వేసవి శలవల్లో మండే ఎండలలో మధ్యాహ్నం పన్నెండు గంటల సమయం లోనో లేదా మూడు గంటల సమయం లోనో చల్లని ఈ పుల్ల ఐస్ చప్పరిస్తుంటే ఆ ఆనందం మాటలలో చెప్పతరమా చెప్పండి. అసలు ఈ రుచి ఎరుగని జన్మ ఒక జన్మేనా అనిపిస్తుంది నిజంగా. తర్వాత తర్వాత ఐస్క్రీములు వచ్చి వీటి అమ్మకానికి గండి కొట్టాయ్ కానీ నా చిన్నతనం లో ఇవే రారాజులు. వీధిలో కేక వినబడగానే ఏ పని చేస్తున్నా వెంటనే అలర్ట్ అయిపోయే వాడిని. ఒకో రోజు కాస్త పెద్ద వాళ్ళు మాత్రమే తీసుకు రాగలిగే రెండు చక్రాల చిన్న తోపుడు బండి లో తెచ్చేవాడు. ఆ బండి భలే ఉండేది చెక్కతో చేసిన పెద్ద పెట్టె, దాని లోపల థర్మోకోల్ అట్టలూ, పింక్ లేదా ఎర్రని ప్లాస్టిక్ బబుల్ రాప్‍తో బాగా ఇన్సులేట్ చేసి వాటి సాయం తోనే పెట్టెని అరలు గా విభజించి ఆ అరల్లో రక రకాల ఐస్ఫ్రూట్ లు నింపి తెచ్చే వాడు. అంత పెద్ద పెట్టెకూ పైన ఒక వృత్తాకారపు చిన్న మూత మాత్రమే ఉండేది. ఆ మూత తీసి ప్లాస్టిక్ కాగితాలు అలా పక్కకి జరిపి కేవలం రెండు మూడు చేతులు మాత్రమే పట్టే ఖాళీ లో చేయిపెట్టి, వాడు డబ్బా లోకి చూడకుండ్ blindfold ఆడుతూ, మనం అడిగిన రకాన్నిబట్టి చేతిని ఒకో వైపు తిప్పి మనకి కావాల్సిన ఐస్ఫ్రూట్ బయటకి తీసి పట్టుకోగానే ఇక మన ఆనందానికి అవధులు ఉండవు. ఇదంతా ఒక ఎత్తైతే డబ్బా పై రంగు రంగుల ఆకర్షణీయమైన బొమ్మలూ కొన్ని బండ్లకు ఉండే చిన్న సైజ్ గంట ఒకటీ మరో ప్రత్యేకమైన ఆకర్షణ.ఈ బండి దగ్గర కొనాలంటే మనం రోడ్డు మీదకి వెళ్ళాలి కదా అలా కాకుండా దాదాపు మన అంత వయసే ఉన్న ఓ చిన్న కుర్రాడు లోపల అంతా థర్మాకోల్ అట్టలతో ప్లాస్టిక్ కవర్ తో ఇన్సులేట్ చేసిన బ్రిటానియా బిస్కట్ డబ్బా లో పెట్టి దానికి ఒక తాడు కట్టుకుని భుజాన మోసుకుంటూ అమ్మటానికి తెచ్చే వాడు. వాడైతే చక్కగా మన గుమ్మం ముందుకే
