బుధవారం, జూన్ 19, 2013

ఓ నాలుగు సినిమాలు


ప్రేమకథాచిత్రమ్.. 

గిరి-నెల్లూరిగిరి-సప్తగిరి అంటూ పోస్టర్స్ లో కనిపించకుండా సినిమాలో మాత్రమే కనిపించిన సప్తగిరి ఒక చింపిరి విగ్గుతోనూ చిత్రవిచిత్రమైన డ్రస్సులతోనూ నెల్లూరి యాసతోనూ కడుపుబ్బ నవ్వించి మార్కులు కొట్టేసాడు. ఇతను ఇదివరకు పరుగులో కాస్త సీరియస్ పాత్రతో పరిచయమైనా తర్వాత కందిరీగ సినిమాలో చేసిన క్లిప్పింగ్ ఇక్కడ చూడండి అందులో కూడా గిరిగా బాగానవ్వించాడు. మారుతి గతచిత్రాలతో పోలిస్తే ఇందులో బూతుల మోతాదు బాగానే తగ్గించాడు ఐతే ఇది కూడా యూత్ లవ్ స్టోరీ పెద్దలకి మరియూ ఫామిలీ కథలను ఇష్టపడే వాళ్ళకి అంతగా నచ్చకపోవచ్చు. మొదటి సగం కొంచెం బోర్ కొట్టినా  సరదాగానే సాగుతుంది హార్రర్ తో కామెడీని మిక్స్ చేసి చేసిన ప్రయత్నం అభినందించదగినది. పెద్దకనుల హీరోఇన్ నందిత సినిమాకు బిగ్ ఎస్సెట్ అలాగే జెబి అందించిన నేపధ్య సంగీతం కూడా మూడ్ కి తగినట్లుంది. కళాఖండాలనదగిన సినిమాలని మాత్రమే చూడాలనే పట్టింపు లేకపోతే రెండుగంటల టైంపాస్ కోసం చూడదగిన సినిమా ప్రేమకథాచిత్రమ్.  



మాన్ ఆఫ్ స్టీల్ (సూపర్ మాన్)

నేను సూపర్ మాన్ సినిమాలకి పెద్ద అభిమానినేమీ కాదు, చిన్నపుడెపుడో ఎన్టీఆర్ గారి సూపర్మాన్ సినిమాకి తీస్కెళితే అందులో నాకు నచ్చిన విషయం “శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ” అన్నపాటని చెప్పేవాడ్నట. కాకపోతే బాట్మన్ రూపు రేఖలని మార్చేసిన నోలన్ ప్రొడ్యూసర్ కావడం, రసెల్ క్రో ఉండటం, హెన్రీకావెల్ కూడా చూడ్డానికి బాగున్నాడనిపించడంతో సూపర్మాన్ అంటే పాంటేస్కుని డ్రాయరేస్కుంటాడనే డెఫినిషిన్ ని మార్చేసిన మాన్ ఆఫ్ స్టీల్ సినిమా కోసం థియేటర్ వరకూ వెళ్ళాను. సినిమాకి కాస్తకొత్తరీతిలో రూపురేఖలద్దడానికి చేసిన ప్రయత్నం కొంచెం పర్లేదనిపించినా రెండున్నరగంటల నిడివి బోర్ కొట్టించింది. త్రీడీ ఫార్మాట్ లో ఈ సినిమా చూడడం శుద్దదండగ మొత్తం ఒక పావుగంటకూడా ఎఫెక్ట్స్ లేవు. నేను చాలా సేపు గ్లాసెస్ తీసేసే చూశాను. ఇక సూపర్మాన్ చేసే ఫీట్స్ అన్నీ మన హీరోలు ఎడంచేత్తో అవలీలగా ఎన్నో వందల సార్లు చేసినవే కనుక పెద్దగా అప్పీలింగ్ గా అనిపించవు. పైగా హీరో విలన్లు ఇద్దరూ ఆ డౌన్టౌన్ బిల్డింగుల పైనబడి వాటిని కూల్చేస్తూ కొట్టుకుంటుంటే ఆ చిత్రీకరణ వెనుక రహస్యం (సిజి) తెలిసిన నాకు పెద్ద ఆసక్తిగా అనిపించలేదు. మొత్తంమీద పిల్లలు ఉంటే కాస్తా అక్కడక్కడ ఎంజాయ్ చేయచ్చేమో కానీ వీడియోగేంస్ కి పరిచయమైన పిల్లలు సైతం ఎంజాయ్ చేయలేకపోవచ్చు ఈ సూపర్మాన్ ని. 


