అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

అందమైన బాల్యం

మధురమైన జ్ఞాపకాలతో అందమైన బాల్యాన్ని నా సొంతం చేసినందుకు అమ్మానాన్నలకు ఎప్పుడూ ఋణపడి ఉంటాను. మొదటి సంతానాన్నవడంతో నేనాడిందే ఆట పాడిందే పాట అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళినా మా ఇంట్లో అయినా అపురూపంగా గడిచింది. పాడుకున్న పాటలు, ఆడుకున్న ఆటలు, స్కూల్ ఎగ్గొట్టడానికి వేసిన వేషాలు, తిన్న చిరుతిళ్ళు, నాన్న వేలు పట్టుకుని కొట్టిన షికార్లు, 16mm సినిమాలు కబుర్లు ఇక్కడ చదవచ్చు.

ఇంటర్మీడియెట్ హాస్టల్ కబుర్లు

నూనూగు మీసాల నూత్న యవ్వనం అమ్మానాన్నలకు దూరంగా నాదంటూ ఓ స్వంత ప్రపంచం. అప్పటివరకూ ప్రతి చిన్న పనికి వాళ్ళమీద ఆధారపడి ఒక్కసారిగా నాకు నేనే నెగ్గుకు రావాల్సిన పరిస్థితులను తలుచుకుని దిగులు. అంతలోనే చుట్టూ ఉన్న స్నేహితులతో నేస్తం కట్టేసి చేసిన అల్లర్లు, పరోఠాల బిజినెస్సులు, చెరకుతోట దొంగతనాలు, ఆడ్మినిస్ట్రేటర్ కి మస్కాగొట్టి చూసిన సినిమాలు, సరదా కొంటె కబుర్లు ఇక్కడ చూడండి.

ఇంజనీరింగ్ కాలేజ్

ఇంటర్మీడియెట్ కి రెసిడెన్షియల్ హాస్టల్ కనుక పంజరంలో పక్షిలా బతికితే ఇంజనీరింగ్ కాలేజ్ యూనివర్సిటీ హాస్టల్స్ లోకి వచ్చేసరికి ఒక్కసారిగా జూలోనుండి పచ్చని అడవిలోకి వదిలేసిన జింక పరిస్థితే అయింది, ఎక్కడికి పరుగులెట్టినా ఏం చేసినా అడిగేవాళ్ళులేరు. అసలు హాస్టల్ బిల్డింగ్ లో నిరంతరం కాపుకాసే వార్డెన్ ఉండడనే విషయం నాకు డైజెస్ట్ కావడానికి నెలపట్టింది :-) నిజమా అలా ఎలా సాధ్యం అని ఇప్పటికీ అనిపిస్తూనే ఉంటుంది. అంతటి స్వేఛ్చాప్రపంచంలో చేసిన అల్లర్లు కొన్ని కబుర్లు ఇక్కడ.

సినిమాలు రివ్యూలు..

నాకున్న అతి పెద్ద వ్యసనం సినిమా చూడడం రిలీజైన ప్రతి అడ్డమైన సినిమా చూసేసి ఈబొమ్మలో చూపించినట్లు తెలుగు సినిమాని భుజాల మీద మోసేవాళ్ళలో నేనొకడ్ని. చూసి ఊరుకోకుండా ఇది ఇందుకు బాలేదు అది అందుకు బాగుంది అంటూ పేద్ద వంద సినిమాలు తీసేసి విశ్రమిస్తున్న మేధావిలా చేసే విశ్లేషణలు :-) హహహ చదివిన ఒకరిద్దరు అలా తిడతారు కానీ నా దృష్టిలో ఒక సాధారణ సినీ ప్రేక్షకుడు చూసొచ్చి మిత్రులతో చెప్పే కబుర్ల లాంటి నా సినీ రివ్యూలు ఇక్కడ చదవండి. ఆరెంజ్, ఖలేజా, కృష్ణం వందే జగద్గురుం లాంటివి కొన్ని ఎక్కువమంది ఆదరణ పొందాయ్.

శుక్రవారం, జులై 04, 2008

అంతా మన మంచికే...

బహుశా ఈ కధ మీరందరూ వినే ఉంటారు, నేను ఎప్పుడో విన్నాను కాని పూర్తి గా మర్చిపోయాను. ఈ రోజు నేను కొంచెం డల్ గా ఉంటే నా నేస్తం చైతు మళ్ళీ గుర్తు చేసిన ఈ కధ నాకు చాలా బాగా నచ్చింది అప్పుడప్పుడు చదువుకోడానికి బావుంటుంది అని ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను.

అనగనగా ఒక రాజ్యం లో ఓ రోజు రాజు గారు కత్తి విద్యా నైపుణ్యాన్ని పెంపొందించుకోడానికి సాధన చేస్తుండగా అనుకోకుండా ఒక వేలు కొంత తెగి కింద పడిందట, అది చూసి రాజు గారు మధన పడుతుంటే పక్కనే ఉన్న బుద్ది శాలి అయిన మంత్రి అది చూసి "ఓ రాజా !! బాధ పడకు అంతా మన మంచికే జీవితం లో ఏది జరిగినా మన మంచికే జరుగుతుంది అని భావించాలి ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది అలానే మీ వేలు తెగడం కూడా మీ మంచికే అని హితవు పలికాడుట.

అది విన్న రాజు గారి అరికాలి మంట నెత్తికెక్కి "ఈ మూర్ఖ మంత్రి నేను వేలు తెగి బాధ పడుతుంటే అంతా మన మంచికే అని హితవు పలుకుతాడా..." అని కోపం తెచ్చుకుని...."ఎవరక్కడ ఈ మూర్ఖ మంత్రి ని చెఱసాల లో బంధించండి" అని ఆజ్ఞా పించాడుట. వెంటనే భటులు వచ్చి మంత్రి గారిని చెఱసాల లోనికి తీసుకు వెళ్తూ "ఎమయ్యా మంత్రి గారు.. రాజు గారు అంత బాధ పడుతూ ఉంటే నీ పాలికి నువ్వు ఊరుకోకా అట్టా అంటివే..ఇప్పుడు నీ పరిస్తితి ఏందీ..." అని అడిగారుట.

దానికి మంత్రి గారు చిరు నవ్వు నవ్వుతూ ఇది కూడా నా మంచికే జరిగి ఉంటుంది కారణం లేకుండా ఏదీ జరుగదు అని అన్నాడుట. ఇది జరిగిన రెండు రోజుల తర్వాత రాజు గారు అడవికి వేటకు వెళ్ళి అక్కడ తప్పి పోయి అడవి మనుషులకు దొరికి పోయారుట. అక్కడ వారు రాజు గారిని చూసి "ఆహా ఈ రోజు మంచి నర బలి దొరికింది.." అని బలికి అంతా సిద్దం చేసేంతలో ఒకడు రాజు గారి తెగిన వేలు చూసి "ఔరా!!.. ఈ నరుడికి ఒక అవయవ లోపం ఉన్నది... బలికి పనికి రాడు... విడిచి పెట్టండీ..." అని రాజు గారిని వదిలి పెట్టేసారుట.

అప్పుడు రాజు గారు "బ్రతుకు జీవుడా!!..." అని అనుకుని ఎలానో కష్ట పడి తిరిగి రాజ్యానికి చేరుకుని నేరుగా చెఱసాల లో ఉన్న మంత్రి గారి వద్దకు వెళ్ళి మంత్రి వర్యా మిమ్మలను అనవసరం గా అవమానించినాను ఆ నాడు నా వేలు తెగడం వల్లనే కదా నేను బతికి బట్ట గలిగాను, కనుక మీరు అన్నది సబబే ఏమి జరిగినా మన మంచికే అనుకోవలె అంతా మన మంచికే అని నేను కూడా ఒప్పుకుంటున్నాను అని అన్నారుట. అది అంతా విన్న మంత్రి గారు బటుల వైపు తిరిగి చూసారుటోయ్ రాజు గారు నన్ను చెఱసాల లో బంధించక పోయి ఉంటే నేను కూడా రాజు గారి వెంట వెళ్ళి ఉండే వాడ్ని. అప్పుడు అన్ని అవయవాలు సరిగా ఉన్న నన్ను బలి ఇచ్చేవారు అందుకే రాజు గారు నన్ను చెఱసాల లో పెట్టుట కూడా నా మంచికే జరిగినది అని అనగా... బటులు నిజమే ప్రభు మీరు చెప్పినది అని అన్నారుట.

