళని చూసినట్లు చూసి నవ్వి అదంత వీజీకాదు దానికో ప్రొసీజరుంది అని మొదలెట్టారు. ఇక అక్కడ నుండి మా కష్టాలు మొదలయ్యాయ్ కేస్ బబుల్ గమ్ లా సాగడం మొదలైంది, సామాన్లు పోలీస్ స్టేషన్ లో లాకర్ లో భద్రంగా దాచారు. ఆ పక్కనే మరో సెల్ లో దొంగని కూడా పెట్టి మేపుతున్నారు. నేను మాత్రం పోలీస్ స్టేషన్ కి ఇంటికీ మధ్య చక్కర్లు కొట్టడం మొదలెట్టాను.
లీగల్ సిస్టం ఎంత చిత్రమైందంటే పోలీసులు ఇన్ఫార్మర్స్ ద్వారానో అనుమానితులపై నిఘా వేసో దొంగలను పట్టుకున్నామని చెప్తే కోర్ట్ నమ్మదట. వాళ్ళని సక్రమంగా పట్టుకున్నట్లు కూడా ప్రత్యక్ష సాక్ష్యాలు చూపించాలిట. ముందుగా అలాంటి ఇద్దరు సాక్షులను అరేంజ్ చేయిస్తే రెండు మూడు వారాలలో మీ సామాను మీకు ఇప్పిస్తామని చెప్పారు కానీ అలా చెప్పగలిగిన వాళ్ళు నాకు ఎవరూ తెలియరని చెప్పాను. అయితే బాగా ఆలశ్యమవుతుంది ముద్దాయి కూడా శిక్ష తప్పించుకోవచ్చు అన్నారు. నేను చేయగలిగింది ఏమీలేదని చెప్పడంతో సాధారణంగా ఎప్పటిలాగే వారి పద్దతులలో కేస్ ఫైల్ చేస్తామని చెప్పారు.
కేస్ ఫైల్ చేశాక నేను ఒక లాయర్ ని పెట్టుకుని రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ కేస్ ఫైల్ చేయాలట దానికి లాయర్ ప్లస్ కోర్ట్ ఫీజులూ చెల్లించాలి అదీకాక గెజిటెడ్ ఆఫీసర్ హోదాలో ఉన్న ఒక గవర్నమెంట్ ఉద్యోగి శాలరీ సర్టిఫికెట్ తో వస్తువుల ధరకి హామీ ఇప్పించాలిట. అంటే నేను కేస్ హియరింగ్ కి వచ్చినరోజున వస్తువులని మళ్ళీ కోర్ట్ లో హాజరుపరచాలి అలా కాని పక్షంలో ఆ ఆఫీసర్ కోర్టుకు డబ్బులు కట్టాలన్నమాట. లేదా కేస్ హియరింగ్ కి వచ్చిన రోజున కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పి మీ వస్తువులు మీరు తీసుకు వెళ్ళవచ్చు అన్నారు. కేస్ కోర్ట్ లో ఫైల్ చేయడానికి కొన్ని రోజులు ఆలశ్యం అయింది. ఆ తర్వాత ఒక లాయర్ ని మాట్లాడాలని చెప్పి మరికొన్ని రోజులు తాత్సారం చేసి తిప్పుకున్నారు. అంతలో హియరింగ్ దగ్గర పడింది.
26th July 2013
అంతకు నాలుగు రోజుల ముందే ఈరోజు మీ కేస్ హియరింగ్ అని చెప్పడంతో పదిన్నరకు కోర్ట్ ఆవరణకు చేరుకున్నాను. నా జీవితంలో మొట్ట మొదటి సారి అక్కడికి వెళ్ళడం, కోర్ట్ అనగానే సినిమాలలో చూపించినట్లు ఎత్తైన మెట్లు భారీ సెట్టింగ్ ఊహించుకున్న నాకు మాములు భవన సముదాయం కనిపించి నిరాశపరిచింది. సరే ఇక్కడిలాగే ఉంటుందేమో అని కాస్త లోపలికి నడవగానే చెడు వినకు, అనకు, కనకు అంటూ బక్కచిక్కిన మూడు కోతి బొమ్మలు వెల్కం చెప్పాయ్. నాకు కావలసిన కోర్ట్ రూం ఎక్కడుందో వాకబు చేస్తూ మరికొంచెం ముందుకు వెళ్ళగానే న్యాయదేవత ఎదురైంది ఆవిడని తప్పుకుని ముందుకు వెళ్తే నేను వెతుకుతున్న కోర్ట్ హాల్ కనిపించింది అక్కడే ఉన్న మా పోలీస్ స్టేషన్ HC(Head constable) ని పలకరించాను. ఆయన నాతరఫున వస్తువులను రిటర్న్ చేయమంటూ లెటర్ రాసి సంతకం పెట్టించుకుని కోర్ట్ లో సబ్మిట్ చేసి "మీ పేరు పిలుస్తారు ఎదురు చూడండి" అని చెప్పారు.
