గురువారం, డిసెంబర్ 18, 2008

ఈ రోజు ఎక్కడికి వెళదాం నాన్నా ?

నా చిన్నతనం లో నాకు అత్యంత ఇష్టమైన పనుల లో నాన్న తో షికారు కి వెళ్ళడం ఒకటి. పాపం రోజంతా ఆఫీసు లో అలసి పోయి వచ్చినా ఓపికగా పార్కుకో, మార్కెట్ కో లేదంటే ఏదైనా పని ఉంటే అక్కడికి తన తో పాటు నన్నూ తీసుకు వెళ్ళేవారు నాన్న. నరసరావుపేట్ లో గాంధీపార్క్ కూరగాయల మార్కెట్ రెండూ ఎదురుబొదురు గానే ఉండేవి. పార్కు లో జారుడు బల్ల, ఊగుడు బల్ల (Seasaw), ఉయ్యాల ఇలాంటి వాటితో మిగిలిన పిల్లలతో కలిసి ఆడుకునే వాడిని. లేదంటే నాన్న వాటర్ ఫౌంటైన్, పూల మొక్కల పక్కన బెంచ్ మీద కూర్చుని వాళ్ళ ఫ్రెండ్ తో మాట్లాడుతుంటే నేను ఫౌంటైన్ ని వచ్చేపోయే జనాన్ని చూస్తూనో, లేదంటే పార్కు పక్కనే ఉన్న ట్రాక్ పై ఏదైనా రైలు వస్తే దాన్ని చూస్తూనో కాలం గడిపేసే వాడిని. నేను కొంచెం పెద్దయ్యాక అయితే, నాన్న ఫ్రెండ్ ఒకాయన "మీ ఇద్దరూ ఏదో ఫ్రెండ్స్ లా కలిసి ఊరంతా భలే తిరుగుతారోయ్.." అని అంటూ ఉండేవారు.

లా పార్కులో కొంత సమయం గడిపాక మార్కెట్ కి వెళ్ళేవాళ్ళం. అక్కడ షాప్ వాళ్ళు నాన్న ని పేరుతో పలకరించి ఫలానా కూర తాజా గా వచ్చిందంటూ కూరలు అందివ్వడం. బెండకాయలు చివర్లు తుంచడం బీరకాయలో, సొరకాయలో పొట్లకాయలో అయితే గోరుతో గుచ్చి లేతగా ఉందో లేదో చూడటం ఇలాంటివన్నీ చేస్తుంటే గమనించి ఒకో రోజు ఒకో దాని గురించి అడిగేవాడ్ని అలా ఎందుకు చేసారు అని తను ఓపికగా వివరించి చెప్పేవారు. మా కాంపౌండ్ లో అంతా "మీ అమ్మకి నువ్వు డిటెక్టివ్ లా పని చేస్తావోయ్ అందుకే నిన్ను పంపిస్తుంది " అనో లేదా "మీ నాన్న నీ చేత సంచి మోయించడానికి తీసుకువెళ్తున్నారోయ్" అని అంటూనో కాన్‌స్పిరసీ లు లేవనెత్తడానికి ప్రయత్నించే వారు. కానీ నాకు మాత్రం మేమిద్దరమూ అలా నడుచుకుంటూ వెళ్తుంటే నాన్న చెప్పే బోలెడు కబుర్లు అంటే భలే ఇష్టం.

రోడ్డుకీ ఏవైపున నడవాలి ? ట్రాఫిక్ రూల్స్ ఎందుకున్నాయి అందరూ పాటించినా లేకపోయిన మనం పాటించాల్సిన అవసరం ఎందుకు ఉంది ? దార్లోనో సినిమా హాల్లోనో పార్కు లోనో ఎవరన్నా తెలిసిన వాళ్ళు కనిపిస్తే వాళ్ళ వైపు వేలు చూపెడుతూ అరవడం లాంటివి చేయకూడదు ఇలాంటి చిన్న చిన్న విషయాలే చాలా చక్కగా అర్ధమయ్యేలా చెప్పేవారు. ఒకో రోజు జరిగిన సంఘటనల పట్టీ, ఎదురైన వాళ్ళను పట్టీ, తిరిగే ప్లేసులని పట్టీ మా టాపిక్ లు ఉండేవి. నేను కొంచెం పెద్దయిన తర్వాత మొదటి సారి ఒంటరిగా ఎక్కడికో వెళ్ళాల్సి వచ్చినపుడు నాన్న చెప్పిన విషయాలు అలానే గుర్తు చేసుకుని తను చెప్పినట్లే నడవడం నాకింకా గుర్తుంది. నా ఎదుగుదలలో నాన్న చెప్పిన అలాంటి పాఠాల పాత్ర మరచిపోలేనిది.

