ఆదివారం, నవంబర్ 22, 2009

బండీ రా.. పొగబండీ రా..

శీర్షిక చూసిన వెంటనే వంశీగారి జోకర్ సినిమా లో పాట గుర్తు చేసుకుంటూ.. "వీడెవడండీ బాబు పొగబండి అని శీర్షికపెట్టి వోల్వో బస్సు బొమ్మ పెట్టాడు !! పొగబండి అంటే రైలుబండి అని కూడా తెలియని వీడికి ఒక బ్లాగు.. దానిలో పోస్ట్ లు.. వాటిని మనం చదవడం..హుః" అని మోహన్ బాబు స్టైల్ ల్లో తిట్టేసుకోకండి మరి, చివరి ఫోటో చూస్తే అసలు ఈ టపా ఎందుకు మొదలెట్టానో మీకీపాటికి అర్ధమైపోయుంటుంది. అసలు టపా లోనికి వెళ్ళేముందు ఓ చిన్ని పిట్టకథ చెప్పాలి.

ఇది చాలా రోజుల క్రితం కథ, అప్పటికింకా వోల్వోబస్సులు మన ఆర్టీసీకి రాని రోజుల్లో.. బస్సుల్లో కూడా హైటెక్ హవా నడుస్తున్నరోజుల్లో ఓ శుభముహుర్తాన బెంగళూరు నుండి ఓ ప్రైవేట్ హైటెక్ బస్సు లో గుంటూరు బయల్దేరాను. రాత్రి పదకొండుగంటల ప్రాంతంలో భోజనమయ్యాక వాక్మన్ లో పాటలు వింటూ నిద్రకుపక్రమిస్తుండగా "థడ్‍డ్..డాం.." మంటూ పెద్ద శబ్దం అంతకన్నా పెద్ద కుదుపుతో బస్ ఆగిపోయింది. దదాపు కూర్చున్న ప్రతిఒక్కరికి మొహమో కాళ్ళకో ముందు సీట్ కి తగిలి చిన్న దెబ్బలు తగిలాయి. బస్ ముందు అద్దం పగిలింది కదిలే స్థితిలో ఉందో లేదో తెలీదు. భోజనాల దగ్గర మందుకొట్టి ఎక్కిన డ్రైవర్ క్లీనర్ ఇద్దరూ కూడా ప్రయాణీకులతో పాటు నిద్రకుపక్రమిస్తూ యాక్సిడెంట్ చేయడం కాకుండా వెంటనే బస్ ని, ప్రయాణీకులని గాలికి ఒదిలేసి పరారయ్యారు. వీడు ఎదురుగా గుద్దినది ఒక అర్టీసీ బస్ ని ఆ బస్ స్టాఫ్ మా రూట్ లో వెళ్ళే ఇతర ఆర్టీసీ బస్సులను ఆపి మమ్మల్ని ఎక్కించి పంపించారు. నాదగ్గర ఉన్న అన్ని డబ్బులు ప్రైవేట్ బస్ వాడి టికెట్ కి పెట్టేయడం తో ఈ కొత్త బస్ లో టికెట్ కి పదిరూపాయలు తగ్గితే ఓ అపరిచితుడ్ని అడిగి టికెట్ తీసుకున్నాను అతను మా కొలీగ్ తర్వాత మంచి ఫ్రెండ్ అయ్యాడనుకోండి. ఈ సంఘటన నాకు రెండు పాఠాలు నేర్పింది. ఒకటి కేవలం గవర్నమెంట్ బస్సులు మాత్రమే ఎక్కడం. ఇంకోటి ప్రయాణం లో ఎప్పుడూ టికెట్ డబ్బుకి రెట్టింపు డబ్బు దగ్గర ఉంచుకోడం.

