అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

అందమైన బాల్యం

మధురమైన జ్ఞాపకాలతో అందమైన బాల్యాన్ని నా సొంతం చేసినందుకు అమ్మానాన్నలకు ఎప్పుడూ ఋణపడి ఉంటాను. మొదటి సంతానాన్నవడంతో నేనాడిందే ఆట పాడిందే పాట అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళినా మా ఇంట్లో అయినా అపురూపంగా గడిచింది. పాడుకున్న పాటలు, ఆడుకున్న ఆటలు, స్కూల్ ఎగ్గొట్టడానికి వేసిన వేషాలు, తిన్న చిరుతిళ్ళు, నాన్న వేలు పట్టుకుని కొట్టిన షికార్లు, 16mm సినిమాలు కబుర్లు ఇక్కడ చదవచ్చు.

ఇంటర్మీడియెట్ హాస్టల్ కబుర్లు

నూనూగు మీసాల నూత్న యవ్వనం అమ్మానాన్నలకు దూరంగా నాదంటూ ఓ స్వంత ప్రపంచం. అప్పటివరకూ ప్రతి చిన్న పనికి వాళ్ళమీద ఆధారపడి ఒక్కసారిగా నాకు నేనే నెగ్గుకు రావాల్సిన పరిస్థితులను తలుచుకుని దిగులు. అంతలోనే చుట్టూ ఉన్న స్నేహితులతో నేస్తం కట్టేసి చేసిన అల్లర్లు, పరోఠాల బిజినెస్సులు, చెరకుతోట దొంగతనాలు, ఆడ్మినిస్ట్రేటర్ కి మస్కాగొట్టి చూసిన సినిమాలు, సరదా కొంటె కబుర్లు ఇక్కడ చూడండి.

ఇంజనీరింగ్ కాలేజ్

ఇంటర్మీడియెట్ కి రెసిడెన్షియల్ హాస్టల్ కనుక పంజరంలో పక్షిలా బతికితే ఇంజనీరింగ్ కాలేజ్ యూనివర్సిటీ హాస్టల్స్ లోకి వచ్చేసరికి ఒక్కసారిగా జూలోనుండి పచ్చని అడవిలోకి వదిలేసిన జింక పరిస్థితే అయింది, ఎక్కడికి పరుగులెట్టినా ఏం చేసినా అడిగేవాళ్ళులేరు. అసలు హాస్టల్ బిల్డింగ్ లో నిరంతరం కాపుకాసే వార్డెన్ ఉండడనే విషయం నాకు డైజెస్ట్ కావడానికి నెలపట్టింది :-) నిజమా అలా ఎలా సాధ్యం అని ఇప్పటికీ అనిపిస్తూనే ఉంటుంది. అంతటి స్వేఛ్చాప్రపంచంలో చేసిన అల్లర్లు కొన్ని కబుర్లు ఇక్కడ.

సినిమాలు రివ్యూలు..

నాకున్న అతి పెద్ద వ్యసనం సినిమా చూడడం రిలీజైన ప్రతి అడ్డమైన సినిమా చూసేసి ఈబొమ్మలో చూపించినట్లు తెలుగు సినిమాని భుజాల మీద మోసేవాళ్ళలో నేనొకడ్ని. చూసి ఊరుకోకుండా ఇది ఇందుకు బాలేదు అది అందుకు బాగుంది అంటూ పేద్ద వంద సినిమాలు తీసేసి విశ్రమిస్తున్న మేధావిలా చేసే విశ్లేషణలు :-) హహహ చదివిన ఒకరిద్దరు అలా తిడతారు కానీ నా దృష్టిలో ఒక సాధారణ సినీ ప్రేక్షకుడు చూసొచ్చి మిత్రులతో చెప్పే కబుర్ల లాంటి నా సినీ రివ్యూలు ఇక్కడ చదవండి. ఆరెంజ్, ఖలేజా, కృష్ణం వందే జగద్గురుం లాంటివి కొన్ని ఎక్కువమంది ఆదరణ పొందాయ్.

శుక్రవారం, జనవరి 22, 2010

అపుడే ఏడాదైందా !! ఇంకా ఏడాదేనా !!



సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు 22 జనవరి 2009, మమ్మల్ని అందరిని ఒంటరి వాళ్ళను చేసి అప్పటి వరకూ కొండంత అండగా ఉన్న మా అమ్మ తిరిగి రాని లోకాలకు పయనమయింది. ఈ ఏడాది కాలంలో మేము వేసే ప్రతి అడుగులోనూ తను లేని లోటు స్పష్టంగా తెలుస్తూనే ఉన్నా తన ఆశీస్సులు అనుక్షణం మా వెంట ఉన్నాయన్న నమ్మకం మమ్మల్ని వెన్నుతట్టి ముందుకు నడిపించింది.

గడిచిన ఏడాది గురించి ఓ క్షణం ఆలోచిస్తే "తను మమ్మల్ని వదిలి వెళ్ళి అపుడే ఏడాదైందా నిన్న మొన్ననే మామథ్య తిరిగినట్లు తన  ఙ్ఞాపకాలు సజీవంగా ఉన్నాయే" అనిపిస్తుంది. మరోక్షణం తను లేని లోటు, తన తోడు లేకుండా మేము భారంగా వేసిన అడుగులు, గడిపిన రోజులు గుర్తొస్తే ఇంకా ఒక ఏడాదేనా గడిచింది ఇంకా మరెన్ని రోజులు గడపాలో కదా అని కూడా అనిపిస్తుంది. 

గత వారం రోజులుగా తన ప్రధమ వర్దంతికి ఏర్పాట్లు చేస్తుంటే, ప్రతినిముషం తను ఉంటే ఎటువంటి ఫంక్షన్ కైనా శ్రీకృష్ణుడి సారధ్యంలా హాల్ లో సోఫాలో నిండుగా కదలకుండా కూర్చునే అన్నిపనులు ఎలా ప్లాన్ చేసి నడిపిస్తుంది, తనులేని లోటు ఎంతగా ఉంది అనే ఆలోచనలతో మనసు భారమౌతుంటే, గుండె కరిగి కన్నీటి వరదై ముందుకు ఉరుకుతుంది. సంవత్సరీకం గురించి చెప్పడానికి అమ్మ వాళ్ళ ఆఫీసుకి వెళ్ళిన మా నాన్న గారితో  "మేడమ్ గారు నీతి నిజాయితీలతో ఒక్క పైసా కూడా తీసుకోకుండా నాలుగేళ్ళలో ఎంతోమందికి ఉద్యోగాలిప్పించి అన్నం పెట్టింది సార్, ఆవిడ్ని మేం ఎలా మర్చిపోతాం" అని వాళ్ళంతా ఏక కంఠంతో అనడం వింటుంటే గర్వంతో అదే కన్నీరు ఆనందభాష్పాలుగా మారిపోతుంది.

అమ్మా, నీవెక్కడ ఉన్నా నీ ఆత్మకు సుఖ శాంతులు చేకూరాలనీ,
నీ చల్లని దీవెనలు సదా మా వెన్నంటే ఉండాలనీ కోరుకుంటూ..
నీ ఙ్ఞాపకాలలో, నువు పంచిన ఆత్మీయత లో..
నీ కోసం వెతుకుతూ మేము....

గత ఏడాది నేను అమ్మకు సమర్పించిన అశృనివాళి ఇక్కడ నొక్కి చూడండి.

మంగళవారం, జనవరి 19, 2010

స్పాములూ - స్కాములూ (Spam & Scam)

ఈ టపా ఎవర్నీ వేలెత్తి చూపడానికి ఉద్దేశించినది కాదు. కేవలం విషయం అందరికి తెలియచేయటానికి మాత్రమే ఉద్దేశించి రాయడమైనది. దయచేసి మీ వ్యాఖ్యలలో సైతం వ్యక్తుల పేర్లను ఉదహరించకండి.

జాల ప్రపంచంలో మీ ఈమెయిల్ ఐడి, ఇంటి అడ్రస్, బ్యాంక్ అక్కౌంట్ నంబర్ లాటి వివరాలు బయల్పరిచే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. సాధారణంగా ఈమెయిల్ కన్నా మిగిలిన రెండిటి విషయం లోనూ మరింత జాగ్రత్త అవసరం ఈమెయిల్ ఐడిది ఏముంది అనుకుంటాం, కానీ మీ ఈ మెయిల్ ను మీరు సమర్ధవంతంగా వినియోగించుకోగలుగుతున్నపుడు మాత్రమే అది నిజం. ఈ మెయిల్ ద్వారా జరిగే రక రకాల మోసాల గురించి అవగాహన లేని వారు మీ ఈమెయిల్ సైతం జాగ్రత్తగా కేవలం నమ్మదగిన వ్యక్తులకు మాత్రమే ఇవ్వటం మంచిది. ముందుగా ఆయా వ్యక్తుల అనుమతి తీసుకోకుండా ఒక పెద్ద గ్రూప్ ఈమెయిల్ అందరి ఈమెయిల్ ఐడి లను బయల్పరుస్తూ పంపించడం ప్రోత్సాహకరమైన విషయం కాదు. కావాలనో, ఒక మంచి ఉద్దేశ్యం తోనో, అవగాహనా రాహిత్యం వల్లనో పంపించే ఇటువంటి మెయిల్స్ తరువాత సమస్యగా మిగులుతాయి. విలువైన వ్యక్తుల సమయాన్ని హరించడమే కాక మెయిల్ సర్వర్ల పై అధిక లోడ్ తద్వారా బోలెడు ఎనర్జీ వేస్ట్. 

ఉదాహరణకు మీరు మీ అడ్రస్ బుక్ లోఉన్న అందరికీ ఒక ఈ మెయిల్ పంపిద్దాము అనుకున్నపుడు ’బిసిసి(Bcc)’ ఉపయోగించడం ఉత్తమమైన పద్దతి. దీనివలన మిగిలినవారికి ఎవరెవరికి మెయిల్ పంపబడినదో తెలిసే అవకాశం లేదు అలానే ఇతరుల ఐడి లు ఎవరికి కనిపించనందున స్పామ్ ను నివారించవచ్చు. ముందుగా అందరికీ బిసిసిలో ఈమెయిల్ పంపించి ఫలానా డిస్కషన్ మొదలు పెడదాము అనుకుంటున్నాను మీకు పాల్గొనడం ఇష్టమైతే జవాబివ్వండి అని అడిగి స్పందించిన వారి ఐడి లను బయల్పరుస్తూ అప్పుడు 'To' లో పొందుపరిచి మెయిల్ ఇవ్వడం చాలా మంచి అలవాటు.

