అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

అందమైన బాల్యం

మధురమైన జ్ఞాపకాలతో అందమైన బాల్యాన్ని నా సొంతం చేసినందుకు అమ్మానాన్నలకు ఎప్పుడూ ఋణపడి ఉంటాను. మొదటి సంతానాన్నవడంతో నేనాడిందే ఆట పాడిందే పాట అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళినా మా ఇంట్లో అయినా అపురూపంగా గడిచింది. పాడుకున్న పాటలు, ఆడుకున్న ఆటలు, స్కూల్ ఎగ్గొట్టడానికి వేసిన వేషాలు, తిన్న చిరుతిళ్ళు, నాన్న వేలు పట్టుకుని కొట్టిన షికార్లు, 16mm సినిమాలు కబుర్లు ఇక్కడ చదవచ్చు.

ఇంటర్మీడియెట్ హాస్టల్ కబుర్లు

నూనూగు మీసాల నూత్న యవ్వనం అమ్మానాన్నలకు దూరంగా నాదంటూ ఓ స్వంత ప్రపంచం. అప్పటివరకూ ప్రతి చిన్న పనికి వాళ్ళమీద ఆధారపడి ఒక్కసారిగా నాకు నేనే నెగ్గుకు రావాల్సిన పరిస్థితులను తలుచుకుని దిగులు. అంతలోనే చుట్టూ ఉన్న స్నేహితులతో నేస్తం కట్టేసి చేసిన అల్లర్లు, పరోఠాల బిజినెస్సులు, చెరకుతోట దొంగతనాలు, ఆడ్మినిస్ట్రేటర్ కి మస్కాగొట్టి చూసిన సినిమాలు, సరదా కొంటె కబుర్లు ఇక్కడ చూడండి.

ఇంజనీరింగ్ కాలేజ్

ఇంటర్మీడియెట్ కి రెసిడెన్షియల్ హాస్టల్ కనుక పంజరంలో పక్షిలా బతికితే ఇంజనీరింగ్ కాలేజ్ యూనివర్సిటీ హాస్టల్స్ లోకి వచ్చేసరికి ఒక్కసారిగా జూలోనుండి పచ్చని అడవిలోకి వదిలేసిన జింక పరిస్థితే అయింది, ఎక్కడికి పరుగులెట్టినా ఏం చేసినా అడిగేవాళ్ళులేరు. అసలు హాస్టల్ బిల్డింగ్ లో నిరంతరం కాపుకాసే వార్డెన్ ఉండడనే విషయం నాకు డైజెస్ట్ కావడానికి నెలపట్టింది :-) నిజమా అలా ఎలా సాధ్యం అని ఇప్పటికీ అనిపిస్తూనే ఉంటుంది. అంతటి స్వేఛ్చాప్రపంచంలో చేసిన అల్లర్లు కొన్ని కబుర్లు ఇక్కడ.

సినిమాలు రివ్యూలు..

నాకున్న అతి పెద్ద వ్యసనం సినిమా చూడడం రిలీజైన ప్రతి అడ్డమైన సినిమా చూసేసి ఈబొమ్మలో చూపించినట్లు తెలుగు సినిమాని భుజాల మీద మోసేవాళ్ళలో నేనొకడ్ని. చూసి ఊరుకోకుండా ఇది ఇందుకు బాలేదు అది అందుకు బాగుంది అంటూ పేద్ద వంద సినిమాలు తీసేసి విశ్రమిస్తున్న మేధావిలా చేసే విశ్లేషణలు :-) హహహ చదివిన ఒకరిద్దరు అలా తిడతారు కానీ నా దృష్టిలో ఒక సాధారణ సినీ ప్రేక్షకుడు చూసొచ్చి మిత్రులతో చెప్పే కబుర్ల లాంటి నా సినీ రివ్యూలు ఇక్కడ చదవండి. ఆరెంజ్, ఖలేజా, కృష్ణం వందే జగద్గురుం లాంటివి కొన్ని ఎక్కువమంది ఆదరణ పొందాయ్.

ఆదివారం, మే 24, 2009

బదిలీ...

2009 కొత్త సంవత్సరం మొదటి రోజు నన్ను ఏమిటి రా విశేషాలు? అని అడిగిన వారికీ, అడగని వారికీ నేను ఒకటే జవాబు చెప్పాను."ఆ ఏముంది తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అదే రొటీన్ రోజూ, "లైఫ్ ఈజ్ బోరింగ్ యూనో..." అని. మరి శేషతల్పం పై విశ్రమిస్తున్న విష్ణుమూర్తి ఓ అరక్షణం కనులు అరమోడ్పులు చేసి, చెవులు రిక్కించి నా మాటలు విని ముసి ముసి నవ్వులు నవ్వుకున్నాడో... లేకా హిమగిరి పై తపస్సు చేసుకుంటున్న మహేశ్వరుడు ఓ క్షణం కనులు తెరిచి ఆహా అవునా అని వెటకారం గా అనుకున్నాడో కానీ...ఆ క్షణం నుండీ శివకేశవులు ఇద్దరూ కలిసి చెరో వైపూ నుండి నా జీవితం తో బంతాట ఆడేసుకుంటున్నారు... ఈ రెండువేల తొమ్మిది అంతా వరసగా బోర్ అనే మాట దరిచేరనివ్వకుండా ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. అచ్చం టెన్నిస్ కోర్ట్ లో ప్రత్యర్ధి ని చూస్తూ ఓ నువ్వు ఆ షాట్ కొట్టావా ఇప్పుడు నా షాట్ చూడు ఎలా కొడతానో అని ఒకర్ని మించి ఒకరు పోటీ పడి నా జీవితం లో ట్విస్ట్ లు ఇస్తున్నారనమాట.

అదుగో రమణారెడ్డి లా సన్నగా పొడవుగా తెల్లగా ఉన్న భవంతి పక్కనే రేలంగి లా లావుగా పొట్టిగా బులుగు రంగులో blue cross blue shield అని రాసి ఉన్న భవంతే నేను ఇన్ని రోజులూ చికాగో లో పని చేసిన ఆఫీస్.

సరే ఇంత ఉపోద్ఘాతం దేనికయ్యా అంటే... నేను ప్రస్తుతం (ఆదివారం మే 17) ఫ్రాంక్ఫర్ట్, జెర్మనీ విమానాశ్రయం నుండి ఈ బ్లాగ్ రాసుకుంటున్నాను. నిన్న శనివారం బయల్దేరి ఇండియా వచ్చేస్తున్నాను. ఈ గురువారం అనగా మే ఇరవైఒకటిన బెంగళూరు నుండి పని మొదలు పెట్టాలి... మధ్యలో ఓ మూడు రోజులు శలవు అనమాట. అదీ సంగతి.. ఈ టపా నాకు విషయం తెలిసిన దగ్గర నుండీ రాద్దాం అని అనుకుంటున్నాను కానీ గత రెండు మూడు వారాలుగా ఈ బదిలీ హడావిడి లొ పడి అస్సలు కుదరలేదు... ఇదే అనేమిటి లే ఈ మధ్య నా బ్లాగ్ కేవలం ముఖ్యమైన విషయాలను తెలియచేసే నోటీస్ బోర్డ్ లా ఉపయోగిస్తున్నానేమో కదా. చూడాలి బెంగళూరు నుండైనా తరచూ బ్లాగడానికి వీలు దొరుకుతుందేమో... కానీ సమస్యేమిటంటే బెంగళూరు వెళ్ళినా నాకు ఇదే ఆఫీసు పని అక్కడ నుండి కొనసాగించాలి సో ఏమాత్రం వీలు చిక్కుతుందో చూడాలి. ఏవిటో ఇదే పని సగం జీతానికి ఇండియానుండి చేయాలి అంటే కొంచెం కష్టమే కానీ మన అసలు జీతం అదే రా బాబు ఇప్పటి వరకు డబల్ జీతానికి పని చేసావు అంతే అని సర్ది చెప్పుకోటమే... జీతం ఎక్కువైనా ఖర్చులు కూడా అంతే ఉండి చస్తాయ్ లెండి అమెరికా లో ఒక మాదిరిగా బతకాలి అంటే...

మొత్తం మీద నా బదిలీ లో మొదటి అంకం పూర్తయింది... చికాగో బంధాలను వదిలించుకుని, రెండున్నరేళ్ళ గా సమకూర్చుకున్నవన్నీ రెండు వారాలలో ఒక్కోటీ పాతిక కేజీలు మించని రెండు సూట్కేస్ లలో సర్దేసుకుని, మళ్ళీ ఎప్పుడు పలకరించడానికి వీలు పడుతుందో అని భారమైన మనసుతో వీడ్కోలు తెలుపుతూ చికాగో నుండి బయటపడ్డాను. ఇక్కడ సమకూర్చుకున్నవన్నీ అలా ఒకటొకటి గా నన్ను వదిలి వెళ్తుంటే ఎంత దిగులేసిందో... ఏవిటో ఈ మనసు, ప్రాణం లేని వస్తువులపై కూడా ఇలా మమకారాన్ని పెంచేసుకుంటుంది. ముఖ్యంగా ఇష్టంగా కొనుక్కున్న నా కారు ను సమయాభావం వల్ల అతి తక్కువ ధరకి అమ్మేసి అప్పగించిన రోజు రాత్రి ఎంత ప్రయత్నించినా పొంగుకు వచ్చే కన్నీళ్ళకి ఆనకట్ట కట్ట లేకపోయాను. మా అమ్మ తను కొన్న ఏ వస్తువునైనా ఎందుకు అలా తిరిగి అమ్మటానికి ఒప్పుకోదో మొదటి సారిగా బోధ పడింది.


