శుక్రవారం, మే 30, 2008

కాఫీ(Kauphy)...కబుర్లు

వీడేంటి కారంపూడి గురించి చెప్తాను అని కాఫీ గురించి మొదలు పెడుతున్నాడు అనుకుంటున్నారా. అసలు బ్లాగడానికి వాగడానికి చాలా దగ్గర సంబందం వుంది కదా. ఉచ్చారణలోనే కాదు అర్ధం లో కూడా ఒకటే అనుకోవచ్చు. అందుకని ఏదొ వాగుతున్నాను అబ్బ అలా విసుక్కోకుండా వినండి సార్ ...ఓ సారీ చదవండి సార్.

కాపీ అనగానే ముందు నాకు గుర్తొచ్చేది ఏదో సినిమాలో ఒక్క అక్షరం కూడా కలవకుండా...KAUPHY... అని చెప్పిన స్పెల్లింగ్ నాకు అప్పట్లో అది చాలా నచ్చేసింది. బావా బావా పన్నీరు సినిమా అనుకుంటా... బావుంటుంది. ఇక పోతే నాకు ఇంటర్ వరకు ఇలాటి కాఫీ, టీ లు లాటివి అలవాటు లేవు. కొంచెం పెద్ద అయిన తర్వాత తాగాలి అనిపించినా. వీడు కాఫీ టీ లాంటి అలవాట్లు కూడా లేని బుద్ది మంతుడు అని అనిపించు కోవాలి అని తాగకుండా వుండేవాడ్ని :-) అలా నవ్వకండి ఇది నిజం. ఇంటర్ కోసం హొస్టల్ లో చేరిన తర్వాత సాయంత్రం నాలుగు గంటలకి కాఫీ/టీ ల తో పాటు వుడికించిన శనగలు, పల్లీలు, బూంది ఇతరత్రా స్నాక్స్ పెట్టేవారు. అప్పుడు నేస్తాల తో పాటు మెల్లగా అప్పుడప్పుడు తాగడం అలవాటు అయింది. అదే అలవాటు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా కొనసాగించేసా అనమాట.

కాని ఈ రెండిటి లో నాకు కాఫీ చాలా బాగా నచ్చేది. మనకి చిన్నప్పటి నుండి అంతే లెండి ఆరోగ్యకరమైన వి ఏవి నచ్చవు :-) అలా మెల్లగా టీ కంటే కూడా కాఫీ కి బానిసని అయిపోయా. కాఫీ టీ ల గురించి చెప్తూ మా సిమ్హాచలం గురించి చెప్పక పోతే చాలా మిస్ అయినట్లే... ఇంజినీరింగ్ చదివే రోజులలో యూనివర్సిటీ హాస్టల్ లో ఉండే వాడ్ని. ఆ వాతావరణం చాలా బావుండేది లెండి విశాఖ లో ప్రశాంతమైన వాతావరణానికి తోడు జనానికి దూరం గా హాస్టల్ విద్యార్ధుల గొడవ తప్ప ఏమి వినపడకుండా చాలా బావుండేది. మా బ్లాకు రౌండ్ గా మూడు అంతస్థులతో వుండేది మధ్య లో పెద్ద పెద్ద చెట్లు కొంత ఖాళీ స్తలం వుండేది.

సాయంత్రం కాలేజి నుండి జనం వచ్చే సరికి దాదాపు 4 నుండి 5 మధ్యలో మా సిమ్హాచలం టీ ఫ్లాస్క్ లు ఒక చేతిలో, టీ గ్లాసులు కడగడానికి సగం నీళ్ళు నింపిన చిన్న బక్కెట్ ఒక చేతిలో, బిస్కట్ లూ, చెగోడీలూ, పప్పుండలూ నింపిన ఒక చిన్న బేసిన్ చంకలో పెట్టుకుని మా బ్లాకుకి వచ్చేవాడు. తను అలా రూము రూముకి తిరిగి ఆ టీ అమ్మేవాడు. స్టూడెంట్స్ రూం బయట కుర్చీ వేసుకుని కూర్చుని మధ్య మధ్య లో "సిమ్హాచలం తొందరగా రావయ్య ఎంత సేపు ఎదురు చూడాలి " అని పొలికేకలు పెడుతూండేవారు. ఇగో వచ్చేత్తున్నాను బాబులూ అని శ్రీకాకుళం యాస లో సమాధానం ఇచ్చుకుంటూ ఒక్కడే బ్లాకు అంతా తిరిగే వాడు.