అలానే కొందరు ఫార్వర్డ్ చేసే ఈ మెయిల్స్ సైతం వందల సంఖ్యలో ఈమెయిల్ ఐడిలు ఉన్న మెయిల్ ను మరో వందమందికి ఆ ఐడిలతో సహా పంపిస్తారు. ఇది కూడా తీవ్రమైన అసౌకర్యానికి గురి చేస్తుంది మీదే కాక అందరి ఈమెయిల్స్ జాలం లో బయటపడటం వలన స్పామరులకు స్కామరులకు మరింత ఆస్కారమిచ్చినట్లు అవుతుంది. కనుక ఇటువంటి మెయిల్స్ ఫార్వర్డ్ చేసేప్పుడు సైతం Bcc ఉపయోగించండి అలానే మెయిల్ లో ఇదివరకే ఈమెయిల్ ఐడి లు ఉన్న విషయం మీరు గమనిస్తే వాటిని డిలీట్ చేసి పంపించండి. ఇలా అత్యల్ప సమయాన్ని కేటాయించి బాధ్యతాయుతమైన ఈమెయిల్ వినియోగదారులవండి.

సరే ఈ విషయాలు తెలియక పొరపాటున మీ ఐడిని మీకు ఇష్టం లేని ఒక డిస్కషన్ త్రెడ్ లో మీ అనుమతి లేకుండా కలిపారనుకుందాం. డిస్కషన్ టాపిక్ తో వచ్చే మెయిల్స్ రెండు ఉంటే "Please remove my id from this discussion" అంటూ గ్రూప్ అందరికీ పంపించే మెయిల్స్ ఒక ఇరవై వస్తుంటాయ్. ఇటువంటి మెయిల్స్ స్పామింగ్ కు ముఖ్య కారణం. మీకు ఇటువంటి మెయిల్స్ వచ్చినపుడు ఉత్తమమైన పని జవాబివ్వకుండా వదిలేయడం. లేదంటే "reply all" or "అందరికి సమాధానమివ్వు" ఆప్షన్ ఉపయోగించక కేవలం ఎవరైతే మీకు మొదట ఈమెయిల్ పంపారో వారికి మాత్రమే జవాబివ్వడం ఉత్తమమైన పద్దతి. మీకు ఓపిక ఉంటే ఇలాంటి మెయిల్స్ ని మీ మెయిల్ సెట్టింగ్స్ లో ఫిల్టర్ ఆప్షన్ ఉపయోగించి పూర్తిగా నివారించవచ్చు. GMAIL లో నేను ఫిల్టర్ ఉపయోగించి విజయవంతంగా ఇటువంటి మెయిల్స్ ను నిరోధించగలిగాను. మీరు చేయవలసిందల్లా ఆ మెయిల్ యొక్క సబ్జెక్ట్ లైన్ ను కాపీ చేసి ఈ సబ్జెక్ట్ తో ఉన్న మెయిల్స్ ను తొలగించు అని ఫిల్టర్ క్రియేట్ చేయడమే. ప్రతి మెయిల్ సిస్టం ఈ ఆప్షన్ ను ఇస్తుందనే అనుకుంటున్నాను.

అసలు ఈ మెయిల్ ఐడి బయట పెట్టడం గురించి ఇంత టపా అవసరమా అనుకుంటున్నారా అయితే మీ ఈమెయిల్ ఐడి తెలుసుకుని అంచెలంచెలుగా మీ నెట్ బ్యాంకింగ్ ఐడి లను, బ్యాంక్ అకౌంట్ వివరాలను సైబర్ నేరస్తులు ఎలా సంగ్రహిస్తారో తద్వారా మీ డబ్బు ఎలా దోచుకుంటారో సవివరంగా వివరిస్తూ మంచు పల్లకీ గారు ఈ మధ్యే "నైజీరియా టు శ్రీకాకుళం" అంటూ ఒక టపా రాసారు అది ఒక సారి చూడండి. జాల ప్రపంచంలో మీ వ్యక్తిగత వివరాలను కాపాడుకోవలసిన ఆవశ్యకతను ఆ టపా మరింత వివరిస్తుంది.



Photos courtesy www.solarpowerrocks.com, http://sayiamgreen.com/

బుధవారం, జనవరి 13, 2010

నేనూ - నా ఇయర్ ఫోన్స్ - ఓ భొగి

పది సంవత్సరాలు ఒక వస్తువు మనతో ఉందంటే దానితో తెలియని అనుభందం ఏదో ఏర్పడి పోతుంది. హఠాత్తుగా ఓ  ఉదయం అది పని చేయడం మానేసిందంటేనో ఇక ఉపయోగించలేక పడేయాల్సి వస్తుందంటేనో మనసు ఒక్క క్షణమైనా విలవిలలాడక ఉండదేమో. అలాటిది మన నిర్లక్ష్యమే దానికి కారణం అయినపుడు ఆ బాధ మరింత ఎక్కువ అవుతుంది. ఆ వస్తువు ఏదైనా విలువ ఎంతైనా ఈ అనుభూతిలో మాత్రం పెద్దగా మార్పుండదు. "ఈ ప్రపంచంలోని ప్రతి దానిలోనూ జీవం ఉంటుంది ఏ మనిషైనా, వస్తువైనా మనకు ఎపుడు పరిచయమవ్వాలో మనతో ఎంత కాలం కలిసి ఉండాలో అంతా ముందే నిర్ణయింప బడి ఉంటుంది.." అని ఈ మధ్యే చదివిన ’ఆల్కెమిస్ట్’ లో చెప్పినా కూడా ఈ రోజు ఉదయం నిద్ర లేవగానే కాలికింద నలిగి మూడు ముక్కలైన నా సోనీ ఇయర్ ఫోన్స్ ని చూసి "హ్మ్ ఋణం తీరిపోయింది" అని అనుకుని సరిపెట్టుకోలేక పోయాను, కళ్లలో తడి చేరకుండా ఆపలేకపోయాను.

ఇంచుమించు పదేళ్ళ క్రితం నా క్యాసెట్ వాక్మన్ తో వచ్చిన హెడ్ సెట్ అసౌకర్యంగా ఉంది ప్లస్ క్వాలిటీ బాగోలేదు అని ఓ వెయ్యి లోపే దొరికిన ఈ ఇయర్ ఫోన్స్ కొన్నాను. నాకు చిన్నప్పటినుండి సోనీ అంటే అదో విథమైన ఫాసినేషన్ వల్లనో ఏమో తెలియదు కానీ అంతవరకూ వాడి పడేసిన చాలా హెడ్ సెట్స్ కన్నా దీని క్వాలిటీ చాలా బాగుంది అనిపించింది. ఇక అప్పటి నుండి ఇది నా శరీరం లో ఓభాగమై పోయింది. ఆఫీసు లో డెస్క్ టాప్ ఆ తర్వాత ల్యాప్ టాప్ కి కూడా ఇవే వాడేవాడ్ని. కొన్నాళ్ళకి క్యాసెట్ వాక్మెన్ పోయి సిడి ప్లేయర్ తర్వాత యంపీత్రీ సీడీ ప్లేయర్, తర్వాత ఫస్ట్ జెన్ ఐపాడ్, క్రియేటివ్ జెన్, కొత్త ఐపాడ్ ఇలా ఎన్ని ప్లేయర్స్ మారినా ఇయర్ ఫోన్స్ మాత్రం ప్లేయర్ తో వచ్చిన వాటిని పక్కన పడేసి ఇదే వాడేవాడ్ని. అదేంటో తెలియదు ప్లేయర్స్ తో వచ్చిన వాటి కన్నా నాకు ఇందులోనే బాగా వినిపిస్తున్నాయ్ అనిపించేది. నేను ఏ ఊరికి వెళ్తే ఇది కూడా నా వెంట ఆఊరికి ఆ దేశానికి వచ్చేసేది. నా చెవులు కూడా దీనికి బాగా అలవాటయ్యాయి. ఫోన్ తాలూకూ హెడ్ సెట్ కి పావుగంటలో విసుగొచ్చేది కానీ ఇవి పెట్టుకుంటే మాత్రం గంటలు గంటలు పాటలు వింటూ ఆనందంగా గడిపేసే వాడ్ని.

అలాంటి దీన్ని రాత్రి ల్యాప్ టాప్ తో పాటు ఉపయోగించి నిర్లక్ష్యంగా మంచం మీద వదిలేసాననుకుంటా, ఉదయం మంచం దిగేసరికి సరిగా నా కాలికింద పడి బాగుచేయడానికి కూడా వీలులేనంతగా రైట్ ఇయర్ బడ్ మూడు ముక్కలు అయింది. ఎలాగో కష్టపడి అతికించా కానీ పనిచేయడం లేదు ఎడమ బడ్ బాగానే అదే క్లారిటీతో వినిపిస్తుంది కానీ ఇకపై ఉపయోగించడం కష్టమే. నా గోడు విన్న ఓ నేస్తం "దానికో చిన్న శవపేటిక తయారు చేయించి ఓ శాటిన్ రిబ్బను కట్టి దాచిపెట్టుకోరా" అని సలహా ఇచ్చినా, అల్కెమిస్ట్ ఫిలాసఫీలో ఆలోచిస్తే దీనికీ ఓ ఆత్మ ఉంది అది ఇన్ని రోజులు నన్ను అనుసరించి ఉండి, "ఇక వీడు ఎంతకాలమైనా నన్ను ఇలానే సతాయిస్తుంటాడు రెస్ట్ ఇవ్వకుండా" అని అనుకుని, పనికి రాని పాత వస్తువుల్ని భోగి మంటల్లో పడవేసే ఈ భోగి రోజు తనంతట తానే ఇలా పాడైపోయి ముక్తిపొందాలని నిర్ణయించుకుంది అని అనిపిస్తుంది. అంతలోనే ఇన్నాళ్ళు నాతో ఉన్న ఈ హెడ్ ఫోన్ ఇలా పాడై పోవడం వెనుక ఏదైనా bad omen ఉందా అని కూడా అనిపిస్తుంది :-) మీరింకా ’అల్కెమిస్ట్’ చదవకపోతే ఈ విషయాలు వదిలేయండి. 

