అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

అందమైన బాల్యం

మధురమైన జ్ఞాపకాలతో అందమైన బాల్యాన్ని నా సొంతం చేసినందుకు అమ్మానాన్నలకు ఎప్పుడూ ఋణపడి ఉంటాను. మొదటి సంతానాన్నవడంతో నేనాడిందే ఆట పాడిందే పాట అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళినా మా ఇంట్లో అయినా అపురూపంగా గడిచింది. పాడుకున్న పాటలు, ఆడుకున్న ఆటలు, స్కూల్ ఎగ్గొట్టడానికి వేసిన వేషాలు, తిన్న చిరుతిళ్ళు, నాన్న వేలు పట్టుకుని కొట్టిన షికార్లు, 16mm సినిమాలు కబుర్లు ఇక్కడ చదవచ్చు.

ఇంటర్మీడియెట్ హాస్టల్ కబుర్లు

నూనూగు మీసాల నూత్న యవ్వనం అమ్మానాన్నలకు దూరంగా నాదంటూ ఓ స్వంత ప్రపంచం. అప్పటివరకూ ప్రతి చిన్న పనికి వాళ్ళమీద ఆధారపడి ఒక్కసారిగా నాకు నేనే నెగ్గుకు రావాల్సిన పరిస్థితులను తలుచుకుని దిగులు. అంతలోనే చుట్టూ ఉన్న స్నేహితులతో నేస్తం కట్టేసి చేసిన అల్లర్లు, పరోఠాల బిజినెస్సులు, చెరకుతోట దొంగతనాలు, ఆడ్మినిస్ట్రేటర్ కి మస్కాగొట్టి చూసిన సినిమాలు, సరదా కొంటె కబుర్లు ఇక్కడ చూడండి.

ఇంజనీరింగ్ కాలేజ్

ఇంటర్మీడియెట్ కి రెసిడెన్షియల్ హాస్టల్ కనుక పంజరంలో పక్షిలా బతికితే ఇంజనీరింగ్ కాలేజ్ యూనివర్సిటీ హాస్టల్స్ లోకి వచ్చేసరికి ఒక్కసారిగా జూలోనుండి పచ్చని అడవిలోకి వదిలేసిన జింక పరిస్థితే అయింది, ఎక్కడికి పరుగులెట్టినా ఏం చేసినా అడిగేవాళ్ళులేరు. అసలు హాస్టల్ బిల్డింగ్ లో నిరంతరం కాపుకాసే వార్డెన్ ఉండడనే విషయం నాకు డైజెస్ట్ కావడానికి నెలపట్టింది :-) నిజమా అలా ఎలా సాధ్యం అని ఇప్పటికీ అనిపిస్తూనే ఉంటుంది. అంతటి స్వేఛ్చాప్రపంచంలో చేసిన అల్లర్లు కొన్ని కబుర్లు ఇక్కడ.

సినిమాలు రివ్యూలు..

నాకున్న అతి పెద్ద వ్యసనం సినిమా చూడడం రిలీజైన ప్రతి అడ్డమైన సినిమా చూసేసి ఈబొమ్మలో చూపించినట్లు తెలుగు సినిమాని భుజాల మీద మోసేవాళ్ళలో నేనొకడ్ని. చూసి ఊరుకోకుండా ఇది ఇందుకు బాలేదు అది అందుకు బాగుంది అంటూ పేద్ద వంద సినిమాలు తీసేసి విశ్రమిస్తున్న మేధావిలా చేసే విశ్లేషణలు :-) హహహ చదివిన ఒకరిద్దరు అలా తిడతారు కానీ నా దృష్టిలో ఒక సాధారణ సినీ ప్రేక్షకుడు చూసొచ్చి మిత్రులతో చెప్పే కబుర్ల లాంటి నా సినీ రివ్యూలు ఇక్కడ చదవండి. ఆరెంజ్, ఖలేజా, కృష్ణం వందే జగద్గురుం లాంటివి కొన్ని ఎక్కువమంది ఆదరణ పొందాయ్.

శనివారం, జులై 25, 2009

సీతాకళ్యాణం - వాగ్దానం(1961) సాహిత్యం

ఘంటసాల మాష్టారి గాత్ర మాధుర్యమో, శ్రీ రామ కథ లోని మహత్తో, పెండ్యాల వారి సంగీత మహిమో లేదా అసలు హరికధా ప్రక్రియ గొప్పతనమే అంతో నాకు సరిగా తెలియదు కానీ, ఈపాట ఎన్ని సార్లు విన్నా ఒళ్ళు పులకరిస్తూనే ఉంటుంది. రేలంగి, నాగేశ్వరరావు, కృష్ణకుమారి లపై చిత్రీకరించిన ఈ పాట లో విశేషమేమిటంటే.. చిత్రీకరణ లో ఎక్కడా శ్రీరామ కళ్యాణాన్ని చూపించరు కానీ కనులు మూసుకుని పాట వింటుంటే మాత్రం కళ్యాణ ఘట్టం అంతా కనుల ముందు సాక్షాత్కరిస్తుంది. ఇది రాసినది శ్రీశ్రీ గారు అని మొదటి సారి తెలిసినపుడు చాలా ఆశ్చర్య పోయాను. ఇక పాట విషయానికి వస్తే రేలంగి గారి బాణి లో చిన్న చిన్న చెణుకు లు విసురుతూ నవ్విస్తూ హుషారు గా సాగే కధ లో మనం మైమరచి పోతాం. "రఘూ రాముడూ... రమణీయ..." అని మొదలు పెట్టగనే తెలియకుండానే తన్మయంగా తల ఊపేస్తాం.. "ఎంత సొగసు కాడే.." అంటే అవును కదా అని అనిపించక మానదు... అసలు సొగసు అన్న మాట పలకడం లోనే ఘంటసాల గారు ఆ దివ్య సుందర మూర్తిని సాక్షాత్కరింప చేస్తారు.
మీరెపుడైనా జలపాతాన్ని దూరం నుండి కాకుండా దాని పై నుండి చూశారా... ప్రవాహం అంతా చాలా ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఏదో చిన్న పిల్ల కాలువ లా ప్రవహిస్తూ కనిపిస్తుంది... కాని ఒక్క సారి అంచుకు వెళ్ళి చూడగానే పైనుండి పోటెత్తుతూ ఉదృతంగా హుషారు గా ముందుకు దూకుతూ మనకి కనువిందు చేస్తుంది. ఇంత వర్ణించడమెందుకు చాలా సినిమా లలో జలపాతాల లో ప్రమాదం సీన్ల లో ఇది మీరు గమనించే ఉంటారు. అలానే అప్పటి వరకు నెమ్మదిగా వ్యాఖ్యానంతో సాగే కథ ఒక్క సారిగా "ఇనకుల తిలకుడు నిలకడ గల క్రొక్కారు మెఱుపు వలె నిల్చీ.." అని అంటూ ఆ జలపాతపు దూకుడునంతా తన స్వరం లో చూపించేస్తారు ఘంటసాల గారు. ఇక చివరికి వచ్చే సరికి హెచ్చు స్వరం లో ఒక్క సారి గా "ఫెళ్ళు మనె విల్లు... " అనగానే సీతమ్మవారి సంగతేమో కానీ కధ వింటున్న వారెవ్వరికైనా గుండె ఝల్లు మనక మానదు అంటే అతిశయోక్తి కాదేమో.

పొయిన ఏప్రిల్ లో శ్రీరామ నవమి రోజు ఈ పాట చాలా గుర్తు చేసుకున్నాను అదే రోజు మధురవాణి గారు తన బ్లాగు లో ఈ పాట లింక్ ఇచ్చారు.. దానికి వెంటనే సాహిత్యం ఇద్దామనుకున్నాను కాని ఇన్ని రోజులకి కుదిరింది. మధురవాణి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మళ్ళీ అప్ లోడ్ చేయడానికి బద్దకించి, వారి ఈస్నిప్స్ యకౌంట్ నుండే ఎంబెడ్ చేయబడిన పాట ని, ఈ హరికథా సాహిత్యాన్ని ఇక్కడ మీకోసం ఇస్తున్నాను. విని, చదివి ఆనందించండి తప్పులేమన్నా ఉంటే వ్యాఖ్య ద్వారా తెలియచేయండి.



చిత్రం : వాగ్దానం
సంగీతం : పెండ్యాల
గానం : ఘంటసాల
సాహిత్యం : శ్రీశ్రీ

శ్రీ నగజా తనయం సహృదయం
శ్రీ నగజా తనయం సహృదయం
చింతయామి సదయం త్రిజగన్మహోదయం
శ్రీ నగజా తనయం...ఊ..ఊ...

శ్రీ రామ భక్తులారా ఇదీ సీతాకళ్యాణ సత్కథ
నలభై రోజులనుంచీ చెప్పిన కథ చెప్పిన చోట చెప్పకుండా చెప్పుకొస్తున్నాను
అంచేత కించిత్తు గాత్ర సౌలభ్యానికి అభ్యంతరం ఏర్పడినట్లు తోస్తుంది
నాయనా కాస్త పాలూ మిరియాలూ ఏమైనా...
చిత్తం.. సిద్దం...

భక్తులారా... సీతామహాదేవి స్వయంవరానికి ముల్లోకాలనుంచీ విచ్చేసిన వీరాధి వీరుల్లో..
అందరినీ ఆకర్షించిన ఒకే ఒక్క దివ్య సుందర మూర్తి ఆహ్హ !! అతడెవరయ్యా అంటే...

రఘూరాముడు రమణీయ వినీల ఘన శ్యాముడు..
రమణీయ... వినీల.. ఘన శ్యాముడు..
వాడు నెలరేడు సరిజోడు మొనగాడు..
వాని కనులు మగమీలనేలు రా..
వాని నగవు రతనాల జాలు రా..
వాని కనులు మగమీలనేలు రా..
వాని నగవు రతనాల జాలు రా..
వాని జూచి మగవారలైన మైమరచి మరుల్కొనెడు మరో మరుడు మనోహరుడు..రఘూరాముడు

సనిదనిసగ రిగరి రిగరి సగరి రిగరి సగగరి సనిదని
సగగరి సని రిసనిస రిసనిస నిదపమగరి రఘురాముడు...
ఔనౌను...
సనిస సనిస సగరిరిగరి సరిసనిస..పదనిస..
సనిగనినిస సనిరిసనిదని నిదసనిదపమ గ మ స
నినినినిని..పస పస పస పస...
సఫ సఫ సఫ తద్దీం తరికిటతక...
రఘూరాముడూ రమణీయ వినీల ఘన శ్యాముడు..
శభాష్..శభాష్...

ఆప్రకారంబుగా విజయం చేస్తున్న శ్రీరామచంద్రమూర్తిని అంతఃపుర గవాక్షం నుండీ సీతాదేవి ఓరకంట చూచినదై
చెంగట నున్న చెలికత్తె తో.. ఎంత సొగసుగాడే..ఎంత సొగసుగాడే మనసింత లోనే దోచినాడే... ఎంత సొగసుగాడే...
మోము కలువ రేడే ఏ..ఏ.. ఏ... మోము కలువ రేడే నా నోము ఫలము వీడే...
శ్యామలాభిరాముని చూడగ నామది వివశమాయె నేడే... ఎంత సొగసుగాడే..
ఇక్కడ సీతాదేవి ఇలా పరవశయై ఉండగా..
అక్కడ స్వయం వర సభా మంటపంలో జనక మహీపతి సభాసదులను చూచి
అనియెనిట్లు ఓ యనఘులార నా యనుగు పుత్రి సీతా...
వినయాదిక సద్గుణ వ్రాత.. ముఖ విజిత లలిత జలజాత...
ముక్కంటి వింటి నెక్కిడ జాలిన ఎక్కటి జోదును నేడు
మక్కువ మీరగ వరించి మల్లెల మాల వైచి పెండ్లాడు...ఊ..ఊ...