అసలు అమ్మా నాన్న ఇద్దరూ గవర్నమెంట్ ఉద్యోగాలు చేసినా మా కుటుంబం ఈ బదిలీల భారిన పడిన సందర్బాలు తక్కువే అని చెప్పాలి.. అమ్మ నాన్న మా చదువులు మిగిలిన విషయాలు అనవసరం గా ఇబ్బంది పడాల్సి వస్తుంది అని ఎలాగో అలా నయానో భయానో చెప్పి ఇలాంటి బదిలీలు ఆపేసేవారు, కొండొకచో రావాల్సిన పదోన్నతులు కూడా త్యాగం చేసిన సందర్భాలు లేకపోలేదు. రెండు సార్లు మాత్రం తప్ప లేదు ఒకసారి నరసరావుపేట వదిలి పిడుగురాళ్ళ వెళ్ళి ఒక రెండేళ్ళు ఉండి తిరిగి వస్తే రెండవసారి నరసరావుపేట నుండి గుంటూరు కు వచ్చి అక్కడే స్థిరపడిపోయాం. మాకు ఇళ్ళు కూడా ఎక్కువగా మారే అలవాటు ఉండేది కాదు. పిడుగురాళ్ళ నుండి వచ్చేసాక దదాపు పదమూడేళ్ళపైగా ఒకే ఇంట్లో ఉన్నాము. ఎంత మంది ఆ ఇంటి వాస్తు మంచిది కాదు అని చెప్పినా ఏం జరిగినా గుంటూరు వచ్చే వరకూ ఆ ఇల్లు మారకుండా అక్కడే ఉన్నాం.

మొదటి సారి బదిలీ నన్ను బాధ పెట్టింది నరసరావుపేట లో రామిరెడ్డి పేట కబీర్‍దాస్ గారి ఇంటి లో ఉన్నపుడు. అప్పుడు నేను తొమ్మిదో తరగతి చదువుతున్నాను. ఆ ఇంట్లో కింద మూడు వాటాలు అద్దెకి ఇచ్చి పైన ఇంటి ఓనర్స్ ఉండే వారు. కింద ఇళ్ళల్లో ఓ చివర మేము ఉండే వాళ్ళము ఇంకో చివర ఓ రైల్వే స్టేషన్ మాష్టారు ఉండే వారు. నేను అప్పుడు పేరుకు తొమ్మిదో తరగతి కానీ వయసు పదమూడో పద్నాలుగో ఉండేది అప్పుడే టీనేజికి వచ్చినా ఇంకా నిక్కర్లు వదలని వయసనమాట అందుకని వాళ్ళూ చిన్న వాళ్ళే అయినా నేను వాళ్ళని అంకుల్ ఆంటీ అంటే ఏమీ అనుకునే వాళ్ళు కాదు. నాకు వాళ్ళ ఇంట్లో బాగా కాలక్షేపం ఖాళీ దొరికినప్పుడల్లా వెళ్ళి కూర్చుని వాళ్ళ తో కబుర్లు చెప్పే వాడ్ని, నేను మొదటి సారి వాకెమన్ లో పాటలు విన్నది వాళ్లదగ్గరే. అప్పటి వరకూ మా ఇంట్లో ఫ్లాట్ గా ఉండే ఢిల్లీ మోనో సెట్ (దీని గురించి చెప్పాలంటే ఓ ప్రత్యేక టపా కావాలి మళ్ళీ చెప్తాను) లో పాటలు వినడం అలవాటు. మొదటి సారి స్టీరియో వాక్మన్ చెవులకి పెట్టుకుని బయటకి వినపడకుండా వినడం, ఆ హెడ్ సెట్ తలకి పెట్టుకుని పెద్దగా అరచినట్లు మాట్లాడటం ఇది ఎదుటి వాళ్ళు గుర్తించి చెప్తే నవ్వుకోడం అంతా ఓ వింత అనుభూతి. వాళ్ళ సొంత ఊరు వైజాగ్ అనమాట షిప్ యార్డ్ గురించి వైజాగ్ గురించీ వాళ్ళు కబుర్లు చెప్తుంటే అలా వింటుండేవాడ్ని. అలా నాకు మంచి ఫ్రెండ్స్ అయిన వాళ్ళు బదిలీ అయి వెళ్ళి పోయినప్పుడు నేను ఏడ్చేసాను. ఆంటీ కూడా వెళ్ళి పోతున్నందుకు ఏడ్చేశారు అప్పుడు. కాని తర్వాత వాళ్ళ తో కాంటాక్ట్ తప్పి పోయింది ఇప్పుడు ఎక్కడ ఉన్నారో మరి.

కౌలాలంపూర్ లోని పెట్రొనాస్ టవర్స్ పోలికతో హెబ్బాల్ కి దగ్గర లో నార్త్ బెంగళూరు కు చిహ్నం గా మారిన ట్విన్‌టవర్స్ అపార్ట్మెంట్స్ ఇవి. నేను ఇదివరకు అంతా సౌత్ బెంగళూర్ లో ఉండటం తో దీని గురించి అస్సలు తెలియదు. మొన్న మొదటి సారిగా ఆఫీస్ కి ఈ వైపు వచ్చినపుడు చూసి అవాక్కయ్యాను.

ఇక నా బదిలీ లో రెండవ అంకం బెంగళూరు లో స్థిరపడటం... అక్కడ మళ్ళీ ఇపుడు అద్దెఇళ్ళ కోసం వేట, దొరికాక వాటికి పదినెల్ల అడ్వాన్సు.. మంచినీళ్ళ నుండీ ఇంటర్‍నెట్ వరకూ అన్నీటికీ వెతుక్కొని సమకూర్చుకోడం అంతా చాలా పెద్ద పనే... ఆఫీసు కి దగ్గర్లో ఇల్లు దొరకకపోతే మళ్ళీ రోజు వెళ్ళి రావడం ఒకటి సమస్య, ఆఫీసు దగ్గర లో అంటే మరీ పల్లెటూరు అదీకాక మొన్నే ఎవరో మా కొలీగ్ ను రాత్రి పదకొండు గంటలప్పుడు ఆఫీసు నుండి ఇంటికి నడిచి వెళ్తుంటే పొడిచారట... అతని అదృష్టం కొద్దీ ప్రాణ హాని లేకపోయినా మన అదృష్టం ఎలా తగలడుతుందో ఏమి తెలుసు. ఏమిటో ఈ రౌడీ వెధవలకి లేటెస్ట్ న్యూస్ చేరుతున్నట్లు లేదు.. ఇంకా సాఫ్ట్వేర్ ఉద్యోగులు అంటే బోలెడు డబ్బుంటుంది అనే అపోహ లోనే ఉన్నట్లున్నారు... ప్రస్తుత పరిస్తితులలో ఈడ్చి తంతే దమ్మిడీ రాలట్లేదు అనే విషయం ఇంకా అర్ధమైనట్లు లేదు వాళ్ళకి. అన్నట్లు మా ఆఫీస్ ఐబీయం మాన్యతా లో ఉంది హెబ్బాల్ ఫ్లైఓవర్ దగ్గర లో నాగవరా అనే ఊరిలో అట ఆ చుట్టు పక్కల మీదో మీకు తెలిసిన వాళ్ళదో ఇల్లు అద్దెకి ఉంటే నాకో మాట చెప్పండి.. మీ సాయం మర్చిపోను. అన్నట్లు నేను ప్రస్తుతం సింగిల్ బెడ్రూం ఇల్లు కోసం వెదకాలి. మరీ గవర్నమెంట్ హాస్టళ్ళలా కాక కాస్త డీసెంట్ గా ప్రత్యేకమైన గది ఉండి సౌకర్యవంతమైన పేయింగ్ గెస్ట్ అయినా పర్లేదు అని చూస్తున్నాను.

అద్దె ఇల్లంటే గుర్తొచ్చింది జిల్లా కి ముఖ్య పట్నం అయిన గుంటూర్ లో కూడా అద్దెకి ఇల్లు వెతుకుతుంటే మీరెవరు? మీ సామాజిక వర్గం ఏమిటీ, వెజ్జా నాన్వెజ్జా ఇత్యాది ప్రశ్నలు సర్వసాధారణం అయిపొయాయి ఒకరు చౌదర్లకి మాత్రమే అంటే ఇంకోరు రెడ్లకి మాత్రమే అంటారు మరొకరు క్రిస్టియన్సె కే అంటే ఇంకోరు హిందూస్ ఓన్లీ అంటారు అన్నీ నిరూపించుకుని ఇల్లు వెదకడం బోలెడు కష్టం అయిపోతుంది.. నా అదృష్టమో ఏజంట్ల ద్వారా వెళ్ళడం వలన వాళ్ళు అవన్నీ ముందే ఫిల్టర్ చేసారో కానీ నాకు ఇంతవరకూ బెంగళూరు లో ఎప్పుడూ ఆ సమస్య రాలేదు మరి, ప్రస్తుతం బెంగళూరు లో అదీ పల్లె వాతావరణం తో ఉండే నాగవరా లో నాకు ఎన్ని శల్య పరీక్షలు పెట్టనున్నారో ???

ఈ టపా నేను మే పదిహేడున ఎయిర్‍పోర్ట్ లో కూర్చుని రాసాను కాని అప్పటి నుండి ఇప్పటి వరకూ ఇంటరెనెట్ దొరకక పోస్ట్ చేయలేదు. అంటే అక్కడ ఎందుకో నెట్ పని చేయలేదు. నెట్‍సెంటర్ కి వెళ్ళాలంటే బద్దకం :-) ఆఫీసు లోనేమో చాలా బిజీ, హోటల్ లో ఇంటర్నెట్ వైఫై ఉంది కానీ నాలుగు రోజుల క్రితం కురిసిన వర్షాలకి బీయస్‍యన్‍యల్ తీగలు తెగాయిట అప్పటి నుండీ అది పని చేయడం లేదు, రిసెప్షన్ వాడికి కాల్ చేసిన ప్రతిసారీ "ఎవరో రావాలీ ఈ తీగలు సవరించాలీ..." అని అదే పాట పదే పదే పాడుతున్నాడు. అందుకే ఇక లాభం లేదు అని ఈ ఆదివారం ప్రత్యేకంగా ఆఫీసుకు వచ్చి బ్లాగ్ మరియూ కొన్ని ముఖ్యమైన ఈమెయిల్స్ కి జవాబివ్వాల్సిన పని ముగించాను. అన్నట్లు నాకు వెంటనే అన్ని విధాలా అనుకూలమైన వసతి దొరకాలని ఆశీర్వదించడం మరవకండేం, ఇంకా ఈ మధ్య దేవుళ్ళెవరూ నా మొర ఆలకించడం లేదల్లే ఉంది సో మీ రికమెండేషన్ పని చేస్తుందేమో మరి, కాస్త ప్రయత్నించి చూద్దురూ...

సరే త్వరలో మరో టపా లో మళ్ళీ కలుద్దాం అంతవరకూ శలవు.

శనివారం, ఏప్రిల్ 11, 2009

ఇది విన్నారా !! సూపర్ బ్రెయిన్ యోగా !!

