అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

అందమైన బాల్యం

మధురమైన జ్ఞాపకాలతో అందమైన బాల్యాన్ని నా సొంతం చేసినందుకు అమ్మానాన్నలకు ఎప్పుడూ ఋణపడి ఉంటాను. మొదటి సంతానాన్నవడంతో నేనాడిందే ఆట పాడిందే పాట అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళినా మా ఇంట్లో అయినా అపురూపంగా గడిచింది. పాడుకున్న పాటలు, ఆడుకున్న ఆటలు, స్కూల్ ఎగ్గొట్టడానికి వేసిన వేషాలు, తిన్న చిరుతిళ్ళు, నాన్న వేలు పట్టుకుని కొట్టిన షికార్లు, 16mm సినిమాలు కబుర్లు ఇక్కడ చదవచ్చు.

ఇంటర్మీడియెట్ హాస్టల్ కబుర్లు

నూనూగు మీసాల నూత్న యవ్వనం అమ్మానాన్నలకు దూరంగా నాదంటూ ఓ స్వంత ప్రపంచం. అప్పటివరకూ ప్రతి చిన్న పనికి వాళ్ళమీద ఆధారపడి ఒక్కసారిగా నాకు నేనే నెగ్గుకు రావాల్సిన పరిస్థితులను తలుచుకుని దిగులు. అంతలోనే చుట్టూ ఉన్న స్నేహితులతో నేస్తం కట్టేసి చేసిన అల్లర్లు, పరోఠాల బిజినెస్సులు, చెరకుతోట దొంగతనాలు, ఆడ్మినిస్ట్రేటర్ కి మస్కాగొట్టి చూసిన సినిమాలు, సరదా కొంటె కబుర్లు ఇక్కడ చూడండి.

ఇంజనీరింగ్ కాలేజ్

ఇంటర్మీడియెట్ కి రెసిడెన్షియల్ హాస్టల్ కనుక పంజరంలో పక్షిలా బతికితే ఇంజనీరింగ్ కాలేజ్ యూనివర్సిటీ హాస్టల్స్ లోకి వచ్చేసరికి ఒక్కసారిగా జూలోనుండి పచ్చని అడవిలోకి వదిలేసిన జింక పరిస్థితే అయింది, ఎక్కడికి పరుగులెట్టినా ఏం చేసినా అడిగేవాళ్ళులేరు. అసలు హాస్టల్ బిల్డింగ్ లో నిరంతరం కాపుకాసే వార్డెన్ ఉండడనే విషయం నాకు డైజెస్ట్ కావడానికి నెలపట్టింది :-) నిజమా అలా ఎలా సాధ్యం అని ఇప్పటికీ అనిపిస్తూనే ఉంటుంది. అంతటి స్వేఛ్చాప్రపంచంలో చేసిన అల్లర్లు కొన్ని కబుర్లు ఇక్కడ.

సినిమాలు రివ్యూలు..

నాకున్న అతి పెద్ద వ్యసనం సినిమా చూడడం రిలీజైన ప్రతి అడ్డమైన సినిమా చూసేసి ఈబొమ్మలో చూపించినట్లు తెలుగు సినిమాని భుజాల మీద మోసేవాళ్ళలో నేనొకడ్ని. చూసి ఊరుకోకుండా ఇది ఇందుకు బాలేదు అది అందుకు బాగుంది అంటూ పేద్ద వంద సినిమాలు తీసేసి విశ్రమిస్తున్న మేధావిలా చేసే విశ్లేషణలు :-) హహహ చదివిన ఒకరిద్దరు అలా తిడతారు కానీ నా దృష్టిలో ఒక సాధారణ సినీ ప్రేక్షకుడు చూసొచ్చి మిత్రులతో చెప్పే కబుర్ల లాంటి నా సినీ రివ్యూలు ఇక్కడ చదవండి. ఆరెంజ్, ఖలేజా, కృష్ణం వందే జగద్గురుం లాంటివి కొన్ని ఎక్కువమంది ఆదరణ పొందాయ్.

శనివారం, నవంబర్ 27, 2010

శబ్బాసు రా భరణీ...

“ఎవడ్రావీడు భరణి గారంతటి వారిని ’రా’ అంటాడా ఎంత కండకావరం” అంటూ చొక్కా చేతులు మడిచి యుద్దానికి వస్తున్నారా ? రండి రండి నాకేం భయంలేదు. మీరేమన్నా అనుకున్నా మా దొరబాబుని, పాతసామాన్లోడ్ని, నానాజీని, తోటరాముడ్ని, మాణిక్యంగాడ్ని, చేపలక్రిష్ణగాడిని నేను రా అనే అంటాను. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మా తనికెళ్ళ, ఎక్కడికి వెళ్ళినా తన మూలాలని మరచిపోని మా భరణి కూడా నన్నేమి అనడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్టార్ డమ్ సాంపాదించుకున్న విలక్షణమైన నటుడు తనికెళ్ళభరణి అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఆయన హాస్యపాత్ర పోషిస్తే నవ్వని వాళ్ళుండరు, ఓ తండ్రిగానో బాబాయ్ గానో చేస్తే హుందాగా ఒదిగిపోతారు, ఇక ‘ఆమె’ సినిమాలో లాంటి దుష్టపాత్రలో కనిపిస్తే చూస్తున్న మనకే సినిమా అన్న విషయం మరచిపోయి వెళ్ళి వాడిని పట్టుకు నాలుగు తన్నాలనిపించేలా జీవించేస్తారు.

“సీతతో అదంత వీజీ కాదు” అంటూ నచ్చిన అమ్మాయిని ఎలా లవ్లో పడేయాలా అని ప్రయత్నాలు చేస్తూ పక్కవాళ్ళ సలహాలు విని భంగపడే అమాయకపు దొరబాబు గా, చివరికి తన మామ దుర్భుద్ది తెలిసి అతనికి గడ్డిపెట్టే పాత్రలో తన మొదటి సినిమా “శ్రీకనకమాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్” తోనే నన్ను ఆకట్టుకున్నారు. తర్వాత “చెట్టుకిందప్లీడర్” లో రాజేంద్రప్రసాద్ గుక్కతిప్పుకోకుండా తనకారు గొప్పతనం గురించి పేజీలు పేజీలు డైలాగులు చెప్తుంటే వాటన్నిటికీ సమాథానంగా “పాత సామాన్లు కొంటాం” అని ఒకే ఒక్క డైలాగ్ తో  నన్ను కుదురుగా కుర్చీలో కూర్చోనివ్వకుండా నవ్వించి నా  మనసులో కామెడీ ఆర్టీస్ట్ గా చెరగని ముద్ర వేసుకున్నారు. అంతలోనే “శివ” సినిమా లో నానాజీ గా ఓ వైవిధ్యమైన గెటప్ మరియూ డైలాగ్ డెలివరీతో “అఛ్చా!! భరణి కామెడీ ఆర్టిస్ట్ మాత్రమేగాదు మంచి నటుడు” అని మనందరిచేతా శబాష్ అనిపించుకున్నాడు.
   

