నల్లగా నిగనిగలాడుతూ, మెలికలు తిరుగుతూ పరుచుకుని ఉన్న తారు రోడ్ పై బస్సు శర వేగంతో ముందుకు వెళ్తుంది. నరసరావుపేట పొలిమేరలు దాటి ఐదునిముషాలవుతుందేమో. కిటికీ పక్కనే కూర్చున్న నా దృష్టి రోడ్ పైనే ఉన్నా ఆలోచనలు మాత్రం బస్సుకన్నా వేగంగా, దారితప్పిన బాటసారిలా ముందుకు వెనక్కు ప్రయాణిస్తూ ఉన్నాయ్. "విజయవాడ ఎంత సేపట్లో వస్తుంది నాన్నా?" ప్రశ్న అడుగుతూ పక్కకి తిరిగిన నాకు, కొద్దిగా తెరిచిన నోటినుండి సన్నగా వస్తున్న గురకే సమాధానమైంది. పాపం నాన్న, ఉదయాన్నే లేచి ఆఫీసుకు వెళ్ళి మధ్యాహ్నం వరకూ పని చేసి వచ్చి హడావిడిగా అన్నంతినేసి నన్ను హాస్టల్ లో దిగబెట్టడం కోసం, మధ్యాహ్నం నిద్ర కూడా మానుకుని బయల్దేరారు. పడుకోనిద్దాంలే ఇపుడు నేను తెలుసుకుని మాత్రం చేసేదేముంది. దృష్టి మళ్ళీ రోడ్ పై నిలిపాను, ఎండ తీక్షణంగా ఉంది, దూరంగా రోడ్ పై నీటి చెలమలు ఉన్నట్లు కనిపిస్తున్నాయ్. బస్ ముందుకు వెళ్ళే కొద్దీ అవి మాయమవడమో మరింత దూరం జరగడమో జరుగుతుంది. ఎండమావులు(Mirage) అంటారు ఇవేనేమో!!, కానీ స్కూల్లో టీచర్ చెప్పిన ప్రకారం అవి ఎడారుల్లో కదా కనిపించాలి, ఊర్లో ఇలా రోడ్ మీద ఎందుకు కనిపిస్తున్నాయబ్బా ఏమోలే.. ఎండమావులు పదం ఈ మధ్యే ఎక్కడో విన్నాను కదా ఎక్కడా ?
"అసలు ఈ రెసిడెన్షియల్ కాలేజిలు ఎండమావులు లాంటివమ్మాయ్ దూరంగా ఉన్నంత సేపు మురిపిస్తాయ్ అంతే.. అక్కడికెళ్తే అసలు బండారం బయట పడుతుంది. అయినా మన బంగారం మంచిదవ్వాలి కానీ అంత డబ్బులు పోసి అక్కడ చదివించినా ఉపయోగం ఏం ఉంటుంది చెప్పు డబ్బు దండగ తప్పించి.." నే వినట్లేదనుకున్నారో లేదా విన్నా పర్లేదనుకున్నారో మొత్తానికి స్పష్టంగా నా చెవిన పడ్డ ఒకాయన అమ్మకిస్తున్న ఉచిత సలహా గుర్తొచ్చింది.
"వాడి కంటి చూపు అంతంత మాత్రమే అంత లావు కళ్ళద్దాలు వేసి అంత దూరాల్లో ఒక్కడ్నే ఉంచి చదివించాల్సిన అవసరం ఉందా.. ఇప్పుడు వాడు చదివి ఎవర్ని ఉద్దరించాలిట. ఏం వాళ్ళ నాన్న బిఎ చదివి మాంచి ఉద్యోగం చేయడం లేదా వాడ్ని కూడా ఏ ఆర్ట్స్ గ్రూపులోనో చేర్చి ఇంటిదగ్గరే ఉంచి చదివించచ్చు కదా.." బంధువుల సలహాలు విని చిద్విలాసంగా నవ్వడమే కానీ పన్నెత్తు మాట మాట్లాడని అమ్మానాన్నలు గుర్తొచ్చారు.అసలు బుద్దిగా చదువుకుంటే ఈ బాధలు ఉండక పోవు కదా అత్తెసరు మార్కులు తెచ్చుకోవడం వల్లనే కదా ఈ కష్టాలన్నీ. "ఎవరు చేసిన ఖర్మ వారనుభవించకా.." మనసులోనే పాడేసుకుంటూ మళ్ళీ రోడ్ పై దృష్టి నిలిపాను.