ఇది విన్నారా !! ఈ సూపర్ బ్రెయిన్ యోగా గురించి విన్నారా... ఎంత వరకూ నిజమో నాకు తెలియదు కానీ ఈ వీడియో ఇది వరకు చూసి ఉండక పోతే ఓ సారి చూడండి. ఇది దదాపు ఒక సంవత్సరం క్రితం 2008 ఆగస్ట్ లోది, అయినా నేను ఇప్పుడే చూసాను, మీరూ ఇదివరకు చూసి ఉండక పోతే ఓ సారి చూడండి.



"ఓసోస్ ఇది మాకెందుకు తెలియదు చిన్నప్పటి నుండి ఎన్ని సార్లు తీయలేదు మనకి చిరపరిచితమైన గుంజీళ్ళేగా.." అంటారా. అదే మరి నాకూ అలా అనిపించి మన బడి లో ఇచ్చే సాధారణమైన పనిష్మంట్ వెనకాల ఇంత ప్రయోజనం ఉందా అని ఆశ్చర్య పడిపోయే ఇలా బ్లాగుతున్నా. ఈ ప్రయోజనం గుర్తెరిగే మన బడి లో ఉపాధ్యాయులు ఈ దండనని ప్రవేశ పెట్టారా లేకా ఇది చూసి దీని మీద పరిశోధనలు చేసి ప్రయోజనాన్ని బయటకి లాగారో తెలియదు కానీ వీడియో లో చూపిన ప్రకారం. ఆక్యూపంచర్ పద్దతి లో కుడి చెవితమ్మె(ear loab) పట్టుకోడం ద్వారా ఎడమ మెదడు, ఎడమ చెవి ద్వారా కుడి మెదడు ఉత్తేజితమై మైండ్ పవర్ పెరుగుతుంది అంటున్నారు. ఇది ఎంతవరకూ నిజమో తెలియదు కానీ కొందరు మానసిక వికలాంగులు ఈ యోగా తర్వాత కొన్ని పనులను సక్రమంగా చేయగలిగారు అనీ, ఇంకా ఈ యోగా చేసిన అనంతరం మెదడుకు చేసిన EEG Scanning లో కుడి ఎడమ మెదడుల మధ్య సంతులన కనిపించింది అని చూసాక నిజమే నేమో అనిపిస్తుంది.

అన్నట్లు మన బడి లోనూ, ఇంటిలోనూ పిల్లల కి దండన గానే కాదు, తమిళనాడు లో గణేశుని ఎదురుగా పెద్దలు సైతం ఇలా గుంజీళ్ళు తీసే పద్దతి ఉంది. ఈ మధ్య ఆంధ్రా లో కూడా మొదలు పెట్టారేమో తెలియదు కానీ నేను మొదట గమనించింది మాత్రం తమిళనాడు లోనే. బుద్ది కుశలత కోసం పూజించే దేవుడు విఘ్నేశ్వరుడే కనుక ఆ స్వామి ఎదురుగా ఇలా గుంజీళ్ళు తీయడం మొదలు పెట్టారేమో మరి. అంటే చాలా చోట్ల వినాయకుడి ఎదురుగా ప్రస్తుతం ఈ గుంజీళ్ళని మోడర్నైజ్ చేసి ఇలా క్రాస్ గా కొండక చో మాములుగా చెవులు పట్టుకొని స్టయిల్ గా కొద్దిగా మోకాళ్ళు వంచి తీస్తున్నారు, పూర్తిగా యోగా పద్దతి లో ఎవరూ తీయడం లేదు. సో కుడి చేత్తో ఎడమ చెవి తమ్మె(earloab) , ఎడమ చేత్తో కుడి చెవి తమ్మె పట్టుకొని, కిందకి కూర్చునేప్పుడు గాలి పీలుస్తూ కూర్చుని, పైకి లేచేప్పుడు ఆ గాలిని నెమ్మదిగా వదిలేయాలి. అదీ సంగతి, ఇంకెందుకు ఆలస్యం ? ఉదయం లేవగానే ఆపకుండా గబ గబ గబ ఓ ఫ్ఫదో ముఫ్ఫయ్యో గుంజీళ్ళు తీసేయండి ఇక :)

మరికొన్ని వివరాల కోసం సూపర్ బ్రెయిన్ యోగా వారి వెబ్ సైట్ కై ఇక్కడ క్లిక్ చెయండి.

శుక్రవారం, ఏప్రిల్ 03, 2009

రామా కనవేమి రా !!

శ్రీ రామ నవమి సంధర్బంగా తోటి బ్లాగరు లందరికీ, పాఠకులకూ, నా హృదయపూర్వక శ్రీరామ నవమి శుభాకాంక్షలు. అంతా ఈ పాటికి పూజలు గట్రా ముగించుకుని రేడియో లో కళ్యాణం వింటూ ఉండి ఉంటారు. రేడియో లో వింటం ఏమిటి నా మొహం నేనింకా ఎనభైల లోనే ఉన్నాను !! ఇప్పుడన్నీ లైవ్ ప్రోగ్రాం లే కదా... సరే లెండి టీవీ లో చూస్తుండి ఉంటారు. నా మటుకు నాకు శ్రీరామ నవమి అనగానే మొదట గుర్తొచ్చేది భద్రాచలం లోని రాముని కళ్యాణం, ఆ వైభవానికి తగ్గట్టుగా ఇక ఉషశ్రీ గారి వ్యాఖ్యానం (ఇక్కడ క్లిక్ చేసి వినవచ్చు), ముఖ్యమంత్రి నెత్తిన పెట్టుకుని మరీ తీసుకు వచ్చే ముత్యాల తలంబ్రాలు, దేనికవే సాటి. వాటి తర్వాత వీధి వీధి నా వెలసే నవమి పందిళ్ళు. ఆ పందిళ్ళ లో దొరికే బెల్లం పానకమూ, వడపప్పూ. ఇక ఒకో బజారు లో పోగైన చందాల ను పట్టీ అక్కడ ఉండే కలిగిన వాళ్ళని బట్టీ వాళ్ళ వాళ్ళ శక్తి కి తగ్గట్టు గా ఒకప్పుడు నాటకాలు, కోలాటాలు, డ్యాన్సు లు ఏర్పాటు చేస్తే ఆ తర్వాత అంటే నేను కాస్త పెద్దయ్యాక 16mm ప్రొజక్టర్ లతో సినిమాలు, ఆ తర్వాత మరికొన్నాళ్ళకి వీధి కొకటి గా వెలసిన దివాకరం వీడియో షాపు నుండి వీడియో క్యాసెట్ లు టీవీ సెట్ లు అద్దెకు తెచ్చి వాటిలో పాత సినిమాలు వేసే వాళ్ళు. ప్రస్తుతం డీవీడీ లతో పైరసీ సినిమాలు వేసే స్థాయి కి ఎదిగి పోయుంటార్లెండి.

అసలీ పానకం వడపప్పు గురించి అడిగితే మీకో చిన్న పిట్ట కధ చెప్పాలి. అంటే అడక్క పొయినా చెప్తా అనుకోండి మరి ఈ బ్లాగే నా సొంత డబ్బా కొట్టుకోడానికి పెట్టుకున్న బ్లాగ్ కదా... కనుక వినండి మరి హ హ "మా తాతలు ముగ్గురు... " అని అంటూ నేను అహనా పెళ్ళంట లో నూతన్ ప్రసాద్ లా నా ఆటో బయోగ్రఫీ అంతా చెప్పబోవడం లేదు లేండి బయపడకండి. నేను ఇంటర్ మీడియట్ నుండీ హాస్టళ్ళ లో ఉండి చదువుకున్నాను. ఇంటర్ విజయవాడ లో కనుక సందు దొరికితే నరసరావు పేట లో ఇంటికి పరిగెట్టే వాడిని. ఇదే అలవాటు వైజాగ్ లో ఇంజనీరింగ్ చేరినా కూడా వదల లేదు. సాధారణంగా పుట్టిన రోజు దగ్గర నుండి చిన్న చిన్న పండగలకు కూడా ఇంటికి వెళ్ళి పోయే వాడ్ని. మహ మహా పరీక్షలని కూడా లెక్క చేయకుండా ఇంటికి వెళ్ళి సరీగ్గా పరీక్ష ముందు రోజో ఆ రోజో ఊర్నుండి దిగిన చరిత్ర మనది. ఇక విషయానికి వస్తే ఇంటరె చదివే టైం లో అవసరం రాలేదు కానీ ఇంజనీరింగ్ లో చేరాక మొదటి ఏడు నవమి కి ఇంటికి వెళ్ళడం కుదర్లేదు. అప్పటికి ఫ్రెషర్స్ పార్టీ అయిపోయినా ఇంకా అడపా దడపా సీనియర్స్ కనిపిస్తే సార్ అని పిలుస్తూనే ఉండే వాళ్ళం అప్పుడప్పుడూ వాళ్ళు కూడా యస్ డీ చెప్పరా అని అడుగుతూనే ఉండే వాళ్ళు..
ఇదిగో వైజాగ్ లో నేను నాలుగేళ్ళు ఉద్దరించిన మా హాస్టల్స్ ఇవే క్లిక్కితే కాస్త పెద్ద ఫోటో తెలుస్తుంది. 7thబ్లాక్ అని ఉన్న దాన్లో మొదట ఏడు ఉన్నాను ఆ తర్వాత కాస్త ముందుకి 4thబ్లాక్ కి వచ్చి అక్కడే మిగిలిన మూడేళ్ళు పూర్తి చేసా.. ఈ మూలనున్నది క్రికెట్ గ్రౌండ్ దాని కధ త్వర లోనే చెప్తా :)