ఇక అక్కడనుండి... వంటింట్లో అన్నం, పిల్లల చేతిలో ఐస్క్రీం లాంటివి దొంగిలిస్తూ తన పెళ్ళి జైల్లో జరగాలని కలలుకనే “చిలిపిదొంగ” గా అల్లరి చేసినా, “నాకో బుల్లి చెల్లి.. నేడే గల్లీలో దానికి పెళ్ళి.. ఇది జరగాలి మళ్ళీ మళ్ళీ” అంటూ తోటరాముడుగా లొల్లి చేసినా, “వారెవా ఏమి ఫేసు” అంటూ మాణిక్యంగా ఖాన్ దాదాని మాటల్తో మాయచేసినా, లాయర్ సాబ్ గా గాయంలో మాచిరాజుకి చట్టానికి దొరక్కుండా దందాచేసే సలహాలిచ్చినా, ఇంద్రన్న నమ్మిన బంటు వాల్మీకి గా యావన్మందినీ మెప్పించినా, భార్యని అమితంగా ప్రేమిస్తూ ఏనాటికైనా అసెంబ్లీ లో కొరమీనంత మైకట్టుకొని “అద్దెచ్చా” అనాలనుందంటూ చేపలకృష్ణగా అదరగొట్టినా చూస్తున్న మనం నటుణ్ణి  మర్చిపోయి ఆయా పాత్రల్లో మాత్రమే లీనమయ్యేలా చేయడం తనికెళ్ల భరణి గారి గొప్పతనమే. కమర్షియల్ సినిమాల్లో పాత్రలేకాకుండా తిలదానం, గ్రహణం లాంటి చిత్రాలలో సైతం మంచి పాత్రల్లో మనని రంజింప చేశారు. ఇలా తలుచుకుంటుంటే ఈ జాబితాకు అంతే ఉండదు, ఆయన చేసిన పాత్రలన్నీ కళ్ళముందు సజీవంగా కదులుతున్నాయి.     

నటుడికన్నా ముందు ఒక మంచి రచయిత అయిన భరణి నటుడిగా బిజీ అయ్యాక మాట మాట్లాడితే కలం మడిచి జేబులో పెట్టేశానని అంటుంటారు కానీ ఆ కలానికి సాగటమే తప్ప ఆగటం తెలీదు. తెలిస్తే తెలంగాణా యాసలో ఇంత చక్కటి శివస్తుతిని పలికించగలిగేదా. మొన్న తనకి జరిగిన వెండి పండుగ సభలో చదివి వినిపించిన “శబ్బాసు రా శంకరా” నాకు చాలా నచ్చేసి మళ్ళీ మళ్ళీ వినడానికి mp3 గా మార్చుకుని మీతో కూడా పంచుకుందామని ఇదిగో ఇక్కడ ఇస్తున్నాను చిత్తగించండి. దీన్ని పైరసీ అనచ్చేమో నాకు తెలీదు కానీ నన్నడిగితే మాత్రం అభిమానమనే అంటాను. క్రింద ప్లేయర్ లోడ్ అయ్యాక ప్లేబటన్ నొక్కి భరణి గారు తన స్వరంతో వినిపించిన ఈ శివస్తుతి వినవచ్చు, ఆడియో డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ నొక్కండి.


 శంకర అంటెనే నాకు 
శెక్కెర లెక్కనె ఉంటదయ్య
శివునాఙ్ఞైతది చీమనైత 
శబ్బాసురా శంకరా
“శివునాఙ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటూ” శంకరునికి పరమ విధేయత కల్గిన ప్రాణిగా మనకి పరిచయమైన చీమతో తనని తాను పోల్చుకుంటూ అలానే ఈశ్వరునితో పోలిస్తే తను చీమంత అల్పుణ్నని ఒద్దికగా చెప్తూనే చక్కెర వైపు చీమ ఆకర్షింప బడినట్లు నీవైపు నేనాకర్షింపబడతాను అదికూడా నీ ఆఙ్ఞమేరకే అని చెప్పడం ఎంత బాగుంది.
***
గణపతి దేవుడు నీకు బిడ్డ 
ఖబరస్థానేమో నీ అడ్డ
నీతత్వాల్ బాడత కాళ్ళమీద బడ్డా 
శబ్బాసురా శంకరా
***
ఆధాచంద్రమ నెత్తిమీద 
నీలో ఆధానేమో అమ్మాయే
పూరా ఙ్ఞానివి నీకు సాటెవరురా 
శబ్బాసురా శంకరా
***
పెండ్లామా పెద్దమ్మతల్లి 
గంగెంట ఏందీ లొల్లి
మూడుకండ్లుంటెనె రెండు ఇండ్లాయెరా 
శబ్బాసురా శంకరా
***
పెద్దోన్కెమో సిద్ధి బుద్ధి 
చిన్నోన్కి దేవమ్మ శ్రీవల్లి
నీ ఖాన్దాన్ మొత్తం ఇద్దరే ఇద్దరా 
శబ్బాసురా శంకరా
***
బైటికి బండబూతివి 
అర్ధంగాని లోలోతివి
కరిగే రాతివి పరంజ్యోతివి 
శబ్బాసురా శంకరా
***
“నాకా రావయ ఓనమాలు 
బిల్ కుల్ రాదు చందస్సు
నువ్వే యతివి గణాలు సుట్టుముట్టూ 
శబ్బాసురా శంకరా”
ఛందస్సులోని యతిని గణాలను తీసుకుని ఈశ్వరునిలోని యతికి ఆతని ప్రమధ గణాలకు ఇంత చక్కగా లంకేసి సర్వం ఈశ్వరమయమని తనచే పలికించేది వాడే అని ఎంత అందంగా చెప్పాడు. 
***
కన్ను దెరిస్తె నువ్వే 
కన్నులు మూస్తెభి నువ్వే
మా కండ్లల కారు చీకటుల కారణమేందిరా.. 
శబ్బాసురా శంకరా

బిడ్డా ఇది పాపిష్టిలోకము 
దీన్ని నేనే జూడ మీకెందుకు
అనిమాకన్నులు మూసిపెట్టినవు లే 
శబ్బాసురా శంకరా
కళ్ళు మూసినా తెరిచినా కారుచీకట్లే ఏమీ కనపడదంటూ కళ్ళలో నీళ్ళుకారడానికి బదులు చీకట్లు కారు తున్నాయి అని అంటూ ఒక్క పదానికి ఎన్ని భావాలు. 
***
కారటుదీస్తది సిల్క 
పనులైతై పైసలిమ్మంటదీ
ఇది కాకింటది కావు కావంటది 
శబ్బాసురా శంకరా
హ హ జాతకం కార్డు తీసిన చిలక నీ పనులవుతాయి పైసలివ్వవోయ్ అని అడిగితే పైన ఎగురుతున్న కాకి ఇది  విని తన కావ్ కావ్ అనే అరుపులతో ఆపనులు కావుకావు నమ్మద్దని చెప్తున్నదని భరణి చమత్కారం :-) శెబ్బాస్ అనిపించుకోక ఏముంది.
***
క్వాయిష్ ఒక్కటె నాకు ఎప్పటికీ 
కైలాసమెటు బోవుడో
కాశీబోవుడు కాలిపోవుడూ 
శబ్బాసురా శంకరా