కనుక మనమందరం కూడా జీవితం లో ఏమి జరిగినా అంతా మన మంచికే అనుకుని ఎక్కువ కుంగి పోకుండా Take it easy ఊర్వశీ!! అని అనేసుకోవాలనమాట.... :-)

--మీ వేణు.

గురువారం, జులై 03, 2008

బుడుగు తో కాసేపు...

ఉరేయ్!! బ్లాగు వాడుల్లారా(no offense) ... ఎలా ఉన్నారు, మన పేరు బుడుగు...వీడున్నాడే..ఈ బ్లాగు వాడు..వేణు గాడు...వాడూ.. మొన్నో ఎల్లుండో ఓ రోజు నా దగ్గరికి వచ్చి... "బుడుగు గారు..బుడుగు గారు మరేమో నండి.. నా బ్లాగు చూసే వాళ్ళు అందరికీ మీరు ప్రైవేటు చెప్పడం గురించి చెప్పాలండీ.." అని రిక్వెస్టింగ్ చేసాడు (రిక్వెస్టింగు అంటే ఏంటో తెలీదు కానీ అలా అనాలి అని బాబాయ్ చెప్పాడు, బాబాయ్ దగ్గర ఇలాంటివి బోలెడు ఉన్నాయి లే).

అసలికి ఈ బ్లాగు వాడు అంటే మనకి మా చెడ్డ ఖోపం...మన కుటో (దీన్నే ఫోటో అని కూడా అంటార్లే... అప్పుడూ లావుపాటి పిన్ని గారు ఆవిడ ముగుడూ ఒకే దాన్లో పట్టకపోతే పిన్ని గారిని సగమే తీసారు అని చూపెట్టా గదా అదే) సరే వీడు మన కుటో అయితే పెట్టుకున్నాడు గానీ మన గురించి ఇన్ని రోజులు అయినా టపా వెయ్య లేదు. మనమంటే బొత్తి గా బయ్యంబత్తీ లేకుండా పోయింది. బయ్యంబత్తీ అంటే అంతేలే పెద్దవాళ్ళంటే చిన్న వాళ్ళకి బయ్యంబత్తీ ఉండాలని బామ్మ చెప్పింది. మరి నేనేమన్నా చిన్న వాడ్నా చితక వాడ్నా మనమంటే కూడా ఉండద్దూ వీడికి.

అయ్యినా కూడా పోన్లే పాపం వీడికి ప్రైవేటు చెప్పడం గురించి తెలీదు కదా మనం చెప్పి రష్చించు దాం...ఎంతైనా అడిగాడు కదా అని అనుకున్నా... కానీ వీడికి ఊరికే చేయగూడదు కదా...అలా చేస్తే అలుసైపోతామంట బాబాయ్ చెప్పాడు. అందుకే బాబాయి రెండుజెళ్ళ సీతకి లెట్రు(అంటే ఉత్తరం లా ఉంటుంది లే) ఈమన్నా కూడా మనకి బిస్కత్తులు ఇస్తేనే చేస్తాం కదా. అందుకే వీడిని " సర్లే ఫో చెప్పి నిను రష్చించు తాను కానీ నాకు ఫది..ముఫై పకోడీలు పెట్టుతావా" అని అడిగాను.

వాడు సరేండీ అని ఫకోడీ లు పెట్టాడు...కానీ పెట్టేసి ఊరుకోకుండా "బుడుగు గారు... బుడుగు గారు మరేమో ఫది ఫకోడిల్లో మూడు తినేస్తే ఇంకా ఎన్ని పకోడీలు ఉంటై" అని అడిగాడు. జాటర్ ఢమాల్...మనకి అసలే లెక్కలు అంటే కోపం కదా... మనసాయం కోసం వచ్చి మనల్నే లెక్కలు అడుగుతాడా అని యమ ఖోపం వచ్చీసింది. అలా అయితే నీ ఫకోడీలు వద్దు...నీ బ్లాగు లో ప్రైవేటు గురించి చెప్పి నిన్ను రష్చించను ఫో అనేసాను.

అప్పుడు వీడు మళ్ళీ "తప్పయి పోయింది బుడుగు గారండీ" అని కాళ్ళా వేళ్ళా పడితే (పెద్ద వాళ్ళు అలా పడతార్లే నువ్వు ఇంకా చిన్న వాడివి కదా నీకు తెలీదు) పోనీలే కదా అని "సరే రా భయం పడమాకు... నేను నిన్ను రష్చించుతాను లే ఫో..." అని చెప్పి ఇలా వచ్చేసా అనమాట.

అసలింతకీ ప్రైవేటు చెప్పడం అంటే "తిట్టడం" అని అర్ధం ఒకో సారి "కొట్టడం" అని కూడా వస్తుంది లే... ఎప్పుడైనా అమ్మ మనల్ని కొట్టుతే నాన్నేమో అమ్మకి ప్రైవేటు చెప్తాడు, నేను దెబ్బలాట అనుకున్నా కాని ప్రైవేటు అనాలని బాబాయి చెప్పాడు. ఒక సారి బాబాయి రెండు జెళ్ళ సీతకిమ్మని లెట్రు ఇచ్చుతే దాన్ని సీత వాళ్ళ నాన్న నా దగ్గర నుండి లాక్కుని చదివేసాడు గదా అప్పుడు వాడు కూడా బాబాయి కి "వెధవ కానా..." అని గాట్టి గా ప్రైవేటు చెప్పేసాడు లే...

అసలంతెందుకు మీ బ్లాగు లో ఎవడో పేరు తెలీని వాడు, వాడి నోటికొచ్చినట్లు అవాకులూ చవాకులు పేలితే మీరు కూడా వాడికి గట్టిగా ప్రైవేటు చెప్తారు కదా అదనమాట ప్రైవేటు చెప్పడం అంటే...అర్ధం అయ్యిందా... ఇంకా కాకపోతే ఈ కింద ఇచ్చిన లంకె లో ఇలాంటియ్యే నేను చెప్పే బోలెడు కబుర్లు ఉన్నాయి అవన్నీ చదివేయండి... ఒక వేళ మీకు నా గురించి అస్సలు తెలీక పొయ్యినా కూడా చదివేయండి ఎందుకంటే...చదివాక నేను నచ్చని తెలుగు వాడులు ఎవరూ ఉండరు...

బాపూ రమణ ల బుడుగు అల్లరి పిడుగు

సరే మరి ఇంక నేను రైలు ఎక్కి సీగాన పసూనాంబ వాళ్ళ ఊరు వెళ్ళాలి... వేళ్ళి మళ్ళీ వస్తాను. ఈ సారైనా నిజం డ్రైవరు నన్ను రైలు తోలనిస్తాడో లేదో వాడికి ఫదీ ముఫ్ఫై బీడీ లు ఇస్తాను అని చెప్పుతాలే...

*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*

అవండీ నాకు అత్యంత ఇష్టమైన మా బుడుగు గారు చెప్పిన కబుర్లూ... ఈ రోజు ఉదయం ట్రైన్ లో సరదాగా డ్రాఫ్టు చేసి పెట్టుకుందాం అని పెన్నూ పేపరూ తీసుకు మొదలెట్టాను...ఆగితేనా... అరగంట లో ఇన్ని కబుర్లు చెప్పేసాడు... సరే మరి మీరు ఇంకా రమణ గారి "బుడుగు" చదవక పోతే చదివేయండేం... మళ్ళీ మరో టపా లో కలుద్దాం....

--మీ వేణు.

బుధవారం, జులై 02, 2008

మరికొన్ని కాలనీ కబుర్లు

నిన్న చెప్పిన ఆటలలో కొన్ని చాలా బాగా ఎంజాయ్ చేసే వాడ్ని కాని మా తాత గారి ఇంట్లో అన్నింటికన్నా ఎక్కువ నాకు సంతోషాన్ని ఇచ్చే విషయం మాత్రం. సాయంత్రం పూట చీకటి పడిన తర్వాత చాల్ల గాలికి ఆరు బయట నులక మంచం మీద తాతయ్య పక్కన పడుకుని తను చెప్పే కబుర్లు వినడం. తను రామాయణ మహా భారతాలలో చిన్న చిన్న పిట్ట కధ లు, మిలట్రీ కధలు, ఊరిలో బాంబుల గొడవలు అలా ఎక్కడెక్కడి వింతలు విశేషాలు బోలెడు కబుర్లు చెప్తుండే వారు. తను పెద్ద గా చదువుకో లేదు చందమామ లాంటి పుస్తకాలలో పురాణ కధలు కూడ బలుక్కుని మెల్లగా చదివే వారు అందుకని నేను కొంచెం పెద్దయ్యి బాగా చదవడం వచ్చేసిన తర్వాత చందమామ, బాల మిత్ర లాంటి పుస్తకాలలో కధలు నా చేత చదివించుకుని వింటూ వాటికి తన వ్యాఖ్యానాన్ని జోడించి దానిలో నీతిని గురించి చక్క గా అర్ధం అయ్యేలా చెప్తుండేవారు.