సరే ఇక విషయంలోనికి వస్తే ప్రస్తుతం ఓల్వో బస్సులు వచ్చి బస్ ప్రయాణాన్ని కాస్త సులభ తరం చేశాయనే చెప్పచ్చు. మొన్నా మధ్య బెంగళూరు నుండి హైదరాబాద్ కు వోల్వోలో ప్రయాణించాను, అది ఎపియస్ అర్టీసీ వారి బండి. దాని వాలకం చూడగానే కాస్త అనుమానాస్పదంగా కనిపించింది. సాధారణంగా మిగిలిన బస్ ల మెయింటెనెన్స్ విషయం లో కాస్త అలక్ష్యం చూపించినా ఓ ఆర్నెల్లక్రితంవరకు వోల్వోలు బాగానే మెయింటెయిన్ చేసేవారు ఈ బస్ వాలకమే డబ్బా వాలకంగా కనిపించింది. సరే టిక్కెట్టుకొన్నాక తప్పదు కదా అనుకుని ఎక్కి కూర్చున్నాను మొదటి అసౌకర్యం సీట్ల మధ్య ఎడమ విషయంలో, మరీ సీట్ లు దగ్గర దగ్గరగా అరేంజ్ చేశాడు ఎంతగా అంటే ముందు వాడు ఫుల్ గా రిక్లైన్ అయితే వెనక సీట్లో ఎవరూ కూర్చోలేనంత. బెంగళూరు - గుంటూరు రూట్లో నాకు ఈ అసౌకర్యం ఎపుడూ కలగలేదు. సరే అని కూర్చుంటే రాత్రి రెండు గంటల సమయం లో పెద్ద కుదుపుతో బస్ ఆగిపోయింది. సెల్ఫ్ స్టార్టర్ పని చేయడం లేదు కాసేపు గ్యాప్ ఇచ్చి స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ సెల్ఫ్ అందుకోవడం లేదు.

అలా బస్ ఆగిపోయి రెండునిముషాలు కూడా అవ్వలేదు అతి దగ్గరలో వెనక నుండి పెద్దగా రైలు కూత !! వెనక్కి తిరిగి చూస్తే.. నాకైతే ఒక్క క్షణం వెన్నుజలదరించింది, ఆ రైలు నా గుండెల్లోనే పరిగెట్టినట్లు అనిపించింది. రైల్వే ట్రాక్ కు మా బస్ కూమధ్య రెండు బస్సులు పట్టే అంత దూరం అంతే.. గేటు దాటిన వెంటనే మా బస్ ఆగిపోయింది కాబట్టి సరిపోయింది అదే ట్రాక్ మీద ఆగితే మా పరిస్థితి ఏంటి. బస్ లో పసిపిల్లలు, మహిళలు, వృద్దులు అన్ని రకాల వాళ్ళు మంచి నిద్ర లో ఉన్నారు అందర్ని లేపి సమయానికి బస్ నుండి దింపడం సాధ్యమయ్యే పనేనా.. బస్ ను ట్రాక్ పైనుండి నెట్టి ఇవతలికి తీసుకురావాలన్నా అంత తక్కువ వ్యవధిలో అయ్యేనా... అసలు ఇలాటి ఎమర్జన్సీ సమయం లో గేట్ పడకపోతే అతి తక్కువ సమయంలో రైలు ను ఆపటానికి సరైన ఎక్విప్ మెంట్ మరియూ భద్రతా వ్యవస్థ ఆగేట్ దగ్గర ఉందా ఇలాటి ప్రశ్నలు చుట్టుముట్టాయి. నాకు తెలిసి ఇది వరకు 5 నిముషాలకు ముందే గేట్ వేసేవాడు ఇపుడు బెటర్ ఎక్విప్మెంట్ ఉండటం వల్ల ఆ వ్యవధి తగ్గించాడా లేక కేవలం ట్రాఫిక్ ఒత్తిడి వలనా అనేది తెలియదు.

సరే బస్ ఆగింది సెల్ఫ్ స్టార్ట్ అవడం లేదు ఇక మార్గాంతరం బస్ తోయడమే అయి ఉంటుంది అనుకుంటూ బస్ దిగి ఏమైందా అని నిలబడి చూస్తున్నాను. అప్పటికే నాలాటి ఎంతూసియాస్ట్స్ కొందరు దిగి ఇంజన్ చుట్టు పక్కల మూగి మాట్లాడుకుంటున్నారు. ఇదే సందు అని సిగరెట్ వెలిగించి హడావిడిగా దమ్ము లాగేస్తున్నారెవరో..