******

భరణి వెండి పండుగ వీడియో ఇక్కడ చూడవచ్చు. తన ప్రసంగం 11ని:25సె కు మొదలౌతుంది. తనికెళ్ళ భరణి గారి ప్రసంగం చివరలో 26ని:32సె. దగ్గర తెలుగు భాషకు మాత్రమే ప్రత్యేకమైన సాహితీ ప్రక్రియ పద్యం అని చెపుతూ, శ్రీకృష్ణదేవరాయలు గారు అల్లసాని పెద్దనని కవిత్వం లక్షణాలు ఎలా ఉండాలి అని అడిగితే పెద్దన గారు ఆశువుగా చెప్పిన “పూతమెరంగులన్” పద్యమును భరణిగారు చదివిన తీరు పండితులను పామరులను సమానంగా ఆకట్టుకుంటుంది అంటే అతిశయోక్తి కాదేమో. 


ఇటీవలే వెండి పండుగ జరుపుకున్న మా తనికెళ్ళ భరణి నిండు నూరేళ్ళూ మరెన్నో వైవిధ్యభరితమైన పాత్రలు పోషిస్తూ మరిన్ని మంచి రచనలు చేయాలనీ, ఆ శక్తినీ, ఆసక్తినీ, ఆయుష్షునీ ఆకళామతల్లి తన ముద్దుబిడ్డకు ఆశీస్సులుగా అందజేయాలని మనసారా కోరుకుంటూ శలవు.

ఆదివారం, నవంబర్ 21, 2010

బ్లాగ్వన భోజనాలకు నావంతు :-)

జ్యోతిగారు బ్లాగ్ వన భొజనాలకు ఆహ్వానాన్నందించారు బాగానే ఉంది కానీ మన వంతుగా మనం ఏం తీసుకు వెళ్దాం అని కాస్సేపాలోచించానా అంతలో మనల్ని పదో తరగతి నుండి ఇలాంటి వన భోజనాలు లేదా పాట్ లక్ లలో ఆదుకుంటున్న సరంజామా గుర్తొచ్చింది. అవును కదా మరి అందరూ వంటలే చేసుకొస్తే ప్లేట్లు, కట్లెరీ ఎవరు తెస్తారు అని వెంటనే అవి పట్టుకొద్దాం అని నిర్ణయించేసుకున్నా :-D మాములుగా ఇదివరకు అలవాటైన ప్లాస్టిక్ సామాగ్రి పట్టుకొద్దామంటే ఈ మధ్య పర్యావరణం పై మక్కువ పెరిగింది అదీకాక కాస్తంత గ్రాండ్ గా కూడా ఉంటుందని మన బ్లాగర్లందరి కోసం వెండి కంచాలు, బంగారు పూతపూసిన కట్లెరీ తీసుకువచ్చాను అందుకోండి. అహా మాకు మ్యాచింగ్ మ్యాచింగ్ కావాలి అంటారా అలాగే వెండి కట్లెరీ కూడా ఆ చివర్న ఉన్నాయ్ చూడండి.

వెండి కంచాలు
బంగరు పూత పూసిన కట్లెరి
వెండి కట్లెరీ
సరే మరి పేపర్ టవల్స్ ఎక్కడ బాబు అంటారా ? చెప్పాను కదండీ పర్యావరణ కాలుష్య నివారణార్థం ప్లాస్టిక్ మరియూ పేపర్ ఉపయోగం నిషిద్దం. కాబట్టి నామాట విని ఈ సారికి మీ మీ కర్చీఫ్ లకో, చున్నీలకో, పైట చెంగులకో పని పెట్టేయండి అవేవీ అందుబాటులో లేవంటే ఓ మహత్తరమైన చిట్కా ఏంటంటే ఎవరూ గమనించకుండా స్టైల్ గా ఫ్యాంట్ జోబులో చేతులు పెట్టుకుని లోపల వైపున్న గుడ్డకి తుడిచేసుకోండి :-D ఏదో సరదాగా రాసా, నో అఫెన్స్ ప్లీజ్.

రాత్రి ఇక్కడి వరకే టైప్ చేసి ఉదయాన్నే పోస్ట్ చేసేద్దాం అనుకున్నా కానీ ఉదయాన్నే కాస్త తొందరగా పదింటికి లేచి ఆత్మారాముడ్ని శాంతింప చేద్దామని ఆలోచిస్తుంటే అవును ఇదెందుకు బ్లాగ్ లో పెట్టేయకూడదూ అనిపించింది. ఆలోచనొస్తే ఊరుకుంటామా, మరి నేను చేసిన ఈ స్టీందోశ కూడ రుచి చూసి వెళ్ళండి. అంటే మరి హోటల్లో చేసే స్టీందోశ ఎలా చేస్తారో నాకు తెలీదు మరి దీన్ని స్టీందోశ అనచ్చోలేదో కూడా నాకు తెలీదు. నేను చేసుకునే ఈ దోశ ప్రత్యేకత ఏంటంటే అస్సలు నూనె వాడకపోవడం ఇంకా పెనం పైన మూత పెట్టి ఆవిరితో కూడా ఉడికించడం. అందుకే దీన్ని నేను స్టీందోశ అని పిలుచుకుంటాను, ఎప్పుడైనా ప్రత్యేకమైన అకేషన్ కు నెయ్యివేసి పలచగా కరకరలాడేలా చేసిన దోశలు తిన్నా, సాధారణంగా నాకు ఇలా స్టీం చేసుకునే దోశలంటేనే ఇష్టం, కాస్త పలచగా పోసి ఎక్కువ కాలిస్తే ఇవికూడా కరకరలాడుతాయండోయ్.

నేనైతే మా ఇంటిదగ్గరలోని బేకరీలోనో కిరాణా కొట్టులోనో దొరికే రెడీమేడ్ దోశపిండి కొనుక్కొని వచ్చి చేస్తాను. ఓపిక ఉన్నవాళ్ళు ఒక వంతు మినప్పప్పుకు ఒకటింపావు వంతు బియ్యం ఓ ఐదుగంటలు నాన పెట్టి మిక్సీలో రుబ్బుకుని మెత్తని దోశ పిండి తయారు చేసుకోవచ్చు. వంటలో కార్బోహైడ్రేట్స్ తగ్గించాలనుకునే వాళ్ళు మినప్పప్పు ఎక్కువ వేసి బియ్యం తగ్గించుకోవచ్చు కాకుంటే దోశలు కాస్త గట్టిగా వస్తాయి అవి మెత్తబడాలంటే మిక్సీలోవేసేముందు కాసిన్ని మెంతులు కలుపుకోవచ్చు కాకుంటే రుచి కొద్దిగా మారుతుంది. ఇక బియ్యం ఎక్కువేసిన ఈ పిండి ముందు రోజు రాత్రే రడీ చేసుకుని ఒక ఐదారు గంటలు పులవనిచ్చి ఉదయాన్నే దోశలు వేసుకుంటే పుల్లట్లు బ్రహ్మాండంగా వస్తాయి కానీ ఐదుగంటలైన వెంటనే ఫ్రిజ్ లో పెట్టటం మరిచి ఎక్కువ పులిస్తే రుచి పాడైపోతుంది కనుక జాగ్రత్తగా ఉండాలి. నేను కొనుక్కొచ్చిన పిండికి కాసిని నీళ్ళు కాస్తంత ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకుంటాను, ఎప్పుడైనా పిండి మరీ తాజాగా ఉండి అస్సలు పులవలేదు అనిపిస్తే కాస్త పెరుగు కానీ మజ్జిగ కానీ కలుపుతుంటాను.

