శుక్రవారం, డిసెంబర్ 26, 2008

సాయము వలదా !! ఓ చెయ్ వేసేదా...

కొన్ని నెలల క్రితం అంటే ఆగస్ట్ లో నేను ఇండియా వెళ్ళివచ్చాను చాలా మంది బ్లాగ్ మిత్రులకు తెలుసు ఆ విషయం. అప్పటి కొన్ని అనుభవాలు బ్లాగ్ లో పంచుకోడానికి ఇప్పటికి వీలు దొరికింది. ఏం చేయమంటారు చెప్పండి నా బ్లాగ్ ధీం ఙ్ఞాపకాలు కదా, మరి అందుకే ఇన్ని రోజులు గడచిన తరవాత కానీ రాయడానికి కుదరడం లేదు :-) రావు గారు చెప్పినట్లు ఎప్పటికప్పుడు ట్రావెలాగుడు రాయగలిగితే బాగుండేది కానీ అది మన స్కూలు కాదు, అదీ కాక అసలు అన్ని విశేషాలు ఏమీ లేవు. ఎక్కడికైనా సైట్ సీయింగ్ కి వెళ్తే ఏమన్నా ఉంటాయ్ కానీ ఏదో పర్సనల్ ట్రిప్ కి ఇంటికి వెళ్ళినపుడు ఏముంటాయ్ చెప్పండి మనకీ రోజూ తారస పడే వ్యక్తులూ సంఘటనలలోనే నాకు ప్రత్యేకంగా అనిపించినవి రాద్దామని ప్రయత్నిస్తున్నా... ఓ రెండు మూడు టపాలకి సరిపడా విషయం ఉండి ఉంటుందనుకుంటున్నా, సరే ఇక ఉపోద్ఘాతం ఆపేస్తాను, మరి చదవండి.

నాకు ఎంత విదేశీ ప్రయాణమయినా ముందు సర్దుకునే అలవాటు అస్సలు లేదు, ఎప్పుడూ ఓ వారం ముందే సర్ధుకోవాలని అనుకుంటాను కానీ, ప్రయాణం రేపనగా ఈ రోజు రాత్రి ఏ పది గంటలకో పాత సూట్కేస్ తీసుకుని దుమ్ము దులపడం మొదలు పెడతాను. ఈ అలవాటు ఇప్పటిది కాదు లెండి. మన ఇంజినీరింగ్ పరీక్షలకి కూడా ఇంతే చదివే వాడ్ని ఓ సారి ఇలానే పరీక్ష ముందు రోజు రాత్రి నైట్ ఔట్ కి సిద్దమయ్యి పుస్తకం తీసి, ఓం ప్రధమంగా మొదటి పేజీ చదువుతుంటే అటుగా వచ్చిన పక్క రూమ్ వాడు నన్ను చూసి దాదాపు మూడవ అంతస్థు నుండి కిందకి దూకినంత పని చేసాడు, "హబ్బే నాకు ఏదో అనుమానం వచ్చి ఇండెక్స్ చూస్తున్నా లే మామా నువ్వు ఖంగారు పడకు.." అని నేను సర్ది చెప్ప బట్టి సరిపోయింది కానీ లేదంటే నిజంగా దూకేసే వాడే పాపం.