 హ హ :-) నాకు బొత్తిగా పనిలేదన్న విషయం ఈపాటికే మీరు గ్రహించేసుంటారు. ఏదేమైనా భోగి అనగానే నాకు  గుర్తొచ్చే ఓ చిన్న మ్యూజిక్ బిట్ గురించి చెప్పి ముగిస్తాను. ఇళయరాజా గారు స్వర పరిచిన దళపతి సినిమాలోనిది ఈ బిట్. సినిమాలో  అప్పుడప్పుడు నేపథ్య సంగీతం గా వినిపిస్తుంది క్యాసెట్ లో కూడా వచ్చిందనుకుంటా. లిరిక్ కి పెద్ద ప్రాముఖ్యం లేదు కానీ రాజా బీట్ వినడానికి భలే ఉంటుంది. నేను అప్పుడప్పుడు రివైవ్ అవడానికి ఈ బిట్ వింటుంటాను, లిరిక్ వదిలేసి తాననన తాననన తానానా హొయ్ అని పాడుకుంటూ కూడా ఉంటాను. మీరు ఇక్కడ విని ఆనందించండి. :-) మీకూ మీ కుటుంబానికీ భోగి మరియూ సంక్రాంతి శుభాకాంక్షలు :-)

సోమవారం, జనవరి 11, 2010

నరసరావుపేట్రియాట్స్ లో నేను.

నరసరావుపేట్రియాట్స్ బ్లాగులో నా పదవ తరగతి జ్ఞాపకాల టపా చదివారా, లేదంటే ఈ క్రింది లింక్ పై నొక్కి చదవండి.


"మా ఊరు మాకు గొప్ప" అంటూ మొదలు పెట్టి, "రండి చరిత్ర సృష్టిద్దాం" అంటూ ఆహ్వానించి, నరసరావుపేట వాసులకు ఒక వేదిక సృష్టించి, అందరి అనుభవాలను అనుభూతులను ఇలా పంచుకునే అవకాశాన్ని కల్పించిన మా పేట్రియాట్స్ గీతాచార్య, సుజాత లకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

"మన పేట్రియాట్స్ బ్లాగు కోసం ఏమైనా రాయచ్చుకదా" అంటూ ప్రోత్సహించి, నాకు మళ్ళీ ఒకసారి నాచిన్ననాటి రోజుల్లోకి వెళ్ళి ఆనాటి మధురానుభూతుల్లో విహరించే సదవకాశం కల్పించి, నాచే ఈ టపా రాయించి, ప్రచురించిన సుజాత గారికి ప్రత్యేక ధన్యవాదాలు.

దయచేసి ఆ టపాకు సంబందించిన కామెంట్లు నరసరావుపేట్రియాట్స్ బ్లాగులోనే రాయండి.

బుధవారం, జనవరి 06, 2010

క్షుర ’ఖ’ర్మ

తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం క్షవరం. చిన్నప్పటి నుండీ మంగలి చేతిలో హింస భరించ లేక, అలా అని జుట్టుని అలా వదిలేయలేక పడ్డ కష్టాలు నాకూ ఆ దేవుడికే తెలుసు. అసలు మనిషి అనాటమీ గురించి ఎపుడైనా ఆలోచిస్తే ఆహా  దేవుడు ఎంత అద్భుతమైన అర్కిటెక్ట్ అని అనిపిస్తుంటుంది. కానీ అంత గొప్ప ఆర్కిటెక్ట్ కూడా అప్పుడప్పుడూ పప్పులో కాలేస్తాడు అని చెప్పడానికి ఒక ఉదాహరణ జుట్టు. తలలో ఉన్న మెదడు కు దెబ్బ తగలకుండా రక్షణ కోసాం జుట్టును అమర్చాడనుకుందాం సరే బాగుంది. కానీ అది కుషన్ లా కాస్త పెరిగి, ఓ స్టైల్ లో అలా ఉండిపోయేలా ఉంటే ఎంత బాగుండేది. అలాకాకుండా అది జీవితాంతం అలా పెరుగుతూనే ఉండే ఏర్పాటు చేశాడు చూశారా అక్కడే మరి నాకు మండుద్ది. పోని కత్తిరించకుండా వదిలేద్దామా అంటే అడ్డ దిడ్డంగా ఎగిరి మొహం మీద పడటం, చెవుల పైనంతా పెరిగి చిరాకు తెప్పించటం ఇత్యాదిగా దాని నిర్వాకాలు మాటల్లో చెప్పనలవి కాదు. ఇంతేనా అసలు దాని నిర్వహణ కోసం రోజూ కొబ్బరి నూనె సీసానో, శలవురోజుల్లో అయితే ఆముదం సీసానో చేత పట్టుకుని వెంటపడే అమ్మనుండి తప్పించుకోడానికి ఎంత చాక చక్యం కావాలి. పోనీ గుండు గీయించేద్దాం అంటే, అబ్బే అదస్సలు బాగోదు. హు మగవాడిగా పుట్టినందుకు ఈ కష్టాలు భరించక తప్పదు కదా. 

నా చిరాకుకు ఒక మినహాయింపు వాలుజడ, అంటే మరి దాన్ని భరించాల్సింది మనం కాదు కదా :-) అది కూడా ఓ కారణం మినహాయించడానికి. కానీ గుప్పెడు మల్లెలు తురిమిన వాలు జడ నాగుపాములా అలా వయ్యారంగా కదులుతూ ఉంటే ఆ అందం చూడటానికి రెండు కళ్ళూ సరిపోతాయిటండీ... అసలు ఒకప్పటి అమ్మాయిలను చూసి కుళ్ళుకునే వాడ్ని ఎంచక్కా అందమైన వాలు జడ వీళ్ళసొంతం, అదీకాక నెలకోసారి మంగలిచేతికి తలప్పగించి వాడు దానిపై తబలా వాయిస్తూ వాలీబాల్ ఆడుకుంటుంటే భరించాల్సిన అవసరం లేదుకదా అని. ఒకప్పటి అని ఎందుకన్నానంటే పాపం ఇప్పుడు వాళ్ళుకూడా క్రాఫింగ్ చేయించేస్తున్నారు కదా అందుకని. కానీ తర్వాత్తర్వాత చెల్లాయిని చూస్తే అర్ధమైన విషయం ఏమిటయ్యా అంటే వాలుజడ నిర్వహణ కోసం అమ్మాయిలంతా మంగలోడి కన్నా నిరంకుశులు అయిన అమ్మల చేతికి ప్రతిరోజు బుర్ర అప్పగించి నానా హింస భరిస్తారు పాపం :-( అని. వారి సహనానికో వందనం ఇదుగో :-)

అమెరికాలో ఈ బాధ మరింత ఘోరంగా ఉండేది. అక్కడ ఎక్కువగా మెక్సికన్స్ మరియూ చైనీస్ ఈ పని చేసే వారు. వాళ్ళకి ఇంగ్లీష్ లో చెప్పినా సరిగా అర్ధం అయ్యేది కాదు పోని అర్ధం కాలేదు అని మరో సారి అడిగి మనకి ఎలా కావాలో తెలుసుకుంటారా అంటే ఊహూ అదీలేదు. మనం చెప్పిన దానికంతా తలాడించేసి  వాడికి నచ్చిన స్టైల్లో చేసి పంపించేస్తాడు. ఒకసారి ఇలానే నేను ఐదు నిముషాలు జుట్టుపట్టుకుని మరీ చూపించి వివరించాను వాడు బుద్దిగా విని నేఆపగానే ఒక మెషీన్ తీసుకుని వరికోతలు కోసినట్లు జుయ్.య్.య్.మని తలంతా రెండు రౌండ్ లు వేసి రెండే నిముషాల్లో అయిపోయింది ఫో!! అన్నాడు, నాకేం చేయాలో అర్ధంకాక డబ్బులు ఇచ్చి బయటపడ్డాను. ఇక్కడి రేట్లు కూడా మరీ దారుణం రెండు నిముషాలు మిషన్తో చేసే పనికి 13 డాలర్ల ఫీజు పైన రెండు డాలర్ల టిప్పూ వెరసి 15 డాలర్లు ముక్కుపిండి వసూలు చేసేవాడు (ఈసారెళ్తే వాల్ మార్ట్ లో ఓ మూల క్షౌరశాల కూడా పెట్టమని సలహా ఇవ్వాలి). సరే ఇంటికొచ్చి చూస్కుందును కదా తలంతా సగం చీకేసిన తాటి టెంక లా ఒకసగం అంతా క్రాఫ్ చేయని పొడవు జుట్టు రేగిపోయి, మరోసగం క్రాఫింగ్ చేసిన జుట్టు కుదురుగా నున్నగా అణిగిపోయి దర్శనమిచ్చింది. ఆ వికృతరూపాన్ని చూసి ఝడుసుకుని మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళే ధైర్యం చేయలేక వేరే చోటకి వెళ్ళి సరిచేయించుకుని వచ్చాను.

సరే ఇక బెంగుళూరు వచ్చిన మొదట్లో అప్పటికే చాన్నాళ్లవుతుంది, చిరాకుగా ఉంది  అని తప్పనిసరై సెలూన్ వేట మొదలెట్టాను, ఎవర్నడిగినా ఇక్కడే ఇక్కడే అని చెప్తుంటే కాబోలు అనుకుని అలా కాళ్ళరిగేలా ఓ కిలోమీటరు పైనే నడిచి ఏదో ఒక మెన్స్ పార్లర్ అని కనిపిస్తే దాన్లోకి అడుగు పెట్టాను. తలుపు తీసి లోపలికి అడుగు పెట్టానో లేదో చల్లని ఎయిర్ కండిషన్ గాలి, సుమధురమైన రూమ్ ఫ్రెషనర్ ఘుమ ఘుమలు మైమరపించాయి. ఓ క్షణం పరికించి చూస్తే మాంచి టివీ ప్లస్ మ్యూజిక్ సిస్టం, ఒక పక్కగా అక్వేరియం, ఖరీదైన (ఫోటోల్లో చూపించినలాంటి) కుర్చీలు, ఓ మూలగా వాషింగ్ మెషీన్, ప్రతి కుర్చీకీ పక్కన వాళ్ళు కనపడకుండా ఇండివిడ్యువల్ కంపార్ట్ మెంట్స్(కార్పొరేట్ అఫీసుల్లో కూడా ఉండవేమో). కళ్ళు మిరుమిట్లు గొలిపే లైట్లు, గ్రానైట్ ఫినిషింగ్ తో వాష్ బేసిన్ ప్లాట్‍ఫాం. మొత్తం పోష్ సెటప్ చూస్తే వీర లెవల్ లో వసూల్ చేస్తాడు అనిపించింది ఓ క్షణం వెనక్కితిరిగి చూడకుండా పారిపోదామా అనికూడా అనిపించింది. కానీ అప్పటికే అలసి పోయి ఉండటంతో ఏదోఒకటి లే ఇక ఓపికలేదు అనుకున్నాను.