మరీ చిన్నప్పుడు కాదు కాని కొంచెం పెద్దయిన తర్వాత సాయంత్రం అలా ఆరుబయట నులక మంచం మీద వెల్లకిలా పడుకుని గుండెల మీద బేటరీ రేడియో పెట్టుకుని వినడం కూడా చాలా ఇష్టం. ఇలాంటి నా అందమైన సాయంత్రాలలో ఒక అపశ్రుతి మా పక్కింటి అంకుల్, ఆయన అందరితో నవ్వుతూ గౌరవం గా మాట్లేడే వారు ఎప్పుడైనా ఎదురు పడితే "ఏం బాబు బావున్నావా" అంటూ ఆప్యాయం గా పలకరిస్తారు, చాలా మర్యాదస్తుడు కాకపోతే సాయంత్రం ఆరింటి వరకే. అది దాటిందంటే "ఏం బాబు" కాస్తా "ఏరా కుర్ర నాకొడకా" లోకి మారిపోతుంది. ప్రతి రోజు ఫుల్ల్ గా మందు కొట్టేసి నానా యాగీ చేస్తుండే వారు, నేను కొంచెం పెద్దయిన తర్వాత నవ్వుకునే వాడ్ని కాని చిన్నపుడు ఆయన అరుపులు అవీ విని చాలా భయం వేసేది. మేం వెళ్ళినప్పుడు కూడా ఒకో సారి తాత గారు నాతో ఆడకుండా వాళ్ళ గొడవలు తీర్చాల్సి వచ్చేది.

కారంపుడి గురించి చెప్తూ కోడి పందాల గురించి చెప్పుకోక పోతే అసంపూర్తి గానే ఉండి పోతుందేమో. సాధారణం గా సంక్రాంతి, దసరా లాంటి పండగలకి మేము తాతగారి ఊరు వెళ్ళేవాళ్ళం మరీ బాలకృష్ణ సినిమాలో చూపించినట్లు కాదు కాని కోళ్ళ పందాలు జరిగేవి, నాకు ఒక సారి చూసినట్లు గుర్తు. మరి నేను చిన్న పిల్లాడ్ని కదా అటు వెళ్ళనివ్వరు అనమాట. అప్పట్లో మా ఇంట్లో కూడా ఒక కోడి ని పెంచే వాళ్ళు, కువ కువ లాడుతూ దాని వెనకాలే తిరిగే బుజ్జి బుజ్జి పిల్లల్ని చూడటం అంటే నాకు ఎంత సరదానో. అప్పుడప్పుడు అపురూపం గా ఆ చిన్న చిన్న కోడి పిల్లల్ని పట్టుకుని తెగ మురిసి పోయే వాడ్ని వెచ్చగా ఉండే వాటి స్పర్శ ఇంకా నాకు అలానే గుర్తుండి పోయింది.

సంక్రాంతి టైం లో అనుకుంటా మా ఊర్లో బండ లాగుడు పోటీ లు జరిగేవి. ఒక పెద్ద పొడవాటి బండకి అటు ఇటు జోడెడ్లని కట్టి ఆ బండ మీద నుంచుని ఎడ్లని అదుపు చేస్తూ లాగించాలి. ఆ పోటీలు చూడటనికి జనం బాగా వచ్చే వాళ్ళు. అసలు సంక్రాంతి అంటే 3 రోజులకూ మూడు ప్రత్యేకతలతో పండుగ బ్రహ్మాండం గా జరిగేది. ఇంటి ముందు ముగ్గులు, హరిదాసు లు, గంగిరెద్దులు, ఇంకా భోగి మంటలు ఇవేవీ మర్చిపోలేను. కాలేజి కి వచ్చాకా చాలా తక్కువ సంక్రాంతి పండగలకి ఇంట్లో ఉన్నాను ఒక వేళ వున్నా అప్పటి సందడి ఇప్పుడు ఎక్కడ లెండి ఏదో అతిధి ఫుడ్స్ నుండి పిండి వంటలు, పులిహార తో సహా కొనుక్కుని వచ్చి పండగ అయింది అనిపించే వాళ్ళని చాలా మందిని చూస్తున్నాను. నేనూ అంతే వాళ్ళలో ఒకడ్ని, అసలు ఇక్కడ అమెరికా లో ఉంటే అందరికీ ఫోన్ చేసి విష్ చేయడమే పండగ అనే స్తితి కి వచ్చేసా అనుకోండి అది వేరే విషయం.

అన్నట్లు కారంపుడి అంటే ఇంకో చిన్న విషయం చెప్పాలి, ఇప్పటికీ ఇంకా వేస్తున్నారో లేదో తెలీదు కాని అప్పట్లో అంత్రం వేసే వాళ్ళు అని వుండేవారు, కారంపుడి లో కూడా ఒకతను ఉండే వాడు. నాకు చిన్నప్పుడు ఎపుడో ఒంట్లో బాగా లేకపోతే అతని దగ్గరకి తీసుకు వెళ్ళి అది కట్టించారు. అంత్రం/తాయత్తు అంటే చిన్న రాగి సిలిండర్ లాగా ఉంటుంది medical capsule కన్నా కొంచెం పెద్ద సైజు లో రెండు పక్కలా చదును గా మూతల లాగా వుండి మధ్య లో తాడు కట్టడానికి చిన్న రింగులు వుండేవి. మనకి మొదటి సారి అది కట్టించినప్పుడు అసలే మనకి curiosity ఎక్కువ రిపేర్లు అంటే సరదా కదా సో దానిలో ఏముంటుందా అని నానా కష్టాలు పడి విరగొట్టి తీసి చూసేసాను లోపల ఏమీ లేదు. ఒక పలచని రాగి రేకుని అలా ఆ షేప్ లో చుట్టి ఇచ్చాడు అంతే...

సో అలా దాన్లో ఏదో ఉంటుంది అని మనం చేసిన ఎక్స్పరిమెంట్ తుస్సనడమే కాకుండా దాని వల్ల అమ్మ చేతిలో గాఠ్టిగా ప్రైవేటు చెప్పించుకోవాల్సొచ్చింది. అవునూ! అసలు మీకు ప్రైవేటు చెప్పించు కోడం అంటే తెలుసా... లేదంటే లాభం లేదు బుడుగు చేత మీకు ప్రైవేటు చెప్పించేయాల్సిందే...

సరేనండీ కారంపుడి గురించి దాదాపు నాకు గుర్తున్నంత వరకూ వ్రాసేసాను ఇంకా ఏమన్నా గుర్తొస్తే మధ్య మధ్య లో వ్రాస్తుంటాను. రేపు మరో విషయం మీద మాట్లాడుకుందాం అంత వరకూ శలవా మరి.

--మీ వేణు.

మంగళవారం, జులై 01, 2008

N.S.P. / PWD కాలనీ..

మొన్న, కారంపుడి టపా లో మా కాలనీ రోడ్డు గురించి చెప్పుకున్నాం కదా. అలా బస్ అంత అందమైన రోడ్ లో ఒక 10 నిముషాలు ప్రయాణించాక మా కాలనీ వస్తుంది. రోడ్ మీద ఒక పక్క చిన్న కాఫీ హోటలు దాని పక్కన ఒక కిళ్ళీ బంకు ఉంటే మరో పక్కన కాలనీ లోపలకి వెళ్ళే దారి ఉండేది. రోడ్ ని ఆనుకుని దారి మొదటిలో అటు ఇటు కూర్చోడానికి అరుగు లు లాగా కట్టి ఉండేవి. కారెంపుడి వరకే వచ్చే బస్సులు ఇక్కడ నుండి కాలనీ లోపలకి వెళ్ళే రోడ్ లొ అలా లోపలకి చివర దాకా వెళ్ళి కాలనీ హాస్పిటల్ దగ్గర ఒక round U Turn కొట్టి మళ్ళీ వెనక్కి ఊర్లోకి వెళ్ళేవి.