అని ఈ ప్రకారం జనక మహారాజు ప్రకటించగానే సభలోని వారందరూ ఎక్కడివారక్కడ చల్ల బడి పోయారట...
మహా వీరుడైన రావణాసురుడు కూడా..హా ఇది నా ఆరాధ్య దైవమగు పరమేశ్వరుని చాపము
దీనిని స్పృశించుట యే మహా పాపము అని అనుకొనిన వాడై వెనుదిరిగి పోయాడట తదనంతరంబున...

ఇనకుల తిలకుడు నిలకడ గల క్రొక్కారు మెఱుపు వలె నిల్చీ..
తన గురువగు విశ్వామితృని ఆశీర్వాదము తలదాల్చి...
సదమల మద గజ గమనము తోడ స్వయంవర వేదిక చెంత..
మదన విరోధి శరాసనమును తన కరమున బూనిన యంత...

ఫెళ్ళు మనె విల్లు గంటలు ఘల్లు మనే...
ఘుభిల్లుమనె గుండె నృపులకు..
ఝల్లు మనియె జానకీ దేహమూ...
ఒక నిమేషమ్మునందె.. నయము జయము ను
భయము విస్మయము గదురా... ఆఆ ఆఆ
శ్రీమద్రమారమణ గోవిందో హారి... హారి
భక్తులందరు చాలా నిద్రావస్త లో ఉన్నట్టుగా ఉంది మరొక్కసారి..
జై శ్రీమద్రమారమణ గోవిందో హారి... హారి
భక్తులారా ఆ విధంగా శ్రీరామచంద్రమూర్తి శివ ధనుర్బంగము కావించినాడు...
అంతట..
భూతల నాధుడు రాముడు ప్రీతుండై పెండ్లియాడే..
పృథుగుణ మణి సంఘాతన్ భాగ్యో పేతన్ సీతన్..
భూతల నాధుడు రాముడు ప్రీతుండై పెండ్లియాడే..
శ్రీమద్రమారమణ గోవిందో హారి... హారి

మంగళవారం, జులై 21, 2009

ఆటో చాహియే క్యా !! -- రెండు

బెంగళూరు ఆటోల క్రమబద్దీకరణ కోసం ఇక్కడి ట్రాఫిక్ పోలీసులు ప్రవేశ పెట్టిన మరో అంశం డ్రైవర్ లైసెన్స్ ప్రదర్శన. ప్రతి ఆటోలోనూ ఇక్కడ ఫోటోలో చూపించినట్లు డ్రైవర్ పేరు, పోలీస్ స్టేషన్ పరిధి, లైసెన్సు నంబరు అన్నీ కలిపి సాధారణంగా డ్రైవర్ సీటు వెనకాల ప్రయాణీకుల కు స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలి. విధిగా ప్రతి ఆటోలోనూ ప్రదర్శితమయ్యే ఈ వివరాలు ఆటో వాలాలని కాస్తైనా కంట్రోల్ లో ఉంచుతాయి అనుకుంటున్నాను. అంటే క్షణం క్షణం లో శ్రీదేవి ని దబాయించినట్లు ఆ లిఖ్ లో.. నంబర్ లిఖ్ లో.. కంప్లైంట్ కరో.. అని లెక్క లేకుండా మాటాడే వాడు తగిల్తే మనం ఏమీ చేయలేమనుకోండి అది వేరే విషయం..

ఇక ఇక్కడి ఆటోలో నాకు అత్యంత కోపం తెప్పించే అంశం కుడి వైపు మలుపు తిరగాలి అని తెలిసినా కూడా మూడు లైన ల రోడ్ లో ఎడమ వైపు చివరి లైన్ లో ప్రయాణిస్తూ, హఠాత్తుగా సిగ్నల్ దగ్గరకు వచ్చే సరికి సర్రు మని ఈ చివరి నుండి ఆ చివరికి అడ్డగోలు గా నడిపి ఇతర చోదకులను ఖంగారు పెట్టి ప్రమాదాలకూ ట్రాఫిక్ జామ్ లకూ కారకులవుతారు. మొన్న ఒక రోజు ఇటువంటి సంధర్బం లోనే నేను ఒక కిలో మీటర్ ముందు నుండి డ్రైవర్ తో "బాబు వచ్చే సిగ్నల్ దగ్గర కుడి వైపు తిరగాలి..లైన్ మారు రైట్ లైన్ లోకి వెళ్ళు.." అని చెప్తూనే ఉన్నాను. అయినా అతను నా మాట లెక్క చేయకుండా సరిగా సిగ్నల్ నాలుగు అడుగుల లో ఉందనగా వాడి స్టైల్ లో అడ్డం గా తిప్పేసాడు. నాకు బాగా కోపం వచ్చి తిట్టేసాను. "ఏమోయ్ ఇందాకటి నుండీ చెప్తున్నాను అసలు బుర్రా బుద్దీ ఉన్నాయిటోయ్..." అని క్లాస్ మొదలు పెట్టేసరికి ఓ క్షణం తత్తర పడి లేదు సార్ అని చెప్పినా, మరు నిముషం లో అతను "లేదు సార్ ఇలాంటి పెద్ద రోడ్ లో మాలాటి చిన్న బళ్ళు నిదానంగా వెళ్ళే బళ్ళు ఎడమ వైపునే వెళ్ళాలి కుడివైపు నుండి వేగాంగా వెళ్ళే బండ్లు వెళ్తాయి !! అందుకని నేను చేసిందే కరెక్ట్..." అంటూ లాజిక్ తీసి వాదించడం మొదలు పెట్టాడు. నేను "సరే లేవోయ్ అన్నీ తెలిసినపుడు ఆఖరి నిముషం లో తత్తర పెట్టక ముందే లైన్ మారాలి తెలీదా అని గట్టిగా అరిచేసి వదిలేశా అనుకోండి అంతకన్నా ఏం చేస్తాం, ఎంత చెప్పినా వాడి చెవికెక్కుతుందా.

సరే ఇన్ని కష్టాలు పడుతూ ఆటోల లో ఎందుకు తిరగడం అంటారా... నాకెందుకో ఆటో లో ప్రయాణం చాలా నచ్చుతుంది... ట్ర్.ర్.ర్.ర్ మనే కర్ణ కఠోరమైన శబ్ధ కాలుష్యాన్ని భరించగల ఓపిక ఉండాలే కానీ... ఆటో ప్రయాణాన్ని చాలా బాగా ఆస్వాదించవచ్చు. వేగం పరం గా అయితేనేమీ, వాహన ఎత్తు పరంగా అయితే నేమీ, ఓపెన్ నెస్ పరంగా అయితేనేమీ, ఆటోలో వెళ్తుంటే నాకు ఇంచు మించు నడుస్తూ ఆయా వీధుల లో తిరుగుతున్న అనుభూతే కలుగుతుంది. కార్ కానీ బస్ కానీ మరే వాహనమైనా ఈ అనుభూతి దొరకదు, బైక్ దీనికి ఎక్సెప్షన్ అనుకోండి మరి మనకి అది వచ్చి చావదు కదా :-) అదీకాక హెబ్బాల్ ఓ కుగ్రామం లా ఉంటుందేమో ఇక్కడ ఒకో సారి రోడ్డు పక్కన గాడిదలు, గుర్రాలు, కొండొకచో ఒంటెలు కూడా కనపడి పలకరిస్తూ అలరిస్తూ ఉంటాయి. ఇక ఔటర్ రింగ్ రోడ్డు లో ప్రత్యేకించి నే ప్రయాణం చేసే హెన్నూరు, నాగవర సిగ్నల్స్ మధ్య రోడ్డుకు అటు ఇటు పచ్చని చెట్ల తో బోలెడు ఆహ్లాదకరంగా ఉంటుంది. కార్ లో క్షణం లో అయిపోయే ఈ స్ట్రెచ్ ని ఆటో లో చాలా చక్కగా ఎంజాయ్ చెయ్యచ్చు.
ఈ ఉల్లిపాయ సమోసాలనీ వాటిని కట్టి పడేసిన దారాన్నీ గమనించారా.. ఇటువంటి వరుసలు 5-6 వరకు ఒకదానిపై ఒకటి పేర్చి కేవలం దారం తో, అవి పడి పోకుండా ఓ కోట కట్టి సిగ్నల్ దగ్గర అమ్ముతూ ఉంటారు. అద్భుతమైన ఫీట్ కదూ !! అసలు పావ్ బాజీ లూ, పానీ పూరీలు, ఛాట్ మసాలాలు ఎన్ని వచ్చినా ఈ ఉల్లిపాయ సమోసా కి సాటి రావేమో అని అనిపిస్తుంది నాకైతే, కాదనే వారెవరైనా ఉన్నారా ??

ఇక ఆటో ప్రయాణం లో మరో పదనిస సిగ్నల్స్ దగ్గర కనిపించే రక రకాల వ్యక్తులు. సింటెక్స్ వాటర్ ట్యాంక్ షేప్ లో ఉండే కిడ్డీ బ్యాంక్ లు, కర్చీఫ్ లు, జామ కాయలు, కార్ క్లీనింగ్ కి వాడే క్లాత్ లు, వార్తా పత్రికలు, చిన్న చిన్న బొమ్మలు, బాల్స్ ఇత్యాదులు అమ్మే వాళ్ళు వీళ్ళ లో ఒక వర్గం. వీళ్లలో కొందరు రియల్ క్రియేటివ్ బిజినెస్ పీపుల్ ఉంటారు, అసలు వీళ్ళ దగ్గర బోల్డు బిజినెస్ టాక్టిక్స్ నేర్చుకోవచ్చు నేమో అనిపిస్తుంది. కొందరు పిల్లలు ఇలా అమ్ముతూ ఈ పని లోనే రిక్రియేషన్ కూడా కవర్ చేస్తారు. ఒక పిల్లాడు ఆగి ఉన్న కార్ సైడ్ అద్దం లో క్రాఫ్ సరిచేసుకుంటే మరొకడు మూసి ఉన్న విండో గ్లాస్ లో మొహం చూసుకుంటూ రక రకాల హావభావాలు ప్రదర్శిస్తూ కార్ లోపలి వాళ్ళని కూడా ఎంటర్ టైన్ చేస్తూ ఉంటాడు. కారుల్లో వాడు అద్దాలు ఎత్తేసి వీళ్ళ దగ్గర నుండి తప్పించుకున్నా ఆటో లో ఉంటే వీరి భారిన పడక తప్పదు. మొన్నొక రోజు ఇలానే ఆటో ఆగి ఉంటే ఒకమ్మయ్ వచ్చింది నన్ను చూడగానే తెలుగు వాడ్ని అని ఎలా తెల్సుకుందో లేదా అందరితో తెలుగు లోనే మాటాడుతుందో తెలీదు కానీ "అన్నా పిల్లలకి బంతి కొను అన్నా... పిల్లలకి, ఆడుకోడానికి రంగురంగులుగా, మెత్తగా బాగుంటుంది అన్నా..కొనన్నా అని మొదలు పెట్టింది. నిజం చెప్పొద్దూ పిల్లలు, బంతి సంగతి ఎలా ఉన్నా అంకుల్ అనకుండా అన్నా అన్నందుకైనా కొనచ్చేమో అని ఓ క్షణం అనిపించింది :-) సరే ఏదైనా ఇప్పుడు నీ బొమ్మలు కొనడానికి అర్జెంట్ గా పెళ్ళి చేసుకుని పిల్లల్ని కనడం సాధ్యం కాదు లే ఫో అని చెప్పి పంపించేశా..

