అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

అందమైన బాల్యం

మధురమైన జ్ఞాపకాలతో అందమైన బాల్యాన్ని నా సొంతం చేసినందుకు అమ్మానాన్నలకు ఎప్పుడూ ఋణపడి ఉంటాను. మొదటి సంతానాన్నవడంతో నేనాడిందే ఆట పాడిందే పాట అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళినా మా ఇంట్లో అయినా అపురూపంగా గడిచింది. పాడుకున్న పాటలు, ఆడుకున్న ఆటలు, స్కూల్ ఎగ్గొట్టడానికి వేసిన వేషాలు, తిన్న చిరుతిళ్ళు, నాన్న వేలు పట్టుకుని కొట్టిన షికార్లు, 16mm సినిమాలు కబుర్లు ఇక్కడ చదవచ్చు.

ఇంటర్మీడియెట్ హాస్టల్ కబుర్లు

నూనూగు మీసాల నూత్న యవ్వనం అమ్మానాన్నలకు దూరంగా నాదంటూ ఓ స్వంత ప్రపంచం. అప్పటివరకూ ప్రతి చిన్న పనికి వాళ్ళమీద ఆధారపడి ఒక్కసారిగా నాకు నేనే నెగ్గుకు రావాల్సిన పరిస్థితులను తలుచుకుని దిగులు. అంతలోనే చుట్టూ ఉన్న స్నేహితులతో నేస్తం కట్టేసి చేసిన అల్లర్లు, పరోఠాల బిజినెస్సులు, చెరకుతోట దొంగతనాలు, ఆడ్మినిస్ట్రేటర్ కి మస్కాగొట్టి చూసిన సినిమాలు, సరదా కొంటె కబుర్లు ఇక్కడ చూడండి.

ఇంజనీరింగ్ కాలేజ్

ఇంటర్మీడియెట్ కి రెసిడెన్షియల్ హాస్టల్ కనుక పంజరంలో పక్షిలా బతికితే ఇంజనీరింగ్ కాలేజ్ యూనివర్సిటీ హాస్టల్స్ లోకి వచ్చేసరికి ఒక్కసారిగా జూలోనుండి పచ్చని అడవిలోకి వదిలేసిన జింక పరిస్థితే అయింది, ఎక్కడికి పరుగులెట్టినా ఏం చేసినా అడిగేవాళ్ళులేరు. అసలు హాస్టల్ బిల్డింగ్ లో నిరంతరం కాపుకాసే వార్డెన్ ఉండడనే విషయం నాకు డైజెస్ట్ కావడానికి నెలపట్టింది :-) నిజమా అలా ఎలా సాధ్యం అని ఇప్పటికీ అనిపిస్తూనే ఉంటుంది. అంతటి స్వేఛ్చాప్రపంచంలో చేసిన అల్లర్లు కొన్ని కబుర్లు ఇక్కడ.

సినిమాలు రివ్యూలు..

నాకున్న అతి పెద్ద వ్యసనం సినిమా చూడడం రిలీజైన ప్రతి అడ్డమైన సినిమా చూసేసి ఈబొమ్మలో చూపించినట్లు తెలుగు సినిమాని భుజాల మీద మోసేవాళ్ళలో నేనొకడ్ని. చూసి ఊరుకోకుండా ఇది ఇందుకు బాలేదు అది అందుకు బాగుంది అంటూ పేద్ద వంద సినిమాలు తీసేసి విశ్రమిస్తున్న మేధావిలా చేసే విశ్లేషణలు :-) హహహ చదివిన ఒకరిద్దరు అలా తిడతారు కానీ నా దృష్టిలో ఒక సాధారణ సినీ ప్రేక్షకుడు చూసొచ్చి మిత్రులతో చెప్పే కబుర్ల లాంటి నా సినీ రివ్యూలు ఇక్కడ చదవండి. ఆరెంజ్, ఖలేజా, కృష్ణం వందే జగద్గురుం లాంటివి కొన్ని ఎక్కువమంది ఆదరణ పొందాయ్.

మంగళవారం, నవంబర్ 25, 2008

కార్పొరేట్ ట్రావెల్ !!!

నాకు సాధారణం గా లంచ్ నా డెస్క్ దగ్గరకే తెచ్చుకుని ఇంటర్నెట్ లో వార్తలో, వికీ నో, మరోటో చూస్తూ తినడం అలవాటు. మొన్న గురువారం అలాగే లంచ్ టైం లో CNN news చదువుతుంటే ఈ వార్త నన్నాకర్షించింది. దాని గురించే ఈ టపా….

మీ ఊహా శక్తి కి కొంచెం పని కల్పించి ఒక చిన్న దృశ్యం ఊహించుకోండి. మీరో గంపెడు పిల్లలు బోలెడు జనాభా మరియూ భాధ్యతలతో నిండి ఉన్న ఒక ఉమ్మడి కుటుంబానికి పెద్ద అయి ఉండి నెలాఖరు రోజులలో కడుపు నిండా తింటానికి కూడా డబ్బులు లేని పరిస్తితులలో కష్ట పడి పచ్చడి మెతుకులతో కడుపు నింపుకుని అరుగు మీద సేద దీరుతుంటే మీ ముందు ఒక ఖరీదైన బెంజ్ కార్ వచ్చి ఆగి అందులో నుండి సూటు బూటూ వేసుకున్న ఓ వ్యక్తి చేతిలో సత్తు బొచ్చె తో దిగి బాబు కాస్త ధర్మం చేయండయ్యా నేను చాలా ధీనమైన పరిస్తితి లో ఉన్నాను అని అంటే మీకేం అనిపిస్తుంది.




సరీగ్గా ఈ అమెరికను రాజకీయనాయకుడి కి కూడా అదే అనిపించింది. వివరాల కోసం CNN లో
ఈ వార్త చదవండి. దీని సారాంశమేమంటే… ఈ మధ్య వచ్చిన ఆర్ధిక మాంద్యాన్ని తట్టుకోడానికి గాను అమెరికా ప్రభుత్వం bailout money అని కొంత ధనాన్ని మర్కెట్ లోకి పంపడానికి నిర్ణయించుకుంది. ఆ డబ్బులో నుండి మాకు ఓ పాతిక బిలియను డాలర్లు ఇవ్వండి బాబూ మేము పూర్తిగా మునిగిపోయే పరిస్తితి లో ఉన్నాం అని దాదాపు chapter 11 bankruptcy file చేయడానికి సిద్దపడుతున్న GM ఇంకా Ford and Chrysler అనే మూడు Detroit కార్ల కంపెనీల CEO లు వాషింగ్టన్ కి వచ్చారు కాకపోతే వాళ్ళు చేసిన తప్పల్లా ఏంటంటే… “మేం అప్పుల్లో ఉన్నాం మాకు డబ్బు సాయం చేసి మా కంపెనీలని బ్రతికించండి అని ప్రభుత్వాన్ని అడగడానికి వారి వారి అలవాట్ల ప్రకారం తలా ఓ ప్రైవేట్ జెట్ లో Detroit నుండి Washington కి వచ్చారు.

దానికి గాను అయిన ఖర్చు రమా రమి 60 వేల డాలర్లు. commercial jets ఉపయోగిస్తే ముగ్గురుకీ కలిపి 2 వేల లో అయిపోయేది ఖర్చు అలా కాకుండా జెట్ పూల్ చేసుకుని ముగ్గురూ కలిసి ఒకే జెట్ లో వచ్చినా 20వేల తో అయిపోయేది. ఇటువంటి పరిస్థితి లో కూడా ఇలా వృధా గా ఖర్చు పెడుతున్న వీళ్ళకి చూస్తూ చూస్తూ డబ్బు సాయం ఎలా చేయమంటారు అని అడిగారు. అంతే కాదు ఆ రోజు నిర్ణయం తీసుకోడానికి జరపాల్సిన వోటింగ్ ని కూడా రద్దు చేసారుట.

