అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

అందమైన బాల్యం

మధురమైన జ్ఞాపకాలతో అందమైన బాల్యాన్ని నా సొంతం చేసినందుకు అమ్మానాన్నలకు ఎప్పుడూ ఋణపడి ఉంటాను. మొదటి సంతానాన్నవడంతో నేనాడిందే ఆట పాడిందే పాట అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళినా మా ఇంట్లో అయినా అపురూపంగా గడిచింది. పాడుకున్న పాటలు, ఆడుకున్న ఆటలు, స్కూల్ ఎగ్గొట్టడానికి వేసిన వేషాలు, తిన్న చిరుతిళ్ళు, నాన్న వేలు పట్టుకుని కొట్టిన షికార్లు, 16mm సినిమాలు కబుర్లు ఇక్కడ చదవచ్చు.

ఇంటర్మీడియెట్ హాస్టల్ కబుర్లు

నూనూగు మీసాల నూత్న యవ్వనం అమ్మానాన్నలకు దూరంగా నాదంటూ ఓ స్వంత ప్రపంచం. అప్పటివరకూ ప్రతి చిన్న పనికి వాళ్ళమీద ఆధారపడి ఒక్కసారిగా నాకు నేనే నెగ్గుకు రావాల్సిన పరిస్థితులను తలుచుకుని దిగులు. అంతలోనే చుట్టూ ఉన్న స్నేహితులతో నేస్తం కట్టేసి చేసిన అల్లర్లు, పరోఠాల బిజినెస్సులు, చెరకుతోట దొంగతనాలు, ఆడ్మినిస్ట్రేటర్ కి మస్కాగొట్టి చూసిన సినిమాలు, సరదా కొంటె కబుర్లు ఇక్కడ చూడండి.

ఇంజనీరింగ్ కాలేజ్

ఇంటర్మీడియెట్ కి రెసిడెన్షియల్ హాస్టల్ కనుక పంజరంలో పక్షిలా బతికితే ఇంజనీరింగ్ కాలేజ్ యూనివర్సిటీ హాస్టల్స్ లోకి వచ్చేసరికి ఒక్కసారిగా జూలోనుండి పచ్చని అడవిలోకి వదిలేసిన జింక పరిస్థితే అయింది, ఎక్కడికి పరుగులెట్టినా ఏం చేసినా అడిగేవాళ్ళులేరు. అసలు హాస్టల్ బిల్డింగ్ లో నిరంతరం కాపుకాసే వార్డెన్ ఉండడనే విషయం నాకు డైజెస్ట్ కావడానికి నెలపట్టింది :-) నిజమా అలా ఎలా సాధ్యం అని ఇప్పటికీ అనిపిస్తూనే ఉంటుంది. అంతటి స్వేఛ్చాప్రపంచంలో చేసిన అల్లర్లు కొన్ని కబుర్లు ఇక్కడ.

సినిమాలు రివ్యూలు..

నాకున్న అతి పెద్ద వ్యసనం సినిమా చూడడం రిలీజైన ప్రతి అడ్డమైన సినిమా చూసేసి ఈబొమ్మలో చూపించినట్లు తెలుగు సినిమాని భుజాల మీద మోసేవాళ్ళలో నేనొకడ్ని. చూసి ఊరుకోకుండా ఇది ఇందుకు బాలేదు అది అందుకు బాగుంది అంటూ పేద్ద వంద సినిమాలు తీసేసి విశ్రమిస్తున్న మేధావిలా చేసే విశ్లేషణలు :-) హహహ చదివిన ఒకరిద్దరు అలా తిడతారు కానీ నా దృష్టిలో ఒక సాధారణ సినీ ప్రేక్షకుడు చూసొచ్చి మిత్రులతో చెప్పే కబుర్ల లాంటి నా సినీ రివ్యూలు ఇక్కడ చదవండి. ఆరెంజ్, ఖలేజా, కృష్ణం వందే జగద్గురుం లాంటివి కొన్ని ఎక్కువమంది ఆదరణ పొందాయ్.

బుధవారం, జూన్ 13, 2012

శ్రీశ్రీనివాసం శిరసా నమామి - 2

మొదటి భాగం ఇక్కడ చదవండి. కళ్యాణకట్ట క్యూలో తోసుకుంటూ ఒకళ్ళమీద ఒకళ్ళు నిలబడి ఎలాగో రెండున్నర గంటలు ఎదురు చూశాక కంపార్ట్మెంట్స్ లోకి వదిలాడు. అక్కడ కుర్చీలూ ఒక మంచినీళ్ళ కుళాయి ఉన్నాయి. అక్కడ కూర్చుని ఒక అరగంట ఎదురు చూశాక అక్కడనుండి కిందకి వదిలాడు. అలా వదిలేప్పుడు ఒక బార్ కోడ్ ప్రింట్ చేసున్న స్లిప్ మరియు సగం బ్లేడ్ మనచేతికి ఇస్తారు. ఆ కోడ్ తోపాటు ఒక నంబర్ ఉంటుంది కింద కళ్యాణ కట్ట దగ్గరకు వెళ్ళినపుడు ఆ నంబర్ ఎక్కడ ఉందో వెతుక్కుని దానిదగ్గర ఉన్న క్షురకుని వద్దకు వెళ్ళి లైన్లో నించుంటే అతను గుండుకొడతాడు. ఆ ప్రదేశం అంతా కింద నీళ్లు వెంట్రుకలతో బ్యాగ్ కిందపెట్టుకోడానికి కూడా వీలు లేకుండా ఉంది తరచుగా శుభ్రం చేయడానికి ఒక నలుగురైదుగురు స్టాఫ్ ఉన్నాకూడా వారి పనితీరు అంత ప్రభావవంతంగా అనిపించలేదు. బహుశా విపరీతమైన రద్దీ ఉండటం వలన అయి ఉండచ్చు. ప్రతి క్షురకుని దగ్గర చేతికింద ఒక వేడినీళ్ల బక్కెట్టు, క్యూల మధ్యలో ఒక బకెట్లో మాములు నీళ్ళు ఉన్నాయి. మన వంతు వచ్చే ముందు ఆ నీళ్ళతో మన తల తడుపుకుంటే మనవంతు వచ్చినపుడు నాయీబ్రాహ్మడు వేడినీళ్ళుపయోగించి పని పూర్తిచేస్తాడు.

ఇక్కడ గుండు ఉచితంగా చేస్తారు “ఎవరికీ డబ్బులు ఇవ్వద్దు, అంతా ఉచితం” అని అంతటా బోర్డులు ఉంటాయి కానీ మీరు ఆ టోకెన్ అతని చేతిలో పెట్టేప్పుడే దానితో పాటు కొంత డబ్బులు కలిపి ఇవ్వండి. నాకు ఈ సూక్ష్మం తెలియక కేవలం టోకెన్ మాత్రమే ఇచ్చాను. ఆయన ఎడాపెడా గుండంతా మంట పుట్టేలా గీకేయడమే కాక అక్కడక్కడ పూర్తిగా చేయకుండా వదిలేస్తే, నేను తడుముకుని చూస్కుని మళ్ళీ చెప్పి చేయించుకోవాల్సి వచ్చింది. అంతా అయ్యాక గట్టుమీద భద్రంగా పెట్టిన బ్యాగ్ తీసుకుని వచ్చేస్తుండగా “ఏంటి సార్ అలా వెళ్ళిపోతున్నారు తోచినంత ఎంతోకొంత ఇవ్వండి సార్” అని ఆపేశాడు. “అదేంటోయ్ అంతటా ఇవ్వద్దని బోర్డులున్నాయ్ సి.సి. కెమేరాలు కూడా ఉన్నట్లున్నాయ్ కదా?” అని నేను అంటే “అవంతే ఉంటాయ్ సార్ మీరు కిందనుండి ఇచ్చేయండి, మాకు అలవాటే తీస్కుంటాం” అని చెప్పాడు. అతనికి కొంత చదివించుకుని పక్కన ఉన్న స్వామివారి ఫోటోకి భక్తిపూర్వకంగా ఒక నమస్కారం చేసుకుని ఇవతలికి వస్తుండగా ఎవరినో “ఏంది దొరలాగా గుండు చేయించుకుని వెళ్తున్నావ్ పైసల్దీయ్” అని అదిలించడం వినిపించింది.

మాములుగా ఇంటిదగ్గర క్రాఫ్ చేయించుకున్నపుడు పర్స్ అంతా ముట్టుకోవడమెందుకు అని సరిపడా చిల్లర మాత్రమే తీస్కెళ్ళే నేను తప్పనిసరై ఇది పుణ్యకార్యమనే ధీమాతో అంతా స్వామిదే బాధ్యత అని అలాగే ఉతికిన బట్టలు స్వామివారి ముడుపుతొ సహా ఉన్న ట్రావెల్ బ్యాగు తగిలించుకుని బయల్దేరాను. కళ్యాణకట్టలో స్నానానికి బాత్రూములున్నాయ్ కానీ ఆ రోజు నీళ్ళు రావట్లేదని చెప్పారు. మెల్లగా పుష్కరిణి వైపు అడుగులేయడం మొదలెట్టాను. అంత పొద్దున్నేకూడా ఎక్కడ చూసినా భక్తులతో తిరుమల అంతా కళకళలాడుతుంది. దారిలో ఎక్కడంటే అక్కడ మంచినీళ్ళకోసం ఏర్పాటు చేసిన పంపులు బాగున్నాయ్. గుడి పరిసరాలే కాకుండా మాడవీధుల్లోను కొబ్బరికాయలు కొట్టేదగ్గర మెట్లమీద అంతా ఎంతమంది భక్తులు ఉన్నాకూడా పరిశుభ్రతకు ఏవిధమైన లోటులేకుండా చూడడం బాగా నచ్చింది.

వరాహ స్వామి గుడి వెనక పుష్కరిణి పక్కన మహిళలకి మగవారికి ఎవరికి వారికే ప్రత్యేకంగా కట్టిన స్నానపు గదులు చాలా శుభ్రంగా సౌకర్యంగా ఉన్నాయ్. విశాలమైన ఆవరణ, గ్రానైట్ రాళ్ళతో ఫినిషింగ్ ఇచ్చిన గోడలు అంతే చక్కని మెయింటెనెన్స్, ఒక్కో బాత్రూములోనూ బక్కెట్టు మగ్గు, తలుపుకు బట్టలు తగిలించుకోడానికి హ్యాంగర్స్, సబ్బు షాంపూ ఇతరత్రాలు పెట్టుకోవడానికి చిన్న అర, బాత్రూముల మధ్య కొంచెం ఎత్తులో నీళ్ళుపడకుండా బ్యాగులు పెట్టుకోడానికి ఒక గట్టు అన్నీ చాలా సౌకర్యంగా ఉన్నాయ్. వీటన్నిటికి తోడు పుష్కరిణి నుండి పంప్ చేస్తున్న నీరు పుష్కరిణిలో స్నానమాచరించిన తృప్తిని కూడా మిగిల్చింది.