"ఇందాక వాళ్ళ బస్ ఫెయిల్ అయిందని ఎవర్నో చాలామందిని ఎక్కించారు వాళ్ళని దించేయండోయ్ ఎవరో స్ట్రాంగ్ లెగ్ గాడున్నట్లున్నాడు " ఒకాయన జోక్.

"ఛ ఏపీయస్ ఆర్టీసీ వాళ్ళు ఇంత చెత్త బస్సులు నడుపుతున్నారా.. ఇంకోసారి వీళ్ళ బస్ అసలు ఎక్క కూడదు.." ఓ యూత్ అప్పటికప్పుడు తీసేసుకున్న రిజల్యూషన్.

"కుదుపులకి బ్యాటరీ వైర్లేవో లూజ్ అయి ఉంటాయి చూడండి మాష్టారు.." గుండు సూది నుండి అణుబాంబు వరకూ తనకు తెలియని విషయం లేదని ఫీల్ అయ్యే ఓ పెద్దాయన ఉచిత సలహా...

"అబ్బా బంగారం లాంటి నిద్ర పాడు చేశారు.. బయల్దేరిన దగ్గరనుండి డొక్కు సినిమా ’బిల్లా’ పెట్టి. ఇప్పుడేమో ఇలా హు.. అవును మాష్టారూ ఇంతకీ ఇది ఏ ఊరంటారు ??" ఇంకొకాయన భోగట్టా..

"......." చిరునవ్వుతో మౌనంగా వీళ్ళమాటలు వింటూ, మనసులో "ఇవి జాగ్రత్తగా గుర్తు పెట్టుకుని బ్లాగ్ లో రాసేయాలి.." అనుకుంటూ నేనూ, ఇదీ అక్కడి సన్నివేశం.

సరే చివరికి ఇక వేరే దారి లేదు అని నిర్ణయించుకుని "రండి బాబు బస్ నెట్టండి.. అలా స్టార్ట్ చేయాల్సిందే.. లేకుంటే కదలదు.." అన్న డ్రైవర్ పిలుపందుకుని బస్ వెనక్కి చేరాం. అక్కడ అంతా దుమ్ము డీజిల్ ఎక్సాస్ట్ వలన పట్టిన చమురుమురికి చూడటానికే అసహ్యం గా ఉంది, కానీ మరి తప్పదు కదా అలానే దాని మీద చేతులు వేసి బస్ నెట్టడం మొదలు పెట్టాం. ఓ పది పదిహేనడుగులు నెట్టిన తర్వాత ఒక్కసారిగా ఇంజన్ స్టార్ట్ అయింది.. మరుక్షణం దట్టంగా నల్లని పొగ మేఘం మా అందరిని చుట్టుముట్టింది.. మేమంతా బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికుల్లా.. నల్లగా తయారయ్యాం.. అవకాశం దొరికిన వెంటనే తప్పించుకున్నం కాని ఆ లోపే ఇదీ మా పరిస్థితి. ఆ తర్వాత కూడా బస్ ఇంజన్ రైజ్ చేసేకొద్దీ దాదాపు ఒక అయిదు నిముషాలపాటు అలా నల్లని పొగ వదులుతూనే ఉంది. (ఈ పక్కన ఫోటో గూగులమ్మ ఇచ్చింది, నేనెక్కిన బస్ ఇంతకు పది రెట్లు ఘోరంగా ఉంది)

