అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

అందమైన బాల్యం

మధురమైన జ్ఞాపకాలతో అందమైన బాల్యాన్ని నా సొంతం చేసినందుకు అమ్మానాన్నలకు ఎప్పుడూ ఋణపడి ఉంటాను. మొదటి సంతానాన్నవడంతో నేనాడిందే ఆట పాడిందే పాట అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళినా మా ఇంట్లో అయినా అపురూపంగా గడిచింది. పాడుకున్న పాటలు, ఆడుకున్న ఆటలు, స్కూల్ ఎగ్గొట్టడానికి వేసిన వేషాలు, తిన్న చిరుతిళ్ళు, నాన్న వేలు పట్టుకుని కొట్టిన షికార్లు, 16mm సినిమాలు కబుర్లు ఇక్కడ చదవచ్చు.

ఇంటర్మీడియెట్ హాస్టల్ కబుర్లు

నూనూగు మీసాల నూత్న యవ్వనం అమ్మానాన్నలకు దూరంగా నాదంటూ ఓ స్వంత ప్రపంచం. అప్పటివరకూ ప్రతి చిన్న పనికి వాళ్ళమీద ఆధారపడి ఒక్కసారిగా నాకు నేనే నెగ్గుకు రావాల్సిన పరిస్థితులను తలుచుకుని దిగులు. అంతలోనే చుట్టూ ఉన్న స్నేహితులతో నేస్తం కట్టేసి చేసిన అల్లర్లు, పరోఠాల బిజినెస్సులు, చెరకుతోట దొంగతనాలు, ఆడ్మినిస్ట్రేటర్ కి మస్కాగొట్టి చూసిన సినిమాలు, సరదా కొంటె కబుర్లు ఇక్కడ చూడండి.

ఇంజనీరింగ్ కాలేజ్

ఇంటర్మీడియెట్ కి రెసిడెన్షియల్ హాస్టల్ కనుక పంజరంలో పక్షిలా బతికితే ఇంజనీరింగ్ కాలేజ్ యూనివర్సిటీ హాస్టల్స్ లోకి వచ్చేసరికి ఒక్కసారిగా జూలోనుండి పచ్చని అడవిలోకి వదిలేసిన జింక పరిస్థితే అయింది, ఎక్కడికి పరుగులెట్టినా ఏం చేసినా అడిగేవాళ్ళులేరు. అసలు హాస్టల్ బిల్డింగ్ లో నిరంతరం కాపుకాసే వార్డెన్ ఉండడనే విషయం నాకు డైజెస్ట్ కావడానికి నెలపట్టింది :-) నిజమా అలా ఎలా సాధ్యం అని ఇప్పటికీ అనిపిస్తూనే ఉంటుంది. అంతటి స్వేఛ్చాప్రపంచంలో చేసిన అల్లర్లు కొన్ని కబుర్లు ఇక్కడ.

సినిమాలు రివ్యూలు..

నాకున్న అతి పెద్ద వ్యసనం సినిమా చూడడం రిలీజైన ప్రతి అడ్డమైన సినిమా చూసేసి ఈబొమ్మలో చూపించినట్లు తెలుగు సినిమాని భుజాల మీద మోసేవాళ్ళలో నేనొకడ్ని. చూసి ఊరుకోకుండా ఇది ఇందుకు బాలేదు అది అందుకు బాగుంది అంటూ పేద్ద వంద సినిమాలు తీసేసి విశ్రమిస్తున్న మేధావిలా చేసే విశ్లేషణలు :-) హహహ చదివిన ఒకరిద్దరు అలా తిడతారు కానీ నా దృష్టిలో ఒక సాధారణ సినీ ప్రేక్షకుడు చూసొచ్చి మిత్రులతో చెప్పే కబుర్ల లాంటి నా సినీ రివ్యూలు ఇక్కడ చదవండి. ఆరెంజ్, ఖలేజా, కృష్ణం వందే జగద్గురుం లాంటివి కొన్ని ఎక్కువమంది ఆదరణ పొందాయ్.

సోమవారం, మార్చి 30, 2009

బ్లాక్ ఐస్ !!

శీర్షిక చూడగానే "నల్లా నాల్లాని కళ్ళా.. పిల్లా...నీ మొగుడయ్యే వాడెల్లా.. ఉండాలొ కాస్త చెప్పమ్మా.." అని పాడేసుకుంటున్నారా.. ఆగండాగండి నేనేమీ నీలి కళ్ళ నీలిమ గురించి చెప్పబోవట్లేదు.. అంత లేదండీ.. ఇది ఆ ఐస్ గురించి కాదు ఇంకో ఐస్ గురించి. ఏంటబ్బా!! అని తెగ ఆలోచించేయకండి మరి, నెనెలాగు చెప్పేస్తున్నాను కదా ఆలకించండి. అసలు ఈ ఆంగ్ల భాష లో ఉన్నంత తికమక మరే భాషలోనూ లేదు. అంటే అక్కడికి నేనేదో పివి నరసింహ రావు గారి లా ఓ పాతిక భాషలు ఔపోసన పట్టేసానని కాదు కానీ, ఉదాహరణకి ఈ ఐస్ నే తీసుకోండి eyes ని ice ని ఒకేలా పలికి చస్తే తేడా ఎలా తెలిసేది. బహుశా పదం కని పెట్టినవాడి తప్పేం లెదేమో లెండి, బహువచనం కోసం అన్నిటికీ యస్ చేర్చేయడం లోనే తేడా అంతా వచ్చి ఉంటుంది. సో నే చెప్ప బోయేది ఈ ice గురించి అనమాట. ఓహో అలాగా !! అని అర్జంట్ గా కళ్ళముందు టార్టాయిస్ కాయిల్ తిప్పేసుకుంటూ నో, సీలింగ్ కి తిరుగుతున్న ఫేన్ కేసి చూస్తూనో అలా ఓ సారి చిన్నతనానికి వెళ్ళి పాలైస్, ద్రాక్షా ఐస్, కొబ్బరి ఐస్, సేమ్యా ఐస్ ఇలాంటి రక రకాల ఐస్ లన్నీ గుర్తు చేసుకుంటున్నారా :-) మరే నాకు కూడా మొదట అవే గుర్తుకొచ్చాయ్ కానీ అది కూడా కాదు. వాటి గురించి సవివరంగా మరో టపా లో చెప్పుకుందాం.

ఇక విషయానికి వస్తే, ఈ దేశం లోకి వచ్చాక మొదటి సారి ఈ బ్లాక్ ఐస్ అన్న పదం విన్నప్పుడు " ఓరి వీళ్ళ అసాధ్యం కూలా, ఐస్ కి కూడా వర్ణ బేధమా, ఔరా!!" అని బోల్డు కుంచెం ఆశ్చర్య పడిపోయేసాను. తర్వాత ఆరా తీయగా తెలిసింది ఏమిటంటే ఈ అమెరికా లో ఎడ తెరిపి లేకుండా మంచు కురిసి బయట ఉన్న అతి శీతల ఉష్ణోగ్రత వలన ఆ మంచు రోడ్డు పైనే ఐస్ లా గడ్డ కట్టి బాగా నునుపు తేలి, నీటికి సహజంగా ఉన్న పారదర్శకత వలన నల్లని రోడ్ మీద పలచగా పేరుకోని నల్లని ఐస్ అనే భ్రమ కలిగించడమే కాక దీని పారదర్శకత వలన ఇలా ఐస్ పేరుకున్నట్లు తెలియక వేగంగా దాని మీద నుండి కారు నడిపి నప్పుడు స్లిప్ అయ్యి అనేక యాక్సిడెంట్ లకి కారకమవుతుంది. ఇదిగో ఇలాంటి ఒక అతి చిన్న ఐస్ లేయర్ కొన్ని వారాల క్రితం నన్ను కింద పడేసింది. ఆ విషయం మీతో పంచుకుందామనే ఈ ప్రయత్నం.

"వసంతం వచ్చింది వేసవి ఎండలు మండి పోతున్నాయ్ ఇప్పుడు నీ గోల ఏంటి !!" అని విసుక్కోకండి మరి అసలు మజా ఇప్పుడే ఉంది, వింటర్ లో సాధారణంగా బయట వాతావరణం గమనించి జాగ్రత్తగా నడచుకొంటాం కాస్త స్ప్రింగ్ వాతావరణాన్ని గమనించగానే మనకు తెలియకుండానే ఇంకేముంది అని కాస్త రిలాక్స్ అవుతాం అప్పుడే వస్తాయ్ ఇలాంటి చిక్కులు. చికాగో, మిచిగన్, విస్కాన్సిన్ లాటి కొన్ని చోట్ల "House pasting no festival" అన్నట్లు స్ప్రింగ్ రాగానే సరిపోదు, మే మాసం వరకూ కూడా అడపా దడపా మంచు పలకరించి పోతూనే ఉంటుంది. అందుకే చికాగో లో రెండే కాలాలు అని అంటారు ఒకటి వింటర్ మరొకటి construction season ఎనిమిది నెలలు వింటర్ కి కేటాయించగా మిగిలిన నాలుగు నెలల్లో ఇళ్ళు కట్టుకునే పనుల్లో పడతారనమాట. అంతెందుకు స్ప్రింగ్ వచ్చింది అని ఎగిరి గంతులేసి ఒక వారం కూడా గడవలేదు రాత్రి ఇక్కడ ధారాళంగా స్నో పడింది.

సో కొన్ని వారాల క్రితం ఇలాంటి ఒక మంచి సన్నీ డే ఉదయం ఆఫీసుకు బయల్దేరి "చా! వెదవ జీవితం, ఏంటో చిన్నపుడు అమ్మ వాళ్ళ తో గొడవపడో మాయ చేసో కాన్వెంట్ చదువునీ, గంపెడు పుస్తకాల స్కూల్ బ్యాగ్ బరువునీ తప్పించుకొన్నా కానీ ఇంత వయసొచ్చాక ఉద్యోగం చేస్తున్న టైం లో ల్యాప్ టాప్ బ్యాగ్ పేరు తో జీవితాంతం ఓ స్కూలు బ్యాగ్ ని మోయాల్సి వస్తుందని అనుకోలేదు" అని వీపున వేళ్ళాడుతున్న బ్యాగ్ సరిచేసుకుంటూ తిట్టుకుంటూ బయటకి అడుగు పెడదాం అని చూద్దును కదా, బయట మంచు అంతా కరిగి పోయి ఫెళ్ళున ఎండ కాస్తూ అందమైన ఉదయం కనిపించింది దాన్తో ఆనందం పట్టలేక "వావ్ వాటే డే!! అని ఆనందిస్తూ బస్ కి లేట్ అవుతుంది అని అనుకుంటూ తలుపు తీయగానే చల్లని గాలి స్వాగతించింది. హ్మ్ ఇదేమీ ఈ అపశృతి అని అనుకుంటూ హడావిడిగా నడక మొదలు పెట్టాను చుట్టూ అంతా క్లియర్ గా ఉంది కదా అని కాస్త రిలాక్స్ అవడం తో కింద ఉన్న చిన్న ఐస్ లేయర్ (పై ఫోటో లోనిది) ని గమనించ లేదు దాంతో దాని మీద కాలు వేయడం, బ్యాలన్స్ తప్పడం తో రక రకాల యోగాసనాలు వరుసగా వేసేసి చివరిగా ఇదిగో ఈ పక్క ఫోటో లో ఉన్నట్లు శలభాసనం లో సెటిల్ అయ్యాను ఏదో ఆగిపోయాను కానీ అసలు ఓ రెండు రౌండ్లు ఫల్టీలు కొట్ట వలసింది. కాస్త మడమ బెణకడం తప్పించి ఏమీ దెబ్బలు తగల లేదు లేండి. ఈ సాకు ను అడ్డం పెట్టుకుని రెండ్రోజులు ఇంటి నుండి పని చేసాను అది వేరే విషయం.