మనం నూనె కూడా వాడట్లేదు కనుక నాన్ స్టిక్ దోశల పెనం ఉపయోగిస్తే దోశలు పెనానికి అంటుకోకుండా చక్కగా వస్తాయి . ఇక మొదటి దోశ ఎప్పుడూ సరిగా రాదు అంటూ ఉంటారు చాలామంది కానీ గ్యాస్ మంటను మీడియం కన్నా కాస్త తక్కువలో ఫోటోలో చూపినట్లుగా  పెట్టి ఓపికగా పెనం సరైన ఉష్ణోగ్రతకు చేరుకునే వరకూ ఎదురు చూస్తే మొదటి దోశ ఐనా పెనంకు అంటుకు పోకుండా చక్కగా వస్తుంది. ఈ సరైన ఉష్ణోగ్రత తెలుసుకోడానికి నేను పెనం పై ఇంచుమించు మూడు అంగుళాల దూరంలో అఱచేయి బోర్లించి చేతికి వేడి తగిలేదీ లేనిదీ చూస్తాను. అలా పెనం వేడెక్కాక ఒక గరిటెతో దోశపిండిని పెనం మధ్యలో వేసి గరిటె అడుగుభాగంతో పిండిపై నెమ్మదిగా నొక్కుతూ పిండిని గుండ్రంగా పెనం అంతా పరచుకునేలా తిప్పాలి. ఆ వెంటనే పెనం పైన దోశను పూర్తిగా కవర్ చేయగల మూతను బోర్లించాలి, ఈ మూత గాజుదైతే దోశ స్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి సులువుగా ఉంటుంది. ఈ మూత వలన అవిరికి దోశ పైన కూడ చక్కగా ఉడికినది గమనించి మూత తీసి అట్లకాడతో అంచు వెంబడి మెల్లగా దోశను పెనం నుండి వేరు చేసి ఆపై పూర్తిగా తీసి ప్లేట్లో సర్వ్ చేసుకోవచ్చు దోశను తిరగేయాల్సిన అవసరం ఉండదు. అలా కాదూ రెండు వైపులా ఎక్కువగా కాలిన క్రిస్పీదోశ నాకిష్టం అంటే తిరగేసి రెండోవైపు కూడా కాల్చవచ్చు.

దోశకూ దోశకు మధ్య నూనె/నెయ్యి లో ముంచిన గుడ్డతో కానీ అవి వద్దనుకుంటే తడి గుడ్డతో కానీ సగం కోసిన ఉల్లిపాయతోకానీ పెనం అంతా ఒకసారి రుద్దితే ఉష్ణోగ్రత కాస్త తగ్గి పెనం అంతా సమంగా విస్తరించడం వలన దోశ చక్కగా వస్తుంది. ఇక దోశ పైన పలుచగా గుంటూరు సంబారు కారం చల్లుకోవడమో (మన దగ్గర స్టాకులేదు అందుకే ఫోటోబులో అది మిస్సింగ్) లేదా అసలు పిండిలోనే ఉప్పుతో పాటు కాస్తంత కారం కూడా కలిపేయడమో చేశారంటే ఈ దోశలను చట్నీకూడా అవసరం లేకుండా లాగించేయచ్చు. పై ఫోటోలోనిది ఒక్క చుక్క ఆయిల్ కూడా ఉపయోగించకుండా వేసిన దోశ. That is హెల్తీ దోశ making for dummies :-)

బుధవారం, నవంబర్ 17, 2010

రక్త చరిత్ర - 1

"నా సినిమాలో హింసా రక్తపాతం మాత్రమే ఉంటాయి అవి చూడాలనుకున్న వాళ్ళె ఈ సినిమాకు రండి మిగతావాళ్ళు చూడకపోయినా పర్లేదు" అంటూ వర్మ స్పష్తం చేశాక కూడా రక్త చరిత్ర సినిమా చూడాలా అసలే మనకి హింసాత్మక సినిమాలను భరించడం కష్టం. రక్త చరిత్ర సినిమా విడుదలైన రోజు నా ఆలోచనలు ఇవి కానీ వర్మ మీదున్న అపారమైన అభిమానం తో అసలు కథేమిటో ఎలా తీసాడో తెలుసుకోడానికి ఒక్క సారైనా చూడకపోతే ఎలా అని తెలుగు వర్షన్ కోసం వెతికాను కానీ బెంగళూరు లో రిలీజ్ అవ్వలేదు ఆహ సర్లే ఈ విధంగా తప్పించుకున్నాం అనుకుని ఇక ఆ ఆలోచన వదిలేశాను. అనుకోకుండా ఓవారం క్రితం షో టైమింగ్స్ చూస్తుంటే బెంగుళూరు లో తెలుగు వర్షన్ కూడా విడుదల అయి ఉండటం గమనించిన వెంటనే పరుగున వెళ్ళిపోయాను. థియేటర్ లోపలికి అడుగుపెట్టి పరికించి చూస్తే ఒక మోస్తరు పెద్ద ఆడిటోరియం సగానికి నిండటమే కాక అందులో సగం మహిళా ప్రేక్షకులు ఉండటం నన్ను ఆశ్చర్యపరచింది. ఎంత పిచ్చినా____ని అని తనకు తానే చెప్పుకున్నా, ఎలాంటి సినిమాలు తీసినా వర్మకు ఉన్న అభిమానుల సంఖ్య తగ్గే ప్రసక్తే లేదు అనుకుని నవ్వుకుంటూ నా సీట్లో సెటిలై సినిమా చూడటంలో లీనమయ్యాను.


