సోమవారం, సెప్టెంబర్ 21, 2009

సంస్కారం a.k.a. manners

ఒకో సారి ఓ వ్యక్తి మనకి నచ్చలేదు అంటే అతనికి సంభందించిన ఏ విషయమూ మనకి నచ్చవేమో కదా... దానికి తోడు ఆ వ్యక్తి సకల కళా వల్లభుడైతే ఇక చెప్పాలా... ఈ టపాకి మొదట చుట్టా, బీడీ, సిగరెట్.. అని పెడదాం అనుకున్నాను, ఆగండాగండి, పొగాకు ప్రియులంతా నా పై దండెత్తి రాకండి, ఈ టపా ఉద్దేశ్యం ఫలానా అలవాట్లు మంచివి, ఫలానావి కావు అని చెప్పడానికి కాదు. సదరు అలవాట్లు ఉన్న ఒకరిద్దరు వ్యక్తుల వలన నాకు కలిగిన అసౌకర్యం గురించి చెప్పడానికి మాత్రమే. సాధారణంగా నా ముక్కుకు సెన్సిటివిటీ ఎక్కువ, ఎంత ఎక్కువ అంటే ఒకోసారి నా చెమట వాసన కి నాకే చిరాకు వస్తుంటుంది, అందుకే నేను సాధారణం గా డియోడరెంట్ లో ఇంచుమించు స్నానం చేసినంత పని చేసి ఆఫీసుకు వెళ్తాను. అలాంటిది ఇక సిగరెట్లు, ఖైనీ, గుట్కా లాటి పొగాకు వాసన అయితే ఇక నా అవస్థ మాటల్లో చెప్పలేను. సిటీ బస్సుల్లో ప్రయాణించడం నాకు నచ్చక పోవడానికి ఇదికూడా ఒక కారణం. ఆఫీస్ లో ఇది వరకూ పక్క సీట్ వ్యక్తి దమ్ము కొట్టి వచ్చిన వెంటనే నేను కాఫీ బ్రేక్ తీసుకుని వాడి కి దూరం గా కాసేపు గడిపి వచ్చే వాడిని లేదంటే కాసేపు నా పని చెడి పోయేది. నా అదృష్టం కొద్దీ గత రెండేళ్ళుగా అలాటి వాళ్ళ పక్క క్యూబికల్స్ అలాట్ అవకపోడం వలన బతికి పోయాను.

ఇక సదరు హీరో గారు మా అఫీసులోనే పని చేస్తారు. నేను ఇది వరకు పని చేసిన ఒక ప్రాజెక్ట్ లో పని చేశారట "తెలుగు మాట వినిపిస్తే అదో ఆనందం బాసూ చాలా రోజుల తర్వాత ఇక్కడ నిన్ను చూశా" అని అంటూ పరిచయం చేసుకున్నాడు. ఓహొ తెలుగంటే అభిమానం కాబోలు అని నేనూ ఎదురుపడినపుడు ఒకటి అరా మాట్లాడేవాడ్ని. ఈ మధ్యే కొన్ని కారణాల వలన ఇతను ఉండే పక్క క్యాబిన్ లో కి నేను మారాల్సి వచ్చింది. ఇప్పడిప్పుడే అయ్యవారి లీలలు ఒకటొకటి బయట పడుతున్నాయ్. ఆఫీస్ టైం లో దర్జాగా సిగరెట్ కాల్చి రావడం ఒక ఎత్తైతే అది కాల్చి వచ్చి నా సీట్ దగ్గరలో నిలబడి పెద్ద పెద్ద గా అరుస్తూ ఏదో ఫోన్ మాట్లాడేస్తుంటాడు. ఆ వాసన భరించ లేక ఒకటి రెండు సార్లు చెప్పి చూశాను అయినా ఏ మాత్రం మార్పు లేదు. ఇదిలా ఉంటే ఒకోసారి గుట్కా నో, ఖైనీ నో ఏదో చెత్త నముల్తూ నోటికి ఒక పక్క నుండి ఆ సొల్లు కారుతూ ఉండగా, భయంకరమైన దుర్గంధం వెదజల్లుతూ, ఆ నోటి తుంపర మన మీద పడుతుందేమో అనే ధ్యాసైనా లేకుండా మొహం మీదకి వచ్చి మాట్లాడుతుంటాడు.ఆప్పటికీ నేను అసహ్యం చిరాకు, కోపం ఇత్యాది భావాలనన్నీ కలగలిపిన అతి భయంకరమైన ముఖ కవళికలతో దూరం జరగడానికి ప్రయత్నిస్తూ మాటలు ఎక్కడివి అక్కడ తుంచేయడానికి ప్రయత్నిస్తుంటాను. అయినా అతనికి నా మీద కనికరం కలగదు. అభిమానానికి ముచ్చట పడాలో అలవాట్ల తో అవస్త పెడుతున్నందుకు బాధ పడాలో అర్ధం కాదు ఒకో సారి.

