బుధవారం, మే 11, 2016

కాలాన్ని శాసించ గలిగితే...

టైమ్ ట్రావెల్... మహా మహా మేధావులు సైతం ఎక్కడో ఓ చోట తడబడి అర్ధం కాక తికమక పడే సబ్జెక్ట్.. "అలాంటి సబ్జెక్ట్ తో సూర్య కొత్త సినిమా అదీ మూడు కారెక్టర్స్ తనే చేస్తున్నాడట. ఇక ఐనట్లేలే" అని తేలికగా నిట్టూర్చేశాను మొదట్లో ఈ సినిమా గురించి విన్నపుడు, కానీ దర్శకుడు విక్రమ్ కుమార్ అనేసరికి కాస్త ఆసక్తి కలిగింది. "మనం" లాంటి ఒక కాంప్లెక్స్ ఐడియాని సింపుల్ గా నెరేట్ చేసిన అతని శైలి గుర్తొచ్చి సినిమా కోసం ఎదురు చూసేలా చేసింది. సినిమా చూశాక మరో అద్భుతమైన కథనంతో తనపై ఉన్న నమ్మకాన్ని వందశాతం నిలబెట్టుకున్నాడు విక్రం అని అనిపించింది.

మీరు గమనించి చూస్తే స్కూల్లో కానీ కాలేజ్ లో కానీ ఫిజిక్స్ క్లాస్ లు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అది ఎవ్విరిడే సైన్స్ తో కలిసి పోయి ఉండడం ఒక కారణమైతే ఫిజిక్స్ టీచర్స్ అందరూ కూడా రోజువారీ జీవితంలో ఎదురయ్యే విషయాలకు కొత్త అర్ధాన్ని ఇస్తూ అన్వయిస్తూ చాలా సులువుగా అర్ధమయేలా చెప్పడం ముఖ్య కారణం. "24" సినిమా తీసిన విక్రమ్ కుమార్ కూడా అలాంటి ఓ ఫిజిక్స్ టీచరేననిపించింది ఈ సినిమా చూశాక. 

కొందరు డైరెక్టర్లు కాంప్లెక్స్ ఐడియాలని మరింత కాంప్లికేటెడ్ గా తెరకెక్కించి జనాల్ని కన్ఫూజ్ చేసి పారేస్తుంటే టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ లో బేసిక్స్ ని తీసుకుని క్లాసు మాసు అని తేడా లేకుండా ప్రతి ఒక్క ప్రేక్షకుడికి సులువుగా అర్ధమయేలా స్పూన్ ఫీడ్ చేస్తూ విక్రమ్ రాసుకున్న స్క్రిప్ట్ ఈ సినిమాకి మొదటి హీరో అయితే, సైంటిస్ట్ గా విలన్ గా లవర్ బోయ్ గా మూడు పాత్రలను అద్భుతంగా పండించిన సూర్య రెండో హీరో. 

ఇక విక్రమ్ కుమార్ ఆలోచనని అంతే అద్భుతంగా తెరకెక్కించిన టెక్నికల్ టీమ్ : సినిమాటోగ్రాఫర్ "తిరు", ప్రొడక్షన్ డిజైనర్స్(ఆర్ట్ డైరెక్టర్స్) అమిత్ రే అండ్ సుబ్రత చక్రబోర్తి, విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ వైజర్ జూలియన్ ట్రౌసిల్లియర్ లు ఈ సినిమాకి మేజర్ అస్సెట్స్ అని చెప్పచ్చు. నేపధ్య సంగీత పరంగా రహ్మాన్ సంగీతం కొంత వరకూ ఆకట్టుకున్నా పాటల విషయంలో మాత్రం పూర్తిగా తేలిపోయింది. సినిమా పూర్తయే సరికి లాలి పాట తప్ప మరేవీ గుర్తుండవు.

సాధారణంగా టైమ్ ట్రావెల్ అనగానే భవిష్యత్తులోకి ప్రయాణించడం గతంలోకి ప్రయాణించడం అక్కడ కొత్త వ్యక్తులని కలుసుకోడం ఇలాంటి కథే ఉంటుందని ఊహిస్తాం ఐతే విక్రం ఈ మార్గాన్ని ఎన్నుకోలేదు. కాలంలో ప్రయాణించడానికి బదులుగా కాలాన్ని శాసించ గలిగితే ఎలా ఉంటుంది అనే ఐడియాని తీస్కుని ఓ సాధారణ రివెంజ్ డ్రామాని చెప్పాలని డిసైడ్ అయ్యాడు. దాంతో తనకి ఎక్కువ క్రియేటివ్ ఫ్రీడమ్ దొరికినట్లైంది.

ఈ సినిమా కథ విషయానికి వస్తే శివకుమార్(సూర్య) కాలాన్ని అదుపు చేయగల ఒక వాచ్ ని తయారు చేయాలని ప్రయత్నిస్తూ అనుకోని ఓ చిన్న యాక్సిడెంట్ వల్ల విజయం సాధిస్తాడు. ఐతే దానిమీద కన్నేసిన అతని కవల సోదరుడు ఆత్రేయ(సూర్య) ఆ వాచ్ ని సొంతం చేస్కునే ప్రయత్నంలో శివని అతని భార్య(నిత్యా మీనన్)ని చంపేస్తాడు. అతి కష్టం మీద శివ తన కొడుకు మణి(సూర్య) ని మాత్రం రైల్లో ఎదురైన సత్య(శరణ్య) అనే ఆవిడకి అప్పగించగలుగుతాడు.