వోల్వో వెబ్ సైట్ ని బట్టి చూస్తే వాళ్ళ బస్సులు అన్ని Euro 2/Euro 3 ఎమిషన్ క్లాసుకు చెందినవే అయి ఉంటాయి, వాటికి ఇంత ఘోరమైన నల్లని పొగ రాకూడదు. మరి మన వాళ్ళు కిరోసిన్ కల్తీ అయిన డీజిల్ తోనడుపుతున్నారో లేక బస్ కొనడమే కానీ బొత్తిగా మెయింటెనెన్స్ విషయం పట్టించుకోవడం లేదో అర్ధం కాలేదు. నాకైతే మెయింటెనెన్స్ లోపమే అనిపించింది, అలా అనుకోవడానికి బస్ వాలకం కూడా ఒక కారణం. కనీసం సరిగా బస్ కడిగే విషయం కూడా పట్టించుకోని వాళ్ళు క్రమం తప్పకుండా సర్వీస్ చేయించే అవకాశం నాకైతే కనిపించలేదు. అలా చేయిస్తే ఇలాటి సంధర్భం ఎదురు పడదు అని నా నమ్మకం. దాదాపు యాభై నుండి అరవై లక్షల వరకూ పోసి కొనే బస్సులు ఇలా గాలికి వదిలేస్తే వాటి లైఫ్ స్పాన్ తగ్గిపోవడం ఒక నష్టం. అదేకాక ఇందాక చెప్పినట్లు ఏ రైల్వే ట్రాక్ మధ్య లోనో ఆగిపోయి ఫాటల్ యాక్సిడెంట్ కి కారణం అయితే ఎవరి నిర్లక్ష్యానికి ఎవరు మూల్యం చెల్లించినట్లు ? వీళ్ళు మారేదెన్నడు ??

17 కామెంట్‌లు:

  1. బాగున్నాయి మీ బస్సానుభవాలు!

    బెంగుళూరు, హైద్రాబాదుల మధ్య కంటే బెంగుళూరు గుంటూరు మధ్య ప్రయాణం వోల్వోలో హాయిగా ఉంటుంది. అందునా NH 5 మీదకు వచ్చాక ప్రయాణం మరింత వేగంగా, సుఖంగా ఉంటుంది.

    నాకు తెలిసి ముఖ్యంగా KSRTC ఓల్వో బస్సులు భలే డొక్కుగా ఉంటాయి.అందునా హైద్రాబాదు రూట్లో వేసే బస్సులు మరీ ఘోరం. నత్త నడక నడుస్తూ ఉంటాయి. ఇదేమిటని అడిగితే ఒక డ్రైవర్ ఇలా చెప్పాడు."ఏపీలో మా బస్సుకు యాక్సిడెంట్ అయితే చాలా లిటిగేషన్లు ఉంటాయమ్మా! అందుకని కర్ణాటకలో స్పీడుగా తోలినా ఏపీలోకొచ్చాక కాస్త నెమ్మదిగానే తోలతాం" !

    బెంగుళూరు దాటిన కొద్దిగంటల్లో కర్నాటక ఎండ్ ఐపోయి ఏపీ వస్తుందాయె!

    మెయింటెనన్స్ విషయానికొస్తే కొత్తల్లో ప్రతిదీ బాగానే ఉంటుంది. రాను రాను కిటికీలకు మురికి కర్టెన్లూ, ఏళ్లతరబడి ఉతకని షాల్సూ...తో సహా ఇంజను వరకూ అన్నమాట. అందుకే నేను మాత్రం వోల్వో బస్సులో నా షాల్ ఇంట్లోంచి పట్టుకెళతాను.(ఇంజన్ అలా పట్టుకెళ్ళలేం మరి)

    రిప్లయితొలగించండి
  2. నెమలికన్ను మురళి గారివ్యాఖ్య ఈమెయిల్ ద్వారా.

    ఆర్టీసీ వాళ్ళు మారుతున్నారు కానీ బహు నెమ్మదిగా అండీ.. వీళ్ళు వోల్వో లాంటివి ఇంట్రడ్యుస్ చేయడమే ఒక వింత.. మీరు చెప్పిన కారణాలతో పాటు రోడ్ కండిషన్ అనే మరో కారణం కూడా ఉంటుంది.. మన రోడ్లలో వోల్వో కి అనుకూలమైనవి ఎన్ని ఉన్నాయంటారు? పబ్లిక్ సర్విస్ కదా.. అందుకే బస్సులన్నీ 'ఎవరికి పుట్టిన పిల్లరా.. ఎక్కెక్కి ఏడుస్తోంది?' అన్నట్టు ఉంటాయి.. బాగుంది మీ పొగబండి కథ.. మొదటి పేరాలోనే చెప్పెయ్యకపోతే నేను వంశీ కోసం వెతుక్కునే వాడిని :):)

    రిప్లయితొలగించండి
  3. ఇదేంటి, నేనూ ప్రయాణం గురించి రాద్దామనుకున్నానే. సరే..