ఆంగ్ల చిత్రాలు ఒరిజినల్ డివిడి చూసే అలవాటున్న వారు ఎడిషనల్ లాంగ్వేజ్ ఆప్షన్ లో డైరెక్టర్స్ కామెంటరీ అన్న ఆప్షన్ చూసి ఉంటారు ఇందులో సినిమా డైలాగ్ లు చిన్నగా వినిపిస్తూ ఆ షాట్ ఎలా ప్లాన్ చేసిందీ ఎంత కష్టపడింది ఇంకా ప్రేక్షకులు అక్కడ గమనింఛవలసిన అంశాలు ఇత్యాది వివరాలు సినిమా డైరెక్టర్ తన స్వరంతో చెప్తూ ఉంటాడు. ఒకవిధంగా దర్శకుడు దగ్గరకూర్చోబెట్టుకుని తన పాయింట్ ఆఫ్ వ్యూ లో మనకు సినిమా చూపించినట్లనమాట. నాకు ఒక సారి చూసిన సినిమాలు ఇలా డైరెక్టర్స్ కామెంట్ తో చూడటం చాలా ఇష్టం బహుశా దీన్ని చూసి ప్రేరణ పొందారో ఏమో కానీ వర్మ తన వ్యాఖ్యానంతో సినిమా ప్రారంభించారు. చాలాచోట్ల ఈ వ్యాఖ్యానం బాగానే సహాయ పడింది కాని ఒకటిరెండు సార్లు మాత్రం అక్కడ జరుగుతుంది మళ్ళీ ఈయన చెప్పాల్సిన పనేముంది అనిపించింది. ఆమాత్రం విసుగైనా మనకి కలగడానికి కారణం తన కంఠస్వరం. అదే వ్యాఖ్యానాన్ని మరికాస్త ట్రిం చేసి సాయికుమార్ లాంటి మరో గంబీరమైన స్వరం ఉన్న నటుడితో చెప్పించి ఉంటే ఇంకా చాలా బాగుండేది.

ఇంకా సినిమా చూడని వారు సినిమా చూసే ఉద్దేశ్యమున్న వారు నీలిరంగులో ఉన్న ఈ మూడు పేరాల సినిమా కథ చదవకుండా ఉండడం ఉత్తమం. నరసింహారెడ్డికి ముఖ్య అనుచరుడైన వీరభద్రయ్య ఎదుగుదలను చూసి ఓర్వలేని నాగమణి రెడ్డి నరసింహా రెడ్డికి అతనిపై లేనిపోనివి చెప్పి వారిద్దరిని విడదీయడమే కాక నరసింహారెడ్డే వీరభద్రయ్యని నరికేయమని పురమాయించేలా చేస్తాడు. ఎన్నికలలో వీరభద్రయ్య వర్గానికి సానుభూతి దక్కకూడదని వీరభద్రయ్య కుడిభుజమైన మందాని బెదిరించి అతనిచేతే వీరభద్రయ్యని అవినీతిపరుడని ఆరోపింప చేసి దారుణంగా చంపిస్తాడు నాగమణి. తన తండ్రిని చంపింది మందా అయినా చంపించింది నాగమణి, నరసింహ అని తెలుసుకున్న శంకర్ అడవిలో దాక్కుని ఒక్కొక్కరినీ చంపుతూ ఉంటాడు. తండ్రి చావుతో గ్రామానికి వచ్చిన ప్రతాప్ తన అన్న శంకర్ ను కూడా ఎన్ కౌంటర్ పేరిట పోలీసులు పొట్టనపెట్టుకోవడంతో చలించిపోయి తన పట్నంచదువు పక్కన పెట్టి ప్రతీకారంగా నరసింహా, మందా, నాగమణి ముగ్గురిని చంపేస్తాడు. 

నాగమణి కొడుకూ నరరూపరాక్షసుడు ఐన బుక్కారెడ్డి ప్రతాప్ ను వెదికి చంపడానికి చేసిన ప్రయత్నాలు వృథాఅవ్వగా ప్రతాప్ పాపులారిటీకి గండి కొట్టాలని తన పలుకుబడిని పెంచుకోవాలని అధికారం కోసం తన అన్నను ఎన్నికలలో నిలబెడతాడు. కొత్తగా పార్టీ పెట్టి ఆ ఊరిలో సభపెట్టటానికి వచ్చిన సినీనటుడు శివాజీరావు ను బాంబులతో బెదరగొట్టి వెనక్కి వెళ్ళేలా చేస్తాడు బుక్కారెడ్డి. దాంతో అహం దెబ్బతిన్న శివాజీ రావు బుక్కారెడ్డిని ఎదుర్కోగల ప్రతాప్ ని చేరదీసి "నువ్ చేస్తున్న చెడులో కూడా మంచిని చూసాను కానీ నువ్ అధికారంలేకుండా కేవలం అయుధంతో ఏమీ చేయలేవు బ్రదర్ కనుక నా పార్టీ తరపున బుక్కారెడ్డి అన్నకు పోటీగా ఎన్నికలలో నిలబడు" అని ఆఫర్ చేస్తాడు. నరసింహ ని చంపితే నాగమణి అతన్ని చంపితే బుక్కా ఇలా ఎవరో ఒకరు పుడుతున్నారు కనుక సిస్టం ను బాగు చేయాలంటే తనే సిస్టం అవ్వాలి అని నిర్ణయించుకున్న ప్రతాప్ ఎన్నికలలో నిలబడతాడు.
ఎన్నికలలో ఘన విజయం సాధించిన ప్రతాప్ కు శివాజీరావు మంత్రిపదవి ఇచ్చి గౌరవిస్తాడు. ఘోరమైన ఓటమిని భరించలేక దుఖిస్తున్న బుక్కారెడ్డిని అతను ఎన్నికల సమయంలో చేసిన హత్యల కేసుల్లో అరెస్టు చేయడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ అశ్వని ని చంపేసి జైలు పాలవుతాడు. అలా పోలీసుల కళ్ళెదుట మరో పోలీసాఫీసర్ను చంపి జైలులో ఉన్న బుక్కారెడ్డిని అతనికి ప్రతాప్ పై ఉన్న పగని వాడుకుని తమ పార్టీ ఎదుగుదలకు అడ్డంపడిన ప్రతాప్ ని అంతంచేయాలని పెద్దసారు మరో పెద్దచేతుల త్రినాథరావు సాయంతో బెయిల్ పై విడుదల చేయిస్తాడు. హైదరబాద్ మహేశ్వరి కాంప్లెక్స్ లో ఎవరికీ తెలియకుండా నివసిస్తూ ప్రతాప్ హత్యకు పథకాలు రచిస్తున్న బుక్కారెడ్డిని శివాజీరావు అనుమతితో తన మనుషులను పురమాయించి అతి కౄరంగా హత్య చేయిస్తాడు ప్రతాప్. ఈ హత్యతో శివాజీరావు పార్టీలో కొందరు అసమ్మతి వర్గం ప్రతాప్ ఒక గూండా అని హత్యలు చేసే అతన్ని పార్టీలో ఉంచడానికి వీలు లేదని గొడవచేస్తారు. వారికి సమాధానంగా చంపినది ఒక రావణుడి లాంటి కౄరుడిని అని ప్రతాప్ నారాముడు అని సమర్ధించడమే కాక "శివాజీ రావ్ రాజ్యంలో లో గూండాయిజమనేది కనిపించకూడదు అది అణచి వేయడం మరో పెద్ద గూండా వల్లనే అవ్తుతుంది అది నువ్వే బ్రదర్" అని శివాజీరావ్ ప్రతాప్ కి పూర్తి అధికారం కట్టబెట్టటంతో రాష్ట్రంలో ఒక తిరుగులేని శక్తిగా ఎదుగుతాడు ప్రతాప్. అలా ఎదురు లేకుండా రాష్ట్రాన్ని ఏలుతున్న ప్రతాప్ కు అనుకోని ఒక అడ్డంకి ఎదురైంది ఆ కథ ద్వితీయపర్వంలో అని వర్మ చెప్తుండగా రక్త చరిత్ర-2 ట్రైలర్ తో మొదటి భాగం ముగుస్తుంది.