ఒకోసారి ఒంటరిగా బెంగళూరు లో ఉన్నప్పుడు ఏ శాంతి సాగర్ కో వెళ్ళి సాంబార్ ఇడ్లీ అని ఆర్డర్ చేయగానే వాడు రెండు స్పూన్ లు వేసి తెస్తే అది చూడగానే ఒకో సారి నాన్న హోటల్ కి తీసుకు వెళ్ళి అక్కడ సాంబార్ ఇడ్లీ రెండు స్పూన్ లతో ఎందుకు తినాలి, ఎలా తినాలి అని వివరించిన మొత్తం ఎపిసోడ్ గుర్తొస్తుంది. ఇంకా నరసరావుపేట్ లో గడియారం స్తంభం దగ్గర ఒక కేరళా మిలటరీ హోటల్ ఉండేది అక్కడ పరాఠా షారువా వాటితో నంజుకోడానికి ఆ పక్కనే చక్రాల్లా కోసిన ఉల్లిపాయలు :-) అన్నీ ఎంత వింతగా ఉండేవో చూడటానికి... " ఇలా తింటేనే రుచి రా... " అని భలే చెప్పేవారు. ఇంకా మేమిద్దరం కలిసి కోటప్ప కొండ తిరనాలకి వెళ్ళడం కూడా ఒక మరిచి పోలేని అనుభవం. మామూలు
బస్ స్టాండ్ కి కొంచెం దూరం గా ఒక పెద్ద గ్రౌండ్ లో ప్రత్యేకం గా కర్రలతో కట్టిన క్యూలు, జనాన్ని కంట్రోల్ చేయడానికి పోలీసులూ వాలంటీర్లు చేసే హడావిడి, ఎఱ్ఱ బస్సులు, రాత్రులు నిద్ర మేలుకుని నాన్నతో కలిసి కొండ ఎక్కడం, మళ్ళీ తెల్ల వారు ఝామున నిద్ర మత్తుతో తిరిగు బస్ లో ప్రయాణం, తెల్లారే వరకూ నిద్ర పోకూడదు అని అంటూ నాన్నా నేను ఆ చుట్టు పక్కల తగిలే ఊర్ల గురించి, వాళ్ళ అలవాట్ల గురించి, కొండ గురించి, తిరనాల గురించి, బస్ గురించి, కండక్టరు గురించీ, డ్రైవరు అదే పనిగా ఉపయోగించే గేర్ రాడ్ గురించీ చెప్పుకున్న కబుర్లు అంతా ఓ వింత అనుభూతి.

మా ఇల్లు రైల్వే స్టేషన్ కి దగ్గర లో ఉండేది, అంటే మా పెరడు తర్వాత కొంచెం దూరం నడవాల్సి ఉంటుంది కానీ, మధ్యలో చెట్లు, చిన్న రోడ్డూ, తుప్పలూ తప్ప ఏమీ ఉండేవి కావు. అప్పట్లో ఇన్ని రైళ్ళు కూడా తిరిగేవి కావు కాబట్టి మాకు పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. ఆ ఇంట్లో ఉన్నపుడు ఒక సారి గుంటూర్లో జెమినీ సర్కస్ వచ్చింది, మాకు వెళ్ళడానికి కుదర్లేదు కానీ ఆ సర్కస్ లోని జంతువులని నరసరావుపేట మీదుగా గూడ్సు బండి లో తరలిస్తూ మా ఊరిలో ఒక రోజంతా ఆపారు. అప్పుడు నాన్న నన్ను గూడ్సు దగ్గరకు తీసుకు వెళ్ళి సందుల్లోంచి జంతువులని చూపించడం ఎప్పటికీ మర్చిపోలేను. హిప్పో ని ఐతే ఒక పెద్ద నీళ్ళ తొట్టి ని గూడ్సు డబ్బాలో ఉంచి దాని నిండా నీళ్ళు నింపి పైన కప్పు లేకుండా అలానే ఫ్రీగా వదిలేసారు మిగతా జంతువుల కన్నా అదే బాగా కనిపించింది లెండి నాన్న భుజం మీద ఎక్కించుకుని చూపించారు అందుకే అంతలా గుర్తుండిపోయింది. ఒక పక్క భయం భయం గానే అయినా వాటిని అలా చూడటం దాని గురించి దదాపు ఓ నెల రోజులు కధలు కధలు గా చెప్పడం ఎలా మర్చిపోగలను.