ఇక ఆటో ప్రయాణం లో విసిగించే మరో బ్యాచ్ హిజ్డాలు, ఒకప్పుడు బెంగళూరు నుండి గుంటూరు కు ప్రశాంతి లో ప్రయాణం చేయాలంటే నాకు చాలా టెన్షన్, ఎందుకంటే ఆ ట్రైన్ మధ్యాహ్నం బయలు దేరుతుంది బెంగళూరు నుండి, అందులో వీళ్ళు అడుక్కోడానికి వచ్చి ఐదో, పదో ఇస్తే తప్ప కదిలే వారు కాదు నానా యాగీ చేశేవారు. ఎప్పుడైనా నిజంగా చిల్లర లేకపోయినా వీళ్ళ భారిన పడక తప్పేది కాదు. వీళ్లకి భయ పడి అప్పట్లో ప్రయాణానికి సిద్దమయ్యేప్పుడు ముందుగా చిల్లర సిద్దంగా పెట్టుకునే వాడ్ని. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ లో బనసవాడి, హెబ్బాళ్ మధ్య లో సిగ్నల్స్ దగ్గర వీళ్ళు వచ్చి డబ్బులు అడుగుతుంటారు. కాకపోతే వీళ్ళు ఎక్కువగా సతాయించరు అడిగి ఇస్తే తీసుకు వెళ్తారు లేదంటే లేదు అంతే.. ఒక సిగ్నల్ దగ్గర ఒకళ్ళకంటే ఇవ్వచ్చు కానీ ప్రతి సిగ్నల్ లోనూ అంటే మనకైనా విసుగొస్తుంది.

సరే ఇప్పటికే చాలా పెద్ద టపా అయినట్లుంది. చివరగా మొన్న పన్నెండో తారీఖు ఈనాడు ఆదివారం ప్రత్యేక సంచిక లో ప్రచురించిన చిన్న వ్యాసం గురించి ప్రస్తావించి ముగిస్తాను. ఆటోలకీ అద్భుతమైన ఫాన్స్ ఉన్నారు అని ఈ వ్యాసం నిరూపిస్తుంది. విదేశీయులతో అటోలో భారత యాత్ర చేస్తూ సేవా కార్యక్రమాలని కూడా చేస్తున్న అరవింద్ గారి గురించి తెలుసుకోవాలంటే, పైనున్న బొమ్మ పై క్లిక్ చేసి వ్యాసం చదవండి.

*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*
ఈ టపా ప్రచురించిన కొన్ని గంటలలో ఇపుడే ఈ ముంబయి ఆటోవాలా గురించి చదివి ఆశ్చర్య పోయాను. ఇతని ఆటోలో ఫస్ట్ ఎయిడ్, టీవీ, పత్రికలు, ఫ్యాన్ లాటి సౌకర్యాలు కల్పించడం ఒక ఎత్తైతే, ఇతని ఆటోలో వికలాంగులకు ఇరవై ఐదు శాతం తగ్గింపు, అంధులకు యాభై రూపాయలవరకూ ఉచిత ప్రయాణ సౌకర్యం లాంటి వివరాలు విని నాకు నోట మాట రాలేదు. ఈ రియల్ హీరో గురించి పూర్తిగా చదవాలంటే ఈ లింక్ చూడండి. ఈ అసక్తికరమైన ఈ మెయిల్ ను నాకు ఫార్వార్డ్ చేసిన నేస్తానికి బ్లాగ్ ముఖంగా ధన్యవాదాలు.
*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*

శనివారం, జులై 11, 2009

ఆటో చాహియే క్యా !! -- ఒకటి

వీడెవడండీ బాబు హిందీ శీర్షిక, అదీ తెలుగు స్క్రిప్ట్ లో పెట్టాడు అని ఆశ్చర్య పోతున్నారా.. చెప్తా చెప్తా అసలు ఎంత తెలుగు వాళ్ళమైనా హిందీ మన జాతీయ భాష అన్న విషయం మర్చిపోతే ఎలా? ఈ విషయం లో ఏ మాటకామాటే చెప్పుకోవాలి ఆటో డ్రైవర్ ల దేశభక్తి ని మాత్రం మెచ్చుకోవాల్సిందే... ఊరేదైనా కానివ్వండి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఏదైనా సరే వీళ్ళంతా మాట్లాడే ఏకైక భాష హిందీ. ప్రాంతీయ భాష మాట్లాడని వాళ్ళుంటారేమో కానీ ఆటో డ్రైవర్ల లో హిందీ మాట్లాడవాళ్ళని నేను ఇంత వరకూ చూడలేదు. మన జాతీయ భాష ని ఇంతగా గౌరవించి ప్రాచుర్యాన్ని పెంపొందిస్తున్న వీళ్ళ దేశభక్తిని గుర్తించక పోతే ఎలా చెప్పండి. సరే ఇక విషయానికి వస్తే నేను అమెరికా లో ఉన్నపుడు అన్నిటికన్నా ఎక్కువగా మిస్ అయింది ఆటోలని :-) నిజం అండీ బాబు అక్కడ ఎక్కడికి వెళ్ళాలన్నా ముందు ఎలా వెళ్ళాలి అనేది ప్లాన్ చేసుకోవాలి, డ్రైవింగా, టాక్సీనా, బస్సా, ట్రైనా ఇలా వీటిలో ఏదోఒకటి అని ప్లాన్ చేసుకోవాలి. అంతే కానీ బెంగళూరు లో లా ఆలోచన వచ్చిందే తడవు రోడ్ పైకి వచ్చి "ఆటో" అని చేయెత్తి ఆపి ఎక్కి కూర్చుని ఇంకో ఆలోచన లేకుండా గమ్యం చేరుకునే అవకాశం అక్కడ ఉండదు. అంటే ఇక్కడ ఇంకో ఆలోచన లేకుండా అని రాసే ముందు నేను కొంచెం ఆలోచించిన మాట వాస్తవమే :-)
ఓ సగటు బెంగళూరు ఆటో

ఆటోలలో పలురకాలు లేవేమో కానీ ఆటోవాలాలో చాలా రకాలు ఉంటారు... కొందరు సాధ్యమైనంత మేరా రౌడీ లుక్ కోసం ప్రయత్నిస్తే అతి కొందరు సాధారణ లుక్ తో సరిపెట్టుకుంటారు మరి కొందరు మాత్రం నీట్ గా డ్రెస్ చేసుకుని వాచీ గట్రాల తో డీసెంట్ గా ఉంటారు. ఇలాంటి డీసెంట్ బ్యాచ్ సాదారణంగా చదువుకున్న బ్యాచ్ అయి ఉంటుంది ఎక్కడో అరుదుగా తగిలే వీళ్లని చూడటం తోనే మనకి విషయం అర్ధం అవుతుంది వీళ్ల మీటర్లు సరిగా పని చేస్తాయి, మీటర్ ఎంత చూపిస్తే అంతే చార్జీ వసూలు చేస్తారు ఎక్కువ ఆడగరు, వీళ్ళు కష్టపడే బ్యాచ్ అనమాట. నాకు ఆమధ్య ఇలాంటి వ్యక్తే తగిలాడు. నేను వచ్చీ రాని కన్నడ లో కష్ట పడుతుంటే అతను స్పష్టమైన ఆంగ్లం మాట్లాడటం మొదలు పెట్టాడు, తర్వాత సంగతేంటి గురూ అని అడిగితే తన సమాధానం "ఇంట్లో అమ్మా నాన్న చదువుకోరా అని పంపిస్తే గాలికి తిరిగాను అప్పుడు తెలియలేదు ఇప్పుడు అనుభవిస్తున్నాను కాని నేను తప్పుడు పనులు చేయడం లేదు కష్టపడుతున్నాను ఉన్నంత లో హ్యాపీ సార్..." అని. అతని నిజాయితీ కి ముచ్చటేసింది ఓ క్షణం ఆవకాయ్ బిర్యాని లో హీరో గుర్తొచ్చాడు.

ఇంకో బ్యాచ్ ఉంటుంది వీళ్ళు అస్సలు వొళ్ళు వంచరు, బద్దకం బ్యాచ్, సాధారణంగా ఆటో స్టాండ్ లలో ఇలాంటి వాళ్ళు ఎక్కువ తగుల్తారు, బాగ పొట్టలు పెంచి ఆటోలలో అడ్డంగా పడి నిద్ర పోడమో లేదా నలుగుర్ని కలేసి పేకాడటం, కబుర్లు చెప్పడం లాటివి చేస్తుంటారు. లోకల్ గా జరిగే గణేశ ఉత్సవాలలోనో మరో చోట తాగి తందనాలాడటం వీధుల్లో కొట్లాటల్లోనో వీళ్ళకి ఆసక్తి తప్ప కష్టపడదాం ఆటో తోలదాం సంపాదిద్దాం అనే అలోచన ఉండదు. వీళ్ళని మీరు బాడుగ అడగగానే వచ్చే మొదటి సమాధానం రాను... లేదా కనీసం పదింతలు రేటు చెప్తారు దానికి ఇష్టమైతే ఎక్కు లేదంటే నీ ఖర్మ అన్నట్లుంటుంది వీళ్ళ వ్యవహారం. ఇలాంటి వాళ్ళని చూసే నా నేస్తం వీళ్ళ తో ఇగో ప్రాబ్లం బాసు నా వల్ల కాదు కావాలంటే నడిచెళ్తా కాని అటో ఎక్కను అంటాడు. నాకూ ఒకోసారి చాలా చిరాకొస్తుంది వీళ్ళని చూసి కానీ మనకి కాస్త సహనం పాళ్ళు ఎక్కువ కనుక నెట్టుకొచ్చేస్తుంటాం.

సరే వీళ్ళ సంగతి ఇలా ఉంటే ఈక మీటర్ల గురించి అడగనే అక్కర్లేదు. అప్పుడెప్పుడో కొన్నేళ్ళ క్రితం "బెంగళూరు లో డిజిటల్ మీటర్ లు ప్రవేశ పెడుతున్నారుట, దూరం, చార్జీ, వెయిటింగ్ అని అన్నీ ప్రత్యేకంగ తెలుస్తాయిట ఇహ మోసాలు గట్రా ఉండవు కామోసు.." అని అనుకున్నాం కానీ వాటిలోనే ఇంకా అత్యాధునాతన పద్దతి లో మోసాలు చేయడానికి అవకాశముంది అనే విషయాన్ని మరిచాను. అప్పటికీ ఇంజినీరింగ్ లో మా చేత మైక్రో ప్రాసెసర్ ప్రోగ్రాం చేయించి మరీ నేర్పించారు అప్పుడు కూడా మేము ఇలాంటి యల్ఈడే లే వాడాం లెండి అందుకే ఈ డిజిటల్ మీటర్ లు చూడగానే నాకు అదే గుర్తొస్తుంది. మొన్నొక రోజు ఆటో ఎక్కితే నలభై కావాల్సిన దూరానికి అరవై అయింది.. సంగతేంటి గురూ అని అంటే ఏంటి సార్ అలా మాట్లాడతారు డిజిటల్ మీటర్ అని బుకాయించబోయాడు నేను కాస్త గట్టిగా అడిగి పద చెక్ చేయిద్దాం అనే సరికి సరే రోజు ఎంతవుతుందో అంతే ఇవ్వండి సార్ అని పట్టుకు పోయాడు. మాములు మీటర్ల లో అయితే ఇంతవరకూ ఏ రెండు మీటర్లు ఒకే రీడిం చూపించిన పాపాన పోలేదు. ఈ విషయం లో చెన్నై చానా నయం ఎందుకంటే అక్కడ మోసం చేయడానికి అసలు మీటర్లే ఉండవు మరి !! వాడెంతడిగితే అంత ఇవ్వాల్సిందే !!

దీనిని అరికట్టడానికి బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు నగరం లో అక్కడక్కడా ప్రీపెయిడ్ ఆటోస్టాండ్ లని పెట్టారు. ఇక్కడ పోలీసులే దూరాన్ని బట్టి ముందే రేటు వసూలు చేస్తారు ప్రీ పెయిడ్ టాక్సీ లాగ కాని తక్కువ దూరమైతే వాడి సణుగుడు భరించాల్సిందే... బెంగళూర్ లో ఆటోలకి పెట్రోల్ డీజిల్ వాడకం చాలా తక్కువే, ఎక్కువ భాగం CNG ఆటోలే ఈ ఆటోలని ప్రవేశ పెట్టిన కొత్త లో ఈ గ్యాస్ కొన్ని బంకుల లో మాత్రమే దొరకడం వలన వాటిలో విపరీతమైన్ రద్దీ ఉండేది, ఒకోసారి ట్రాఫిక్ జాం అయి ఆ ఏరియాలని తప్పించుకుని వెళ్ళాల్సిన అవసరం కూడా వచ్చేది.