బయటకి కదలలేని బద్దకం బేచ్ ఇంకా కొంచెం పొదుపరుల బేచి ఇక్కడ టీ తాగితే, వడలూ, వంకాయ బజ్జీ లు, సమోసాలు, మిరపకాయ బజ్జీలు లాంటి స్నాక్స్ తో పాటు టీ/కాఫీ ల కోసం కొంతమంది శేఖర్ బడ్డీ లకి వెళ్ళే వాళ్ళు. అక్కడ జరిగే కధల మీద ఒక పుస్తకమే వ్రాయచ్చునేమో...ఇవన్ని ఇలా ఉంటే మద్రాస్ లో పని చేసినప్పుడు అక్కడ శరవణ భవన్ లో అలవాటు అయిన కాఫీ నే కాఫీ అనిపిస్తుంది చాలా బాగా చేసేవాడు వాడు. ప్రత్యేకించి టీ నగర్ బస్స్టాండ్ కి కొంచెం దగ్గరలో రంగనాథన్ స్ట్రీట్ కి ఎదురుగా ఉండే శరవణ భవన్ కి కేవలం కాఫీ తాగడానికి దాదాపు 1 కి. మి. నడుచుకుంటూ వెళ్ళి వచ్చే వాళ్ళం.

కాఫీ ఒకో సారి నాకు ఎంత రీలీఫ్ ఇస్తుందంటే ఒక చిన్న ఉదహరణ చెప్తాను. గత వారం రోజులు గా నేను బాగా బిజీ గా ఉన్నాను. దాదాపు 4 రోజులు వరసగా పని చేసి చేసి చాలా చిరాకు అనిపించింది మొన్న సాయం సంధ్యా సమయం లో 6 నుండి 7 మధ్యలో అనుకుంటాను. పని తో విసిగిపోయి ఎంతకీ పని అవడం లేదు ముందుకి కదలడం లేదు అని చిరాకు వచ్చేసి మొత్తం పక్కన పడేసాను.

అలా కంప్యూటర్ పక్కన పడేసి తలుపులు కిటికీలు అన్నీ తెరచి చూస్తే బయట వాతావారణం చాలా ఆహ్లాదం గా వుంది అటు వేడి ఇటు చలీ కాని ఒక గమ్మత్తైన చల్లటి గాలులు. సూర్యాస్తమయం అయినా కూడా సూర్యుడు, మేఘాలు తమ తమ ఉనికిని తెలియచేయడానికా అన్నట్లు విశ్వ ప్రయత్నం చేస్తూ ఒకరితో ఒకరు పోటీ పడుతుంటే అంతటా పరుచుకున్న పలుచని వెలుతురు. నీలి రంగు ఆకాశాన్ని పూర్తి గా కప్పేసిన లేత గోధుమ రంగు మేఘాలలో అక్కడక్కడా నీళ్ళు నిండిన మేఘాలు నలుపు రంగులో ఎవరో చిన్న పిల్లాడు పెన్సిల్ తో ఒకే చోట గీసిన గీతలలా అందం గా ఉన్నాయి. వీటికి తోడు ఆగి ఆగి వినపడుతున్న పక్షుల కువ కువల నేపధ్య సంగీతం. ఒక్క నిముషం మనసంతా దూది పింజ లా తేలి పోయింది.

అంత అందాన్ని కొన్ని నిముషాలు అలానే ఆస్వాదించి దాన్ని మరింత పెంపొందించడానికి ఒక మంచి కాఫీ పెట్టుకుని. నేపధ్యం లో జాకీర్ హుస్సేన్ గారి తబలా పక్క వాయిద్యం గా చేసుకుని హరిప్రసాద్ చౌరాసియా గారు భూపాల రాగం లో వినిపించిన మురళీ నాదం వింటూ ఒంటరి గా ప్రపంచం లో ఎవరితో సంభంధం లేనట్లు గా ప్రకృతి లోని ఆహ్లాదాన్ని సంగీతం లోని మాధుర్యాన్ని కాఫీ రుచి ని తనివి తీరా ఆస్వాదిస్తూ ఒక 10 నిముషాలు గడిపాను. అంతే నాలుగు రోజుల శ్రమ హుష్ కాకి అన్నట్లు ఎగిరి పోయింది. ఆ తర్వాత రెట్టించిన ఉత్సాహం తో మళ్ళీ పని లో మునిగి పోయాను.

అలా నాకు కాఫీ చాలా ఇష్టం కాని సాధారణం గా నేను పని చేసుకుంటూ మధ్య లో కాఫీ తాగుతున్న విషయం కూడా తెలియకుండా తాగేస్తూ ఉంటాను అప్పుడప్పుడు ఇలా ప్రత్యేకం గా ఆస్వాదించి రీచార్జ్ అవుతుంటాను. అదనమాట విషయం, కాఫీ కబుర్లు.....

సరే ఈ రోజుకి శలవా మరి,

--వేణు.

9 కామెంట్‌లు:

 1. మీ కాఫీ కబుర్లు బాగున్నాయి.

  నేను అసలు తాగకుండా ఉండేవాణ్ణి కాదు కానీ, ఎక్కువగా బూస్ట్, హార్లిక్స్ ( ఇది అంత ఇష్ఠం ఉండకపోయినా..అమ్మ బలవంతం మీద ) త్రాగేవాణ్ణి. ఇంటర్ వరకూ ఇదే తంతు. డిగ్రీకి వచ్చాక మాత్రం క్లోజ్ ఫ్రెండ్ సురేష్ వల్ల 'టీ ' ఎక్కువ త్రాగేవాణ్ణి. అయినా కూడా అప్పుడప్పుడు త్రాగే బ్రూ ఫిల్టర్ కాఫీ నే బాగా నచ్చేది. పీజీ లో తమిళ్ నాడు టీలు, అరటికాయ బజ్జీ అలవాటు. ఇంక ఇదుగో ఈ ' ఓమెరికా ' వచ్చాక ఆఫీస్ లో క్రీమర్ తో దిక్కుమాలిన కాఫీ రోజూ తప్పని సరిగా 9 కి పడాల్సిందే !