చిన్నప్పుడు ఏంటి లెండి మొన్న ఆగస్ట్ లో ఇండియా వెళ్ళినపుడు కూడా నాన్నతో తిరుగుతుంటే ఆ ఆనందమే వేరు ఇప్పుడు పెరుగుతున్న సౌకర్యాల వలనా, ఇంకా ఈ వయసులో తనని ఎక్కువ కష్టపెట్టడం ఎందుకు లే అని ఎక్కువ నడిపించలేదు కానీ తనతో కలిసి వెళ్తుంటే చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చి గొప్ప సరదాగా అనిపించింది... సరే ఇక నిద్ర వస్తుంది, నాన్నతో కలిసి తిరిగిన ఊర్ల గురించి మరికొన్ని కబుర్లు రేపటి టపాలో...

అంత వరకూ శలవా మరి...
--వేణూ శ్రీకాంత్.

28 కామెంట్‌లు:

 1. బావున్నాయి, మీ జ్ఞాపకాలు.. నాకు ఇలాంటివే ఉన్నాయి అమ్మతోనూ, నాన్నతోనూ..

  రిప్లయితొలగించండి
 2. పిల్లలకి మొదటి స్నేహితుడు ఎప్పుడూ తండ్రే. అది మీ మాటల్లో చక్కగా తెలుస్తుంది.

  రిప్లయితొలగించండి
 3. ohh!
  శ్రీకాంత్,కాస్త చలించాను,
  నేను బాగా పసివాడిగా ఉన్నప్పుడే మా నాన్న చనిపోవటంతో నాకు ఇలాంటిఆనుభవాలు లేవు.మా అమ్మ ఉద్యోగం నుండి రావటం కొన్ని సార్లు ఆలస్యమయ్యేది,అప్పటికి నాకు ప్రవేటుకు వెళ్ళేటైమయ్యేది,(ఆలస్యం గా వెళితే మా నాయుడమ్మ మేష్టరు గారు చితక్కొట్టేవారు)ఎప్పుడన్నా..కాదు వీలున్నప్పుడల్లా మా అమ్మ నన్ను బయటకు తీసుకువెళ్ళేది.కానీ టీనేజ్ వచ్చాక ఎందుకో కొన్నాళ్ళు ఒక్కడినే వెళ్ళటమో,లేదంటే మా అమ్మావాళ్ళకు కాస్త దూరంగా నడవటమో చేసేవాడిని.అవన్నీ తలచుకుంటే కాస్త సిగ్గు,కాస్త నవ్వూ వస్తున్నాయి.
  మీ నాన్న గారికి నా నమస్కారాలు తెలియజెయ్యండి

  రిప్లయితొలగించండి
 4. బాగున్నాయండి మీ జ్ఞాపకాలు ! ఇంతకీ సాంబార్ ఇడ్లీ రెండు స్పూన్ లతో ఎందుకు తినాలండి?

  రిప్లయితొలగించండి
 5. మంచి జ్ఞాపకాలు. తండ్రితో అలాంటి అనుబంధం, ఆ దగ్గరతనం ఉన్నందుకు మీరు చాలా అదృష్టవంతులు. మా అప్పుడు పిల్లలతో ఇంత దగ్గరగా, ఇంత స్నేహంగా ఉండే తండ్రులు చాలా అరుదుగా ఉండేవారు. నాన్న అంటే అదో భక్తి, భయం తప్పితే చనువన్నది ఉండేది కాదు. మగపిల్లలయితే మరీ ఆమడ దూరాన ఉండేవారు. సంభాషణ అంతా ఊ, ఆ..ల వరకే పరిమితం. ఇప్పటి పిల్లలని చూస్తుంటే ఈ విషయంలో మాత్రం మాకు కాస్తంత అసూయగానే ఉంటుంది:))

  రిప్లయితొలగించండి
 6. వేలుపట్టి నడిపించిన నాన్నని మళ్లీ జ్ఞాపకాల ద్వారా గుర్తు చేసుకోవడం చాలా బావుంది. ప్రయత్నం అభినందనీయం.