రెండుగంటల నిడివి గల ఈ సినిమాలో ఒక్క డబ్బున్నోడా పాట తప్ప మరే ఇతర అనవసరమైన సన్నివేశం లేకుండా శరవేగంగా నడిచే కథనంతో ఆద్యంతం ఎక్కడా బోరుకొట్టకుండా నడిపించడంలో వర్మ సఫలమయ్యాడు. అప్పుడే ఇంటర్వెల్ వచ్చిందా అపుడే సినిమా ఐపోయిందా అని అనుకున్నాను. ఈ మధ్య కాలంలో నాకు ఇలా అనిపించిన సినిమాలు చాలా అరుదు. ఇక రక్తపాతం హింస గురించి  ముందునుండీ ప్రచారంలో ఊదరగొట్టడం వలననేమో నాకు మరీ అంత ఎక్కువ అనిపించలేదు, కొన్ని సీన్స్ నెగటివ్ లో చూపించడం,  లాంగ్ షాట్స్, డైరెక్ట్ సబ్జెక్ట్ ని చూపకుండా శబ్దం, చిందిన రక్తం, నటుల హవభావాలతో భీభత్సాన్ని పలికించడం లాటి వర్మ ప్రత్యేకమైన షాట్స్ తో నాకు సగటు ఫ్యాక్షన్ సినిమాలలో ఉన్నహింస కన్న ఏమీ ఎక్కువ లేదు అనిపించింది. ద్వితీయార్ధంలో వయొలెన్స్ పాళ్ళు తక్కువ ఉండటం కూడా నాకిలా అనిపించడానికోకారణం. ఇక విభిన్నమైన కెమెరా యాంగిల్స్, వర్మ స్టైల్ ఆఫ్ టేకింగ్ ప్రతి ఫ్రేమ్ లోనూ కనిపిస్తూ వర్మ అభిమానులను అలరిస్తుంది. ఒక పీరియడ్ ఫిల్మ్ గా వర్మ తీసుకున్న జాగ్రత్తలు అభినందించదగినవి అట్టహాసంగా సుమోలు స్కార్పియోలూ ఉపయోగించకుండా స్కూటర్లు జీప్ లు ఉపయోగించడం ద్వారా చాలా సహజంగా మనం సినిమా కాక ఆసన్నివేశం లో దూరంగా నిలబడి చూస్తున్నామా అన్న అభిప్రాయాన్ని కలిగిస్తాడు. అలానే డిఐ, కాస్ట్యూమ్స్ మరియూ మేకప్ కూడా సహజత్వాన్ని ప్రతిభింబించాయి. ఇవన్ని వర్మ సినిమాలో మినిమం ఎదురుచూసే స్టాండర్డ్స్ వీటిగురించి ప్రత్యేకంగా రాయనక్కర్లేదు అంటారా ఏదో చూసిన సంతోషంలో చెప్తున్నా...

సినిమాలోని ప్రతి పాత్రా ఈసినిమాని తమ నరనరాల్లోకి ఎక్కించుకుని జీవించినట్లు అనిపిస్తుంది ఏంచేశారో కానీ వర్మ అందరినుండీ అలాంటి నటనని రాబట్టుకున్నారు. ప్రతాప్ పాత్రలో వివేక్ లీనమైపోతే బుక్కారెడ్డిగా అభిమన్యు ఒళ్ళు గగుర్పొడిచే కౄరత్వాన్ని పలికించాడు. శివాజీరావు గా శతృఘ్ను అదిరిపోయే మ్యానరిజమ్స్ తో ’బ్రదర్’ ’టాపిక్ ఈజ్ ఓవర్’ లాంటి మాటలు పలకడంలోనూ అలరిస్తారు. నందిని గా చేసిన అమ్మాయి రాధికా ఆప్టే అందం చీరకట్టులో సింపుల్ గా ఉండి ఆకట్టుకుంటుంది, బాణం సినిమాలోని హీరోయిన్ వేదికను గుర్తు చేస్తుంది. కీలకమైన సన్నివేశాలేకాక వీరభద్రయ్య హత్య సన్నివేశంలో మందా వెంటే ఉండి అతనికి రెండో ఆలోచన రానివ్వకుండా అతన్ని ప్రేరేపించడం, భర్తల అకారణ వైరంతో వారి భార్యల మధ్య సంభంధాలు ఎలా మారిపోతాయి, ఫ్యాక్షనిజం రౌడీయిజం రాజకీయ నాయకుల మథ్య సిస్ట్రంలో చేవ ఉన్న పోలీసులు సైతం ఎలా నిస్సహాయులవుతారు ఇలాంటి చిన్న చిన్న సన్నివేశాల చిత్రీకరణ సైతం ప్రత్యేకతతో ఆకట్టుకుంటాయి. సినిమాకు తగిన నేపధ్య సంగీతం సన్నివేశాలకు మరింత ఘాడత చేకూర్చింది కొన్ని చోట్ల రక్త రక్త అంటూ విసిగించినా చాలాచోట్ల ఉపయోగించిన వాయిద్యాలు కానీ శ్లోకాలు కానీ సరైన ఇంపాక్ట్ కలుగజేసాయి అనడంలో ఏమాత్రం సందేహంలేదు. ఇక పాటలంటారా ఇది మాటల సినిమా ఆమాటకొస్తే చేతల సినిమా పాటల సినిమా కాదు కనుక ఆ విషయానికి అంతగా ప్రాముఖ్యత ఇచ్చినట్లు కనిపించదు.