    వోల్వో బస్సుల పేరుతో వచ్చే చాలా బస్సులు వోల్వోవి కావేమో అని నాకో అనుమానం. మీ అనుభవాలే నాకూ ఓ సారి చెన్నైకి వెళ్ళినప్పుడు కలిగాయి.

    రిప్లయితొలగించండి
  4. సుజాత గారు నెనర్లు. ఎలాగూ ఉద్యోగం బెంగళూరు లో చేస్తూ టాక్స్ డబ్బుల్లో వాటా కర్ణాటకకిస్తున్నాం కదా కనీసం ఇలాటి టికట్ డబ్బులైనా మనవాళ్ళకివ్వాలి అని నేను KSRTC బస్సులు ఉపయోగించనండి ఎప్పుడూ APSRTC నే. హైదరాబాద్ సర్వీసుల విషయం లో మెయింటెనెన్స్ మరీ ఘోరం. అదేకాక కనీససౌకర్యాలు లేని చోట్ల భోజనానికి ఆపడం మరీ దారుణం.

    మురళి గారు నెనర్లు. రోడ్లు కాస్త బాగయ్యాకే వోల్వో సర్వీసు మొదలైందనుకుంటానండీ.. మరందుకే ముందే చెప్పేసాను :-)

    రవి గారు నెనర్లు, కలర్స్ ఇంకా ఫ్రేమ్ ని ఇమిటేట్ చేసే బస్సులు వచ్చాయి కానీ వోల్వో పేరుతో రాలేదండి. అశోక్‍లేలాండ్ వాళ్ళు ఈ మధ్య కొత్తగా A/C బస్ లు దించారు అవి కూడా బాగున్నాయ్. విజయవాడ డిపో వాళ్ళు కొన్నారనుకుంటా ఇవి. విజయవాడ బెంగళూరు మధ్య చూశా వీటిని.

    మీరుకూడా రాసేయండి ఎవరి శైలి వారిదే కదా.

    రిప్లయితొలగించండి
  5. వేణు, దాదాపు పదిహేనేళ్ళ పైగా ఇవేమీ నాకు అనుభవం కాదు కానీ ఇక్కడ నుండి అక్కడికి వచ్చినపుడు నిజమైన పొగబళ్ళలో కథలు వెతలు తెలుసు. మురళీ గారన్నట్లు మార్పు/అభివృద్ది నెమ్మదిగానైనా వస్తే బాగుండు. మీ శీర్షిక చూడగానే "బండి పొగ బండి రా.." పాట "స్టేషన్ మాష్టఱ్ లోదేమో? గుర్తుకు వచ్చింది.

    పూర్వాశ్రమంలో నాకూ ఓ బస్ కథ అనుభవం త్వరలో వ్రాస్తాను చిన్న కథగా సమయం వుంటే.

    రిప్లయితొలగించండి
  6. బాగుంది పొగ బండి ముచ్చట్లు... ఎంచక్క గా ఉషా జలాభిషేకం, జ్యోతి వన భోజనం పెట్టినట్టు బస్సోత్సవాలు పెట్టి మంచి + చెడ్డ అనుభవాలు కలిపి రాస్తే బాగుంటుందేమో... అబ్బ ఆ బుస్ ల లో కర్టెన్స్ కవర్ లు మార్చక పోతే బలే చిరాకు కదా.. జులై లో ఇండియా వచ్చినప్పుడు రాజస్తాన్ నుంచి డెల్హీ బస్ లో వెళ్ళేము.. రామ చంద్ర ఎందుకు లే... గతమ్ గతః అనుకోవటమ్ బెటర్.