  రిప్లయితొలగించండి
 7. చాలా బాగా వ్రాశారు... ఇంత మంచి జ్ఞాపకాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. నాకు కూడా చిన్నప్పటి నుండి నాన్నతో తిరగడం, నాన్న చెప్పే కబుర్లు వినడం ఎంతో ఇష్టం. ఫోటోలు కూడా భలే పెట్టారు.

  రిప్లయితొలగించండి
 8. మీ జ్ఞాపకాలు చదూతూంటే హాయిగా ఉంది.

  ఆ మొదటి ఫోటో ఉంది చూసారూ -సింహమూ దాని పిల్లా... మీ జాబు మొత్తాన్నీ వివరించేస్తోంది ఆ ఒక్క బొమ్మా!

  ఇంతకీ మీ నాన్న చూసారా ఈ జాబును?

  రిప్లయితొలగించండి
 9. చాలా బాగుంది! ఎన్నో జ్ఞాపకాలను తట్టి లేపారు! :-)

  రిప్లయితొలగించండి
 10. ఇంతకీ సాంబార్ ఇడ్లీ రెండు స్పూన్ లతో ఎందుకు తినాలండి?
  నాది శ్రావ్య గారి doubt నే :)

  రిప్లయితొలగించండి
 11. వేణు: మనకి మొట్టమొదటి అడుగు వేయించేది తల్లి తండృలే. నాన్నతో బంధం మాటాలకి అందదు. ఐతే ఒక్కసారి ఈ నా పోష్టు చదువు http://ramakantharao.blogspot.com/2008/12/blog-post_11.html ఇలా కూడా ఉంటున్నారు కొడుకులు ఈ రోజు రేపట్లో.

  సాంబారు ఇడ్లీ తినటానికి రెండు చెంచాలు దేనికి? సాంబారు ఇడ్లీ తినేప్పుడు ఒక చెంచాని గోడలా పెట్టుకుని, రెండో చెంచాతో సాంబారుతో ఇడ్లీని స్కూప్ చెయ్యటానికి ఆసరాలా వాడేందుకు.

  రిప్లయితొలగించండి
 12. వేణు గారు,
  గుండె పిండేసారు.....నాకు ఉహ తెలిసేప్పటికే మా నాన్నగారు చనిపోవటం తో , నాకు ఇలాంటిఆనుభవాలు లేవు. జీవితం లో డబ్బు, కీర్తి, డిగ్రీలు సంపాదించవచ్చు కాని కొన్ని అనుభూతులని మాత్రం కోల్పోతే తిరిగి సంపాదించలేము. మన కన్నవాళ్ళు నుండి మనకు దక్కనిది,మనం కన్నవాళ్ళకి ఇచి సంతృప్తి పొందవలసినదే, మా అబ్బాయిని ఐన మీ నాన్నగారు మిమ్మల్ని పెంచినట్టు పెంచుతాను....మీరు చాలా అదృష్టవంతులు ....................... మీ చిన్నప్పటి ఫోటో, మీ నాన్నగారి ఫోటో వుంటే పెట్టండి, చూసి సంతోషిస్తాము.
  ------సుబ్బు

  రిప్లయితొలగించండి
 13. మేధా, శ్రీ, శ్రావ్య, ప్రతాప్, ప్రఫుల్ల చంద్ర, లక్ష్మీ, పూర్ణిమ, నేస్తం, మధు, సుబ్బు (మీ మీ పేర్ల చివర గారు చేర్చి చదువుకోగలరు:-) మీ అందరికీ కామెంటినందుకు పేరు పేరునా ధన్యవాదములు

  రాజేంద్ర గారు నెనర్లు, Sorry to here about your father, ఆ టీనేజ్ అలాంటిదండీ అలాంటి వేషాలు వేయిస్తుంది.