మా తాత గారి ఇంటి బయట నుంచుంటే ఇలా U Turns కోసం వచ్చిన బస్ కనిపించేది అప్పట్లో మనకదొక వింత :-) అంతే కాకుండా ఎవరైనా ఊరికి బయల్దేరే సమయం లో పిల్లల్లో ఒకళ్ళని ఇంటి బయట కాపలా పెట్టి బస్ రాగానే చెప్పమనే వాళ్ళు. అంటే అలా U turn తీసుకుని వెళ్ళీ కాఫీ టిఫిన్ కోసం ఆపే వాళ్ళనమాట, దాంతో మేము తీరికగా వెళ్ళడానికి కొంచెం టైముండేది. అంతా బాగానే ఉంటుంది కానీ హాస్పిటల్ ముందునుండి వెళ్ళాలంటే మనకి కొంచెం భయం. అయినా తప్పదు కదా వెళ్ళే దారిలోనాయె, సరే ఏం చేస్తాం అని కొంచెం దూరం గా మధ్య మధ్య లో ఇండీషన్ (Injection ని మనం ఇలానే పిలిచే వాళ్ళం) ఇచ్చే కంపౌండరు ఏమన్నా వస్తున్నాడా అని చూసుకుంటూ వెళ్ళేవాడ్ని.

నాకు మా కాలనీ అంటే చాలా ఇష్టం అన్ని ఇళ్ళు ఇంచుమించు ఒకేలా ఉండేవి, ఒకటే ప్లాన్, ప్రతీ ఇంటి ముందూ బోలెడు ఖాళీ స్థలం దాని తర్వాత చిన్న రోడ్ అది దాట గానే గడ్డి వాము దడి. దాదాపు ప్రతి ఇంట్లో పాడి పశువులు ఉండేవి. ఉదయాన్నే తెల తెల వారుతుండగా లేచి, నిలబెట్టిన మంచం పట్టె మీద తల ఆన్చి నించుని, నిద్ర కళ్ళతో, మత్తుగా అలా ఉండి, లయబద్దం గా వినపడుతున్న పాలు పితికే శబ్దాన్ని, పచ్చి పాల మీద నుండి వచ్చే ఒక రకమైన కమ్మటి వాసనని ఆస్వాదిస్తూ ఉంటే ఎంత బావుండేదో... వర్ణించడానికి మాటలు రావడం లేదు.

ఒకో రోజు ఆఫీసరు గారింట్లో పాలు పోసి రావడానికి నేను కూడా వెళ్ళే వాడ్ని. ఇంకా పూర్తి గా నిద్ర లేవని వీధులలో చుట్టూ పచ్చని చెట్ల మధ్య మా పిన్ని చేయి పట్టుకుని, మా స్కూల్ కబుర్లు చెప్తూ నడుస్తూ ఉంటే మాకు నేపధ్యం లో పక్షుల కువ కువ లు, గుడిలో నుండి బాలు గారి గొంతుతో వినిపించే శివస్తుతి వింటుంటే అలసట తెలిసేదే కాదు. ఎంత మధురం గా ఉండేవో ఆ రోజులు. ఉదయం అంటే అలా ఉండాలి అనిపించేలా ఉండేవి. బాలు గారు ఆలపించిన శివస్తుతి మీరు విని ఉండక పోతే వెంటనే వినండి చాలా బావుంటుంది, మరి నాకు మా ఊరిలో వినడం వల్ల అలా అలవాటు అయిందేమో తెలిదు కానీ ఎప్పుడు విన్నా నాకు ఉషోదయమే. ఇంకా ఆఫిసర్ గారి బంగళాలో నెమలి ఉండేది దానికోసమే అంత ఇష్టం గా వెళ్ళే వాడ్ని. నేను నెమలి పురి విప్పడం చూడలేదు కానీ పింఛం తో అలా వయ్యారం గా నడుస్తూ తిరగడం చూసే వాడ్ని. ఎప్పుడైనా వర్షం పడే ముందు బాగా తూనీగలు ఎగురుతుంటే అప్పుడు అనుకునే వాళ్ళం నెమలి ఇప్పుడు పురి విప్పి ఆడుతుంటుందేమో అని.

కాలనీ ఇళ్ళన్నీ దాటి అలా కొంచెం దూరం వెళ్తే కాలవ వచ్చేది అక్కడ పిల్లల ఈతలు అల్లర్లూ చూసి ఆనందించడమే కానీ నాకు ఈత కొట్టేంత ఫ్రీడం ఉండేది కాదు, ఎప్పుడూ ఎవరో ఒకరు పెద్ద వాళ్ళు తోడు రాకుండా అటు వెళ్ళనిచ్చే వారు కాదు నన్ను. అదీ కాక నేను చాలా చిన్న తనం నుండీ కళ్ళద్దాలు వాడాల్సి వచ్చింది. మూడవ తరగతి లోనో 4 లోనో మొదలు పెట్టాను అప్పుడే -6 పవరు వున్న అద్దాలు వాడే వాడ్ని. కాసు ప్రసాద రెడ్డి గారి పుణ్యమా అని ఇప్పుడు లేవనుకోండి. నాకైతే కాలవ ఒడ్డున నిలబడి చేప పిల్లలు ఎక్కడ కనిపిస్తాయా అని చూడటమే గొప్ప సరదాగా ఉండేది. నా సరదా చూసి మా వాళ్ళు బొరుగులు తీసుకుని వచ్చే వాళ్ళు అవి వేస్తే చేప పిల్లలు పైకి వస్తాయి చూడచ్చు అని.

కాలవ దాటి ఒక పక్కగా వెళ్తే చేలుండేవి అక్కడ మట్టి గట్టు మీద జాగ్రత్త గా నడవాలి. చేలో వేరు శనగ మొక్కల్ని పీకి మట్టి తగలకుండా జాగ్రత్త గా ఒలుచుకు తినేవాళ్ళం చాలా రుచి గా ఉండేవి. ఇంకా ఒకో సారి తిరిగి వచ్చేప్పుడు రేగు పళ్ళు, సీమ చింతకాయలు డైరెక్ట్ గా చెట్ల నుండి కోసుకుని తినడం లో ఉండే ఆనందం సూపర్ బజారు లో కొనుక్కుని తెచ్చుకోడం లో ఎక్కడ ఉంటుంది చెప్పండి. అసలు మీరు లేత తాటి కాయ నుండి డైరెక్ట్ గా తాటి ముంజలు ఎప్పుడైనా తిన్నారా... కాయ లో ముంజ కి ఒక పక్కగా బొటన వేలు పెట్టి తిప్పి నోటితో ఒడుపుగా ముంజని మొత్తం లాగేసి తింటుంటే... అసలు ఆ మజా ఎన్ని వందల పిజ్జాలు బర్గర్ లూ తిన్నా దొరకదు. హ హ.. వీడెవడ్రా బాబు పెద్ద తిండి పోతులా ఉన్నాడు అనుకుంటున్నారా... మనం కొంచెం భోజన ప్రియులమే లెండి.

ఇంక ఆటల విషయానికి వస్తే మా మామయ్యలు బిజీ గా కాలేజిలో ఉండే వాళ్ళు దాంతో నేను ఎక్కువ గా మా పిన్ని వాళ్ళతో పులీమేక, పరమపదసోపాన పఠం, గవ్వలు, అచ్చంగిల్లాలు (ఇవి నాకు అస్సలు వచ్చేవి కాదు ఒక రెండు సార్లు ప్రయత్నించి వదిలేసే వాడ్ని), రైటా రాంగా, ఇసుకలో పుల్లని దాచి పెట్టే ఆట ఇలాంటి హాని లేని ఆటలు ఆడేవాడ్ని అనమాట మరి మనకి కళ్ళద్దాలున్నాయ్ కదా సో వీటికే పరిమితం, అసలా అద్దాల మూలం గా నాకు సైకిలు నేర్చుకోడానికి కూడా కుదిరేది కాదు. అమ్మ భయపడి నేర్చుకోనివ్వలేదు మనకీ పెద్ద ఇష్టం లేదనుకోండి అది వేరే విషయం. ఇంకా ఆకాశం లో కొంగలు ఎగురుతుంటే గోళ్ళు ఇలా గట్టి గా పట్టుకుని ...కొక్కిరాయి... అని ఏదో చెప్పే వాళ్ళం అలా చేస్తే కొంగలు వాటి తెల్ల రంగుని మన గోళ్ళకి ఇచ్చి వెళ్తాయంట. నిజం గానే కొంగలు వెళ్ళాక చూస్తే గోరు మొదట్లో తెల్ల గా మచ్చ కనిపించేది తెగ మురిసి పోయే వాళ్ళం :-) నొప్పి పుట్టేలా గోటిని నొక్కి పట్టుకుంటే తెల్ల మచ్చ పడక చస్తుందా...

అవనమాట కొన్ని నా చిన్ననాటి కబుర్లు.
మళ్ళీ మరో టపా లో మరిన్ని కబుర్లతో కలుద్దాం అంత వరకూ శలవా మరి....

--మీ వేణు.