సరే టపా పొడవు పెరుగుతున్నట్లుంది మరికొన్ని విషయాలు రేపు చెప్తాను అంత వరకూ శలవ్...

మంగళవారం, జూన్ 30, 2009

అలక పానుపు ఎక్కనేల-శ్రీవారి శోభనం

ఈ సినిమా నాకు పూర్తిగా చూసినట్లు గుర్తు లేదు ఎపుడో ఒక సారి టీవీ లో ఈ పాట వేస్తుంటేనో లేక సినిమా వేస్తుంటే పాట మాత్రమే చూసానో కూడా సరిగా గుర్తు లేదు కాని అప్పట్లో రేడియో లో క్రమం తప్పకుండా నేను వినే కొన్ని పాటలలో ఇదీ ఒకటి. మొదట్లో అంటే మరీ చిన్న తనం లో బామ్మ గారి కామెంట్స్ విని నవ్వుకోడానికి వినే వాడ్ని, కాస్త పెద్దయ్యాక భామ గారి పాట్లు అవగతమై పాట పూర్తి గా అర్ధమయింది :-) ఇక జానకమ్మ గారి గాత్రం గురించి నేనేం చెప్పినా తక్కువే... ఆ దోర నవ్వు దాచకే అని అంటూ ఆవిడ నవ్వే నవ్వు మనకే తెలియకుండా మన పెదవులపై చిరుమందహాసాన్ని నాట్యం చేయిస్తుంది. అంతెందుకు ఆవిడ శీతాకాలం అంటూ గొంతు వణికించడం వింటే ఎంత మండు వేసవి లో ఉన్నా మనకీ చలి వేసి వణుకు పుట్టేస్తుందంటే అతిశయోక్తి కాదేమో... పాటంతా వేటూరి గారు ఎంత అందం గా రాశారో బామ్మ గారి చివరి మూడుపంక్తులు "నులకపానుపు నల్లి బాధ.." అంటూ అంతే కొంటె గా రాశారు. సరే మరి మీరూ ఓ సారి మళ్ళీ విని తరించేయండి.



చిత్రం : శ్రీవారి శోభనం (1985)
సాహిత్యం :వేటూరి
సంగీతం : రమేష్ నాయుడు
గానం : జానకి, ఆనితా రెడ్డి

అలక పానుపు ఎక్కనేల చిలిపి గోరింకా...ఆ..అలక చాలింకా...
బామ్మ: నాకలకేమిటే నీ మొహం ఊరుకో...
అలక పానుపు ఎక్కనేల చిలిపి గోరింకా...ఆ..అలక చాలింకా...
శీతాకాలం సాయంకాలం...మ్...
శీతాకాలం సాయంకాలం...మ్...
అటు అలిగిపోయే వేళా చలికొరికి చంపే వేళా...ఆఆ....
బామ్మ: అందుకే లోపలికి పోతానే తల్లి నన్నొదులు....

||అలకపానుపు||

రామ రామ శబరి బామ్మ నిద్దరేపోదూ..!!
బామ్మ: హూ నువ్విట్టా ఇంతగొంతేసుకుని పాడితే నిద్దరెట్టాపడుతుందే...
రాతిరంతా చందమామ నిదరపోనీదు...ఊ..ఊ...
కంటి కబురా పంప లేనూ...ఊ...
ఇంటి గడపా దాటలేనూ..ఊ..
ఆ దోర నవ్వు దాచకే.. నా నేరమింకా ఎంచకే...
ఆ దోర నవ్వు దాచకే.. ఈ నవ్వు నవ్వి చంపకే...

||అలకపానుపు||

రాసి ఉన్న నొసటి గీత చెరపనేలేరు...
రాయనీ ఆ నుదుటి రాతా రాయనూ లేరూ...
బామ్మ: ఆ రాతే రాసుంటే ఇంట్లో నే వెచ్చగా నిద్రబోయేదాన్ని కదా !!
రాసి ఉన్న నొసటి గీత చెరపనేలేరు...
రాయనీ ఆ నుదుటి రాతా రాయనూ లేరూ...
నచ్చినా మహరాజు నీవూ...
నచ్చితే మహరాణి నేనూ...
ఆ మాట ఏదో తెలిపితే నీ నోటి ముత్యం రాలునా...

బామ్మ:
నులకపానుపు నల్లి బాధ పిల్ల చిలకమ్మా... అల్లరాపమ్మా...
శీతాకాలం సాయంకాలం శీతాకాలం సాయంకాలం...ఊ..||2||
నను చంపకే తల్లీ... జో కొట్టకే గిల్లీ...

||అలకపానుపు||

శుక్రవారం, జూన్ 26, 2009

పాప్ సంగీత సామ్రాట్‍కు కన్నీటి వీడ్కోలు !!

మరణం ఎంత చిత్రమైనది, ఎంత దయలేనిది ! తన పర, పేదా గొప్ప బేధాలు లేకుండా ఎంతటి వారినైనా ఎప్పుడైనా ఎక్కడైనా తన కబంద హస్తాలతో కబళించి వేసి, నీ శక్తి అల్పము పరిమితమూనూ రా ఓ వెర్రి మానవుడా అని పరిహసిస్తుంది. యాభైవసంతాల ప్రపంచ పాప్ సంగీత సంచలనం మైఖేల్ జాక్సన్ ఇంత అర్ధంతరంగా, అదీ ప్రపంచ వ్యాప్తంగా అతని అభిమానులు లండన్ లో జరగనున్న అతని comeback షో కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణం లో తిరిగిరాని లోకాలకు పయనమవ్వడం అత్యంత విషాద భరితం. మొదట మార్చి లో ప్రకటించిన తేదీల ప్రకారం అయితే అతని మొదటి లండన్ షో జులై ఎనిమిదిన జరగాల్సి ఉంది.


సంగీతానికి నేను చిన్నతనం నుండే అలవాటు పడినా, మైఖేల్ పాటని నాకు మొదట పరిచయం చేసింది మా హరిగాడు. వాడు నా ఇంటర్మీడియేట్ మరియూ బీటెక్ క్లాస్ మేట్ అప్పటి రోజుల్లోనే మా వాడు వాళ్ళ తాడేపల్లి గూడెం లో సత్యన్నారణ షాప్ లో అప్పుడప్పుడే కొత్తగా రిలీజ్ అవుతున్న సీడీ ల నుండి రికార్డ్ చేయించుకుని వచ్చిన BAD ఆల్బం నుండి మొదటి సారి "Man in the mirror" పాట వినిపించాడు తరువాత స్మూత్ క్రిమినల్ ఆ తర్వాత అంబా..అంబా అని టైటిల్ సాంగ్ (అంటే జాగ్రత్తగా విన్న తర్వాత అది i am bad అని అర్ధమైంది లెండి) అప్పట్లో ఆ అమెరికన్ యాస లో పాట ఎక్కువగా అర్ధమయ్యేది కాదు కానీ మ్యూజిక్ మాత్రం నన్ను అత్యంతగా ఆకట్టుకుంది. అదే సమయం లో అంటే ఇంటర్ చదివేప్పుడు ఒక సారి శలవల్లో ఇంటికి వచ్చినపుడు పెద్ద మామయ్య గారి ఇంటిలో చూసిన BAD క్యాసెట్ ఆల్బం కవర్ మీదున్న మైఖేల్ బొమ్మని, తళ తళలాడే క్యాసెట్ ఇన్లే కార్డ్ ని ఎంత అపురూపంగా ఎన్ని సార్లు తడిమి తడిమి చూసుంటానో లెక్క లేదు. ఆ తర్వాత ఆంగ్లం లో పాటలు విన్నది చాలా తక్కువ కానీ మైఖేల్ పాటలు మాత్రం తప్పకుండా వింటూ ఉండే వాడ్ని ఎవరన్నా నీకు ఎలాంటి పాటలు ఇష్టం అంటే క్లాసిక్, ఫిల్మీ ప్లస్ మైఖేల్ అని ప్రత్యేకంగా చెప్పే వాడ్ని అంత ఇష్టం ఇతని పాటలు.


ఇతని వీడియోల లో ఏది ఇక్కడ పెడదాం అని ఆలోచించినపుడు ఏది ఎన్నుకున్నా మరో దానికి అన్యాయం చేసిన వాడిని అవుతాను అనిపించింది అందుకే నేను మొదటి సారి విన్న "Man in the mirror" from Bad
ఇక్కడ ఇస్తున్నాను.
సగటు అమెరికన్ జీవిత వయోః పరిమితి తో పోల్చి లెక్క వేసినప్పుడు యాబైవసంతాలు పెద్ద వయసు కాదు. అతని ఆరోగ్యం పై వచ్చిన పుకార్లు స్కిన్ క్యాన్సర్, డ్రగ్స్ వాడకం లాటివి కృంగ తీసినా... డ్యాన్సింగ్ ఐడల్, అంత సన్నగా, చలాకీగా, చురుకుగా, స్టేజ్ పై ఒక అలలా, మెరుపులా కదిలే మైఖేల్ జాక్సన్ హార్ట్ అటాక్ తో చనిపోయాడన్న విషయం ఇంకా నేను నమ్మ లేక పోతున్నాను. అంత చురుకైన వాడికి కార్డియాక్ అరెస్ట్ ఏ కారణం వలన వచ్చి ఉంటుందో ఊహించడానికి చాలా కష్టం గా ఉంది. అటాప్సీ ఫలితాలు వెలువడితే కానీ పూర్తి వివరాలు తెలియవేమో.. కానీ కొలెస్ట్రాల్ కారణమైతే మాత్రం ఆశ్చర్య పోవాల్సిందే.. మందీ మార్బలానికీ, డబ్బు కీ కొరత లేని మైఖేల్ జాక్సన్, ప్రపంచ వ్యాప్తం గా కోట్లమంది అభిమానుల్ని సంపాదించుకున్న అతను కూడా ఇంత అర్ధంతరం గా మృత్యువు కోరలకి బలికావడం విధి రాత కాక మరేమిటీ.. అందుకే మృత్యువు చిత్రమైనది !!

ఆదివారం, జూన్ 21, 2009

మాటల్తో స్వరాలే షికారు కెళ్తె...

సంగీతాభిమానులందరికీ ప్రపంచ సంగీత దినోత్సవ (June 21st) శుభాకాంక్షలు...

ఈ రోజు ప్రపంచ సంగీత దినోత్సవం అని ఉదయాన్నే తన విషెస్ తో తెలియచేసిన నేస్తానికీ, ఇంకా ఈ పాట తో విషెస్ చెప్పిన మరో నేస్తానికి థ్యాంక్స్ తెలుపుకుంటూ మీ కోసం ఈ పాట.

ఇక్కడ వినండి

చిత్రం : అమ్మచెప్పింది
సంగీతం : కీరవాణి
సాహిత్యం : సుద్దాల అశోక్ తేజ
గానం : ప్రణవి

మాటల్తో స్వరాలే షికారు కెళ్తె గీతం
అందంగా నిశ్శబ్దం తలొంచుకుంటే సంగీతం
సంగీతం తో చేస్తే స్నేహం
పలికిందల్లా గీతం...

||మాటల్తో||

కాగితాలలో నిదురపోయే కమ్మనీ మాటే..
కాస్త లెమ్మనీ ఇళయరాజా ట్యూన్ కడుతుంటే..
పాటల్లె ఎగిరి రాదా.. నీ గుండె గూడైపోదా..
సంగీతం తో చేస్తే స్నేహం
హృదయం లయలే గీతం...

||మాటల్తో||

గోరుముద్దలో కలిపి పెట్టే గారమొక పాట
పాఠశాలలో మొదట నేర్పే పాఠమొక పాటా
ఊయలని ఊపును పాటే
దేవుడిని నేర్పును పాటే..
సంగీతం తో చేస్తే స్నేహం
బ్రతుకంతా ఓ గీతం...

||మాటల్తో||

శుక్రవారం, జూన్ 19, 2009

పల్లెటూరి పిల్లగాడా...పశులగాసే మొనగాడ..