అసలు మీరు ఎప్పుడైనా జారి కింద పడ్డారా :) చెప్తే నవ్వుతారు, వీడెవడండీ బాబు అంటారేమో కానీ, కింద పడుతున్నపుడు భలే ఉంటుంది అంతా మనకు తెలుస్తూనే ఉంటుంది కానీ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ వేగంగా జరిగిపోతాయ్ అంటే మన మెదడు గ్రహించి రియాక్ట్ అయ్యే లోపలే తరువాతది జరుగుతుంటుంది. హ హ అంతా మనకి తెలుస్తుంది కానీ ఏదీ మన కంట్రోల్ లో ఉండదు భలే చిత్రమైన స్తితి లే, తర్వాత ఒక సారి అసలు ఏం జరిగింది అని ఆలోచిస్తే ఇదంతా గుర్తొచ్చి భలేగా అనిపించింది. చికాగో వచ్చిన కొత్త లో ఊరు నడి బొడ్డున ఇలాంటి ఓ చిన్న ఫీట్ చేసాను. పోయిన సంవత్సరం తప్పించుకున్నాను అలాగే ఈ ఏడు కూడా ఎస్కేప్ అనుకున్నాను కాని మొన్న సరండర్ అవక తప్పలేదు. చిన్నపుడు స్కూల్ నుండి వచ్చే దారిలో నో స్కూల్ లోనో ఇలాంటి ఫీట్ లు బాగానే చేసే వాడ్ని. ఎలా పడినా పర్లేదు కానీ తల నేల కి ఆనితే మాత్రం అమ్మ చేసే హడావిడి అంతా ఇంతా కాదు. పసుపు, సున్నం కలపిన ఎఱ్ఱనీళ్ళ లో కాసిన్ని ఎండు మిఱపకాయలు వేసి దిష్టి తీసి పడిన చోట బోర్లించకుండా వదిలేది కాదు. సరే ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే వింటర్ ముగిసింది కదా అని రిలాక్స్ అవకుండా నడిచేప్పుడూ డ్రైవ్ చేసేప్పుడూ కాస్త ఇలాంటి బ్లాక్ ఐస్ గురించి చూసుకోండి.

సరే నండీ మరి అవి ఈ రోజుకి కబుర్లు మళ్ళీ మరో టపా లో త్వరలో కలుద్దాం అంత వరకూ శలవా మరి.

శనివారం, మార్చి 28, 2009

ఉగాది శుభాకాంక్షలు

అందరికీ హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు, కాస్త ఆలశ్యంగా. ఏం చేయమంటారు చెప్పండి మరి, ఫలానా రోజే పండగ అనుకునే కన్నా మనకి అనువు గా ఉన్న రోజే పండగ అని జరుపుకోడం అలవాటయి పోయింది మరి. ఉగాది అనగానే మొదట గుర్తు వచ్చేది ఉగాది పచ్చడే నేమో కదా... దీనికి కావలసిన అన్ని దినుసులు సులువు గానే దొరుకుతాయ్ కానీ వేప పూత కోసమే కాస్త కష్ట పడాలి, అంటే ప్రస్తుతం ఇంట్లో పచ్చడి చేసేది తక్కువేనేమో... నా చిన్నతనంలో వేప పూతనీ, మామిడి పిందెలనీ కష్ట పడి వెతికి పట్టుకుంటే, కాస్త పెద్దయ్యాక మార్కెట్ కి వెళితే ఏవి కావాలంటే అవి దొరకేవి. ఇంకాస్త పెద్దయ్యాక స్వగృహలాంటి చోట్ల ఉగాది పచ్చడి కూడా అమ్మేస్తుంటే కష్టపడటం ఎందుకు అనిపిస్తుంది. అదేంటో కానీ బజార్లో కొన్న మామిడి కంటే, అపరిచితుల పెరట్లో ఉన్న మామిడి కే రుచెక్కువ ఎందుకో !! కాస్త చిన్న ఊర్లలో బాల్యాన్ని గడిపిన వాళ్ళని ఎవరిని కదిపినా ఈ విషయం ఒప్పుకుంటారు అవునా :)

రుచంటే గుర్తొచ్చింది. వివిధప్రాంతాల లో ఇంట్లో చేసే ఉగాది పచ్చడి రుచి ఒక ఎత్తైతే మా ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ మెస్ లో మా వాడు చేసే ఉగాది పచ్చడి ఉంటుందీ... ఆహా !! ఎలాగో అలా ఉగాది పూట పచ్చడి రుచి చూడాలి అని కోరిక ఒకవైపు, కానీ మా వంట వాడి ఉగాది పచ్చడి రుచి చూసి ఆరోగ్యాలు చెడగొట్టుకుని అసలు ఉగాది అంటేనే విరక్తి కలిగించుకోడం అవసరమా అన్న సందిగ్ద ఒక వైపు చాలా ఇబ్బంది పడేవాళ్ళం ఎలాగయితేనేం ధైర్యం చేసి కనీసం ఒక్క స్పూన్ అన్నా నోట్లో వేసుకున్నాం అని అనిపించుకునే వాళ్ళం అనుకోండి అది వేరే విషయం. అది సరే ఇంతకీ ఈ సంవత్సరం నువ్వు ఉగాది పచ్చడి రుచి చూసావా లేదా అని అడుగుతున్నారా... ఇందాకే చెప్పాను కదండీ మరి, మనకి వీలున్న రోజే పండగ !! ఈ రోజు మరి ఆఫీసు లోనే ఓపిక అంతా అవిరైపోతుందా ఇక ఇలాటి పనులు ఏం చేస్తాం, రేపు శనివారం కదా భాస్కర్ గారి రెసిపీ రెడీ గా పెట్టుకున్నా ఉదయాన్నే వెళ్ళి అన్నీ తెచ్చుకుని మొదలు పెట్టేయడమే... అంతగా కుదర్లేదంటే గుళ్ళు ఎలానూ ఉన్నాయ్ :) వెళ్ళి అక్కడ క్యాష్ కౌంటర్లో ఉన్న అమెరికన్ వాలంటీర్ తో ఒన్ యుగాడి చట్నీ, టుగో అని చెప్తే చాలు, వాళ్ళే ఇచ్చేస్తారు.


అందాకా మీ అందరూ సరదాగా నవ్వుకోడానికి తెలుగువన్ నుండి మల్లిక్ గారి చెణుకు మీ కోసం ఆనందించండి.

సోమవారం, మార్చి 02, 2009

అమ్మకు అశృ నివాళి !!

ఇటువంటి టపా ఎప్పుడో ఓ సారి రాయల్సి ఉంటుంది అని తెలుసు కాని, ఇంత త్వరగా రాయాల్సిన అవసరమొస్తుంది అని అనుకో లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నా మిత్ర బృందం నుండి నూతన సంవత్సర శుభాకాంక్షలు అందుకుంటున్న తరుణం లో ఈ 2009 ఆరంభం లోనే నాకు అత్యంత విషాదాన్ని మిగులుస్తుందనీ నేను అస్సలు ఊహించ లేదు. జనవరి 21 బుధవారం రాత్రి, భోజనం కానిచ్చి మనసు లో "గత మూడు వారాలు గా హాస్పిటల్ లో ఉన్న అమ్మ, గత వారం రోజులు గా ICU నుండి మామూలు రూం కి షిఫ్ట్ అయి నిదానంగా కోలుకుంటుంది, ఇంక ఇవ్వాళో రేపో ఇంటికి పంపించేస్తారు కాబోలు" అని అనుకుంటూ నిద్రకు ఉపక్రమించే సమయం లో తమ్ముడి దగ్గర నుండి కాల్ అందుకున్నాను. critical care unit కి మార్చారు అని చెప్పిన కొన్ని గంటల వ్యవధి లోనే అమ్మ ఇక లేదు అనే చేదు నిజం విని ఏం చేయాలో అర్ధం కాలేదు. తనకెంతో ఇష్టమైన గురువారం జనవరి 22 2009 న ఉదయం అమ్మ మమ్మల్ని ఒంటరిగా ఈ భూమ్మీద వదిలేసి తిరిగి రాని లోకాలకు పయనమయింది.
మరణం, మరణించిన వారికి ఐహిక బాధలనుండి విముక్తిని ప్రసాదించే ఓ వరం ఏమో కాని, వారి ఆత్మీయులకి మాత్రం తీరని శాపం. నిన్నటి వరకూ మన మధ్య తిరిగే మన మనిషి హఠాత్తుగా కేవలం చిత్రాలకు ఙ్ఞాపకాలకూ పరిమితం అయ్యరన్న ఊహే ఆ దేవుడు ఎంత దయలేని వాడు అని అనుకునేలా చేస్తుంది. నేను ఇండియా వెళ్ళే వరకూ రక రకాల ఆలోచనులు నన్ను ఊపిరి తీసుకోనివ్వలేదు. ఈ వార్త తెలిసిన తర్వాత కూడా నేను మాములుగానే ఉన్నానేంటి? ఆకాశం విరిగి మీద పడలేదు, భూమి బద్దలై నన్ను మింగేయలేదు, అవునూ!! ఈ ఆకలి, నిద్ర ఇవి కూడా నన్ను వీడి పోనంటున్నాయేంటీ. అసలు నేను ఇంకా నిద్ర లోనే ఉన్నానేమో ఇదంతా ఓ పీడకలేమో లేచాక అమ్మతో మాట్లాడి ఇలాంటి కల వచ్చింది నువ్వు జాగ్రత్త అమ్మా అని చెప్పాలి అని ఏవేవో ఆలోచనలు.