    రిప్లయితొలగించండి
  7. బాగుంది వేణు గారు బాగుంది. ఇంత ఇబ్బంది పడితే బాగుందంటాడు ఏంటి అనుకోకండి, పొగ బండి ముచ్చట్లు బాగున్నాయి అని చెప్తున్నాను.

    వేణు గారు, మీ తోటి ప్రయాణికులలో నాలాంటి 'రూల్స్ రామానుజం' లేడా?
    ఆ రైల్వే గేటు సంగతి అందరు వదిలేసార?

    అది manned crossing అయితే 2 నిముషాలు ముందు వరుకు కూడా గేటు వేయకపోవడానికి బాద్యులు ఎవరు?
    ఒకవేళ అది unmanned crossing అయితే, అక్కడ సిగ్నల్స్ వుండి వుంటే డ్రైవర్ గారు వాటిని గౌరవించలేదా ?
    (ఇంకా చాలా వున్నాయి కానీ, కామెంట్స్ లో ఇంతకన్నా బాగుండదేమో!)

    ఏమైనా చక్కగా అందరూ signals పాటిస్తే అది unmanned aeroplane Xing అయినా బాధ లేదు. ఈ ఫోటోలో లాగ
    http://i48.tinypic.com/msgfit.jpg

    manned crossing అయినా ఎవరి పని వాడు చేయకపోతే, ఇదిగో ఇలా వుంటుంది.
    http://i46.tinypic.com/20gn1vt.jpg

    ఇంక, ఇటువంటి shortcuts తీసుకునే వారిని చూస్తే నాలో 'అపరిచితుడు' తన్నుకు వస్తునాడు.
    http://i48.tinypic.com/2n6rvcm.jpg

    రిప్లయితొలగించండి
  8. 'గవర్నమెంటు బస్సులే ఎక్కాలి' అన్నది నిజం. ఆర్టీసీ బస్సులు ఎలా ఉన్నా, అవంటే నాకెందుకో చాలా గౌరవం. ప్రైవేటు బస్సుల్తో పోలిస్తే, వాటిలో ప్రయాణమే క్షేమం అన్న ఉద్దేశం నాది.

    ఇంతకీ మీ బస్సు డ్రైవరువాడికి 'లైటు ఆర్పి సెల్ఫు కొట్టుము' అని ఎవరూ చెప్పలేదా? :-)

    రిప్లయితొలగించండి
  9. బావున్నాయి మీ వోల్వో అనుభవాలు.. పెరుగుట తరుగుట కొరకే అన్న సామెత చక్కగా వర్తిస్తుందేమో కదా!
    నాకింకా గుర్తుంది మా కజిన్ 'కేశినేని వోల్వో బస్సులు తెచ్చాడక్కా, ఇంక ఇక్కడ పడుకుంటే అక్కడ లేవడమే!" అని చెప్పడం.. నేనేమో ఎప్పుడెప్పుడు ఇండియా వెళ్ళి ఆ బస్ లో పడుకుని మరీ ప్రయాణం చేద్దామా అని ఎదురుచూడటం.. కొన్ని ఏళ్ళ నిరీక్షణ తర్వాత ఫైనల్ గా హైద్ నించి శిరిడీ వెళ్ళడానికి వోల్వో బస్ ఎక్కాను.. బస్ హైవే దారిపట్టి లైట్లు ఆఫ్ చేయగానే అందరూ ఫట్ ఫట్ మని తమ సీట్లు వెనక్కి విరిచేసుకున్నారు, అదే వాల్చుకున్నారు.. అంతే, ముందు శాల్తీ సీట్ నా ఒడికి కేవలం నాలుగైదు అంగుళాల దూరంలో ఉంది!! ఇదేమి కంఫర్ట్ నెస్సో అనుకుంటూ రాత్రంతా జాగారమే!

    రిప్లయితొలగించండి
  10. ఉషగారు నెనర్లు, ఆ పాట జోకర్ సినిమాలోదండి. ఓ అయితే త్వరగా రాసేయండి ఎదురు చూస్తుంటాను.