కంపెనీ లేమో ప్రోటోకాల్స్ సెక్యూరిటీ ఇబ్బందులు కారణాలు గా చూపించి, ఇక్కడ కంపెనీలు మూత పడితే Detroit లో నిరుద్యోగులయ్యే అనేక మంది జీవితాల గురించి పట్టించుకోకుండా అనవసరమైన విషయానికి ప్రాముఖ్యత నిచ్చి విషయాన్ని పక్క దారి పట్టిస్తున్నారు రాజకీయనాయకులు అని అంటున్నాయి. వీరిద్దరి వాదనలో ఎవరిదీ కొట్టి పారేయలేనివి గానే ఉన్నాయనిపిస్తుంది కాని నన్ను ఆకర్షించిన విషయమేంటంటే రాజకీయాలు ఏ దేశం లో నైనా ఎక్కడైనా రాజకీయాలే సుమా అనే విషయం.

ఇవ్వన్నీ పక్కన పెడితే అసలు there is a lot of saving potential in corporate travel అని నా అభిప్రాయం, నా వృత్తి రీత్యా మా account లోని అన్ని Travel and living expenses నేను గమనిస్తూ ఉంటాను, చాలా అడ్డదిడ్డం గా బుక్ చేసి పడేస్తుంటారు టిక్కెట్స్. కొద్దిగా డీల్స్ వెతికితే నో కాస్త సర్ధుకోగలిగితేనో రెండువందల డాలర్లకి అయిపోయే tickets కోసం ఆరేడు వందల డాలర్లు ఖర్చు పెడుతుంటారు. ఇవే ఎయిర్లైన్స్ కి అసలైన లాభసాటి బేరాలనుకోండీ ఇవి కట్ చేస్తే అక్కడ బోలెడు ఉద్యోగాలు పోతాయంటారేమో.

ఆదివారం, నవంబర్ 16, 2008

ఓ క్లాసు... ఓ మాసు... :-)

గత వారం రోజులు గా ఎందుకో ఈ రెండు పాటలూ పదే పదే గుర్తొస్తున్నాయి సో టపాయించేస్తే ఓ పనైపోతుంది అని మొదలెట్టాను. అసలు ఈ టపా కి సరైన శీర్షిక ఓ క్లాసిక్... ఓ జానపదం అయి ఉండేదేమో. ముందు క్లాసిక్ గురించి... జంధ్యాల గారి ముద్దమందారం సినిమాలో వేటూరి గారు రాసిన ఈ పాట చాలా బాగుంటుంది. సాహిత్యం గొప్ప గా లేకపోయినా చిన్న చిన్న పదాలలో మంచి భావాలని పలికించారు వేటూరి గారు... రమేష్‌నాయుడు గారి సంగీతం ఆహ్లాదం గా ఉంటే... ఇక బాలు గాత్రం అద్భుతమైన వన్నె తెస్తుంది మనసుకు హాయినిస్తుంది. ఒక సారి విని చూడండి....

చిత్రం : ముద్దమందారం
సాహిత్యం : వేటూరి
సంగీతం : రమేష్ నాయుడు
గానం : బాలు

నీలాలు కారేనా కాలాలు మారేనా
నీ జాలి నే పంచుకోనా నీ లాలి నే పాడలేనా
జాజి పూసే వేళ జాబిల్లి వేళ
పూల డోల నేను కానా

||నీలాలు||

సూరీడు నెలరేడు సిరిగల దొరలే కారు లే
పూరి గుడిసెల్లో పేద మనసుల్లో వెలిగేటి దీపాలులే
ఆ నింగి ఈ నేల కొనగల సిరులే లేవులే
కలిమి లేముల్లొ కరిగే ప్రేమల్లొ నిరుపేద లోగిళ్ళులే

||నీలాలు||

ఈ గాలిలో తేలి వెతలను మరిచే వేళలో
కలికి వెన్నెల్లు కలల కన్నుల్లో కల పారి పోవాలి లే
ఆ తారలే తేరి తళ తళ మెరిసే రేయిలో
ఒడిలో నువ్వుంటె ఒదిగీ పోకుంటె కడతేరి పోవాలిలే..

||నీలాలు||

ఇక రెండో పాట విషయానికి వస్తే, నా చిన్నపుడు మా మావయ్య పాడేవారు ఈ పాటని, తెలంగాణా యాస లో సాగే ఈ పాట ఇప్పటికీ ఎలాంటి మూడ్ లో ఉన్నా నాకు హుషారు తెప్పిస్తుంది... క్లాసు మాసు తేడా ఏంటి లెండి మంచి జానపదాలు వింటే మనకి తెలీకుండానే మన పాదమో లేక చెయ్యో కనీసం చిన్న గా అయినా సరే పాట తో పదం కలుపుతుంది ఆ పాటలు అలాంటివి. ఒక విచారించ వలసిన విషయం ఏంటంటే నాకు ఈ పాట రాసిన లేదా స్వరపరిచిన వ్యక్తుల గురించి ఏమీ తెలియదు కానీ ఈ పాట విన్న ప్రతి సారీ మాత్రం చాలా ఆనందిస్తాను ఒక చిరునవ్వు మోము పై అలవోకగా అలా వచ్చి వెళ్తుంది.

ఎడ్లు బాయె... గొడ్లు బాయె... ఎలమ దొరల మంద బాయే...
గోళ్ళగమ్మ నేను బోతె కందిరీగ కరిసి పాయె...
అరెరెరెరెరె ఆయ్
కోడిబాయె లచ్చమ్మదీ... కోడి పుంజు బాయె లచ్చమ్మదీ... ||2||
||ఎడ్లు బాయె||
||కోడిబాయె||

హోయ్
బండి బాయె బస్సు బాయె రేణిగుంట రైలు బాయె.... ||2||
మళ్ళి దిరిగి చూడ బోతె గాలి మోటరెళ్ళిపాయె... ||2||
అరెరెరెరె
దూడ బాయె లచ్చమ్మదీ... లేగ దూడ బాయె లచ్చమ్మదీ...||2||

||ఎడ్లు బాయె||
||కోడిబాయె||

కొండబాట నస్తుంటే.... కోయిలమ్మ గూస్తుంటే...
కొండబాట నస్తుంటె.... కోయిలమ్మ గూస్తుంటె...
వాగు బాట నస్తుంటే.. వాయిలాల సప్పుడాయె...
మందనంత గెదుముకుంట ఇంటిదారినొస్తుంటే...2
పోతుబాయె లచ్చమ్మదీ.. లేగ పోతుబాయె లచ్చమ్మదీ...||2||

||ఎడ్లు బాయె||
||కోడిబాయె||

లచ్చన్న దారి లోన లంబాడీ ఆటలాయె...హోయ్...
జిగులారి సంత లోన పోతలింగడి గంతులాయె
బంతి పూలు తెంప బోతె తుమ్మెదొచ్చి గరిసి బాయె
గంప బాయె లచ్చమ్మదీ పూల గంప బాయె లచ్చమ్మదీ.. ||2||

||ఎడ్లు బాయె||
||కోడిబాయె||

మంగళవారం, నవంబర్ 11, 2008

Potluck !! మన వన భోజనాలేనండీ...

మా టీం లో మూడొంతుల పైగా భారతీయులు ఉండటం తో మొన్నీమధ్య దీపావళి సంధర్భం గా మా ఆఫీస్ లో పాట్ లక్ అరేంజ్ చేసాము సరదాగా ఆ ఫోటోలు దాని ప్రిపరేషన్ కోసం నే పడ్డ పాట్లు మీతో పంచుకుందామని ఈ టపా...