అక్కడ స్నానం ముగించి తిరిగి గుడి ముందుకు వచ్చి స్వామివారికి ఒక టెంకాయ కొట్టి అప్పటికే సర్వ దర్శనం ఒక రోజు పడుతుందని టాక్ స్ప్రెడ్ అవడంతో ప్రత్యేక దర్శనం(300)క్యూ వెతుక్కుంటూ బయల్దేరాను. మంగళ బుధవారాల్లో ఈ లైన్లోకూడా దర్శనం ఆరుగంటల పైనే పడుతుందట మిగిలిన రోజుల్లో మూడు నాలుగు గంటల్లో ముగుస్తుందని తెలిసింది ఆరోజు గురువారం. టిక్కెట్లు క్యూలోనే ఇస్తారు కానీ క్యూలైన్స్ లో ప్రవేశించేముందే సెల్ ఫోన్స్, లగేజ్, చెప్పులను క్లోక్ రూంలో సరండర్ చేయాలి. కళ్యాణకట్టనుండి వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1 దగ్గరకు వెళ్ళే దారిలో మొదట నడిచి వచ్చినవారికి ఇచ్చే లాకర్ ఫెసిలిటీ ఉంటుంది. మరికొంచెం ముందుకు వెళ్తే అదనంగా మరో రెండు కౌంటర్లు లగేజ్ సెల్ ఫోన్స్ చెప్పులు డిపాజిట్ చేసుకునేందుకు ఉన్నాయ్. తిరుమలలో ఎంత రద్దీ ఉన్నా ఈ కౌంటర్లలో అంత రద్దీలేకపోవడం ఆశ్చర్యంగా అనిపించింది ఒకరిద్దరిని మించి క్యూ పెరగకుండా సిబ్బంది జాగ్రత్తగా చూస్తున్నారు. అలాగే రోజంతా ఒకటే పని చేస్తూ వందలమంది భక్తులను డీల్ చేసినా అక్కడి సిబ్బంది విసుక్కోకుండా ప్రతి ఒక్కరికి ఓపికగా సమాధానాలు చెప్పడం బాగా నచ్చింది.  

ఇక ప్రత్యేక దర్శనం క్యూలో ఎంటర్ అయ్యాక క్యూలో పైన ఫాన్లు, దాదాపు ప్రతి యాభై అడుగులకు ఒక మంచినీటి కుళాయి, అక్కడక్కడా పెద్దవాళ్ళు కూర్చోడానికి ఏర్పాటు చేసిన కుర్చీలు, క్యూ బయటనుండి టి.టి.డి వారు సరఫరా చేసిన పాలు, క్యూ గ్రిల్స్ కు వేళ్ళాడదీసిన వట్టివేళ్ళ తడికలు చాలా ఆకట్టుకున్నాయి. కానీ ఇక్కడ కూడా భక్తులలో క్రమశిక్షణ లోపించింది. రెండుమూడు వరుసలలో నిలబడి తోసుకోవడమే కాక క్యూలో నిలబడి ఇబ్బంది పడుతున్న ఒక పెద్దావిడని కుర్చీలో కూర్చోపెట్టడానికి అప్పటికే అందులో సెటిల్ అయిన ఒక అతనికి పక్కనున్నవాళ్ళం గట్టిగా చెప్పి లేపాల్సి వచ్చిందంటే మీరే అర్ధం చేసుకోవచ్చు.

ఈ క్యూలైన్స్ లో దదాపు మూడుగంటలకు పైగా ఎదురు చూశాక మెటల్ డిటెక్టర్ ద్వారా టిక్కెట్ కౌంటర్స్ వద్దకూ, ఆపై క్యూ కాంప్లెక్స్ లోకి వదిలారు. ఈ కాంప్లెక్స్ లు చాలా శుభ్రంగా మంచినీరు, టాయిలెట్స్ ఇతరత్రా సౌకర్యాలతో కూర్చోడానికి బల్లలతో పెద్ద పెద్ద ఫాన్స్ తో ఒక కాఫీ వెండింగ్ మెషీన్ తో చాలా సౌకర్యవంతంగా ఉన్నాయ్. అక్కడ అందరు సెటిల్ అయాక ఒక్కొక్కరు పులిహోర పొట్లాలు జంతికలు ఇతరత్రా తినుబండారాలు తెరవడం మొదలెట్టారు. అప్పటి వరకూ దర్శనమెప్పుడవుతుందా అని ఎదురుచూస్తున్న నాకు సిక్స్ ట్రాక్ స్ట్రీరియో ఫోనిక్ ఎఫెక్ట్స్ తో కరకర నమిలే శబ్దాలు, పులిహోరల ఘుమఘుమలు ఇవి చాలవన్నట్లు టి.టి.డి వారు ఉచితంగా సరఫరా చేసిన బిసిబేళబాత్ పులియోగరే సువాసనలు నా కళ్ళు ముక్కు చెవుల ద్వారా ముప్పేట దాడిచేయడంతో అప్పటికి ఇరవైనాలుగ్గంటలుగా పొద్దున్న ఒక టీ, మంచినీళ్ళు తప్ప ఏమీ తినలేదన్న విషయం గుర్తువచ్చింది. అంతలోనే మరికొన్ని గంటలు ఓపికపడితే దర్శనం అయ్యాక తినచ్చులే అని అనిపించడమే తడవు ఆటోమాటిక్ గా ధ్యాస స్వామివారివైపు మరలింది.

ఆ కాంప్లెక్స్ లో ఎదురు చూసిన మూడుగంటలూ ఫోన్ కూడా చేతిలో లేకపోవడంతో స్వామి సన్నిధిలో ఇతర ఆలోచనలు అన్నీ వదిలేసి ఎప్పుడు ఆయన దర్శనమౌతుందా అని ఎదురు చూస్తూ కూర్చోవడం ఆహ్హా నాకు చాలా నచ్చింది. ఇదికూడా అదృష్టమే కదా ఇందుకే ఈ సదవకాశాన్ని నాకు కల్పించేందుకే ఎపుడూ దర్శనం ఆలశ్యమౌతుంటుందేమో అని అనిపించింది. ఆ కాంప్లెక్స్ నుండి వదిలేశాక ఇక ఎక్కడా ఆగకుండా స్వామి దర్శనమేనని తెలుసుకుని ఆనందంతో ఎదురు చూస్తుండగా క్యూ కాంప్లెక్స్ తలుపులు తీయడమాలశ్యం ఆ ప్రదేశమంతా గోవిందా గోవిందా అంటూ గోవిందనామాలతో ప్రతిద్వనించింది. మెల్లగ క్యూకదలనారంభించింది, క్యూ మధ్యలో ఇరుకుదారుల్లో వెంటిలేషన్ సరిగా లేని చోట ఏసీ బ్లోయర్స్ ఏర్పాటు చేయడం బాగుందనిపించింది. మళ్ళీ మరోసారి మెటల్ డిటెక్టర్ గుండా తనిఖీ చేయించుకుని గుడి ముందుకు వెళ్ళాను. ముఖద్వారం వద్ద కింద ఏర్పాటు చేసిన పారేనీటిలో పాదాలు తడుపుకుని పరమ పవిత్రమైన గుడి ఆవరణలోకి అడుగుపెట్టాను.

నా ప్రయత్నంగా అడుగు తీసి అడుగేసుకుంటూ నడచి వెళ్ళడం నాకు అక్కడివరకే గుర్తుంది. ఇక అక్కడినుండి ఎలా నడిచానో నాకేమీ గుర్తులేదు అంతా ఆ స్వామి ఇతర భక్తులు కలిసి నడిపించినదే. నా పిచ్చిగానీ ఆ దేవదేవుని దయలేకుంటే అక్కడివరకూ మాత్రం రాగలనా ? నేవేసే ప్రతి అడుగూ ఆ స్వామి కనుసన్నలలో వేసేదే అని నాకూ తెలుసుననుకోండి కాకపోతే ముఖద్వారం దాటాక చాలా చిత్రంగా ఇహలోకపు స్పృహ పూర్తిగా కోల్పోయాను. ఎవరు తగులుతున్నారో ఎవరు లేదో ఎవరు కాళ్ళుతొక్కుతున్నారో ఎవరు ముందుకు తోస్తున్నారో ఎవరు వెనకకు నెడుతున్నారో ఇవేమీ తెలియని ఒక అలౌకికమైన స్థితిలోకి చేరుకున్నాను. పెదవులు నిర్విరామంగా గోవింద నామాన్ని పలుగుతుంటే చూపులు బంగారు వాకిలి పై నిలిచాయి. సకలదేవతలు, మహర్షులు, యోగి పుంగవులు, అన్నమయ్య వెంగమాంబ వంటి మహాభక్తులు, రాజులు చక్రవర్తులు సమస్త ప్రాణికోటీ ఆ స్వామి దర్శనానికి వేచిచూసిన అదే వాకిలి గుండా వెళ్ళి దర్శనం చేసుకోవడానికి నేను ఎంత అదృష్టవంతుడినో కదా.. ఎంత పుణ్యం చేస్కుంటే ఈ మహద్భాగ్యం నాకు దక్కుతుందోకదా.. అని ఆలోచిస్తూ ఎప్పుడు ఆ మహద్వారం గుండా నా స్వామి దర్శనమౌతుందా అని తల ఎత్తి చూస్తూ ’గోవిందా.. గోవిందా..’ అని తన్మయత్వంగా పిలుస్తూ నడుస్తుంటే... క్యూ మలుపు తిరిగింది...