అలాంటి టైం లో ఎందుకో గుర్తు లేదు కానీ శ్రీరామ నవమి కి హాస్టల్ లోనే ఉండాల్సి వచ్చింది. మా మెస్ వాడు పానకం వడపప్పు లాటి పనులేమీ పెట్టుకోకుండా ఎప్పటిలానే సగం ఉడికిన క్యాబేజీ నీళ్ళ కూర, డేగిసా లో వలేసి పడితే కాని కూరగాయ ముక్కలు దొరకని మిక్సుడు వెజిటబులు సాంబార్ చేసేసి చేతులు దులిపేసుకున్నాడు. నవమి రోజు ఎదో తిండి తింటే తిన్నాం కానీ పానకం వడపప్పు లేకుండా ఏమిటి రా రామా!! అని అనుకుని. బయట ఎక్కడకో వెళ్ళి పందిళ్ళ లో తాగడం కాదు అని నేనే పూనుకుని. మెస్ వాడ్ని బతిమి లాడి కొన్ని గిన్నెలు, ఐస్ వాటర్ సంపాదించి భారి ఎత్తున పానకం తయారు చేసేసి మా బ్లాక్ లో సీనియర్స్ జూనియర్స్ అని తేడా లేకుండా అందరికీ పంచేసా... చేసిందంతా ఖాళీ చేసేసినా ఒక్కోళ్ళు ఒక్కో కామెంట్, ఒకడు మిరియాలు ఎక్కువయ్యాయంటే ఇంకోడు బెల్లం తక్కువైందంటాడు మరొకడు యాలుకలు నలగలేదు బాసు పంటికింద తగుల్తున్నాయ్ అంటాడు. మొత్తం మీద ఆ తర్వాత కొన్ని రోజులు మా సీనియర్స్ ఇక నన్ను యస్ డీ అడగాల్సిన అవసరం లేకుండానే పానకం కేండిడేట్ గా గుర్తు పెట్టుకున్నారు :)

సరే ఇంకా రామనవమి అనగానే నాకు సీతారాముల కల్యాణం చూతము రారండీ పాట గుర్తొస్తుంది. ఆ పాటా, ఇంకా పందిళ్ళ లో క్రమం తప్పకుండా వేసే లవకుశ లో పాటలు భాస్కర్ గారు తన టపా లో అల్రెడీ వేసేసారు (ఆ టపా ఇక్కడ చూడండి) ఇవేకాక ఇంకా సీతారామ కల్యాణం అనగానే ఖచ్చితంగా ఓ రెండు హరికధలు గుర్తుకు వస్తాయి. ఈ రెండూ సోషల్ సినిమాలకు సంభందించినవైనా అందులో సీతా రాములను చూపించక పోయినా ఆ వర్ణన, సంగీతం, గాత్రం మనల్ని మంత్ర ముగ్దులను చేస్తాయి. వాటిలో మొదట గుర్తు వచ్చేది వాగ్దానం సినిమా లో ఘంటసాల గారు గానం చేసిన సీతా కళ్యాణం హరికధ. రేలంగి గారి బాణి లో చిన్న చిన్న చెణుకు లు విసురుతూ నవ్విస్తూ హుషారు గా సాగే కధ లో మనం మైమరచి పోతాం. "రఘూ రాముడూ... రమణీయ..." అని మొదలు పెట్టగనే తెలియకుండానే తన్మయంగా తల ఊపేస్తాం.. "ఎంత సొగసు కాడే.." అంటే అవును కదా అని అనిపించక మానదు... అసలు సొగసు అన్న మాట పలకడం లోనే ఘంటసాల గారు ఆ దివ్య సుందర మూర్తిని సాక్షాత్కరింప చేస్తారు. ఇక చివరికి వచ్చే సరికి హెచ్చు స్వరం లో ఒక్క సారి గా "ఫెళ్ళు మనె విల్లు... " అనగానే సీతమ్మవారి సంగతేమో కానీ కధ వింటున్న వారెవ్వరికైనా గుండె ఝల్లు మనక మానదు అంటే నమ్మండి. ఈ పాట నాకు పూర్తిగా ఎక్కడా దొరక లేదు. దొరికిన వెంటనే పోస్ట్ చేస్తాను.

ఇక రెండోది స్వాతి ముత్యం సినిమా లోనిది. విశ్వనాధ్ గారి దర్శకత్వం, కమల్ అభినయం, హరికధ, భజన, కోలాటం అన్ని కలిపి ఇళయరాజా గారు స్వరకల్పన చేసిన ఈ పాటను బాలు గారు అలరిస్తారు. నాకు ఈ పాట చాలా ఇష్టమ్ ఎక్కువ సార్లు వినడం వలనో ఏమో దదాపు నోటికి కంఠతా వచ్చు :) కాలేజ్ లో కూడా ఒకరిద్దరు ఫ్రెండ్స్ అడిగి మరీ ఈ పాట పాడించుకునే వారు నా చేత... ఈ పాట శ్రీరామ నవమి సంధర్బంగా మీ కోసం.



చిత్రం: స్వాతిముత్యం (1986)
గానం : బాలసుబ్రహ్మణ్యం, జానకి
సాహిత్యం : ఆత్రేయ
సంగీతం : ఇళయరాజ

రామా కనవేమి రా
రామా కనవేమిరా శ్రీ రఘు రామ కనవేమిరా
రామా కనవేమి రా
రమణీ లలామ నవ లావణ్య సీమ
ధరాపుత్రి.. సుమ గాత్రి..
ధరాపుత్రి సుమ గాత్రి నడయాడి రాగా
రామా కనవేమి రా !!

సీతా స్వయంవరం ప్రకటించిన పిమ్మట జనకుని కొలువులో ప్రవేసించే జానకిని
సభాసదులందరు పదే పదే చూడగా శ్రీ రామ చంద్ర మూర్తి
కన్నెత్తి సూడడేమని అనుకుంటున్నారట తమలో సీతమ్మ అనుంగు చెలికత్తెలు

||రామా కనవేమి రా||

ముసి ముసి నగవుల రసిక శిఖామణులు సా నిదమ ప మగరిస
ఒసపరి చూపుల అసదృశ విక్రములు సగరిగ మనిద మ ని ని
ముసిముసి నగవుల రసిక శిఖామణులు తా తకిట తక ఝణుత
ఒసపరి చూపుల అసదృశ విక్రములు తకఝణు తకధిమి తక
మీసం మీటే రోష పరాయణులు నీ దమప మా గరిగ
మా సరి ఎవరను మత్త గుణొల్వణులూ.. ఆహ..
క్షణమే.. ఒక దినమై.. నిరీక్షణమే.. ఒక యుగమై...
తరుణి వంక శివ ధనువు వంక
తమ తనువు మరచి కనులు తెరచి చూడగ
రామా కనవేమిరా..కనవేమిరా..

ముందుకేగి విల్లందబోయి ముచ్చెమటలు కక్కిన దొరలు భూ వరులు
తొడగొట్టి ధనువు చేపట్టి బావురని గుండెలు జారిన విభులు

ముందుకేగి విల్లందబోయి ముచ్చెమటలు కక్కిన దొరలు భూ వరులు
తొడగొట్టి ధనువు చేపట్టి బావురని గుండెలు జారిన విభులు
అహ గుండెలు జారిన విభులు
విల్లెత్తాలేక మొగమెత్తాలేక సిగ్గేసిన నరపుంగవులూ
తమ వళ్ళు వొరిగి రెండు కళ్ళు తిరిగి వొగ్గేసిన పురుషాగ్రణులూ
ఎత్తే వారు లేరా అ విల్లు ఎక్కు పెట్టే వారు లేరా
ఆ ఎత్తే వారు లేరా అ విల్లు ఎక్కు పెట్టే వారు లేరా
అరెరె ఎత్తే వారు లేరా అ విల్లు ఎక్కు పెట్టే వారు లేరా
అహ ఎత్తే వారు లేరా అ విల్లు ఎక్కు పెట్టే వారు లేరా
కడక తైయ్యకు తా ధిమి తా..

రామాయ రామభద్రాయ రామచంద్రాయ నమః
అంతలొ రామయ్య లేచినాడు ఆ వింటి మీద చెయ్యి వేసినాడు
అంతలొ రామయ్య లేచినాడు ఆ వింటి మీద చెయ్యి వేసినాడు
సీత వంక ఓరకంట చూసినాడు
సీత వంక ఓరకంట చూసినాడు
ఒక్క చిటికలో విల్లు ఎక్కు పెట్టినాడు
చిటికలో విల్లు ఎక్కు పెట్టినాడు
ఫెళ ఫెళ ఫెళ ఫెళ ఫెళ ఫెళ విరిగెను శివ ధనువు
కళలొలికెను సీతా నవ వధువు
జయ జయ రామ రఘుకుల సొమ ||2||
దశరథ రామ దైత్యవి రామ ||2||
జయ జయ రామ రఘుకుల సొమ ||2||
దశరథ రామ దైత్యవి రామ ||2||

సీతా కల్యాణ వైభోగమే శ్రీ రామ కల్యాణ వైభోగమే ||2||
కనగ కనగ కమనీయమె అనగ అనగ రమణీయమె ||2||
సీతా కల్యాణ వైభోగమే శ్రీ రామ కల్యాణ వైభోగమే
రామయ్య అదుగోనయ్య
రమణీ లలామ నవ లావణ్య సీమ
ధరాపుత్రి సుమ గాత్రి నడయాడి రాగా
రామా కనవేమిరా శ్రీ రఘు రామ కన వేమిరా ఆ.. ఆ.. ఆ..
రామా కనవేమి రా

సోమవారం, మార్చి 30, 2009

బ్లాక్ ఐస్ !!

శీర్షిక చూడగానే "నల్లా నాల్లాని కళ్ళా.. పిల్లా...నీ మొగుడయ్యే వాడెల్లా.. ఉండాలొ కాస్త చెప్పమ్మా.." అని పాడేసుకుంటున్నారా.. ఆగండాగండి నేనేమీ నీలి కళ్ళ నీలిమ గురించి చెప్పబోవట్లేదు.. అంత లేదండీ.. ఇది ఆ ఐస్ గురించి కాదు ఇంకో ఐస్ గురించి. ఏంటబ్బా!! అని తెగ ఆలోచించేయకండి మరి, నెనెలాగు చెప్పేస్తున్నాను కదా ఆలకించండి. అసలు ఈ ఆంగ్ల భాష లో ఉన్నంత తికమక మరే భాషలోనూ లేదు. అంటే అక్కడికి నేనేదో పివి నరసింహ రావు గారి లా ఓ పాతిక భాషలు ఔపోసన పట్టేసానని కాదు కానీ, ఉదాహరణకి ఈ ఐస్ నే తీసుకోండి eyes ని ice ని ఒకేలా పలికి చస్తే తేడా ఎలా తెలిసేది. బహుశా పదం కని పెట్టినవాడి తప్పేం లెదేమో లెండి, బహువచనం కోసం అన్నిటికీ యస్ చేర్చేయడం లోనే తేడా అంతా వచ్చి ఉంటుంది. సో నే చెప్ప బోయేది ఈ ice గురించి అనమాట. ఓహో అలాగా !! అని అర్జంట్ గా కళ్ళముందు టార్టాయిస్ కాయిల్ తిప్పేసుకుంటూ నో, సీలింగ్ కి తిరుగుతున్న ఫేన్ కేసి చూస్తూనో అలా ఓ సారి చిన్నతనానికి వెళ్ళి పాలైస్, ద్రాక్షా ఐస్, కొబ్బరి ఐస్, సేమ్యా ఐస్ ఇలాంటి రక రకాల ఐస్ లన్నీ గుర్తు చేసుకుంటున్నారా :-) మరే నాకు కూడా మొదట అవే గుర్తుకొచ్చాయ్ కానీ అది కూడా కాదు. వాటి గురించి సవివరంగా మరో టపా లో చెప్పుకుందాం.