అమెరికా జీవన విధానం గురించి పెద్ద గా పరిచయం లేని వారికోసం అసలు potluck అంటే ఏంటో ముందు చూద్దాం. నేను అమెరికా వచ్చిన కొత్త లో అందరితో కలిసి పాట్‌లాక్ (potlock) అని అనే వాడ్ని తర్వాత తర్వాత మెల్ల గా అది pot lock కాదు potluck అని తెలుసుకున్నాను. దీని డిక్షనరీ మీనింగ్ ఏమిటా అని వెతికితే అనుకోని అతిధి కి కుండలో ఉన్నదేదో వడ్డించడం అని ఒక అర్ధం అట అంటే నిఖార్సైన తర్జుమా అనమట pot luck కి కుండ అదృష్టం :-) సరే ఇక వేరే అర్ధానికి వస్తే అతిధులు అంతా ఎవరి వంట వారే వండుకుని తెచ్చుకుని అంతా కలిసి ఒకే చోట పంచుకుంటూ తినడం. దీనినే కొంచెం ఆర్గనైజ్డ్ గా అంటే అంతా కలిసి ఒకే వంటకం తేకుండా ముందే మెనూ లిస్ట్ లా ఒక సైనప్ షీట్ పెట్టి బఫే కి కావాల్సిన సరంజామా అంతా తలా ఒకటి చొప్పున అందులో వ్రాసి తీసుకు వస్తారు.

potluck table, బిర్యాని ప్రెజెంటేషన్ బాగుంది కదా

వంశీ గారి పసలపూడి కధలో లేకా శంకరమంచి గారి అమరావతి కధలో చదివిన వారికి వాటిలో వర్ణించిన వన భోజనాలు అందులోకి ప్రత్యేకం గా వంట వాడితో చేయించి పెట్టే వంటలు గుర్తొచ్చి నోరు ఊరుతుందా :-) నేను 10 వ తరగతి లో ఉన్నపుడు మా నరసరావుపేట ఊరి చివర్లో ఉన్న మామిడి తోటలో వనభోజనాలకి వెళ్ళిన గుర్తు అప్పుడు అక్కడే వంటమనిషి తో వండించి తిన్న గుర్తు. ఆ తర్వాత కాలేజ్ లో ఒకటి రెండు సార్లు వెళ్ళినా కేటరింగ్ వాడికి చెప్తే వాడే మంచి నీళ్ళ తో సహా ఏర్పాట్లు చేసే వాడు. అంతే కాని అమెరికా కి వచ్చే వరకు ఇలా ఎవరికి వారే వంట చేసుకుని తీసుకు వచ్చి తినడం అనే ప్రక్రియ పరిచయం అవ్వలేదు. నాకు ఇక్కడి అలవాట్ల లో నచ్చిన వాటిలో ఇది ఒకటి. ఇండియా లో ఏమో కానీ ఇక్కడికి వచ్చాక మన వాళ్ళు బాగానే అరేంజ్ చేస్తుంటారు ఇంటి దగ్గర ఎప్పుడైనా వెళ్ళినా బేచిలర్ గా cool drinks, paper napkins or plates లాంటివి పట్టుకెళ్ళడం తప్ప వంట చేసే పని పెట్టుకునే వాడ్ని కాదు.

ఎప్పుడో ఒక సారి నేను అట్లాంటా లో ఉన్నపుడు మా ఆఫీస్ వాళ్ళకి మన ఆలూ ఫ్రై కాస్త నెయ్యి అదీ దట్టించి రుచి చూపించా... అప్పుడు ఎక్కువ మంది అమెరికన్స్ ఉండే వారు టీం లో, వీళ్ళకి mashed potato తప్ప ఇంకోటి తెలీదు కనుక wow potato can be cooked like this ? who made it ? its wonderful !! అని అనుకుంటూ లొట్టలు వేసుకుంటూ బాగానే ఆస్వాదించారు అప్పుడు. కానీ ఇప్పుడు మన వాళ్ళు ఎక్కువ ఉన్నారు కనుక ఆ పప్పులు ఉడకవ్ "ఏంట్రా ఎదవా ఇంటికి వచ్చిన అనుకోని అతిధుల కోసం అయిదు నిముషాల్లొ చేసి పడేసే ఆలూ ఫ్రై తెస్తావా" అని తిట్లు లంకించుకుంటారేమో అని అనుమానపడి, మనకి తేలికగా అయిపోయే వంటకం ఏమిటా అని అలోచించి... ఫైనల్ గా ష్రింప్ (American name for prawns) కర్రీ అదేనండి రొయ్యల ఇగురు చేద్దాం అని డిసైడ్ అయిపోయా...


ఇదే మనం వండి పట్టుకెళ్ళిన సాల్ట్ కర్రీ.. ఓ సారీ !! ష్రింప్ కర్రీ...

మరీ ముందు రోజు ఏం చేస్తాం లే అని ఆ రోజు తెల్లవారు ఝామునే లేచి వంట మొదలు పెట్టాను. మంచి నిద్రమత్తులో marinate చేసేప్పుడు వేసిన ఉప్పు సంగతి మర్చిపోయి మాములు గా కూరలో మళ్ళీ రెండో సారి ఉప్పు వేసేసాను చివరికి కూర అంతా అయిపోయే టైం లో రుచి చూస్తే "ఉప్పు బ్రహ్మాండం గా సరిపోయింది కాకపోతే కూరే కాస్త తక్కువైంది" అన్న బాపు గారి సెటైరు గుర్తొచ్చింది. ఇప్పుడు దీన్ని ఎలా ఫిక్స్ చేయాలి రా దేవుడా !! అని ఆలోచిస్తుంటే అంతకు కొద్ది రోజుల ముందే ఓ ఫ్రెండ్ చెప్పిన బంగాళదుంప చిట్కా గుర్తొచ్చింది. కూర చివర్లో ఒక పచ్చి దుంప ని పెద్ద ముక్కలుగా కోసి వేస్తే ఉప్పు పీల్చేస్తుంది అని అన్నారు సరే ప్రయత్నిద్దాం అని చూస్తే ఇంట్లో ఆలూ లేదు.. వెంటనే ఉదయాన్నే ఏ మొహం పెట్టుకుని అడగడం అని కూడా ఆలోచించ కుండా... ఎదురింటి తలుపు కొట్టి "పిన్ని గారు ఓ బంగాళదుంప ఉంటే అప్పిప్పిస్తారా " అని అడిగి తీసుకు వచ్చి ఎక్కువ సర్ఫేస్ ఏరియా వచ్చేలా చెక్కు తీసి నిలువు గా రెండు ముక్కలు కోసి కూర లో వేసాను. లక్కీ గా అది చాలా వరకు ఉప్పుని అంతే కాకుండా ఎక్కువైన నీటినీ కూడా పీల్చేయడం తో కూర కాస్త తినగలిగే స్టేజ్ కి వచ్చింది.

సరే ఏదేమైనా ఒప్పుకున్నాక తప్పదు కదా తిన్నవాడి దురదృష్టం అని అనుకుని అలానే పట్టుకుని వెళ్ళాను. మా వాళ్ళంతా కూడా కొంచెం ఉప్పు తక్కువైతే ఇంకా బాగుండేది అని అంటూనే మొత్తం గిన్నె ఖాళీ చేసేయడం తో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నా. అదనమాట నా పాట్‌లక్ కధ....