మాములు పాత యూనివర్సిటీ/గవర్నమెంట్ బిల్డింగ్స్ లాగా పెద్ద పెద్ద రాళ్ళతో కట్టిన భవనం అది. ముందు కొన్ని నీడనిచ్చేచెట్లున్నాయ్ వాటికింద నాలుగైదు సిమెంట్ బల్లలు ఉన్నాయి. వాటిమీద ముద్దాయిలు సంకెళ్ళతో కూర్చుని ఉన్నారు వారిపక్కన వారికి ఎస్కార్ట్ గా వచ్చిన పోలీసులు గన్నులతో ఉన్నారు. సంకెళ్ళనీ గన్నునీ కూడా అంత దగ్గరగా చూడడం అదే మొదటిసారి. వీళ్ళేకాక రకరకాల పనులమీద వచ్చిన ఇతర వ్యక్తులు కూర్చుని ఉన్నారు. కులం జాతి మతం ప్రాంతం అనే బేధాలకి అతీతంగా అందరూ కలిసి కూచుని జడ్జిగారికోసం ఎదురు చూస్తున్నారు. ఆడవాళ్ళు, మగవాళ్ళు, పసిపిల్లలని వెంట తీస్కొని వచ్చిన వాళ్లు, యువకులు, పండు ముదుసలులు అందరూ ఉన్నారు.
ఆవేళ కాస్త ఆలశ్యంగా పదకొండుముప్పావుకి వచ్చారు జడ్జిగారు. ఆవిడ వచ్చీ రాగానే అప్పటివరకూ రిలాక్స్ గా ఉన్న వాతావరణం మారిపోయింది. ముందుగా వాయిదాలు ఇచ్చే కేసులను ఒకదాని తర్వాత ఒకటి పిలిచి పెద్దగా చర్చలేకుండానే తరువాతి వాయిదా తారీఖుని ఇచ్చి పంపించి వేస్తున్నారు. అలా ఒక పది హేను కేసులు ఇచ్చి ఉంటారు వాటిలో కొన్ని 2005 అంటే ఎనిమిదేళ్ళక్రితం పెట్టినవి కూడా ఉన్నాయ్. కాసేపటికి నా పేరు పిలిచారు లోపలికి అడుగు పెట్టాను.
బహుశా ఇది పబ్లిక్ హియరింగ్ కోర్ట్ కాదేమో పబ్లిక్ గాలరీ లాంటివి ఏవీ లేవు. ఒక పొడవైన హాలు ఉంది దానికి ఒక చివర న్యాయమూర్తి అచ్చంగా సినిమాలో చూపించినట్లే పెద్ద డస్క్ కి అవతల వైపు ఒక ఎత్తైన ధర్మాసనంపై కూర్చుని ఉన్నారు. పక్కనే ఒక గుమస్తా నిలబడి ఉన్నారు. ఆ బెంచ్ కి కింద దానిని ఆనుకుని కోర్ట్ క్లర్క్ టేబుల్ ఉంది దానికి ఒక వైపు క్లర్క్ గారు కూచుని ఉన్నారు ఇంకోవైపు సాక్షి కోసం కుర్చీ వేసి ఉంది. నేను కోర్ట్ హాలులోకి ఎంటరైన గుమ్మం అక్కడే ఉంది. నన్ను ఆ కుర్చీలో కూర్చోమన్నారు. నా పక్కనే పిపి(పబ్లిక్ ప్రాసిక్యూటర్) నుంచున్నారు ఆయనకి కాస్త అవతల డిఫెన్స్ లాయర్ ఉన్నారు. ఈ టేబుల్ తర్వాత వీళ్ళ వెనుక కాస్త ఖాళీ వదిలి పొడవాటి టేబుల్స్ రెండువైపులా వేసి ఉన్నాయ్ వాటిముందు న్యాయవాదులు కూర్చుని ఉన్నారు. ఆ టేబుల్స్ తర్వాత హాలుకు రెండో చివర మరో గుమ్మం ఉంది దాని దగ్గరగా ఖాళీ స్థలం ఉంది అక్కడ ఎస్కార్ట్ గా వచ్చిన పోలీస్ తో కలిసి ముద్దాయి నిలబడ్డాడు.