  శ్రావ్య ఈ ప్రశ్న ఎవరు అడుగుతారా అనుకున్నానండీ రాసేప్పుడే... కేవలం చట్నీ తో అయితే చేతులు మురికి అవకుండా సులువుగా తినేయచ్చు చెంచా అవసరం లేకుండా కానీ సాంబార్ ఇడ్లీ ని అలా చేయి ఖరాబు చేస్కో కుండా తినలేం ఇప్పుడంటే స్పూన్ లూ, ఫోర్కు లు, కత్తులు సాధారణం కానీ అప్పట్లో ఓ పాతికేళ్ళ క్రితం అంటే 80 లలో ఇవి ఓ వింతే, అదీ రెండు స్పూన్ లు ఎందుకంటే ఒకదాన్ని ఫోర్క్ లా సపోర్ట్ కి వాడి ఇడ్లీ ని చిన్న ముక్కలు గా త్వరగా కట్ చేయచ్చు, రెండో ఉపయోగం భాస్కర్ చెప్పారు కదా సపోర్ట్ పెట్టుకుని రెండో స్పూన్లోకి స్కూప్ చేయడానికి. ఆ సౌకర్యమే వేరు సుమీ...

  సిరిసిరిమువ్వగారు నెనర్లు నా ఙ్నాపకాలు ఎర్లీ 80 లలోవి అండీ, మీరు చెప్తుంటే అనిపిస్తుంది మరి మా నాన్న గారికి మా తాతయ్య దగ్గర ఇలాంటి అనుభవాలే ఉన్నాయోలేవో... ఈ సారి కాల్ చేసినప్పుడు అడగాలి...

  చదువరి గారు నెనర్లు, మా నాన్న ఇంకా చదివి ఉండకపోవచ్చనుకుంటున్నా అండీ లేదంటే ఈ పాటికి కాల్ చేసి ఉండేవారు. రెండావ భాగం కూడా ప్రచురించి అప్పుడు చదవమని చెప్తాను. ఖచ్చితంగా కొన్ని సంఘటనలు తను మర్చి పోయి ఉంటారు :-) మంచి రిఫ్రెష్ తనకి కూడా..

  భాస్కర్ గారు నెనర్లు, మీ భాగ్‍భన్ పోస్ట్ ఆరోజే చదివా కానీ కామెంటటం కుదర్లేదు ఈ రోజు చేస్తా ఇది నాకు కూడా ఇష్టమైన సినిమాలలో ఒకటి.

  సుబ్బూ, ఫోటోలకి ఇంకా టైం ఉందండీ ముందు ముందు పరిచయం చేస్తాను తప్పకుండా...

  రిప్లయితొలగించండి
 14. వేణూ గారూ!మీ బ్లాగ్ మొదటి సారి చూస్తున్నానండి.బాల్యం లోకి పరుగులు తీయించారు కదండీ .అన్నట్టు నేను కూడా
  నాన్న కూతుర్నేనండోయ్ .నాన్న చేయి పట్టుకొని దీపావళి టపాసులు కొనుక్కోవడం ,వినాయక చవితికి గణపతిని ,పూజా సామగ్రిని తెచ్చుకోవటం ,ఆఫీసుకు నేను వస్తానని మారాం చేయడం ఒకటేవిటి చాలా .......మీ బ్లాగ్ చూస్తుంటే ఇంచుమించుగా నా బాల్యాన్ని చూపుతున్నట్టు ఉంది .మీకు కృతజ్ఞతలు . అవునూ.....మీ ప్రొఫైల్ లో వేణువు పట్టుకున్నది మీరేనాండీ !!?

  రిప్లయితొలగించండి
 15. చాలా బావుంది. మా నాన్న గుర్తుకొచ్చారు. ఆయన నన్ను ఎప్పుడూ కొట్టలేదు. ఇప్పుడు నేనూ ఓ నాన్నని. మా నాన్న నాపై ఉన్నాడు. ఇంకా ఎలా ఉంటే బావుండేది, ఇప్పుడు బేరీజు వేసుకోవాలి.