  రిప్లయితొలగించండి
 2. తమిళనాడు అఱటికాయ బజ్జీలు, టీ భలే గుర్తు చేసారు Venu గారు. నాకు అక్కడ ఉన్నన్ని రోజులు ఆ అలవాటు ఉండేది. ఉదయం పొంగల్ టిఫిన్ అయితే సాయంత్రం అఱటికాయ బజ్జీలు, వడలు.

  రిప్లయితొలగించండి
 3. అటు వేడి ఇటు చలీ కాని ఒక గమ్మత్తైన చల్లటి గాలులు. సూర్యాస్తమయం అయినా కూడా సూర్యుడు, మేఘాలు తమ తమ ఉనికిని తెలియచేయడానికా అన్నట్లు విశ్వ ప్రయత్నం చేస్తూ ఒకరితో ఒకరు పోటీ పడుతుంటే అంతటా పరుచుకున్న పలుచని వెలుతురు. నీలి రంగు ఆకాశాన్ని పూర్తి గా కప్పేసిన లేత గోధుమ రంగు మేఘాలలో అక్కడక్కడా నీళ్ళు నిండిన మేఘాలు నలుపు రంగులో ఎవరో చిన్న పిల్లాడు పెన్సిల్ తో ఒకే చోట గీసిన గీతలలా అందం గా ఉన్నాయి. వీటికి తోడు ఆగి ఆగి వినపడుతున్న పక్షుల కువ కువల నేపధ్య సంగీతం. ఒక్క నిముషం మనసంతా దూది పింజ లా తేలి పోయింది.
  idi xtraordinary venu garu..chala baga raasaru.naku baga nachindi andi.
  tea,coffee taagaka pothe budhimantulana mata..
  ithe nenu chala budhimanthuraalini..:-)
  b.Tech ayyipoyina,entha mandi balavantha petina,nenu thaagaledu..
  i didnt even taste it..
  chaitu gr8 kada..:-)
  may b taahithe alavatu ayyedi emo ledni..
  newaz me blogs chala bagunnay..keep cont..

  రిప్లయితొలగించండి
 4. ఇంత పాత పోస్ట్ చదివి కామెంట్ చేసినందుకు థ్యాంక్స్ చైతు. నీ పుణ్యమా అని మళ్ళీ ఓ సారి చదువుకున్నాను నేనుకూడా.

  అప్పట్లో అంతే అనుకునే వాడ్ని ఈ పిల్లాడు కాఫీ టీ లు కూడా తాగడమ్మా అని అనిపించుకోవాలి అని.

  కానీ యండమూరి గారు అన్నట్లు అస్సలు ముట్టుకోని వాడికి దాని రుచి ఏమిటో తెలియదు. వాళ్ళ కన్నా ఒక సారి ప్రయత్నించి ఆ రుచి కి అలవాటు పడని వాడు ఇంకా గొప్ప బుద్దిమంతుడు.

  ఈ విషయం ఆయన తాగుడు గురించి అన్నారనుకో కానీ అది కాఫీ కి కూడా వర్తిస్తుంది :-)

  రిప్లయితొలగించండి
 5. కాఫీ గురించి గుర్తు చేశారు వేణూ శ్రీకాంత్ గారు. ఇప్పుడెళ్ళి పెట్టుకోవాలి. :)

  రిప్లయితొలగించండి
 6. మీ కాఫి కబుర్లు చాలా బాగుందండీ..

  టెన్షన్ గా ఉన్నాప్పుడు అలా సంగీతం వింటూనో ,లేకపొతే స్నేహితులతోనో లేదా ఒక్కటే అలా కిటికీలోనుంచి బయటకి చూస్తూనో ఒక కప్పు కాఫి కడుపులో పడితే చాలు మళ్లి రీచార్జ్ అయ్యిపొవచ్చు. మీ టపా చదివి నేను కూడా రీచార్జ్ అయ్యాను.:)

  నేను మీలాగే కాఫి,టీలు తాగేదాన్ని కాదండీ..కానీ కాఫి అలవాటు మాత్రం అయ్యింది. అలవాటయ్యాక వదలబుద్ది కాలేదు.

  :)

  రిప్లయితొలగించండి
 7. ప్రియ గారు నెనర్లు, ఎందుకో మీ వ్యాఖ్య మిస్ అయ్యాను ఇన్నాళ్ళ తర్వాత జవాబిస్తున్నందుకు సారీ..

  స్నిగ్ధ గారు నెనర్లు, అదేనండీ కాఫీ మహత్యం అలవాటయ్యాక వదలడం చాలా కష్టమే :)

  రిప్లయితొలగించండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.