Some Desserts

అన్నట్లు నా కూర లో ఉప్పు ఎక్కువవ్వడం వల్ల ఇటువంటి పొరపాట్లని ఫిక్స్ చేయడానికి ఉపాయాల పై ఓ చిన్నపాటి డిస్కషన్ జరిగింది. కొందరు బంగాళ దుంప వేయమంటే కొందరు కొబ్బరి కోరు వెయ్యమన్నారు ఇంకొందరు dough bolls అంటే ఆటా గొధుమపిండి లాంటివి ఉండల్లా చేసి వెయ్యమని చెప్పారు. మీకు కూడా తెలిసిన చిట్కాలేమన్నా ఉంటే కామెంట్ల లో షేర్ చేసుకోండి.

మంగళవారం, అక్టోబర్ 07, 2008

మా ఊరు ఒక్క సారి (పంట చేల)--పాలగుమ్మి

ముందుగా తన టపా ద్వారా ఈ పాటను పరిచయం చేసిన సిరిసిరిమువ్వ గారికి నెనర్లు. ఆపై ఎక్కడ దొరుకుతుంది అని అడిగితే నాదవినోదిని గురించి చెప్పి పాలగుమ్మి వారి ఫోన్ నంబరు ఇచ్చిన సి.బి.రావు గారికి నెనర్లు. నేను ఇండియా వెళ్ళినప్పుడు పాలగుమ్మి వారితో మాట్లాడి నాదవినోదిని నాగరాజు గారి నంబరు తీసుకుని, సరిగ్గా వచ్చే ముందు రోజు అప్పటికే 36 గంటలు గా స్వల్ప విరామం తో చేసిన ప్రయాణాన్ని లెక్క చెయ్యకుండా... మరుసటి రోజు అమెరికాకు చేయాల్సిన 20 గంటల ప్రయాణాన్ని కూడా మరచి బాగ్‌లింగంపల్లి లో నాగరాజు గారి ఇల్లు వెతికి పట్టుకుని ఈ కేసేట్ సంపాదించాను.

కానీ ఇంతా శ్రమపడి "తాళం వేసితిని కానీ గొళ్ళెం మరిచితిని" అన్న చందాన కేసెట్ సంపాదించాను కానీ నా దగ్గర ప్లేయర్ లేదన్న విషయం విస్మరించాను. అంటే నిజానికి అమెరికా లో ఓ కేసెట్ ప్లేయర్ కొనుక్కోడం ఎంత సేపు లే, ఇప్పుడు ఐపాడ్ లు గట్రా వచ్చాయ్ కాబట్టి కేసెట్ ప్లేయర్ లు తక్కువ ధర లో దొరుకుతుండి ఉంటాయ్, అనే నిర్లక్ష్యం కూడా ఒక కారణం లెండి. తీరా ఇక్కడికి వచ్చాక ఎక్కడ వెతికినా కేసెట్ ప్లేయర్ అని అడగగానే నన్నో ఆదిమానవుడ్ని చూసినట్లు చూసి ఇంకా అవి ఎక్కడ దొరుకుతున్నాయ్ అని నన్నే ఎదురు ప్రశ్నించడం మొదలు పెట్టారు. ఆఖరికి ఈ రోజే బెస్ట్‌బై లో చివరగా మిగిలి ఉన్న ఒకే ఒక్క కేసెట్ వాక్మన్ తెచ్చి ఇపుడే ఈ పాట వినగానే పడిన కష్టమతా మర్చిపోయాను. అందుకే వెంటనే టపాయించేస్తున్నాను.


Maa Uru okka saari...


పాలగుమ్మి విశ్వనాథం గారు రచించి, స్వరపరచి గానం చేసిన ఈ పాట మనకోసం.

ఓహొ ఓ...ఓ...ఆ.ఆ...ఆ.ఆ...

పంట చేల గట్ల మీద నడవాలి..
ఊహలేమొ రెక్కలొచ్చి ఎగరాలి.. ||పంట చేల||
మా ఊరు ఒక్క సారి పోయి రావాలి..
జ్ఞాపకాల బరువు తో తిరిగి రావాలి..||మా ఊరు||

ఒయ్యారి నడకలతో ఆ ఏరు..
ఆ ఏరు దాటితే మా ఊరు ||ఒయ్యారి||
ఊరి మధ్య కోవెలా కోనేరు..
ఒక సారి చూస్తిరా తిరిగి పోలేరు..
ఊరి మధ్య కోవెలా కోనేరు..
ఒక సారి చూస్తిరా వదిలి పోలేరు..

||పంట చేల......తిరిగి రావాలి||

పచ్చని పచ్చిక పైనా మేను వాల్చాలి...
పైరగాలి వచ్చి నన్ను కౌగిలించాలి...||పచ్చని||
ఏరు దాటి తోట తోపు తిరగాలి...
ఎవరెవరో వచ్చి నన్ను పలకరించాలి... ||ఏరు దాటి||

మా ఊరు ఒక్క సారి పోయి రావాలి..||2||

చిన్ననాటి నేస్తాలు చుట్టూ చేరాలి...
మనసువిప్పి మాట్లాడే మనుషుల కలవాలి...||చిన్ననాటి||
ఒకరొకరు ఆప్యాయతలొలకబొయ్యాలి...
ఆగలేక నా కన్నులు.. చెమ్మగిల్లాలి...||ఒకరొకరు||

పంట చేల గట్ల మీద నడవాలి..
ఊహలేమొ రెక్కలొచ్చి ఎగరాలి.. ||పంట చేల||
మా ఊరు ఒక్క సారి పోయి రావాలి..
జ్ఞాపకాల బరువు తో తిరిగి రావాలి..||మా ఊరు||
ఓహొ హో...ఓ..ఒ..ఒ..ఒ..ఓ....||2||

నాదవినోదిని కేసెట్ మరియూ సిడీ ల కోసం సంప్రదించ వలసిన చిరునామా.

నాగరాజు 040-27676526
HIG Block 6, Flat 16.  
Near Sundarayya park, Baglingampally Hyderabad-500044 
Email : hemavathi_57@rediffmail.com

సోమవారం, సెప్టెంబర్ 29, 2008

ఫిల్టర్ కాఫీ / కాఫీ ఫిల్టర్

శీర్షిక చూసి ఇదేదో మంచి కాఫీ లాంటి టపా చదువుదాం అని వస్తే, మీరు తప్పులో కాలేసినట్లే ముందే హెచ్చరిస్తున్నా కాబట్టి చదివి మీరు తెచ్చుకునే తలనొప్పులకు ఇక నా పూచీ ఏం లేదు (నా లాంటి కాఫీ ప్రియులకి తలనొప్పి కూడా ఒకందుకు మంచిదే!! మరి ఎంచక్కా ఆ వంకతో ఇంకో కప్పు కాఫీ ఎక్కువ తాగేయచ్చు కదా:-). సరే ఏదో ఊసు పోక ఈ రోజు ఉదయం నే చేసిన సాహసం గురించి సరదాగా వ్రాద్దాం అని కూర్చున్నా సో తీరిక ఉంటే చదవండి.

నేను ఇండియా వెళ్ళినప్పుడు చెన్నై అయితే వెళ్ళాను కానీ చాలా బిజీ స్కెడ్యూల్ అవడం వల్ల శరవణ భవన్ లో ఫిల్టర్ కాఫీ తాగే అవకాశం దొరక లేదు. కానీ అక్కడ ఉన్నంత సేపూ తలచుకుంటూనే ఉన్నా. అక్కడ నుండి గుంటూర్ వచ్చాక ఈ సారి తీసుకు వెళ్ళాల్సిన వాటిలో కాఫీ ఫిల్టర్ మర్చిపోకుండా చేర్చమ్మా అని చెప్పా. దాందేముంది రా మన ఇంట్లో ఉన్నది ఎలాగు వాడటం లేదు అది ఇప్పుడే సూట్కేస్ లో పెట్టేసుకో అని అమ్మ ఇచ్చేసింది. మా ఇంట్లో అందరూ టీ ప్రియులు లెండి నేను ఒక్కడ్నే కాఫీ కి అంకితమయ్యా... మొత్తం మీద అలా మర్చిపోకుండా తీసుకు వచ్చిన ఫిల్టర్ ని వాడటానికి ఈ రోజే తీరిక దొరికింది.