  రిప్లయితొలగించండి
 16. వేణూ,
  మీతో పాటు మీ వూరంతా నేనూ తిరిగొచ్చాను ఇప్పుడే! మారిపోయిన వూరు చూస్తుంటే ఎక్కడికో వెళ్ళినట్లుంది తప్ప, "మా వూరే మారి పోయింది" అనుకోవడం ఇష్టం ఉండదు. జ్ఞాపకాల్లో మిగిలిన వూరే అసలు వూరు అనిపిస్తుంది. మీ నాన్న గారితో మీ లోకల్ టూర్లు చాలా బాగున్నాయి. అన్నట్టు గడియారం స్థంభం కూల్చేసారు తెలుసా!

  కానీ వరూధిని గారన్నట్టు మగపిల్లలకు నాన్నంటే హడల్ అన్నట్లుండటం ఇప్పట్లో లేదు. ఆడపిల్లలు మాత్రం ఎప్పుడూ నాన్న కూతుళ్ళే! మా నాన్న గారు నన్ను ముద్దు చేసినట్టు మా అన్నయ్యలిద్దరినీ చేసే వారు కాదు. తప్పు చేస్తే చేంతాడే!

  రిప్లయితొలగించండి
 17. పరిమళం గారు నెనర్లు, నా బ్లాగు కు స్వాగతం. :-) ఆ వేణువు పట్టుకుంది బుడుగు అని నా బెస్ట్ ఫ్రెండ్ అండీ. వివరాలకు జూలై లో నే రాసిన "బుడుగుతో కాసేపు" అనే టపా చదవండి.

  రవి గారు నెనర్లు, నన్ను కూడా మా నాన్న కొట్టిన సంధర్బాలు గుర్తులేవు ఎప్పుడో నాలుగో మూడో తరగతి లోనో ఒకసారి పడిందనుకుంటా.

  సుజాత గారు నెనర్లు, ఆ తెలుసండీ, WTC ‍టవర్స్ కూలిన దానికంటే ఎక్కువ బాధ పడ్డా గడియారస్తంభం గురించి విని. అవును నిజమే నాన్న నేను మంచి నేస్తాలలా తిరిగినా మా చెల్లాయంటే నే నా కన్నా ఎక్కువ ముద్దు.

  రిప్లయితొలగించండి
 18. నా హృదయం తన అలలతో
  ఈ ప్రపంచపు తీరాన్ని స్పృశిస్తూ
  తన సంతకాన్ని దానిపై కన్నీళ్లతో ఇలా చేసింది
  “ నేను నిన్ను ప్రేమిస్తున్నాను"
  టాగోర్ స్ట్రే బర్డ్స్

  మీరైనా నేనైనా తిరిగి ప్రేమించటం తప్ప మరేమి చేయగలం?

  రిప్లయితొలగించండి
 19. బాబా గారు నెనర్లు, నిజమే తిరిగి ప్రేమించటం తప్ప ఏమి చేయలేం.. వాళ్ళు కోరుకునేది కూడా అదే అనిపిస్తుంది.

  రిప్లయితొలగించండి
 20. వేణు గారు బాగా రాస్తున్నారు..ముందుగా ఎలా వున్నారు??? నరసారావు పేట వెల్లినప్పుడు మా నాన్నగారి తో ఇప్పటకి స్వాతి కో, లేక కోర్టు ఎదురుగా వుండే హోటల్ కి వెళ్ళి రవ్వ దోసే తింటాను.. కాఫి తాగడం..వౌవ్..బలే గుర్తు చేశారు..మరియు చాలా అందంగా చెప్పారు.. కేరళ హోటల్ , మలబార్ హోటల్ లో కూడా పరోటా అదుర్స్..నా జీవితం లో అలాంటి పరోట, చారువా ఇంకా ఎక్కడైనా తింటాను అని అనుకోను..నేను ఆదిత్య రెసిడెన్సియల్ కాలేజి లో చదివాను..నా పేరు రాంబాబు తల్లపనేని..మాది నరసరావు పేట పక్కన వురు అన్నారం అని..నాకు మీ టపాలు ఎప్పుడు చదివినా నరసరావు పేట ఒకసారి వెల్లి వచ్హినట్లుంటుంది..నెనర్లు..