అంతలో ఓ పక్కనుండి యాప్రాన్ కట్టుకుని చేతిలో ఓ కత్తెర పట్టుకుని మాంచి ఇంగ్లీష్ లో ఒకతను పలకరించాడు. అతన్ని చూసిన వెంటనే ఫక్కుమని నవ్వొచ్చేసింది. కింద ఫోటోలో చూపించినట్లుగా, అంత కాకపోయినా ఇంచుమించు అంత గడ్డం, చెవులవరకూ అంటే సగం పైగా బట్టతల. అతన్ని ఇలాటి మెన్స్ బ్యూటీ పార్లర్ లో పెట్టడం చూసి నవ్వాగలేదు. "నువ్వు అర్జెంట్ గా ఓ విగ్గు కొనుక్కో.. లేదంటే ఈ పనైనా మానేయవోయ్.." అని సలహా ఇద్దాం అనుకున్నాను. చూస్తే తెలుగువాడిలా కనిపించాడు "ఏం పేరోయ్.." అని అడిగా/ దివాకర్ అన్నాడు నాకు ఎందుకో తోటరాముడు గారి దినకర్ ప్లస్ ఏప్రిల్ ఒకటి విడుదల లోని దివాకరం ఇద్దరూ కలిసి గుర్తిచ్చారు. సరే తెలుగు అని తెలిసాక మాట్లాడటం మొదలెట్టాడు.

"అసలు మీకు మీ జుట్టు మీద కానీ మీమీద కానీ శ్రద్ద లేదు సార్... ఇవ్వాళ రేపు జనం ఎలా ఉంటున్నారు ? జిమ్ లని బ్యూటీ పార్లర్ లని ఎంత శ్రద్దగా మెయింటెయిన్ చేస్తున్నారో తెలుసా?. మీరిలా మీగురించే పట్టించుకోకుండా ఉంటే ఎలా సార్?" అన్నాడు. అహా అలాగా "అది సరే ఇంతకీ పట్టించుకోవడం అంటే ఏంటి సార్?" అని అడిగాను. "ఫేషియల్ చేద్దాం సార్, బ్లీచ్ చేద్దాం సార్" అని వాడి దగ్గర ఉన్న సర్వీసులన్నీ మార్కెటింగ్ చేయడం మొదలెట్టాడు. "అలాక్కాదు కానీ ముందు క్రాఫ్ చేసి తగులడు రా బాబు.." అని చెప్తే మొదలెట్టి క్రాఫ్ చేస్తున్నంత సేపు వాగుతూనే ఉన్నాడు. ధ్యాసంతా మిగిలిన సర్వీసులపై ఉంటే ఇక క్షవరం ఎలా చేసుంటాడో మీకు వేరే చెప్పాలా.. అసలే పలచని సిల్కీ హెయిర్ ఆపై వాడు అడ్డదిడ్డంగా కత్తెరతో స్వైర విహారం చేస్తుంటే జుట్టు కుదుళ్ళతో సహా పెరకబడటం తెలుస్తుంది. "ఒరే..ఒరే.. నేను క్షవరం చేయమన్నాను రా జుట్టుపీకమనలేదు.." అని తిట్టేశాను కాస్తేలే సార్ అని కవర్ చేశాడు. ఇక గెడ్డం గీసేప్పుడైతే  సుత్తివీరభద్రరావు గారి తిట్లు గుర్తొచ్చాయ్ "ఇంకోసారి చేయి వణికిందంటే నీ నవరంధ్రాలలోను మైనం కూరతాను కుంకా... గడ్డం చేస్తే సుతారంగా నెమలీక తో నివిరినట్లుండాల్రా దోగుడుపార తో దోకినట్లు కాదు". అని తిట్టేద్దాం అనిపించింది. మొత్తం మీద అన్నీ ముగించి చివరికి 370 బిల్లేశాడు. క్షవరం నా తలకా, నా జేబుకా రా నాయనా అని తిట్టుకుంటూ బిల్లు కట్టి బయటపడ్డాను, అదీ జరిగింది.

సోమవారం, జనవరి 04, 2010

(ఇం) కోతి కొమ్మచ్చి

సాహితీలోకం లో నేను ఇంకా పాకడం కూడా రాని పసివాణ్ణి, నేనేదో రాయడం గురించి చెప్తున్నాను అనుకునేరు నే చెప్పేది చదవడం గురించే, ఇక రాయడం సంగతి మీరే అర్ధంచేసుకోండి. యండమూరి గారి నవలల్ని, ఆంగ్ల నవలల్ని మినహాయిస్తే నేను చదివిన పుస్తకాలు ఓ పాతిక ముప్పై మించవు. కాకపోతే అన్నప్రాసన నాడే ఆవకాయ రుచి చూసినట్లుగా నే తెలుగు పుస్తకాలు మొదలు పెట్టిందే ’అమరావతికథలు’ పుస్తకంతో, ఆ తర్వాత నాకున్న అసక్తి వలన అయితేనేమీ, ఓపికవలన అయితేనేమీ వెతికి వెతికి అన్నీ మంచి పుస్తకాలు మాత్రమే చదివాను. అయినా నాకు పుస్తకాలపై సమీక్షలూ పరిచయాలూ రాసే అర్హత లేదనే ఘాట్టి నమ్మకం, అందునా ముళ్ళపూడి వారి పుస్తకం గురించి పరిచయం చేయడం అంటే సూరీడ్ని దివిటీ పట్టుకు చూపించడమన్న మాటే, అన్నమాటేమిటిలే ఉన్న మాటే.. అయినప్పటికీ నాకు బాగా నచ్చేసిన, ప్రతి తెలుగువారి ఇంట ఖచ్చితంగా ఉండాల్సిన (ఇం)కోతికొమ్మచ్చి గురించి నాలుగు మాటలు చెప్పాలని ఈ చిన్ని ప్రయత్నం.

అసలు ఆటోబయోగ్రఫీ కి కోతికొమ్మచ్చి అని పేరు పెట్టాలన్న ఆలోచన రావడమే రమణ గారి చమత్కార శైలికి నిదర్శనం. మొదట నవ్వొచ్చినా వెంటనే ఎంత నిజం అనిపిస్తుంది. ఒకసారి గమనించి చూస్తే మనసు గతంలోకి పయనించినపుడు ఒక క్రమ పద్దతిలో తేదీల వారీగా అసలు ఆలోచించదు అని అర్ధమవుతుంది. చంచలమైన మనసు కోతిలాటిది అది గతమనే చెట్టుపై ఙ్ఞాపకాల కొమ్మలమీద ఒకదాని మీదనుండి ఇంకో దాని మీదకు దూకుతూ కోతికొమ్మచ్చి ఆట ఆడేసుకుంటుంది కదా, రమణగారు ఎంతబాగా చెప్పారు అని అనుకుంటాం. అసలు ఈ పేరు పెట్టడం తోనే రమణ గారు జీవితాన్ని చూసే దృక్కోణం ఎలా ఉంటుందో మనకి ఒక అవగాహన తెప్పించేస్తారు. మొదటి భాగమైన కోతికొమ్మచ్చిలో ఎక్కువగా బాల్యం, ఇష్టంగా చూసిన ఆకలి కష్టాలు, స్నేహాలు, పెళ్ళికబుర్లు, రచనా వ్యాసంగం, పత్రికలో ఉద్యోగం లాటి వివరాలు గుప్పించి చివరికి ఆంధ్రపత్రిక లో ఉద్యోగానికి ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ గా రెండో రాజీనామా చేయడంతో ముగించారు. ఇంతకూ మీరా మొదటిభాగం చదివారా ? లేదంటే ముందు మీ కంప్యూటర్ కట్టేసి వెళ్ళి కోతికొమ్మచ్చి కొని తెచ్చుకుని చదివేసి తర్వాత ఈ టపా తెరవండి.

ఇక రెండో భాగం మొదలుపెట్టడమే "రెండో రాజీనామాతో సంపాదన కుళాయిధార సన్నబడింది.." అంటూ మొదలుపెట్టి నిరుద్యోగిగా పొట్టకూటికోసం చేసిన అనువాదాలు, సాధించిన విజయాలు, "నావల్ల కాదు.. నే సినిమా రంగానికి పనికి రాను" అనుకుంటూనే పెద్దల ప్రోత్సాహంతో అడుగుపెట్టిన సినీరంగ విశేషాలు, అక్కడ అందుకున్న సత్కారాలు, ఛీత్కారాలు, అభిమానాలు, అవహేళనలు గురించి చెప్తారు. ఇంకా ఒకడికింద పనిచేయడం విసుగువచ్చి బాపుతో కలిసి నడిపిన జ్యోతి పత్రిక గురించి, అది మేలుచేయడం మానేయడంతో తిరిగి సినీ ప్రపంచంలోకి నిర్మాతగా అడుగిడి చేసిన సాహసాల గురించి చెప్తారు. హ హ కోతి కొమ్మచ్చి అని చెపుతూనే నేను ఏ భాగం లో ఏమేం రాశారో విడదీయడానికి ప్రయత్నిస్తున్నాను. అంటే టూకీగా ఇదే అయినా రమణ గారు ఇలా ఓ క్రమ పద్దతిలో రాయరు అక్కడక్కడా కొమ్మలు పట్టుకుని ఎక్కడికో వెళ్ళి మళ్ళీ "మర్కట శ్రేష్టా కోతికొమ్మచ్చి వలదు.." అని తనని తనే అదిలించుకుని కథ కొనసాగిస్తూ క్రమపద్దతిలోనే రాసినట్లు భ్రమింపచేస్తారు.