ఎలా వాడాలి అనే బేసిక్ ట్రైనింగ్ టెలిపోన్ లో అల్రెడీ ఓ నేస్తం దగ్గర తీసుకుని ఉండటం తో "జయమ్ము నిశ్చయమ్ము రా భయమ్ము లేదు రా... " అనుకుంటూ మొదలు పెట్టాను. ముందు నీళ్ళు మైక్రోవేవ్ లో వేడి చేయాలి దానికోసం ఒక ప్లాస్టిక్ గ్లాస్ లో నీళ్ళు పోసి ఓ ప్లాస్టిక్ స్పూన్ వేసి ఓవెన్ లో పెట్టా (మైక్రో వేవ్ ఓవెన్ లో నీళ్ళు యధాతధం గా వేడి చేయకూడదు ఓ స్పూనో స్టిర్రరో వేసి చేయాలి అని వీడియోలతో మరీ చెప్పారు కదా అది వంట పట్టించుకున్నా లెండి అందుకే ముందు జాగ్రత్త) కానీ ఓ 3 నిముషాలు ఆగి చూస్తే ఆ స్పూన్ కాస్తా వంగి పోయి ఉంది.

హతవిధీ ఆదిలోనే హంసపాదా అనుకుని సరే ఆ వంగిన ప్లాస్టిక్ స్పూన్ కరిగి పోయి ఏ కెమికల్స్ నీళ్ళలో కలిసి ఉంటాయో అని అనుమానం వచ్చి అవన్ని పడేసి ఈ సారి పింగాణీ కప్ దాన్లోకి ఒక స్ట్రాంగ్ స్పూన్ పడేసి కాసింత తక్కువ టైం వేడి చేసా. నీళ్ళు వేడయ్యే సరికి ఫిల్టర్ లో ఒక స్పూన్ కాఫీ పౌడర్ వేసి దాని పైన రెండో
ఫిల్టర్ పెట్టి రెడీ చేసి, ఆ వేడి నీళ్ళు ఫిల్టర్ లో పోసి మూత పెట్టేసా. ఇక అక్కడ నుండి మొదలు నా కష్టాలు.

ఫిల్టర్ అంతా స్టీల్ అదీ కాక Airtight ఎక్కడ ముట్టుకున్నా కాలి పోతుంది కనీసం ఒక పక్కకి జరపడానికి కూడా లేదు. పొనీ హేండిల్ ఏమన్నా ఇచ్చాడా అంటే అదీ లేదు ముందు ఇది ఇలా డిజైన్ చేసిన వాడ్ని తన్నాలి అనుకున్నా పోని చల్ల బడే వరకు ఆగుదాం అంటే మనకి ఆత్రం ఆగి చావదు. ఏదైనా గుడ్డ తోనో లేదా పేపర్ టవల్ తోనో ట్రై చేద్దాం అంటే ముందు గ్రిప్ దొరకడం లేదు దానికి తోడు మొత్తం Airtight అవడం వల్లనేమో రెండు కంపార్ట్మెంట్ లు పైన మూత అన్నీ బిగుసుకు పోయి కదిలి చావడం లేదు, లోపలేం జరుగుతుందో తెలీడం లేదు.

ఓ రెండు నిముషాల పాటు "బావగారు బాగున్నారా" సినిమాలో శ్రీహరి సీసా మూత తీయడానికి చేసే ప్రయత్నం గుర్తు చేసుకోండి ఇంచు మించు అదే రేంజ్ లో తిప్పలు పడ్డా... మరో రెండు నిముషాలు "తమ్ముడు" సినిమాలో అవధాన్లు మాష్టారి దుష్యంతుడు పాఠం గుర్తొచ్చింది. బాణం గాట్టిగా లాగాడు... రాలా !!... మళ్ళీ లాగాడు...బాణం లో నుంచి చెయ్యొచ్చింది కాని బాణం రాలా!!.. అదే టైప్ లో గాట్టిగా లాగాను కానీ చేయి జారిపోయింది కానీ మూత రాలేదు కింద కంపార్ట్మెంటూ రాలేదు !! అలా ఓ అయిదు నిముషాలు కుస్తీ పట్టాక వేసుకున్న
టీషర్ట్ ని కాఫీ షర్ట్ చేస్తూ హఠాత్తు గా ఊడి వచ్చేసింది.

అయ్యో రామా మొత్తం అంతా ఒలికి పోయిందా మళ్ళీ పెట్టాలా అనుకుని చూస్తే ఏదో కాస్త షర్ట్ మీదా నేల మీద కిచెన్ టాప్ మీదా చిందిందనే కానీ మళ్ళీ చేయాల్సిన అవసరం రాలేదు, బ్రతుకు జేవుడా అనుకుంటూ
అవన్ని క్లీన్ చేసి, 3 వంతులు పాలు ఓ వంతు డికాక్షను కలిపి కాసింత చక్కెర వేసి మళ్ళీ కాసేపు వేడి చేసి. చివరగా కాఫీని మంచి నురగ వచ్చేలా స్టీల్ గ్లాస్ లోకి ఇంకో కప్ తోటి తిరగ కొట్టి వేడి వేడి ఫిల్టర్ కాఫీ ని ఆస్వాదించేసా. ఈ చివర తిరగకొట్టడం అనబడు ఘట్టం అతిముఖ్యం స్పూన్ తో తిప్పినా Ikea లో దొరికే Milk frother లాంటి టూల్స్ వాడినా ఇలా ఒక కప్ నుండి ఇంకో కప్ లోకి తిరగ కొడితే వచ్చే టేస్ట్ కానీ అలాంటి నురగ కానీ రాదు.

నే తెచ్చిన కాఫీ ఫిల్టర్ & నే చేసిన ఫిల్టర్ కాఫీ

ఏ మాటకామాటే చెప్పుకోవాలి ఎంత కష్ట పడైనా ఫిల్టర్ కాఫీ నే మళ్ళీ
తాగాలనిపిస్తుంది కాని ఇంచు మించు సరి సాటి అని చెప్పుకునే ఇన్స్టంట్ జోలికి ఇక వెళ్ళ బుద్ది కావడం లేదంటే నమ్మండీ. ఇంకో విషయం కూడా ఏంటంటే ఈ స్టీల్ కి కాఫీ కి ఏదో కనెక్షన్ ఉండీ ఉంటుంది. అరిటాకులో వేసి ఇచ్చిన వేడి వేడి పెసరట్టు అరిటాకు రసం పీల్చి మరింత రుచి గా తయారయినట్లు స్టిల్ ఫిల్టర్ లో, స్టీల్ గ్లాస్ ల్లో ఏదో ప్రత్యేకమైన రుచి ని సంతరించుకుంటుంది మన కాఫీ. ఇది వరకు ఇక్కడి electric coffee maker లో చేసిన ఫిల్టర్ కాఫీ ఇంత రుచి గా లేకపోడమే అందుకు నిదర్శనం.

సో అదనమాట నా ఫిల్టర్ కాఫీ కధ, ఇంకెందుకాలశ్యం వెళ్ళి ఓ మంచి ఫిల్టర్ కాఫీ తాగేయండి.

మళ్ళీ మరో టపా లో కలుద్దాం శలవ్.