ఇక విషయానికి వస్తే, ఈ దేశం లోకి వచ్చాక మొదటి సారి ఈ బ్లాక్ ఐస్ అన్న పదం విన్నప్పుడు " ఓరి వీళ్ళ అసాధ్యం కూలా, ఐస్ కి కూడా వర్ణ బేధమా, ఔరా!!" అని బోల్డు కుంచెం ఆశ్చర్య పడిపోయేసాను. తర్వాత ఆరా తీయగా తెలిసింది ఏమిటంటే ఈ అమెరికా లో ఎడ తెరిపి లేకుండా మంచు కురిసి బయట ఉన్న అతి శీతల ఉష్ణోగ్రత వలన ఆ మంచు రోడ్డు పైనే ఐస్ లా గడ్డ కట్టి బాగా నునుపు తేలి, నీటికి సహజంగా ఉన్న పారదర్శకత వలన నల్లని రోడ్ మీద పలచగా పేరుకోని నల్లని ఐస్ అనే భ్రమ కలిగించడమే కాక దీని పారదర్శకత వలన ఇలా ఐస్ పేరుకున్నట్లు తెలియక వేగంగా దాని మీద నుండి కారు నడిపి నప్పుడు స్లిప్ అయ్యి అనేక యాక్సిడెంట్ లకి కారకమవుతుంది. ఇదిగో ఇలాంటి ఒక అతి చిన్న ఐస్ లేయర్ కొన్ని వారాల క్రితం నన్ను కింద పడేసింది. ఆ విషయం మీతో పంచుకుందామనే ఈ ప్రయత్నం.

"వసంతం వచ్చింది వేసవి ఎండలు మండి పోతున్నాయ్ ఇప్పుడు నీ గోల ఏంటి !!" అని విసుక్కోకండి మరి అసలు మజా ఇప్పుడే ఉంది, వింటర్ లో సాధారణంగా బయట వాతావరణం గమనించి జాగ్రత్తగా నడచుకొంటాం కాస్త స్ప్రింగ్ వాతావరణాన్ని గమనించగానే మనకు తెలియకుండానే ఇంకేముంది అని కాస్త రిలాక్స్ అవుతాం అప్పుడే వస్తాయ్ ఇలాంటి చిక్కులు. చికాగో, మిచిగన్, విస్కాన్సిన్ లాటి కొన్ని చోట్ల "House pasting no festival" అన్నట్లు స్ప్రింగ్ రాగానే సరిపోదు, మే మాసం వరకూ కూడా అడపా దడపా మంచు పలకరించి పోతూనే ఉంటుంది. అందుకే చికాగో లో రెండే కాలాలు అని అంటారు ఒకటి వింటర్ మరొకటి construction season ఎనిమిది నెలలు వింటర్ కి కేటాయించగా మిగిలిన నాలుగు నెలల్లో ఇళ్ళు కట్టుకునే పనుల్లో పడతారనమాట. అంతెందుకు స్ప్రింగ్ వచ్చింది అని ఎగిరి గంతులేసి ఒక వారం కూడా గడవలేదు రాత్రి ఇక్కడ ధారాళంగా స్నో పడింది.

సో కొన్ని వారాల క్రితం ఇలాంటి ఒక మంచి సన్నీ డే ఉదయం ఆఫీసుకు బయల్దేరి "చా! వెదవ జీవితం, ఏంటో చిన్నపుడు అమ్మ వాళ్ళ తో గొడవపడో మాయ చేసో కాన్వెంట్ చదువునీ, గంపెడు పుస్తకాల స్కూల్ బ్యాగ్ బరువునీ తప్పించుకొన్నా కానీ ఇంత వయసొచ్చాక ఉద్యోగం చేస్తున్న టైం లో ల్యాప్ టాప్ బ్యాగ్ పేరు తో జీవితాంతం ఓ స్కూలు బ్యాగ్ ని మోయాల్సి వస్తుందని అనుకోలేదు" అని వీపున వేళ్ళాడుతున్న బ్యాగ్ సరిచేసుకుంటూ తిట్టుకుంటూ బయటకి అడుగు పెడదాం అని చూద్దును కదా, బయట మంచు అంతా కరిగి పోయి ఫెళ్ళున ఎండ కాస్తూ అందమైన ఉదయం కనిపించింది దాన్తో ఆనందం పట్టలేక "వావ్ వాటే డే!! అని ఆనందిస్తూ బస్ కి లేట్ అవుతుంది అని అనుకుంటూ తలుపు తీయగానే చల్లని గాలి స్వాగతించింది. హ్మ్ ఇదేమీ ఈ అపశృతి అని అనుకుంటూ హడావిడిగా నడక మొదలు పెట్టాను చుట్టూ అంతా క్లియర్ గా ఉంది కదా అని కాస్త రిలాక్స్ అవడం తో కింద ఉన్న చిన్న ఐస్ లేయర్ (పై ఫోటో లోనిది) ని గమనించ లేదు దాంతో దాని మీద కాలు వేయడం, బ్యాలన్స్ తప్పడం తో రక రకాల యోగాసనాలు వరుసగా వేసేసి చివరిగా ఇదిగో ఈ పక్క ఫోటో లో ఉన్నట్లు శలభాసనం లో సెటిల్ అయ్యాను ఏదో ఆగిపోయాను కానీ అసలు ఓ రెండు రౌండ్లు ఫల్టీలు కొట్ట వలసింది. కాస్త మడమ బెణకడం తప్పించి ఏమీ దెబ్బలు తగల లేదు లేండి. ఈ సాకు ను అడ్డం పెట్టుకుని రెండ్రోజులు ఇంటి నుండి పని చేసాను అది వేరే విషయం.


అసలు మీరు ఎప్పుడైనా జారి కింద పడ్డారా :) చెప్తే నవ్వుతారు, వీడెవడండీ బాబు అంటారేమో కానీ, కింద పడుతున్నపుడు భలే ఉంటుంది అంతా మనకు తెలుస్తూనే ఉంటుంది కానీ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ వేగంగా జరిగిపోతాయ్ అంటే మన మెదడు గ్రహించి రియాక్ట్ అయ్యే లోపలే తరువాతది జరుగుతుంటుంది. హ హ అంతా మనకి తెలుస్తుంది కానీ ఏదీ మన కంట్రోల్ లో ఉండదు భలే చిత్రమైన స్తితి లే, తర్వాత ఒక సారి అసలు ఏం జరిగింది అని ఆలోచిస్తే ఇదంతా గుర్తొచ్చి భలేగా అనిపించింది. చికాగో వచ్చిన కొత్త లో ఊరు నడి బొడ్డున ఇలాంటి ఓ చిన్న ఫీట్ చేసాను. పోయిన సంవత్సరం తప్పించుకున్నాను అలాగే ఈ ఏడు కూడా ఎస్కేప్ అనుకున్నాను కాని మొన్న సరండర్ అవక తప్పలేదు. చిన్నపుడు స్కూల్ నుండి వచ్చే దారిలో నో స్కూల్ లోనో ఇలాంటి ఫీట్ లు బాగానే చేసే వాడ్ని. ఎలా పడినా పర్లేదు కానీ తల నేల కి ఆనితే మాత్రం అమ్మ చేసే హడావిడి అంతా ఇంతా కాదు. పసుపు, సున్నం కలపిన ఎఱ్ఱనీళ్ళ లో కాసిన్ని ఎండు మిఱపకాయలు వేసి దిష్టి తీసి పడిన చోట బోర్లించకుండా వదిలేది కాదు. సరే ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే వింటర్ ముగిసింది కదా అని రిలాక్స్ అవకుండా నడిచేప్పుడూ డ్రైవ్ చేసేప్పుడూ కాస్త ఇలాంటి బ్లాక్ ఐస్ గురించి చూసుకోండి.

సరే నండీ మరి అవి ఈ రోజుకి కబుర్లు మళ్ళీ మరో టపా లో త్వరలో కలుద్దాం అంత వరకూ శలవా మరి.

శనివారం, మార్చి 28, 2009

ఉగాది శుభాకాంక్షలు

అందరికీ హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు, కాస్త ఆలశ్యంగా. ఏం చేయమంటారు చెప్పండి మరి, ఫలానా రోజే పండగ అనుకునే కన్నా మనకి అనువు గా ఉన్న రోజే పండగ అని జరుపుకోడం అలవాటయి పోయింది మరి. ఉగాది అనగానే మొదట గుర్తు వచ్చేది ఉగాది పచ్చడే నేమో కదా... దీనికి కావలసిన అన్ని దినుసులు సులువు గానే దొరుకుతాయ్ కానీ వేప పూత కోసమే కాస్త కష్ట పడాలి, అంటే ప్రస్తుతం ఇంట్లో పచ్చడి చేసేది తక్కువేనేమో... నా చిన్నతనంలో వేప పూతనీ, మామిడి పిందెలనీ కష్ట పడి వెతికి పట్టుకుంటే, కాస్త పెద్దయ్యాక మార్కెట్ కి వెళితే ఏవి కావాలంటే అవి దొరకేవి. ఇంకాస్త పెద్దయ్యాక స్వగృహలాంటి చోట్ల ఉగాది పచ్చడి కూడా అమ్మేస్తుంటే కష్టపడటం ఎందుకు అనిపిస్తుంది. అదేంటో కానీ బజార్లో కొన్న మామిడి కంటే, అపరిచితుల పెరట్లో ఉన్న మామిడి కే రుచెక్కువ ఎందుకో !! కాస్త చిన్న ఊర్లలో బాల్యాన్ని గడిపిన వాళ్ళని ఎవరిని కదిపినా ఈ విషయం ఒప్పుకుంటారు అవునా :)