సరే అలా విమానం బయల్దేరడానికి కాస్త టైం ముందు వరకు కూడా సర్దుకుంటూ హడావిడిగా చెకిన్ కార్యక్రమాలన్నీ ముగించి విమానం లో పడే సరికి అప్పటికే అందరూ బోర్డ్ చేసి ఉండటం తో నా కేబిన్ లగేజి కి ప్లేసు దొరకలేదు. పైన ఉన్న ఖాళీ లో ఒక బేగ్ కుక్కేసాను. కానీ లాప్టాప్ ఉన్న బ్యాక్ ప్యాక్ ఎక్కడ పెట్టాలో దొరక లేదు ఇంతలో నా ముందు సీటు కి పైన ఉన్న కంపార్ట్మెంట్ ఓపెన్ చేసి చూద్దును కదా ఏవో నాలుగు చిన్నప్లాస్టిక్ సంచులు తప్ప ఏమీ లేవు అవన్నీ ఓ పక్కకి లాగి పెడితే నా బ్యాగ్ ఈజీ పడుతుంది అని నేను ప్రయత్నించే లోపే ముందు సీట్లో ఓ పెద్ద మనిషి లేచి, "మేమింతకు ముందే ప్రయత్నించాము అక్కడ ఇంకేవి పట్టవు నీ బ్యాగ్ కాళ్ళదగ్గర పెట్టుకో.." అని ఓ సలహా పారేసాడు. అసలే చిరాకు గా ఉన్నానేమో ఎడా పెడా వాయించి పడేసి "నేను ఇక్కడే పెడతాను నీ దిక్కున్న చోట చెప్పుకో పో.." అన్నంత గా అరిచేసాను అసలే పద్నాలుగు గంటల ఏక బిగి ప్రయాణమాయే, చికాగో నుండి ఢిల్లీ కి ఒకే విమానం, అంత సేపు కాళ్ళ దగ్గర ఓ బ్యాగ్ తో చాలా చిరాకు అనే ఆలోచన ఒక్కటే నాచేత మాట్లాడిస్తుంది. ఆఖరికి ఓ అటెండెంట్ వచ్చి "ఎదురు గా ఇంకో చోట చిన్న ఖాళీ ఉంది దాన్లో పెడ్తాను ఇవ్వరా.." అంటే నేను చాలా మూర్ఖంగా అసలటు చూడకుండానే అది చాలా చిన్న ఖాళీ అక్కడ పట్టదు అని చెప్పాను. అతను నిశ్శబ్దంగా నా బ్యాగ్ తీసుకుని అక్కడ సర్దేసాడు.

ఆ తర్వాత ఓ పది నిముషాలకి కానీ నేను ఎలా బిహేవ్ చేశాను అనే విషయం అర్ధమ్ కాలేదు నాకు. ముందు సీట్ అతనికి సారీ చెప్దామా అని అనుకున్నా కాసేపు కానీ మనకి అంత మంచి బుద్ది, సంస్కారం ఎక్కడేడ్చింది, ఆ ఎవడో లే వాడికి సారీ చెప్పక పోతే మాత్రం ఏమయ్యింది అన్నట్లు చివరకి చెప్పకుండానే ఫ్లైట్ దిగేశాను. ఇప్పటికీ అప్పుడప్పుడూ ఆ బిహేవియర్ తలచుకొని బాధ పడుతుంటాను ఒకో సారి బొత్తిగా మనం ఏం చేస్తున్నామో మనకే తెలియనట్లు బిహేవ్ చేస్తాం ఎప్పటికి మారేనో ఈ బుద్ది అని అనిపించింది.

నేను సాధారణంగా ఒంటరి గా ప్రయాణిస్తుంటాను కనుక ప్రయాణం లో ఇతరులని గమనిస్తుండటం అలవాటు అదే ఫ్లైట్ లో ఓ కుర్రవాడ్ని చూసాను. సౌతిండియన్ లానే ఉన్నాడు ఒంటరిగా ప్రయాణం చేస్తున్నాడు మధ్య మధ్య లో లేచి అటూ ఇటూ నడుస్తూ అందరినీ పలకరిస్తూ చాలా కలుపు గోలు గా ఉన్నాడు. ఎవరో కుర్రాడు బాగ హుషారు గా ఉన్నాడే అనుకున్నా కాని అతను చేసిన ఓ సాయం చూసి చాలా ముచ్చటేసింది. ఓ నార్తిండియన్ మామ్మ గారు వాళ్ళ అబ్బాయి చేతులు పట్టుకుని నడిపిస్తుంటే నడవలేక నడవలేక నడుస్తుంది. ఆవిడ్ని చూసిన మన వాడు వెంటనే కిందకూర్చుని కాళ్ళు రెండూ పట్టుకుని తన చేతులతో ఆవిడ కాళ్ళ చేత ఆడుగులు వేయించాడు. ఏ సంబంధం లేని అతనలా సాయం చేస్తుంటే భేష్ అని అనుకోకుండా అతనిని అభినందించ కుండా ఉండ లేక పోయా.