ఎప్పుడో నా చిన్నతనం లో ఊహ తెలిసీ తెలియని వయసు లో, మరణం అంటే ఏమిటో కూడా తెలియని తనం లో, సంవత్సరం కూడా నిండని నా పెద్ద తమ్ముడు మమ్మల్ని వదిలి వెళ్ళినప్పటి ఙ్ఞాపకాలు ఇంకా సజీవంగా ఉన్నాయి. అప్పుడు మేము ఉంటున్న నరసరావు పేట లో సరైన వైద్యం అందక వాడి చిన్ని శరీరాన్ని టాక్సీ లో వేసుకుని గుంటూరు తీసుకు వెళ్ళడం అక్కడి హాస్పిటల్ వాతావరణం డాక్టర్ ఏం చేయలేం అని తేల్చి చెప్పేసాక అమ్మ స్పృహ తప్పి పడిపోవడం. తర్వాత తిరిగి ఇంటికి రావడం అప్పటి వరకూ వాడి ఫోటో లేదని అలానే కుర్చీ లో కూర్చో పెట్టి నాన్న వాడి కళ్ళు తెరిచి పట్టుకుంటే వాడి ఫోటో తీసుకోడం అన్నీ కళ్ళ ముందరే నిన్న మొన్న జరిగినట్లు ఉన్నాయి. మళ్ళీ ఇన్ని నాళ్ళ కి అమ్మకి వీడ్కోలు పలకాల్సి రావడం న మనసంతా భరించ లేని విషాదాన్ని నింపింది.

తను ఉన్నన్నాళ్ళు ఏదో తెలియని ధైర్యం, ఇపుడు తను మా మధ్య లేదు అనే ఆలోచనే బోలెడంత దిగులును మనసంతా నింపేస్తే ఇక ధైర్యానికి చోటెక్కడ ఉంటుంది. అయినా గత నెల రోజులు గా ఎన్నో అనుభవాలు అమ్మ తోడు లేకపోవడం వలనేమో కానీ మరింత కొత్త గా మరింత బారంగా అనిపించాయి అన్నీనూ.. అసలు తనని సంప్రదించకుండా మా అంతట మేమే నిర్ణయాలు తీసుకోడం ఎంత కష్టమో కదా !! నేను ఇప్పటి వరకూ అలా నా అంతట నేను తీసుకున్న నిర్ణయాలు ఏమీ లేవు ఇకపై అన్నీ నేనే అలా తీసుకోవాలంటే ఎంత కష్టం... అంటే మేమేదో అమ్మ మాట జవదాటని వాళ్ళం అని కాదు కానీ తనతో వాదించి మా మాటే నెగ్గించుకుని మాకు నచ్చిన నిర్ణయమే తను తీసుకునేలా చేసినా కానీ గవర్నమెంట్ సీల్ లాగా తన ఆమోద ముద్ర ఉంటే అదో దైర్యం మా ఇంట్లో అందరికీ.. నాన్న తో సహా. ఇకపై అది లేకుండానే ముందుకు నడవాలి, ఎలాగో... ఏంటో...
తను ఏమైపోయినా కానీ, మా ఇంటిల్లిపాది క్షేమం కోసం అనుక్షణం తపన పడే అమ్మ ఇక మా మధ్య లేదు అన్న ఆలోచనే కళ్ళ వెంట కారే కన్నీటికి ఆనకట్ట కట్ట లేకున్నా... ఎవరో చెప్పినట్లు మనిషి కేవలం ఒక్క చోటే ఉండ గలరు ఇప్పుడు తన ఆత్మ అన్ని చోట్లా తానై మా అందరి యోగ క్షేమాలు చూస్తూ మా వెంటే ఉంటుంది అన్న ఊహ బోలెడంత ఊరట నిస్తుంది. అమ్మో అదే నిజమయితే ! ఇంతకు ముందు అంటే ఇక్కడ ఒంటరి గా ఏడ్చినా ఏం చేసినా అమ్మ కి తెలియదు ఇప్పుడిక తను నా పక్కనే ఉంటుంది కదా నేను ఏడవడం చూస్తే తను బాధ పడుతుంది కదా ఇక ఏడవకూడదేమో. అవునూ అసలు ఏడుపు ఎందుకు వస్తుందీ... గుండె లోతుల్లో ఆత్మీయుల ఙ్ఞాపకాలు వెచ్చగా కదిలి మనసుతో కలిసి, కరిగి కన్నీరై కళ్ళ నుండి జాలువారుతాయేమో కదా!! మరి అమ్మ ఙ్ఞాపకాలన్నీ అలా నన్ను వదిలి వెళ్ళి పోతే ఎలా మరి !! అందుకే ఇకపై ఏడవను.

కేవలం సర్వీస్ చేయడానికే పుట్టినట్లు గుంటూరు ఆర్&బి సర్కిల్ ఆఫీస్ సుపరింటెండెంట్ గా రిటైరైన ఆరునెలల లోపే మమ్మల్ని వదిలి వెళ్ళి పోయిన మా అమ్మ "నేలటూరి దయామణి" కి అశృ నివాళి సమర్పించుకోడం తప్ప మేమేం చేయగలం. అమ్మా! అక్షరాలకు అందని ఆప్యాయత, మాటలకందని మమతాను రాగాలకు ప్రతి రూపం నువ్వు, వెల లేని అనురాగం, ఆప్యాయతలు పంచిన ప్రేమ మూర్తిగా, మంచితనానికి, నీతి, నిజాయితీ లకు మారు పేరు గా నిలచి, కొవ్వొత్తి లా నువ్వు కరిగిపోయి మా జీవితాలలో వెలుగు నింపి, తీరిగి రాని లోకాలకు పయనమైన నీ ఆత్మకు శాంతి చేకూరాలని. నువ్వెక్కడ ఉన్నా నీ ఆశీస్సులు, మార్గదర్శకాలు మమ్ము ముందుకు నడిపిస్తాయని ఆశిస్తూ.

నీ ఙ్ఞాపకాలలో, నువు పంచిన ఆత్మీయత లో..
నీ కోసం వెతుకుతూ మేము....

గురువారం, ఫిబ్రవరి 19, 2009

బొమ్మను చేసీ.. ప్రాణము పోసీ.. ఆడేవు నీకిది వేడుకా !!

ఈ పాట గురించి ఏమని చెప్పను. ఘంటసాల గారి గాత్రం తో మనసు ను మెలి పెట్టే పాట. ఆత్మీయులను కోల్పోయినపుడు గుర్తొచ్చి మరింత భాధ పెట్టే పాట. ఆపద్బాన్ధవుడు లో అడిగినట్లు "ఆ దేవుడి కి తను చేసుకున్న బొమ్మ ల పై తనకు హక్కు లేదా" అని అడుగుతున్నారా ?, మరి అలా తన ఇష్టమొచ్చినట్లు ఆడు కుందామని అనుకున్నపుడు ఆ బొమ్మల మధ్య అనుభంధాలు, మమతానురాగాలు ఎందుకు సృష్టించాలి ? ఏంటో ఈ దేవుడు !! అందుకే ఒకటి మాత్రం నిజం... తలచేది జరుగదూ... జరిగేది తెలియదూ... !!



చిత్రం: దేవత (1965)
సంగీతం : యస్.పి. కోదండపాణి
సాహిత్యం : శ్రీశ్రీ
గానం : ఘంటసాల

బ్రతుకంత బాధ గా... కలలోని గాధ గా...
కన్నీటి ధారగా.... కరగి పోయే...
తలచేది జరుగదూ... జరిగేది తెలియదూ... !!

బొమ్మను చేసీ.. ప్రాణము పోసీ.. ఆడేవు నీకిది వేడుకా.. ||2||
గారడి చేసీ.. గుండెలు కోసీ.. నవ్వేవు ఈ వింత చాలికా...

|| బొమ్మను ||

అందాలు సృష్టించినావు.. దయతో నీవూ..
మరల నీ చేతితో నీవె తుడిచేవులే..
అందాలు సృష్టించినావు.. దయతో నీవూ..
మరల నీ చేతితో నీవె తుడిచేవులే..
దీపాలు నీవే వెలిగించినావే.. ఘాఢాంధకారాన విడిచేవులే..
కొండంత ఆశా.. ఆడియాశ చేసీ...
కొండంత ఆశా.. ఆడియాశ చేసీ.. పాతాళ లోకాన తోసేవులే..

|| బొమ్మను ||

ఒక నాటి ఉద్యానవనమూ.. నేడు కనమూ..
అదియే మరుభూమి గా నీవు మార్చేవులే..
ఒక నాటి ఉద్యానవనమూ.. నేడు కనమూ..
అదియే మరుభూమి గా నీవు మార్చేవులే..
అనురాగ మధువు అందించి నీవు.. హలా హల జ్వాల చేసేవులే
ఆనందనౌకా పయనించు వేళా..
ఆనందనౌకా పయనించు వేళా.. శోకాల సంద్రాన ముంచేవులే !!

|| బొమ్మను ||

బుధవారం, జనవరి 21, 2009

దారిన పోయే దానయ్య లు !!

ప్రయాణం లో చికాకులు ఎన్ని ఉన్నా చివరికి విమానం శంషాబాద్ విమానాశ్రయం లో ల్యాండ్ అయింది, లగేజి పికప్ కోసం మెల్లగా Baggage Carousel (ఈ పక్కన ఫోటో లో ఉన్నది) దగ్గరకు చేరుకున్నాను. నేపద్యం లో విమానాశ్రయం సిబ్బంది రక రకాల ప్రకటనలు చేస్తున్నారు వాటిలో ఒకటి, "విమానాశ్రయము నందు మీకు పెయిడ్ పోర్టర్ సౌకర్యము కలదు..మీ సామాను మోయుటకు పోర్టర్ సిబ్బంది సేవలను ఉపయోగించు 'కొన' వచ్చును.." అని అంటూ చెప్తుంది. ఇది చాలా శ్రద్దగా విన్నాడేమో నా పక్కన ఉన్న ఒకాయన పాపం కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ తరపున సాయం చెయ్యడానికి వచ్చిన వాళ్ళ మీద గయ్ గయ్ మంటూ విరుచుకు పడి పోయాడు. మాములు గా అయితే పాపం మర్యాద గా చెప్పి ఉండే వాడేమో కానీ "మరి ఎవరు ఎయిర్ లైన్స్ వాళ్ళో ఎవరు పోర్టర్ సిబ్బందో ఎలా తెలుస్తుంది ఎందుకు వచ్చిన గోలా, నా సామాను నేనే మోసుకుంటే పోలా !!" అని అనుకున్నాడేమో, దాంతో వాళ్ళు బలి. నాకు ఆ కింగ్ ఫిషర్ జనాలని చూస్తే బోల్డు కొంచెం జాలేసింది :-) విజయ్ మాల్యా నేమో అతి మర్యాదలూ.. అతిథి మర్యాదలూ అని "Hospitality is more important" అని సిబ్బంది కి తర్ఫీదు ఇచ్చి పంపుతుంటే, అంత మర్యాద కి అంత గా అలవాటు పడని మనవాళ్ళు ఆ సర్వీసుని సరిగా అర్ధం చేసుకో లేక సిబ్బంది ని కసురుకుంటుంటే,, ఏం చేయాలో పాలు పోక పాపం సతమతమౌతున్నారు ఈ కింగ్ ఫిషర్ సిబ్బంది. సరే కింగ్ ఫిషర్ గురించి మరో రోజు రాస్తాను, మన టపా విషయానికి వస్తే...