రుచంటే గుర్తొచ్చింది. వివిధప్రాంతాల లో ఇంట్లో చేసే ఉగాది పచ్చడి రుచి ఒక ఎత్తైతే మా ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ మెస్ లో మా వాడు చేసే ఉగాది పచ్చడి ఉంటుందీ... ఆహా !! ఎలాగో అలా ఉగాది పూట పచ్చడి రుచి చూడాలి అని కోరిక ఒకవైపు, కానీ మా వంట వాడి ఉగాది పచ్చడి రుచి చూసి ఆరోగ్యాలు చెడగొట్టుకుని అసలు ఉగాది అంటేనే విరక్తి కలిగించుకోడం అవసరమా అన్న సందిగ్ద ఒక వైపు చాలా ఇబ్బంది పడేవాళ్ళం ఎలాగయితేనేం ధైర్యం చేసి కనీసం ఒక్క స్పూన్ అన్నా నోట్లో వేసుకున్నాం అని అనిపించుకునే వాళ్ళం అనుకోండి అది వేరే విషయం. అది సరే ఇంతకీ ఈ సంవత్సరం నువ్వు ఉగాది పచ్చడి రుచి చూసావా లేదా అని అడుగుతున్నారా... ఇందాకే చెప్పాను కదండీ మరి, మనకి వీలున్న రోజే పండగ !! ఈ రోజు మరి ఆఫీసు లోనే ఓపిక అంతా అవిరైపోతుందా ఇక ఇలాటి పనులు ఏం చేస్తాం, రేపు శనివారం కదా భాస్కర్ గారి రెసిపీ రెడీ గా పెట్టుకున్నా ఉదయాన్నే వెళ్ళి అన్నీ తెచ్చుకుని మొదలు పెట్టేయడమే... అంతగా కుదర్లేదంటే గుళ్ళు ఎలానూ ఉన్నాయ్ :) వెళ్ళి అక్కడ క్యాష్ కౌంటర్లో ఉన్న అమెరికన్ వాలంటీర్ తో ఒన్ యుగాడి చట్నీ, టుగో అని చెప్తే చాలు, వాళ్ళే ఇచ్చేస్తారు.


అందాకా మీ అందరూ సరదాగా నవ్వుకోడానికి తెలుగువన్ నుండి మల్లిక్ గారి చెణుకు మీ కోసం ఆనందించండి.

సోమవారం, మార్చి 02, 2009

అమ్మకు అశృ నివాళి !!

ఇటువంటి టపా ఎప్పుడో ఓ సారి రాయల్సి ఉంటుంది అని తెలుసు కాని, ఇంత త్వరగా రాయాల్సిన అవసరమొస్తుంది అని అనుకో లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నా మిత్ర బృందం నుండి నూతన సంవత్సర శుభాకాంక్షలు అందుకుంటున్న తరుణం లో ఈ 2009 ఆరంభం లోనే నాకు అత్యంత విషాదాన్ని మిగులుస్తుందనీ నేను అస్సలు ఊహించ లేదు. జనవరి 21 బుధవారం రాత్రి, భోజనం కానిచ్చి మనసు లో "గత మూడు వారాలు గా హాస్పిటల్ లో ఉన్న అమ్మ, గత వారం రోజులు గా ICU నుండి మామూలు రూం కి షిఫ్ట్ అయి నిదానంగా కోలుకుంటుంది, ఇంక ఇవ్వాళో రేపో ఇంటికి పంపించేస్తారు కాబోలు" అని అనుకుంటూ నిద్రకు ఉపక్రమించే సమయం లో తమ్ముడి దగ్గర నుండి కాల్ అందుకున్నాను. critical care unit కి మార్చారు అని చెప్పిన కొన్ని గంటల వ్యవధి లోనే అమ్మ ఇక లేదు అనే చేదు నిజం విని ఏం చేయాలో అర్ధం కాలేదు. తనకెంతో ఇష్టమైన గురువారం జనవరి 22 2009 న ఉదయం అమ్మ మమ్మల్ని ఒంటరిగా ఈ భూమ్మీద వదిలేసి తిరిగి రాని లోకాలకు పయనమయింది.
మరణం, మరణించిన వారికి ఐహిక బాధలనుండి విముక్తిని ప్రసాదించే ఓ వరం ఏమో కాని, వారి ఆత్మీయులకి మాత్రం తీరని శాపం. నిన్నటి వరకూ మన మధ్య తిరిగే మన మనిషి హఠాత్తుగా కేవలం చిత్రాలకు ఙ్ఞాపకాలకూ పరిమితం అయ్యరన్న ఊహే ఆ దేవుడు ఎంత దయలేని వాడు అని అనుకునేలా చేస్తుంది. నేను ఇండియా వెళ్ళే వరకూ రక రకాల ఆలోచనులు నన్ను ఊపిరి తీసుకోనివ్వలేదు. ఈ వార్త తెలిసిన తర్వాత కూడా నేను మాములుగానే ఉన్నానేంటి? ఆకాశం విరిగి మీద పడలేదు, భూమి బద్దలై నన్ను మింగేయలేదు, అవునూ!! ఈ ఆకలి, నిద్ర ఇవి కూడా నన్ను వీడి పోనంటున్నాయేంటీ. అసలు నేను ఇంకా నిద్ర లోనే ఉన్నానేమో ఇదంతా ఓ పీడకలేమో లేచాక అమ్మతో మాట్లాడి ఇలాంటి కల వచ్చింది నువ్వు జాగ్రత్త అమ్మా అని చెప్పాలి అని ఏవేవో ఆలోచనలు.

ఎప్పుడో నా చిన్నతనం లో ఊహ తెలిసీ తెలియని వయసు లో, మరణం అంటే ఏమిటో కూడా తెలియని తనం లో, సంవత్సరం కూడా నిండని నా పెద్ద తమ్ముడు మమ్మల్ని వదిలి వెళ్ళినప్పటి ఙ్ఞాపకాలు ఇంకా సజీవంగా ఉన్నాయి. అప్పుడు మేము ఉంటున్న నరసరావు పేట లో సరైన వైద్యం అందక వాడి చిన్ని శరీరాన్ని టాక్సీ లో వేసుకుని గుంటూరు తీసుకు వెళ్ళడం అక్కడి హాస్పిటల్ వాతావరణం డాక్టర్ ఏం చేయలేం అని తేల్చి చెప్పేసాక అమ్మ స్పృహ తప్పి పడిపోవడం. తర్వాత తిరిగి ఇంటికి రావడం అప్పటి వరకూ వాడి ఫోటో లేదని అలానే కుర్చీ లో కూర్చో పెట్టి నాన్న వాడి కళ్ళు తెరిచి పట్టుకుంటే వాడి ఫోటో తీసుకోడం అన్నీ కళ్ళ ముందరే నిన్న మొన్న జరిగినట్లు ఉన్నాయి. మళ్ళీ ఇన్ని నాళ్ళ కి అమ్మకి వీడ్కోలు పలకాల్సి రావడం న మనసంతా భరించ లేని విషాదాన్ని నింపింది.

తను ఉన్నన్నాళ్ళు ఏదో తెలియని ధైర్యం, ఇపుడు తను మా మధ్య లేదు అనే ఆలోచనే బోలెడంత దిగులును మనసంతా నింపేస్తే ఇక ధైర్యానికి చోటెక్కడ ఉంటుంది. అయినా గత నెల రోజులు గా ఎన్నో అనుభవాలు అమ్మ తోడు లేకపోవడం వలనేమో కానీ మరింత కొత్త గా మరింత బారంగా అనిపించాయి అన్నీనూ.. అసలు తనని సంప్రదించకుండా మా అంతట మేమే నిర్ణయాలు తీసుకోడం ఎంత కష్టమో కదా !! నేను ఇప్పటి వరకూ అలా నా అంతట నేను తీసుకున్న నిర్ణయాలు ఏమీ లేవు ఇకపై అన్నీ నేనే అలా తీసుకోవాలంటే ఎంత కష్టం... అంటే మేమేదో అమ్మ మాట జవదాటని వాళ్ళం అని కాదు కానీ తనతో వాదించి మా మాటే నెగ్గించుకుని మాకు నచ్చిన నిర్ణయమే తను తీసుకునేలా చేసినా కానీ గవర్నమెంట్ సీల్ లాగా తన ఆమోద ముద్ర ఉంటే అదో దైర్యం మా ఇంట్లో అందరికీ.. నాన్న తో సహా. ఇకపై అది లేకుండానే ముందుకు నడవాలి, ఎలాగో... ఏంటో...
తను ఏమైపోయినా కానీ, మా ఇంటిల్లిపాది క్షేమం కోసం అనుక్షణం తపన పడే అమ్మ ఇక మా మధ్య లేదు అన్న ఆలోచనే కళ్ళ వెంట కారే కన్నీటికి ఆనకట్ట కట్ట లేకున్నా... ఎవరో చెప్పినట్లు మనిషి కేవలం ఒక్క చోటే ఉండ గలరు ఇప్పుడు తన ఆత్మ అన్ని చోట్లా తానై మా అందరి యోగ క్షేమాలు చూస్తూ మా వెంటే ఉంటుంది అన్న ఊహ బోలెడంత ఊరట నిస్తుంది. అమ్మో అదే నిజమయితే ! ఇంతకు ముందు అంటే ఇక్కడ ఒంటరి గా ఏడ్చినా ఏం చేసినా అమ్మ కి తెలియదు ఇప్పుడిక తను నా పక్కనే ఉంటుంది కదా నేను ఏడవడం చూస్తే తను బాధ పడుతుంది కదా ఇక ఏడవకూడదేమో. అవునూ అసలు ఏడుపు ఎందుకు వస్తుందీ... గుండె లోతుల్లో ఆత్మీయుల ఙ్ఞాపకాలు వెచ్చగా కదిలి మనసుతో కలిసి, కరిగి కన్నీరై కళ్ళ నుండి జాలువారుతాయేమో కదా!! మరి అమ్మ ఙ్ఞాపకాలన్నీ అలా నన్ను వదిలి వెళ్ళి పోతే ఎలా మరి !! అందుకే ఇకపై ఏడవను.