పవిత్ర

జనార్ధనమహర్షి మంచి ఆదర్శంతో ఉన్నతమైన భావాలతో సినిమా తీస్తాడు కానీ సినిమాలో ఎక్కడో ఏదో లోపం ఉంటుంది అది బయటకి ఇది అని స్పష్టంగా కనపడదు కానీ ఆ వెలితిమాత్రం అలాగే ఉంటుంది. పవిత్రకూడా అలాంటి సినిమానే. సినిమాలో తాను చెప్పాలనుకున్న పాయింట్ బాగుంది, డైలాగులు కొన్ని బాగున్నాయ్. సినిమా లాజిక్ కి అందదు సినిమాటిక్ లిబర్టీస్ బాగా తీసుకున్నారు అటు పూర్తిగా ఆర్ట్ ఫిల్మ్ లాగా కాక ఇటు కమర్షియల్ ఫిల్మ్ లాగా కాక అక్కడక్కడ మితిమీరిన ఎక్స్పోజింగ్ తో కన్ఫూజింగ్ గా ఉంది. సాయికుమార్ నటన గురించి చెప్పక్కర్లేదు ఇలాంటి పాత్రలు అవలీలగా చేసేస్తాడు. రోజాకి ఒక మంచి పాత్రదొరికింది తను బాగా చేసింది శ్రేయకూడా బాగానే చేసింది కానీ కొన్ని చోట్ల అసహజంగా వేశ్యపాత్రకనుక ఇలాగే ఉండాలన్నట్లు మరీ తెచ్చిపెట్టుకున్న నటనలాగా అనిపించింది. ఇటువంటి ఆఫ్ బీట్ సినిమాలిష్టపడేవారు ఒకసారి చూసి వదిలేయదగిన సినిమా చూడకపోయినా మిస్ అయ్యేదేం లేదు.


సమ్ థింగ్ సమ్ థింగ్

సుందర్ సి. దర్శకత్వంలో వచ్చిన టిపికల్ కామెడీ మూవీ ఇది. ఆమధ్యవచ్చిన నేనే అంబాని, ఒకే ఒకే లాంటి డబ్బింగ్ సినిమాల తరహాలోనే సరదాగా సాగిపోయే ఫామిలీ కామెడీ డ్రామా. పోస్టర్ లో కనిపించినట్లే సినిమా అంతటిని బ్రహ్మానందం ముందుండి నడిపించాడు. రెండుగంటల టైంపాస్ కోసం హాప్పీగా చూసేయచ్చు, మధ్యలో పాటలు మాత్రం స్పీడ్ బ్రేకర్స్ ఆ టైంలో హాయిగా సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లో అప్డేట్స్ చూస్కుంటూ గడిపేసి సినిమా ఎంజాయ్ చేసి వచ్చేయచ్చు. సిద్దార్ధ్ కొంచెం వయసుమీదపడినట్లు కనిపించాడు, కాస్ట్యూంస్ లో తమిళ వాసనలు కనిపిస్తాయీ, అలాగే అక్కడక్కడ కామెడీలోకూడా కనిపిస్తాయి. అయితే సినిమా అంతా ఒక అమ్మాయిని ఎలా ప్రేమలో పడేయాలనే ప్రయత్నాలతో సాగే సినిమా కనుక పిల్లలతో కలిసి చూడడం కాస్త అసౌకర్యంగా అనిపించచ్చు. నేను మాత్రం పూర్తిగా ఎంజాయ్ చేశానీ సినిమాని.

సో అవీ గత రెండు వారాలలో విడుదలైన సినిమాల కబుర్లు. ఓ కుర్రాళ్ళ సినిమా, ఓ పిల్లల సినిమా ఓ పెద్దల సినిమా ఓ ఫామిలీ సినిమా అని కేటగరైజ్ చేయచ్చేమో. ఇక ఈ వారం విడుదలకు సిద్దంగా ఉన్న తొలి తెలుగు కామెడీ త్రీడీ చిత్రం “యాక్షన్ త్రీడీ” కోసం ఎదురు చూస్తున్నాను అది విడుదలయ్యాక ఆ కబుర్లతో మళ్ళీ కలుస్తా.

17 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. నేను ఫ్యామిలీ మూవీ అనచ్చేమో అని చెప్పింది సంథింగ్ సంథింగ్ ని దృష్టిలో పెట్టుకునేనండీ. మేబీ పర్ఫెక్ట్ జెనర్ లో ఫిట్ అవకపోవచ్చు ఉన్న ఇబ్బందివల్ల అందుకే ఆ ఏమోని ఆడ్ చేసింది :)

      తొలగించండి
  2. బాగున్నాయి రివ్యుస్ వేణు గారు. నేను మీరు రివ్యు రాసిన మొదటి రెండు సినిమాలు చూసాను. ఫర్వాలేదనిపించాయి. "పవిత్ర" ఇక్కడ మా స్టేట్ లో విడుదల కాలేదు. సిద్దార్థ్ సినిమాకి వెళ్ళాలి ....