నా ట్రిప్ లో నేను ఎక్కువ భాగం రోడ్ మీదే గడపాల్సి వచ్చింది. సో అవసరమైనప్పుడల్లా ఓ రెంటల్ కార్ తీసుకుని ఊళ్ళు తిరగడం జరిగింది నేను ఇండియా లో ఉన్నప్పుడు అంటే 2006 డిశంబర్ వరకూ కూడా చెవీ వ్యాన్ లు అంతగా పేరు తెచ్చుకోలేదు. కానీ మొన్న ఎక్కడ చూసినా ఛెవీ టవేరా (ఈ పక్కన ఫోటో లో ఉన్నది) chevrolet Tavera నే కనిపించింది. ఏ ట్రావెల్స్ వాడ్ని ఆడిగినా ముందు ఇదే బండి ఇవ్వడం మొదలు పెట్టారు. అప్పట్లో సుమో, తర్వాత క్వాలిస్ ఆ తర్వాత స్కార్పియో కొన్ని రోజులు తిరిగింది కానీ దాన్ని త్వరలోనే ఈ బండి రిప్లేస్ చేసింది సార్ అని కథలు కథలు గా చెప్పారు ట్రావెల్స్ జనాలు. అమెరికా లోనే అంతంత మాత్రం గా ఉపయోగించే ఈ అమెరికన్ వ్యాన్ ఇంతగా ఆంద్రా లో ప్రాముఖ్యత సంతరించుకుంటుంది అనేది నేను ఊహించలేదు. సరే అలాంటి ఓ పన్నెండు గంటల ట్రిప్ లో ఓ రోజు కంభం అనే ఊరిలో బోజనం చేయాల్సి వచ్చింది.

ఊరు చూస్తే చాలా చిన్న ఊరు లా ఉంది, అప్పటికే టైమ్ తొమ్మిదిన్నర అయిందీ, ఈ ఊరు దాటితే మరో ఊరు రావడానికి ఎంత లేదన్నా అరగంట టైం పడుతుంది సో ఇక్కడే ఏదో తినేద్దాం అని ఏదో చిన్న సెంటర్‌లా కనిపించిన చోట ఆపి, మా డ్రైవర్ దిగి వెళ్ళి కనుక్కుని వచ్చి "పైన సెంటర్ లో ఉన్నాయంటండీ.." అని అంటే మళ్ళీ బయల్దేరాం కొంచెం దూరం వెళ్ళాం కానీ ఎక్కడా ఏమీ కనిపించ లేదు ఇంతలో ఆ దారిన పోయే ఒకతను కనిపింఛాడు. అతనిదగ్గర లో బండి ఆపి "బాబూ ఇక్కడ మంచి హోటల్స్ ఏమున్నాయ్.." అని అడిగాం అతను మేం అడగడం ఆలశ్యం ఓ క్షణం ఆలో చించి మీకు ఎలాంటి బోజనం కావాలి అని అడిగి ఇదిగో ఫలానా సెంటర్ కి వెళ్తే ఫలానా హోటల్ ఉంటుంది అక్కడకి వెళ్ళండి అని వివరం గా స్పీడ్ బ్రేకర్ లు సిగ్నల్ లైట్స్ తో సహా దారి చెప్పడమే కాకుండా అక్కడ ఏమేం దొరుకుతాయో ఏవి బాగుంటాయో చాలా వివరంగా ఓపిక గా ఏమాత్రం విసుగు లేకుండా చెప్పాడు. ఆ హోటల్ మీదేనేమిటోయ్ కొంపదీసి అంటే "లేదండీ మా ఊర్లో రుచికరమైన బోజనం అక్కడే దొరుకుద్దండీ.." అని చెప్పాడు. అతనికి థ్యాంక్స్ చెప్పి శలవు పుచ్చుకున్నాక మేమంతా ఒకరి మొహాలు ఒకరం చూసుకుంటూ మొత్తానికి భలే వాడిని అడిగాం అనుకున్నాం.

తీరా అక్కడికి వెళ్ళి చూస్తే అది చాలా చిన్న హోటల్ శుబ్రత గురించి కొంచెం అనుమానం వచ్చింది. ఒక పది నిముషాలు కాస్త రేట్ ఎక్కువ వసూల్ చేసే పెద్ద హోటల్ దొరుకుతుందేమో అని వెతికి.. ఏమీ దొరక్క సరె మా దానయ్య మీద భరోసా ఉంచి అక్కడే తిందాం అని కూర్చున్నాం. వడ్డించే ముందు అతను ముందుగా వాష్ బేసిన్ లో చేయి కడుక్కుని మొదలు పెట్టటం చూసాక పర్లేదు ధైర్యం గానే తినచ్చు అనుకున్నాం. మా దానయ్య చెప్పినట్లే భోజనం వేడిగా, చాలా రుచి గా ఉంది. హోటల్ చూసి పదార్దాల రుచిని అంచనా వేయ కూడదు అని మరో సారి నిర్ధారించుకున్నాను. మొత్తం మీద ఆ దారిన పోయే దానయ్య పుణ్యమా అని అంత రాత్రి వేళ ఆ కంభం లొ కమ్మని భోజనం చేసాం. ఇటువంటి సౌలభ్యం ఈ అమెరికా లో బాగా మిస్ అవుతాను నేను. ఇక్కడ అలా దారే పోయే వాడిని ఆపితే వాడేం చేస్తాడో అని భయం, అదే కాక ఏదో డౌన్ టౌన్ లో తప్ప అసలు ఇక్కడ రోడ్ మీద జనం కనపడటమే గగనమాయె, సో చచ్చినట్లు దారి లో కనిపించిన ఏ చెత్త రెస్టారెంట్ లోనో దొరికిన గడ్డి తిని తృప్తి పడాల్సిందే...

ఇదే ట్రిప్ లో ఒక సారి ఆళ్ళగడ్డ సమీపిస్తుండగా చాంతాడు లాంటి ట్రాఫిక్ జామ్ ఎదురైంది మా బండి చివరి లో ఉంది ముందంతా కనుచూపు మేరా బస్ లు లారీ లు ఆగి ఉన్నాయి. మేము ట్రాఫిక్ జామ్ ని సమీపిస్తూ దేవుడా దీన్లో నుండి ఎప్పటికి రా బాబు బయట పడేది అని అనుకుంటూ, ఏమైంది అని వాకబు చేస్తే. మరో దానయ్య స్వచ్చందం గా ముందుకు వచ్చి "సెంటర్ లో ఎరువులు అందలేదని రైతులు ధర్నా చేస్తున్నారండీ ఇప్పట్లో తేలే లా లేదు చాలా సెపటి నుండీ బళ్ళు ఆగున్నాయ్.. మీరేడికెళ్ళాళా? " అని అడిగాడు. ఊరు దాటి వెళ్ళాళి బాబు అని చెప్తే "అయితే మీరు కాస్త ఎనక్కి వెళ్ళి ఆ కనబడే మట్టి రోడ్డంబడి వెళ్తే ఊళ్ళో సందులగుండా సెంటర్ లో ధర్నా ని తప్పించుకుని ఎళ్ళచ్చు.." అని దారి చెప్పాడు. అతను చెప్పిన రూట్ లో వెళ్ళి ఒక ఇరవై నిముషాల్లో మళ్ళీ హైవే ఎక్కాం మనసులోనే అతనికి ధన్యవాదాలు తెలుపుకుంటూ. ఇలా సాయం తీసుకోడం లో కూడా రిస్క్ ఉందండోయ్.. ప్రత్యేకంగా రాత్రి పూట మీరు ప్రయాణం చేయాల్సి వచ్చినపుడు ఎప్పుడూ కూడా ఇలా మధ్య లో అడిగిన వాళ్ళ కి మీ చివరి గమ్యం చెప్పకండి. వాళ్ళెవరో తెలియదు కనుక దొంగలు అయ్యే అవకాశం కూడా ఉంది కనుక వీలైనంత దగ్గర ఊరి పేరు మాత్రం చెప్పండి చాలు. అందరూ మంచి వాళ్ళే దొరకరు కదా మన జాగ్రత్త లో మనం ఉండాలి మరి.

ఆదివారం, జనవరి 11, 2009

ముత్యాల పల్లకి (1976)

నా చిన్నతనం లో నేను చాలా సార్లు విన్న పాటలు ఇవి రెండూ.. అప్పట్లో పెళ్ళికి వెళ్తే "సన్నా జాజి కి..." పాట తప్పని సరిగా వినిపించే వారు. కొన్ని రోజులు గా ఎందుకో ఈ పాటలు గుర్తొస్తున్నాయి. మీరూ ఓ సారి విని గుర్తు చేసుకుని ఆనందించండి. మల్లెమాల గారు రాసిన సాహిత్యం సరళంగా అందం గా ఉంటుంది. తెల్లవారక ముందే పాట, రెండవ చఱణం లో పల్లెల గురించి ఎంత బాగా చెప్పారు అనిపించక మానదు. ఈ సంక్రాంతి సమయం లో పల్లెలు మరింత గుర్తొచ్చి మనసు భారమౌతుంది కదా !!


తెల్ల వారక ముందే.. పాట ను ఇక్కడ (చిమట మ్యూజిక్ లో) వినండి.

చిత్రం: ముత్యాల పల్లకి
సంగీతం : సత్యం
సాహిత్యం : మల్లెమాల

తెల్లా వారక ముందే పల్లే లేచిందీ..
తన వారినందరినీ తట్టి లేపిందీ..
ఆదమరచి నిద్ర పోతున్న తొలికోడి..
అదిరి పడి మేల్కొంది అదే పనిగ కూసింది..

||తెల్లా వారక ముందే||

వెలుగు దుస్తులేసుకునీ సూరీడూ..
తూర్పు తలుపు తోసుకుని వచ్చాడు
పాడు చీకటికెంత భయమేసిందో..
పక్క దులుపు కుని ఒకే పరుగు తీసిందీ..
అది చూసీ.. లతలన్నీ.. ఫక్కున నవ్వాయి..
ఆ నవ్వులే ఇంటింటా పువ్వులైనాయి..

||తెల్లా వారక ముందే||

పాలావెల్లి లాంటి మనుషులు...
పండూ వెన్నెల వంటీ మనసులు
మల్లె పూల రాశి వంటి మమతలూ..
పల్లె సీమలో కోకొల్లలూ..
అనురాగం.. అభిమానం...
అనురాగం అభిమానం కవల పిల్లలూ..
ఆ పిల్లలకూ పల్లెటూళ్ళు కన్న తల్లులూ..

||తెల్లా వారక ముందే||


~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*


సన్న జాజికి గున్న మావికి.. పాట ను ఇక్కడ (చిమట మ్యూజిక్ లో) వినండి.