శనివారం, జూన్ 28, 2008

అనగనగా ఓ హిచ్...

ఆయ్!! మీరు సరిగానే చదివారండి అప్పుతచ్చులేం లేవు...లేదూ నేనింకేదో చెప్పబోయి తుమ్మనూ లేదు... అది హచ్(తుమ్ము) కాదు హిచ్చే... అనుమానమేం లేదు వీడికి పిచ్చే... అని మీరు నిర్ధారించే లోపు టాపిక్ లోకి వచ్చేస్తాను. మొన్నీ మధ్యన నా ఫ్రెండ్ మా ఊరి నుండి వేరే ఊరికి మూవ్ అయ్యాడు అని చెప్పాను కదా... తనకి ఒక చిన్ని కారు తో పాటు బోలెడంత సామాను ఉంది. సామాను అంటే ఇక్కడ అమ్మేసి వెళ్ళి అక్కడ కొనుక్కునే టైపు సామాను కాదండోయ్... బట్టలు, పుస్తకాలు ఇతరత్రా చిన్ని చిన్ని ఎలెక్ట్రానిక్ సామన్లు ఇంకా మోజు పడి కొనుక్కున్న జిం సామాగ్రి గట్రా అనమాట. సొ అవన్నీ కారు తో సహా తను వెళ్ళే ఊరికి తీసుకు వెళ్ళాలి. మూవ్ అవడానికి ఒక నెల ముందు నుండే ఆలోచించీ... చించీ... చించి మిగతా ఉపాయాలేమి పని చేయడం లేదు అని ఎంత దూరమైనా సరే నే డ్రైవ్ చేసుకెళతా అని ఓ నిర్ణయానికి వచ్చేసాడు.

సరే సామాను చూస్తే బోలెడు ఉంది కార్ చూస్తే చిన్నది ఏం చేయాలా అని ఆలోచించి కార్ కి ఒక Uhaul Trailer తగిలిద్దాం అని డిసైడ్ అయ్యాడు. ఇక్కడే మన హీరో(హిచ్) ఎంటర్ అయ్యేది...సాధారణం గా Sports utility vehicles లేదా పికప్‌ట్రక్కులకీ వుండే ఈ హిచ్ ని మన వాడి బుజ్జి Toyota Celica కార్ కి తగిలించాలి. మామూలు గా ఏ Uhaul ఆఫిసుకో లేదా మెకానిక్ షెడ్ కో తీసుకు వెళ్తే ఓ నాలుగైదువందల డాలర్లు తీసుకుని బిగించి ఇచ్చే వాడు. కానీ మా వాడికి కార్ మెకానిజం అంటే బోలెడంత ఇష్టం, తను మెకానికల్ ఇంజినీరు లెండి. ఈ కార్ ని అమ్మేయకుండా ఇంకా వాడుతున్నదే దాని మీద ప్రయోగాలు చేయడానికి.

మనమేమన్నా తక్కువ తిన్నామా Instrumentation Engineering పట్టా పుచ్చుకున్నాం కదా, అదీ కాక నాకు చిన్నప్పటి నుండీ ఇలాంటి పనులు అంటే మహా సరదా... కావాలంటే మా ఇంట్లో పాత గడియారాలని రేడియో లని అడగండి వాటి ధీన గాధలు వినిపించటానికి సొంతం గా ఓ బ్లాగ్ ఓపెన్ చెస్తాయి.... అంటే హైస్కూల్ కి వచ్చాక తిరిగి బిగించడం కూడా వచ్చిందనుకోండీ అంతకు ముందు విషయాలు మీరు నన్ను అడక్కూడదు. అప్పట్లోనే మన ఈ కళని చూసి మా నాన్న గారు సతీ లీలావతి సినిమా లో కమల హాసన్ లా "మనోడి రిపేరింగుని జూసావా పెద్ద ఇంజినీరైపోతాడీడు" అని అనుకునే వారంట.

సరే సరే వర్తమానం లోకి వస్తే...ఠాట్ ఇంట్లో ఇద్దరు ఇంజనీర్లం ఉండి ఎవడికో అప్పగించడమేంటి... అదీ గాక గాంధీ గారు ఏమని చెప్పారు మన పని మనమే చేసుకోవాలి అని చెప్పారు (అంటే అదే కారణం కాదు లెండీ ఆ వంక తో మా సరదా కూడా తీరుతుంది ఇంకా కాసిన్ని డబ్బులూ మిగుల్తాయ్ కదా అవి ఎంచక్కా షేర్స్ లో పెట్టుకోవచ్చు అని) సో ఇత్యాది కారణాల వల్ల మేమే బిగించాలి అని డిసైడ్ అయ్యాం అంతర్జాలం లో వెతికి కావాల్సిన సరంజామా ఆర్డర్ చేసాడు మా వాడు. అది రావడానికి ఒక రెండు వారాలు పైనే పట్టింది.

అంతా వచ్చేసాక ఇక చూస్కోండి మా వీరంగం అంతా ఇంతా కాదు ఓ రెండు వారాల పాటు మా అపార్ట్‌మెంట్ జనాలకి ఏమీ అర్ధం అయ్యేది కాదు. గరాజ్ లో చేస్తే ఒక అందం కానీ మేం ఏ మాత్రం సిగ్గు పడకుండా అపార్ట్‌మెంట్ ఓపెన్ పార్కింగ్ లాట్ లో వీకెండ్, వీక్‌డే అని తేడా లేకుండా ఎప్పుడు మూడ్ వస్తే అప్పుడు సాయంత్రాలు ఒక అరగంటా, గంటా టైం దానికి కేటాయించే వాళ్ళం.
ఇదే మేం బిగించిన హిచ్.. స్టీల్ లా మెరిసిపోయేది బాల్‌మౌంట్, రంగు రంగుల వైర్ లు కార్ లోపల్నుండి వచ్చాయి కదా ఆ వేలాడే కనెక్టర్ ని Trailer కి కలిపితే అప్పుడు కార్ తో పాటు Trailer కి కూడా సిగ్నల్ & బ్రేక్ లైట్లు వెలుగుతాయనమాట
అదేంటో మాకు ఏ పనీ మొదటి సారి విజయవంతం అయ్యేది కాదు మొదట Trailer లైట్లకి వైరింగ్ చేయాలి. అది కొంచెం తడబడినా విజయవంతం గా పూర్తి చేసాం. తర్వాత ఒక రోజు ఒక అరగంట నానా తంటాలు పడి బంపర్ పీక లేక వదిలేసాం. మరుసటి రోజు అరనిముషం లో అదీ పీకేసాం. తర్వాత బిగిద్దాం అంటే alignment కుదర్లేదు దాంతో మా వాడి మెకానికల్ బుర్ర ఉపయోగించి Filing చేసాడు అలా Failure is stepping stone of success అని ప్రత్యక్షం గా అనుభవించాం అనమాట.
Uhaul వాడు ఇలా హుక్ చేస్తాడు
మొత్తం మీద అంతా అయిపోయాక మా అనందం మాత్రం వర్ణనాతీతం. ఆదా చేసిన డబ్బులు కాదు కానీ మా పని మేం చేసుకోడం తో వచ్చిన ఆనందం అనమాట. అంతా అయిపోయి చివరగా Uhaul వాడి దగ్గరకి వెళ్తే వాడు అరనిముషం లో మేం బిగించిన హిచ్ కి Trailer హుక్ చేసి ఇచ్చేసరికి మా అనందం అంతా ఇంత కాదు మా అంతట మేమే సొంతంగా కార్ డిజైన్ చేసి డెవలప్ చేసినంత ఫీల్ అయిపోయాం. విమానాన్ని కనిపెట్టిన రైట్ బ్రదర్స్ కూడా అంత ఆనందించి ఉండరు. Toyota Celica హిచ్ మరియూ యూహాల్ ట్రైలర్ తో

సో అదనమాట మా హిచ్ కధా కమామిషు... ఇంకెందుకాలస్యం సాధనమున పనులు సమకూరు ధరలోన... అనుకుంటూ మీరూ ఇలాటిదే ఏదో కార్యక్రమం మొదలు పెట్టండి మరి...

మళ్ళీ మరో టపాలో కలుసుకుందాం...

అంతవరకూ శలవా మరి....

--మీ వేణు.