ఇలాంటి జెన్యూన్ హెల్పర్స్ ఒక తీరైతే వేరో జాతి కూడా కనిపిస్తుంటారు. ఓ పాత పాట ఉంటుంది "మీ అందాల చేతులు కందేను పాపం ఎందుకు ఈ బెడద.. సాయము వలదా ఓ చెయ్ వేసేదా..." అని అంటూ హరనాధ్, పద్మనాభం మిత్ర బృందం తో కలిసి జమునా ని మిత్ర బృందాన్ని ఆట పట్టిస్తూ పాడతారు. ఆ పాట మంచి సరదాగా ఉంటుంది. అలానే కొందరు అబ్బాయిలు, ప్రత్యేకించి మిడిల్ ఏజ్ అంకుల్స్ (నొ అఫెన్స్ , భుజాలు తడుము కుంటే నే చేయ గలిగింది ఏమీ లేదు.) అమ్మాయిలు కనపడగాన సాయం చేయడానికి ముందుంటారు అలాంటి ఓ చిన్నారావ్ గురించి చెప్పుకుందాం. (అసలు ముందు తోట రాముడు గార్నడిగి దినకరుడ్ని అప్పు తెచ్చుకుందాం అనుకున్నా కానీ, అసలే దినకర్ అనే ఆయన నిజ్జంగా ఉన్నాడని ఈ మధ్య చదివాం కదా, మళ్ళీ ఆయన తీసుకొనే సివిల్ మరియూ క్రిమినల్ చర్యలతో ఎందుకొచ్చింది చిక్కూ. అదీ కాక, ఏమన్నా తేడా వస్తే, ఆయన అభిమానులంతా మా ఇంటి మీద దాడి చేసి, మా ఇంటి కి నల్ల రంగు వేసి నిరసన తెలుపుతారేమో "ఎందుకొచ్చిన గొడవరా దేవుడా.." అని అనుకుని ఈ మధ్యనే మళ్ళీ చూసిన ఏప్రిల్ ఒకటి విడుదల లోని పేను కొరుకుడు చిన్నారావ్ పేరు పెట్టుకున్నా అదనమాట విషయం).

సరే ఈ సదరు చిన్నారావ్ గార్లకి అమ్మాయిలు కనిపిస్తే చాలు సాయం చేయడానికి రడీ అయిపోతారు, అబ్బాయిలో, వయసు పై పడిన మహిళలో, మరొకరో ఎంత అవస్థ పడుతున్నా అస్సలు వీరి కంటికి కనపడరు. అదేదో సినిమాలో ధర్మ వరపు సుబ్రహ్మణ్యం ఇలాంటి లెక్చరర్ పాత్ర వేసి తెగ నవ్విస్తాడు. క్లాస్ లో అబ్బాయిలని విసుక్కుంటూ అమ్మాయిల వైపే తిరిగి పాఠం చెబుతూ.. ఇలా మన సదరు చిన్నారావ్ కూడా ఇదే బాపతు. నాకు ఢిల్లీ నుండి హైదరాబాద్ వెళ్ళే ఫ్లైట్ లో తగిలాడు నాది విండో సీట్ నా పక్క సీట్ లో ఓ అమ్మాయి తన పక్కన ఎయిల్ సీట్ మన చిన్నారావ్ గారిది. నేను నా మానాన పాటలు వింటూ మన వాడి వీరంగం గమనిస్తూ ఉన్నా, మధ్యలో ఓ సారి కాఫీ లో క్రీమ్ తక్కువైందని ఫ్లైట్ అటెండెంట్ (మగవాడు) పై గొడవ పడ్డాడు ధుమ ధుమ లాడుతూ కూర్చున్నాడు, కానీ పక్కన అమ్మాయ్ తో మాట్లాడేప్పుడు మాత్రం ఎక్కడ లేని నవ్వు వచ్చేస్తుంది అన్న గారి మొహం లో.