ఆహ్హ... అడుగో నా స్వామి... వజ్రకిరీటపు ధగధగలూ, తొడిగిన బంగారు ఆభరణాల తళుకులూ ఆ దివ్యమంగళ మూర్తి చిరునవ్వు వెలుగుల ముందు వెలతెలా పోతున్నాయ్ కదా... అవిగో నాస్వామి దుష్టశిక్షణకు శిష్టరక్షణకూ ఉపయోగించే శంఖు చక్రాలవిగో... అదిగో ఆ విశాలమైన హృదయముపైనే కదా లక్ష్మీదేవి విశ్రమించేది, అవునూ ఏదీ నా స్వామి వరద హస్తమేదీ? కౌస్తుభ మేదీ... అయ్యో ఇదేమి చిత్రం? ఎనిమిదడుగుల నిలువెత్తు స్వామి నిండువిగ్రహాన్ని దర్శించుకోనివ్వకుండా మొహం మాత్రమే కనిపించేలా లైట్లు పెట్టారా ? స్వామి పూర్తిగా నిండైన రూపంతో దర్శనమివ్వరా ? అయ్యో ఇదెక్కడి చోద్యమయ్యా ఇన్నినాళ్ళ తర్వాత నిన్ను చూద్దామని వస్తే దర్శనభాగ్యాన్ని కలిగించకపోతే ఎలా స్వామీ అని ఆలోచిస్తూ రెప్పలార్పి మళ్ళీ చూద్దునుకదా నా స్వామి నిండైన రూపంతో వరద హస్తంతో పద్మ పాదాలతో సహా దరిశనమిచ్చాడు. ఆ రూపాన్ని కనులనిండుగా నింపుకునేలోపు లిప్తలో మాయమయ్యాడు. ఒక్కసారిగా ఒళ్ళంతా పులకింతకు గురైంది ఏదో తెలియని శక్తి ఆవహించినట్లై ఒక దివ్యమైన అనుభూతికి లోనయ్యాను.

అహా అక్కడున్నది రాతి విగ్రహం కాదు కోరిన వరాలిచ్చి పాపాలను ప్రక్షాళనగావించి మోక్షాన్నిప్రసాదించే సాక్షాత్ శ్రీమన్నారాయణుడే కదా. అందుకే అభిషేక సమయాన ఆ స్వామికి చెమటపడుతుంది, పుష్పాలంకరణ చేసే అర్చకులకు కఱకురాతి స్పర్శ కాక మృదువైన మనుషశరీర స్పర్శ అనుభూతిలోకొస్తుంది. ఏడుకొండలవాడా వేంకటరమణా గోవిందా గోవిందా అని అనుకుంటూ ఇవతలకి వచ్చేశాను. శ్రీవారి పోటు వద్ద వకుళమాతను దర్శించుకుని ఆ పక్కన తీర్ధప్రసాదాలారగించి పరకామణిని మరోమారు ఆశ్చర్యంగా పరికించి చూసి విమాన వేంకటేశ్వరుని దర్శించుకుని భక్తితో మొక్కి, ఆ పక్కన ఉన్న హుండీలో శక్తికొద్ది సమర్పించుకుని ఆనందనిలయ ప్రాంగణం నుండి బయటికి వచ్చి అక్కడ ఇచ్చిన చిన్నలడ్డు ప్రసాదాన్ని స్వీకరించాను. శ్రీవారి దర్శనమై బయటికి రాగానే పక్కన రెండు స్టీలు హుండీలు పెట్టారు కానీ గుడి చుట్టి ప్రదక్షిణ చేసి విమాన వెంకటేశ్వరుని దర్శించుకున్నాక ఎప్పటినుండో ఉంటున్న ఖజానాకు సంబంధించిన హుండీ ఉంటుంది. సాధారణంగా స్వామికి సమర్పించుకునే మొక్కులు ఈ హుండీలోనే వేస్తారు.     

అలా స్వామి దివ్యదర్శనాన్ని ముగించుకుని మనసులో ఆ రూపాన్ని మళ్ళి మళ్ళీ గుర్తు చేసుకుంటూ లడ్డూ ప్రసాదాల కౌంటర్ వైపు నడిచాను మిగిలిన వివరాలు మూడో టపాలో.

సోమవారం, జూన్ 04, 2012

శ్రీశ్రీనివాసం శిరసా నమామి - 1

ఆ ఆపద మొక్కుల వాడిని తలచుకోగానే నాకు ముందు గుర్తొచ్చేది తిరుమలలోని రద్దీనే... నేను ఇలా భయపడతాను కనుకనే ఏమో నేను ఎపుడు దర్శనానికి వెళ్దామనుకున్నా విపరీతమైన రద్ది ఉంటుంది. వెళ్ళి వచ్చిన తెల్లారి పేపర్ చూస్తే “తిరుమలలో పెరిగిన రద్దీ” అంటూ వార్త వస్తుంటుంది. అప్పటికీ రెండు వారాలక్రితం నేను ఇలా వెళ్దామనుకున్నపుడు బ్లాగ్ మిత్రులు శంకర్ గారు “ఇప్పుడు విపరీతమైన రద్దీ ఉంటుందండీ ఒక్క రెండువారాలు, స్కూల్స్ తీసేవరకూ ఆగడం మంచిది” అని సలహా ఇచ్చారు కానీ ఆస్వామి ఆజ్ఞ అయితే కాదని వాయిదా వేయడానికి మనమెవరం? అదీ కాక ఇంచుమించు పుష్కరకాలం తర్వాత వెళ్ళాలని బుద్దిపుట్టింది అనుకుని, శంకర్ గారి వద్ద కొన్ని సందేహాలు నివృత్తిచేసుకుని మరికొంత సమాచారం సేకరించి ఆమర్నాడే ఒంటరిగా తిరుమలకు బయలు దేరాను. నాకు మనసులో దర్శనానికి వెళ్ళాలని అనిపించినా ఆస్వామే శంకర్ గారి రూపంలో నాల్రోజులు ఆగి వెళ్లమని సలహా ఇచ్చారని నాకు ఆక్షణంలో తోచలేదు.

పుష్కరకాలం క్రితం నాలుగైదు సార్లు దర్శనానికి వెళ్ళినా కార్లు, పరివారం, రికమెండేషన్ లెటర్లు, ఇతరత్రా  హంగులతో వెళ్ళి వచ్చే వాడ్ని కనుక నాకు ఎపుడైనా క్యూకాంప్లెక్స్ లో వెయిటింగ్ తప్ప మరో నొప్పి తెలిసేది కాదు. ఈసారి మాత్రం ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా సామాన్యుడిగా దర్శనానికి వెళ్ళాను. ఇలా ఏవిధమైన ఏర్పాట్లు లేకుండా వెళ్ళాలి అనుకున్నవాళ్ళకి ఉపయోగపడుతుందని అన్ని వివరాలతో టపా రాస్తున్నాను. ఇవన్నీ తెలిసిన వారిని ఈ టపా విసిగించవచ్చు గమనించగలరు.

ఆన్లైన్ రిజర్వేషన్ల పుణ్యమాని గుంటూరునుండి బయలుదేరే బస్సులో సీట్ దొరికింది, సాయంత్రం ఐదుగంటలకు వెచ్చని వడగాలులు మొహం మీద కొడుతూ మంటలు పుట్టిస్తుండగా పదినిముషాలకోసారి ఓ గుక్క మంచినీళ్లతో నాలుక తడుపుకుంటూ బస్సులో కూర్చున్నాను. రాత్రి పన్నెండు గంటలకు చేరుకోవాల్సిన బస్సు ఒకటిన్నరకి చేరుకుంది. బస్సుదిగి వాకబు చేస్తే కొండమీదకి బస్సులు నాలుగ్గంటలనుండి దొరుకుతాయని అన్నారు. ప్రైవేట్ వాహనాలపై సదభిప్రాయం లెని నేను ఆర్. టి. సి. బస్సుమాత్రమే ఉపయోగించాలని నిర్ణయించుకున్నాను. తిరుమల వెళ్ళే బస్టాండ్ కు చేరుకుని  కాలకృత్యాలు తీర్చుకునే సరికి రెండు గంటలనుండే కొండ మీదకి వెళ్ళే బస్సులకు టిక్కెట్లు ఇష్యూ చేయడం మొదలెట్టారు. ఒకవైపు ప్రయాణానికి 34రూ.లు వెళ్ళిరావడానికి 62రూ.లు టిక్కెట్. అదేరోజు తిరిగిరావాలనే రూల్ ఏమీలేదు. రిటర్న్ టిక్కెట్ కొని బస్సెక్కి కూర్చున్నాను. పదినిముషాల్లో బయల్దేరిన బస్సును మరో పదినిముషాల్లో అలిపిరి గేట్ వద్దకు తీసుకు వెళ్లి ఆపేశాడు.  

అక్కడ తెలిసిన విషయమేమిటయ్యా అంటే తిరుమల వెళ్ళే ఘాట్ రోడ్ రాత్రి పన్నెండు గంటలనుండి మూడుగంటల వరకూ మూసి వేస్తారు. ఐతే కొంత టైం సేవ్ చేస్కోడానికి బస్సులు రెండింటి నుండి తిరుపతిలో బయల్దేరి గేట్ ముందు నిలుపుతారుట. తిరుపతి వచ్చేవరకూ కూడా వడగాడ్పులు అల్లాడించినా అలిపిరి దగ్గరకి వచ్చేసరికి చల్లని గాలి తగలడం మొదలైంది. ఆ చల్లగాలుల ద్వారా పచ్చని చెట్ల ఆవశ్యకతను ప్రకృతి మరోసారి స్పష్టంగా తెలియజేసినట్లు అనిపించింది. దదాపు అరగంట టైం ఉండటంతో బస్సుదిగి చుట్టుపక్కల కాస్త తిరిగి సైకిల్ పై పెట్టుకుని అమ్ముతున్న ఒక మాంచి మసాలా టీ తాగేసరికి గేట్ తీశారు. బస్సులోని ప్రతిఒక్కరు కూడా లగేజ్ తో దిగి సెక్యూరిటీ చెక్ కి వెళ్ళాలి, బ్యాగ్ ను స్కానర్ పై ఉంచి మనం మెటల్ డిటెక్టర్ గుండా వెళ్ళాలి. బస్సుప్రయాణీకులను సైతం ఇలా చెక్ చేయడం బాగానే ఉంది కానీ కొందరు చేతి సంచులను సీట్ కింద వదిలేయడం గమనించాను బాధ్యతగా అన్నిటిని స్కాన్ చేయించేలా చూడాల్సిన డ్రైవర్ స్టీరింగ్ వీల్ వదిలి పక్కకి కూడా రాకపోవడం నాకు నచ్చలేదు, మొత్తంమీద అదో మొక్కుబడి వ్యవహారంగా మాత్రమే అనిపించింది. 