ఇక ఈ మానవుడి మరో అద్వితీయమైన అలవాటు త్రేన్పులు (burping/belching). భోజనం సమయం లో కడుపు నిండిన దానికి గుర్తు గా ఓ చిన్న త్రేన్పు వస్తే, కష్టపడి వండిన వారికి ఓ చిన్న అభినందన / కాంప్లిమెంట్ లాగా అందంగానే ఉంటుంది. కానీ మన వాడు మనిషి సన్నగానే ఉంటాడు కానీ సిగరెట్లు, గుట్కా పొగాకు వంటి వాటితో ఎసిడిటీ తెచ్చుకున్నాడల్లె ఉంది, తెస్తే తెచ్చుకున్నాడు అది అతని ఆరోగ్యం అతనిష్టం కానీ ఆ ఏడుపేదో అతని సీట్ దగ్గర ఏడిస్తే మనకేమీ అభ్యంతరం లేదు. గంటకోసారి హడావిడి గా అతని సీట్ లోనుండి లేచి నా క్యూబికల్ లోకి వచ్చి అతి జుగుప్సాకరం గా అత్యంత దీర్ఘం గా ఇంచు మించు వాంతి చేసుకుంటున్నాడేమో అన్నట్లు అతిభయంకరమైన త్రేన్పు ఒకటి త్రేన్చేసి నాకు మహా చిరాకు తెప్పిస్తాడు. ఆ పనేదో అతని సీట్ లో చేయచ్చు కదా అసలేమిటి ఇతని ఉద్దేశ్యం అని నా కొలీగ్ కూడా నాతో చర్చించినా మేం ఆ విషయం ఏంటో కనిపెట్ట లేకపోయాం.

అతను సీట్ వదిలి వెళ్ళాలి అంటే నా క్యూబికల్ మీదుగానే వెళ్ళాలి అదో పనిష్మంట్ నాకు. పదినిముషాలకోసారి అటుగా వెళ్తూ సెల్ఫోన్ లో అరుస్తూ మాట్లాడుతూ నా కుర్చీ వెనకాల నిలబడి నా సిస్టం లోకి తొంగి చూస్తుంటాడు. ఎపుడైనా వ్యక్తిగత ఈమెయిల్స్ చేస్తున్నపుడు సైతం ఇతను ఏమాత్రం సంస్కారం లేకుండా అలా తొంగి చూస్తుంటే లాగి పెట్టి ఒకటి కొట్టాలని అనిపిస్తుంది. మొత్తం మీద ఎవరికైనా basic manners మీద ట్రైనింగ్ ఇవ్వాలి అంటే మా వాడ్ని ఒకరోజు గమనించమని చెప్పి, "అదిగో అతని లా ఉండకు చాలు.. ఇంకెలా ఉన్నా నీకు మ్యానర్స్ వచ్చేసినట్లే ఫో.." అని చెప్పచ్చు. కనుక ఈ టపా చదివిన వారిలో ఎవరికైనా లేదా మీఆత్మీయులకైనా ఈ పైన చెప్పిన అలవాట్లు ఉంటే.. వారు ఈ ప్రపంచం లో తాము తప్ప మరో జీవి లేడన్నట్లు గా బొత్తిగా ఇతరుల ఇబ్బందులను గమనించకుండా నడుచుకుంటుంటే కనుక.. కాస్త మారండి/మారమని చెప్పండి ప్లీజ్!! మీ స్వేచ్చ ఇతరులకు ఇబ్బంది కలిగించ కూడదు కదా. (మన బ్లాగ్ లోకం లో ఇటువంటి వారు లేరనే అనుకుంటున్నాను).