నాకు ఎందుకో మొదటి భాగం కంటే ఇందులో బాపు బొమ్మలు కాస్త తక్కువే ఉన్నాయనిపించింది. ఎక్కువభాగం సినిమా విశేషాలు ఆక్రమించుకోవడంతో సినిమా ఫోటోలు, వాటి పబ్లిసిటీ కోసం గీసిన బొమ్మలే ఎక్కువగా కనిపిస్తాయి. అయినా ఉన్న కొద్ది బుల్లి కార్టూన్లలో బాపుమార్క్ గీతలు ఉల్లిపాయ పకోడీలు నముల్తుంటే మధ్య మధ్య కరకర లాడుతూ వేగిన కరివేపాకులా కమ్మగా రుచిగా తగుల్తూనే ఉంటాయి. వాటిలో మచ్చుకు కొన్ని ఈ టపాలో పెడుతున్నాను. బియ్యం బస్తా లంచం అడిగిన సెన్సార్ ఆఫీసరు గురించి చెప్తూ "పాపం అడగడం కూడా చాతకాని ఆఫీసరు.." అని రమణ జాలి పడుతుంటే పక్కన బాపు గారు పరిగెడుతున్న కత్తెర నెత్తిమీద ఓ బియ్యం గింజలాటి బస్తా వేసి ఆ కత్తెరకు దొంగకోళ్ళ చూపు పెట్టి మనల్ని ఫక్కున నవ్వించేస్తారు. బుద్ధిమంతుడు సినిమాలోని అన్నదమ్ముల మధ్య వైవిధ్యాన్ని విడమరిచి చెప్పడానికి రమణ ప్రయత్నిస్తుంటే పక్కనే ఓ అద్భుతమైన బుల్లి బొమ్మ గీసి ఇదీ విషయం అని బాపుగారు ఒక్క గీతతో మనకు సర్వం బోధపడేలా చెప్పేస్తారు. అంతెందుకు ఒక్కమాటలో చెప్పాలి అంటే ఈ పుస్తకాలకు బాపు గారి గీతలు, బంగారు నగలకు పొదిగిన వజ్రపు తునకలు.

"ఆ! సాధించిన నాలుగు విజయాల గురించి, కల్పించి రాసే కష్టాల గురించీ తప్ప ఆత్మకథల్లో ఏముంటుంది లే.." అని కొట్టిపారేయడానికి వీలులేని పుస్తకం ఇది. తినడానికి తిండి లేకపోయినా ఆత్మ గౌరవానికి విలువిచ్చి తృణ ప్రాయంగా ఉద్యోగాలకు రాజీనామా లివ్వడం చూస్తుంటే ఇంత ఆత్మ స్థైర్యం ఈతని సొంతం ఎలా అయింది అని అశ్చర్యమేస్తుంది. కష్టాలను ఓర్పుగా ఎలా ఎదుర్కోవాలో తెలియచెప్పే బ్రతుకు పాఠాలను చెప్పినట్లు తెలియకుండానే మనకి కూడా నేర్పించేస్తారు. "బాకీ కాస్త అటు ఇటుగా ఎలాగైనా తీర్చేసుకోవచ్చు కానీ ఋణం తీర్చుకోలేం.." అంటూ జీవితంలో మేలు చేసిన వాళ్ళని ఎలా గుర్తుపెట్టుకోవాలో నేర్పిస్తారు. "నువ్వు సినిమాకి పనికొస్తావు, సినిమాకే పనికి వస్తావు.. చచ్చినట్టు పనికి రా పైకిరా.." అంటూ తనను తిట్లుచ్చుక్కొట్టి సవరదీసి సినిమారంగంలో పడేసిన డిబియన్ గారి గురించి చెప్తూ అప్పట్లో ప్రతిభను ఎలా గుర్తించేవారో ఇప్పటికీ ఆ అవసరం ఎంత ఉందో స్పష్టంగా తెలియచేస్తారు. తను గడువుకన్నా ముందుగానే రాసిపెట్టినా డబ్బులు ఇవ్వక ఏడిపించిన తీతగాడి(దర్శక నిర్మాత) గురించీ రాశారు, తను నిర్మాతగా మారి అప్పటి పారితోషికంకన్నా ఎక్కువ ఇచ్చినా పాటరాసి ఇవ్వక ఏడిపించిన పాటగాడి గురించీ రాశారు. తను అఙ్ఞానంతో చేసిన పొరపాట్లను ఆనాటి పెద్దలు క్షమాస్త్రంతో ఎలా ఎదుర్కొన్నారో చెప్తూ వారు ఎందుకు అంత పెద్దలయ్యారో వివరించేస్తారు. "కూరల కావిడి గాళ్ళకి ఉన్నపాటి కిమ్మత్తు కవిగాళ్లకి లేదోయ్" అని అంటూ విప్లవం వర్ధిల్లాలి అని తను తిరగబడిన వైనం వివరించి యువతలోధైర్యాన్ని నింపుతారు.

పాఠకులని టైంమెషీన్ లోఎక్కించి 1960 లలోకి అవలీలగా తీసుకు వెళ్తారు, తన చమత్కార దృష్టితో అప్పటిలోకాన్ని చూపిస్తారు, 85 రూపాయల విమాన టిక్కెట్టుగురించీ, అప్పటి రైలులో మొదటి తరగతి కూపేలలోని సౌకర్యాల గురించీ, 45 రూపాయల టిక్కెట్టు ఉండే హిందూ వార్తాపత్రికల డకోటా ఏరో ప్లేన్ ప్రయాణ విశేషాలను వివరిస్తారు. అప్పట్లో పేముకుర్చీలు ఒక్కోటి 27 రూ.లు ఇప్పుడు పన్నెండు వందలట అని ఆశ్చర్యపడి లేస్తారు :-) ఆశ్చర్య’పడి’ లేచి, ఉలికి’పడి’ లేచి, పొరపాటుమాటకు బదులుగా ’పొరమాట’, సెన్సార్ పెద్దల వరుస వివరిస్తూ ’సెన్సా-రింగ్ సర్కస్’ లాటి పద ప్రయోగాలకు ఈ పుస్తకం లోనూ కొదవ లేదు. అలా అని ఇదంతా ఏదో 1960 ల నాటి గోల అనుకోడానికివీలులేదు మధ్య మధ్యలో అలవోకగా "యాంకర్ స్వప్నగారన్నట్లు "చౌ.వండీ.. చౌ.తూనే ఉండండీ.."" ఆని అంటూ సున్నితంగా నేటి యాంకరమ్మలకు ఓ చురక అంటించేస్తారు. అలానే సెన్సారు వాళ్ళకి దొరకకుండా ద్వంద్వార్ధాలతో రాసే మహాశిల్పులుంటారు అనిచెప్తూ  "ఆరేసుకోబోయింది ఏంటో పారేసుకుంది ఏంటో", "అబ్బనీ తీయని దెబ్బ" ఏంటో అంటూ వేటూరిమహాశిల్పిగారికి తనువారవందనాలు అని ప్రైవేటు చెప్పేస్తారు. 

అంతేనా తను ఫారిన్ సరుకు తప్ప ముట్టుకోను అన్న మందుబాబుకు ఫారిన్ సీసాలో నాటు సరుకు పోసి ఇచ్చి చేసిన అల్లరులు నెమరేసుకుంటారు. సావిత్రి గారి వీణను విమానంలో తీసుకురానిచ్చారని విన్న సూర్యకాంతమ్మ "అయ్యో తెలిస్తే నా రుబ్బురోలు కూడా తెచ్చుకుందును కదమ్మా" అంటే ఉరిమిచూసిన సావిత్రిగారితో "తేడా ఏముందమ్మా వీణ సరస్వతీ, రోలు అన్నపూర్ణ, ఇద్దరూ దేవతలే" అంటూ చేసిన చమత్కారాన్ని గుర్తు చేసుకుంటారు. ఇంకా అలనాటి జ్యోతి పత్రికతో తము చేసిన ప్రయోగాలు గురించి వివరిస్తారు ఆనాటి పత్రికనుండి ఇచ్చిన క్లిప్పింగ్స్ పాఠకులకు ప్రత్యేక బోనస్.. "తెలుగువాళ్ళను తిట్తిపోసి అరవవాళ్ళను, బెంగాలీవాళ్ళను మెచ్చుకునేవాడు తెలుగువాడు.." అంటూ ఆనాటి టెల్గువాడు చెప్పిన తెలుగోపనిషత్ తో తెలుగువాడిపై చురకలు. ఫన్‍చాంగం, "దురాలోచనకి దూరాలోచనకి తేడా దీర్ఘమైనది" అంటూ చెప్పే చతురోక్తులు, శ్రీశ్రీగారి పంచపదులు అన్నీ అప్పటి ప్రింట్లో చదవడం ఆసక్తిదాయకం. మచ్చుకు ఒక శ్రీశ్రీ పంచపది.

"అరిచే కుక్కలు కరవవు
కరిచే కుక్కలు మొరగవు
కరవక మొరిగే కుక్కలు తరమవు
అరవక కరిచే కుక్కలు మరలవు
అరవని కరవని కుక్కలెక్కడా దొరకవు."

అదండీ మరి విషయం ఇంకా నే స్పృశించని అంశాలు చాలా ఉన్నాయి నేను మచ్చుకు ఓ నాలుగైదు చెప్తేనే టపా చాంతాడంత అయింది. వెంటనే మీరు కొని చదివేసేయండి. ఈ పుస్తకం ఖచ్చితంగా మిమ్మల్ని నిరాశ పరచదు. ఈ పుస్తకం "కొనడం మీవంతు ఆకట్టుకొనడం మావంతు" అనే నినాదంతో ముందుకు సాగుతున్న హాసం వారి ప్రచురణ. ఇది అన్ని విశాలాంధ్ర పుస్తకాలయాలలోను దొరుకుతుంది వెల 150.


అన్నట్లు కోతికొమ్మచ్చి పేరు బాగుంది, (ఇం)కోతి కొమ్మచ్చి ఇంకాబాగుంది మరి మూడో భాగానికి ఏం పేరు పెడతారో!? అని ఆలోచిస్తున్నారా ఆసందేహాన్ని కూడా నివృత్తి చేశారు అది ’ము-క్కోతికొమ్మచ్చి!!’ట దానికి బాపుగారు గీసిన బొమ్మ ఇక్కడ చూడండి, ఈ బొమ్మ చూసి నవ్వని వారికి ఒక చక్కలిగింత ఫ్రీ :-)

గురువారం, డిసెంబర్ 31, 2009

ఎత్తరుగుల అమెరికా వీధి - ఈనాడు కథ

"ఈనాడు" తెలుగు వార్తాపత్రికల పాఠకులకు చిర పరిచితమైన పేరు. ఈ దినపత్రిక ఆదివారం అనుబంధం ప్రచురించటం మొదలు పెట్టాక, నిజం చెప్పొద్దూ వారపత్రిక ప్లస్ దినపత్రిక కలిపి ఒకే రేటుకు వస్తుంది అనిపించింది. ఒకప్పుడు ఈ ఆదివారం అనుభందం లో నేను తరచుగా చదివేది బాలవినోదిని, కథ, ఇది కథకాదు, పదవినోదిని(cross word puzzle). కానీ రాను రాను నాకు కవర్ పేజి వెనక వేసే తారల విశేషాలు ప్రత్యేకమైన బొమ్మలుకూడా వదలకుండా మొదటి పేజి లోని ’మాయా’లోకం నుండి చివరి పేజీ లోని ’పదవినోదిని’ వరకూ ప్రతి అక్షరం చదవడం అలవాటు అయింది. ఎన్ని చదివినా అప్పటినుండి ఇప్పటివరకు చదవకపోతే మిస్ అయ్యేంతగా అలవాటైనవి మాత్రం కథ, శ్రీధర్ రాజకీయ కార్టూన్స్, బాలు కార్టూన్. వీటిలో ఈ మధ్య కాలంలో వస్తున్న కథలు అన్నీ చాలా వరకు నిరాశ పరుస్తూనే ఉన్నాయి.