తిరుమలలో బస్సు దిగి నాలుగు అడుగులు వేయగానే రోడ్ మీదున్న ఒకరిద్దరు వ్యక్తులు ప్రయాణీకులకు సమాచారాన్ని ఇస్తుండడం గమనించాను ఓహో ఇంత తెల్లవారుఝామునే నిస్వార్ధంగా భక్తులకు సేవచేయడం ఎంత మంచి విషయం అని వాళ్ళదగ్గరకు వెళ్ళి కళ్యాణకట్ట (తలనీలాలు ఇచ్చే చోటు) కోసం ఏటువైపు వెళ్ళాలి ? రూంకావాలంటే ఎక్కడ తీస్కోవాలి ఇతరత్రా వివరాలు అడిగాను. వాళ్ళు సమాధానం దాటవేసి రండి నేను తీస్కెళ్తాను ముందు ఈ బిల్డింగ్ లోపలికి వెళ్తే అక్కడ మీకో ఫోటో తీస్తారు అది తీస్కుని కళ్యాణకట్టకి వెళ్తే అక్కడ గుండు కొడ్తారు అని చెప్పడం మొదలెట్టారు. ఏం ఫోటో? ఎందుకు ? అని వివరాలు అడిగితే వాళ్ళు ఆకాంప్లెక్స్ లోని చిన్న చిన్న ఫోటో స్టూడియోల దళారులని బేరాలకోసం అక్కడ నిలబడి వచ్చిన యాత్రీకులకి కబుర్లు చెప్పి తీస్కెళుతున్నారని అర్ధమైంది. నాకేఫోటో అక్కర్లేదు నేనూ మార్గదర్శిలో చేరాను ఓ మైసూర్ కెమేరా కొనుక్కున్నాను అని చెప్పి పక్కనే ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ ని వివరాలు కనుక్కుని రూంకోసం వెళ్ళాను.

ఆ రద్దీలో పేవ్మెంట్స్ మీద పడుకున్న జనాలని చూశాక రూం దొరుకుతుందన్న ఆశ అణుమాత్రమే ఉన్నా అదృష్టాన్ని పరీక్షించుకుందామని బ్యాగ్ మోస్కుంటూ అడ్మిన్ ఆఫీస్ దగ్గరకు వెళ్ళేసరికి ఒంటరి పక్షులకు రూములివ్వబడవు అని పెద్ద పెద్ద బోర్డులు వెక్కిరిస్తూ కనిపించాయ్. మేమంటే మీక్కూడా చులకనేనా స్వామీ ఏమిటీ అన్యాయం అని అనుకుని ఈసురోమంటూ కాళ్ళీడ్చుకుంటూ తిరిగి కళ్యాణకట్ట వద్దకు బయలు దేరాను. దారిలో నేను గమనించినదేమంటే తిరుమలలో తెల్లవారుఝాము మూడున్నరలాగానేలేదు దదాపు యాభై శాతం దుకాణాలు హోటల్స్ అన్నీ తెరిచే ఉన్నాయి, రోడ్డుపకన్న పడుకొనేవాళ్ళు, దుకాణాల్లో కొనేవాళ్ళు హోటల్స్ లో తినేవాళ్ళు ఎవరిదారి వారిదే అన్నట్లున్నారు. దారిపక్కన బొమ్మలు అమ్మే అతనితో మాటకలిపి ఏంటిబాబు ఇలా ఇరవైనాలుగ్గంటలూ ఇక్కడే ఉంటావా తిండీ నిద్ర పరిస్థితి ఏంటి అని అడిగాను. మరి పూటగడవాలంటే తప్పదుగదండి బేరాల టైంలో తెరవకపోతే ఎట్టా కుదురుద్ది. రాత్రి డూటీ నేను చేస్తాను ఈ టైంలో కూడా దరిదాపు పగలున్నంత బేరాలు ఉంటాయ్ తెల్లారినాక మాఅన్న వస్తాడు అని జవాబిచ్చాడు.

కళ్యాణకట్ట వద్ద అప్పటికే (ఉ.4:00 గం.లు) పేద్ద క్యూ ఉంది. మళ్ళీ ఒక అరకిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళి క్యూలో జాయినయ్యాను. మాములుగా దర్శనం కోసం క్యూలోకి వెళ్ళే ముందే చెప్పులు బయట బద్రపరచాల్సి ఉంటుంది కానీ కళ్యాణకట్టకి వెళ్ళేప్పుడు మాత్రం క్యూ లోపలే సగం దూరం వెళ్ళాక ఉచితంగా చెప్పులు భద్రపరిచే కౌంటర్ వస్తుంది. అక్కడ ఇచ్చేసి టోకెన్ తీస్కుని పని అయ్యాక బయటకి వచ్చి కలెక్ట్ చేస్కోవచ్చు. తిరుమలలోని ఇలాంటి కౌంటర్స్ అన్నిటిలోనూ ఉచితంగా భద్రపరిచే అవకాశమున్నాకూడా ప్రతిఒక్కరు ఏదో మీకు తోచినంత ఇవ్వండి సార్ చాయ్ కాఫీకి అంటూ వసూలు చేస్తూనే ఉంటారు. ఒక్కటే గుడ్డిలో మెల్ల ఏంటంటే రుబాబు చేసి వసూలు చేసే పద్దతిలేదు. వాళ్ళు చూసే చూపులు తట్టుకోలేని వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు లేదంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు.  

తిరుమలలో నేను గమనించినది మరొకటి ఏమిటంటే క్యూలు విశాలమే కానీ మనుషుల మనసులే ఇరుకు.  క్యూలన్నీ కూడా చాలా విశాలంగా ఒకేసారి ముగ్గురు పక్కపక్కన నిలబడటానికి వీలుగా పెద్దగా ఉన్నాయ్ కానీ మనుషులు మాత్రం అందులో మూడులైన్లు ఫాం చేసేసి ఒకళ్ళమీద ఒకళ్ళుపడిపోయి తోసుకుని నానా ఖంగాళీ చేసేస్తున్నారు. ఎవరికి వారు ఎదురు చూపులవలన చిరాకులో ఉన్నారో తొందరలో ఉన్నారో కానీ ఊపిరాడనంత తొక్కిడి కొంచెం ఉక్కిరిబిక్కిరి చేసింది. కళ్యాణకట్ట క్యూలలో ఎక్కడో ఒక్కచోట మంచినీళ్ళ కుళాయి తప్ప ఫెసిలిటీస్ ఏమి లేవు మంచినీళ్ళ బాటిల్ వెంట తీసుకెళ్ళడం మంచిదైంది. క్యూలో రెండున్నరగంటలు పైగా నుంచుని ఎదురుచూశాక కంపార్ట్మెంట్స్ లోకి వదిలాడు. అక్కడి కబుర్లు ఇతర సౌకర్యాల గురించి దర్శనానికి సంబంధించిన కబుర్లు మరొక టపాలో చెప్పుకుందాం. అంతవరకూ నాతోపాటు మీరుకూడా గోవింద నామస్మరణ చేసుకోండి.

సోమవారం, ఏప్రిల్ 23, 2012

దేవస్థానం సినిమా గురించి

శ్రీమన్నారాయణ(కె.విశ్వనాథ్) గారికి దేవస్థానమే ఇల్లు, జీవిత చరమాంకంలో ఎవరూతోడులేని ఆయన ఎక్కువ సమయం దైవసన్నిధిలోనే గడుపుతూ ఉంటారు, సాగరమల్లే తొణకని నిండైన వ్యక్తిత్వం, పురాణాలపై ఆధ్యాత్మిక విషయాలపై పట్టు, భారతీయ కళల పట్ల మక్కువ ఆయన సొంతం. సాంబమూర్తి(బాలసుబ్రహ్మణ్యం)కి ఇల్లే దేవస్థానం పెళ్ళై ఇరవైఏళ్ళైనా పిల్లలులేక భార్యలోనే కూతురును కూడా చూసుకుంటూ ఇల్లూ తానుపనిచేసే షాపు తప్ప మరో లోకం తెలియకుండా చంటిపిల్లాడిలా సరదాగా చలాకీగా ఉండే మనిషి. సాంబమూర్తి భార్య(ఆమని) భర్తని ప్రేమగా చూసుకుంటూ ఆయనకు అన్నివిధాలుగా చేదోడువాదోడుగా నిలిచే అనుకూలవతి అయిన ఇల్లాలు.
“ప్రతి మనిషినీ కంటిపాపతో కాక పాపకంటితో సందర్శించాలి, ప్రతిమనిషిని ప్రేమించాలి ప్రపంచాన్ని ప్రేమించాలి. అపుడందరూ నీవాళ్ళవుతారు.” 
ఓరోజు గుడిలో ఉచితంగా నాట్యంనేర్పించే ఓ అమ్మాయి సందేహ నివృత్తిలో భాగంగా “జననం ఎలా ఉన్నా జీవనం గొప్పగా ఉండాలి మరణం అంతకన్నా మహోన్నతంగా ఉండాలి” అని చెప్పి గుడినుండి ఇంటికి వెళ్ళే దారిలో శ్రీమన్నారాయణ గారు ఓ అనాథ శవాన్ని చూస్తారు. ఆ శవాన్ని మున్సిపాలిటీ వాళ్ళు చెత్తతోపాటు ఊరిచివరకు తీసుకు వెళ్ళి తగలబెట్టటం చూసి ఆయన మనసు వికలమౌతుంది. ఎవరూలేని తాను మరణించిన తరువాత తనగతీ ఇంతే అవుతుందనే దిగులుతో తనకి శాస్త్రోక్తంగా అంత్యక్రియలు జరిపించుకోడానికి డబ్బు నిలువచేసి అన్ని ఘనంగా ఎలా చేయాలో ప్లాన్ చేసుకుని తలకొరివి పెట్టే వారికోసం అన్వేషణ మొదలెడతారు. అలాంటి సమయంలో సాంబమూర్తి మన శ్రీమన్నారాయణ గారి కంట పడతాడు. తనకి తలకొరివి పెట్టడానికి సాంబమూర్తే సరైన వ్యక్తని నిర్ణయించుకుని అతనిని ప్రాధేయపడటం మొదలు పెడతారు. అయితే సాంబమూర్తి ఈ వింతకోరికని విని మొదట తిరస్కరించినా భార్య నచ్చచెప్పడంతో అంగీకరిస్తాడు.