32 కామెంట్‌లు:

  1. మీ సహజ లక్షణాలు (ఆశావాదం, కాస్త భావుకత) అంత దూరం పెట్టి రాశారంటే .. ఎంత రగిలిపోతున్నారో అక్షరాక్షరానా కనిపిస్తుంది :-)

    రిప్లయితొలగించండి
  2. ఎందెందు చూచిన అందందు కలరు ఇటువంటి వారు :)

    రిప్లయితొలగించండి
  3. ఆ ముసుగు బొమ్మ కేక.... :) :) :)
    మా విశ్వవిద్యాలయంలో సిగరెట్టు బాధ చాలా ఎక్కువ... ఎంతంటే ఇక్కడుండగా పోతే కారణం lung cancerఏ అనుకునేంత...

    రిప్లయితొలగించండి
  4. అర్ధం చేసుకున్నందుకు నెనర్లు అబ్రకదబ్ర గారు :-) సాధారణం గా నాకు సహనం పాళ్ళు కాస్త ఎక్కువే అని నమ్మకం కానీ ఇటువంటి వారు తారసపడి దాన్ని సడలిస్తుంటారు.

    చైతన్య గారు నెనర్లు. మీరు చెప్పింది నిజం.

    నేను గారు నెనర్లు. విశ్వవిద్యాలయాల్లో ఈ బాధ గురించి చెప్పనే అక్కర్లేదు అక్కడ అలవాటు తో కొందరు స్టైల్ కోసం కొందరు కలిసి ఇతరుల ప్రాణాలు తీస్తుంటారు.

    రిప్లయితొలగించండి
  5. హమ్మయ్య.. నాకు తోడు మీరున్నారన్న మాట.. నా నాసిక కూడా బహు సున్నితం.. నేను అవతలి వాళ్లకి చురక తగిలేలా జోకులేస్తూ ఉంటాను.. 'హిప్పోపోటమస్' కేసులూ తగులుతూ ఉంటాయనుకోండి :-) ఇదేమీ చిన్న సమస్య కాదండి, అనుభవించే వాళ్లకి తెలుస్తుంది దీని తీవ్రత.. బాగుంది టపా...

    రిప్లయితొలగించండి
  6. మరో అపరిచితుడు గా మారక తప్పదు.ఇలాంటి వారి కోసం

    రిప్లయితొలగించండి
  7. వా అబ్బాయిలకే ఇంత కష్టం గా ఉంటే మా సంగతేంటి? మీటింగ్ రూముల్లోకి ఒక్కొక్కడు కసిగా నాలుగైదు సిగరెట్లు ఒకే సారి తాగి వస్తారనుకుంటా, సిగరెట్టు ఫాక్టరీ లో కూర్చున్నట్టు మహ బధాకరంగా ఉంటుంది లెండి అనుభవం. నిజమే పక్క వాళ్ళ స్క్రీన్ లో కి తొంగి చూడ్డం కూడా కాదు డైరెక్టుగా చూసేవాళ్ళని ఏమనాలో ప్చ్ :(

    రిప్లయితొలగించండి
  8. ఈ లెక్కన నా మీద నేను హెంత జాలిపడిపోవాలి.. ఈ చైనీయులు సిగరెట్ అనే ఆభరణం లేకుండా బయటకు అడుగుపెట్టరు .. పైగా ఆ బ్రష్ కూడా ఎన్ని నెలలకోమారు చేసుకుంటారోగాని ..ఒక పోస్ట్ వేయవచ్చు దాని గురించి ... :)

    రిప్లయితొలగించండి
  9. పడేవాళ్లకే తెలుస్తాయి ఇలాంటి బాధలు, అవతలివాళ్లకి మాత్రం దున్నపోతు మీద వాన పడ్డట్టే! ఆయనెవరో తెలుగతనే అంటున్నారుగా మీ ఈ టపా లింకు ఇస్తూ మెయిలు పంపిస్తే సరి!