హాయ్!! దూరంగా అదేమిటి ఎడ్లబండా? ఆ, దగ్గరకు వస్తుంటే క్లియర్ గా తెలుస్తుంది. ఎడ్లు ఏంత ఠీవీగా నడుస్తున్నాయో... ఆస్వాదించేలోపే రయ్ య్ య్... మంటూ మా బస్ దాన్ని ఒక్క క్షణం లో దాటేసింది భలే! హఠాత్తుగా స్వర్ణకమలం సినిమాలో భానుప్రియ వాళ్ళ ఎడ్లబండిని దాటుకుంటూ వెళ్ళే మోటారు వాహనాలు గుర్తొచ్చాయ్ "నిధిచాల సుఖమా.." కీర్తన గుర్తొచ్చింది. ఎలాగైనా విశ్వనాథ్ గారు సినిమాలు బాగా తీస్తారు కదా. విశ్వనాథ్ బాగాతీస్తారు కానీ ఆయన సినిమాల్లో కొన్ని సరిగా అర్ధం కావు. అదే మాబాసు చిరంజీవైతే కామెడీ చేసినా ఫైట్లు చేసినా డ్యాన్సాడినా ఇరగదీస్తాడు కదా. చిరుని తలుచుకోగానే బోల్డంత ఉత్సాహం అంతలోనే నీరసం తన్నుకొచ్చేశాయి.రేపటి నుండి జైలు జీవితమేనటగా ఇకపై నరసరావుపేటలో ఫ్రెండ్స్ ని తరచుగా కలవడానికే కుదరదు, ఇక సినిమాల సంగతి సరే సరి. ఫ్రెండ్స్ అంటే సర్లే ఇక్కడ కూడా కొత్త ఫ్రెండ్స్ తయారవుతారు కానీ సినిమాలు ఒకసారి రిలీజై ఎత్తేస్తే మళ్ళీ ఎలా చూడటం. మహర్షి సినిమా అలాకాదు చూడలేకపోయింది. పరీక్షలకు నెల ముందు రిలీజైనా పబ్లిక్ పరీక్షలు అని చెప్పి ఎంత బతిమిలాడినా చూడనివ్వలేదు. పరీక్షలవేసరికి సినిమా ఎత్తేశారు. చాలామంది బాగాలేదన్నారు కాని నామినేని గాడు "చాలా బాగుంది, నీకు కూడా నచ్చుతుంది" అన్నాడు, కానీ నాకు కుదరలేదు. నేను హాస్టల్ లో ఉన్నపుడు రిలీజైన సినిమాలు ఎలా చూడాలో ఏమిటో :-(
అరె!! ఆలోచనల్లోనే విజయవాడ వచ్చేసిందా! వావ్ ప్రకాశం బ్యారేజ్ ఎంత అందంగా ఉందో కదా. బాబోయ్ నది ఒడ్డునే ఎంత ఇరుకుగా ఇళ్ళుకట్టుకున్నారో, ఎంతైనా పెద్ద ఊర్లంటే అలాగే ఉంటాయ్ ఏమోలే అందరూ ఇక్కడికే వస్తుంటారు కదా. అవునూ విజయవాడ అంటే మంచి రోడ్లు పెద్ద పెద్ద బిల్డింగ్ లూ ఊహించుకుంటే ఇదేమిటీ ఇలా ఉంది?. ఇలా నాలో నేను చూసిన ప్రతి దాన్నీ ప్రశ్నించుకుంటూ ముందుకు సాగుతూనే నాన్న వెంట కాలేజి గేట్ ముందు బస్ దిగాను. ఎదురుగా పెద్ద గేట్ దానికి రెండు పెద్ద పెద్ద నల్లని తలుపులు, ఈ చివర నుంచి ఆ చివరికి నిలువు చువ్వలు,వాటి వెనకగా మందపాటి పెద్ద రేకు ప్రతి చువ్వపైన మొనదేలిన కొసలతో త్రిభుజాకారపు ఆక్రుతులు, బహుశా పిల్లలెవరైన గేటు దూకే ప్రయత్నం చేస్తే అవి గుచ్చుకుని ఆగిపోడానికేమో.
గేటుకి ఒక మూల ఒక మనిషి మాత్రమే పట్టే మరో చిన్న తలుపు. "ఇదేదో అచ్చంగా సినిమాల్లో చూపించే జైలు గేటు లా ఉందే. నిజంగా హాస్టల్ కే వచ్చామా లేక బస్ వాడు పొరబాటున ఏదైనా జైలు ముందు దించేశాడా ?" ఒక వేళ నేను ఇంట్లో ఆబద్దాలు చెప్పి అప్పుడప్పుడూ కొట్టేసిన ఐదు పది రూపాయలకు నాకు జైలు శిక్షవేస్తే నాకు చెప్పకుండా నాన్న ఇక్కడకు తీసుకువచ్చారా ? హబ్బే ఆబద్దాలకి, అదీ ఇంత పెద్ద జైల్లో శిక్ష వేయరేమో లే. అవునూ ఆమూల చిన్న బోర్డేదో కనపడుతుంది కదా చూద్దాం. ఓ సారి కళ్ళద్దాలు సవరించుకుని చదివాను "సిద్దార్థ రెసిడెన్షియల్ స్కూల్, ఈడ్పుగల్లు" హమ్మయ్యా ఇది జైలు కాదు. కానీ నేను కాలేజి లో జాయిన్ అవడానికి కదా వచ్చింది ఇదేంటి నన్ను స్కూల్ కి తీసుకు వచ్చారు ? ("ఈ పక్కన ఫోటోలో చూపింది మా కాలేజ్ గేట్ కాదు లెండి ఇంచు మించు ఇదే స్టైల్ లో ఇంకా ఎత్తుగా ఉండేది మా గేట్")~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~



