అయినా ఎక్కడో ఓ మంచి కథ దొరకకపోతుందా అనే ఆశతో అలా ప్రతివారం చదువుతూనే ఉన్నాను. అలాంటి టైం లో మొన్న ఆదివారం డిశంబర్ 27 సంచికలో ఓ అందమైన కథ నా కంట పడింది. చదువుతుండగా ఆహా అనిపించింది చదివిన వెంటనే ఓహో అనిపించింది. నాకు పన్నెండు ఇళ్ళు వద్దులే బాబు అటువంటిదే ఒక ఇల్లు ఉన్నా చాలు అనిపించింది. నా ఊహలను ఈ రచయిత ఎలా చదివేశాడా అనిపించింది. వెంటనే ఆ హీరో పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేయాలని అనిపించింది. మనసుండాలే కానీ అటువంటి జీవితం ఎప్పటికైనా ఆచరణ సాధ్యం కాక పోతుందా అనిపించింది.

ఇంకా... పెరటి గుమ్మానికి చేరగిలపడి నేను కూర్చుంటే మొదటి మెట్టుపై తను కూర్చుని మడిచిన నా కాళ్ళపై అలవోకగా వాలి నా మోకాళ్ళ పై తన తల ఆన్చిన నా శ్రీమతితో కలిసి, జాబిలి తో ఆటలాడుకుంటున్న మేఘాలనూ, పెరట్లోని మందారాల వయ్యారాలనూ పరికిస్తూ, నైట్ క్వీన్, సన్నజాజుల పరిమళాలు మట్టివాసనతో కలిసి మైమరపిస్తుంటే ఆస్వాదిస్తూ, తనకి నా స్వరంతో ఈ కథ చదివి వినిపించాలని అనిపించింది. అదిగో అందుకోసమే ఆ అనుభూతి కోసమే భద్రంగా ఈ కథను నా బ్లాగులో పదిల పరచుకుంటున్నాను.

ఇంత మంచి కథను రాసిన వట్టికూటి చక్రవర్తి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కథకు కేవలం  కన్సొలేషన్ బహుమతి తో సరిపెట్టినందుకు ఈనాడు జడ్జిలపై కాస్త కోపం వచ్చినా.. అసలు పోటీ అంటూ పెట్టి మంచి కథలు రాబట్టినందుకు ఈనాడు ఆదివారం బృందాన్ని కూడా అభినందిస్తున్నాను. ఇంతకీ ఈ కథ మీరు చదివారా... ఒకవేళ చదవకపోతే వెంటనే చదివేయండి మరి. పనిలో పనిగా వైవిధ్యభరితమైన కథ అంటూ ఈ కథకు నెమలికన్ను మురళి గారు రాసిన పరిచయాన్ని కూడా ఇక్కడ నొక్కి చదివేయండి. 

మిత్రులు అందరికీ 2010 నూతన సంవత్సర శుభాకాంక్షలు, కాస్త ముందుగా :-). నూతన సంవత్సర వేడుకలను మనసారా ఆస్వాదించండి.






మంగళవారం, డిసెంబర్ 29, 2009

నేనూ.. మౌనం.. సంతోషం..

డిశంబర్ అంతా ఆర్ట్ ఆఫ్ లివింగ్ నెల అయిపోయింది నాకు. అసలు ఈ కోర్స్ చేయడం వెనక ఓ పిట్ట కథ ఉంది కానీ దాని వివరాలు మళ్ళీ ఎపుడైనా సమయం కుదిరినపుడు చెప్తాను. బేసిక్ కోర్స్ చేసిన ఆనందం సద్దుమణగక ముందే పార్ట్ 2 కోర్స్ చేద్దాం అని నిర్ణయించుకున్నాను. దానికోసమని మళ్ళీ ఆశ్రమం కి వెళ్ళిన వెంటనే శలవల్లో ఇంటికి వెళ్ళిన అనుభూతి కలిగింది. అక్కడి వైబ్రేషన్స్ మహిమో ఏమిటో తెలియదు కానీ ఆశ్రమం లో ఉన్నంత సేపూ బయటి ఇబ్బందుల గురించి కానీ సమస్యలగురించి కానీ ఆలోచనలు ఏమాత్రం రావు. ఎపుడూ ఒకటే ధ్యాస.. ధ్యానం.. సేవ.. అదో మధురమైన అనుభూతి. అనుకోకుండా నాతో కలిసి పార్ట్ 1 చేసిన ఒకతను నాతోపాటు పార్ట్ 2 చేయాలి అని నిర్ణయించుకున్నాడు ఇద్దరమూ అనుకోకుండా కలిసాము. ఇందులో మౌనవ్రతం ఉంటుంది అని తెలుసు బేసిక్ లో మేమిద్దరం నవ్వులతో కాస్త అల్లరి చేశాం మన వల్ల అయ్యె పని కాదు బాబు ఈ మౌనవ్రతాలు అవీ అదీకాక ఇంచుమించు మూడురోజులు ఉండాలిట సాధ్యమయ్యే పనేనా అదీ మనలాటి కోతులకు అని అనుకుంటూ మొదలుపెట్టాము. మొదటిరోజు అంతా ఏవో ప్రాసెస్ లు చేయించారు.

ఇక్కడ వీళ్ళ ప్రాసెస్ ల గురించి కొంచెం చెప్పుకోవాలి నిత్యజీవితంలో మనకి ఎదురుపడే వాటినుండే కొన్ని ప్రాసెస్ లను సృష్టించారు అవి చాలా ఎఫెక్టివ్ గా ఉన్నాయి అనిపించింది. ఉదాహరణకి పెద్దవాళ్ళకి జ్వరమో లేదో తీవ్రమైన అస్వస్థత కలిగినపుడు హ్మ్ హ్మ్ అని శబ్దం చేస్తూ మూలగడం వింటూ ఉంటాం. ఆ మూలుగు వల్ల బోలెడంత నెగటివ్ ఎనర్జీ బయటకి పోయి కాస్త శక్తివచ్చినట్లు ఫీల్ అవుతారు. వయసులో ఉన్నవారు అలా మూలగడానికి జంకడం గమనిస్తాం కానీ దానివలన చాలా ఉపయోగాలు ఉన్నాయ్. ఉదాహరణకి మీరు టెన్షన్ పడుతున్నపుడు అంటే ప్రజంటేషన్ ఇవ్వాల్సి వచ్చినపుడో ఇంటర్వ్యూ అటెండ్ అయ్యే ముందో ఇలా రెండుచేతులు పైకెత్తి వేగంగా ముందుకు జారవిడుస్తూ పెద్దగా శబ్దం చేస్తూ మూలుగు ద్వారా గాలి బయటకి వదిలారనుకోండి అప్పుడు మీలో నెగటివ్ ఎనర్జీ అంతా బయటకి వెళ్ళి తెలియని శక్తి వచ్చిచేరినట్లు ఫీల్ అవడమే కాక టెన్షన్ తగ్గి  మరింత సమర్ధవంతంగా ఎదుర్కోగలరు. ఇలాటివే కొన్ని ప్రాసెస్ లు మెడిటేషన్ టెక్నిక్స్ తో మొదటి రోజు గడిచింది.

అదే రోజు అంటే గురువారం రాత్రి 9 గంటలనుండి మా మౌనవ్రతం మొదలైంది, అప్పటినుండి ఆదివారం మధ్యాహ్నం 12 గంటల వరకు మా మౌనవ్రతం కొనసాగింది అంటే దదాపు రెండున్నరరోజులు అంటే 63 గంటలు ఎవరితోనూ మాట్లాడకుండా సేవ చేసేప్పుడు ఒకటి రెండు సార్లు తప్పనిసరి పరిస్థితులలో కేవలం సంఙ్ఞల ద్వారా మాత్రమే సంభాషించి గడిపేశాము. మొదట్లో ఎలారా ఉండటం అనుకున్నాము కానీ శుక్రవారం మధ్యాహ్నానికి మాములు గా అనిపించింది ఏమాత్రం ఇబ్బంది కలగలేదు అసలు మాట్లాడాల్సిన అవసరం కానీ ఆలోఛన కానీ కలగలేదు. బహుశా కోర్స్ జరిగినంతసేపు నిశ్శబ్దంగా అయినా టీచర్ తో కమ్యునికేట్ చేయడం ఒక కారణం అయి ఉండవచ్చు లేదా కోర్స్ లో భాగంగా చేసిన మెడిటేషన్స్ కూడా ఒక కారణమై ఉండవచ్చు. మొత్తానికి చాలా కష్టమేమో అనుకున్నాం కానీ అవలీలగా పూర్తిచేసేశాం. ఎప్పటిలాగే ఆశ్రమం దినచర్యని, ఉదయాన్నే ఐదుగంటలకి నిద్రలేవడం, ఆరుగంటలకి యోగా, పగలంతా మెడిటేషన్ మరియూ సేవ తో అలసిపోవడం, సాయంత్రం గురూజీతో సత్సంగ్, కిచెన్ లో సాత్వికాహారం అన్నీ చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాను.

 నేను ఆశ్రమంలో ఉన్న అయిదురోజులూ గురూజీ తో విశాలాక్షిమంటపంలో పాల్గొన్న సత్సంగ్ చిత్రం  

మౌనవ్రతం ఆచరించిన అంత సేపు నాతోనేను ఎక్కువసమయం గడపగలిగాను ప్రతిపనిని అస్వాదిస్తూ చేశాను. మొత్తం మీద పార్ట్ 2 అయ్యాక నాలో నేను గమనించిన స్ఫుటమైన మార్పు ఏమిటంటే ఫ్లెక్సిబిలిటీ. ఇదివరకు నాలుగు అడుగులు వేయడానికి బద్దకించే నేను ఇప్పుడు కిలోమీటర్ పైనే ఉన్న ప్రదేశాలకు కూడా అవలీలగా నడిచి వెళ్ళి రాగలుగుతున్నాను. ఈ ప్రాక్టీస్ ఇలానే కొనసాగిస్తే నాకు మంచి మేలు జరుగుతుందనే భావిస్తున్నాను. కానీ కోర్స్ చివరిరోజు విపరీతమైన జలుబు దగ్గు పట్టుకుంది వారమైనా ఇంకా తగ్గుముఖం పట్టలేదు. ప్రస్తుతం నిన్నటినుండే హోమియో చికిత్స మొదలెట్టాను ఏమైనా సత్ఫలితాన్ని ఇస్తుందేమో చూడాలి.