సోమవారం, సెప్టెంబర్ 15, 2008

బ్లాగ్లోకానికి, బ్లాగ్‌మిత్రులకు నమస్సుమాంజలి...

బ్లాగ్లోకానికి బ్లాగ్‌మిత్రులకు నమస్సుమాంజలి... గత నెల రోజులు గా నా నుండి కొత్త టపా లేక పోయినా అపుడపుడు ఇటు విచ్చేసి వ్యాఖ్య లతో పలకరించి ప్రోత్సహంచిన మిత్రులందరికీ శతకోటి నమస్సులు. నేను మధ్యలో ఒకటీ అరా టపా లు అతికష్టం మీద చదివినా వ్యాఖ్య వ్రాసే సమయం లేకపోయింది. కంప్యూటరు తో గడప గలిగిన కాస్త సమయం లో ఏదో ఒక ఆఫీసు పని ఉండటం తో పాటు Internent Speed సరిగా లేక పోడం తో ఎక్కువ సమయం వెచ్చించ లేకపోయాను.

ఏదేమైనా నెల రోజుల శలవులు ముగించుకుని ఈ రోజే తిరిగి చికాగో చేరుకున్నాను. నేను డిల్లీ నుండి బయలుదేరే రోజే అక్కడ పేలుళ్ళు జరగడం బాధాకరం, Aug 11th ఉదయం అభినవ్ బింద్రా బంగారు పతకం గెలుచుకున్నాడన్న వార్త తో భారత మీడియా నాకు స్వాగతం పలికిందని సంతోషించే లోపే Sept 13th డిల్లీ పేలుళ్ళ వార్త తో వీడ్కోలు పలకడం బాధాకరమైన విషయం.

మొత్తం మీద నా ట్రిప్ అద్యంతమూ దేవుడి పాలనలో వరుణదేవుడు కురిపించిన ఎడతెరిపి లేని వర్షాలలోను, మా బంధువులు ఆత్మీయులు కురిపించిన అత్మీయ, అనురాగ వర్షపు జల్లులలోనూ, ఇంకా అకాల వర్షాల వల్ల పంట చెడిపోయిందనో సకాలం లో ఎరువులు అందలేదనో రైతన్నల ఆగ్రహ జల్లులలోనూ తడిసి ముద్దయి పోయా... ఇక నా అభిమాన హీరో "ప్రజారాజ్యం" ఆవిష్కరణని అందరితో కూర్చుని ప్రత్యక్ష ప్రసారం చూడటం కూడా ఓ మరువలేని అనుభూతి. ఈ నెల రోజులలోనూ మోయలేనన్ని బోలెడు అనుభూతులు, జ్ఞాపకాల వల్లనో :-) లేకా అనునిత్యం తిన్న విందు భోజనాల వల్లనో (ఇదే అసలు కారణం లెండీ) కానీ ఓ 3 కిలోల బరువు కూడా పెరిగాను.

రానున్న పది రోజులలోనూ మెల్లగా ఆఫీసు లోనూ, బ్లాగ్లోకం లోనూ ఉన్న back log లను కవర్ చేసి తిరిగి టపాయించడం మొదలు పెడతాను అంతవరకూ నిన్న ప్రయాణమయ్యేప్పుడు నా మదిలో మెదిలిన ఈ పాట మీకోసం.



చిత్రం : సిరివెన్నెల
గానం : యస్ పి బి, పి సుశీల
సంగీతం : కె వి మహదేవన్
సాహిత్యం : సిరివెన్నెల సీతారామ శాస్త్రి

ఆ... ఆ...
పొలిమేర దాటిపోతున్నా, ఓ గువ్వలచెన్నా!
పొరుగూరికి చేరిపోతున్నా, ఓ గువ్వలచెన్నా!
కధ మారే రోజులు మారేనూ, ఓ గువ్వలచెన్నా!
కల తీరే దారులు వెతికేనూ, ఓ గువ్వలచెన్నా!

ఆ... ఆ...
ఆ... ఆ...

గుళ్ళో నిను చూడలేకున్నా, ఓ గువ్వలచెన్నా!
గుండెల్లో దాచుకున్నాలే, ఓ గువ్వలచెన్నా!
ఏ సీమలొ తిరుగాడినా, ఓ గువ్వలచెన్నా!
నీ దీవెనలందించాలన్నా, ఓ గువ్వలచెన్నా!
ఓ..ఓ..ఓ...ఒ.ఒ.ఒ.ఓ..
ఆ..ఆ..ఆ..అ.అ.అ.ఆ..

శుక్రవారం, ఆగస్టు 08, 2008

ఈ మాసపు పాట :-) నా జన్మ భూమి

ఓ వారం క్రితం వరకూ రోజులో చాలా భాగం బ్లాగులోనే గడిపిన నేను గత వారం రోజులు గా అంతా కలిపి ఒక గంట రెండుగంటలకన్న ఎక్కువ గడిపి ఉండను. ఏదో వెలితిగా వుంది కానీ హటాత్తు గా ఆఫీస్ పని ఎక్కువవడం నా ఇండియా ట్రిప్ దగ్గర పడటం తో ఆ ఏర్పాట్లు... వెరసి బ్లాగ్లోకం లో గడిపే సమయానికి కోత విధించక తప్ప లేదు. నేను ఆగస్ట్ 11 నుండి సెప్టెంబరు 13 వరకు ఇండియా లో ఉంటాను మధ్య లో ఒక 10 రోజులు అక్కడ నుండే పని చేసినా ఇండియా లో ఉంటున్నా కాబట్టి నెల రోజులు శలవు గానే పరిగణించాలేమో. ఇక నేను ఇండియా లో ఉన్న అన్ని రోజులు బ్లాగు రాసే తీరిక ఉండక పోవచ్చు. శలవుల మధ్యలో అప్పుడప్పుడూ వ్యాఖ్యల ద్వారా పలకరించడానికి ప్రయత్నిస్తాను. మళ్ళీ ఇక్కడికి వచ్చాక అంటే సెప్టెంబర్ 15 తర్వాత వింతలూ విశేషాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు శలవు. ప్రస్తుతానికి I am busy with arrangements and pretty excited about my India trip అందుకే ఈ మాసపు పాట (Song of the month) సిపాయి చిన్నయ్య నుండి "నా జన్మ భూమి" విని ఆనందించండి.

1 Naa Janma Bhoomi...


చిత్రం : సిపాయి చిన్నయ్య
సంగీతం : యం.యస్.విశ్వనాథన్
సాహిత్యం : ఆరుద్ర
గానం : ఘంటసాల

నా జన్మ భూమి...భూమి...భూమి...
నా జన్మ భూమి...భూమి...భూమి...
నా జన్మ భూమి ఎంత అందమయిన దేశము
నా యిల్లు అందులోన కమ్మని ప్రదేశము
నా సామిరంగ హాయ్ హాయ్ నా సామిరంగ

||నా జన్మ||

నడిచే దారిలో నవ్వే పువ్వులు
శాంతి నాదాలతో ఎగిరే పిట్టలు
అహహా అహా అహహా ||2||
నడిచే దారిలో నవ్వే పువ్వులు
శాంతి నాదాలతో ఎగిరే పిట్టలు
పచ్చనీ పంటలు వెచ్చనీ జంటలు
చల్లనీ జీవితం ఇదే నవభారతం
హాయ్ హాయ్ నా సామిరంగ హొయ్ హొయ్ నా సామిరంగ

||నా జన్మ||

బతకాలందరు దేశం కోసమె
దేశమంటేను మట్టికాదోయ్ మనుషులె
అహహా అహా అహహా ||2||
బతకాలందరు దేశం కోసమె
దేశమంటేను మట్టికాదోయ్ మనుషులె
స్వార్ధమూ వంచనా లేనిదే పుణ్యమూ
త్యాగమూ రాగమూ మిశితమే ధన్యమూ
హాయ్ హాయ్ నా సామిరంగ హొయ్ హొయ్ నా సామిరంగ

||నా జన్మ||
నా సామిరంగ హాయ్ హాయ్ నా సామిరంగా

శనివారం, ఆగస్టు 02, 2008

పూవులేవి తేవే చెలీ

అదే సమయం లో వచ్చిన మరో అందమైన లలిత గీతం.. సురస.నెట్ నుండి మనందరికోసం.

