శుక్రవారం, డిసెంబర్ 19, 2008

నాన్న తో షికార్లు !! మరికొన్ని..

నాన్న నేను అప్పుడప్పుడూ షటిల్ కూడా ఆడేవాళ్ళం. కారణం ఏంటో తెలియదు అనుకోకుండా మొదలు పెట్టాం కానీ ఎందుకో మరి మధ్యలోనే ఆపేసాం ఆ అలవాటు అలా కొనసాగించలేకపోయాం. ఇంకా ఒక టైం లో అయితే నాన్న కీ, నాకూ, మా తమ్ముడుకీ ఒకేలాంటి డ్రెస్ లు వుండేవి. తమ్ముడు నెలల పాపాయి అయితే నేనేమో మూడో నాలుగో చదువుతుండే వాడ్ని అనుకుంటా, మేము ముగ్గురం అలా ఒకే లాంటి బట్టలు వేసుకోడం ఎంత బాగుండేదో నాకైతే ఏదో గొప్ప ఫీలింగ్ "నాన్న లాంటి చొక్కానే నేను కూడా వేసుకున్నాను.." అని, ఎంత బాగుండేదో మాటలలో చెప్పలేను. ఇంకా నాన్న ఆఫీసు నుండి వస్తూ ఆఫీసు ఎదురుగా ఉండే షాపు నుండి వేరు శనగ పప్పుండలు, మైసూర్ పాక్, గులాబ్ జామూన్ లాంటి స్వీట్స్ తెచ్చే వారు. గులాబ్‍జామూన్ కోసమైతే ఉదయమో, మధ్యాహ్నం భోజనానికి వచ్చినపుడో బాక్స్ తీసుకు వెళ్ళేవారు ప్రత్యేకంగా. ఇప్పుడంటే యమ్ టీ ఆర్ వాడి పుణ్యమా అని గులాబ్ జామూన్ రెడీ మిక్స్ తో అరగంట లో చేసి అవతల పడేస్తున్నాం కానీ నా చిన్నతనం లో ఇవి చాలా అపురూపం. నేను ఇంజినీరింగ్ లో చేరాక కూడా, ఇంటికి వచ్చినప్పుడు తనని అడిగి మరీ పప్పుండలు తెప్పించుకునే వాడ్ని :-)

మామూలు గా అమ్మమ్మ వాళ్ళ ఊరికో, నాన్నమ్మ వాళ్ళ ఊరికో కాకుండా ఎక్కడికైనా వేరే ఊర్లకి వెళ్ళడం అంటే ముందు గుర్తొచ్చేది గుంటూర్. నాకు నాలుగో తరగతి నుండే -7 పవర్ తో ఉన్న కళ్ళద్దాలు వాడాల్సి వచ్చింది అంటే సోడాబుడ్డి కళ్ళద్దాలు అనమాట. క్లాస్ లో చివరి బెంచ్ లో కూర్చుంటే బోర్డ్ కనపడక పక్కన వాడిని అడగడమో లేదా వాడి నోట్స్ చూసి రాయడమో చేస్తుండే సరికి, అది గమనించిన మా శ్యామ‍లా టీచర్ మా అమ్మ వాళ్ళకి చెప్పింది. అప్పట్లో నరసరావుపేట లో మంచి కళ్ళ డాక్టర్ లేడని నన్ను గుంటూర్ లో దయాకర్ గారికి చూపించే వాళ్ళు. సో ఆరు నెలలకు ఒక సారో లేక సంవత్సరానికి ఒక సారో నాన్న నన్ను గుంటూర్ తీసుకు వెళ్ళేవారు. కొన్ని సార్లు అమ్మ కూడా తీసుకు వెళ్ళేది. రైలు ప్రయాణం తో మొదలయ్యే మా ట్రిప్ లో, రైలు ముందుకు వెళ్తుంటే వేగంగా వెనక్కు వెళ్ళే ఇళ్ళు, చెట్లు, పొలాలు, పక్క ట్రాక్ మీద మరింత వేగంగా వెళ్ళే రైలు, లేతపసుపు రంగులో నాన్న గడ్డం చేసుకునే బ్లేడ్ అంత సైజ్ ఉండే దళసరి కాగితం పై చిన్న చిన్న అక్షరాలతో ముద్రించిన టిక్కట్, (దాన్ని ఇంటికి వచ్చాక పొరలు పొరలు గా చించడమంటే నాకు చాలా ఇష్టం) డాక్టర్ గారి మేడమీదకి మెట్లు, ఆయన రూమ్ లో చల్లని గాలి వచ్చే A/C, ఇంకా గుంటూరు లో మేం చూసిన A/C సినిమా హాల్లోని హిందీ సినిమా, అవన్నీ వింతలు విడ్డూరాలే.