    రిప్లయితొలగించండి
  10. Tit for Tat -
    అతనువచ్చినప్పుడు, బాసూ ఒక్కనిమిషం ఉండు అని, ముక్కుకి మాస్క్ పెట్టుకోండి. అప్పుడు తెలుసుకుంటాడు.
    అలానే, వెనకనుండి తొంగిచూస్తుంటే, బాసూ, ఉండు అని, మానిటర్ ని లాక్ చేయండి. ముఖం మీద గుద్దినట్టు.

    రిప్లయితొలగించండి
  11. టపా బాగుంది ! మీకు నా సానుభూతి ఇంతకన్న ఏమి చెయ్యలేక :(

    రిప్లయితొలగించండి
  12. మురళి గారు నెనర్లు. మరే, మా వాడు హిప్పో కూడా కాదు అంతకు మించి.

    కుమార్ గారు నెనర్లు. హ హ అపరిచితుడు ఐడియా బాగుందండీ..

    లక్ష్మి గారు నెనర్లు. ఇలాటి విషయాల్లో ఆడామగా తేడాలుండవండీ, కేవలం అలవాట్లున్న వారు బాధితులు మాత్రమే ఉంటారు.

    నేస్తం గారు నెనర్లు, మీకు బోలెడంత సానుభూతి. మీ బాధ కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది.

    సిరిసిరిమువ్వ గారు నెనర్లు. అప్పటికీ నేను ఇండైరెక్ట్ గా చెప్పి చూశానండీ ప్రయోజనం శూన్యం. కానీ ఇలా పబ్లిక్ లో ఉతికి ఆరేశా అని తెలిస్తే మరీ పెట్రేగి పోయే అవకాశం ఉంది. సమయం చూసి ఒక్కడినే ప్రశాంతంగా కూర్చోబెట్టి వివరిస్తాను. కనీసం ఇలా క్లాస్ పీకినందుకైనా నాకు దూరం గా ఉంటే అదే పదివేలు.

    భాస్కర్ గారు నెనర్లు. అలాటి ప్రయత్నాలు అన్నీ ఆయ్యాయి సోదరా, దున్న పోతు మీద వాన పడ్డట్లే ఏమాత్రం చలనం లేదు. ఇకడైరెక్ట్ అటాకే మిగిలింది.

    శ్రావ్య గారు నెనర్లు. సానుభూతి అందించినందుకు దన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  13. ఈ అలవాట్ల తాలూకు బాధలు పడ్డదాన్నేనండి. మీ పంథాకే వచ్చి దూరం పోవటమే, ఒకరితో చెప్పించుకుని మానగలిగే వారు అరుదు. I feel so good about the offcial smoke free workplaces and noise free cube lands. As per the third it is an etiquette that one has to cultivate.

    రిప్లయితొలగించండి
  14. ఉష గారు నెనర్లు, అతని అలవాట్లని మాన్పించే ఆలోచన నాకే కోశానా లేదండీ, కేవలం వాటితో నన్ను హింసించడం మానిపించ గలిగితే అదే పదివేలు. smoke free work place ఆ నిజంగా అలాటివి ఉన్నాయా అంటే అఫీసు లో ఉన్న 9 గంటల పాటు సిగరెట్ ముట్టుకోకూడదనే ప్లేస్‍లు. మా ఆఫీస్ కూడా స్మోక్ ఫ్రీనే కానీ వీళ్ళు బయట చెట్లకింద చేరతారు, గంటకి వీళ్ళు పని చేసేది 50 నిముషాలే.

    రిప్లయితొలగించండి
  15. mmmmmm..........గంటకి వీళ్ళు పని చేసేది 50 నిముషాలే.?

    రిప్లయితొలగించండి
  16. అవునండి నేను మీ లాంటి భాదితురాలినే , నా నాసిక కూడా కొంచం ఎక్కువ పని చేస్తుంది, మా ప్రాణానికి వింటర్ వస్తుంది... ఇంకా వాసన ఎక్కువ అవటానికి. మీకు నా హృదయ పూర్వక సానుభూతి ఏం చేస్తాము మరి... :-(
    మీ ఆఫీస్ లో గంట కు 50 నిమిషాలు పని చేస్తారా :-|

    రిప్లయితొలగించండి
  17. వినయ్ గారు వ్యాఖ్యకు నెనర్లు. మా ఆఫీస్ లో ధూమపాన బ్యాచ్ ప్రతి రెండుగంటల్లోనూ కనీసం ఇరవైనిముషాలకు తగ్గ కుండా సిగరెట్ తాగడానికి బ్రేక్ తీసుకుని బయటకి వస్తారు. అందుకే వీరు సీట్ లో ఉండేది గంటకి 50 నిముషాలే అని అన్నాను.