 

సాంబమూర్తితో “ప్రతి ఉదయం వచ్చి పలకరించి ప్రసాదం ఇచ్చివెళ్తాను ఏ ఉదయమైతే నేను రాలేదో ఆరోజు నేను లేనట్టు భావించి నీకర్తవ్యం నిర్వర్తించు” అని చెప్తారు శ్రీమన్నారాయణ. అలా మొదలైన వారి చెలిమి కొనసాగుతుండగా సాంబమూర్తికి శ్రీమన్నారాయణ గారు హరికథాభాగవతులనీ వారి వంశమంతా తరతరాలుగా హరికథలు చెప్పడంలో పేరుపొందిన వారనీ తెలుస్తుంది. నాకోసం దసరా ఉత్సవాలకు గుడిలో హరికథ చెప్పాలని  ఒత్తిడి చేసిన సాంబమూర్తికి అతను ఈతరానికి సరిపోయేలా హరికథ రాస్తేనే చెప్తానని కండీషన్ పెడతారు శ్రీమన్నారాయణ గారు. హరికథ వ్రాయించడంలో గురువు పాత్రపోషించి సాంబమూర్తితో చక్కని హరికథలు రాయించి గానం చేస్తారు. వారి హరికథలూ, వారు భక్తుల సందేహాలకు ఇచ్చిన సమాధానాలను విని ప్రభావితమైన ఓ లాయర్ ఐదుకోట్ల నిధితో “సర్వేజనా సుఖినోభవంతు” ట్రస్ట్ ఏర్పాటు చేసి దేవస్తాన పునరుద్దరణకూ అర్చకులకు సహాయం చేయడానికి, ఆదరణ కోల్పోతున్న కళారూపాల ప్రాచుర్యానికీ పాటుపడాలని కోరుతూ వీరిద్దరినీ ట్రస్టీలుగా నియమిస్తారు. వారిద్దరూ ఈ హరికథలను స్కూళ్ళలోనూ ప్రతిఊరిలోనూ చెప్తూ ప్రాచుర్యం కల్పిస్తారు.
“మనిషి మారడానికి గొప్ప గ్రంథాలు చదవక్కర్లేదు, పెద్ద సంఘటనలు జరగక్కర్లేదు. మంచి మనుషులు చెప్పే ఒక్క మంచి మాట చాలు”
అలా తన స్వార్ధం తన సరదా తప్ప సమాజం గురించి ఆలోచించని సాంబమూర్తి శ్రీమన్నారాయణ చెలిమితో జీవి యొక్క పరమార్ధాన్ని కనుగొని తనకా బ్రహ్మోపదేశం చేసిన శ్రీమన్నారాయణ గారిని తండ్రిగా గౌరవించి తలకొరివి పెడతాననడంతో.. శ్రీమన్నారాయణ గారు కూడా లాయరూ, సాంబమూర్తి అందరూ తనమాటలు విని మారుతున్నారు కానీ తనకే ఇంకా జ్ఞానోదయం కాలేదని తెలుసుకుని “పరోపకారార్ధం ఇదం శరీరం” అని గుర్తుచేసుకుని, మనిషి చనిపోయినపుడు అంత్యక్రియలకు ఘనంగా పెట్టే ఖర్చు మరొక మనిషి బ్రతకడానికి ఉపయోగపడటంకన్నా పరమార్ధం లేదని గ్రహించి తన అంత్యక్రియలకోసం దాచుకున్న డబ్బును కూడా ట్రస్టుకు ఇచ్చివేసి సాంబమూర్తితో కలిసి మానవసేవలో ముందుకు వెళుతున్న తరుణంలో ఓ అనూహ్యమైన మలుపుతో సినిమా ముగుస్తుంది.

గంటాయాభై నిముషాల నిడివిగల ఈ చిత్రం నాకు ఎక్కడా బోర్ కొట్టలేదు. అందుకు ఒక కారణం చిత్రం నిడివి మరొక కారణం వీనుల విందైన సంగీతం అయితే అసలు కారణం బాలు విశ్వనాథ్ ల మీదున్న అమితమైన ప్రేమ. సాంబమూర్తి పాత్ర స్వభావానికి తగ్గట్టుగా బాలు కాస్త అల్లరిగా ఉండటం ఆమనితో సరసాలు మాములుగా సినిమా చూసేవారికి కాస్త ఇబ్బంది కలిగిస్తాయి ఈ వయసులో ఏంటి ఈయన వేషాలు అని. కానీ సాంబయ్య చిన్నపిల్లాడి మనస్తత్వం ఆ ఆలూమగల మధ్య అనురాగాన్ని అర్ధం చేసుకోగలిగితే నాకు ఎబ్బెట్టుగా అనిపించలేదు. నాకు ఆయన మీదున్న అమితమైన ఇష్టం కూడా ఒకకారణం కావచ్చు. ఈ ఒక్క విషయాన్ని భరించగలిగితే ఓ కమ్మటి సినిమా చూసిన అనుభూతిని మిగులుస్తుంది. నటీనటుల నటన గురించి చెప్పనే అక్కర్లేదు సినిమా పూర్తయ్యాక కొందరు మనుషుల జీవితాల్లోకి తొంగి చూసిన అనుభూతి కలిగింది. లొకేషన్స్ సెట్టింగ్స్ హంగులూ ఆర్భాటాలు లేని ఈ సినిమా చూడటం కంటికి హాయిగా ఉంది.
"స్వాతంత్రం తెచ్చిపెట్టిన మహాత్మాగాంధీ లేదా ఎక్కడినుండో ఈ దేశంవచ్చి ఎందరికో సేవ చేసి తరించిన మదర్ థెరిసా అంత ఘనంగా ప్రతి ఒక్కరు చేయలేకపోవచ్చు. చీమకు రెండు చక్కెరపలుకులు వాడిపోతున్న మొక్కకి రెండు నీటిచుక్కలు చల్లితే చాలు అదే ధన్యత."
ఇతర సాంకేతిక శాఖలన్నీ ఎవరి విధి వారు నిర్వర్తించినట్లుగా సరిగ్గా సరిపోయాయి అనిపించినా స్వరవీణాపాణి సంగీతం గురించి మాత్రం ఒక్కసారి ప్రస్థావించి తీరాల్సిందే.. చాలారోజులకు హాయైన సంగీతం విన్న అనుభూతి ఈ ఆడియో విన్నపుడు కలిగింది ఈ సినిమాకు అతి పెద్ద ప్లస్ పాయింట్ ఆ సంగీతమే. నేపధ్యసంగీతం సన్నివేశాలకు తగ్గట్టు మూడ్ ని ఎలివేట్ చేస్తే మధ్య మధ్య వచ్చే ఐదు పాటలు రెండు హరికథలు అద్భుతంగా అనిపిస్తాయి. ఈ పాటల గురించి ప్లస్ సాహిత్యం కోసం నా పాటల బ్లాగ్ లో ఇక్కడ చూడండి.
“మనిషి జీవించినంతకాలం పరులకోసమే బ్రతకాలి”
“జననం ఎలా ఉన్నా జీవనం గొప్పగా ఉండాలి”
"జీవించి ఉన్న కాలంలో మనిషిచేసే మంచి పనుల పరిమళం మాత్రమే శాశ్వతం." 
“అతనికి ఊరినిండా స్థలాలే.. పెళ్ళాంగుండెలో తప్ప.”
“ఎందుకు ఏడుపు? ఎవడు పోయాడటా??.. పక్కింటి వాడు ఎదిగి పోయాడట.”
మనిషి మనసే దేవస్థానం అయితే ప్రతిదానిలోనూ దేవుని దర్శించుకోగలడనీ, మన శరీరంలోని ప్రతి అవయవం ఎంత విలువైనవో వాటిని సక్రమంగా వినియోగించుకోగలిగిన మనిషిని మించిన అదృష్టవంతుడు లేడంటూ చెప్పిన సంభాషణలు, ఇంకా సినిమా అంతటా అక్కడక్కడా సందేహ నివృత్తి ద్వారా చిలకరించిన సూక్తులు కొన్ని చాలా నచ్చాయి. సినిమా అయ్యాక ఒక మంచి ప్రయత్నాన్ని నావంతు బాధ్యతగా టిక్కెట్టుకొని థియేటర్లో చూసి ప్రోత్సహించానన్న తృప్తితో ఓ మంచి సినిమా చూశానన్న సంతోషంతో బయటకి వచ్చాను. హాలు మొత్తానికి ఒక ఇరవై మందికి మించి లేకపోవడం కాస్త నిరాశ పరిచినా వారం తర్వాత అదీ సెకండ్ షోకు గుంటూరులో ఆ మాత్రమైనా జనం వచ్చి చూసినందుకు ఆనందించాను.

శనివారం, ఫిబ్రవరి 25, 2012

ఇష్క్ సినిమా గురించి చిత్రమాలికలో

హింసా రక్తపాతాలకు దూరంగా కుటుంబ విలువలకు ప్రాధాన్యతనిచ్చే ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీని చిన్న చిన్న లాజిక్ తప్పులను క్షమించేసి, అందమైన సినిమాటోగ్రఫీనీ, మోతాదు మించని నటనను శృతిమించని సునిశితమైన హాస్యాన్నీ చూసి ఎంజాయ్ చేయగలను అనుకుంటే ఈ సినిమా మీకోసమే. చిత్రమాలిక కోసం నేను రాసిన ఇష్క్ సినిమా సమీక్ష పూర్తిగా ఇక్కడ చదవండి. 


ఆదివారం, ఫిబ్రవరి 12, 2012

పదాలకు సరదా అర్ధాలు

మొన్న ఒక రోజున టీవీలో సొంతం సినిమా కామెడీ బిట్స్ చూస్తూ ఇలాంటి పదాలు ఇంకా ఎమున్నాయో అని ప్లస్ లో మిత్రుల సాయమడిగితే అందరూ కలిసి ఇదిగో ఈ లిస్ట్ తయారు చేశారు. పదాలను అందించిన మిత్రులు అందరికీ ధన్యవాదాలు. మీకు కూడా ఇంకా ఏవైనా కొత్త అర్ధాలు గుర్తోస్తే ఇక్కడ కామెంట్స్ లో పంచుకోండి. రెండ్రోజుల తర్వాత అన్నీ కలిపి బ్లాగ్ పోస్ట్ అప్డేట్ చేస్తాను. 

దుర్గతి = దుర్గకి పట్టిన గతి
బీట్ రూట్ = బీటేసే రూటు
మేనత్త = మే నెల్లో పుట్టిన నత్త
--సొంతం సినిమా నుండి..