కేవలం సర్వీస్ చేయడానికే పుట్టినట్లు గుంటూరు ఆర్&బి సర్కిల్ ఆఫీస్ సుపరింటెండెంట్ గా రిటైరైన ఆరునెలల లోపే మమ్మల్ని వదిలి వెళ్ళి పోయిన మా అమ్మ "నేలటూరి దయామణి" కి అశృ నివాళి సమర్పించుకోడం తప్ప మేమేం చేయగలం. అమ్మా! అక్షరాలకు అందని ఆప్యాయత, మాటలకందని మమతాను రాగాలకు ప్రతి రూపం నువ్వు, వెల లేని అనురాగం, ఆప్యాయతలు పంచిన ప్రేమ మూర్తిగా, మంచితనానికి, నీతి, నిజాయితీ లకు మారు పేరు గా నిలచి, కొవ్వొత్తి లా నువ్వు కరిగిపోయి మా జీవితాలలో వెలుగు నింపి, తీరిగి రాని లోకాలకు పయనమైన నీ ఆత్మకు శాంతి చేకూరాలని. నువ్వెక్కడ ఉన్నా నీ ఆశీస్సులు, మార్గదర్శకాలు మమ్ము ముందుకు నడిపిస్తాయని ఆశిస్తూ.

నీ ఙ్ఞాపకాలలో, నువు పంచిన ఆత్మీయత లో..
నీ కోసం వెతుకుతూ మేము....

గురువారం, ఫిబ్రవరి 19, 2009

బొమ్మను చేసీ.. ప్రాణము పోసీ.. ఆడేవు నీకిది వేడుకా !!

ఈ పాట గురించి ఏమని చెప్పను. ఘంటసాల గారి గాత్రం తో మనసు ను మెలి పెట్టే పాట. ఆత్మీయులను కోల్పోయినపుడు గుర్తొచ్చి మరింత భాధ పెట్టే పాట. ఆపద్బాన్ధవుడు లో అడిగినట్లు "ఆ దేవుడి కి తను చేసుకున్న బొమ్మ ల పై తనకు హక్కు లేదా" అని అడుగుతున్నారా ?, మరి అలా తన ఇష్టమొచ్చినట్లు ఆడు కుందామని అనుకున్నపుడు ఆ బొమ్మల మధ్య అనుభంధాలు, మమతానురాగాలు ఎందుకు సృష్టించాలి ? ఏంటో ఈ దేవుడు !! అందుకే ఒకటి మాత్రం నిజం... తలచేది జరుగదూ... జరిగేది తెలియదూ... !!



చిత్రం: దేవత (1965)
సంగీతం : యస్.పి. కోదండపాణి
సాహిత్యం : శ్రీశ్రీ
గానం : ఘంటసాల

బ్రతుకంత బాధ గా... కలలోని గాధ గా...
కన్నీటి ధారగా.... కరగి పోయే...
తలచేది జరుగదూ... జరిగేది తెలియదూ... !!

బొమ్మను చేసీ.. ప్రాణము పోసీ.. ఆడేవు నీకిది వేడుకా.. ||2||
గారడి చేసీ.. గుండెలు కోసీ.. నవ్వేవు ఈ వింత చాలికా...

|| బొమ్మను ||

అందాలు సృష్టించినావు.. దయతో నీవూ..
మరల నీ చేతితో నీవె తుడిచేవులే..
అందాలు సృష్టించినావు.. దయతో నీవూ..
మరల నీ చేతితో నీవె తుడిచేవులే..
దీపాలు నీవే వెలిగించినావే.. ఘాఢాంధకారాన విడిచేవులే..
కొండంత ఆశా.. ఆడియాశ చేసీ...
కొండంత ఆశా.. ఆడియాశ చేసీ.. పాతాళ లోకాన తోసేవులే..

|| బొమ్మను ||

ఒక నాటి ఉద్యానవనమూ.. నేడు కనమూ..
అదియే మరుభూమి గా నీవు మార్చేవులే..
ఒక నాటి ఉద్యానవనమూ.. నేడు కనమూ..
అదియే మరుభూమి గా నీవు మార్చేవులే..
అనురాగ మధువు అందించి నీవు.. హలా హల జ్వాల చేసేవులే
ఆనందనౌకా పయనించు వేళా..
ఆనందనౌకా పయనించు వేళా.. శోకాల సంద్రాన ముంచేవులే !!

|| బొమ్మను ||

బుధవారం, జనవరి 21, 2009

దారిన పోయే దానయ్య లు !!

ప్రయాణం లో చికాకులు ఎన్ని ఉన్నా చివరికి విమానం శంషాబాద్ విమానాశ్రయం లో ల్యాండ్ అయింది, లగేజి పికప్ కోసం మెల్లగా Baggage Carousel (ఈ పక్కన ఫోటో లో ఉన్నది) దగ్గరకు చేరుకున్నాను. నేపద్యం లో విమానాశ్రయం సిబ్బంది రక రకాల ప్రకటనలు చేస్తున్నారు వాటిలో ఒకటి, "విమానాశ్రయము నందు మీకు పెయిడ్ పోర్టర్ సౌకర్యము కలదు..మీ సామాను మోయుటకు పోర్టర్ సిబ్బంది సేవలను ఉపయోగించు 'కొన' వచ్చును.." అని అంటూ చెప్తుంది. ఇది చాలా శ్రద్దగా విన్నాడేమో నా పక్కన ఉన్న ఒకాయన పాపం కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ తరపున సాయం చెయ్యడానికి వచ్చిన వాళ్ళ మీద గయ్ గయ్ మంటూ విరుచుకు పడి పోయాడు. మాములు గా అయితే పాపం మర్యాద గా చెప్పి ఉండే వాడేమో కానీ "మరి ఎవరు ఎయిర్ లైన్స్ వాళ్ళో ఎవరు పోర్టర్ సిబ్బందో ఎలా తెలుస్తుంది ఎందుకు వచ్చిన గోలా, నా సామాను నేనే మోసుకుంటే పోలా !!" అని అనుకున్నాడేమో, దాంతో వాళ్ళు బలి. నాకు ఆ కింగ్ ఫిషర్ జనాలని చూస్తే బోల్డు కొంచెం జాలేసింది :-) విజయ్ మాల్యా నేమో అతి మర్యాదలూ.. అతిథి మర్యాదలూ అని "Hospitality is more important" అని సిబ్బంది కి తర్ఫీదు ఇచ్చి పంపుతుంటే, అంత మర్యాద కి అంత గా అలవాటు పడని మనవాళ్ళు ఆ సర్వీసుని సరిగా అర్ధం చేసుకో లేక సిబ్బంది ని కసురుకుంటుంటే,, ఏం చేయాలో పాలు పోక పాపం సతమతమౌతున్నారు ఈ కింగ్ ఫిషర్ సిబ్బంది. సరే కింగ్ ఫిషర్ గురించి మరో రోజు రాస్తాను, మన టపా విషయానికి వస్తే...

నా ట్రిప్ లో నేను ఎక్కువ భాగం రోడ్ మీదే గడపాల్సి వచ్చింది. సో అవసరమైనప్పుడల్లా ఓ రెంటల్ కార్ తీసుకుని ఊళ్ళు తిరగడం జరిగింది నేను ఇండియా లో ఉన్నప్పుడు అంటే 2006 డిశంబర్ వరకూ కూడా చెవీ వ్యాన్ లు అంతగా పేరు తెచ్చుకోలేదు. కానీ మొన్న ఎక్కడ చూసినా ఛెవీ టవేరా (ఈ పక్కన ఫోటో లో ఉన్నది) chevrolet Tavera నే కనిపించింది. ఏ ట్రావెల్స్ వాడ్ని ఆడిగినా ముందు ఇదే బండి ఇవ్వడం మొదలు పెట్టారు. అప్పట్లో సుమో, తర్వాత క్వాలిస్ ఆ తర్వాత స్కార్పియో కొన్ని రోజులు తిరిగింది కానీ దాన్ని త్వరలోనే ఈ బండి రిప్లేస్ చేసింది సార్ అని కథలు కథలు గా చెప్పారు ట్రావెల్స్ జనాలు. అమెరికా లోనే అంతంత మాత్రం గా ఉపయోగించే ఈ అమెరికన్ వ్యాన్ ఇంతగా ఆంద్రా లో ప్రాముఖ్యత సంతరించుకుంటుంది అనేది నేను ఊహించలేదు. సరే అలాంటి ఓ పన్నెండు గంటల ట్రిప్ లో ఓ రోజు కంభం అనే ఊరిలో బోజనం చేయాల్సి వచ్చింది.

ఊరు చూస్తే చాలా చిన్న ఊరు లా ఉంది, అప్పటికే టైమ్ తొమ్మిదిన్నర అయిందీ, ఈ ఊరు దాటితే మరో ఊరు రావడానికి ఎంత లేదన్నా అరగంట టైం పడుతుంది సో ఇక్కడే ఏదో తినేద్దాం అని ఏదో చిన్న సెంటర్‌లా కనిపించిన చోట ఆపి, మా డ్రైవర్ దిగి వెళ్ళి కనుక్కుని వచ్చి "పైన సెంటర్ లో ఉన్నాయంటండీ.." అని అంటే మళ్ళీ బయల్దేరాం కొంచెం దూరం వెళ్ళాం కానీ ఎక్కడా ఏమీ కనిపించ లేదు ఇంతలో ఆ దారిన పోయే ఒకతను కనిపింఛాడు. అతనిదగ్గర లో బండి ఆపి "బాబూ ఇక్కడ మంచి హోటల్స్ ఏమున్నాయ్.." అని అడిగాం అతను మేం అడగడం ఆలశ్యం ఓ క్షణం ఆలో చించి మీకు ఎలాంటి బోజనం కావాలి అని అడిగి ఇదిగో ఫలానా సెంటర్ కి వెళ్తే ఫలానా హోటల్ ఉంటుంది అక్కడకి వెళ్ళండి అని వివరం గా స్పీడ్ బ్రేకర్ లు సిగ్నల్ లైట్స్ తో సహా దారి చెప్పడమే కాకుండా అక్కడ ఏమేం దొరుకుతాయో ఏవి బాగుంటాయో చాలా వివరంగా ఓపిక గా ఏమాత్రం విసుగు లేకుండా చెప్పాడు. ఆ హోటల్ మీదేనేమిటోయ్ కొంపదీసి అంటే "లేదండీ మా ఊర్లో రుచికరమైన బోజనం అక్కడే దొరుకుద్దండీ.." అని చెప్పాడు. అతనికి థ్యాంక్స్ చెప్పి శలవు పుచ్చుకున్నాక మేమంతా ఒకరి మొహాలు ఒకరం చూసుకుంటూ మొత్తానికి భలే వాడిని అడిగాం అనుకున్నాం.