Poovulevi Teve Che...


పూవులేవి తేవే చెలీ పోవలే కోవెలకూ ||3||

తుమ్మెద కాలూననివీ, దుమ్ము ధూళి అంటనివి ||2||
కమ్మగ వలచేవి, రకరకమ్ముల వన్నెలవీ ||2||

|| పూవులేవి ||

ఆలసించెనా, పూజా వేళ మించిపోయెనా ||2||
ఆలయమ్ము మూసి పిలుపాలింపడు నా విభుడూ ||2||

|| పూవులేవి ||

మాలలల్లుటెపుడే? నవమంజరులల్లేదెపుడే ||2||
ఇక పూలే పోయాలి తలబ్రాలల్లే స్వామి పైన ||2||

|| పూవులేవి ||

గురువారం, జులై 31, 2008

అమ్మ దొంగా నిన్ను చూడకుంటే !!

ఓ నాల్రోజులు గా ఎందుకో ఈ పాట పదే పదే గుర్తొస్తుంది. ఈ పాట సాహిత్యమో లేదా mp3 నో దొరుకుతుందేమో అని వెతుకుతుంటే ఓ నెల క్రితం సుజాత(గడ్డిపూలు) గారు కూడా ఈ పాట గుర్తు చేసుకోడం చూసాను. మొత్తం మీద నా కలక్షన్ నుండి తవ్వి తీసి సాహిత్యం తో పాటు వినడానికి లింక్ కూడా ఇస్తే అందరూ మరో సారి ఈ మధురమైన పాట ని ఆస్వాదిస్తారు, తెలియని వాళ్ళకి పరిచయం చేసినట్లూ ఉంటుంది అని ఈ రోజు ఈ పాట ఇక్కడ మన అందరి కోసం. పాలగుమ్మి గారి సాహిత్యం వేదవతీ ప్రభాకర్ గారి గానం తో ఈ పాట చాలా హాయైన అనుభూతినిస్తుంది.

Amma Donga Ninnu C...


సాహిత్యం: పాలగుమ్మి విశ్వనాథ్
సంగీతం : పాలగుమ్మి విశ్వనాథ్
గానం : వేదవతీ ప్రభాకర్

అమ్మ దొంగా నిన్ను చూడకుంటే.. నాకు బెంగా.. ||2||
కొంగట్టుకు తిరుగుతూ ఏవో ప్రశ్నలడుగుతూ ఊ..ఊ..ఉ..
నా కొంగట్టుకు తిరుగుతూ ఏవో ప్రశ్నలడుగుతూ
కల కలమని నవ్వుతూ కాలం గడిపే నిన్ను... చూడకుంటే.. నాకు బెంగా...

||అమ్మ దొంగా||

కధ చెప్పే దాకా కంట నిదుర రాకా...
కధ చెప్పే దాకా నీవు నిదుర బోకా...
కధ చెప్పే దాకా నన్ను కదలనీక....
మాట తోచనీక...మూతి ముడిచి చూసేవు...

||అమ్మ దొంగా||

ఎపుడో ఒక అయ్య నిన్నెగరేసుకు పోతె...
నిలువలేక నా మనసు నీ వైపే లాగితే...
ఎపుడో ఒక అయ్య నిన్నెగరేసుకు పోతె...
నిలువలేక నా మనసు నీ వైపే లాగితే...
గువ్వ ఎగిరి పోయినా గూడు నిదుర పోవునా...||2||

||అమ్మ దొంగా||

నవ్వితే నీ కళ్ళు ముత్యాలు రాలు...
ఆ నవ్వే నిను వీడక ఉంటే అది చాలు...
నవ్వితే నీ కళ్ళు ముత్యాలు రాలు...
ఆ నవ్వే నిను వీడక ఉంటే పది వేలు..
కలతలూ కష్టాలు నీ దరికి రాకా
కలకాలము నీ బ్రతుకు కలల దారి నడవాలి
కలతలూ కష్టాలు నీ దరికీ రాకా
కలకాలము నీ బ్రతుకు కలల దారి నడవాలి...

||అమ్మ దొంగా||

బుధవారం, జులై 30, 2008

గంగామహల్ రిచ్చా(క్షా)బండి పిడుగురాళ్ళ...

శీర్షిక చూసి కాసింత కన్‌ఫ్యూస్డ్ ఫేస్ పెట్టేసి మనోడేంటీ రాజకీయాల్లోకి గానీ ఎళ్తన్నాడంటావా ఈ మధ్య బజారయ్య, రిచ్చాబండి అని టపాలు వ్రాస్తున్నాడు....అని మీలో మీరే కొస్చెనింగ్ సేసుకుంటున్నారా...? ఏం భయపడకండి నేను రాజకీయాల్లోకి అస్సలు వెళ్ళబోడం లేదు... ఇది ఆ బాపతు టపా కానే కాదు !! మీరు నిర్భయం గా చదవచ్చు... సరే ఇక విషయం లోకి వస్తే... మీరు ఏప్పుడైనా సినిమా హాలు దగ్గర్లో ఉన్న ఇంట్లో ఉండటం జరిగిందా ? అంటే ఈ మధ్య కాదు కానీ కనీసం ఓ పదేళ్ళ కి ముందు. నాకు పిడుగురాళ్ళ లో ఉన్నప్పుడు ఆ అదృష్టం పట్టింది, నేను 7, 8 తరగతులు అక్కడే చదువు కున్నాను లెండి. మా నాన్న గారు అప్పటికీ చాలా ఆలోచించి హాలు పక్కనే ఉంటే రోజుకి నాలుగు ఆటలు స్టీరియో ఫోనిక్ సౌండ్ లో వినాల్సొస్తుంది అని కొంచెం దూరమైతే ఏ సమస్యా ఉండదని గంగామహల్ సినిమ హాలు ఎదురు సందు లో కొంచెం దూరం గానే అంటే ఓ పది ఇళ్ళు లోపలకే ఓ ఇల్లు అద్దెకు తీసుకున్నారు.

కొత్త ఊరు, కొత్త ఇల్లూ, కొత్త పరిచయాలు, కొత్త ఫ్రెండ్స్ అంతా బావుంది ఇల్లు కూడా బావుండేది L ఆకారం లో ఉండి ఇంటి లోపలే కొంత ఓపెన్ స్పేస్ ఉండి ఆకాశం కనిపిస్తూ ఆరు బయట పడుకున్నట్లు ఉండేది ఇంకా పూర్తి గా కావాలంటే ఎంచక్కగా డాబా మీదకి వెళ్ళచ్చు పడుకోడానికి. లోపలే సూర్య రశ్మి కి కొరత ఉండక పోడం తో సన్నజాజి పొద ఇంకా కొన్ని పూల మొక్కలు కూడా ఉండేవి. ఆహా అంతా అద్భుతం అనుకునే సమయం లో మెల్లగా గమనించాం అసలు విషయం. ఇప్పుడు ధ్వని కాలుష్యం అని చాలా వరకు నగరాల్లో నిషేదించారు కానీ ఓ పదేళ్ళ క్రితం వరకు కూడా ఇ సినిమా హాలు రిక్షాబండ్లు మంచి జోరు మీద ఉండేవి.