ఒకో సారి హఠాత్తుగా, కారణం తెలియకుండా ఎప్పుడో విన్న పాట, చాలా రోజులుగా అసలు వినని పాట ఒకసారిగా గుర్తొచ్చి అలా ఒకటి రెండు రోజులు వెంటాడుతూ ఉంటుంది. మన మూడ్ కాని ఉన్న పరిసరాలు కానీ పట్టించుకోకుండా పదే పదే అదే హమ్ చేసేస్తాం. నన్ను గత రెండు రోజులుగా అలా వెంటాడుతున్న పాట "మాభూమి" చిత్రం లోని "పల్లెటూరీ పిల్లగాడ.." పాట. నిజానికి ఈ సినిమా గురించి గానీ పాట గురించి గానీ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాల కార్మిక వ్యవస్తనంతటినీ కాకున్నా పల్లెల్లో సాధారణంగా కనిపించే పిల్లల గురించి వాళ్ళ శ్రమని కూడా ఎలా దోచుకుంటారో తెలియచేస్తూ హృద్యంగా రాసిన సాహిత్యం ఒక ఎత్తైతే. ఈ పాట పాడిన సంధ్య గారి గాత్రం మరో ఎత్తు. పదునుగా ప్రశ్నిస్తున్నట్లు ఉంటూనే "ఓ..పాల బుగ్గలా జీతగాడ.." అనే చోట... ఓ అని అనడం లో తన స్వరం లో విషాదం తో గుండెలు పిండేస్తారు ఆవిడ.

ఈ చిత్రం గురించి పరిచయం కోసం ఇక్కడ తెలుగుసినిమా లో ఇంకా ఈ చిత్ర రూపకర్తల్లో ఒకరైన నర్సింగరావు గారి గురించి ఇక్కడ మన నవతరంగం లో చూడగలరు. ఈ సినిమాను నేను మొదటి సారి 90 లలో ఎపుడో దూరదర్శన్ లో వేసినపుడు చూసాను అంతకు ముందు పాట విన్నాను కానీ అపుడే మొదటి సారి చూడటం, చూసినపుడు ఏదో నలభైల లో వచ్చిన సినిమా కావచ్చు అని అనుకున్నాను కానీ అన్నగారు చిలకొట్టుడు కొడుతూ ఊపేస్తున్న సమయం లో అంటే 1980 లో విడుదలై ఇంత హిట్ అయింది అని తెలుసుకుని చాలా ఆశ్చర్యపోయాను.

అన్నట్లు, బాల కార్మికులంటే నన్నెప్పటి నుండో తొలుస్తున్న ఓ ప్రశ్న గుర్తొచ్చింది ఇది కేవలం ఇళ్ళలోనో హోటళ్ళలోనో కూలి పని చేసే వారికే వర్తిస్తుందా ? వాణిజ్య ప్రకటనల లోనూ, చలన చిత్రాల లోనూ పని చేసే పసి పిల్లలకు వర్తించదా ఈ బాలకార్మిక చట్టం!! ఆ మాట కొస్తే బండెడు పుస్తకాలను మోసుకు వెళ్ళే మా సంగతేంటి అంటారేమో కాన్వెంట్ పిల్లలు.

ఈ పాట వీడియో ఇక్కడ చూడచ్చు...




వీడియో లో కొన్ని చరణాలు లేవు పూర్తి పాట ఆడియో ఇక్కడ వినండి

Palletoori Pillaga...


చిత్రం : మాభూమి (1980)
సంగీతం : వింజమూరి సీత, గౌతం ఘోష్
సాహిత్యం : సుద్దాల హనుమంతు
గానం : సంధ్య

పల్లెటూరీ పిల్లగాడా!! పశులగాసే మొనగాడ !!
పల్లెటూరీ పిల్లగాడా !! పశులగాసే మొనగాడ !!

పాలు మరచీ ఎన్నాల్లయ్యిందో .. ఓ..పాలబుగ్గలా జీతగాడా..
కొలువు కుదిరీ ఎన్నాల్లయ్యిందో..

చాలి చాలని చింపులంగీ చల్లగాలికి సగము ఖాళీ..
చాలి చాలని చింపులంగీ చల్లగాలికి సగము ఖాళీ..
గోనె చింపూ కొప్పెర పెట్టావా...
ఓ.. పాలబుగ్గలా జీతగాడా..
దాని చిల్లులెన్నో లెక్కాబెట్టేవా..

తాటి గెగ్గలా కాలి జోడూ తప్పటడుగుల నడక తీరు
తాటి గెగ్గలా కాలి జోడూ తప్పటడుగుల నడక తీరు
బాట తో పని లేకుంటయ్యిందా...

ఓ.. పాలబుగ్గలా జీతగాడా..
చేతికర్రే తోడైపోయిందా..

గుంపు తరలే వంపు లోకి కూరుచున్నవు గుండు మీద..
గుంపు తరలే వంపు లోకి కూరుచున్నవు గుండు మీద..
దొడ్డికే నీవు దొరవై పోయావా...
ఓ.. పాలబుగ్గలా జీతగాడా..
దొంగ గొడ్లనడ్డగించేవా...

కాలువై కన్నీరు గారా... కల్ల పై రెండు చేతులాడ..
కాలువై కన్నీరు గారా... కల్ల పై రెండు చేతులాడ..
వెక్కి వెక్కి ఏడ్చెదవదియేలా
ఓ.. పాలబుగ్గలా జీతగాడా..
ఎవ్వరేమన్నారో చెప్పేవా..


మాయదారి ఆవుదూడలు మాటి మాటికి ఎనుగుదుమికి
మాయదారి ఆవుదూడలు మాటి మాటికి ఎనుగుదుమికి
పంట చేను పాడు చేసాయా
ఓ.. పాలబుగ్గలా జీతగాడా..
పాలికాపూ నిన్నే గొట్టాడా..

నీకు జీతము నెలకు కుంచము.. తాలు వడిపిలి కల్తి గాసము
నీకు జీతము నెలకు కుంచము.. తాలు వడిపిలి కల్తి గాసము
కొలువగ శేరు తక్కువ వచ్చాయా...
ఓ.. పాలబుగ్గలా జీతగాడా..
తల్చుకుంటే దుఖం వచ్చిందా..

పల్లెటూరీ పిల్లగాడా !! పశులగాసే మొనగాడ !!
పల్లెటూరీ పిల్లగాడా !! పశులగాసే మొనగాడ !!
పాలు మరచీ ఎన్నాల్లయ్యిందో ..
ఓ..పాలబుగ్గలా జీతగాడా..

కొలువు కుదిరీ ఎన్నాల్లయ్యిందో..
కొలువు కుదిరీ ఎన్నాల్లయ్యిందో..
కొలువు కుదిరీ ఎన్నాల్లయ్యిందో..

సోమవారం, జూన్ 15, 2009

మరికొన్ని తిరుగు టపా కబుర్లు..

చికాగో నుండి ఫ్రాంక్‍ఫర్ట్ కు చేసిన ప్రయాణం కన్నా అక్కడ నుండి హైదరాబాద్ వరకు చేసిన ప్రయాణం కాస్త సౌకర్యవంతంగా అనిపించింది. ప్రయాణం లో రెండు సినిమాలు కవర్ చేసేసాను. విమానం ఎక్కే సమయం లో ప్రవేశ ద్వారానికి దగ్గరగా వార్తా పత్రికలు, వార, మాస పత్రికలు ఉంచారు కావాలి అనుకున్న వారు వాటి నుండి ఏదైనా ఎన్నుకుని ఉచితంగా ప్రయాణం లో చదువుకోడానికి తీసుకు వెళ్ళవచ్చు. నాకు ఇండియాటుడే మరో ఇండియన్ న్యూస్ పేపర్ కనిపించేసరికి సరె అని అవి అందుకుని లోపలికి వెళ్ళాను. నా సీటు దగ్గరకు చేరుకున్న వెంటనే ఆ పత్రికలు సీట్ లో పడేసి సామాను పైన పెట్టడానికి ప్రయత్నిస్తుండగానే పక్క సీట్ లో కూర్చున్న ఓ అపరిచితుడు ఆవేశంగా పేపర్ తీసుకుని ఇష్టమొచ్చిన రీతిలో నలిపేస్తూ చదవడం మొదలు పెట్టాడు. నాకు చాలా చిరాకు వేసింది నా అనుమతి అడగ లేదు కనీసం నే సీట్ లో సెటిల్ అయ్యె వరకు ఎదురు చూడ లేదు సరికదా ఇంటి ముందు పడేసిన పేపర్ లా నిర్లక్ష్యం గా తీసుకుని చదవడం మొదలు పెట్టటం చూస్తే నేనేదో పేపర్ బోయ్ లాగా అతనికి పేపర్ తెచ్చిఇచ్చిన ఫీలింగ్ వచ్చి ఒళ్ళు మండింది.

నాకు ఎందుకో చిన్నప్పటి నుండీ ఉదయం తాజా గా వచ్చిన వార్తాపత్రిక నుండి వచ్చే తాజా సువాసనని ఆస్వాదిస్తూ మడత నలగని న్యూస్ పేపర్ అలానే మడతలు పడకుండా జాగ్రత్త గా చదివి ఎలా వచ్చిందో అలా మడత పెట్టి పక్కన పెట్టేయటం అంటే చాలా ఇష్టం. మన హీరో నన్నడగకుండా తన ఇష్టం వచ్చినట్లు తీసుకు చదవడమే కాకుండా నలిపేస్తుంటే, చూస్తూ ఇక ఊరికే కూర్చోలేక "మే ఐ.." అని అతను చదువుతున్న పేపర్ తీసుకుని నేను పూర్తిగా చదివిన తర్వాత అతనికి ఇచ్చాను. మరి నా టోన్ కి భయపడ్డాడేమో అతను ఏమీ మాట్లాడలేదు. ఈ మధ్య లో నాకు అదేదో యస్వీ కృష్ణారెడ్డి సినిమా లొ ప్రకాష్ రాజ్ యమ్ యస్ నారాయణ కి క్లాస్ పీకే సీన్ గుర్తొచ్చింది. ప్రకాష్ రాజ్ కార్లో కనిపించిన పేపర్ ని తీసుకుని యంయస్ చదువుతుంటే అక్కడికి వచ్చిన ప్రకాష్ రాజ్ అతనితో "నాకు చద్ది పేపర్ చదివే అలవాటు లేదు...నువ్వు నా పేపర్ చదివావ్ కదా నాకు వార్తలు చెప్పు..." అని ప్రకటనలు, వార్తలు షేర్స్ గట్రా అన్ని వివరాలు చెప్పించుకోడం కాక... "కొని చదివితే వాడి చేతిలో పేపర్ ఉంటుంది... కొనకుండా చదివితే ఇంకొకళ్ళ చేతిలో వాడు పేపర్ అవుతాడు..." అని చెప్పి భయపడతాడు. అంటే ఇక్కడ నేను పేపర్ కొన్నది కాదు కనుక ఓ సీరియస్ లుక్ తో సరిపెట్టాను. కొని ఉంటే నేనూ అదే రేంజ్ లో క్లాస్ పీకే వాడ్ని :-)

మొత్తం మీద హైదరాబాద్ వచ్చి పడ్డాను అర్ధరాత్రి పన్నెండు గంటలకి ఓ అరగంట ముందు. విమానం రావాల్సిన సమయానికన్నా ముందే ల్యాండ్ అయింది దాంతో కాసేపు రన్ వే పైనే ఎదురు చూసాక అప్పుడు గేట్ దగ్గరకు వెళ్ళే అవకాశం దొరికింది. మొత్తం మీద అనుకున్న సమయానికి వచ్చాం లే అని విమానం లో నుండి అడుగు బయట పెడదామని చూద్దునుకదా ఓ క్షణం తటపటాయించి కాలు వెనక్కి తీసుకుందామా అని అనిపించింది. ఏమైంది వీళ్ళందరికీ, ఈ చిత్రమైన స్వాగతం వెనుక గల ఆంతర్యమేమీ, ఈ ముసుగు వీరుల అవతారాలేంటి, ఆపరేషన్ థియేటర్ లో లా మూతినీ ముక్కునీ కలిపేస్తూ మొహానికి అసలీ ముసుగులేంటి? అసలే మనం ఎన్నికల ఫలితాలు వెలువడిన మే పదహారో తేదీన విమానం ఎక్కాం, గాల్లో ఉండగా హైదరాబాద్ పై ఏమైనా బయో యటాక్ జరిగిందా కొంపదీసి, దేవుడా నా రాష్ట్రాన్ని కాపాడు. అయినా అలా జరగడానికి వీలు లేదే బయల్దేరే ముందు ఇంటికి ఫోన్ చేస్తే కాంగ్రెస్ గెలిచింది కనుక ఇక గొడవలు జరగవ్ అని అనుకుంటున్నారు అని చెప్పాకనే కదా బయల్దేరాం, ఇలా బోలెడు ప్రశ్నలు, ఆలోచనల మధ్య లో హఠాత్తుగా వెలిగింది, విమానం లో ఇమ్మిగ్రేషన్ పత్రం తో పాటు ఇచ్చిన స్వైన్ ఫ్లూ డిక్లరేషన్ పత్రం.