    భావన గారు నెనర్లు. హ హ బస్ వారోత్సవాల ఐడియా బానే ఉంది. చూద్దాం ఎంతమంది గుర్తు చేసుకుని వారి ప్రయాణ అనుభవాలు రాస్తారో. నిజమే కొన్ని బస్ ప్రయాణాలు తలచుకోవడం వేస్ట్ అనిపిస్తుంది మరచిపోడమే బెటర్.

    ఫణి గారు నెనర్లు. హ హ రూల్స్ రామానుజం ఎవరూ తగల్లేదండీ. ఏమిటో మరి ట్రాక్ విషయం ఎవరూ పట్టించుకోలేదు. అక్కడ గేట్ దగ్గర అటెండెంట్ ఉన్నాడు. ఆటోమాటికి కాదు.

    అబ్రకదబ్ర గారు నెనర్లు. నాదీ మీ పార్టీనే, ఇంటికి వెళ్ళినపుడు అపుడపుడు తమ్ముడు ప్రైవేట్ బస్సులు అనేవాడు కానీ నేను సేఫ్టీ ప్లస్ ఆదాయం దృష్టి లో పెట్టుకుని APSRTC only అనే వాడిని.

    నిషిగంధ గారు నెనర్లు. నిజమేనండీ నాకు చాలా చిరాకు ఆ సీట్ల ప్లేస్మెంట్. కేవలం ఒక్క రో తగ్గిస్తే ఎలాటి ఇబ్బంది లేకుండా వెళ్ళవచ్చు కానీ మనవాళ్ళు నాలుగు సీట్లు తగ్గించడం అంటే మాటలా బోల్డంత ఆదాయం లాస్ అసలే అరవై లక్షలు పోసి కొన్నాం జనాలు ఎలాగోలా అడ్జస్ట్ అవుతార్లే అన్న కాన్సెప్ట్ తో రన్ చేస్తారు.

    రిప్లయితొలగించండి
  11. అన్యాయం వేణు గారు, ఆర్టీసీ బస్సు ప్రయాణం సుఖదాయకం అని వాళ్ళు అంతలా ఊదరగొడుతుంటే మీరిలా వాటిని పొగ బండి అనేస్తే బస్సుల మనోభావాలు దెబ్బతినవూ? నాకు రోజూ ఈ అనుభవమే అవుతోంది, బండి మీద వెళ్తుంటే సరిగ్గా ఎవరో ఎస్ ఎం ఎస్ ఇచ్చినట్టు ఒక ఆర్టీసీ బస్సు ముందు తగులుకుంటుంది, వాడు వెళ్ళడు మనకి సైడ్ ఇవ్వడు. ఆ దెబ్బకి ఆఫీస్ కి వెళ్ళేలోపల మొహమంతా పొగ చూరిపోయి స్వర్ణ కమలం సినిమాలో శ్రీలక్ష్మి ఇంట్లో దేవుడి పటంలా తయారవుతుంది నా మొహం. కానీ ఏమి చేస్తాము, ఆర్టీసీ కో జై బోలో అంతే

    రిప్లయితొలగించండి
  12. టపాకి జవాబు కన్నా, వేణూగారి కన్నా ముందుగా ఈ పాట సంగతి రాయకపోతే నాకు నిద్రట్టదు ఈ రాత్రికి...
    @ఉష: ఈ పాట "జోకర్" సినిమాలోది...వంశీ అభిమానులంతా సమ్మె చేస్తా(O)రు సినిమా పేరు తప్పు చెప్తే...:)

    ఇక టపా సూపరండీ...నాకసలు బస్సు ప్రయాణమంతే చిరాకు..అయినా బొంబాయిలో ఉన్నన్నాళ్ళూ మాకు అవే దిక్కయ్యాయి...అప్పటికప్పుడు దొరికేవి అవే కదా మరి..
    బస్సు ప్రయాణాల్లో ఇలాటివి మాకూ చాలా అనుభవాలున్నాయి....