ముందు రోజు సర్దుకోడానికో నైట్ ఔట్, ఢిల్లీ విమానాశ్రయం లో ఓ నైటౌట్ ఇవి రెండే కాక ప్రయాణం వలన, బాగా అలసి పోయి ఉన్నానేమో మెల్లగా నా కళ్ళు అరమోడ్పులై, నే నిద్రా దేవి ఒడిలో సేద దీరడానికి ఉపక్రమించేంతలో చేతి పై ఎవరో బలంగా చరిచి నట్లై ఉలిక్కి పడి లేచాను చూస్తే మన అంకుల్ అప్పుడే అరలీటరు ఆముదం అర్జంట్ గా తాగిన వాడి లా మొహం ధుమ ధుమ లాడిస్తూ నన్ను చరిచిన చేతి నే పైకీ కిందకీ ఆడిస్తూ సంఙ్ఞ చేస్తున్నాడు ఏంటా ఇతని గోల అని ఓ నిముషం ప్రాసెస్ చేసి ఆలో చిస్తే కిటికీ వేయమని చెప్పటానికి వచ్చిన తిప్పలు. ఆ ఫేస్ చూసి, అతను చెప్పిన అమర్యాద కరమైన విధానాన్ని చూసి నాకు ఎంత చిరాకు వచ్చిందంటే, వెంటనే ఆ చేతిని అలానే పట్టుకుని పవన్ కల్యాణ్ రేంజిలో వేళ్ళని వెనక్కి విరిచి అతన్ని సీట్ లోంచి పైకి లేపి విసిరి సీలింగ్ కి వేసి కొట్టాలి అనిపించింది. తర్వాత కాసేపెలాగో నిద్ర పోడానికి ప్రయత్నించాను. మధ్య మధ్య లో మెలకువ వచ్చినప్పుడల్లా గమనిస్తూనే ఉన్నాను పాపం ఆమె పుస్తకం చదువుకుంటూ అసహనం గా సమాధానాలు ఇస్తుంటే మన వాడు ఏ మాత్రం సంకోచం లేకుండా ఓ స్పూనేస్కుని మరీ ఆ అమ్మయ్ బ్రైన్ తినేస్తున్నాడు. సరే ల్యాండ్ అయ్యాక అతను ముందు లేచి అతని లగేజి కూడా తీస్కోకుండా మీ బ్యాగ్ ఏది... అని ఆమెని ఆడిగితే తను మర్యాద గా నేను తీస్కుంటానులేండి అని తిరస్కరించింది. నేను మనసులో "రేయ్ ఇలా రార ఆవిడని కాదు రా అడగాల్సింది అక్కడ మోయలేనిపెద్ద వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళా సామాను మోసి పెట్టు రా... " అని అనుకున్నా బయటకి అనడానికి ధైర్యం చాలక.

అన్నట్లు, హైదరాబాద్ లో దిగేప్పుడు గ్లాస్ బిల్డింగ్ మధ్య లో తెల్లని పెద్ద పెద్ద అచ్చ తెలుగు అక్షరాల తో "రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం" అని అంటూ స్వాగతం పలికిన కొత్త ఎయిర్ పోర్ట్ లో అచ్చ తెలుగు లో హొయలు పోతూ కనువిందు చేసిన అక్షరాలని చూసి మనసు పులకించి పోయింది.