వచ్చిఇస్తాడు. ఎఱ్ఱ ఐస్, తెల్లని పాలైస్, ద్రాక్షా ఐస్, కొబ్బరి ఐస్, సేమ్యా ఐస్, ఇలాచీ ఐస్, మ్యాంగో ఐస్ ఇలా ఒకో సమ్మర్ కి ఒకో కొత్త రకం తెచ్చేవాడు. ఎన్ని రకాలు ఉన్నా గోల్డ్ స్పాట్(ఇది అప్పట్లో దొరికే కోలా, ఈ రుచి ఇప్పుడు దొరికే వాటిలో ఎక్కడా నాకు తగల్లేదు, కాస్త ఆరెంజ్ రుచి అనుకోవచ్చు, ఇప్పటి పిల్లలికి తెలియాలి అంటే మిరిండా రుచి అని చెప్పచ్చేమో!) లాంటి రుచితో వచ్చే ఎఱ్ఱ ఐస్ మాత్రం నా ఫేవరెట్, దాని తర్వాత ఇష్టమైనది పాలైస్, ఎప్పుడైనా వేరే ఫ్లేవర్ ప్రయత్నించాలి అంటే గోల్డ్ స్పాట్ ఐస్ మిస్ అవుతానే అని తెగ ఫీల్ అయ్యే వాడ్ని నా బాధ చూడ లేక అమ్మ "సరే రెండూ కొనుక్కో రా.." అని పర్మిషన్ ఇచ్చేది ఒకో సారి :-)ఎఱ్ఱని గోల్డ్ స్పాట్ ఐస్ సాదా గా ఉండేది, ఇలాటి సాదా ఐస్ ల లోనే తర్వాత తర్వాత ద్రాక్ష, ఆరెంజ్, మామిడి, యాలుకలు ఇలాటి రుచులు తెచ్చేవాడు ఇవన్ని రుచి వేరైనా ఆకారం ఒకే రకంగా దీర్ఘ చతురస్రాకారపు క్యూబ్ ల్లా ఉండేవి పైన బొమ్మ లో చూపినట్లు. వీటికి భిన్నంగా సన్నగా, షడ్బుజాకారం లో సిలిండర్ లా ఉండి తెల్లగా మెరిసి పోయే పాలైస్ రుచి మాత్రం అద్భుతం గా ఉండేది. అప్పట్లో ఇది ఖరీదు ఎక్కువ కూడా, మాములు ఐస్ అర్ధరూపాయి ఉంటే ఇది రూపాయి ఉండేది. కాని రుచి మాత్రం యమా ఉండేది లెండి ఆ ఆకారం కూడా ఇంక మళ్ళీ దేనికి ఉపయోగించలేదు. కొన్నాళ్ళ తర్వాత మాములు బార్ షేప్ లో కూడా పాలైస్ తెచ్చే వాడు. దీనికే ఒక చివర కొబ్బరి కోరు అద్దితే కొబ్బరి ఐస్, సేమ్యాలు అద్దితే సేమ్యా ఐస్, యాలుకల పొడి అద్దితే ఇలాచి ఐస్. ఇలా అద్దడం కాకుండా ఒకోసారి పొడవుగా కోసిన కొబ్బరి ముక్కలు రెండు పెట్టి కూడా చేసే వాడు కొబ్బరి ఐస్, అలాగే ద్రాక్ష రుచి ఉన్న ఐస్ లో చివర రెండు ద్రాక్షాలు వచ్చేలా చేసే వాడు. సేమ్యా ఐస్ లో కూడా చివర అద్దడం కాకుండా ఐస్ అంతా నిండుగా సేమ్యాలు నింపి చేసే వాడు.