చిత్రం: ముత్యాల పల్లకి (1976)
సంగీతం : సత్యం
సాహిత్యం : మల్లెమాల
గానం : బాలు, సుశీల

సన్నాజాజి కి గున్నా మావికి పెళ్ళికుదిరిందీ..
మాటే మంతీ లేని వేణువు పాట పాడిందీ.. ||సన్నజాజికి||
హాహహా ఆ ఆ...హాహహా ఆ ఆ...

గున్నా మావికి సన్నా జాజికి పెళ్ళి కుదిరిందీ..
నాదే గెలుపని మాలతీ లత నాట్యమాడిందీ.. ||గున్నా మావికి||
హాహహా ఆ ఆ...ఓహో.హోహ్హో...

పూచే వసంతాలు మా కళ్ళ లో..
పూలే తలంబ్రాలు మా పెళ్ళి లో..
పూచే వసంతాలు మా కళ్ళ లో..
పూలే తలంబ్రాలు మా పెళ్ళి లో..
విరికొమ్మా.. చిరు రెమ్మా..
విరికొమ్మ చిరు రెమ్మ
పేరంటానికి రారమ్మా

||సన్నాజాజికి||

కలలే నిజాలాయె ఈ నాటి కీ...
అలలే స్వరాలాయె మా పాట కీ
కలలే నిజాలాయె ఈ నాటి కీ...
అలలే స్వరాలాయె మా పాట కీ
శ్రీరస్తూ...శుభమస్తూ..
శ్రీరస్తు శుభమస్తు
అని మీరూ మీరు దీవించాలి

గున్నా మావికి సన్నా జాజికి పెళ్ళి కుదిరిందీ..
నాదే గెలుపని మాధవీ లత నాట్యమాడిందీ...
సన్నాజాజి కి గున్నా మావికి పెళ్ళికుదిరిందీ..

గురువారం, జనవరి 08, 2009

నేటి ఆంధ్రజ్యోతి దిన పత్రిక లో నా బ్లాగు !!

నా బ్లాగు లో నే రాసుకున్న "నాన్న తో షికార్లు !!" టపాను ఉదహరిస్తూ, ఆంధ్ర జ్యోతి పేపరు వారు నేటి (8th Jan-2009) నవ్య అనుబంధం లో నా బ్లాగు గురించి పరిచయం చేసారు. ఈ సంధర్బంగా ఆంధ్రజ్యోతి వారికీ, నవ్య నిర్వాహకులకు ధన్యవాదములు.

నా బ్లాగును కనుగొని, ఓపికగా రెండు టపాల నుండి ఎంపిక చేసిన పేరాలు కూర్చి, స్వల్ప మార్పులతో నా బ్లాగు పరిచయం గా ప్రచురించిన వారికి (ఆ వ్యక్తి ఎవరో తెలియదు) ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

అలానే పొద్దు లో 2008 డిసెంబరులో తెలుగు బ్లాగుల ప్రస్థానం లో నా టపాకు స్థానం కల్పించిన చదువరి గారికీ, పొద్దు సంపాదకీయానికి నెనర్లు. బహుశా ఆంధ్ర జ్యోతి వారు అక్కడి నుండే నా బ్లాగు చూడటం తటస్థించి ఉండచ్చు.

బొమ్మ లో ఉన్నది చదవాలంటే, బొమ్మ పై క్లిక్కండి, పెద్ద గా కనిపిస్తుంది.



శుక్రవారం, డిసెంబర్ 26, 2008

సాయము వలదా !! ఓ చెయ్ వేసేదా...

కొన్ని నెలల క్రితం అంటే ఆగస్ట్ లో నేను ఇండియా వెళ్ళివచ్చాను చాలా మంది బ్లాగ్ మిత్రులకు తెలుసు ఆ విషయం. అప్పటి కొన్ని అనుభవాలు బ్లాగ్ లో పంచుకోడానికి ఇప్పటికి వీలు దొరికింది. ఏం చేయమంటారు చెప్పండి నా బ్లాగ్ ధీం ఙ్ఞాపకాలు కదా, మరి అందుకే ఇన్ని రోజులు గడచిన తరవాత కానీ రాయడానికి కుదరడం లేదు :-) రావు గారు చెప్పినట్లు ఎప్పటికప్పుడు ట్రావెలాగుడు రాయగలిగితే బాగుండేది కానీ అది మన స్కూలు కాదు, అదీ కాక అసలు అన్ని విశేషాలు ఏమీ లేవు. ఎక్కడికైనా సైట్ సీయింగ్ కి వెళ్తే ఏమన్నా ఉంటాయ్ కానీ ఏదో పర్సనల్ ట్రిప్ కి ఇంటికి వెళ్ళినపుడు ఏముంటాయ్ చెప్పండి మనకీ రోజూ తారస పడే వ్యక్తులూ సంఘటనలలోనే నాకు ప్రత్యేకంగా అనిపించినవి రాద్దామని ప్రయత్నిస్తున్నా... ఓ రెండు మూడు టపాలకి సరిపడా విషయం ఉండి ఉంటుందనుకుంటున్నా, సరే ఇక ఉపోద్ఘాతం ఆపేస్తాను, మరి చదవండి.

నాకు ఎంత విదేశీ ప్రయాణమయినా ముందు సర్దుకునే అలవాటు అస్సలు లేదు, ఎప్పుడూ ఓ వారం ముందే సర్ధుకోవాలని అనుకుంటాను కానీ, ప్రయాణం రేపనగా ఈ రోజు రాత్రి ఏ పది గంటలకో పాత సూట్కేస్ తీసుకుని దుమ్ము దులపడం మొదలు పెడతాను. ఈ అలవాటు ఇప్పటిది కాదు లెండి. మన ఇంజినీరింగ్ పరీక్షలకి కూడా ఇంతే చదివే వాడ్ని ఓ సారి ఇలానే పరీక్ష ముందు రోజు రాత్రి నైట్ ఔట్ కి సిద్దమయ్యి పుస్తకం తీసి, ఓం ప్రధమంగా మొదటి పేజీ చదువుతుంటే అటుగా వచ్చిన పక్క రూమ్ వాడు నన్ను చూసి దాదాపు మూడవ అంతస్థు నుండి కిందకి దూకినంత పని చేసాడు, "హబ్బే నాకు ఏదో అనుమానం వచ్చి ఇండెక్స్ చూస్తున్నా లే మామా నువ్వు ఖంగారు పడకు.." అని నేను సర్ది చెప్ప బట్టి సరిపోయింది కానీ లేదంటే నిజంగా దూకేసే వాడే పాపం.

సరే అలా విమానం బయల్దేరడానికి కాస్త టైం ముందు వరకు కూడా సర్దుకుంటూ హడావిడిగా చెకిన్ కార్యక్రమాలన్నీ ముగించి విమానం లో పడే సరికి అప్పటికే అందరూ బోర్డ్ చేసి ఉండటం తో నా కేబిన్ లగేజి కి ప్లేసు దొరకలేదు. పైన ఉన్న ఖాళీ లో ఒక బేగ్ కుక్కేసాను. కానీ లాప్టాప్ ఉన్న బ్యాక్ ప్యాక్ ఎక్కడ పెట్టాలో దొరక లేదు ఇంతలో నా ముందు సీటు కి పైన ఉన్న కంపార్ట్మెంట్ ఓపెన్ చేసి చూద్దును కదా ఏవో నాలుగు చిన్నప్లాస్టిక్ సంచులు తప్ప ఏమీ లేవు అవన్నీ ఓ పక్కకి లాగి పెడితే నా బ్యాగ్ ఈజీ పడుతుంది అని నేను ప్రయత్నించే లోపే ముందు సీట్లో ఓ పెద్ద మనిషి లేచి, "మేమింతకు ముందే ప్రయత్నించాము అక్కడ ఇంకేవి పట్టవు నీ బ్యాగ్ కాళ్ళదగ్గర పెట్టుకో.." అని ఓ సలహా పారేసాడు. అసలే చిరాకు గా ఉన్నానేమో ఎడా పెడా వాయించి పడేసి "నేను ఇక్కడే పెడతాను నీ దిక్కున్న చోట చెప్పుకో పో.." అన్నంత గా అరిచేసాను అసలే పద్నాలుగు గంటల ఏక బిగి ప్రయాణమాయే, చికాగో నుండి ఢిల్లీ కి ఒకే విమానం, అంత సేపు కాళ్ళ దగ్గర ఓ బ్యాగ్ తో చాలా చిరాకు అనే ఆలోచన ఒక్కటే నాచేత మాట్లాడిస్తుంది. ఆఖరికి ఓ అటెండెంట్ వచ్చి "ఎదురు గా ఇంకో చోట చిన్న ఖాళీ ఉంది దాన్లో పెడ్తాను ఇవ్వరా.." అంటే నేను చాలా మూర్ఖంగా అసలటు చూడకుండానే అది చాలా చిన్న ఖాళీ అక్కడ పట్టదు అని చెప్పాను. అతను నిశ్శబ్దంగా నా బ్యాగ్ తీసుకుని అక్కడ సర్దేసాడు.

ఆ తర్వాత ఓ పది నిముషాలకి కానీ నేను ఎలా బిహేవ్ చేశాను అనే విషయం అర్ధమ్ కాలేదు నాకు. ముందు సీట్ అతనికి సారీ చెప్దామా అని అనుకున్నా కాసేపు కానీ మనకి అంత మంచి బుద్ది, సంస్కారం ఎక్కడేడ్చింది, ఆ ఎవడో లే వాడికి సారీ చెప్పక పోతే మాత్రం ఏమయ్యింది అన్నట్లు చివరకి చెప్పకుండానే ఫ్లైట్ దిగేశాను. ఇప్పటికీ అప్పుడప్పుడూ ఆ బిహేవియర్ తలచుకొని బాధ పడుతుంటాను ఒకో సారి బొత్తిగా మనం ఏం చేస్తున్నామో మనకే తెలియనట్లు బిహేవ్ చేస్తాం ఎప్పటికి మారేనో ఈ బుద్ది అని అనిపించింది.