తీరా అక్కడికి వెళ్ళి చూస్తే అది చాలా చిన్న హోటల్ శుబ్రత గురించి కొంచెం అనుమానం వచ్చింది. ఒక పది నిముషాలు కాస్త రేట్ ఎక్కువ వసూల్ చేసే పెద్ద హోటల్ దొరుకుతుందేమో అని వెతికి.. ఏమీ దొరక్క సరె మా దానయ్య మీద భరోసా ఉంచి అక్కడే తిందాం అని కూర్చున్నాం. వడ్డించే ముందు అతను ముందుగా వాష్ బేసిన్ లో చేయి కడుక్కుని మొదలు పెట్టటం చూసాక పర్లేదు ధైర్యం గానే తినచ్చు అనుకున్నాం. మా దానయ్య చెప్పినట్లే భోజనం వేడిగా, చాలా రుచి గా ఉంది. హోటల్ చూసి పదార్దాల రుచిని అంచనా వేయ కూడదు అని మరో సారి నిర్ధారించుకున్నాను. మొత్తం మీద ఆ దారిన పోయే దానయ్య పుణ్యమా అని అంత రాత్రి వేళ ఆ కంభం లొ కమ్మని భోజనం చేసాం. ఇటువంటి సౌలభ్యం ఈ అమెరికా లో బాగా మిస్ అవుతాను నేను. ఇక్కడ అలా దారే పోయే వాడిని ఆపితే వాడేం చేస్తాడో అని భయం, అదే కాక ఏదో డౌన్ టౌన్ లో తప్ప అసలు ఇక్కడ రోడ్ మీద జనం కనపడటమే గగనమాయె, సో చచ్చినట్లు దారి లో కనిపించిన ఏ చెత్త రెస్టారెంట్ లోనో దొరికిన గడ్డి తిని తృప్తి పడాల్సిందే...

ఇదే ట్రిప్ లో ఒక సారి ఆళ్ళగడ్డ సమీపిస్తుండగా చాంతాడు లాంటి ట్రాఫిక్ జామ్ ఎదురైంది మా బండి చివరి లో ఉంది ముందంతా కనుచూపు మేరా బస్ లు లారీ లు ఆగి ఉన్నాయి. మేము ట్రాఫిక్ జామ్ ని సమీపిస్తూ దేవుడా దీన్లో నుండి ఎప్పటికి రా బాబు బయట పడేది అని అనుకుంటూ, ఏమైంది అని వాకబు చేస్తే. మరో దానయ్య స్వచ్చందం గా ముందుకు వచ్చి "సెంటర్ లో ఎరువులు అందలేదని రైతులు ధర్నా చేస్తున్నారండీ ఇప్పట్లో తేలే లా లేదు చాలా సెపటి నుండీ బళ్ళు ఆగున్నాయ్.. మీరేడికెళ్ళాళా? " అని అడిగాడు. ఊరు దాటి వెళ్ళాళి బాబు అని చెప్తే "అయితే మీరు కాస్త ఎనక్కి వెళ్ళి ఆ కనబడే మట్టి రోడ్డంబడి వెళ్తే ఊళ్ళో సందులగుండా సెంటర్ లో ధర్నా ని తప్పించుకుని ఎళ్ళచ్చు.." అని దారి చెప్పాడు. అతను చెప్పిన రూట్ లో వెళ్ళి ఒక ఇరవై నిముషాల్లో మళ్ళీ హైవే ఎక్కాం మనసులోనే అతనికి ధన్యవాదాలు తెలుపుకుంటూ. ఇలా సాయం తీసుకోడం లో కూడా రిస్క్ ఉందండోయ్.. ప్రత్యేకంగా రాత్రి పూట మీరు ప్రయాణం చేయాల్సి వచ్చినపుడు ఎప్పుడూ కూడా ఇలా మధ్య లో అడిగిన వాళ్ళ కి మీ చివరి గమ్యం చెప్పకండి. వాళ్ళెవరో తెలియదు కనుక దొంగలు అయ్యే అవకాశం కూడా ఉంది కనుక వీలైనంత దగ్గర ఊరి పేరు మాత్రం చెప్పండి చాలు. అందరూ మంచి వాళ్ళే దొరకరు కదా మన జాగ్రత్త లో మనం ఉండాలి మరి.

ఆదివారం, జనవరి 11, 2009

ముత్యాల పల్లకి (1976)

నా చిన్నతనం లో నేను చాలా సార్లు విన్న పాటలు ఇవి రెండూ.. అప్పట్లో పెళ్ళికి వెళ్తే "సన్నా జాజి కి..." పాట తప్పని సరిగా వినిపించే వారు. కొన్ని రోజులు గా ఎందుకో ఈ పాటలు గుర్తొస్తున్నాయి. మీరూ ఓ సారి విని గుర్తు చేసుకుని ఆనందించండి. మల్లెమాల గారు రాసిన సాహిత్యం సరళంగా అందం గా ఉంటుంది. తెల్లవారక ముందే పాట, రెండవ చఱణం లో పల్లెల గురించి ఎంత బాగా చెప్పారు అనిపించక మానదు. ఈ సంక్రాంతి సమయం లో పల్లెలు మరింత గుర్తొచ్చి మనసు భారమౌతుంది కదా !!


తెల్ల వారక ముందే.. పాట ను ఇక్కడ (చిమట మ్యూజిక్ లో) వినండి.

చిత్రం: ముత్యాల పల్లకి
సంగీతం : సత్యం
సాహిత్యం : మల్లెమాల

తెల్లా వారక ముందే పల్లే లేచిందీ..
తన వారినందరినీ తట్టి లేపిందీ..
ఆదమరచి నిద్ర పోతున్న తొలికోడి..
అదిరి పడి మేల్కొంది అదే పనిగ కూసింది..

||తెల్లా వారక ముందే||

వెలుగు దుస్తులేసుకునీ సూరీడూ..
తూర్పు తలుపు తోసుకుని వచ్చాడు
పాడు చీకటికెంత భయమేసిందో..
పక్క దులుపు కుని ఒకే పరుగు తీసిందీ..
అది చూసీ.. లతలన్నీ.. ఫక్కున నవ్వాయి..
ఆ నవ్వులే ఇంటింటా పువ్వులైనాయి..

||తెల్లా వారక ముందే||

పాలావెల్లి లాంటి మనుషులు...
పండూ వెన్నెల వంటీ మనసులు
మల్లె పూల రాశి వంటి మమతలూ..
పల్లె సీమలో కోకొల్లలూ..
అనురాగం.. అభిమానం...
అనురాగం అభిమానం కవల పిల్లలూ..
ఆ పిల్లలకూ పల్లెటూళ్ళు కన్న తల్లులూ..

||తెల్లా వారక ముందే||


~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*


సన్న జాజికి గున్న మావికి.. పాట ను ఇక్కడ (చిమట మ్యూజిక్ లో) వినండి.

చిత్రం: ముత్యాల పల్లకి (1976)
సంగీతం : సత్యం
సాహిత్యం : మల్లెమాల
గానం : బాలు, సుశీల

సన్నాజాజి కి గున్నా మావికి పెళ్ళికుదిరిందీ..
మాటే మంతీ లేని వేణువు పాట పాడిందీ.. ||సన్నజాజికి||
హాహహా ఆ ఆ...హాహహా ఆ ఆ...

గున్నా మావికి సన్నా జాజికి పెళ్ళి కుదిరిందీ..
నాదే గెలుపని మాలతీ లత నాట్యమాడిందీ.. ||గున్నా మావికి||
హాహహా ఆ ఆ...ఓహో.హోహ్హో...

పూచే వసంతాలు మా కళ్ళ లో..
పూలే తలంబ్రాలు మా పెళ్ళి లో..
పూచే వసంతాలు మా కళ్ళ లో..
పూలే తలంబ్రాలు మా పెళ్ళి లో..
విరికొమ్మా.. చిరు రెమ్మా..
విరికొమ్మ చిరు రెమ్మ
పేరంటానికి రారమ్మా

||సన్నాజాజికి||

కలలే నిజాలాయె ఈ నాటి కీ...
అలలే స్వరాలాయె మా పాట కీ
కలలే నిజాలాయె ఈ నాటి కీ...
అలలే స్వరాలాయె మా పాట కీ
శ్రీరస్తూ...శుభమస్తూ..
శ్రీరస్తు శుభమస్తు
అని మీరూ మీరు దీవించాలి

గున్నా మావికి సన్నా జాజికి పెళ్ళి కుదిరిందీ..
నాదే గెలుపని మాధవీ లత నాట్యమాడిందీ...
సన్నాజాజి కి గున్నా మావికి పెళ్ళికుదిరిందీ..

గురువారం, జనవరి 08, 2009

నేటి ఆంధ్రజ్యోతి దిన పత్రిక లో నా బ్లాగు !!

నా బ్లాగు లో నే రాసుకున్న "నాన్న తో షికార్లు !!" టపాను ఉదహరిస్తూ, ఆంధ్ర జ్యోతి పేపరు వారు నేటి (8th Jan-2009) నవ్య అనుబంధం లో నా బ్లాగు గురించి పరిచయం చేసారు. ఈ సంధర్బంగా ఆంధ్రజ్యోతి వారికీ, నవ్య నిర్వాహకులకు ధన్యవాదములు.

నా బ్లాగును కనుగొని, ఓపికగా రెండు టపాల నుండి ఎంపిక చేసిన పేరాలు కూర్చి, స్వల్ప మార్పులతో నా బ్లాగు పరిచయం గా ప్రచురించిన వారికి (ఆ వ్యక్తి ఎవరో తెలియదు) ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

అలానే పొద్దు లో 2008 డిసెంబరులో తెలుగు బ్లాగుల ప్రస్థానం లో నా టపాకు స్థానం కల్పించిన చదువరి గారికీ, పొద్దు సంపాదకీయానికి నెనర్లు. బహుశా ఆంధ్ర జ్యోతి వారు అక్కడి నుండే నా బ్లాగు చూడటం తటస్థించి ఉండచ్చు.

బొమ్మ లో ఉన్నది చదవాలంటే, బొమ్మ పై క్లిక్కండి, పెద్ద గా కనిపిస్తుంది.



నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.