    భావన గారు నెనర్లు. నిజమే వింటర్లో గోరుచుట్టు మీద రోకటి పోటు అన్న చందాన తయారవుతుంది పరిస్తితి. మా ఆఫీసులో అందరికీ కాదు లెండి. సిగరెట్ బ్యాచ్ కి మాత్రం గంటకి యాభై నిముషాలు.

    రిప్లయితొలగించండి
  18. సిగిరెట్లూ, బీడీలూ, వగైరాల బొమ్మలు పెట్టారు కదా... "పొగ త్రాగటం ఆరోగ్యానికి హానికరం" అని టీవీల్లోలా ఒక డిస్క్లైమర్ పెడితే బాగుండేది. ;-)

    ఇలాంటి కష్టాలు మా కాలేజీ లేవు లెండి. అయినా మీ పరిస్థితికి నా ప్రగాఢ సానుభూతే కాదు. అలాంటి వారి దురాగతాలని తీవ్రంగా ఖండిస్తున్నాం. zyxw......dcba zindabad! (ఖండించాక ఏదోక నినాదం చెయ్యాలి కదా)

    రిప్లయితొలగించండి
  19. chala baga rasharu. me kashtalu inthala unnaya? chudabothe ithanni swine flu ad lo upayoginchukovachhu.
    ilanti vadi pakkana kuchute vasthundadi ani cheppi.

    రిప్లయితొలగించండి
  20. గీతాచార్య గారు నెనర్లు. హ హ టపా ఉద్దేశ్యమే మీకే కాదు ఇతరులకు కూడా హాని కరమని చెప్పడం కనుక Statutory warning అవసరం లేదనుకుంటున్నానండీ :-) మీ కాలేజి లో ఈ బాధ లేకపోడం కాస్త వింతేనండీ, Good to know. నేను కూడా zyxw......dcba zindabad!

    అయ్యా అగా గారు మీ అసలు పేరు కూడా తెలియచేయాలని మనవి పిలవడం బహుఇబ్బంది గా ఉంది :-) వ్యాఖ్యకు నెనర్లు. మీ స్వైన్‍ఫ్లూ క్యాంపెయిన్ ఐడియా బాగుంది.

    రిప్లయితొలగించండి
  21. In our college, the Principal banned such things which are distortable, and spoils the pleasant working atmosphere. So, we have an excellent work space

    రిప్లయితొలగించండి
  22. మీ బ్లాగ్ చాలా బావుంది. అందుకు ముందుగా మీకు అభినందనలు వేణుగారు.
    ఇక ఈ టపా విషయానికి వస్తే మీకు నా సానుభూతి.
    ఆ బాధలు నాకు తెలుసు, ఎందుకంటే నేను కూడా బాధితుడినే.
    అయితే ఇండియాలో వునప్పుడు కాదు, నేను Masters చదవడానికి US వచ్చిన తర్వాత.
    కేవలం University లోనే కాదు, Apartmentకి వచ్చిన తర్వాత కూడా, smoke detectorsని తీసి పారేసి, stoveని lighter చేసుకుని 24 గంటలూ smoking, dining tableని club tableగా చేసుకుని ప్రతిరోజు vodkaలు, Tequilaలు, ఇంకా ఏవేవో సేవించడం మా roomatesకి బాగా అలవాటు.
    మీ సంగతి దేవుడు ఎరుగు, ఇలా common placeలో చేయడం వల్ల ఇబ్బందిగా వుంది, నాకు ఆ వాసనలకు తలనొప్పి, nausea వస్తునాయి అంటే వాళ్ళు వినకపోవడం కాక, ఆ అలవాట్లు నాకు చెయ్యచూపి, వాటిని నేను తప్పించుకొను క్రమంలో నా చేత ఫీట్లు చేయించి, నానా హైరానా పెట్టేవారు.
    కాలక్రమంలో నాకు ఆ వాసనలు (మాత్రమే) అలవాటు అయ్యాయి. అలాగే వాళ్ళు కూడ నా జోలికి రావడం మానుకున్నారు.
    కొందరు వాళ్ళ అలవాటుల వల్ల ఇతరలును ఆసౌకర్యనికి గురి చేస్తునమని ఎందుకు గ్రహించారు, చెప్పినా ఎందుకు అర్ధం చేసుకోరు అన్నది నాకు అర్ధం కాని విషయం.