శుక్రవారం, జూన్ 27, 2008

గుల్మొహర్

ఈ టపా టైటిల్ చూసి ఇదేదో ఈనాడు వారి విపుల పుస్తకం లో అనువాద కధ లా ఉందే అని వచ్చిన వారికి సారీ అండీ, మిమ్మల్ని disappoint చేసినందుకు. ఏదో నోటికి వచ్చినట్లు బ్లాగమంటే సరే కానీ మనకీ కధలూ కవితలు రాసే అంత దృశ్యము లేదు. అప్పటికీ ఆ మధ్య హైస్కూల్ లో చదువుకునే రోజులలో "ఆకుపచ్చని కన్నీరు", "మెత్తని గుండ్రాయి" అని కొన్ని తవికలు రాసాను కానీ జంధ్యాల గారు ఆయన చంటబ్బాయి సినిమా లో వాడుకుంటాను అంటే కాదనలేక ఇచ్చేసాను, మళ్ళీ ప్రయత్నించలేదు :-)
సరే ఇక నా టపా విషయానికి వస్తే, ఇదిగో పైన కనిపిస్తున్న గుల్మొహర్ చెట్టు గురించి, దాని పువ్వుల అందం గురించి వాటి మొగ్గలతో మేము ఆడుకునే కోడి పందెం ఆట గురించీ నా కారంపుడి టపా లో చదివి ఈ చెట్టుపై నాకున్న ఇష్టాన్ని అర్ధం చేసుకుని, వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వాళ్ళ ఊరిలో ఉన్న ఈ చెట్టూ, పువ్వులూ ఫోటో లు తీసి నాకు పంపించిన నా నేస్తం "బుడిగి" కి బోలెడు నెనర్లూ థాంక్స్ లూ (పేపర్‌కాయితం లా) చెప్పుకుంటూ ఆ ఫోటో లు నా బ్లాగు లో భద్రపరచుకొని అప్పుడప్పుడూ చూసుకోవచ్చు కదా అని ఈ రోజు టపా లో అవి పోస్ట్ చేస్తున్నా.అశోకుడు రోడ్లకి ఇరువైపులా నాటించింది ఈ చెట్లో అశోక చెట్లో నాకు తెలీదు కానీ మా కాలనీ రోడ్ లో ఇవి మాత్రం గొడుగులా పెద్దగా పెరిగి మంచి నీడనిచ్చేవి. కొన్ని చెట్లకి కింద చెట్టు చుట్టూ అరుగులు కట్టి ఉండేవి పిల్లలం వాటి మీద కూర్చుని మరీ ఆడుకునే వాళ్ళం. మా ఇంట్లో మాత్రం అది Main Road కావడం తో బాబోయ్ బస్సులు వస్తాయ్ అని ఒక్కడ్నే వెళ్ళనిచ్చే వాళ్ళు కాదు ఎవరో ఒకరు ఎస్కార్ట్ ఉండాల్సిందే లేదంటే ఒకో రోజు వాళ్ళే వెళ్ళి కాసిన్ని మొగ్గలు తెచ్చి ఇచ్చి ఇంట్లోనే ఆడుకొమ్మనే వాళ్ళు.

నాకు పేరు గుర్తు రాక కోడిపుంజు చెట్టు అని పరిచయం చేసిన ఈ చెట్టుకు అసలు "గుల్మొహర్, అగ్నిపూలచెట్టు, పొగడపూలచెట్టు, Flame of the forest (Botanical : delonix regia)" అని బోలెడు పేర్లు ఉన్నాయిట వీటిలో ఏవైనా కరెక్ట్ కాదనిపించినా... ఇంకేదైనా కొత్త పేరు మీకు తెలిసినా వ్యాఖ్య ద్వారా తెలియ చేయండేం. ఎందుకంటే నా ఙ్నాపక శక్తి మీద నాకు పెద్ద గా నమ్మకం లేదు కాని గుల్మొహర్ పేరు మాత్రం గుర్తొచ్చింది తర్వాత ఓ నేస్తం గుర్తు చేస్తే.అప్పట్లో పుష్పవిలాపం గురించి తెలియక పోయినా చెట్టుకి ఉన్నవి ఎక్కువ తెంపే వాళ్ళం కాదు. గాలికి మొగ్గలు పువ్వులూ రాలి కింద పడేవి, బహుశా మా లాంటి పిల్లలు ఆడుకుని ఆనందిస్తారనే చెట్టు మరిన్ని రాల్చేదేమో. అలా కింద పడినవి మాత్రమే ఏరుకుని ఆడుకునే వాళ్ళం. చెట్టు నుండి నేరుగా పువ్వులు కోయకూడదు అని నియమం కాదు లే కాని మొగ్గలు పువ్వులూ మాకు అందనంత ఎత్తులో ఉండేవి అందుకే బుద్ది గా ఉండే వాళ్ళం. కానీ ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తుంది కర్కశం గా మొగ్గని చిదిమి ఆడుకుని ఆనందించే వాళ్ళమని తెలిస్తే కరుణశ్రీ గారు ఏమని అని ఉండేవారో !!
ఇదిగో ఇలా మెలేసి లాగితే ఎవడి కోడి తల తెగితే వాడు ఓడిపోయినట్లు :-) ఇందులో ఓ చిన్న టాక్టీసు ఉందండోయ్ మనం సెలెక్ట్ చేసుకునే ముందే కొంచెం జాగ్రత్త గా చూసి తలలు కొంచెం స్ట్రాంగ్ గా ఆటాచ్ అయి ఉన్నవి సెలెక్ట్ చేసుకుని రంగం లోకి దిగాలి అప్పుడు కానీ కొంచెం నిలబడలేం.
సరే మరి బొమ్మలు చూసి ఆ ఙ్నాపకాలు మళ్ళీ ఓ సారి గుర్తొస్తే అలా ఓ సారి ఫ్లాష్ బాక్ లోకి వెళ్ళి వచ్చి ఓ పదేళ్ళు వయసు తగ్గించుకోండి :-)

ఈ రోజుకి ఇక శలవా మరి.
--మీ వేణు.

గురువారం, జూన్ 26, 2008

అయ్యోలూ..హమ్మోలు..ఇంతేనా!!

మనకున్న సీరియలోఫోబియా !! (అలా హశ్చర్యపడిపోయేస్తే కష్టం, మాయాబజార్ లో్ "ఎవరూ పుట్టించక పోతే మాటలెలా పుడతాయ్" అన్న ఘటోత్కచుడ్ని ఆదర్శం గా తీసుకుని నేనే కనిపెట్టా ఈ పదం). సరే ఏదో ఒకటి ఏడూ... అని అనేసారని నాకు వినపడిందిలే. సో మనకున్న సీరియలోఫోబియా తో మొదట్లో ఈ అమృతం సీరియల్ జోలికి వెళ్ళే వాడ్ని కాదు. కానీ కొంచెం పాపులర్ అయిన తర్వాత ఇంట్లో బలవంతం గా కూర్చో పెట్టేసి చూయించారు.

మొదట్లో నేను చూసిన ఎపిసోడ్స్ లో కామెడీ కధ కన్నా పాటలకి పేరడీ లు కట్టి వెటకారం చేయడం ఎక్కువ ఉండేది కొన్ని ఎంత బాగా నచ్చేవో కొన్ని అంత చిరాకూ తెప్పించేవి. తర్వాత కొన్ని రోజులకి అన్నీ నచ్చడం మొదలు పెట్టాయి మెల్లగా నేను కూడా Addict అయిపోయాను. మరీ పనులు మానుకుని కాక పోయినా ఆదివారం ఖాళీ వుంటే మాత్రం వదలకుండా చూసే వాడ్ని. మామూలు సాగతీత సీరియల్స్ లా లేకుండా ఇది ఏ వారానికి ఆ వారం చిన్న చిన్న పిట్టకధల లా ఉండటం తో బాగా నచ్చేసింది.

అన్నట్లు ఆదివారం అంటే గుర్తొచ్చింది ఇప్పుడు ఇంకా వేస్తున్నాడో లేదో కానీ అప్పట్లో ఈటీవీ లో ఆదివారం రాత్రి 9:30 కి జంధ్యాల గారి సినిమాలు వేసే వాడు. శ్రీవారికి ప్రేమలేఖ సినిమా అందులో చాలా సార్లు వేసేవాడు అది టెలికాస్ట్ అయిన ప్రతీ సారీ చూసే వాడ్ని. ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టని హాస్యం ఆ సినిమాకే సొంతం.

ఇక సిరివెన్నెల గారు రాసిన ఈ సీరియల్ టైటిల్ సాంగ్ ఎంత ఇష్టమంటే, Just Yellow banner ఈ పాటా, లిటిల్ సోల్జర్స్, ఐతే మూడూ కలిపి CD రిలీజ్ చేస్తే నాకు బెంగళూరు లో దొరకడం లేదు అని హైదరాబాద్ నుండి ఒక ఫ్రెండ్ వస్తుంటే తనతో తెప్పించుకున్నా :-) అంత ఇష్టం అనమాట.