మైకు లో పెద్ద వాల్యూం లో పాటలు పెట్టుకుని మధ్య మధ్య లో "నేడే చూడండి... మీ అభిమాన ధియేటర్లో... ఆంధ్రుల అభిమాన నటుడు నట ___ ఫలానా హీరో నటించిన ఫలానా చిత్రం... తప్పక చూడండి..... అని చెవులు ఊదర గొట్టే ఈ బండ్లు మన తెలుగు వారందరికీ చిరపరిచితమే. ఇక వీరు సినిమా గురించి చేసే వర్ణన వింటుంటే ఒకో సారి చూద్దాం అనుకున్న సినిమా కూడా అమ్మో అలా ఉంటుందా అయితే చూడకపోడమే మంచిదేమో అనిపించేలా చేస్తాయ్. నేను నరసరావుపేట్ లో ఉన్నపుడు అమ్మ వాళ్ళకి తెలీకుండా వీటి వెనక పరుగెట్టి పాంప్లెట్ లు సంగ్రహించిన రోజులు కూడా ఉన్నాయనుకోండీ అప్పట్లో అదో తుత్తి అది వేరే విషయం. మాకు ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే...

ఈ రిక్షా బండి వాడు పొద్దున్నే హాలు బయట బండి నిలబెట్టి, ప్రస్తుతం ఆడుతున్న సినిమా లో పాటలు హిట్ అయితే ఆ సినిమా పాటలు లేదంటే వేరే ఏవో ఒక హిట్ అయిన పాటలు వేసే వాడు. పిడుగురాళ్ళ చిన్న ఊరు ఎంత నిదానం గా ప్రతి వీధి కి తిరిగినా మొత్తం ఊరంతా తిరగడానికి రిక్షాలో ఒక అరగంట, గంట కన్నా ఎక్కువ సమయం పట్టదు. కాబట్టి ఊరంతా తిరిగి ప్రచారం అయిపోయాక ఇక మిగిలిన టైం అంతా బండి ని హాలు ముందు నిలబెట్టి వాడి ప్రతాపం ఆ చుట్టు పక్కల ఇళ్ళలో ఉండే మా లాంటి వాళ్ళ మీద చూపించే వాడు. వీడు మరీను ఇందులో బాధ ఏముంది, ఇదేదో బాగానే ఉంది కదా ఉచితం గా రోజు పాటలు వినిపిస్తుంటే ఏంటి వీడి బాధ అని అనుకుంటున్నారా... ఒకే పెద్ద సౌండ్ తో చెవుల్లో ఆపకుండా హోరెత్తే ఆ పాటలు భరించడం మానవ మాత్రుల వల్ల కాదండీ బాబు... మా అదృష్టం బావుండి మంచి పాటలు ఉన్న సినిమా వస్తే గుడ్డిలో మెల్ల లా కాస్త పర్లేదు కానీ చాలా సార్లు ఘోరమైన పాటలతో చావగొట్టే వాడు.

ఒకో సారి ఎప్పుడైనా శలవు రోజులోనో లేకా పండగ రోజుల్లో ఇంట్లో కాస్త పూజ లేట్ అయిందంటే ఇక చూస్కోండి ఇక్కడ మంత్రాలు హారతి గంటలూ... వీటిని డామినేట్ చేస్తూ నేపధ్యం లో నేమో డబ్బింగ్ పాటలు ఇంకా వాటిలో మధ్య మధ్య వచ్చే చిత్ర విచిత్రమైన మూలుగులతో ప్రత్యక్ష నరకం కనపడేది. మేము ఘోరం గా బలి అయిన పాటలలో ప్రేమసాగరం పాటలు ఒకటి కొన్ని పాటలు బానే వుంటాయ్ కానీ ఎంతైనా చాలా రోజులు అవే పాటలు పదే పదే అంత పెద్ద వాల్యూం తో విని భరించడానికి బోలెడు ఓపిక కావాలి. ఈ బాధ భరించ లేక ఆ లొకాలిటీ లో ఉన్న వాళ్ళు అందరూ కలిసి హాలు వాడికి మొర పెట్టుకుని ఈ హింస ప్రతి షో కి ముందు ఒక అరగంట మాత్రమే ఉండేలా ఒక ఒప్పందం చేసుకున్నారు. ఆ టైము లోకూడా కాస్త సౌండ్ తగ్గించి పెట్టడం తో కాస్త విముక్తి పొందాము.

పిడుగురాళ్ళ తో అనుబంధం గా ఉండే ఇంకో జ్ఞాపకం నాటకాలు, 16mm సినిమాలు, కోలాటం. ఆ ఊరి గ్రామ దేవత గంగమ్మ. ఆవిడ గుడి కూడా పెద్దదే ఉండేది ఆవరణ ఇంకా గుడి బయటా చాలా ఖాళీ స్తలం ఉండేది. ఇప్పుడు ఇంకా ఉందో లేదో తెలీదు. గంగమ్మ గుడి జాతర సమయం లో ఇవన్నీ చూసాను. కోలాటం చాలా బావుండేది అంత మంది మధ్యన చక్కని rhythm and coordination చూడముచ్చటగా ఉండేది. ఇంకా ఇక్కడే నాకు ఊహ తెలిసిన తర్వాత మొదటి సారి నాటకం చూసాను అంటే బాగా చిన్నపుడు మా నాన్న గారు ఒకసారి వేస్తుంటే నేను కూడా వెళ్ళాను కానీ గుర్తు లేదు. పిడుగురాళ్ళలో చూసిన నాటకం పేరు గుర్తు లేదు కానీ తెరలు, సన్నివేశాన్ని పట్టి క్షణం లో మారే background తెర, ఆ తెర వెనక నటీ నటులు వాళ్ళ మేకప్ గొడవ ఇదంతా ఇంకా జ్ఞాపకం ఉంది.

ఇక పోతే 16mm సినిమా, గుడిగంటలు అనే పాత సినిమా చూసాను. నేనైతే సినిమా కంటే ఎక్కువ ప్రొజెక్టర్నే ఆసక్తి గా చూసిన జ్ఞాపకం. ఒక చిన్న లెన్స్ దగ్గర కేంద్రీకృతమై బయల్దేరిన కాంతి పుంజం వందల కాంతి రేఖలు గా విడివడి క్రమ క్రమం గా విస్త రిస్తూ తెర అంతా పరచుకోడం. ఇంకా ప్రొజెక్టర్ కీ తెర కి మధ్య ఉన్న దుమ్ము మీద పడే కాంతి లో సీన్ ని పట్టి వెలుగు నీడలు మార్పులు చెందుతూ ఉంటే చూడటానికి అద్భుతం గా వుండేది. ఇంకా ప్రొజెక్టర్ కి అభిముఖం గా నిలబడి లెన్స్ లోకి చూడటం కూడా భలే ఉండేది. అంటే వెలుతురు వల్ల ఎక్కువ సేపు అలా చూడ లేం కానీ నేను అప్పుడప్పుడు ఎదురు గా వెళ్ళి చూడటానికి ప్రయత్నం చేసేవాడ్ని. తెర వెనక వైపుకి వెళ్ళి అటునుండి చూస్తుంటే కూడా భలే ఉండేది. మొదట గా చూసినప్పుడు పెద్ద గా తేడాలేదు రా అనుకున్నాం కానీ నిశితం గా పరికించి చూసాక కుడి ఏడమైతే పొరపాటు లేదోయ్ అని పాడుకున్నాం.

ఈ రోజుకి అవీ కబుర్లు మళ్ళీ మరికొన్ని కబుర్లతో త్వరలో కలుద్దాం,
అంత వరకు శలవ్,

--వేణు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.