ఆరోగ్యానికి సంబందించిన వివిధ ప్రశ్నలు, విమానం ఎక్కే ముందు ఏ ఏ దేశాలు తిరిగావు, జలుబు జ్వరం లాటి లక్షణాలు ఏమైనా ఉన్నాయా ఇత్యాది ప్రశ్న లతో ఒక నాలుగు పేజీల పత్రం ఇచ్చారు అది చూసే అనుకున్నాను మన వాళ్ళు బాగా సీరియస్ గానే తీసుకున్నారనమాట విషయాన్ని అని. కానీ ఎప్పటిలా విమానం నుండి దిగగానే ఇమ్మిగ్రేషన్ కాకుండా... దానికన్నా ముందే ఒక నలుగురు డాక్టర్స్ ని కుర్చీలు వేసి కూర్చో పెట్టారు, వాళ్ళు ప్రయాణీకులనందరిని ప్రశ్నలు అడిగి పరీక్షించి డిక్లరేషన్ పత్రాలు పరిశీలించిన తర్వాత పంపించారు. అక్కడ సిబ్బంది మొత్తం ఇమ్మిగ్రేషన్ అధికారులతో సహా అంతా కూడా మాస్క్ లు వేసుకుని ఉన్నారు. అంటే చాలా మంది సిన్సియర్ గా వేసుకుని కూర్చుని విధులు నిర్వహిస్తున్నారు కాని ఇక్కడ కూడా కొందరు నిర్లక్ష్య వీరులు ఉంటారు కదా వాల్లు నోటికి ముక్కు కి ఉండాల్సిన మాస్క్ ని కిందకి నెట్టేసి గడ్డానికి వేసుకుని పని చేస్తున్నారు. వాళ్ళని చూస్తే నవ్వొచ్చింది, అది అలంకారం కాదు నాయనా అలా వేసుకుని ఏమిటి ఉపయోగం, నీ ఆరోగ్యం కోసమే కదా ఈ రూల్స్ అని చెప్దాం అనిపించింది.

హైదరాబాద్ లో నన్ను ఆశ్చర్య పరిచిన మరో విషయం కస్టమ్స్. ప్రపంచవ్యాప్తంగా కస్టమ్స్ గుర్తు ఎడమ వైపు చిత్రం లో లా సూట్కేస్ లోపల చేయి పెట్టి వెతుకుతున్నట్లుంటుంది కానీ మన ఇండియన్ కస్టమ్స్ మాత్రం పర్స్ లోపల చేయి పెట్టి వెతుకుతున్నట్లు ఉండాలి. వాళ్ళ దృష్టి అంతా మన మనీ పర్స్ మీదనే ఉంటుంది మరి. ఇతను ఎవరో తన బ్లాగ్ లో చాలా చక్కగా ఈ ఎంబ్లమ్ ని మార్చి ఒక్క ముక్క లో చెప్పాడు చూడండి, అవే బొమ్మలు ఇక్కడ ఇస్తున్నాను. ఇక నా విషయానికి వస్తే మెత్తని వాడ్ని చూస్తే మొత్త బుద్దేస్తుంది అని నన్ను చూడగానే కస్టమ్స్ లో ప్రతి ఒక్కడికి డబ్బులు అడగాలి అనిపిస్తుంది. ముంబయి లో ఆఫీసర్ పాస్పోర్ట్ తీసుకుని సతాయిస్తే కానిస్టేబుల్ ఎయిర్పోర్ట్ బయటి వరకు కూడా డబ్బుల కోసం వెంట పడిన సంఘటనలు ఉన్నాయ్. ఢిల్లీ లో అయితే సార్ ఎంతో కొంత మీ ఆనందం కోసం ఇవ్వండి సార్ అని ధీనం గా అడిగిన సంధర్భాలు ఉన్నాయ్. ఎంత ఘోరం అంటే డిల్లీ లో ఒక సారి ఎయిర్ ఇండియా చెక్ ఇన్ చేసే సమయం లో అక్కడి సిబ్బంది ఒక బ్యాగ్ కాస్త ఎక్కువ బరువు ఉందని చూపించి 500 ఇవ్వండి వదిలేస్తాను అని బేరం పెట్టాడు. అంటే ఆ సమయానికి అందరి చెక్ ఇన్ అయిపోయింది నేను ఆఖరు న వెళ్ళాను దాంతో ఎవరూ పట్టించుకోడం లేదు మన వాడు మొదలు పెట్టాడు. నేను హైదరాబాద్ లో చెక్ ఇన్ చేసినప్పుడు పరిమితి లోపు ఉన్న బరువు ఢిల్లీ వచ్చేసరికి ఎలా పెరిగిపోతుంది, ఇంకో కౌంటర్ లో బరువు చూద్దాం అని వాదించే సరికి వదిలేసాడు. ఇలాంటి అనుభవాలు చూసిన నాకు హైదరాబాద్ కస్టమ్స్ ఎలాంటి సినిమా చూపిస్తుందో అని అనుకుంటూ ఉన్న నన్ను పూర్తిగా ఆశ్చర్యానికి గురి చేస్తూ గ్రీన్ ఛానల్ లో నన్ను ఎవరూ అడ్డుకో లేదు. కేవలం కస్టమ్స్ పత్రం మాత్రం కలెక్ట్ చేసుకుని గౌరవంగా పంపించేశారు. బాగు బాగు మొత్తం మీద హైదరాబాద్ స్వాగతం బహు బాగు అని అనుకుంటూ బయట పడ్డాను.

అది సరే కాని నిన్న మాటల మధ్య లో ఒక చిన్న అనుమానం వచ్చింది మీకు తెలిస్తే కాస్త చెప్తారా... అలక ని ఆంగ్లం లో ఏమంటారు? అలక, అలగడం అలకపానుపు ఇత్యాదులని ఆంగ్లం లో ఎలా చెప్పాలో ఎంత ఆలోచించినా గుర్తు రావడం లేదు, మీకు తెలిస్తే చెప్పండి.

సరే మళ్ళీ మరో టపా లో కలుద్దాం, అంతవరకూ శలవా మరి.

customs pics from "http://krishashok.wordpress.com/2008/02/04/symbolically-speaking/"

శనివారం, జూన్ 13, 2009

జర్మనీ లో... విమానం లో...

ఎయిర్ లైన్స్ కి నాకు ఎందుకో మొదటి నుండీ చుక్కెదురు, ఆహా ఎక్కితే ఈ విమానమే ఎక్కాలిరా అని అనిపించేలా నాకు నచ్చే అంతర్జాతీయ విమాన సర్వీసులు ఇంత వరకూ తారసపడలేదు. ఈ సారి చికాగో నుండి వచ్చేప్పుడు లుఫ్థాన్సా లో వచ్చాను, ఆది లోనే టిక్కట్టు రేటు విషయం లో చాలా ఎక్కువ అనిపించింది, సరేలే రిసెషన్ టైం ఇప్పుడు ఏది చూసినా రేట్లు ఇలానే ఉంటున్నాయ్ అని సరిపెట్టుకున్నాను. ఇక చికాగో విమానాశ్రయం కి చేరుకున్నాక, అంతర్జాతీయ విమానాలన్నీ ఒక టెర్మినల్ లో అయితే లుఫ్థాన్సా ఒకటే వేరే టెర్మినల్ మనకా విషయం తెలియక అంతర్జాతీయ టెర్మినల్ కి వెళ్ళి వాడు ఛీ కొడితే తిరిగి సామాను అంతా వేసుకుని అక్కడి నుండి వేరే టెర్మినల్ చేరుకునే సరికి తలప్రాణం తోకకొచ్చింది. ఎలాగో తంటాలు పడి చెక్ ఇన్ చేస్తే సీట్ నంబర్ ఇంకా కేటాయించ లేదు గేట్ దగ్గరకి వెళ్ళి మళ్ళీ మరో బోర్డింగ్ పాస్ తీసుకోండి అనే సరికి ఈ ఎయిర్‍లైన్స్ మీద అక్కడే సగం విసుగొచ్చింది. దీనికి తోడు బోర్డింగ్ సమయం లో ఒక పద్దతి పాడూ లేకుండా పిల్లా పెద్దా అంతా కలిసి ఓ చేంతాడంత క్యూ లో నుంచో పెట్టి ఎక్కించాడు పిల్లలతో అవస్థ పడుతున్న వాళ్ళని చూసి ఎఇర్లైన్స్ మీద నాకు ఒళ్ళుమండి పోయింది.



సరే పోనీలే ని ఎక్కి కుర్చుంటే పర్సనల్ ఎంటర్ టైన్మెంట్ సిస్టం లేదు అంటే సీటు వెనక చిన్న వీడియో స్క్రీన్ లేదనమాట. పైన ఫోటోలో లాగ, అదుంటే ఎనిమిది గంటలు కాసేపు ఓ సినిమా చూసి, కాసేపు నిద్ర పోయి ఇలా శ్రమ తెలియకుండా ఎలాగో గడిచిపోతుంది. లేదంటే తంటాలే, సరే లే ఎలాగో అలా కానిచ్చేద్దాం అని అనుకుంటే టేకాఫ్ టైం లో విపరీతమైన టర్బులెన్స్, నా ఖర్మ కాలి నేను వింగ్ వెనకాల సీట్ లో కూర్చున్నాను సో కిటికీ నుండి చూస్తే వింగూ దాని ఇంజనూ గాలి వాన లో కొబ్బరాకు లా ఊగిపోతుంటే నా ప్రాణాలు అరచేతిలో పెట్టుకు కూర్చున్నాను అంటే నమ్మండి... ఛ ఛ ఇక ఈ ఎయిర్ లైన్స్ ఎప్పుడూ ఉపయోగించ కూడదు అని అప్పుడే శపధం చేసేసుకున్నాను. కాక పోతే అది అత్యంత పాత బోయింగ్ 747 విమానం కనుక వాడైనా చేయగలిగింది ఏమీ లేదు. అందరికన్నా ముందు ఎప్పటి నుండో చికాగో ఫ్రాంక్ఫర్ట్ మధ్య సర్వీస్ నడుపుతున్నాడు కనుక ప్రస్తుతపు సర్వీసుల అధునాతన సౌకర్యాలని సమకూర్చలేక ఇబ్బంది పడుతున్నాడు. ఇది వాడికి కూడా తెలుసు అందుకే ప్రయాణిస్తున్నంత సేపు వాడు త్వరలో ఉపయోగించ బోయే ఎయిర్‍బస్ A380 గురించి ఊదరగొట్టాడు.