  రిప్లయితొలగించండి
 21. హలో డాలర్{$}రాముడు,ఎలా ఉంది చదువు,మీ నరసరావు పేట అనగానే కామెంట్లు రాయటానికి తీరికొచ్చిందా? మూసినబ్లాగు కూడా కాస్త తెరువు బాబు :)

  రిప్లయితొలగించండి
 22. మనందరం నరసరావు పేట కబుర్లు చెప్పుకుంటుంటుంటే రాజేంద్ర గారికెంత కుళ్ళో చూడండి(గు బ్లా సం కాస్తా న.పే.బ్లా.సం గా మారేట్టుందని) ! మరి ఆయనేమో ఏకంగా వాళ్ళ ఊరి పేరుతో ఒక డైలీ యే పెట్టేశారు.

  డాక్టరు రాముడు గారు,
  బ్లాగుని తెరిచే డిమాండ్ విషయంలో రాజేంద్ర గారితో ఏకీభవిస్తున్నా!

  రిప్లయితొలగించండి
 23. Dr రామ్$ గారు నేను బాగున్నానండీ, ఈ మధ్య బొత్తిగా నల్ల పూసైపోయారు !! చాలా రోజులైంది మిమ్మల్ని బ్లాగ్ లో చూసి, మీ కామెంట్ నన్ను చాలా సంతోషపెట్టింది, నెనర్లు. నిజమేనండీ అమ్మ చేతి వంట, ఇంకా చిన్న తనంలో మొదటి సారి రుచి చూసిన ఇలాంటి అభిమాన రుచులు ఎక్కడికి వెళ్ళినా దొరకవ్. బ్లాగ్ విషయం లో రాజేంద్ర గారిది సుజాత గారిదే నా మాట కూడా, ఇక పుచ్చుకున్న శలవులు చాలు మళ్ళీ బ్లాగు మొదలు పెట్టండి.

  రాజేంద్ర గారు, సుజాత గారు చెప్పినట్లు మీ ఊరిగురించి డైలీలు మొదలెట్టేస్తారు కానీ మా ఊరి గురించి ఙ్ఞాపకాలు రాస్కోడానికి కూడా ఒప్పుకోరా..హన్నన్నన్నన్న!!(చూపులు కలిసిన శుభవేళ లో నూతన్ ప్రసాద్ స్టైల్లో) మేం ఈ ద్వంద్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం.. :-)

  రిప్లయితొలగించండి
 24. ఈ పోస్ట్ మీ మిగతా పోస్టుల్లాగే చాలా బాగుంది వేణూ.. పోస్టుకి తగ్గట్లుగా Lion king ముఫాసా-సింబా బొమ్మ భలే పెట్టారు.
  :)

  నాకు కూడా ఇలాంటి అనుభవాలే ఉన్నాయి మా నాన్నతో.. మీలాగే నేను కూడా కోటప్పకొండ తిరుణాల కి వెళ్ళేవాణ్ణి నాన్నతో.

  నాకు మా అమ్మతో ఎంత చనువు ఎక్కువో అలానే మా నాన్న దగ్గర కూడా ఉండేది. కాని మా నాన్న కొంచెం తక్కువే మాట్లాడినా, నా మీద చూపించే ప్రేమ చేతల్లో బాగా తెలిసేది. సాయంత్రం నేను స్కూల్ నుంచి వచ్చేటప్పటికి నా కోసం తప్పని సరిగా ఏదో ఒక స్నాక్ తెచ్చేవారు బజారు నుంచి ( జిలేబి, ముంతకింద పప్పు, మిర్చి బజ్జీలు ఇలా..). అలానే నేను ఆటల పోటీల్లో ఉంటే ప్రతి రోజూ నా ప్రాక్టీసులకి అలానే టోర్నమెంట్స్ కి కూడా తప్పని సరిగా వచ్చేవారు. ఇంక నాకు బాగా ఇష్ఠమైంది నాన్నతో సైకిలు వెనక ఎక్కి సినిమాలకి వెళ్ళటం. జ్ఞాపకాలని కదిలించారు వేణూ ! థాంక్ యూ !

  రిప్లయితొలగించండి
 25. నెనర్లు వేణు గారు, అవును నాకు కూడా అమ్మ నాన్న ఇద్దరితో ఒకే రకమైన చనువు ఉంది, అది మన అదృష్టమే తప్పకుండా..

  రిప్లయితొలగించండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.