సీరియల్ : అమృతం
సంగీతం : కల్యాణి మాలిక్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : కల్యాణి మాలిక్

అయ్యోలూ హమ్మోలు..ఇంతేనా బ్రతుకు హు హు హు.....
ఆహాలూ ఓహొలు..ఉంటాయి వెతుకు హ హ హ.....

మన చేతుల్లోనే లేదా రీమోట్ కంట్రోలు....
ఇట్టే మార్చేద్దాము ఎడుపు గొట్టు ప్రోగ్రాం లు.....

వార్తల్లొ హెడ్ లైన్సా... మన కొచ్చే చిలిపి కష్టాలు......
అయొడిన్ తో అయిపోయే.. గాయాలే మనకు గండాలు....

ఎటో వెళ్ళి పోతూ..నిన్ను చూసింది అనుకో ఓ ట్రబులు..
hello..how do u do.. అని అంటోంది అంతే నీ లెవెలు.
ఆతిధ్యం ఇస్తానంటె మాత్రం వస్తుందా...
తీరిగ్గా నీతో కాలక్షేపం చేస్తుందా..
గాలైనా రాదయ్యా..నీదసలే ఇరుకు అద్దిల్లు....
కాలైనా పెడుతుందా నీ ఇంట్లో పెను తుఫానసలు...

ఒరేయ్ ఆంజినేలు .. తెగ ఆయస పడిపొకు చాలు....
మనం ఈదుతున్నాం..ఒక చెంచాడు భవ సాగరాలు..
కరెంటు రెంటు etc., మన కష్టాలు...
కర్రీ లొ కారం ఎక్కువ ఐతె కన్నీళ్ళు
నైటంతా దోమల్తొ.. ఫైటింగే మనకి గ్లోబల్ వార్..
భారీ గా ఫీల్ అయ్యే.. టెన్షన్ లేం పడకు గోలీ మార్.

బుధవారం, జూన్ 25, 2008

వంట-తంటా (కామన్‌సెన్స్ కరువైన ఓ వంట కధ)

ఆ మధ్య కొన్ని బ్లాగులలో మగ వాళ్ళే వంటింటికి అసలు సిసలు హక్కు దారులు అని అనడం చూసి నా అనుభవాన్ని తెలియచేయాలి అని ఈ టపా మొదలు పెట్టాను....ఇక చదవండి.

ఈ మధ్యే నా పాత తెలుగు రూమ్మేట్ వేరే ఊరికి మారిపోడం తో సులేఖా, ఏక్‌నజర్ లాటి వెబ్‌సైట్ల లో ప్రకటనలు ఇచ్చి మళయాళీ యువతరానికి ప్రతినిధి అయిన ఒక అతనికి నా అపార్ట్మెంట్ లో ఓ గది అద్దెకిచ్చాను. పేరు బాబి :-) అలా నవ్వకండి అతని పేరు కృష్ణ సినిమాలో బ్రహ్మానందానికి పెట్టి కామెడీ చేస్తే అతనేం చేస్తాడు చెప్పండి. నాకూ మొదట్లో పిలిచినప్పుడల్లా నవ్వు ఆపుకోడం కొంచెం కష్టమైందనుకోండీ.

సరే ఇక సోది ఆపి విషయం లోకొస్తే ఇతను మొన్న ఒక రోజు సాయంత్రం కాలీఫ్లవర్ కూర చేస్తాను అని మొదలు పెట్టాడు. ఆహా !! బావుంది సరే నువ్వు చేసి పెట్టు బాబు మేము తిని పెడతాం, అని నా ఫ్రెండూ నేను కొంచెం షాపింగ్ ఉంటే వెళ్ళి ఆ పని చూసుకుని ఒక అరగంటలో వచ్చాం. మేం వచ్చే సరికి ఘుమఘుమలు పార్కింగ్ లాట్ వరకూ కొడుతున్నాయి. మన వాడు పథ్యం కూర వండినా గరమ్మసాలా కొబ్బరి లాంటివి వేసి సువాసనలు మాత్రం తెప్పించేస్తాడు లెండి. మేమిద్దరం ఆకలితో నక నక లాడుతూ ఆహా ఏమి మన భాగ్యము అని పాడుకుంటూ ఇంట్లోకి అడుగుపెట్టాం.

మేం అడుగు పెట్టే సరికి అతను కిచెన్ లో, war room లో critical decision తీసుకోబోయే ఆర్మీ మేజర్ లా తుపాకి బదులు ఒక చిన్న గరిటె పట్టుకుని హడావిడి గా అటూ ఇటూ తిరగుతున్నాడు. మాకు చూడగానే దాల్ మె కుచ్ కాలా హై అనిపించింది. సరే ఇంతకీ సంగతేంటి గురూ అని ఇద్దరం ఒకేసారి అడిగేసాం. sorry Man it's a disaster అన్నాడు. అది సరే నాయనా ఇంత మంచి ఘుమఘుమలు కొడుతుంటే అలా ఎలా ఒప్పుకుంటాం అసలు ఏం జరిగిందో చెప్పు అని అడిగాం. దానికి మన వాడు ఇలా చెప్పుకొచ్చాడు.

మసాలాలు గట్రా అన్నీ వేసి కాలీఫ్లవర్ కొంచెం ఉడికాక మరీ కొద్దిగే ఉంది ముగ్గురుకి సరిపోదేమో అనిపించిందట, దాంతో ఫ్రిజ్ లో ఉన్న ఫ్రోజెన్ కాకరకాయ ముక్కలని యధా తధం గా కూర లో పడేసాడుట. తర్వాత మరి మన వాడికి రుచి చూడాలి అని ఎందుకనిపించిందో, చూస్తే కూరంతా చేదు విషం పోనీ అక్కడితో ఆపేశాడా అంటే లేదు. కొంచెం తెలివి తేటలు ఉపయోగించి బోలెడు ఉప్పు పోసేసాడు "ఉప్పు చేదుని విరక్కొడుతుంది" అని ఎవరో చెప్పినట్లున్నారు, సరే ఇంత చేసినా చేదు పోలేదు గదా అని పంచదార కూడా కలిపాడుట. వింటున్న మా మొహాలలో తెలుగు సినిమాలలో కామెడీ నటులు అందరూ పూనారా అన్నట్లు చిత్ర విచిత్రమైన expressions అన్నీ పలికాయంటే నమ్మండి.

అసలు కాలీఫ్లవర్ కాకరకాయ రెండూ కలిపి వండాలి అన్న ఆలోచనే అమోఘం, బహుశా రెండూ "క" తోనే మొదలయ్యాయి కదా అని కలిపేద్దాం అనుకున్నాడేమో. దానికి తోడు మళ్ళీ ఫిక్షింగ్ ట్రీట్మెంట్ ఒకటి. అయినా ఒక సారి ప్రయత్నించి చూద్దాం అని ఒక ముక్క నోట్లో వేసుకుని చూద్దును గదా, చంటబ్బాయి సినిమా లో శ్రీలక్ష్మి వండిన "అఱటి పండు లంబా లంబా" తిన్న ఎడిటర్ కి మల్లే చిన్నప్పుడు చదువుకున్న హిస్టరీ పాఠాలు అన్నీ గుర్తొచ్చేసాయి. సరే అన్నం ఎందుకు లే వేస్ట్ చేయడం అని ప్రియా పచ్చళ్ళు, దిక్కుమాలిన యోగర్ట్ లతో భొంచేస్తుంటే అంతకు ముందు రోజే చదివిన మగవాళ్ళ వంట టపాలు గుర్తొచ్చి ఈ ప్రహసనాన్ని తప్పక బ్లాగాలి అని అనుకున్నాను.