అన్నట్లు ఇంకో విషయం గమనించాను దీని వెనుక ఏమైనా ప్రత్యేకమైన రీజన్ ఉందేమో ఫ్రీక్వెంట్ ఫ్లయర్స్ కి తెలిస్తే కాస్త చెప్పండి. విమానం లో సీట్లు కుడి నుండి ఎడమ కి వరుస క్రమం లో 3+4+3 ఉన్నాయ్ వాటి నంబర్లు ABC-DEFG-HJK అని ఉన్నాయ్. అంటే వరుసక్రమం లో I మిస్ అయింది, 23H తర్వాత 23I లేకుండా 23J పెట్టేశాడు. మరి ఇది లుఫ్థాన్సా వాడి సెంటిమెంటా లేక అన్ని విమానాల్లోనూ ఇంతే ఉంటుందా.. ఆ "ఐ" ఉండక పోవడం వెనుక ఏదన్నా సాంకేతిక కారణాలు ఉన్నాయా లేక పదమూడో అంకె లా దీని వెనుక కూడా ఏమన్నా కధలు ఉన్నాయా అన్నది మా బుడుగు కు చెప్పి డికేస్టింగ్ చేయమనాలి. మీకేమన్నా తెలిస్తే చెప్పి పుణ్యం కట్టుకోండి.

సాధారణ ప్రయాణీకుల కోసం ఉపయోగిస్తున్న వాటిలో పూర్తి నిడివి డబల్ డెక్ కల అతి పెద్ద విమానం A380 ఇదే

సరే ఎలాగో తంటాలు పడి ఎనిమిది గంటలు గడిపేసి ఫ్రాంక్‍ఫర్ట్ లో దిగాను. ఇక్కడ అన్నీ కాస్త సక్రమంగానే జరిగాయ్... బోర్డింగ్, విమానం లో బుల్లితెరలతో సహా. ఇది కాస్త అధునాతనమైన విమానం, మరి కొత్త సర్వీసు మన హైదరాబాదు కి డైరక్ట్ ఫ్లైట్స్ ఈమధ్యనే మొదలు పెట్టారు కదా అందుకని అనుకున్నాను. సాధారణంగా విమానం బయలుదేరిన వెంటనే భద్రత ను గురించిన వివరాలు చెప్తారు. సాధారణం గా ఇది మొదటి సారి విమాన ప్రయాణం చేసే వారికి చాలా ఉపయోగంగా ఉంటుంది. సీట్ బెల్ట్ ఎలా పెట్టుకోవాలి, విమానం నీళ్ళలో పడి పోతే ఏం చేయాలి. ఒక వేళ ఆకాశం లో ఉన్నపుడు విమానానికి బొక్క పడి ఆక్సిజన్ అందక పోతే ఏంచేయాలి, విమానం లో నుండి పారిపోవాలంటే ఎక్కడెక్కడ మార్గాలు ఉన్నాయ్ ఇలాంటి విషయాలు చెప్తారు. నిజం చెప్పాలి అంటే విమానం లో ఎన్ని రకాల ప్రమాదాలు జరగచ్చో టూకీగా చెప్పి హడల కొడతారనమాట. సాధారణంగా ఇవి మూడు భాషలలో చెప్తారు. ఒకటి ఏ దేశం నుండి బయలుదేరుతుంటే ఆదేశ జాతీయభాష, మరొకటి గమ్యం ఏ దేశమైతే ఆ దేశ జాతీయభాష, మరొకటి ఆంగ్లం. అయితే ఫ్రాంక్‍ఫర్ట్ నుండి బయలుదేరిన లుఫ్థాన్సా లో జర్మన్, హిందీ లో చెప్పాడు. హిందీ లో ఒచ్చే ప్రజంటేషన్ లో ఆంగ్లం లో సబ్‍టైటిల్స్ వేస్తాం చూసుకోండి అన్నాడు. ఓరి వీడి దుంపతెగ ఆంగ్లం లో ప్రజంటేషన్ ఇవ్వడానికి కూడా డబ్బులు దండగ ఎందుకు అనుకుంటున్నాడా అని అనుకునేంతలో నన్ను బోలెడంత హాశ్చర్యానికి గురి చేస్తూ తెలుగు లో ప్రసంగం ప్రారంభమైంది.

భళి రా !! ఈ ఒక్క విషయం తో నా మనసు దోచేశావ్ పో అనుకున్నా... సిబ్బంది అందరికీ తెలుగు నేర్పడం కష్టం కనుక ముందే రికార్డ్ చేయబడిన మెసేజ్ వినిపించాడు. ఎవరో కానీ మంచి అందమైన గొంతు ఉన్న వాళ్ళ కోసం వెతికినట్లున్నారు కానీ తెలుగు తెలిసిన వాళ్ళకోసం వెతికితే బాగుండేది. శ్రావ్యమైన ఆడ గొంతు కోసం తెంగ్లీష్ లో రాసిన స్క్రిప్ట్ ఇచ్చి చదివించినట్లున్నారు ఆవిడ ద్వారాలు అన వలసిన చోట "ద్వరలు" అని శక్తివంచన ని విరగేసి శక్తీ, వంచనా అని రెండు వేర్వేరు పదాలు గా పలికి అర్ధాన్ని మార్ఛేయడం లాంటి పొరపాట్లు చేసినా అసలంటూ తెలుగు లో చెప్పాలి అన్న స్పృహ కలిగినందుకు ఆనందించాను. భాష కూడా ఇటు వాడుక భాష అటు అధికార భాష కాని మధ్య రకమైన భాష ఉపయోగించి కాస్త బెదరగొట్టారు. ఇంతలా ఎందుకు రియాక్ట్ అయ్యనంటే అంతర్జాతీయ విమానాల్లో ఆయా దేశాల జాతీయభాషలలో అనౌన్స్ చేయడం ఓ పద్దతి కానీ మన దేశం లోనే వివిధ రాష్టాలమధ్య తిరిగే విమానాల్లో ప్రాంతీయ భాషలో చెప్పటం చాలా అవసరం అని నా ఉద్దేశ్యం. ఇంతకు ముందు హైదరాబాద్ వెళ్ళే జెట్ లో ఒకటి రెండు సార్లు ఈ విషయమై సజెస్ట్ చేశాను కూడా. అలాంటిది అంతర్జాతీయ విమానం లో, జర్మనీ లో కూర్చుని తెలుగు వింటూంటే మనసు ఆనందించదూ....

మీకోసం ఓ నమూనా ఫ్లైట్ సేఫ్టీ వీడియో ఇక్కడ చూడండి.



ఈ రోజుకి బాగానే మీ బుర్ర తినేసాను కదా ... హ హ ఏంటీ..:-) "తినడమేంటి నాయనా స్ట్రా వేసుకుని జుర్రుకున్నావ్..." అంటారా సరే సరే, హైదరాబాద్ చేరుకున్నాక నేను అందుకున్న అరుదైన స్వాగతం గురించిన వివరాలతో మరో టపాలో కలుద్దాం, అంత వరకూ శలవా మరి.

మీ వేణూశ్రీకాంత్.

ఆదివారం, మే 24, 2009

బదిలీ...

2009 కొత్త సంవత్సరం మొదటి రోజు నన్ను ఏమిటి రా విశేషాలు? అని అడిగిన వారికీ, అడగని వారికీ నేను ఒకటే జవాబు చెప్పాను."ఆ ఏముంది తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అదే రొటీన్ రోజూ, "లైఫ్ ఈజ్ బోరింగ్ యూనో..." అని. మరి శేషతల్పం పై విశ్రమిస్తున్న విష్ణుమూర్తి ఓ అరక్షణం కనులు అరమోడ్పులు చేసి, చెవులు రిక్కించి నా మాటలు విని ముసి ముసి నవ్వులు నవ్వుకున్నాడో... లేకా హిమగిరి పై తపస్సు చేసుకుంటున్న మహేశ్వరుడు ఓ క్షణం కనులు తెరిచి ఆహా అవునా అని వెటకారం గా అనుకున్నాడో కానీ...ఆ క్షణం నుండీ శివకేశవులు ఇద్దరూ కలిసి చెరో వైపూ నుండి నా జీవితం తో బంతాట ఆడేసుకుంటున్నారు... ఈ రెండువేల తొమ్మిది అంతా వరసగా బోర్ అనే మాట దరిచేరనివ్వకుండా ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. అచ్చం టెన్నిస్ కోర్ట్ లో ప్రత్యర్ధి ని చూస్తూ ఓ నువ్వు ఆ షాట్ కొట్టావా ఇప్పుడు నా షాట్ చూడు ఎలా కొడతానో అని ఒకర్ని మించి ఒకరు పోటీ పడి నా జీవితం లో ట్విస్ట్ లు ఇస్తున్నారనమాట.

అదుగో రమణారెడ్డి లా సన్నగా పొడవుగా తెల్లగా ఉన్న భవంతి పక్కనే రేలంగి లా లావుగా పొట్టిగా బులుగు రంగులో blue cross blue shield అని రాసి ఉన్న భవంతే నేను ఇన్ని రోజులూ చికాగో లో పని చేసిన ఆఫీస్.

సరే ఇంత ఉపోద్ఘాతం దేనికయ్యా అంటే... నేను ప్రస్తుతం (ఆదివారం మే 17) ఫ్రాంక్ఫర్ట్, జెర్మనీ విమానాశ్రయం నుండి ఈ బ్లాగ్ రాసుకుంటున్నాను. నిన్న శనివారం బయల్దేరి ఇండియా వచ్చేస్తున్నాను. ఈ గురువారం అనగా మే ఇరవైఒకటిన బెంగళూరు నుండి పని మొదలు పెట్టాలి... మధ్యలో ఓ మూడు రోజులు శలవు అనమాట. అదీ సంగతి.. ఈ టపా నాకు విషయం తెలిసిన దగ్గర నుండీ రాద్దాం అని అనుకుంటున్నాను కానీ గత రెండు మూడు వారాలుగా ఈ బదిలీ హడావిడి లొ పడి అస్సలు కుదరలేదు... ఇదే అనేమిటి లే ఈ మధ్య నా బ్లాగ్ కేవలం ముఖ్యమైన విషయాలను తెలియచేసే నోటీస్ బోర్డ్ లా ఉపయోగిస్తున్నానేమో కదా. చూడాలి బెంగళూరు నుండైనా తరచూ బ్లాగడానికి వీలు దొరుకుతుందేమో... కానీ సమస్యేమిటంటే బెంగళూరు వెళ్ళినా నాకు ఇదే ఆఫీసు పని అక్కడ నుండి కొనసాగించాలి సో ఏమాత్రం వీలు చిక్కుతుందో చూడాలి. ఏవిటో ఇదే పని సగం జీతానికి ఇండియానుండి చేయాలి అంటే కొంచెం కష్టమే కానీ మన అసలు జీతం అదే రా బాబు ఇప్పటి వరకు డబల్ జీతానికి పని చేసావు అంతే అని సర్ది చెప్పుకోటమే... జీతం ఎక్కువైనా ఖర్చులు కూడా అంతే ఉండి చస్తాయ్ లెండి అమెరికా లో ఒక మాదిరిగా బతకాలి అంటే...