    రిప్లయితొలగించండి
  23. బా రాశారు. ఆముసుకేసుకున్న బొమ్మ బావుంది, హ హ భలే నవ్వుకునా ఆ బొమ్మ చూసి

    రిప్లయితొలగించండి
  24. Good to know about your college గీతాచార్య గారు. మీ ప్రిన్సిపాల్ అభినందనీయులు.

    ఫణి గారు మిమ్మల్ని ఇక్కడ కలుసుకోడం ఆనందంగా ఉంది. వ్యాఖ్యానించినందుకు ధన్యవాదాలు. మీతో పోల్చుకుంటే నా పరిస్థితి నయమే అనుకోవాలేమో.. రూమ్ మేట్స్ తో కష్టాలు పడ్డారంటే మీ సహనానికి జోహార్లు. బాధ అర్ధం చేసుకోక పోగా మీకు కూడా అలవాటు చేయడానికి పూనుకోడం దారుణం.

    అశ్విన్ గారు నెనర్లు. హ హ నేనుకూడా వేరే బొమ్మ కోసం వెతుకుతూ, ఇది చూసి నవ్వేసుకుని వెంటనే పెట్టేశానండీ.

    రిప్లయితొలగించండి
  25. venusrikanth garu,

    na peru narasimha inti peru ranasimha... :-D

    na peru gurinchi O pedda kadhundile. ceptanu thondaralone.

    రిప్లయితొలగించండి
  26. హ హ అలాగే మీ కథ తెలుసుకునే వరకు నరసింహ అనే పిలుస్తాను :-D

    రిప్లయితొలగించండి
  27. కొన్ని జీవితాలంతేనండీ వేణూ! మొహాన చెప్పి చావలేం కాబట్టి మన జీవితాలూ ఇంతే! గుట్కాలు తినే వాళ్ళకు అందులో ఏం మజా అనుభవమవుతుందో కానీ, పక్కవాళ్ళకు నరక సందర్శనమే!

    "concern for others" అనే ఒక్క చిన్నమాట వీళ్ళకు అర్థం అయ్యేలా చేయాలంటే ఏం చేయాలో మరి! ఇలాంటి కష్టాలు నేనూ పడుతూ ఉంటాను కాబట్టి మీకు నా సహానుభూతి!

    ఏం చెప్తాం వీళ్ళకి? మనసులో తిట్టుకుని ఊరుకోవడం తప్ప!

    రిప్లయితొలగించండి
  28. నెనర్లు సుజాత గారు. నిజమే ఏం చెప్తాం వీళ్ళకి? మనసులో తిట్టుకుని ఊరుకోవడం తప్ప!

    రిప్లయితొలగించండి
  29. venu gaaru nenu mee blog ki koththa andi

    chaala baagaa chepparandi idi naa samasya kooda
    mee rachanaa saili chaala baaga nachindandi naaku

    రిప్లయితొలగించండి
  30. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి అయితే ఏకంగా అలా సిగరెట్ తాగి వచ్చి తన డెస్క్ దగ్గరకి వచ్చిన కొలీగ్ మీద వాంటింగ్ చేసేసింది.దెబ్బకి గురుడు ఇంకో సారి తాగి,డైరెక్ట్ గా తన ప్లేస్ కి వచ్చే వాడు కాదంట

    రిప్లయితొలగించండి
  31. అజ్ఞాత గారు నెనర్లు, హ హ ఈ ఐడియా ఏదో చాలా బాగుందండీ :-)

    రిప్లయితొలగించండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.