అద్భుతం గా వండి వార్చే మగవాళ్ళంతా నా మీద దండయాత్రకి సిద్దం కాకండేం. నా ఉద్దేశ్యం మగ వాళ్ళకి వంట రాదు అని చెప్పడం కాదు. నారీమణులంతా నిజం గా వంట గది అప్పగించే ఆలోచనలో ఉంటే, ఓ పాలి ఆలోసించి ఆ పని చేయండి, కీడెంచి మేలెంచమన్నారు కదా పెద్దలు :-)

సోమవారం, జూన్ 23, 2008

వాసంత సమీరం లా

ఏవో కొన్ని ప్రోగ్రాం లు, పండగల కి ప్రత్యేకించి తీసిన టెలీఫిల్మ్ లు తప్ప అంత గా ఆకట్టుకోని కార్యక్రమాల మధ్య బాగా ప్రాచుర్యాన్ని పొందిన మొదటి తెలుగు ధారా వాహిక ఋతురాగాలేనేమో. అప్పట్లో నాకు తెలిసి ఆదివారం ఉదయం వచ్చే రామాయణం తర్వాత మా ఊరిలో దాదాపు ప్రతి ఇంట్లోను ఒకే సమయం లో high volume లో పెట్టుకుని చూసే ప్రోగ్రాం లో ఇది ఒకటి. ఋతురాగాలు దూర దర్శన్ లో సాయంత్రం నాలుగు గంటలకు వచ్చేది అనుకుంటాను, స్కూల్ / కాలేజి నుండి ఇంటికి వచ్చే టైము. నాకు ఇంకా బాగా గుర్తు, ఇంటికి వస్తుంటే దారి పొడవునా ప్రతి ఇంట్లోనూ ఈ పాట మార్మోగిపొతుంటుంది. నేను ఈ సీరియల్ ఎప్పుడూ చూడక పోయినా ఈ పాట మాత్రం చెవులు రిక్కించి వినే వాడ్ని. ప్రారంభం లో వచ్చే ఝుం తన నం తననం... వినగానే చాలా హాయిగా అనిపించేది. ఇప్పటికీ ఈ పాట వింటుంటే మనసు అప్పటి ఙ్నాపకాలలోకి వెళ్ళి పోతుంది. అప్పట్లో బాగా పేరుపొందిన కార్యక్రమాలలో చిత్ర లహరి, చిత్ర హార్, చిత్రమాల కూడా వుండేవి. వరుసగా గురు, శుక్ర, ఆది వారాలలో వచ్చేవనుకుంటా.

జెమినీ లో ఈ ధారావాహిక ఇప్పుడు తిరిగి ప్రసారం చేస్తున్నారల్లే వుంది. తెలుగు TV కి access లేని వాళ్ళు ఈ పాట ని ఇక్కడ చూడవచ్చు.

http://www.youtube.com/watch?v=OW_DaYkE-_E



సంగీతం : బంటి, రమేష్
సాహిత్యం : బలపద్ర పాత్రుని మధు
గానం : సునీత, బంటి.

వాసంత సమీరం లా
నునువెచ్చని గ్రీష్మం లా
సారంగ సరాగం లా
అరవిచ్చిన లాస్యం లా

ఒక శ్రావణ మేఘం లా
ఒక శ్రావణ మేఘం లా
శరత్చంద్రికల కల లా..

హేమంత తుషారం లా
నవ శిశిర తరంగం లా
కాలం.. జాలం.. లయలొ కలల అలల సవ్వడి లొ
కాలం.. జాలం.. లయలొ కలల అలల సవ్వడి లో
సాగే జీవన గానం అణువణువున ఋతురాగం
సాగే జీవన గానం అణువణువున ఋతురాగం

వాసంత సమీరం లా
నునువెచ్చని గ్రీష్మం లా
సారంగ సరాగం లా
అరవిచ్చిన లాస్యం లా

గురువారం, జూన్ 19, 2008

బండి కాదు మొండి ఇదీ

"అప్పట్లో" అని అంటూ ఈ రోజు పోస్ట్ మొదలు పెడుతుంటే, హఠాత్తుగా "అహ నా పెళ్ళంట" సినిమా లో "మా తాతలు ముగ్గురు..." అని అంటూ ఆటో బయోగ్రఫీ చెప్పే నూతన్ ప్రసాద్ గారు గుర్తొచ్చి నాకే నవ్వు వచ్చింది, నేను కూడా అలా తయారవుతున్నానా అని. అయినా స్వగతం అంటూ బ్లాగడం మొదలు పెట్టాక తప్పదు కదా. అయినా ఇంచు మించు అదే రేంజ్ లో సుత్తి కొట్టినా కనీసం అందులో నూతన్ ప్రసాద్ గారి లా కట్టేసి కూర్చో పెట్టి వినింపించడం లేదు కదా అని నాకు నేనే సర్దిచెప్పుకున్నాను :-)

సరే ఇక విషయానికి వస్తే మొన్న ఒక రోజు ఆన్‌లైన్ లో ఏదో న్యూస్ క్లిప్పింగ్ విడియో చూస్తుంటే, దానిలో పెరుగుతున్న పెట్రోల్ ధరల గురించి చెప్తూ "బండి కాదు మొండి ఇది" పాట ని నేపధ్యం లో వినిపిస్తున్నారు అది వినగానే ఔరా అనిపించింది. దాదాపు 30 యేళ్ళ క్రితం ఆత్రేయ గారు వ్రాసిన ఈ పాట ని ఇంకా వాడుకుంటున్నారు అంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఈ సమస్య ఇంకా అలానే ఉన్నందుకు విచారించాలా, లేకా అలాంటి ఒక సమస్యని చలోక్తి గా తన పాట లో కలిపి వ్రాసిన ఆత్రేయ గారిని, కల కాలం నిలిచి పోయే స్వరాన్ని ఇచ్చిన యం.యస్.విశ్వనాథన్ గారిని మెచ్చుకోవాలా అనేది అర్ధం కాలేదు. మురళీ మోహన్ గారు నటించిన రామదండు అనే ఈ సినిమాకి బాలచందర్ గారు పర్యవేక్షణ మాత్రమే అని వుంటుంది కాని కధా వస్తువు, టేకింగ్ అంతా ఆయన స్టైలే కనిపిస్తుంది.

ఇంతకీ కొసమెరుపు ఏవిటంటే పెట్రోల్ ధరని పల్లవి లోనే ఉపయోగించినా పాటంతా ఒక పాత డొక్కు కారు తో పడుతున్న పాట్ల గురించి.

నేను చిన్నప్పుడు ఇష్టం గా విన్న పాటలలో ఇదీ ఒకటి....

చిత్రం : రామదండు
సంగీతం : యం.యస్.విశ్వనాథన్
సాహిత్యం : ఆత్రేయ

బండి కాదు మొండి ఇదీ సాయం పట్టండీ...
పెట్రోల్ ధర మండుతోంది ఎడ్లు కట్టండి...
గోపాలా.. గోవిందా.. రావయ్యా.. లాగయ్యా..

||బండి కాదు||

ఎక్కడికి వెళ్ళాలయ్యా...వెళ్ళినాక చెప్తానయ్యా..
చెప్పకుంటె ఎట్టాగయ్యా... చెప్పుకుంటె తంటాలయ్యా...

||ఎక్కడికి||
||బండి కాదు||

అరె ఇంగ్లాండు మహరాణి ఈ డొక్కు కార్లోనె ఊరేగి వెళ్ళిందటా...హా..
అది చూశాకా మోజెక్కీ మైసూరూ మహరాజ దర్జాగ కొన్నాడటా..
అది ఏలమేసారు నాన్న పాట పాడారు...ఏ గాణి ఇచ్చారు ఏగించుకొచ్చారు
ఇది పుట్టాక ఇట్టాగే నెట్టించు కుంటూంది నెట్టింది ఇన్నేళ్ళటా...||2||
అదే అలవాటు అయ్యిందటా...
అరె ఊగిపోతుందీ...అసలు ఊడిపోతుందీ...
ఒట్టి బొమికెలేనండి...దీన్ని మోసుకెళ్ళండీ...
మీ పెళ్ళిళ్ళు జరగాలి రా... నాయనా...
మీరు ఊరేగి వెళ్ళాలి రా..ఇది జగన్నాధ రధమేను రా...

||ఎక్కడికి||
||బండి కాదు||
గోపాలా.. గోవిందా..రేయ్ నాయ్‌నా గోపాలా..
రా రా సాయం పట్రా..నెట్టు నెట్టు నెట్టు నెట్టు..

అరె కన్నాను పిల్లల్ని అరడజను కోతుల్ని
చిన్నారి సైన్యాన్నీ..పేరెట్టాను రామదండనీ...
అరె లంక కెళ్ళింది... రాణి తోటి వచ్చిందీ...
అరె బ్రిడ్జి కట్టిందీ... ఇంత ఎవరు చేసిందీ..
మా రామదండు నెదిరించి ఏసైన్యం ఏనాడు గెలిచింది బతికిందీ...
హ హా...ఇది ఊరంతా తెలిసిందీ...
ఈ కారు చూడండీ... నకరాలు చేస్తోందీ...
దీనంతు చూడండీ... ఒక్క తోపు తోయ్యండీ...
అరె ఈ కారు కొన్నందుకూ... నేనిందర్ని కన్నందుకూ...
సరిపోయారు తోసేందుకూ....

||ఎక్కడికి||2||

||బండి కాదు||

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.