నేను సాధారణంగా ఒంటరి గా ప్రయాణిస్తుంటాను కనుక ప్రయాణం లో ఇతరులని గమనిస్తుండటం అలవాటు అదే ఫ్లైట్ లో ఓ కుర్రవాడ్ని చూసాను. సౌతిండియన్ లానే ఉన్నాడు ఒంటరిగా ప్రయాణం చేస్తున్నాడు మధ్య మధ్య లో లేచి అటూ ఇటూ నడుస్తూ అందరినీ పలకరిస్తూ చాలా కలుపు గోలు గా ఉన్నాడు. ఎవరో కుర్రాడు బాగ హుషారు గా ఉన్నాడే అనుకున్నా కాని అతను చేసిన ఓ సాయం చూసి చాలా ముచ్చటేసింది. ఓ నార్తిండియన్ మామ్మ గారు వాళ్ళ అబ్బాయి చేతులు పట్టుకుని నడిపిస్తుంటే నడవలేక నడవలేక నడుస్తుంది. ఆవిడ్ని చూసిన మన వాడు వెంటనే కిందకూర్చుని కాళ్ళు రెండూ పట్టుకుని తన చేతులతో ఆవిడ కాళ్ళ చేత ఆడుగులు వేయించాడు. ఏ సంబంధం లేని అతనలా సాయం చేస్తుంటే భేష్ అని అనుకోకుండా అతనిని అభినందించ కుండా ఉండ లేక పోయా.

ఇలాంటి జెన్యూన్ హెల్పర్స్ ఒక తీరైతే వేరో జాతి కూడా కనిపిస్తుంటారు. ఓ పాత పాట ఉంటుంది "మీ అందాల చేతులు కందేను పాపం ఎందుకు ఈ బెడద.. సాయము వలదా ఓ చెయ్ వేసేదా..." అని అంటూ హరనాధ్, పద్మనాభం మిత్ర బృందం తో కలిసి జమునా ని మిత్ర బృందాన్ని ఆట పట్టిస్తూ పాడతారు. ఆ పాట మంచి సరదాగా ఉంటుంది. అలానే కొందరు అబ్బాయిలు, ప్రత్యేకించి మిడిల్ ఏజ్ అంకుల్స్ (నొ అఫెన్స్ , భుజాలు తడుము కుంటే నే చేయ గలిగింది ఏమీ లేదు.) అమ్మాయిలు కనపడగాన సాయం చేయడానికి ముందుంటారు అలాంటి ఓ చిన్నారావ్ గురించి చెప్పుకుందాం. (అసలు ముందు తోట రాముడు గార్నడిగి దినకరుడ్ని అప్పు తెచ్చుకుందాం అనుకున్నా కానీ, అసలే దినకర్ అనే ఆయన నిజ్జంగా ఉన్నాడని ఈ మధ్య చదివాం కదా, మళ్ళీ ఆయన తీసుకొనే సివిల్ మరియూ క్రిమినల్ చర్యలతో ఎందుకొచ్చింది చిక్కూ. అదీ కాక, ఏమన్నా తేడా వస్తే, ఆయన అభిమానులంతా మా ఇంటి మీద దాడి చేసి, మా ఇంటి కి నల్ల రంగు వేసి నిరసన తెలుపుతారేమో "ఎందుకొచ్చిన గొడవరా దేవుడా.." అని అనుకుని ఈ మధ్యనే మళ్ళీ చూసిన ఏప్రిల్ ఒకటి విడుదల లోని పేను కొరుకుడు చిన్నారావ్ పేరు పెట్టుకున్నా అదనమాట విషయం).

సరే ఈ సదరు చిన్నారావ్ గార్లకి అమ్మాయిలు కనిపిస్తే చాలు సాయం చేయడానికి రడీ అయిపోతారు, అబ్బాయిలో, వయసు పై పడిన మహిళలో, మరొకరో ఎంత అవస్థ పడుతున్నా అస్సలు వీరి కంటికి కనపడరు. అదేదో సినిమాలో ధర్మ వరపు సుబ్రహ్మణ్యం ఇలాంటి లెక్చరర్ పాత్ర వేసి తెగ నవ్విస్తాడు. క్లాస్ లో అబ్బాయిలని విసుక్కుంటూ అమ్మాయిల వైపే తిరిగి పాఠం చెబుతూ.. ఇలా మన సదరు చిన్నారావ్ కూడా ఇదే బాపతు. నాకు ఢిల్లీ నుండి హైదరాబాద్ వెళ్ళే ఫ్లైట్ లో తగిలాడు నాది విండో సీట్ నా పక్క సీట్ లో ఓ అమ్మాయి తన పక్కన ఎయిల్ సీట్ మన చిన్నారావ్ గారిది. నేను నా మానాన పాటలు వింటూ మన వాడి వీరంగం గమనిస్తూ ఉన్నా, మధ్యలో ఓ సారి కాఫీ లో క్రీమ్ తక్కువైందని ఫ్లైట్ అటెండెంట్ (మగవాడు) పై గొడవ పడ్డాడు ధుమ ధుమ లాడుతూ కూర్చున్నాడు, కానీ పక్కన అమ్మాయ్ తో మాట్లాడేప్పుడు మాత్రం ఎక్కడ లేని నవ్వు వచ్చేస్తుంది అన్న గారి మొహం లో.

ముందు రోజు సర్దుకోడానికో నైట్ ఔట్, ఢిల్లీ విమానాశ్రయం లో ఓ నైటౌట్ ఇవి రెండే కాక ప్రయాణం వలన, బాగా అలసి పోయి ఉన్నానేమో మెల్లగా నా కళ్ళు అరమోడ్పులై, నే నిద్రా దేవి ఒడిలో సేద దీరడానికి ఉపక్రమించేంతలో చేతి పై ఎవరో బలంగా చరిచి నట్లై ఉలిక్కి పడి లేచాను చూస్తే మన అంకుల్ అప్పుడే అరలీటరు ఆముదం అర్జంట్ గా తాగిన వాడి లా మొహం ధుమ ధుమ లాడిస్తూ నన్ను చరిచిన చేతి నే పైకీ కిందకీ ఆడిస్తూ సంఙ్ఞ చేస్తున్నాడు ఏంటా ఇతని గోల అని ఓ నిముషం ప్రాసెస్ చేసి ఆలో చిస్తే కిటికీ వేయమని చెప్పటానికి వచ్చిన తిప్పలు. ఆ ఫేస్ చూసి, అతను చెప్పిన అమర్యాద కరమైన విధానాన్ని చూసి నాకు ఎంత చిరాకు వచ్చిందంటే, వెంటనే ఆ చేతిని అలానే పట్టుకుని పవన్ కల్యాణ్ రేంజిలో వేళ్ళని వెనక్కి విరిచి అతన్ని సీట్ లోంచి పైకి లేపి విసిరి సీలింగ్ కి వేసి కొట్టాలి అనిపించింది. తర్వాత కాసేపెలాగో నిద్ర పోడానికి ప్రయత్నించాను. మధ్య మధ్య లో మెలకువ వచ్చినప్పుడల్లా గమనిస్తూనే ఉన్నాను పాపం ఆమె పుస్తకం చదువుకుంటూ అసహనం గా సమాధానాలు ఇస్తుంటే మన వాడు ఏ మాత్రం సంకోచం లేకుండా ఓ స్పూనేస్కుని మరీ ఆ అమ్మయ్ బ్రైన్ తినేస్తున్నాడు. సరే ల్యాండ్ అయ్యాక అతను ముందు లేచి అతని లగేజి కూడా తీస్కోకుండా మీ బ్యాగ్ ఏది... అని ఆమెని ఆడిగితే తను మర్యాద గా నేను తీస్కుంటానులేండి అని తిరస్కరించింది. నేను మనసులో "రేయ్ ఇలా రార ఆవిడని కాదు రా అడగాల్సింది అక్కడ మోయలేనిపెద్ద వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళా సామాను మోసి పెట్టు రా... " అని అనుకున్నా బయటకి అనడానికి ధైర్యం చాలక.

అన్నట్లు, హైదరాబాద్ లో దిగేప్పుడు గ్లాస్ బిల్డింగ్ మధ్య లో తెల్లని పెద్ద పెద్ద అచ్చ తెలుగు అక్షరాల తో "రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం" అని అంటూ స్వాగతం పలికిన కొత్త ఎయిర్ పోర్ట్ లో అచ్చ తెలుగు లో హొయలు పోతూ కనువిందు చేసిన అక్షరాలని చూసి మనసు పులకించి పోయింది.

మరిన్ని విశేషాలతో మరో టాపాలో కలుద్దాం. అంతవరకు శలవ్....
--వేణూ శ్రీకాంత్

సోమవారం, డిసెంబర్ 22, 2008

బృందావని - తిల్లాన - బాలమురళీకృష్ణ

రుద్రవీణ సినిమా లో ప్రఖ్యాత సంగీత కళాకారుని కొడుకైన కధానాయకుడు కట్టెలు కొట్టుకునే వాళ్ళ దగ్గరకు వెళ్ళినపుడు వాళ్ళు "మీ నాన్నగారి పాట యినే అదృష్టం మాకెలాగూ లేదు మీరైనా మాకోసం ఏదైనా ఓ పాట పాడండయ్యా.." అని మన కధానాయకుడిని అడుగుతారు దానికతను ఓ మంచి ఆలాపన తో మొదలు పెట్టగానే కొందరు నోళ్ళు తెరుచుకుని అర్ధం కాని మొహంతో చూస్తుంటే, మరికొందరు బుర్ర గోక్కుంటూ ఉంటే, మరికొందరు దిక్కులు చూస్తూ ఉంటారు, తను కొంచెం విరామం ఇవ్వగానే అందరూ కలిసి "కాస్త మంచి పాట పాడండయ్యా..." అని అమాయకంగా అడుగుతారు. అలానే డిగ్రీ పూర్తయి ఉద్యోగం లో చేరిన తర్వాత వరకూ కూడా నాకు కర్ణాటక సంగీతం ఒక అర్ధం కానీ సాగతీత కార్యక్రమం మాత్రమే అనే అభిప్రాయం ఉండేది.