మొత్తం మీద నా బదిలీ లో మొదటి అంకం పూర్తయింది... చికాగో బంధాలను వదిలించుకుని, రెండున్నరేళ్ళ గా సమకూర్చుకున్నవన్నీ రెండు వారాలలో ఒక్కోటీ పాతిక కేజీలు మించని రెండు సూట్కేస్ లలో సర్దేసుకుని, మళ్ళీ ఎప్పుడు పలకరించడానికి వీలు పడుతుందో అని భారమైన మనసుతో వీడ్కోలు తెలుపుతూ చికాగో నుండి బయటపడ్డాను. ఇక్కడ సమకూర్చుకున్నవన్నీ అలా ఒకటొకటి గా నన్ను వదిలి వెళ్తుంటే ఎంత దిగులేసిందో... ఏవిటో ఈ మనసు, ప్రాణం లేని వస్తువులపై కూడా ఇలా మమకారాన్ని పెంచేసుకుంటుంది. ముఖ్యంగా ఇష్టంగా కొనుక్కున్న నా కారు ను సమయాభావం వల్ల అతి తక్కువ ధరకి అమ్మేసి అప్పగించిన రోజు రాత్రి ఎంత ప్రయత్నించినా పొంగుకు వచ్చే కన్నీళ్ళకి ఆనకట్ట కట్ట లేకపోయాను. మా అమ్మ తను కొన్న ఏ వస్తువునైనా ఎందుకు అలా తిరిగి అమ్మటానికి ఒప్పుకోదో మొదటి సారిగా బోధ పడింది.


అసలు అమ్మా నాన్న ఇద్దరూ గవర్నమెంట్ ఉద్యోగాలు చేసినా మా కుటుంబం ఈ బదిలీల భారిన పడిన సందర్బాలు తక్కువే అని చెప్పాలి.. అమ్మ నాన్న మా చదువులు మిగిలిన విషయాలు అనవసరం గా ఇబ్బంది పడాల్సి వస్తుంది అని ఎలాగో అలా నయానో భయానో చెప్పి ఇలాంటి బదిలీలు ఆపేసేవారు, కొండొకచో రావాల్సిన పదోన్నతులు కూడా త్యాగం చేసిన సందర్భాలు లేకపోలేదు. రెండు సార్లు మాత్రం తప్ప లేదు ఒకసారి నరసరావుపేట వదిలి పిడుగురాళ్ళ వెళ్ళి ఒక రెండేళ్ళు ఉండి తిరిగి వస్తే రెండవసారి నరసరావుపేట నుండి గుంటూరు కు వచ్చి అక్కడే స్థిరపడిపోయాం. మాకు ఇళ్ళు కూడా ఎక్కువగా మారే అలవాటు ఉండేది కాదు. పిడుగురాళ్ళ నుండి వచ్చేసాక దదాపు పదమూడేళ్ళపైగా ఒకే ఇంట్లో ఉన్నాము. ఎంత మంది ఆ ఇంటి వాస్తు మంచిది కాదు అని చెప్పినా ఏం జరిగినా గుంటూరు వచ్చే వరకూ ఆ ఇల్లు మారకుండా అక్కడే ఉన్నాం.

మొదటి సారి బదిలీ నన్ను బాధ పెట్టింది నరసరావుపేట లో రామిరెడ్డి పేట కబీర్‍దాస్ గారి ఇంటి లో ఉన్నపుడు. అప్పుడు నేను తొమ్మిదో తరగతి చదువుతున్నాను. ఆ ఇంట్లో కింద మూడు వాటాలు అద్దెకి ఇచ్చి పైన ఇంటి ఓనర్స్ ఉండే వారు. కింద ఇళ్ళల్లో ఓ చివర మేము ఉండే వాళ్ళము ఇంకో చివర ఓ రైల్వే స్టేషన్ మాష్టారు ఉండే వారు. నేను అప్పుడు పేరుకు తొమ్మిదో తరగతి కానీ వయసు పదమూడో పద్నాలుగో ఉండేది అప్పుడే టీనేజికి వచ్చినా ఇంకా నిక్కర్లు వదలని వయసనమాట అందుకని వాళ్ళూ చిన్న వాళ్ళే అయినా నేను వాళ్ళని అంకుల్ ఆంటీ అంటే ఏమీ అనుకునే వాళ్ళు కాదు. నాకు వాళ్ళ ఇంట్లో బాగా కాలక్షేపం ఖాళీ దొరికినప్పుడల్లా వెళ్ళి కూర్చుని వాళ్ళ తో కబుర్లు చెప్పే వాడ్ని, నేను మొదటి సారి వాకెమన్ లో పాటలు విన్నది వాళ్లదగ్గరే. అప్పటి వరకూ మా ఇంట్లో ఫ్లాట్ గా ఉండే ఢిల్లీ మోనో సెట్ (దీని గురించి చెప్పాలంటే ఓ ప్రత్యేక టపా కావాలి మళ్ళీ చెప్తాను) లో పాటలు వినడం అలవాటు. మొదటి సారి స్టీరియో వాక్మన్ చెవులకి పెట్టుకుని బయటకి వినపడకుండా వినడం, ఆ హెడ్ సెట్ తలకి పెట్టుకుని పెద్దగా అరచినట్లు మాట్లాడటం ఇది ఎదుటి వాళ్ళు గుర్తించి చెప్తే నవ్వుకోడం అంతా ఓ వింత అనుభూతి. వాళ్ళ సొంత ఊరు వైజాగ్ అనమాట షిప్ యార్డ్ గురించి వైజాగ్ గురించీ వాళ్ళు కబుర్లు చెప్తుంటే అలా వింటుండేవాడ్ని. అలా నాకు మంచి ఫ్రెండ్స్ అయిన వాళ్ళు బదిలీ అయి వెళ్ళి పోయినప్పుడు నేను ఏడ్చేసాను. ఆంటీ కూడా వెళ్ళి పోతున్నందుకు ఏడ్చేశారు అప్పుడు. కాని తర్వాత వాళ్ళ తో కాంటాక్ట్ తప్పి పోయింది ఇప్పుడు ఎక్కడ ఉన్నారో మరి.

కౌలాలంపూర్ లోని పెట్రొనాస్ టవర్స్ పోలికతో హెబ్బాల్ కి దగ్గర లో నార్త్ బెంగళూరు కు చిహ్నం గా మారిన ట్విన్‌టవర్స్ అపార్ట్మెంట్స్ ఇవి. నేను ఇదివరకు అంతా సౌత్ బెంగళూర్ లో ఉండటం తో దీని గురించి అస్సలు తెలియదు. మొన్న మొదటి సారిగా ఆఫీస్ కి ఈ వైపు వచ్చినపుడు చూసి అవాక్కయ్యాను.

ఇక నా బదిలీ లో రెండవ అంకం బెంగళూరు లో స్థిరపడటం... అక్కడ మళ్ళీ ఇపుడు అద్దెఇళ్ళ కోసం వేట, దొరికాక వాటికి పదినెల్ల అడ్వాన్సు.. మంచినీళ్ళ నుండీ ఇంటర్‍నెట్ వరకూ అన్నీటికీ వెతుక్కొని సమకూర్చుకోడం అంతా చాలా పెద్ద పనే... ఆఫీసు కి దగ్గర్లో ఇల్లు దొరకకపోతే మళ్ళీ రోజు వెళ్ళి రావడం ఒకటి సమస్య, ఆఫీసు దగ్గర లో అంటే మరీ పల్లెటూరు అదీకాక మొన్నే ఎవరో మా కొలీగ్ ను రాత్రి పదకొండు గంటలప్పుడు ఆఫీసు నుండి ఇంటికి నడిచి వెళ్తుంటే పొడిచారట... అతని అదృష్టం కొద్దీ ప్రాణ హాని లేకపోయినా మన అదృష్టం ఎలా తగలడుతుందో ఏమి తెలుసు. ఏమిటో ఈ రౌడీ వెధవలకి లేటెస్ట్ న్యూస్ చేరుతున్నట్లు లేదు.. ఇంకా సాఫ్ట్వేర్ ఉద్యోగులు అంటే బోలెడు డబ్బుంటుంది అనే అపోహ లోనే ఉన్నట్లున్నారు... ప్రస్తుత పరిస్తితులలో ఈడ్చి తంతే దమ్మిడీ రాలట్లేదు అనే విషయం ఇంకా అర్ధమైనట్లు లేదు వాళ్ళకి. అన్నట్లు మా ఆఫీస్ ఐబీయం మాన్యతా లో ఉంది హెబ్బాల్ ఫ్లైఓవర్ దగ్గర లో నాగవరా అనే ఊరిలో అట ఆ చుట్టు పక్కల మీదో మీకు తెలిసిన వాళ్ళదో ఇల్లు అద్దెకి ఉంటే నాకో మాట చెప్పండి.. మీ సాయం మర్చిపోను. అన్నట్లు నేను ప్రస్తుతం సింగిల్ బెడ్రూం ఇల్లు కోసం వెదకాలి. మరీ గవర్నమెంట్ హాస్టళ్ళలా కాక కాస్త డీసెంట్ గా ప్రత్యేకమైన గది ఉండి సౌకర్యవంతమైన పేయింగ్ గెస్ట్ అయినా పర్లేదు అని చూస్తున్నాను.

అద్దె ఇల్లంటే గుర్తొచ్చింది జిల్లా కి ముఖ్య పట్నం అయిన గుంటూర్ లో కూడా అద్దెకి ఇల్లు వెతుకుతుంటే మీరెవరు? మీ సామాజిక వర్గం ఏమిటీ, వెజ్జా నాన్వెజ్జా ఇత్యాది ప్రశ్నలు సర్వసాధారణం అయిపొయాయి ఒకరు చౌదర్లకి మాత్రమే అంటే ఇంకోరు రెడ్లకి మాత్రమే అంటారు మరొకరు క్రిస్టియన్సె కే అంటే ఇంకోరు హిందూస్ ఓన్లీ అంటారు అన్నీ నిరూపించుకుని ఇల్లు వెదకడం బోలెడు కష్టం అయిపోతుంది.. నా అదృష్టమో ఏజంట్ల ద్వారా వెళ్ళడం వలన వాళ్ళు అవన్నీ ముందే ఫిల్టర్ చేసారో కానీ నాకు ఇంతవరకూ బెంగళూరు లో ఎప్పుడూ ఆ సమస్య రాలేదు మరి, ప్రస్తుతం బెంగళూరు లో అదీ పల్లె వాతావరణం తో ఉండే నాగవరా లో నాకు ఎన్ని శల్య పరీక్షలు పెట్టనున్నారో ???

ఈ టపా నేను మే పదిహేడున ఎయిర్‍పోర్ట్ లో కూర్చుని రాసాను కాని అప్పటి నుండి ఇప్పటి వరకూ ఇంటరెనెట్ దొరకక పోస్ట్ చేయలేదు. అంటే అక్కడ ఎందుకో నెట్ పని చేయలేదు. నెట్‍సెంటర్ కి వెళ్ళాలంటే బద్దకం :-) ఆఫీసు లోనేమో చాలా బిజీ, హోటల్ లో ఇంటర్నెట్ వైఫై ఉంది కానీ నాలుగు రోజుల క్రితం కురిసిన వర్షాలకి బీయస్‍యన్‍యల్ తీగలు తెగాయిట అప్పటి నుండీ అది పని చేయడం లేదు, రిసెప్షన్ వాడికి కాల్ చేసిన ప్రతిసారీ "ఎవరో రావాలీ ఈ తీగలు సవరించాలీ..." అని అదే పాట పదే పదే పాడుతున్నాడు. అందుకే ఇక లాభం లేదు అని ఈ ఆదివారం ప్రత్యేకంగా ఆఫీసుకు వచ్చి బ్లాగ్ మరియూ కొన్ని ముఖ్యమైన ఈమెయిల్స్ కి జవాబివ్వాల్సిన పని ముగించాను. అన్నట్లు నాకు వెంటనే అన్ని విధాలా అనుకూలమైన వసతి దొరకాలని ఆశీర్వదించడం మరవకండేం, ఇంకా ఈ మధ్య దేవుళ్ళెవరూ నా మొర ఆలకించడం లేదల్లే ఉంది సో మీ రికమెండేషన్ పని చేస్తుందేమో మరి, కాస్త ప్రయత్నించి చూద్దురూ...

సరే త్వరలో మరో టపా లో మళ్ళీ కలుద్దాం అంతవరకూ శలవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.