శివాజీరావు పాత్ర గురించి అంతగా గొడవ చేయాల్సిన అవసరం కూడా నాకు ఏం కనిపించలేదు. ఆ పాత్ర అలా ప్రవర్తించడానికి ప్రతాప్ కు సపోర్ట్ చేయడానికి వర్మ సరైన జస్టిఫికేషన్ ఇచ్చాడు. ముల్లును ముల్లుతోనే తీయాలి అన్న సూత్రం అందరికీ తెలిసిందే అందరూ పాటిస్తున్నదే అదే పని శివాజీరావు కూడా చేశాడు. అలాంటి పని అతని గొప్పతనాన్ని ఎందుకు తగ్గిస్తుందో నాకు అర్ధంకాలేదు. నొబడీ ఈజ్ పర్ఫెక్ట్ ఆయన మహానుభావుడైనంత మాత్రాన ఎన్నో మంచి పనులు చేసినంతమాత్రానా ఆ మంచి చేయడనికి అడ్డుపడుతున్న రాక్షసులను తొలగించడానికి పోరాటమార్గాన్ని ఎంచుకోవడం తప్పెలా అవుతుంది. అది కూడా ఒక లీడర్షిప్ లక్షణం అని ప్రజలు ఎందుకు ఒప్పుకోలేకపోతారో నాకెప్పటికీ అర్ధం కాదు. ప్రజాస్వామ్య రాజ్యంలో పోలీసుల అండతో కూడా ఒక ఊరిలోకి అడుగుపెట్టలేని నిస్సహాయ స్థితిలోకి తనని నెట్టివేసిన ఒక రాక్షసుడిని ఎదుర్కోవడానికి ఆయనకి అంతకన్నా మార్గం లేకపోయింది.
మొత్తానికి మరో మంచి సినిమా చూసిన సంతోషం నా మొహంలో ప్రతిఫలిస్తుండగా వర్మ శకంలో పుట్టి అతని సినిమాలు చూస్తూ ఎదుగుతున్నందుకు మరోసారి గర్వపడుతూ ధియేటర్ నుండి బయటకు వచ్చిన నేను ఆ క్షణం నుండే రక్త చరిత్ర రెండవభాగం ఎప్పుడు విడుదల అవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూడటం మొదలు పెట్టాను.

సోమవారం, నవంబర్ 15, 2010

బెంగళూరు పుస్తకోత్సవం 2010

ప్రతి ఏడు ఈ పుస్తకోత్సవాల గురించి వినడమే కానీ వెళ్ళడానికి అస్సలు కుదిరేది కాదు. ఈ సారి ఎలాగైనా వెళ్ళాలి అని సెల్ లోనూ క్యాలెండర్ లోను రక రకాల రిమైండర్లు పెట్టుకుని ఎట్టకేలకు ఈవేళ వెళ్ళిరాగలిగాను. నిజంగా ఇదో మహా ఉత్సవం అద్భుత ప్రపంచం కొన్ని పాత పుస్తకాల స్టాల్స్ తోపాటు కొందరు పబ్లిషర్స్ స్టాల్స్, కొన్ని పుస్తకాల షాపుల స్టాల్స్, కొన్ని ఇంటర్నేషనల్ ప్రత్యేక స్టాల్స్, రామకృష్ణ మఠం స్టాల్, ఇస్కాన్ స్టాల్, ఖురాన్ కి సంభందించిన స్టాల్ మరియూ ఇస్లాం స్టూడెంట్స్ కు ప్రత్యేకమైన స్టాల్. ఇంకా మధ్యలో అక్కడక్కడ పుస్తక పఠనానికి సంబందించిన టూల్స్ స్టాల్, స్టేషనరీ స్టాల్, ఇంటర్నేషనల్ డివిడిల స్టాల్ లాంటి పుస్తకాలకు సంభందించిన వైవిధ్యభరితమైన ప్రదర్శనలతో బాగా ఆకట్టుకుంది. సమయాభావం వలన నేను రెండు గంటలకు మించి గడపలేకపోయాను కానీ కాస్త తీరిక చేసుకుంటే అన్ని భాషల (హిందీ,ఇంగ్లీష్, తెలుగు) పుస్తకాలపై ఇష్టం ఉన్నవారు చాలా సమయం గడపవచ్చు.

డిస్కౌంట్స్ పరంగా గొప్పగా ఉన్నట్లైతే ఏమీ కనిపించలేదు ఇంటర్నేషనల్ స్టాల్ లో మాత్రం యాభై మరియూ వంద రూపాయలకు మంచి కలర్ ఫుల్ ప్రింటింగ్ ఉన్న పుస్తకాలు ఉన్నాయి కానీ వాటిలో నాకు అంతగా ఆసక్తికరమైనవేమీ కనిపింఛలేదు వివరంగా చూడలేదనుకోండి నేను మరికాస్త సమయం గడిపి ఉంటే మరిన్ని వివరాలు ఇవ్వగలిగి ఉండేవాడ్ని. ఏర్పాట్లు అంటే స్టాల్స్, లైటింగ్, కార్పెట్ లాటివి అన్నీ బాగున్నాయి కానీ మొదటి పావుగంట కరెంట్ లేకపోవడం కాస్త విసుగు తెప్పించింది. మంచినీటి సౌకర్యం కూడా నాకు బయటకు  వచ్చేముందు లాంజ్ లోతప్ప ఎక్కడా కనిపించలేదు. బయటకి వచ్చేముందు లాంజ్ లోని చిన్న కేఫ్ లాంటి సెటప్ లో స్నాక్ ఐటంస్, స్వీట్స్, శాండ్విచ్, కార్న్ లాంటివి దొరుకుతున్నాయి.

ఇక తెలుగుకు సంభందించి ఇక్కడ మూడు స్తాల్స్ ఉన్నాయి, ఠాగూర్ పబ్లికేషన్స్, విక్టర్ పబ్లికేషన్స్, విశాలాంధ్ర పబ్లికేషన్స్. ఇంకా ఇస్కాన్ మరియూ రామకృష్ణ మఠం స్టాల్స్ లో అతి కొన్ని తెలుగు రచనలు ఉన్నాయి. కింద ఇచ్చిన బొమ్మలో తెలుగు పుస్తకాల స్టాల్స్ ఎక్కడ ఉన్నాయో మార్క్ చేశాను గమనించ గలరు. అన్ని షాపులకు సరైన అవకాశం ఇవ్వడానికి ఎంట్రన్స్ మరియూ ఎక్సిట్ ను ప్రతిరోజూ మారుస్తారు (బొమ్మలో ఎరుపు రంగుతో entrance/exit అని రాసి ఉన్నవి) అందుకే టిక్కెట్ కౌంటర్ రిఫరెన్స్ గా తీసుకుని మీరు వెళ్ళిన దారిని బట్టి ఈ స్టాల్స్ ఎక్కడ ఉన్నది సరిగా అంచనా వేసుకోవచ్చు. ఠాగూర్ పబ్లిషర్స్ ది సింగిల్ స్టాల్ కానీ ఇతర పబ్లిషర్స్ నుండి కూడా మంచి పుస్తకాలే ఉన్నాయి. విక్టర్ వారిదాన్లో పెద్దబాలశిక్షకు నిఘంటువులకు పెద్ద పీట వేశారు ఇంకా భక్తి, యోగా, తంత్ర, జ్యోతీష్యం కి సంభందించిన పుస్తకాలు ఎక్కువ ఉన్నాయి.
విశాలాంధ్ర బుక్ స్టాల్ లో మంచి కలక్షన్ తోపాటు వారి హాస్పిటాలిటీ చాలా బాగుంది వీరి పుస్తకాలు ఎలా అమ్మాలో వీరికి బాగా తెలుసు అని ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పాల్సిన పనిలేదు కానీ మిగతా చోట్ల కన్నా వీరి రిసెప్షన్ మరియూ సందర్శకులకు సహాయం చేసే పద్దతి నాకు బాగా నచ్చింది. నాషాపింగ్ అంతా విశాలాంధ్రలోనే చేశాను, ప్రత్యేకంగా లిస్ట్ ఏమీ పట్టుకెళ్లలేదు లెండి కనిపించినవి ఏవో కొన్ని కొనేశాను. వీరు అనంతపురం నుండే కాక హైదరాబాద్ నుండి కూడా రోజూ పుస్తకాలు తెప్పిస్తున్నారు కనుక మీరు ఏవైనా పుస్తకాలు ప్రత్యేకంగా కావాలంటే వీరికి చెప్పి తెప్పించుకోవచ్చు. ఇక్కడ మీరు ఎక్కువ పుస్తకాలు కొంటే మాత్రం బిల్లింగ్ పై శ్రద్ద పెట్టండి ఆ డిస్కౌంట్లదేముంది లే పుస్తకం పైన ఉన్న ధర చెల్లిద్దాం అంటే మీ ఇష్తం కానీ మీరు విశాలాంధ్ర మెంబర్ ఐతే (ఏడాది క్రితం నే గుంటూరు లో తీసుకున్నపుడు రెండు సంవత్సరాల సభ్యత్వానికి 25 రూ.లు) మీకు విశాలాంధ్ర పుస్తకాలపై ఇరవై శాతం మరియ ఇతర పబ్లిషర్స్ పుస్తకాలపై పది శాతం రాయితి దొరుకుతుంది. ఈ రాయితీపై వీళ్ళు అసహనం ప్రదర్శించడం వీలైతే స్కిప్ చేయడం గమనించాను అందుకే మీకు గమనించమని ప్రత్యేకంగా చెప్తున్నాను.