అలాంటి నాకు మొదటి సారి ఈ సంగీతం అలవాటు చేసింది మా ఈ.యమ్.యస్.యన్.శేఖర్, వాడు నా ఇంజినీరింగ్ క్లాస్మేట్ నేను వాడు కలిసి ప్రాజెక్టు వర్క్ కూడా చేసాం. ఆ ప్రాజెక్టు వర్కు టైమ్ లో ఇద్దరం కలిసి కొన్ని సినిమా పాటలకి పేరడీ లు కట్టుకుని పాడుకునే వాళ్ళం కానీ కర్ణాటక సంగీతం గురించి ఎప్పుడూ మాట్లాడుకునే వాళ్ళం కాదు. ఇద్దరికీ ఉద్యోగాలు వచ్చిన కొత్తలో మద్రాసు లో టి.నగర్ పక్కనే ఉన్న వెస్ట్ మాంబళం లో ఒకే మాన్షన్ లో ఉన్న టైమ్ లో, వాడు బాలమురళి గారి కేసెట్ లు తెగ కొని తెచ్చే వాడు. అప్పట్లో నాదగ్గర పేనాసోనిక్ డబుల్ డెక్ డిటాచబుల్ స్పీకర్స్ ఉన్న టూఇన్‍వన్ ఉండేది (ఠాగూర్ సినిమాలో చిరంజీవి మొదటి సారి పంపిన కేసెట్ పోలీసులు వింటారు చూసారా అదే సిస్టం) దానిలో చాలా బాగ వచ్చేది స్టీరియో సౌండ్, బాస్ బూస్టర్ కూడా ఉండేది.

మేమంతా అప్పట్లో రిలీజైన తమిళ మాస్ పాటలు, ప్రియురాలు పిలిచే, జీన్స్ లాంటి సినిమా పాటలు ఈ టేప్ రికార్డర్ లో హై వాల్యూమ్ లో పెట్టుకుని వింటుంటే, అప్పుడప్పుడూ మా వాడు ఈ కర్ణాటక సంగీతం వినిపించే వాడు. మొదట్లో ఏంటి రా బాబు నీ గోల అనే వాడ్ని కానీ మెల్లగా నేను కూడా కర్ణాటక సంగీతానికి అడిక్ట్ అవడం మొదలు పెట్టాను. అప్పుడే కొన్ని రాగాల పేర్లు, కొందరు గాయకుల పేర్లు, బాలమురళి గారి పంచరత్నాలు, తిల్లానాలు వీటన్నింటి తో పరిచయం, దాని తో పాటే అభిమానం పెరిగింది. వాటన్నింటిలోనూ కర్ణాటక సంగీతం లో ఓనమాలు కూడా తెలియని నాలాంటి పామరులు సైతం బాగా ఆస్వాదించగల సంగీతం, బాలమురళి గారు స్వయంగా రచించి స్వరపరచిన తిల్లానాలు అని అనిపించేది. నిన్న ఉదయం ఈ బృందావని తిల్లాన వింటుంటే ఈ పాట కి కూడా లిరిక్స్ రాసుకుని నా బ్లాగ్ లో పెట్టాలి అనిపించింది, అందుకే ఈ దుస్సాహసం. ఈ తిల్లానాకు మొదట్లో వచ్చే ఆలాపన నాకు చాలా ఇష్టం, మీరు కూడా విని ఆస్వాదించి ఆనందించండి మరి.


గమనిక: ముందే చెప్పినట్లు నాకు సంగీతం గురించిన ఓనామాలు కూడా తెలియవు మామూలు సినిమా పాటలు వింటూ వాటి లిరిక్స్ ఎలా అయితే టైప్ చేసుకుంటానో అలానే ఈ తిల్లానా కి కూడా ప్రయత్నించాను. పెద్దలు ఎవరైనా తప్పులు గమనిస్తే నిస్సంకోచంగా కామెంట్స్ లో తెలియచేయండి సరిదిద్దుకుంటాను.

ఆఅఆఆ...ఆఅఆఅ..ఆ ఆ ఆ...
ననన దిల్లిల్లాన దిల్లాన నాదిరిధీం...ధీం.నాదిరిధీం..నాదిరిధీం..నాదిరిధీం..
ననన దిల్లిల్లాన దిల్లాన నాదిరిధీం...ధీం.నాదిరిధీం..నాదిరిధీం..నాదిరిధీం..
ననన దిల్లిల్లాన దిల్లాన నాదిరిధీం.ధీం.నాదిరిధీం..నాదిరిధీం..నాదిరిధీం..

ననన దిల్లిల్లాన దిల్లాన నాదిరిధీం.ధీం.నాదిరిధీం..నాదిరిధీం..నాదిరిధీం..
ననన దిల్లిల్లాన దిల్లాన నాదిరిధీం...ధీం.నాదిరిధీం..నాదిరిధీం..నాదిరిధీం..
ననన దిల్లిల్లాన దిల్లాన నాదిరిధీం...ధీం.నాదిరిధీం..నాదిరిధీం....
నాదిరిధీంనన..దింనన..తధిగిణతోం తకిట ఝం.తఝంతఝంత తఝం..తరిత ఝం..తరిత ఝం..తరిత...
నాదిరిధీంనన..దింనన..తధిగిణతోం తకిటఝం.తఝం తఝఝంత తఝంతరిత ఝం..తరిత ఝం..తరిత..నాదిరిధీం...
ననన దిల్లిల్లాన దిల్లాన నాదిరిధీం...ధీం.నాదిరిధీం..నాదిరిధీం..నాదిరిధీం..
ననన దిల్లిల్లాన దిల్లాన నాదిరిధీం...ధీం.నాదిరిధీం..నాదిరిధీం..నాదిరిధీం..
ననన దిల్లిల్లాన దిల్లాన నాదిరిధీం.ధీం.నాదిరిధీం..నాదిరిధీం..నాదిరిధీం..
ననన దిల్లిల్లాన దిల్లాన నాదిరిధీం...ధీం.నాదిరిధీం..నాదిరిధీం..
నాదిరిధీంనన..దింనన..తధిగిణతోం తకిట ఝం.తఝంతఝంత తఝం..తరిత ఝం..తరిత ఝం.తరిత...

నాదిరిధీంనన..దింనన..తధిగిణతోం తకిటఝం.తఝం తఝఝంత తఝంతరిత ఝం..తరిత ఝం.తరిత..నాదిరధీం...
ననన దిల్లిల్లాన దిల్లాన నాదిరిధీం.ధీం.నాదిరిధీం..నాదిరిధీం..నాదిరిధీం..
ననన దిల్లిల్లాన దిల్లాన నాదిరిధీం.ధీం.నాదిరిధీం..నాదిరిధీం..నాదిరిధీం..
ననన దిల్లిల్లాన దిల్లాన నాదిరిధీం...ధీం.నాదిరిధీం..నాదిరిధీం..నాదిరిధీం..
సొగసులూర హొయలుకోరి.నీ..దరి జే...రితినీ..
సొగసులూర హొయలుకోరినీ..దరిజే..రితిని..నీర క్షీర న్యాయమై మైమరచి సకల చరా చరమెల్ల పులకించి తీయని..
సొగసులూర హొయలుకోరినీ..దరిజే..రితిని..నీర క్షీర న్యాయమై మైమరచి సకల చరా చరమె పులకించి తీయని..
సొగసులూర హొయలుకోరీ.నీ..దరిజే..రితిని..నీర క్షీర న్యాయమై మైమరచి సకల చరా చరమె పులకించి..
తీయని హాయనిపించు చిరు రవళి నీ మురళీ మాధురీ...
తీయని హాయనిపించు చిరు రవళి నీ మురళీ మాధురీ...
తీయని సొగసులూర హొయలుకోరి.నీ..దరి జే..రితిని..నీర క్షీర న్యాయమై మైమరచి సకల చరా చరమె పులకించి..
తీయని హాయనిపించు చిరు రవళి నీ మురళీ మాధురీ...
తీయని హాయనిపించు చిరు రవళి నీ మురళీ మాధురీ...
తీయని హాయనిపించు చిరు రవళి నీ మురళీ మాధురీ...
తీయని హాయనిపించు చిరు రవళి నీ మురళిమాధురీ...
నాదిరిధీంనన..దింనన..తధిగిణతోం తకిట ఝం.తఝంతఝంత తఝం..తరిత ఝం..తరిత ఝం.తరిత...
నాదిరిధీంనన..దింనన..తధిగిణతోం తకిటఝం.తఝం తఝఝంత తఝంతరిత ఝం..తరిత ఝం.తరిత..నాదిరిధీం...
ననన తిల్లిల్లాన తిల్లాన నాదిరిధీం.ధీం.నాదిరిధీం..నాదిరిధీం..నాదిరిధీం..
ననన తిల్లిల్లాన తిల్లాన నాదిరిధీం.ధీం.నాదిరిధీం..నాదిరిధీం..నాదిరిధీం..
ననన తిల్లిల్లాన తిల్లాన నాదిరిధీం...ధీం.నాదిరిధీం..నాదిరిధీం..
నాదిరిధీంనన..దింనన..తధిగిణతోం తకిట ఝం.తఝంతఝంత తఝం..తరిత ఝం..తరిత ఝం.తరిత...
నాదిరిధీంనన..దింనన..తధిగిణతోం తకిటఝం.తఝం తఝఝంత తఝంతరిత ఝం..తరిత ఝం.తరిత..నాదిరధీం...
ననన తిల్లిల్లాన తిల్లాన నాదిరిధీం.. ననన తిల్లిల్లాన తిల్లాన నాదిరిధీం..
ననన తిల్లిల్లాన తిల్లాన నాదిరిధీం.ధీం.నాదిరిధీం..నాదిరిధీం..నాదిరిధీం..
ననన తిల్లిల్లాన తిల్లాన నాదిరిధీం.ధీం.నాదిరిధీం..నాదిరిధీం..నాదిరిధీం..
ననన తిల్లిల్లాన తిల్లాన నాదిరిధీం...ధీం.నాదిరిధీం..నాదిరిధీం..నాదిరిధీం..
నాదిరిధీం..నాదిరిధీం..నాదిరిధీం..
న్నా.ధిరిధీం..న్నా.ధిరిధీం..నాధిరిధీంమ్....ఆఆ...ఆ..ఆ.న...

శుక్రవారం, డిసెంబర్ 19, 2008

నాన్న తో షికార్లు !! మరికొన్ని..