ఇంకా ఇలాంటి సరదా అర్ధాలు మీరు విన్నవీ అన్నవీ ఏమైనా ఉంటే చెప్పండి.. సరదాగా కలెక్ట్ చేద్దారి :-)

ఇంజనీర్ :: ఇంజన్లో నీరు పోసేవాడు
సైక్లోన్ :: సైకిల్ కొనడానికి తీసుకునే లోన్..
బాట్‌మేన్ :: బాట్ పట్టుకుతిరిగేటోడు...
భీరుడు :: బీరు తాగేటోడు
చందమామ :: చందాలు అడిగే మామ
సీతమ్మతల్లి :: సీత వాళ్ళ అమ్మ వాళ్ళ తల్లి.
సైలెన్స్ :: సైలు పెట్టుకునే లెన్స్.
భారతీయుడు :: భారతీ నువ్వు చెయ్యి. (భారతీ you do)
క్యాపిటలిస్టు :: క్యాప్ పెట్టుకునేవాడు
మార్క్సిస్ట్ :: మార్కులు వేసేవాడు
జీనియస్ :: జీన్స్ వేసుకున్న వాడు
లైట్ హౌస్ :: తేలికైన ఇల్లు
పంచ పాండవులు :: పంచె కట్టుకునే పాండవులు
డ్రాయర్ :: డ్రా చేసేవాడు
మార్క్సి(ర్క్స్+ఇ)స్ట్ :: మార్కులు ఇష్టపడి వాటికోసం కష్టపడేవాడు
మావోయిస్టులు :: మా ఆవుకి ఇష్టులు (కుమ్మడానికి)
షోలే :: (ఈరోజు) షో లేదు.
బ్లాగరు :: (వెబ్ లాగరు) - వెబ్బుని లాగే వాడు
ప్రసాదు :: ప్రభుత్వ.సారాయి.దుకాణం
వెదవ :: వెయ్యేళ్ళు దరిద్రంతో వర్ధిల్లు.
వెధవ :: వెయ్యేళ్ళు ధనంతో వర్ధిల్లు
షేక్స్పియర్ :: షేకు S పీరు సాయెబ్బు గారు
సాంబార్ :: సాములోరి బార్
కుక్కరు :: కుక్క అరుపు
రాంబస్ :: రాము గాడి బస్సు
దోమ :: రెండు 'మ' లు
బెంగాలి :: బెంగ పెట్టుకున్న ఆలి
బిల్ గేట్స్ :: బిల్లు కట్టకుండా గేట్ దూకి పారిపోయే వాడు.
దూర దర్శన్ :: దర్శనానికి దూరంగా ఉండవలసినది.
బుక్‌మార్క్ :: బుక్ షాప్ మార్క్ గాడు
డయేరియా :: చచ్చే ఏరియా or చచ్చిన జనాల ఏరియా (స్మశానం)
సోదరా :: సోది ఆపరా :-)
వైఫ్ :: వైట్ బ్లఫ్ (అంటే white lies అంటారు కదా, అలా అన్న మాట :-))
దూర్వాసుడు :: దూరంనుంచే వాసనొచ్చేవాడు...(బహుశ కోపం వాసననుకోవచ్చేమో)
కాంతారావు :: కాంతా రావూ?
హర్ నాథ్ :: హర్ (ప్రతీ ఒక్క) నాథుడు
బ్లాగు :: బాబు లాగు
ముంతాజ్ :: తాజాగా ఉన్న ముంత
బ్లాగ్ ఫ్రెండ్స్ చెప్పిన లిస్ట్ :
హోమియోపతి :: హోమ్ లోనే ఉండే పతి
కులాసా :: కుమారుడి వల్ల లాసు
కవి :: కనపడదు వినపడదు
పంచ దార :: ఐదుగురి భార్య
శ్రీకాంత్ :: శ్రీ కి అంతం
పాణి గ్రహణం :: పాణి కి గ్రహణం పట్టడం
పల్లె టూరు :: పల్లెకు టూరు వెళ్ళడం
సైకాలజీ :: సైకిలు గురించి చెప్పే శాస్త్రం
శిశుపాలుడు :: శిశువులకి పాలిచ్చేవాడు
ప్రియానందభోజా :: ప్రియ పచ్చడితో ఆనందంగా భోజనం చేసే వాడు
ఎగ్జాం :: ఎగ్గ్+జాం
లేపాక్షి :: పాక్షికంగా లేచినది.
మెడల్ :: మేడలో వేసుకోనేది.
ఆల్జీబ్రా :: అన్ని జీబ్రాలు
శ్రీశ్రీ గారు చెప్పిన అర్ధం
నిర్మాత :: మాత లేనివాడు.

ఆదివారం, జనవరి 22, 2012

అమ్మ లేని మరో ఏడాది.

నేనున్నానని భరోసానిస్తూ... గట్టిగా పట్టుకుంటే నా చేయి ఎక్కడ కందిపోతుందోనని మృదువుగా నా మణికట్టును తన అరచేతిలో పొదవి పట్టుకున్న అమ్మచేతి నులి వెచ్చని స్పర్శను ఇంకా మరువనేలేదు... మా అమ్మ అచ్చంగా నాకే సొంతమని లోకానికి చాటి చెబుతూన్నట్లుగా.. నా అరచేతిని బలంగా తనచేతివేలి చుట్టూ బిగించి పట్టుకున్న బిగి సడలినట్లే లేదు... తను ఎప్పుడూ నాతోనే ఉండాలన్న నా ఆలోచన గమనించలేదో ఏమో!! అమ్మ నా చేతిని విడిపించుకుని  నన్ను వీడి వెళ్ళిపోయి అప్పుడే మూడేళ్ళు గడిచిపోయాయి !!

గడచిన ఈ మూడేళ్ళలోనూ ఏరోజుకారోజు రేపటికన్నా అలవాటౌతుందిలే అని అనుకుంటూ పడుకుంటానే కానీ ఇంతవరకూ ఏ ఒక్కరోజూ ఆ అమ్మలేని తనం ఇంకా నాకు అలవాటు కాలేదు... ఇక ఎప్పటికైనా అలవాటు అవుతుందన్న నమ్మకం కూడా రాను రాను సన్నగిల్లుతుంది. తను లేదన్న నిజం అప్పుడప్పుడు గుచ్చుకుంటున్నట్లుగా తెలిసే కొద్దీ కళ్ళు చెమ్మగిల్లుతూనే ఉన్నాయి... 

కానీ అంతలోనే ఆకాశానికేసి చూసినపుడు లెక్కకు మిక్కిలిగా ఉన్న ఆ నక్షత్రాలలో అమ్మ ఏ నక్షత్రంగా మారి పైనుండి నన్ను మురిపెంగా చూసుకుంటుందో అని అనిపించి సాంత్వనతో మనసు కుదుటపడుతుంది. తనను సంతోషంగా ఉంచడానికైనా నేను నవ్వుతు తుళ్ళుతూ ఆనందంగా ఉండాలన్న కర్తవ్యం గుర్తుకొస్తుంది.

అమ్మ మమ్మల్ని వదిలివెళ్ళి నేటికి మూడేళ్ళు(జనవరి22, 2009) అయిన సంధర్భంగా "అమ్మా మేమిక్కడ నీ ఙ్ఞాపకాలతో నీవు నిర్దేశించిన మార్గంలో పయనిస్తూ సంతోషంగా ఉన్నాము.. నువ్వుకూడా ఏలోకాన ఉన్నా నీ ఆత్మకు సుఖశాంతులు చేకూరాలని మనసారా కోరుకుంటున్నాము" అని తనకు చెప్పాలని ఈ పోస్ట్. 

వ్యాఖ్యాతలకు గమనిక : ఈ పోస్ట్ కు వచ్చే కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.... 
అప్డేట్ : 28/1/2012 ఈ పోస్ట్ కామెంట్స్ డిజేబుల్ చేయబడినవి మీ వ్యాఖ్యను తెలియజేయాలనుకుంటే ఈ బ్లాగ్ పైన సోషల్ ప్రొఫైల్స్ చివరలో ఇచ్చిన మెయిల్ ఐకాన్ పై క్లిక్ చేసి మెయిల్ చేయగలరు.

ఆదివారం, జనవరి 15, 2012

సంక్రాంతి శుభాకాంక్షలు

గిలిగింతలు పెట్టే చలిలో వెచ్చని భోగిమంటలు, చలికి వణుకుతూనే తెల్లవారుఝామున చేసే తలస్నానాలు, పిల్లలకు పోసే పుల్ల భోగిపళ్ళు తీయని చెఱకు ముక్కలు, నిండు అలంకరణతో ఇంటింటికీ తిరుగుతూ అలరించే గంగిరెద్దులు, కమ్మని గానంతో ఆకట్టుకునే హరిదాసులు, ప్రతి ఇంటిముందూ తీర్చి దిద్దిన రంగురంగుల రంగవల్లులు. చిక్కుడు, గుమ్మడి కూరల్తో తినే పెసర పులగం, అరిసెలు, చక్రాలు ఇతర పిండివంటలు, కొత్తబియ్యంతో చేసిన పాయసాలు, పులిహారలూ, కనుమ రోజు మినప గారెలు కోడి కూరలూ. తెలుగింట  మూడురోజులు ఏరోజుకారోజు ప్రత్యేకతతో నిజంగా పెద్ద పండుగ పేద్ద పండుగే అనిపించేలా జరుపుకునే భోగి, సంక్రాంతి మరియూ కనుమ మూడురోజులను మీరంతా మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ ఆనందంగా జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ..

మిత్రులందరికీ హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు.

ఆదివారం, జనవరి 01, 2012

నూతన సంవత్సర శుభాకాంక్షలు..


మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా
ఆ మత్తులోనబడితే గమ్మత్తుగా చిత్తవుదువురా...
మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా
హ్మ్.. ఏంటో ఘంటసాల గారి కమ్మటి గొంతులో ఈ పాటింటుంటే జోలపాడుతున్నట్లుండి నాకే నిద్రొస్తుంది ఇంక నిద్రపోయే పాండా గాడేం లేస్తాడు... ఇది కాదు కానీ ఇంకోపాటతో ట్రైచేద్దారి...
తెల్లారేదాకా ఏ గొడ్డూ కునుకు తియ్యదూ..
గింజా గింజా ఏరకుంటే కూత తీరదూ..
ఓ గురువా సోమరిగా ఉంటే ఎలా?
బద్దకమే ఈ జన్మకు వదిలి పోదా..?
గురకలలో నీ పరువే చెడును కద...
దుప్పటిలో నీ బతుకే చిక్కినదా? 
వీడేంటీ నిద్రలేవమంటే చిత్రమైన ఆసనాలేస్తున్నాడు
లేవర..లేవరా..
“అబ్బా పోరా..”
సుందర.. సుందరా..
“తంతానొరేయ్..”
చాలు రా నిద్దరా..
“థూ..ఈ సారినిద్దర్లేపావంటే సంపేత్తానొరేయ్”
వార్నీ.. నేన్రా ఈ బ్లాగువాడ్ని.. అడ్డగాడిదలా.. ఓహ్ నువ్ పాండావి కదూ.. అడ్డపాండాలా పడుకున్నది కాక నిన్ను అమ్మాబాబు అంటూ మర్యాదగా నిద్రలేపుతుంటే నన్నే తిడతావా?? హన్నా... లే ముందు..
“హబ్బా బ్లాగోడివి ఐతే ఏంటి గురూ.. మాంచి నిద్ర చెడగొట్టావ్.. ఇంకొన్నాళ్ళు పడుకోనివ్వు.. చాలా బద్దకంగా ఉంది.. ఐనా ఇపుడు నువ్వింత అర్జంట్ గా నన్ను నిద్రలేపి ఏం వెలగపెట్టాలంటా ?"