అసలు విషయం చెప్పడం మరిచాను. కోర్స్ అంతా ఒక ఎత్తైతే ఆదివారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో గురూజీ శ్రీశ్రీ రవిశంకర్ గారిని ప్రత్యక్షంగా కలుసుకోవడం ఒక మరిచిపోలేని అనుభూతి. చల్లని చూపులతో ఆశీర్వదించి సంతోషంగా ఉన్నావా అనీ, ఏం చేస్తున్నావు అనీ కుశల ప్రశ్నలు వేసి నాతో ముచ్చటించినది ఒక్క నిముషం పాటే అయినా అంతసేపు నేను మైమరచిపోయి ఏదో లోకంలో ఉన్న అనుభూతి కలిగింది. ఆయన నిరంతర మెడిటేషన్ మరియూ సాధన ఫలితం అనుకుంటా ఒక ఉత్తేజితమైన అద్భుత శక్తి వలయం (aura) తన చుట్టూ ఉన్నట్లు  అది మనల్ని మృదువుగా స్పృశించి ముందుకు సాగినట్లు అనిపించింది ఆయన నన్ను ఆశీర్వదించి ముందుకు సాగుతుంటే. అన్నీ బాగున్నాయ్ కానీ కోర్స్ చివరన టీచర్స్ మీరంతా కూడా టీచర్స్ కావాలి మీరు ఒక్కొక్కరూ 108 మందితో పార్ట్ 2 కోర్స్ చేయించాలి అని ప్రచారం చేయడం నాకు నచ్చలేదు. ఇదే విషయాన్ని హుందాగా చెప్పి ఉంటే బాగుండేది. కాకపోతే అది టీచర్స్ ని బట్టి ఉంటుంది అని అందరు టీచర్స్ ఇలా చెప్పరనీ మిగిలిన వారితో మాట్లాడినపుడు తెలిసింది. మొత్తం మీద ఈకోర్స్ ఒక మధురమైన అనుభూతిని ఇస్తుంది వీలైతే బెంగళూరు ఆశ్రమంలో లేదంటే మీ దగ్గరలో వెంటనే చేయడానికి ప్రయత్నించండి. మీకు మీరు, మీ శరీరానికి మనసుకు ఇచ్చుకోగల ఒక అమూల్యమైన బహుమతి ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్స్, తప్పక చేయడానికి ప్రయత్నించండి.

గురువారం, డిసెంబర్ 17, 2009

జీవించడం ఓ కళ - ఆర్ట్ ఆఫ్ లివింగ్ - 2

రెండో రోజు ఉదయం ఆరుగంటలకు నిద్ర లేచి ఏడున్నరకల్లా అల్పాహారం కోసం బయలుదేరాను కాస్త కొండలు గుట్టలుగా ఉన్న ప్రాంతమవడంతో మెట్లు ఎక్కిదిగడం పైగా ఎంతదూరమైనా నడకే కావడంతో కాస్త కష్టంగా ఉందనిపించింది, అసలేమన దైనందిన జీవితంలో పక్కసీట్ కు వెళ్ళాలన్నా కుర్చీలోనే జరుగుతూ వెళ్ళేంత బద్దకిష్టులం కనుక అంతే ఉంటుంది లే అని సర్దిచెప్పి అలానే తిరిగేశాను. కిచెన్ చాలా పెద్దగా ఉంది దాని డాబా పైన బోలెడన్ని సోలార్ ప్యానల్స్ ఆకర్షణీయంగా పేర్చి ఉన్నాయ్ వాటిద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును కిచెన్ అవసరాలకు ఉపయోగిస్తారుట. కిచెన్ లో కింద కూర్చుని భోజనం కేవలం పెద్దవాళ్ళకోసం కింద కూర్చోలేని వాళ్ళకోసం ఒక పక్కన కాసిని టేబుల్స్ కుర్చీలు సైతం ఏర్పాటు చేసి ఉంచారు. అల్పాహరం గా నాకు అత్యంత ఇష్టమైన ఉప్మా శనగపప్పు, కొబ్బరి వేసి చేసిన కారప్పొడి తాగడానికి చాక్లెట్ ఫ్లేవర్డ్ రాగిమాల్ట్. ఆహా బ్రహ్మాండం అనుకున్నాను. ఆ కిచెన్ లో మెజారిటీ పనులు చేసేది అంత సేవకులని స్టాఫ్ అతి కొద్దిమంది అని సర్వింగ్ కూరలు తరగడం అన్నీ సేవచేయడానికి ఉత్సాహం చూపే వారిచే చేయిస్తారుట. అదీకాక అక్కడ రోజుకు ఐదువేలమందికి వంట చేస్తారుట, ఇక్కడ దగ్గరలోని కొన్ని స్కూల్స్ కి సైతం భోజనం ఇక్కడినుండే వెళ్తుంది అని తెలుసుకుని ఆశ్చ్రర్యపడిఫోయాను. కిచెన్ టైమింగ్స్ కూడా నాకు బాగా నచ్చాయి అల్పాహారం 7:30 నుండి 8:30 వరకు. మధ్యాహ్న భోజనం 12:30 నుండి 1:30 వరకూ, రాత్రి భోజనం 6:30 నుండి 7:30 వరకూ. శరీరానికి సరైన సమయాలు ఇవైనా నేను పాటించేసంధ్రర్భాలు బహుస్వల్పం ఇక్కడ ఆశ్రమం లో పాటింపచేస్తారు. ఆహారంకూడా చాలా బాగుంది శాఖాహారం శరీరానికి ఆవశ్యకమైన పోషకాలను అందించే మితమైన సాత్విక ఆహారం.


ఇక వంటశాలలో అల్పాహారం స్వీకరించి అక్కడ నుండి వచ్చాక కాస్త రిలాక్స్ అయి కోర్స్ కోసం వెళ్ళాము. మొదట రిజిస్ట్రేషన్ సమయంలో రేపుదయం శంకరహాల్ లో జరుగుతుంది కోర్స్ అని చెప్పారు సరే అని మేమంతా అక్కడికి చేరుకునే సరికి చివరినిముషంలో ఇక్కడ కాదు వేరే చోట అని మళ్ళీ ఇంకోచోటకి మార్చారు. అబ్బే బొత్తిగా పద్దతీ పాడులేకుండా ఏమిటీ ఈ మేనేజ్మెంట్ ఒక ఇంటర్నేషనల్ సెంటర్ ప్రవర్తించవలసిన విధానమేనా ఇది అని అనిపించింది. ఎట్టకేలకు కోర్స్ మొదలైంది ఒకరినొకరు పరిచయంచేసుకోండి హలో హాయ్ అని కాకుండా  సంఘశ్చత్వమ్ అనే మాటతో పరిచయం చేసుకుందాం అన్నారు. ఏమిటి దాని ప్రత్యేకత అంటే కలసి నడుద్దాం అన్న పదానికి సంస్కృత పదమట. సో ఇక్కడమన అందరం ఒకే గ్రూప్ గా కలసికదులుదాం. అంతే కాదు ఈ మూడురోజులు చిన్న పిల్లలు ఎలాటి ఓపెన్ మైండ్ తో ఉత్సాహంతో నేర్చుకుంటారో అలా నేర్చుకుందాం అని మొదలు పెట్టారు. మా గ్రూప్ కు వచ్చిన టీచర్స్ పేర్లు పంకజ్ & వాసంతి. ఇద్దరు కూడా చాలా చక్కగా ఓపికగా వివరించి నేర్పించారు. నిజంగా మా అదృష్టం అటువంటి టీచర్స్ దొరకడం అనిపించింది.

ఇక కోర్స్ కంటెంట్ విషయానికి వస్తే వార్మప్ అనదగిన అతి కొన్ని యోగాసనాలు నేర్పిస్తారు. ఆ తర్వాత ప్రత్యేకమైన శ్వాసక్రియ పద్దతిని నేర్పిస్తారు. ఆ తర్వాత మూడు అంచెల ప్రణాయామ నేర్పిస్తారు దాని తర్వాత భస్త్రిక నేర్పిస్తారు. ఇవన్నీ శ్వాస ప్రక్రియలే.. యధాలాపంగా శ్వాస పీల్చడం కాకుండా శ్రద్దగా శరీరానికి కావలసినంత ఆక్సిజన్ ను అందించడానికి అలానే శ్వాస ద్వారా టాక్సీన్స్ ను శరీరం నుండి బయటికి పంపడానికి ఈ శ్వాస ప్రక్రియ చాలా ఉపయోగపడుతుంది. ఇవన్నీ నేర్పాక గురూజీ కంఠస్వరంతో కూడిన క్యాసెట్ ద్వారా సుదర్శనక్రియ నేర్పిస్తారు. ఈ సుదర్శన క్రియ వలన కలిగే అనుభూతిని ఎదుటి వారి ద్వారా తెలుసుకోవడం కంటే స్వయంగా అనుభవిస్తేమరింత ఆనందానికి గురికావచ్చు. అంతేకాక ఆ అనుభూతికూడా ఒకొకరు ఒక విధంగా వివరించారు నిర్దుష్టంగా ఇది అని ఆశించకుండా.. మెదడును క్లీన్ స్లేట్ గా ఉంచుకుని సహజంగా మీ శరీరం ఏవిధమైన అనుభూతిని మీకందించిందో దానిని ఆస్వాదించడం మంచిపద్దతి.