నాన్న నేను అప్పుడప్పుడూ షటిల్ కూడా ఆడేవాళ్ళం. కారణం ఏంటో తెలియదు అనుకోకుండా మొదలు పెట్టాం కానీ ఎందుకో మరి మధ్యలోనే ఆపేసాం ఆ అలవాటు అలా కొనసాగించలేకపోయాం. ఇంకా ఒక టైం లో అయితే నాన్న కీ, నాకూ, మా తమ్ముడుకీ ఒకేలాంటి డ్రెస్ లు వుండేవి. తమ్ముడు నెలల పాపాయి అయితే నేనేమో మూడో నాలుగో చదువుతుండే వాడ్ని అనుకుంటా, మేము ముగ్గురం అలా ఒకే లాంటి బట్టలు వేసుకోడం ఎంత బాగుండేదో నాకైతే ఏదో గొప్ప ఫీలింగ్ "నాన్న లాంటి చొక్కానే నేను కూడా వేసుకున్నాను.." అని, ఎంత బాగుండేదో మాటలలో చెప్పలేను. ఇంకా నాన్న ఆఫీసు నుండి వస్తూ ఆఫీసు ఎదురుగా ఉండే షాపు నుండి వేరు శనగ పప్పుండలు, మైసూర్ పాక్, గులాబ్ జామూన్ లాంటి స్వీట్స్ తెచ్చే వారు. గులాబ్‍జామూన్ కోసమైతే ఉదయమో, మధ్యాహ్నం భోజనానికి వచ్చినపుడో బాక్స్ తీసుకు వెళ్ళేవారు ప్రత్యేకంగా. ఇప్పుడంటే యమ్ టీ ఆర్ వాడి పుణ్యమా అని గులాబ్ జామూన్ రెడీ మిక్స్ తో అరగంట లో చేసి అవతల పడేస్తున్నాం కానీ నా చిన్నతనం లో ఇవి చాలా అపురూపం. నేను ఇంజినీరింగ్ లో చేరాక కూడా, ఇంటికి వచ్చినప్పుడు తనని అడిగి మరీ పప్పుండలు తెప్పించుకునే వాడ్ని :-)

మామూలు గా అమ్మమ్మ వాళ్ళ ఊరికో, నాన్నమ్మ వాళ్ళ ఊరికో కాకుండా ఎక్కడికైనా వేరే ఊర్లకి వెళ్ళడం అంటే ముందు గుర్తొచ్చేది గుంటూర్. నాకు నాలుగో తరగతి నుండే -7 పవర్ తో ఉన్న కళ్ళద్దాలు వాడాల్సి వచ్చింది అంటే సోడాబుడ్డి కళ్ళద్దాలు అనమాట. క్లాస్ లో చివరి బెంచ్ లో కూర్చుంటే బోర్డ్ కనపడక పక్కన వాడిని అడగడమో లేదా వాడి నోట్స్ చూసి రాయడమో చేస్తుండే సరికి, అది గమనించిన మా శ్యామ‍లా టీచర్ మా అమ్మ వాళ్ళకి చెప్పింది. అప్పట్లో నరసరావుపేట లో మంచి కళ్ళ డాక్టర్ లేడని నన్ను గుంటూర్ లో దయాకర్ గారికి చూపించే వాళ్ళు. సో ఆరు నెలలకు ఒక సారో లేక సంవత్సరానికి ఒక సారో నాన్న నన్ను గుంటూర్ తీసుకు వెళ్ళేవారు. కొన్ని సార్లు అమ్మ కూడా తీసుకు వెళ్ళేది. రైలు ప్రయాణం తో మొదలయ్యే మా ట్రిప్ లో, రైలు ముందుకు వెళ్తుంటే వేగంగా వెనక్కు వెళ్ళే ఇళ్ళు, చెట్లు, పొలాలు, పక్క ట్రాక్ మీద మరింత వేగంగా వెళ్ళే రైలు, లేతపసుపు రంగులో నాన్న గడ్డం చేసుకునే బ్లేడ్ అంత సైజ్ ఉండే దళసరి కాగితం పై చిన్న చిన్న అక్షరాలతో ముద్రించిన టిక్కట్, (దాన్ని ఇంటికి వచ్చాక పొరలు పొరలు గా చించడమంటే నాకు చాలా ఇష్టం) డాక్టర్ గారి మేడమీదకి మెట్లు, ఆయన రూమ్ లో చల్లని గాలి వచ్చే A/C, ఇంకా గుంటూరు లో మేం చూసిన A/C సినిమా హాల్లోని హిందీ సినిమా, అవన్నీ వింతలు విడ్డూరాలే.

ఓ సారి గుంటూర్ మెడికల్ కాలేజి లో మెడికల్ సైన్సు ఎగ్జిబిషన్ జరిగితే దానికి కూడా వెళ్ళాం అది కూడా నాకు బాగా గుర్తు ఎంత మంది జనమో గ్రూపులు గ్రూపులు గా పంపించే వారు మా టైమ్ వచ్చే సరికి సాయంత్రమయ్యింది ఇంటికి వెళ్ళే సరికి బాగా రాత్రవుతుంది అని అనుకున్నా అలానే రోజంతా ఎండని లెక్క చేయకుండా కాలేజి గ్రౌండ్ లో లాన్ మీద అక్కడక్కడా నానా తిప్పలు పడుతూ ఎదురు చూసి చూసి సాయంత్రమ్ ఎప్పుడో కాలేజి అంతా తిరిగి చూసాం. అప్పుడు నాన్న నువ్వు పెద్ద అయ్యాక మెడిసిన్ చదివినప్పుడు ఇక్కడ తిరుగుతావ్, ఇలాంటి టేబుల్ మీద ఆపరేషన్ చేయాలి అదీ ఇదీ అని చాలా చెప్పారు కానీ నేను తన ఆ ఒక్క కోరిక మాత్రం తీర్చలేకపోయాను. అది ఒక్కటి కొంచెం బాధ అనిపిస్తుంటుంది అప్పుడప్పుడూ కానీ, నా బదులు చెల్లాయి, తమ్ముడు ఇద్దరూ డాక్టర్ చదువుతూ ఆ లోటు తీర్చారనుకోండి అది వేరే విషయం.

తరువాత నన్ను ఇంటర్ కోసం విజయవాడ దగ్గర లోని ఈడ్పుగల్లు లో సిద్దార్ద రెసిడెన్షియల్ కాలేజి లో చేర్పించటానికి తీసుకు వెళ్ళారు ఒక పెద్ద సిటీ లో ఊరంతా తిప్పి కృష్ణా బేరేజి అవీ చూపెట్టి, ట్రంకు పెట్టే, పరుపు, బక్కెట్ లాంటివి కొనిపించి బయట హోటల్లో బోజనం చేసేంత వరకూ అంతా బాగుంది కానీ సాయంత్రం నాన్న ఇక బయల్దేరతాను అన్నపుడు మాత్రం దిగులు అనిపించింది. అక్కడ ఇంటర్ అయిపోయాక మళ్ళీ వైజాగ్ లో ఇంజినీరింగ్ లో చేరడానికి నేను నాన్న బయల్దేరి వెళ్ళాం. రోజంతా కాలేజి లో అప్ప్లికేషన్ పూర్తి చేసి, ఫీజులు కట్టి, హాస్టల్ లో చేరి లగేజి హాస్టల్ లో పడేసి సరదాగా అలా బీచ్ కి వెళ్దాం అని మా ఇంజినీరింగ్ కాంపస్ నుండి సి.బి.ఐ, వాల్తేర్ మీదుగా నడక ప్రారంభించాం అలా చాలా దూరం నడిచాం కానీ బీచ్ ఎక్కడా కనపడదేంటి అదీ కాక ఎదురు గా ఏదో పెద్ద గోడ లా ఉంది బహుశా బీచ్ కీ రోడ్ కీ మధ్య ఒక పెద్ద గోడ కట్టారేమో అనుకుంటూ యమ్.వి.పి కాలనీ వరకు వచ్చినా మాకు విషయం అర్ధం కాలేదు చివరకి దదాపు బిచ్ రోడ్ కి వచ్చాక అప్పుడు అర్ధమయ్యింది మేము ఇప్పటి వరకూ గోడ అని అనుకుని చూస్తూ వస్తున్నది నిజానికి సముద్రమనీ అవతలి ఒడ్డు అనేది కనుచూపు మేర లో లేకపోడం వలన నీళ్ళే అలా కనిపిస్తున్నాయ్ అని ముందు నాన్న చెప్తే నమ్మ లేదు కానీ తర్వాత నాకు అర్ధమయ్ చాలా హాశ్చర్యపడిపయేసాను.

నన్ను ఇలా వేలు పట్టుకుని నడిపిస్తూ రక రకాల ప్రదేశాలు తిప్పిన నాన్న తో నాకు ఉద్యోగమొచ్చిన చాలా రోజుల తర్వాత ఓ రోజు ఢిల్లీ నుండి బెంగళూరు కు విమానం లో కలిసి ప్రయాణం చేయడం నా జీవితం లో మరచి పోలేని అనుభవం. నాన్నకి అదే మొదటి విమాన ప్రయాణం, అప్పటికే నేను మా ఐబీయమ్ వాడి పుణ్యమా అని అమెరికాకి అనకాపల్లికి తేడా లేకుండా ఓ ఐదారు ట్రిప్పులు వేసాను. కానీ అదేంటో అన్ని సార్లు నేను ఒక్కడ్నే కనీసం ఒక ఫ్రెండ్ కూడా దొరికే వాడు కాదు కంపెనీ కి అలాంటిది మొదటి సారి ఒక తెలిసిన వాళ్ళు అదీ నాన్న తోడు ఉండడం ఎంత బాగుందో. ఆ రోజు ఎంత ఆనందం గా ఉన్నానంటే. జెట్ ఎయిర్లైన్స్ విమానం కేన్సిల్ అయి కొన్ని గంటల తర్వాత వెళ్ళే మరో విమానం లో టిక్కట్ ఇచ్చారు చెకిన్ చేయడానికి వెళ్ళినప్పుడు ఓకే నో ప్రాబ్లం అని నా ఆనందంలో నేనున్నాను. ఆవిడ ఓ నిముషం అవాక్కయి సార్ కేన్సిల్ అయిందని తెల్సిన ఇంత మంది లో నవ్వుతూ జవాబిచ్చింది మీరే సార్ అని చెప్పింది. "నా ఆనందం నీకేం తెలుసు లే కానీ బోర్డింగ్ పాస్ ఇవ్వు తల్లీ !!" అని మనసులొ అనుకుని అలవాటు ప్రకారం ఓ చిన్న నవ్వు నవ్వాను. ఆ తర్వాత లాంజ్ లోని తాజ్ లో ఫ్రీ ఫుడ్ ఎంజాయ్ చేసి నాన్న ని విమానాశ్రయం అంతా తిప్పి గేలరీ నుండి చిన్న పెద్ద విమానాలని దాన్లో భోజనం, లగేజ్ ఎలా లోడ్ చేస్తారో , ఫ్యూయలింగ్ లాంటివన్నీ ఎలా చేస్తారో, ఇలా నేను నాన్న కి విమాన ప్రయాణం గురించిన వివరాలు అన్నీ వివరంగా చెప్తుంటే నా ఆనందం మాటలలో చెప్పలేను.

ఇవన్నీ చదివి నాన్న ఏమంటారో :-) "హ హ భలే రాసావు గా" అంటారో లేక "అన్ని విషయాలు భలే గుర్తున్నాయే.." అని అంటారో చూడాలి !!

ఇక శలవా మరి ...

--వేణూ శ్రీకాంత్

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.