ఓ సారి గుంటూర్ మెడికల్ కాలేజి లో మెడికల్ సైన్సు ఎగ్జిబిషన్ జరిగితే దానికి కూడా వెళ్ళాం అది కూడా నాకు బాగా గుర్తు ఎంత మంది జనమో గ్రూపులు గ్రూపులు గా పంపించే వారు మా టైమ్ వచ్చే సరికి సాయంత్రమయ్యింది ఇంటికి వెళ్ళే సరికి బాగా రాత్రవుతుంది అని అనుకున్నా అలానే రోజంతా ఎండని లెక్క చేయకుండా కాలేజి గ్రౌండ్ లో లాన్ మీద అక్కడక్కడా నానా తిప్పలు పడుతూ ఎదురు చూసి చూసి సాయంత్రమ్ ఎప్పుడో కాలేజి అంతా తిరిగి చూసాం. అప్పుడు నాన్న నువ్వు పెద్ద అయ్యాక మెడిసిన్ చదివినప్పుడు ఇక్కడ తిరుగుతావ్, ఇలాంటి టేబుల్ మీద ఆపరేషన్ చేయాలి అదీ ఇదీ అని చాలా చెప్పారు కానీ నేను తన ఆ ఒక్క కోరిక మాత్రం తీర్చలేకపోయాను. అది ఒక్కటి కొంచెం బాధ అనిపిస్తుంటుంది అప్పుడప్పుడూ కానీ, నా బదులు చెల్లాయి, తమ్ముడు ఇద్దరూ డాక్టర్ చదువుతూ ఆ లోటు తీర్చారనుకోండి అది వేరే విషయం.

తరువాత నన్ను ఇంటర్ కోసం విజయవాడ దగ్గర లోని ఈడ్పుగల్లు లో సిద్దార్ద రెసిడెన్షియల్ కాలేజి లో చేర్పించటానికి తీసుకు వెళ్ళారు ఒక పెద్ద సిటీ లో ఊరంతా తిప్పి కృష్ణా బేరేజి అవీ చూపెట్టి, ట్రంకు పెట్టే, పరుపు, బక్కెట్ లాంటివి కొనిపించి బయట హోటల్లో బోజనం చేసేంత వరకూ అంతా బాగుంది కానీ సాయంత్రం నాన్న ఇక బయల్దేరతాను అన్నపుడు మాత్రం దిగులు అనిపించింది. అక్కడ ఇంటర్ అయిపోయాక మళ్ళీ వైజాగ్ లో ఇంజినీరింగ్ లో చేరడానికి నేను నాన్న బయల్దేరి వెళ్ళాం. రోజంతా కాలేజి లో అప్ప్లికేషన్ పూర్తి చేసి, ఫీజులు కట్టి, హాస్టల్ లో చేరి లగేజి హాస్టల్ లో పడేసి సరదాగా అలా బీచ్ కి వెళ్దాం అని మా ఇంజినీరింగ్ కాంపస్ నుండి సి.బి.ఐ, వాల్తేర్ మీదుగా నడక ప్రారంభించాం అలా చాలా దూరం నడిచాం కానీ బీచ్ ఎక్కడా కనపడదేంటి అదీ కాక ఎదురు గా ఏదో పెద్ద గోడ లా ఉంది బహుశా బీచ్ కీ రోడ్ కీ మధ్య ఒక పెద్ద గోడ కట్టారేమో అనుకుంటూ యమ్.వి.పి కాలనీ వరకు వచ్చినా మాకు విషయం అర్ధం కాలేదు చివరకి దదాపు బిచ్ రోడ్ కి వచ్చాక అప్పుడు అర్ధమయ్యింది మేము ఇప్పటి వరకూ గోడ అని అనుకుని చూస్తూ వస్తున్నది నిజానికి సముద్రమనీ అవతలి ఒడ్డు అనేది కనుచూపు మేర లో లేకపోడం వలన నీళ్ళే అలా కనిపిస్తున్నాయ్ అని ముందు నాన్న చెప్తే నమ్మ లేదు కానీ తర్వాత నాకు అర్ధమయ్ చాలా హాశ్చర్యపడిపయేసాను.