ఈ ప్రయత్నంలోనే ఆత్రేయకి యాక్సిడెంటై కోమాలోకి వెళ్తాడు.  పాతికేళ్ళ తర్వాత మణి పెరిగి పెద్దవాడై వాచ్ మెకానిక్ గా స్థిరపడతాడు. ఇన్నేళ్ళ తర్వాత కోమానుండి బయట పడిన ఆత్రేయ తిరిగి వాచ్ కోసం అన్వేషణ మొదలు పెడతాడు. ఆ వాచ్ ఎక్కడికి చేరింది, ఆత్రేయకి మణి గురించి ఎలా తెలుస్తుంది, మణి తన గతాన్ని ఎలా తెలుసుకుని ఆత్రేయ పై ఎలా పగ తీర్చుకున్నాడు అనేది మిగిలిన కథ.

చూడడానికి అతి సాధారణమైన రివెంజ్ స్టోరీలా కనిపించే ఈ కథకు టైమ్ ట్రావెల్ ని జోడించి అందరికీ సులువుగా అర్ధమయేలా రాసుకున్న కథనం అద్యంతం ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తూ ఊహించని మలుపులను అందిస్తూ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన విషయం అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ ని టైమ్ ట్రావెల్ థియరీని విడమరిచి చెప్పడానికి ఎక్కడా ప్రయత్నం చెయ్యకపోవడం. అలా కాకుండా చక్కని సన్నివేశాలతో తన కథ చెప్పడనికి ఆ కాన్సెప్ట్స్ ని ఉపయోగించుకోవడం విక్రం బ్రిలియన్సీకి నిదర్శనం అనిపించింది.

సినిమాలో వాడిన కాన్సెప్ట్స్ సైంటిఫిక్ గా వందశాతం కరెక్ట్ కాకపోవచ్చేమో కానీ టైమ్ ట్రావెల్ చుట్టూ ఉన్న ఆంబిగ్విటీని సైతం తన కథకు ప్లస్ గా సరదా సన్నివేశాలు రాసుకోడానికి ఉపయోగించుకున్నాడు. సినిమాటిక్ లిబర్టీస్ అనుకోండి ఇల్లాజికల్ సీన్స్ అనుకోండి అల్టిమేట్ గా సినిమాని ఆస్వాదించడానికి ఆ సన్నివేశాలు దోహదం చేస్తాయి అక్కడే విక్రం ఊహాశక్తి బయటపడుతుంది.

ఇక లవర్ బోయ్ గా సైంటిస్ట్ గా ఆత్రేయగా సూర్య చూపించిన వేరియేషన్స్ అద్భుతం. ముఖ్యంగా ఆత్రేయ కారెక్టర్ భయపెడుతుంది సినిమా అయ్యాక కూడా గుర్తుండిపోతుంది. ఈ సినిమా వరకు ఏమైనా నెగటివ్ పాయింట్స్ ఉన్నాయంటే అవి పాటలు ప్లస్ సమంతాతో రిపీటెడ్ గా అనిపించి బోర్ కొట్టే ఒకటి రెండు సన్నివేశాలు. అవి కూడా కామెడీగా నవ్వుకోవడానికి పనికొచ్చినా రిపీట్ అయినపుడు కాస్త విసుగు తెప్పిస్తాయి. సమంత క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో కాస్త ఆకట్టుకునే ప్రయత్నం చేసింది కానీ స్పీడ్ బ్రేకర్స్ లా అనిపించాయి ఆ సన్నివేశాలు. 

మొత్తం మీద ఈ వేసవిలో సకుటుంబ సపరివార సమేతంగా మిస్ అవ్వకుండా చూడ దగిన సినిమా 24. ముఖ్యంగా మీ పిల్లలతో కలిసి వెళ్ళి వాళ్ళడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ వేసవి శలవల్లో వినోదంతో పాటు విజ్ఞానాన్ని పంచుకోగల చిత్రం 24.  డోంట్ మిస్ ఇట్.  

6 కామెంట్‌లు:

  1. చాలా కాలం తరువాత మీ నించి రివ్యూ చుశాము..వెరీ ఇంట్రెస్టింగ్..సాంగ్స్ నేను వినలేదండి..బట్ రీ రెకార్డింగ్ విన్నంత వరకూ బావున్నట్టనిపించింది..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. థాంక్స్ శాంతి గారు, అవునండీ రీరికార్డింగ్ బాగానే ఉంది.

      తొలగించండి
  2. మన అదృష్టం ఏమిటంటే, ఈ కథని గబ్బర్ సింగ్ గారికి వినిపించారట మొదట. కానీ, గబ్బర్ సింగ్ గారు ఈ కథ వింటూ నిద్రపోయారట. మెలకువ వచ్చిన తరువాత, ఇలాంటి కథను తాను చేయడమేమిటి చీపుగా అని గబ్బర్ గారు ఒప్పుకోలేదు. దాంతో సినిమా ప్రేమికులకు ఒక మంచి నటుడి నటననూ, హీరో కెలికి చెడగొట్టని కథనూ చూసే అవకాశం దక్కింది :-)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హహహ బాగా చెప్పారు శ్రీకాంత్ జీ :-) నేను ఈ కథ మహేష్ కి కూడా వినిపించారని విన్నానండీ..

      తొలగించండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.