"ఏమంటే ఏం చెప్తాం మాకు మాకు బోల్డు కబుర్లు ఉంటాయోయ్ ఐనా నా బ్లాగుకు అతిధిగా వచ్చి సెటిల్ అయిందేకాక లేవమంటే నీ గోలేంటీ... ఇప్పటికే నా ఫ్రెండ్స్ అందరూ నిన్నూ నన్ను కలిపి తిట్టుకుంటున్నారు తెలుసా?"
"ఏంటీ తిడుతున్నారా ?? ఎవరు.. ఎవరు మనల్ని తిడుతుంది.. కమాన్ చెప్పు.. రెండు కుంగ్ ఫూ కిక్కులిచ్చానంటే కిక్కురుమనకుండా పడుకుంటారు..."

"అదుగో ఇందుకే నిన్ను ఆ కుంగ్ ఫూ సినిమాలు ఎక్కువ చూడద్దనేది ఇదివరకూ ఎంత స్వీట్ గా క్యూట్ గా ఉండేవాడివి ఇపుడేమో ఇలా రౌడీలా తయారయ్యావ్..."
"హిహి తిడుతున్నారనే సరికి ఏదో కొద్దిగా ఆవేశం వచ్చిందిలే బాసు... అదీకాక కాస్త బద్దకం కూడా వదిలిచ్చుకోడానికి పనికి వస్తుంది కదాని రెండు మూవ్ లు ప్రాక్టీస్ చేశా.."
"సరే సరే లే ఇక సాగింది చాలు గానీ ఇంద ఈ కేక్ తినేసి మన ఫ్రెండ్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేసి బయల్దేరితే నేను నా పని చూసుకుంటా.."
"ఏంటో బాసు బొత్తిగా అలవాటై పోయింది నీ బ్లాగ్ వదిలి వెళ్ళాలనిపించడంలేదు పోనీ నీకు అడ్డం రాకుండా అప్పుడప్పుడూ అవసరమైతే సాయం చేస్తూ ఇక్కడే ఓపక్కన తిరుగుతూ ఉండనా.. ఎంతైనా మనం మనం బెస్ట్ ఫ్రెండ్స్ కదా నీ బ్లాగ్ ఫ్రెండ్స్ అందరికీ నన్ను కూడా పరిచయం చేయ్..."

"హ్మ్ సరే రోజూ వచ్చి నిన్ను చూస్కోడం నాకు కూడా అలవాటైపోయింది నువ్ లేకపోతే వెలితిగానే ఉంటుందేమో. సో అలా సైడ్ బార్ లో ఓ పక్కన తిష్టవేసేయ్ కానీ మళ్ళీ బద్దకమంటూ నిద్రొస్తుందంటూ నాకు అడ్డం రాకూడదు సరేనా.."

"అలాగే గురూ నేను అస్సలు అడ్డంరాను నువ్వు హాయిగా కబుర్లు చెప్పుకో" (మనసులో:హు! వీడి బద్దకానికి నిద్రకీ నన్ను బాధ్యుడిని చేస్తున్నాడు.. దొంగమొహం..) 
"నేస్తాలూ కొంచెం దగ్గిరగా రండి మా బాసు వినకుండా మీకో విషయం చెప్పాలి.. ఈ రోజు నుండీ ఈ బ్లాగ్ వాడు మళ్ళీ మీకు సుత్తేయడం మొదలు పెడతాడుట, మా గురువుగారు శ్రీశ్రీ బుడుగు గారు ఆర్డర్ వేస్తే సర్లేకదా అని పాపం ఇన్ని రోజులూ ఏదో ఒకలా మిమ్మల్ని నేను రష్చించేశాను ఇకపై మీకు భరించక తప్పదు... నేను కూడా ఆ పక్కనే ఉండి మనవాడ్ని కాస్త అదుపులో పెడతాలెండి."

"మరి కొత్త సంవత్సరం కదా మీకోసం నా అంత పేఏఏ..ద్ద... కేక్ ఇంకా ఒక మంచి గ్రీటింగ్ కార్డ్ తీసుకు వచ్చాను మరి అవి అందుకుని నాతో కూడా దోస్తీ కట్టేసి ఈ బ్లాగ్ కి వచ్చినపుడు నన్ను కూడా పలకరిస్తుండండేం.."

"హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్."
"ఆ విషెస్ చెప్పేశాను బాసు.. ఇక వస్తా.."
"ఆ ఆ సరే టాటా.."
నేస్తాలూ అదనమాట విషయం..
అందరికీ హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు..
ప్రతిరోజూ ప్రతిక్షణం అవధులులేని ఆనందం మీ సొంతమవాలని కోరుకుంటున్నాను...
 

సోమవారం, జనవరి 24, 2011

విరామం


నా బ్లాగులకు కొంతకాలం విరామం ప్రకటిస్తున్నాను. నా ఙ్ఞాపకాలు, అనుభూతులు, అనుభవాలు, ఆలోచనలు మళ్ళీ మీ అందరితో పంచుకోవాలని అనిపించినపుడు మళ్ళీ వస్తాను. అంతవరకూ శలవు.

శనివారం, జనవరి 22, 2011

ఒక్కసారి మాట్లాడాలని ఉంది..

“అమ్మా నేను హాస్టల్ కు వెళ్ళక తప్పదా !! ఇక్కడే ఉండి బాగా చదువుకుంటానమ్మా.. ఇంటర్మీడియేట్ కే హాస్టల్ ఏమిటీ? హాస్టల్ లో నేను ఉండలేనమ్మా.. పంపించద్దు..” కళ్ళ నిండుగా నీళ్ళు ఎపుడు దూకుదామా అని రడీగా ఉన్నాయ్ వాటిని బలవంతాన ఆపుకుంటూ బిక్కమొహం వేసుకుని అమ్మని బతిమిలాడుతున్నాను..

“ఇక్కడ ఉండి చదవవని కాదురా.. అక్కడ ప్రత్యేక శ్రద్ద తీసుకుని చదివిస్తారు నీ ఫ్యూచర్ కే మంచిది. ఈ రెండేళ్ళు కష్టపడి చదివావనుకో స్ట్రాంగ్ ఫౌండేషన్ పడుతుంది అప్పుడు ఇంక నీ ఇష్టం.. అయినా నీకు చెప్తున్నాం కానీ మేం మాత్రం ఉండగలమా.. ప్రతి ఆదివారం వస్తావు కదా. మధ్యలో ఒక రోజు పక్కింట్ అంకుల్ వాళ్ళ ఫోన్ కి ఫోన్ చేయి ఇంకా తరుచుగా ఉత్తరాలు కూడా రాస్తుండు. అక్కడ నీకు బోలెడంత మంది కొత్త ఫ్రెండ్స్ కలుస్తారు.. తర్వాత మమ్మల్ని మర్చిపోతావ్ లే.. ఆ స్నేహాలతో జాగ్రత్తగా ఉండమ్మా.. ఎవర్ని పడితే వాళ్లని నమ్మకూడదు...” అమ్మ ఆపకుండా ఏదో చెబుతూనే ఉంది.. నేను మాటలు వినడం మానేసి అమ్మనే చూస్తూ ఉండిపోయాను. రేపటి నుండి ఇలా ఎపుడు పడితే అపుడు అమ్మ కనపడదు కదా వారం అంతా ఎదురు చూడాలి. అమ్మని వదిలి దూరంగా వెళ్ళడం అదే మొదటి సారి.

హాస్టల్ కు వెళ్ళిన తర్వాత ప్రతి ఆదివారం ఇంటికి వెళ్తూనే ఉన్నా మధ్యలో ఏ చిన్న సమస్య వచ్చినా ఆఖరికి ఏదైనా పీడకల వచ్చినా అమ్మకి ఫోన్ చేసేవాడ్ని. సెల్ ఫోన్లు ఇంకా పరిచయమవని ఆరోజుల్లో ఇప్పుడున్నంత విరివిగా ఫోన్లు ఉండేవి కాదు ఒక ల్యాండ్ లైన్ కనెక్షన్ కోసం కొన్ని నెలలపాటు ఎదురు చూడవలసి వచ్చేది. హాస్టల్లో కొన్ని నిర్ణీత సమయాల్లోనే మాట్లాడుకోవడానికి అనుమతినిస్తారు కనుక ఆ సమయంలో క్యూలు ఎక్కువగా ఉండేవి అందులోనే నిలబడి కాళ్ళునొప్పులు పుట్టేవరకూ ఎదురు చూసి మాట్లాడే నాలుగు మాటలు కూడా ఎంత మధురంగా ఉండేవో. ఎప్పుడైనా నాన్న వాళ్ళే అడ్మిన్ ఆఫీసుకు కాల్ చేస్తే ఆఫీస్ నుండి అరిచిన అరుపు విని ఎగిరిగంతేసి పొడవైన కారిడార్ లో కిందపడిపోతామేమో అన్నంత వేగంగా పరిగెట్టుకుంటూ వెళ్ళి మాట్లాడటం ఇప్పటికీ గుర్తుంది... 

“ఒరే నువ్వు విజయవాడ లో ఉన్నప్పటిలా కాదు ఇపుడు చాలా దూరంలో ఉంటున్నావ్ కదా.. అదీకాక యూనివర్సిటీ హాస్టల్ పెద్దగా పరిమితులు ఉండవు రాత్రి తొమ్మిది తర్వాత రేట్ తక్కువ కాబట్టి కాస్త ఎక్కువ మాట్లాడుకోవచ్చు. కనీసం రెండు మూడు రోజులకి ఒక సారి కాల్ చేయాలి సరేనా...” ఇంజనీరింగ్ కు వైజాగ్ పంపేముందు అమ్మ ఎన్ని సార్లు చెప్పిందో ఈ మాట. “అలాగే అమ్మా హాస్టల్ దగ్గరలో ఫోన్ బూత్ ఉంటే రోజూ చేస్తాను సరేనా...” అని చెప్పిన ప్రతిసారి నే జవాబిచ్చాను.