నాకు ఈ సేమ్యా ఐస్ ఎలా చేస్తారో ఎప్పటికీ అర్ధమయ్యేది కాదు. నీళ్ళలో సేమ్యా వేయగానే నీళ్ళు ఐస్ లా గడ్డ కట్టే లోపే సేమ్యా అడుగుకి వెళ్ళి పోతుంది కదా ఐస్ అంతా పరుచుకుని ఉండేలా సేమ్యాలతో ఎలా తయారు చేస్తాడా అని తెగ ఆలోచించే వాడ్ని, బహుశా కాస్త గడ్డ కట్టడం మొదలయ్యాక కలుపుతాడేమో లే అని సరిపెట్టేసుకున్నా... తర్వాత కొన్ని రోజులకి ప్యాకెట్ ఐస్ బాగా ఫేమస్ అయింది. ఈ పక్కన చూపించినట్లు పొడవాటి సన్నని ప్లాస్టిక్ ప్యాకెట్ లో రక రకాల రుచులు గల నీరు నింపి ఫ్రీజ్ చేసి తెచ్చే వాడు మనకి ఇచ్చేటప్పుడు దానికి ఒక మూల బ్లేడ్ తో కోసి అందించే వాడు ఎందుకనో మా ఇంట్లో ఈ ఐస్ కొనుక్కోడానికి ఒప్పుకునే వారు కాదు. సో ఇది మనం డబ్బులు దాచుకుని సీక్రెట్ గా బడిదగ్గర ఇంటర్బెల్ లో మత్రమే కొనుక్కోవాలనమాట. కాని ఆ అవకాశం మనకొచ్చింది బహుస్వల్పం మొత్తం మీద దీని రుచి పెద్దగా చూడకుండానే నేను స్కూల్ దాటేశాను. ఆ తర్వాత ఇవన్నీ మోటైపోయి చిన్న చిన్న పేపర్ కప్పుల్లో నాజూకుగా చెక్క స్పూన్ లతో తినే ఐస్క్రీములు ఫేమస్ అయిపోయాయి. క్వాలిటీ ఈ ఐస్క్రీమ్ మార్కెట్టును దీర్ఘకాలం ఏలింది అనుకుంటా ఆ తర్వాత అరుణ్ వచ్చేది. అప్పట్లో వీటిని మార్కెట్ చేయడానికి మాములు కప్ లు కాకుండా వాలీ బాల్ ఆకారం లో చేసిన కప్ లు కూడా వచ్చేవి క్వాలిటీ వాడివి, కానీ ఎందుకో నాకు ఐస్ నచ్చినంతగా ఐస్క్రీమ్ లు నచ్చక పెద్దగా ఫాలో అవలేదు... ఏదేమైనా పుల్లైస్ కి ఉండే రుచి ఈ ఐస్క్రీములకి ఎక్కడిది చెప్పండి.
ఇలా నేను కమ్మటి ఊహలలో ఉండగా హఠాత్తుగా వాస్తవం కరిచింది... ఈ ఐస్క్రీముల పుణ్యమో ఏమో కానీ అలాంటి ఐస్ అమ్మే చిన్న పిల్లలు తర్వాత కాలం లో ఎప్పుడూ కనిపించ లేదు, బహుశా ఇప్పుడు అసలు రావట్లేదేమో మరి. వాడు తెచ్చే ఐస్ రుచి గా ఉన్నా, వాడ్ని చూస్తే జాలేసేది. ఇప్పుడు తలచుకుంటే మరీ పాపం అనిపిస్తుంది. వాడిది మనలాగే వేసవి శలవలను ఆనందంగా ఆడుకుంటూ గడప వలసిన బాల్యం అన్న స్పృహ నాకు అప్పట్లో తక్కువే ఉండేది కానీ. ఐస్ లు నింపిన బరువైన బ్రిటానియా డబ్బాని భుజాన మోస్తూ, నిండు వేసవి మండుటెండ లో దదాపు కరిగిపోయిన తారు రోడ్, అరిగిపోయి చిల్లులు పడ్డ స్లిప్పర్స్ లో నుండి వాడి లేత అరికాళ్ళపై తన ప్రతాపాన్ని చూపిస్తుంటే, పరుగో నడకో అర్దం కాని నడక తో వాడు ఇంటింటికీ తిరిగే వాడు. పాపం భుజాన అన్ని ఐస్ఫ్రూట్ లు ఉన్నా దాహం తీర్చుకోవాలంటే ఎవరన్నా ఇంట్లో వాళ్ళు ఇచ్చే గుక్కెడు మంచినీళ్ళే గతయ్యేవి. ఒకోసారి నాతో పాటు మా వీధిబడి లో చదివే పిల్లలు కూడా ఇలా అమ్మడానికి వచ్చేవారు. వాళ్ళ అవస్థలు తలచుకుంటే ఈ పుల్లైస్ లు ఇపుడు తక్కువగా దొరకడమే మంచిదైందేమో అనిపిస్తుంటుంది.
