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. థాంక్స్ జలతారు వెన్నెల గారు. సిధ్దార్థ్ సినిమా కొతదనమేం ఆఫర్ చేయకపోయినా కామెడీతో టేకింగ్ తో చుట్టేశాడండి ఒకసారి సులువుగా చూసేయచ్చు చూడండి.

      తొలగించండి
  3. వారానికి నాలుగు సినిమాలు చూస్తారా ? ఆరోగ్యం జాగ్రత్త (సరదాగానే ) .. నేను సినిమాలు చూడను రివ్యూలు చదువుతాను . సిన్మాలు ఎలా ఉన్నాయో తెలియదు .. రివ్యూలు బాగున్నాయి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హహహహ మురళి గారు మంచి డౌటొచ్చిందండీ మీకు :) వారానికి కాదులెండి జూన్ మొదలయ్యాక ఈ పందొమ్మిది రోజుల్లోనూ చూసిన సినిమాలు ఈ నాలుగేనండీ. ఆవరేజ్ వారానికి ఒకటి పడుతుంది. అసలు కాలేజ్ రోజుల్లో అయితే ఫస్టియర్ లో హాస్టల్ కి వెళితే రాగింగ్ చేస్తారని భయపడి రోజుకు నాలుగు ఆటలు చూసి అర్ధరాత్రి సైలెంట్ గా హాస్టల్ కి చేరుకున్న సంధర్బాలుకూడా ఉన్నాయండీ :) అదే నా రికార్డ్.

      తొలగించండి
  4. సమీక్షలు చదువుతుంటె సరదాగా బాగున్నాయండి. మార్కులూ , నక్షత్రాలూ ఇచ్చే పధ్ధతి కన్నా మీ వర్గీకరణ చక్కగా ఉందండి.Thank you.

    రిప్లయితొలగించండి
  5. ఏదైనా సినిమా చూడలకునేడపుడు తప్పనిసరిగా ముందు మీ బ్లాగ్ చూడ్డం ఈ మధ్య నాకు కొత్తగా అబ్బిన అలావాటు వేణూ గారూ. మొన్న మీ ఈ పోస్ట్ చదివి "something something" చూసి వచ్చాను. దీన్నిబట్టి మీరు బాగా రివ్యూలు (కూడా) బాగా రాస్తారని నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరంలేదేమో?!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హాహహ థాంక్స్ ప్రియ గారు. సినిమా ఎంజాయ్ చేసిఉంటారని అనుకుంటున్నాను.

      తొలగించండి
  6. బాగున్నాయి మీ రివ్యూలు .వీటిలో ప్రేమకథాచిత్రం మా ఊరు వచ్చింది .ఎలా ఉందో తేలిక చూడలేదు.మీ రివ్యూ చుద్దామంటే నెట్ పనిచేయలేదు .మా ఇంట్లో అందరం మీ రివ్యూ లు చూస్తాము .మా పిల్లలు కూడా ...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. థాంక్సండీ.. ఓహ్ ఐతే మిస్ ఐపోయారనమాట, త్వరలో టీవీలో వేస్తాడులెండి అపుడు చూసేయండి :)

      తొలగించండి
  7. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  8. వేణూ..మీరు మెన్షన్ చేసిన మూవీస్ చూడక పోయినా,NTR హనుమాన్ మాన్(ఆయన వేసుకున్న బ్లూ కలర్ బనీన్ పై 'హెచ్'అనే వుంటుంది మరి) చుశానండీ..ఆయన గాలిలో ఈదిన విధానం,బండగా ఉన్న రౌడీస్ తో మాస్ మసాలా డిషుం డిషుం లూ,మబ్బుల్లో చంద్రమ్మా(ట్యూన్ బావుంటుంది) అని జయప్రదతో గాలిలో సాంగూ..హ హ హ..గుర్తొస్తే కితకితలు పెట్టినట్టు నవ్వొచ్చేస్తోంది సుమీ..ఆప్షన్స్ యాడ్ చేసినందుకు థాంక్సండీ..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హహహ :-) నోకామెంట్స్ శాంతిగారు చిన్నపుడు ఎన్టీఓడికి వీరాభిమానిని మరి :-) హనుమాన్ మాన్ బాగుందండీ :-)

      తొలగించండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.