మొదటి ఏడాదంతా ఇంచు మించూ రోజూ ఏదో టైంలో ఇంటికి కాల్ చేసి కాసేపు మాట్లాడిన నేను ఆ ఏడు చివరికి వచ్చేసరికి  “అమ్మా హాస్టల్ నుండి ఫోన్ బూత్ చాలా దూరమమ్మా రాత్రుళ్ళు 9 తర్వాత చీకట్లో ఇంతదూరం నడిచొచ్చి మాట్లాడి మళ్ళీ ఇంటికి వెళ్ళడం కష్టంగా ఉంది అందుకే నాలుగురోజులకో వారానికో ఒక సారి చేస్తున్నా అంటే అర్ధం చేసుకోవేంటి..” అని అంటూనే.. కుదిరిన ప్రతిసారి అమ్మతో గంటకి తక్కువకాకుండా ఫోన్లో మాట్లాడిన రోజులు ఎన్నో... అప్పట్లో రాత్రుళ్ళు ఒకరిద్దరు నా తర్వాత మాట్లాడడానికి వరుసలొ ఎదురు చూస్తుంటే వాళ్ళని ముందు చేసుకోమ్మని చెప్పేసి నేను చివరన ఫోన్ చేసే వాడ్ని ఆఖరున ఉండేది నేనైతే ఏ అవాంతరాలు లేకుండా అమ్మతో కావాలిసినంత సేపు మాట్లాడుకోవచ్చని నిద్రని కూడా త్యాగం చేసే వాడ్ని.

కాలేజ్ కబుర్లు, ఫ్రెండ్స్ గురించీ, లెక్చరర్స్ గురించీ నేను చెప్తుంటే చెల్లాయి తమ్ముళ్ళ అల్లర్లు, ఇంటి విషయాలు, బంధువుల విషయాలు అమ్మచెప్తుంటే మామాటల మధ్య నిముషాలు క్షణాల్లా దొర్లేవి. నాన్న తమ్ముడు చెల్లాయిలతో అందరితోనూ కలిపి పావుగంట మాట్లాడితే మేమిద్దరమే ఒక ముప్పావుగంట మాట్లాడుకునే వాళ్ళం. SSLC(10th తోసమానం) మించి చదువుకోకపోయినా అమ్మకి ఎన్ని విషయాలు తెలుసో ఎన్ని తెలివితేటలో నరసరావుపేటలోనే కూర్చుని వైజాగ్ గురించి అక్కడి మనుషుల ప్రవర్తనలగురించి తూర్పు యాస గురించి ఇంకా ఎవరితో ఎలా మసులుకోవాలి లాంటి విషయాలు బోలెడన్ని చెప్పేది. మా ఇద్దరి కబుర్లు వినే నేస్తం ఒకడు “మీ ఇద్దరికీ ఫోన్ ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు రా, దీన్ని కనిపెట్టింది విషయాన్ని సాధ్యమైనంత క్లుప్తంగా చేరవేయడానికి అంతే కానీ ఇలా ఆ.. ఇంకేంటి అంటూ పక్కన కూర్చుని కబుర్లు చెప్పుకున్నట్లు మాట్లాడుకోడానికి కాదు..” అంటూ ఏడిపించేవాడు.

అమ్మతో మాటలంటే ఇంకో విషయం గుర్తొచ్చింది.. సాధారణంగా ఎవరితోనూ గొడవపడని నేను అప్పట్లో కాస్తైనా కోపంగా మాట్లాడేది ఒక్క అమ్మతోనే.. మాకు ముఖ్యంగా ఒక్క విషయంలో చాలా పెద్ద గొడవయ్యేది. ఇంటర్ లో తక్కువే కానీ ఇంజనీరింగ్ లో సెలవలకు వచ్చిన ప్రతిసారీ మీ స్నేహితులకోసం కూడా తీసుకువెళ్ళు అని చెప్పి పిండివంటలు పచ్చళ్ళు బోలెడు ప్యాక్ చేసేది అమ్మ. నాకేమో అవన్నీ మోసుకుని బస్సుల్లో వెళ్ళడం ఒక కష్టమయితే అసలు కాలేజికి వెళుతూ నే ఒక్కడ్నే అన్నేసి తినుబండారాలు తీసుకుని వెళ్ళడం పెద్ద నామోషీగా ఫీల్ అయ్యేవాడ్ని. మిగతావాళ్లెవరూ అన్ని తెచ్చుకునేవారు కాదు మరి అందుకే నాకలా అనిపించేది..

అలా చేసిపెట్టేవాళ్ళు ఉండటం నా అదృష్టమని అప్పట్లో తెలుసుకోలేకపోయాను కొన్నిసార్లు అంతే ఉన్నపుడు విలువ తెలీదు తెలిసేప్పటికి ఏమీ ఉండదు. ఇలాంటిదే ఇంకోటి ఇంట్లోఉన్నపుడు అమ్మ “మధ్యాహ్నం మూడవుతుంది భోజనానికి లేమ్మా” అని చెప్తుంటే “ఏంటీనస నాకు ఆకలేస్తే తినాలని తెలీదా” అని అనిపించేది అదే ఒంటరిగా ఉన్నపుడు ఒకోరోజు “ఏంటో జన్మ ఉన్నావా తిన్నావా అని అడిగేవాళ్ళు కూడా లేరు” అని అనిపిస్తుంటుంది. మళ్ళీ డివియేట్ అవుతున్నాను.. అలా మోసుకెళ్ళడం మనకి నామోషీ కనుక అమ్మ చేయించిన వాటిలో సగం తీసుకు వెళ్తా అని నేనూ తను చెప్పినవన్నీ తీసుకువెళ్ళాలని తనూ పట్టుపట్టి కూర్చునేవాళ్ళం. అదేంటో కానీ ఎప్పుడూ అమ్మే గెలిచేదిలెండి ఎప్పుడైనా నేను కాస్త గట్టిగా కోప్పడితే తను నామాట వినేది కాని అలా అమ్మమీద కోప్పడి వెళ్ళినపుడు నాకు మళ్ళీ ఇంటికి వచ్చేవరకూ హాస్టల్ లో ఏవో ఒక ఇబ్బందులు వచ్చేవి అస్సలు బాగుండేది కాదు అదో సెంటిమెంట్.

సరే ఇక ఇంజనీరింగ్ నాలుగో ఏటికి వచ్చేసరికి మళ్ళీ రెండ్రోజులకి ఒక సారి ఫోన్ చేయడం ఒకోసారి ప్రతిరోజూ మాట్లాడటం చేసేవాడ్ని. ఎంతగా అంటే హాస్టల్ దగ్గరలోని ఫోన్ బూత్ ల వాళ్ళు మా దగ్గరకి రమ్మంటే మా దగ్గరికి రమ్మంటూ అచ్చంగా ఈనాటి క్రెడిట్ కార్డ్ వాళ్ళలా అప్పులు సైతం ఇవ్వడానికి వెనుకాడేవారు కాదు. అదేంటో అమ్మతో మాట్లాడినపుడు మేం మాట్లాడుకునేవి సాధారణమైన విషయాలే అయినా కాల్ అయ్యాక ఏదో తెలియని శక్తి ఆవహించేది బోలెడంత ధైర్యంగా కొండంత కాన్ఫిడెన్స్ తో రొమ్మువిరుచుకుని చీకటి వెలుతురు అనే ఆలోచన లేకుండా ఎంత రాత్రయినా నిర్బయంగా తుప్పల్లో పడి నడుచుకుంటూ రూంకి వెళ్ళేవాడ్ని. ఆ శక్తి దదాపు ఒక రోజంతా అలానే ఉండేది. అందుకే పరీక్షల టైంలో అసలే చివరినిముషంలో ముక్కున పట్టడానికి సమయం చాలకపోయినా సరే ప్రతిరోజూ కాసేపయినా అమ్మతో మాట్లాడటం మాత్రం మిస్ అయ్యేవాడ్ని కాదు. ఒక్క ఇంజనీరింగ్ పరీక్షలనేనా జీవితంలో ఎలాంటి పరీక్షలనైనా అమ్మతో ఒక సారి చర్చించి సమస్యపై తన ఇన్ సైట్ తీసుకుని ముందుకు సాగేవాడ్ని.

ఉద్యోగార్ధినై హైదరాబాద్ లో ఉన్నా.. ఉద్యోగనిమిత్తం చెన్నై లో ఉన్నా, బెంగళూరు, అమెరికా ఇలా ఒకటేమిటి ఎక్కడైనా ఎప్పుడైనా అమ్మతో మాట్లాడటం ఓ చక్కని అనుభూతి, కొండంత బలం. అమెరికా వెళ్ళాక చాన్నాళ్ళకి ఒక సారి నేను “అమ్మా ఇంజనీరింగ్ లో ఉన్నపుడు నువ్వు చెప్పినమాటలు గుర్తున్నాయా.. ఇప్పుడంటే చిన్నపిల్లాడివి ఒక్కడివి ఎలా ఉన్నావో అన్న బెంగ కాబట్టి రోజూ చేయమంటున్నాను కానీ.. పెద్దై ఉద్యోగం చేస్తుంటే రోజూ కాల్ చేయాల్సిన పనేమి ఉంటుంది అప్పుడు అఖ్ఖర్లేదు... అన్నావ్ కాని మనం ఇప్పటికి కూడా ఆ డైలీ ట్రెండ్ కంటిన్యూ చేస్తున్నాం కదా..” అంటే అమ్మ తేలిగ్గా అందంగా ఒక నవ్వు నవ్వేసేది.

రెండేళ్ళ క్రితం సరిగ్గా ఈ రోజున (జనవరి 22-2009) ఆ మాటల ఙ్ఞాపకాలను మాత్రమే నాకు మిగిల్చి మమ్మల్ని ఒంటరివాళ్ళను చేసి వెళ్ళిపోయిన అమ్మని తలుచుకోని క్షణం లేకపోయినా.. గడిచిన ఏడాదికన్నా ఈ ఏడాది.. ఈ నిముషం తను నాతో పాటుంటే ఈ సమస్యని తను ఇంకా బాగా డీల్ చేసి ఉండేది, ఈ క్షణం అమ్మ సలహా తీసుకుంటే బాగుండు, ఇప్పుడు అమ్మతో మాట్లాడగలిగితే బాగుండు అని అనిపించిన సంఘటనలు కోకొల్లలు. అలా అనిపించినపుడల్లా ఒంటరిగా దిగులు పడుతూ ఉలుకూ పలుకూ లేని నా సెల్ ఫోన్ వైపు ఆశగా చూసుకుంటూ “దేవుడూ ఒక్కసారి అమ్మతో మాట్లాడాలని ఉంది ఆలోకానికి కనెక్షన్ ఇవ్వవూ...” అని ఎన్ని సార్లు బ్రతిమిలాడానో ఆ దేవుడ్ని :-( కానీ “నాకూ అమ్మప్రేమ కావాలి” అంటూ రెండేళ్ళక్రితమే బలవంతంగా మా అమ్మని తన దగ్గరకు తీసుకువెళ్ళిన జాలీ దయా లేని ఆ దేవుడు నామాట వింటాడా.. విన్నా పట్టించుకుంటాడా...

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.