మరిన్ని విశేషాలతో మరో టాపాలో కలుద్దాం. అంతవరకు శలవ్....
--వేణూ శ్రీకాంత్

12 కామెంట్‌లు:

  1. అమ్మో ఇలాంటి తింగరోళ్ళు ప్రయాణం అంతా సినిమా చూపిస్తారండీ బాబూ.... అవసరం లేకపోయిన వెర్రి నవ్వులు, వెర్రి వాగుడు.... ఒక రేంజ్ లో ఉంటాయి వీళ్ళు చూపించే కళలు

    రిప్లయితొలగించండి
  2. మా కథ మీది ముగిసిన చోట మొదలైందిలేండి. అలా బాధలు, కష్టాలు ఓర్చుకుని రైలుబండి ఎక్కామో లేదో ఎదురుసీట ఆంటీగారికి మా లోయరు బెర్తు మీదే కళ్ళు. చివరాకరికి అది ఆవిడ సొంతమే అయింది లేండి. అన్ని రైలు ప్రయాణాల్లోనూ ఇదే తంతు. మా అక్కకేమో ఒకటే చిరాకు, అమెరికా నుంచి వచ్చావు ఆ మాత్రం చెప్పలేవా అని. నాకేమో తగని దిగులు అందరకూ సీట్లు సర్థుబాటు చేయటానికేనా నేనీ దేశం వచ్చానూ అని.

    రిప్లయితొలగించండి
  3. బలే రాసారు ... చదివినంత సేపూ నవ్వుతూనే ఉన్నా :)

    రిప్లయితొలగించండి
  4. పోనీలేండి ఇప్పటికైనా రాస్తున్నారు."మిడిల్ ఏజ్ అంకుల్స్":)

    రిప్లయితొలగించండి
  5. >>అరలీటరు ఆముదం అర్జంట్ గా తాగిన వాడి లా
    హ.హా భలే చెప్పారు.

    రిప్లయితొలగించండి
  6. లక్ష్మి గారు నెనర్లు, నిజమేనండీ కొందరు అయితే పుట్టు పూర్వోత్తరాల నుండి ప్రస్తుతం సంపాదించే జీతం వరకూ దేన్ని వదిలిపెట్టకుండా అడుగుతారు. మహిళలు కూడా మినహాయింపు కాదు. ప్రయాణం లో కొత్త పరిచయాలు హాయి గొలిపినా కొన్ని మాత్రం చాలా విసిగిస్తాయి.

    ఉష గారు నెనర్లు, హ హ లోయర్ బెర్త్ గురించి ఎందుకు అడుగుతార్లెండి ఒక సారి నో అని చెప్పిన పాపానికి "ఏమోయ్ నేనేమన్నా నీ ఆస్తి రాసిమ్మని అడుగుతున్నానా.." అని దులిపేసారు నన్ను.

    నేస్తం గారు, సిరిసిరిమువ్వ గారు, చైతన్య గారు, మంచి బాలుడు గారు, వ్యాఖ్యానించిన మీ అందరికీ నెనర్లు.

    రిప్లయితొలగించండి
  7. మిడిల్ ఏజ్ అంకుల్స్ - భుజాలు తడుముకున్నానండీ...:)
    మీ ప్రయాణంలో పదనిసలు...బావున్నాయండీ.
    -గిరీష్

    రిప్లయితొలగించండి
  8. నాకు కూడా ప్రయాణాలలో తోటి ప్రయాణికులతో ఎదురైనా అనుభవాలని వ్రాద్దామన్న ఆలోచన వచ్చింది... మీరు వ్రాసింది చూసాక నేను కూడా రాయొచ్చేమో అనిపిస్తుందోంది... చూడాలి...
    మీ కబుర్లు ఎప్పటిలా బాగున్నాయి.

    రిప్లయితొలగించండి
  9. mee blog bavundadi nenu nijamga chala enjoy chestunanu ,ipude andhrajyothy paperlo article mee blog lodi chusi ,blog loki dukesanu so ippude modalu pettanu front ninchi back vellthunanu,thanks very much for balamurali krishna gari music .

    రిప్లయితొలగించండి
  10. ప్రఫుల్ల చంద్ర గారు నెనర్లు. మరి ఆలశ్యం ఎందుకు మొదలు పెట్టేయండి.

    అపురూప గారు థ్యాంక్యూ అండీ. బ్లాగ్ నచ్చినందుకు సంతోషం. నా బ్లాగ్ ఆంధ్ర జ్యోతి లో వచ్చిన విషయం మీరు చెప్పే వరకూ తెలియదు :-)

    రిప్లయితొలగించండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.