ఈ కోర్స్ ఏదో ఒక కల్ట్ ని ప్రోత్సహించడమో మతాన్ని ప్రోత్సహించడమో చేయదు. దీని ముఖ్యోద్దేశ్యం నిన్ను నువ్వు తెలుసుకో అని నేర్పించడమే. ఆనందాన్ని వాయిదావేయకుండా ప్రతిక్షణాన్ని తక్షణమే ఆనందంగా గడుపు, నువ్వు ఒక మాఫియా డాన్ అయినా నువు చేసే పనిని శ్రద్దగా ఆనందంగా చేయి. అలానే ఇతరులకు సహాయపడు, వారంలో కొన్ని గంటలు ఏదో ఒకరకమైనసేవ తోగడుపు, ఇలాటి మంచి మాటలు, అలవాట్లు చాలా చెప్తారు. అవకాశమున్న ప్రతిఒక్కరు మీకు దగ్గరలో ఉన్న చోట ఈ కోర్స్ చేయండి. వీలైతే బెంగళూరు  ఆశ్రమానికి వచ్చి ఈ కోర్స్ చేయండి ఖచ్చితంగా ఆశ్రమంలోని జీవనశైలి వైవిధ్యంగా ఉండటమే కాక కోర్స్ మీ శరీరానికి మేలు చేస్తుంది అలానే ఈ అనుభవం మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. కోర్స్ ఒక ఎత్తైతే సాయంత్రంపూట ఆశ్రమంలో గంటన్నరపాటు జరిగే సత్సంగ్ మరో ప్రత్యేకం, భజనలు పాటలలో అంతమంది యువత పాల్గొనడం మనం మరెక్కడా చూడం, వాటితర్వాత గురూజీ ప్రసంగం ఉంటుంది. ఆయన చాలామంచి విషయాలపై ప్రసంగం ఒకోసారి శిష్యుల ప్రశ్నలకు జవాబులు చెప్తూ ఉంటారు. ఈ సత్సంగ్ జరిగే విశాలాక్షిమంటపంలో నే గమనించిన విశేషమేమిటంటే లోపల హాల్ అంతా దేదీప్యమానంగా వెలుగుతుంటుంది కానీ ఎక్కడాలైట్ కనపడదు, డైరెక్ట్ గా మీ కన్నుల్లోపడి ఇబ్బంది పెట్టదు.

నేను ఈ గురువారం నుండి సోమవారంవరకూ (17th thru 21st) పార్ట్ 2 కోర్స్ చేయడానికి మరలా ఆశ్రమానికి వచ్చాను ప్రస్తుతం ఆశ్రమం నుండే ఈటపా ప్రచురిస్తున్నాను. ఆశ్రమ రిసెప్షన్ లో వెల్కం హోం  అని ఉంటుంది అచ్చంగా అలాగే నేను మా ఇంటికి వచ్చినట్లు ఫీల్ అవుతున్నాను. ఖచ్చితంగా ఈ కోర్స్ కూడా నాకు ఆనందాన్ని అందిస్తుంది అని అనుకుంటున్నాను.

ఆసక్తి ఉన్నవారు మరిన్ని వివరాలకొరకు ఈ వెబ్సైట్స్ చూడండి.

  http://www.artofliving.org/intl/Portals/0/press/PressKit/TheArtofLiving-AnOverview.pdf

  http://www.artofliving.org/

బెంగళూరు లోని కోర్స్ వివరాల కొరకు ఇక్కడ నొక్కండి

బుధవారం, డిసెంబర్ 16, 2009

జీవించడం ఓ కళ - ఆర్ట్ ఆఫ్ లివింగ్ - 1

బ్రతకడానికి జీవించడానికి మధ్య గల తేడాను చదువరులకు వివరించాల్సిన పనిలేదు అనుకుంటున్నాను. మనలో చాలా మందిమి బ్రతికేస్తుంటాం జీవించేవారు ఏ కొందరో ఉంటారు. నాకు ఇలా జీవించే అవకాశం మొన్న ఓ వారాంతం లో (డిశం 3 నుండి 6 వరకూ) దొరికింది. బెంగళూరు శివార్లలో కనకపుర రోడ్ లో ఉన్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమం గురించి నేను ఇదివరకు చాలా సార్లు విన్నాను. అహా అంత పెద్ద ఆశ్రమం కట్టించారంటే మహ కోటీశ్వరులై ఉంటారు బాగా డబ్బులు దండుకునే మరో సంస్థ అని అనుకునే వాడ్ని. నిజానికి ఒక పది పదేహేనేళ్ళ క్రితం నాకే కాదు చాలా మందికి రవిశంకర్ అంటే కేవలం ప్రముఖ సితార్ విద్వాంసుడు పండిట్ రవిశంకర్ గురించి మాత్రమే తెలుసు. కానీ తర్వాత ఆశ్రమంలో అందరూ గురూజీ గా పిలుచుకుని శ్రీ శ్రీ రవిశంకర్ గారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులుగా, ప్రముఖ మానవతావాది గా ప్రపంచానికి పరిచయమయ్యారు.

ఏవిటీ వీళ్ళు నాకు జీవించడం నేర్పేది నాకు రాదా.. నే ఇంతకాలం జీవించట్లేదా.. అన్ని మార్కెటింగ్ టెక్నిక్స్ వెళ్లడం అనవసరం అనే ఒక అభిప్రాయం కూడా ఉండేది నాకు కొన్నేళ్ల క్రితం వరకు. తర్వాత అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళని. బేసిక్ కోర్స్ చేసిన వారిలోనూ వచ్చిన మార్పును గమనించిన తర్వాత There may be some thing good అని అనిపించింది. దానికి తోడు ఎవర్ని అడిగినా "అది ఒక అద్భుతమైన అనుభవం మీ అంతట మీరు తెలుసుకోవాల్సిందే కానీ మేము ఏమీ చెప్పలేము" అంటూ కోర్స్ చేయమని చెప్పే వాళ్ళే కానీ అందులో ఏముంటుందో చెప్పే వారు ఎవరూ లేరు. అంతర్జాలం లో వెదికినా దానిలో ఏదో సుదర్శన క్రియ నేర్పుతారు అని మాత్రం ఉంది కానీ మిగిలిన వివరాలు ఏమీ లేవు. ఆఫీసుల్లో పని చేసి చేసి నాకు ఏదైనా మీటింగ్ కు వెళ్ళేముందు పూర్తిగా సిద్దమై వెళ్ళడం అలవాటైంది. అలాటిది ఇక్కడ ఏమి చెప్తారో ఏం చేస్తారో తెలియకుండా ఎలా వెళ్ళడం, ఏముంటుంది అక్కడ? ఇలాటి సవాలక్ష సందేహాలతో గురువారం సాయంత్రం  ఆశ్రమం లో అడుగుపెట్టాను.

రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో హెల్ప్ డెస్క్ దగ్గర చాలా వేగంగా వివరాలు తెలియ చేశారు. తర్వాత ఫోటో తీసే దగ్గర సైతం వెంటనే పని అయిపోయింది. పేమెంట్ డస్క్ దగ్గర ఒకావిడ తీరిగ్గా ఫోన్లో మాట్లాడుతూ నింపాదిగా పని చేస్తుంది కాస్త చిరాకు కలిగింది. కానీ అప్పటికే చాలా ఆలశ్యమైంది దానికి తోడు అలసిపోయి ఉన్నాను తనకి క్లాస్ పీకే ఓపిక లేదు అని మౌనంగా ఉండిపోయాను. మొత్తానికి అక్కడ పద్దతులగురించి ప్రత్యేకమైన తాళం కోడ్ తోఎలా ఓపెన్ చేయాలో తెలుసుకుని  రిసెప్షన్ నుండి బయటపడి నా రూమ్ వైపు మెల్లగా నడక ప్రారంభించాను. రాత్రి దగ్గర దగ్గర పదిగంటల సమయం చుట్టూ పచ్చని చెట్లు ప్రశాంతమైన వాతావరణం వీపున ఒక బ్యాగ్ చేతిలో మరో బ్యాగ్ ఉన్నా కూడా నడకలో ఏమాత్రం అలసట తెలియలేదు చాలా ఆహ్లాదకరంగా ఉంది.

అలా నడుస్తుంటే కుడివైపు పెద్ద కట్టడం అందంగా అలంకరించిన దీపాలతో గోపురం పైనుండి రంగు రంగుల కాంతులు విరజిమ్ముతూ ఠీవీగా నిలబడి చూస్తుంది. దానిని విశాలాక్షిమంటపం అంటారుట హెల్ప్ డెస్క్ లో ఇచ్చిన మ్యాప్లో చూసి మరోసారి నిర్ధారించుకుని రెండు కళ్ళలో తనివి తీరా దానిరూపాన్ని నింపుకుని ముందుకు కదిలాను. ఇదిగో ఈ పక్కన చూపించినది అదే రాత్రి వెలుగులో విశాలాక్షిమంటపం. నాకు కేటాయించిన బ్లాక్ దగ్గరకు రాగానే వ్రుత్తాకారపు ఆ కట్టడం చూసి ఒక్క సారి ఆంధ్రాయూనివర్సిటీ ఇంజనీరింగ్ హాస్టల్స్ గుర్తొచ్చాయి  మనసు కాలేజి రోజులలోనికి వెళ్ళిపోయింది. నా గది ముగ్గురు ఉండవలసినది మంచాలు, రగ్గులు, అటాచ్డ్ బాత్ అన్నీ చాలా సౌకర్యంగా బాగుంది అనిపించింది.

సరే రేపటి కోర్స్ లో ఏముండబోతోందో అనుకుంటూ నిద్రకుపక్రమించాను కానీ కొత్త ప్రదేశం వలన అనుకుంటాను అలసిపోయినా నిద్రమాత్రం పట్టడం లేదు. కిటికీకి ఆనుకుని ఉన్న మంచంమీద వెల్లకిలా పడుకుని రక రకాల భంగిమలలో నిద్ర పోవడానికి ప్రయత్నిస్తుంటే కిటికీకి ఉన్న కర్టన్ తగిలీ తగలనట్లు సుతారంగా చెంప నిమిరింది మూసిన కనురెప్పలు నుండి సైతం ఏదో వెలుగు కనిపించేసరికి మెల్లగా కళ్ళు తెరిచాను ఆ ముందురోజే పౌర్ణమి కాబోలు కిటికీకి పైన నిండుచందమామ చిరునవ్వుల వెన్నెలలు రువ్వుతూ నీకోసం నన్నిలా చూస్తూ నిద్రిస్తావు కదా అని ఇలాటి రూమ్ అలాట్ చేయించి కిటికీ పక్కన మంచం ఖాళీగా ఉంచి నే ఎదురు చూస్తుంటే నన్ను నిర్లక్ష్యం చేస్తూ అలా ఎలా నిద్రిస్తావోయ్ అని అడుగుతున్నట్లు అనిపించింది. మనసంతా గాలిలో తేలిపోతుంటే ఆహా స్వాగత సత్కారం అద్భుతం అనుకుంటూ అలా జాబిలిని వెన్నెలను చూస్తూ మెల్లగా నిదురలోకి జారుకున్నాను.

బేసిక్ కోర్స్ గురించీ, ఆశ్రమం గురించి మరికొన్ని వివరాలు నా తరువాతి టపాలో...

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.