కోర్టు బంట్రోతు వచ్చి నాతో ప్రమాణం చేయించింది, భగవద్గీత ఏవీ లేదు కానీ చేతులు కట్టుకుని సేం డైలాగ్ “దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను అబద్దం చెప్పను” అని చెప్పాను. ఆ తర్వాత పిపి గారు ముందుగా నా పర్సనల్ వివరాలు ఆ తర్వాత జరిగిన అఫెన్స్ గురించి ఏవేవి పోయాయి ఏవి దొరికాయి ఇతరత్రా వివరాలు అడుగుతూంటే నేను చెప్పిన వాటిని తన దగ్గర ఉన్న రిపోర్ట్ తో టాలీ చేస్కుంటూ జడ్జిగారు ఆమోదం తెలపడం మొదలెట్టారు. నేను అంతా పూర్తిచేసి వస్తువులు ఐడెంటిఫై చేశాక డిఫెన్స్ లాయర్ ని ఏవైనా అభ్యంతరాలున్నాయా అని అడిగారు తను లేవని చెప్పాక అతని వస్తువులు అతనికి ఇచ్చేయమంటూ జడ్జిగారు ఆర్డర్ పాస్ చేశారు.
నేను చెప్పిన వివరాలను కోర్ట్ క్లర్క్ అక్కడికక్కడే ఒక పేపర్ మీద రాసి ఇస్తే దాని మీద ప్లస్ ఆరోజు నేను కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పినట్లుగా ఒక రిజిస్టర్ లోనూ నేను సంతకం చేయాల్సి ఉంటుంది బయట వెయిట్ చేయమన్నారు. నాతో ప్రమాణం చేయించిన బంట్రోతు వచ్చి సంతకాలు పెట్టించుకుని “డబ్బులు ఇవ్వు” అని డైరెక్ట్ గా అడిగింది. ఒక్క క్షణం స్టన్ అయిన నేను “అదేంటమ్మా పదడుగుల దూరంలో గుమ్మం అవతల న్యాయమూర్తిని పెట్టుకుని ఇలా అడగడానికి భయమేయట్లేదా?” అని అడిగాను. ఇక్కడ ఇదంతా కామనే సార్ కాఫీకైనా ఒక ఇరవై రూపాయలివ్వండి అంటూ దబాయించి మరీ తీస్కుంది.
ఈ ప్రొసీజర్ అంతా అయిన ఒక గంటకి న్యాయవాదుల సంతకాలతో కోర్ట్ ఆర్డర్ విడుదలయ్యాక దాన్ని తీస్కుని అదే ఆవరణలో ఉన్న క్లరికల్ ఆఫీస్ కి వెళ్ళి వస్తువులు హాండోవర్ చేస్కున్నట్లు ఒక పర్సనల్ బాండ్ మీద రెవెన్యూ స్టాంపులపై సంతకాలు చేసాక నా వస్తువులు నా చేతికి వచ్చాయి. రికవర్ చేయని రెండు సెల్ఫోన్స్ పై ఆశలు వదిలేసుకోవడమే తప్ప ఇక చేయగలిగింది ఏం లేదని చెప్పారు. ఐతే లాప్ టాప్ చెక్కుచెదరకుండా ఎలా ఉన్నది అలానే చేతికి రావడం మాత్రం బోలెడంత సంతోషాన్నిచ్చింది.
అదండీ నేను చూసిన ఒక సీరియస్ దొంగతనం సంగతి. ఈ సిరీస్ లో ఇదే ఆఖరి పోస్ట్. కేవలం టవర్ బోల్ట్ వేసి తాళం మర్చిపోయి పడుకోవడమనే చిన్న పొరపాటు వల్ల వాడెవడో మా ఇంటికొచ్చి దొంగతనం చేస్తే నాలుగు నెలల పాటు టెన్షన్, తిప్పట, కొంత అనవసర ఖర్చు, రెండు సెల్ఫోన్స్ నేను చెల్లించిన మూల్యం కాగా దాని మూలంగానే జీవితంలో మొదటిసారి పోలీస్ స్టేషన్, కోర్టు లకు వెళ్ళి సిస్టం గురించి తెలుసుకుని కొత్త అనుభవాన్ని చవి చూశాను. విచిత్రం ఏవిటంటే దొంగలని పట్టుకొని ప్రాపర్టీ రికవర్ చేయడానికి పోలీసులకి పదిహేను రోజులు పడితే, కోర్టుకు సబ్మిట్ చేసి నా వస్తువులు నాకు ఇప్పించడానికి మూడునెలలు పట్టింది. నేను ???
- వేణూశ్రీకాంత్
- అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.











.jpg)

.jpg)






.jpg)



