నన్ను ఇలా వేలు పట్టుకుని నడిపిస్తూ రక రకాల ప్రదేశాలు తిప్పిన నాన్న తో నాకు ఉద్యోగమొచ్చిన చాలా రోజుల తర్వాత ఓ రోజు ఢిల్లీ నుండి బెంగళూరు కు విమానం లో కలిసి ప్రయాణం చేయడం నా జీవితం లో మరచి పోలేని అనుభవం. నాన్నకి అదే మొదటి విమాన ప్రయాణం, అప్పటికే నేను మా ఐబీయమ్ వాడి పుణ్యమా అని అమెరికాకి అనకాపల్లికి తేడా లేకుండా ఓ ఐదారు ట్రిప్పులు వేసాను. కానీ అదేంటో అన్ని సార్లు నేను ఒక్కడ్నే కనీసం ఒక ఫ్రెండ్ కూడా దొరికే వాడు కాదు కంపెనీ కి అలాంటిది మొదటి సారి ఒక తెలిసిన వాళ్ళు అదీ నాన్న తోడు ఉండడం ఎంత బాగుందో. ఆ రోజు ఎంత ఆనందం గా ఉన్నానంటే. జెట్ ఎయిర్లైన్స్ విమానం కేన్సిల్ అయి కొన్ని గంటల తర్వాత వెళ్ళే మరో విమానం లో టిక్కట్ ఇచ్చారు చెకిన్ చేయడానికి వెళ్ళినప్పుడు ఓకే నో ప్రాబ్లం అని నా ఆనందంలో నేనున్నాను. ఆవిడ ఓ నిముషం అవాక్కయి సార్ కేన్సిల్ అయిందని తెల్సిన ఇంత మంది లో నవ్వుతూ జవాబిచ్చింది మీరే సార్ అని చెప్పింది. "నా ఆనందం నీకేం తెలుసు లే కానీ బోర్డింగ్ పాస్ ఇవ్వు తల్లీ !!" అని మనసులొ అనుకుని అలవాటు ప్రకారం ఓ చిన్న నవ్వు నవ్వాను. ఆ తర్వాత లాంజ్ లోని తాజ్ లో ఫ్రీ ఫుడ్ ఎంజాయ్ చేసి నాన్న ని విమానాశ్రయం అంతా తిప్పి గేలరీ నుండి చిన్న పెద్ద విమానాలని దాన్లో భోజనం, లగేజ్ ఎలా లోడ్ చేస్తారో , ఫ్యూయలింగ్ లాంటివన్నీ ఎలా చేస్తారో, ఇలా నేను నాన్న కి విమాన ప్రయాణం గురించిన వివరాలు అన్నీ వివరంగా చెప్తుంటే నా ఆనందం మాటలలో చెప్పలేను.

ఇవన్నీ చదివి నాన్న ఏమంటారో :-) "హ హ భలే రాసావు గా" అంటారో లేక "అన్ని విషయాలు భలే గుర్తున్నాయే.." అని అంటారో చూడాలి !!

ఇక శలవా మరి ...

--వేణూ శ్రీకాంత్

10 కామెంట్‌లు:

 1. వేణు గారు ,
  చాలా బాగా వ్రాసారు , మీ వర్ణన చాలా బాగుంది........
  -----సుబ్బు

  రిప్లయితొలగించండి
 2. బావున్నాయండీ మీ జ్ఞాపకాలు.
  మీ ఇల్లంతా ఇంజనీర్లు, డాక్టర్లేనన్నమాట :-)

  రిప్లయితొలగించండి
 3. బావుందండి, ఐతే మీరు నాన్నగారు కూడా matching matching అన్నమాట మరి ఎప్పుడూ samepinch అనలేదా :)

  రిప్లయితొలగించండి
 4. సుబ్బు గారు, మధు గారు, నేను గారు వ్యాఖ్య రాసినందుకు నెనర్లు.

  రిప్లయితొలగించండి
 5. ఎంత బాగా రాశారండీ...కళ్ళకు కట్టినట్టు వర్ణించటం అంటే ఏమిటో మీ టపాలు చదివితే అర్థం అవుతుంది.

  రిప్లయితొలగించండి
 6. వేణూ శ్రీ గారూ!ఇలా సంబోధిస్తే (ఉష శ్రీ గారిలా )మీకభ్యంతరం లేదుగా ?చిన్నప్పుడు మన వేలు పట్టి నడిపించిన నాన్నని ,చేయి పట్టుకొని అన్నీ చూపించడం ఎంత మంచి అనుభూతి !కాని ఈ అదృష్టం ఎక్కువ శాతం అబ్బాయిలకే దక్కుతుందనుకుంటా.

  రిప్లయితొలగించండి
 7. ఆ మహానుభావుడి తో పోలిక ఎందుకు లేండి కానీ నాకు ఆ పిలుపు అలవాటే నిరభ్యంతరంగా పిలవండి. ఈ కాలం అమ్మాయిలకి కూడా దక్కుతుందండీ అబ్బాయిలకే ప్రత్యేకం ఏం కాదు.

  రిప్లయితొలగించండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.