    "అబ్బా బంగారం లాంటి నిద్ర పాడు చేశారు.. బయల్దేరిన దగ్గరనుండి డొక్కు సినిమా ’బిల్లా’ పెట్టి.."
    ఈయనెవరో ఖచ్చితంగా 50+ అయిఉంటారండీ..:)

    "మేమంతా బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికుల్లా...."
    ఇంతకీ అసలు ఫొటో మిస్సయ్యాం అన్నమాట :) :)

    రిప్లయితొలగించండి
  13. నవరసాల తో మీ పొస్ట్ బాగుందండి . నాకు వెంటనే నా అనుభవాలు రాసేద్దామనిపిస్తోంది .

    రిప్లయితొలగించండి
  14. :-) భలే చెప్పారు. కానీ గుంటూరునుంచీ హైదరాబాద్ వరకు మాత్రం విజయవాడ మీదుగా ఆర్టీసీ సూపర్లగ్జరీనో, గరుడానో బెటర్. స్వానుభవం.

    రిప్లయితొలగించండి
  15. బాగుందండి, మీ బస్ ప్రయాణం. ఇంత ఇబ్బందైతే ఎలా మరి? ఈ సారి బస్ కాకుండా ఇంకేదన్నా వేరే వాహనం చూసుకోండి మరి. ఎలాగొలా గమ్యం చేరాలి కదా మరి.

    రిప్లయితొలగించండి
  16. హైదరాబాద్ నుండి వైజాగ్ కి వెళ్ళే వోల్వో బస్సులు బాగానే ఉంటాయండి..ఒక్క మీరు చెప్పిన సీట్ల ఎక్స్ టెండింగ్ ప్రాబ్లం తప్ప....బహుశా డి.పో బట్టి బస్సుల మెయింటెనెన్స్ ఆధారపడి ఉంటుందనుకుంటా....
    బాగా రాసారు..

    రిప్లయితొలగించండి
  17. లక్ష్మిగారు నెనర్లు. ఇంకానయ్యం బస్సుల మనోభావాలు దెబ్బతింటాయి అనలేదు :-) నిజమే ట్రాఫిక్ లో బస్సులు చేసే హడావిడి అంతా ఇంతా కాదు మెట్రో ఎక్స్ప్రెస్ సర్వీసు వాడూ నేనెక్కిన ఆటోవాడూ కలిసి నన్నొకసారి నరకానికి నాలుగించీల దూరం తీసుకువెళ్ళి వదిలారు.

    తృష్ణగారు నెనర్లు. నేనుకూడా బస్ వాడేది అందుకేనండీ.. అప్పటికప్పుడు బయల్దేరాలంటే వేరే మార్గం లేదు.

    మాలాకుమార్ గారు నెనర్లు. నిజమేనండీ బస్ లో కానీ రైలు లో కాని ప్రయాణానుభవం ఖచ్చితంగా నవరసాల సమ్మేళనమే వెంటనే రాసేయండి మరి భావనగారు ఏదో బస్ వారోత్సవాలు అంటున్నారు మనం బస్ మాసం ప్రకటించేద్దాం.

    గీతాచార్య గారు నెనర్లు. నిజమేనండీ.. కానీ గుంటూరు హైదరాబాద్ ఎంతలేదన్నా ఆరుగంటల్లో తేలిపోతుంది కనుక పర్లేదండీ కానీ 12-13 గంటల ప్రయాణాలే మరీ ఇబ్బంది పెడతాయి.

    జయ గారు నెనర్లు. నావన్నీ ఆఖరి నిముషంలో ఖరారయ్యే ప్రయాణాలండీ కనుక బస్సులు తప్ప వేరే మార్గం లేదు.

    శేఖర్ గారు నెనర్లు. నిజమేనండీ డిపోను బట్టి మెయింటెనెన్స్ ఉంటుంది. మా గుంటూరు డిపో బస్సులు కూడా బాగానే మెయింటెయిన్ చేస్తున్నారు ప్రస్తుతానికి. డిపో వాళ్ళు కొన్న బస్సులు ఓకే కానీ ఒకోసారి ప్రైవేట్ సర్వీస్ నుండి బస్సులు లీజుకి తీసుకుని నడుపుతారు RTC వాళ్ళు, అవి మరీ ఘోరంగా ఉంటాయి.

    రిప్లయితొలగించండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.