ఈ నెల ఇరవై ఒకటి (ఆదివారం Nov 21st) వరకూ సాగే ఈ పుస్తకోత్సవానికి ప్రవేశ రుసుము ఒక్కొక్కరికి ఇరవై రూపాయలు, సమయం ఉదయం పదకొండు గంటలనుండి రాత్రి ఎనిమిది వరకూ. అలానే గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం సరిపడ డబ్బు మీ వెంట తీసుకు వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ ఏ స్టాల్ లోనూ క్రెడిట్ కార్డ్ పై చెల్లించే అవకాశం లేదు, అలానే ఏటియం కూడా చూడలేదు.

మరికొన్ని వివరాల కోసం బుక్ ఫెస్ట్ వెబ్సైట్ ఇక్కడ చూడండి.
విశాలాంధ్ర స్టాల్ లోని పుస్తకాల గురించి మరికొన్ని వివరాలకు పుస్తకం లోని వ్యాసం ఇక్కడ చూడండి.

ఇక నే కొన్న పుస్తకాల జాబితా అంటారా ఎప్పటికి ఇవన్ని చదవడం పూర్తి చేస్తానో కానీ చిట్టా ఇదిగో చిత్తగించండి.
1.నామిని గారి ఇస్కూలు పుస్తకం(ఇస్కూలు పిలకాయల కత, పిల్లల భాషలో అల్జీబ్రా, చదువులా చావులా, అమ్మ చెప్పిన కతలు, పిల్లల్తో మాట్లాడాల్సిన మాటలు) (వీరి పుస్తకాలు నాకు అస్సలు దొరికేవి కావు ఇప్పటికి మొదటి పుస్తకం చదివే వీలు చిక్కింది).
2.శ్రీపాద వారి కలుపు మొక్కలు (మొన్న గుంటూరులో మార్గదర్శి, వడ్లగింజలు, పుల్లంపేట జరీ చీర తో పాటు ఇది దొరకలేదు, ఆలోటు ఇప్పుడు తీరింది).
3.పాలగుమ్మి వారి రచనల మూడవ  సంపుటం (బ్రతికిన కాలేజి, చచ్చి సాధించాడు, భక్త శబరి, చచ్చిపోయిన మనిషి నవలలు).
4.బుచ్చిబాబు కథలు మొదటి సంపుటం (వీరి రచనలు చదవడం ఇదే మొదలు).
5.అడివి బాపిరాజు గారి నారాయణరావు నవల.
6.భమిడిపాటి కామేశ్వరరావు గారి రచనలు మొదటి సంపుటం(ఓ 20 తక్కువ 500 జోకులు మరియూ 9 హాస్య కథానికలు:-)
ఇవి కాక ఈ కింది వంశీ రచనలు
7.వెండితెర నవలలు (శంకరాభరణం, సీతాకోకచిలుక, శుభోదయం, అన్వేషణ సినిమాలపై).
8.ఆనాటి వాన చినుకులు (23 కథల సంపుటం).
9.మంచు పల్లకీ.
10.గాలికొండాపురం రైల్వేగేటు.
11.గోకులంలో రాథ.
12.వెన్నెల బొమ్మ.

శనివారం, నవంబర్ 13, 2010

ఓ రేంజ్ ఆడియో ఓ బేబి / ఓ బాబు

సాథారణంగా ఎలాంటి తెలుగు సినిమాఐనా ఆడియో రిలీజ్ ఐన వెంటనే సాధ్యమైనంత త్వరగా వినడం నాకు అలవాటు కనీసం ఒక్క పాట ఐనా బాగుండకపోతుందా అని ఒక ఆశ అనమాట. కాని ఒకోసారి కొన్ని ఆల్బంలు అనుకోని కారణాల వల్ల వెంటనే వినడానికి కుదరదు. అదేంటో నాకు అలా కుదరనపుడల్లా ఆ ఆడియో ఖచ్చితంగా హిట్ ఐ తర్వాత విన్నపుడు ఎలా మిస్ అయ్యాను ఇన్ని రోజులు అనిపిస్తుంది. అలా నేను మిస్ అయి ఆలస్యంగా విన్న ఆడియో ఆరెంజ్. ఆ మధ్య చాలా బిజీగా ఉండి అసలు ఈ సినిమా ఆడియో రిలీజ్ అయినది కూడా తెలుసుకోలేకపోయాను. కాస్త తీరిక దొరికాక చూస్తే పాటలన్నీ ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి. ఈ మధ్య కాలంలో నాకు ఒక ఆల్బంలో అన్ని పాటలు బేషరతుగా నచ్చినది ఈ సినిమాకేనేమో. హెరీస్ జయరాజ్ పాటలు ఇదివరకు కూడా కొన్ని ఆల్బంలలో చాలా సార్లు విన్నా అన్ని పాటలు బాగుండటం అరుదే. అదీకాక ఇప్పటి వరకూ విన్నవి అన్నీ తమిళ డబ్బింగ్ సినిమాలవే అవడంతో కాస్త నిరాశగా ఉండేది. మొదటి సారి ఈ ఆల్బం మాత్రం చాలా సంతోష పెట్టింది. పాటలన్నీ మంచి హుషారుగా స్టైలిష్ గా నవతరపు పోకడలు పోతున్నా మెలోడిలు కూడా ఉండటంతో ఆల్బం ఒక షడ్రసోపేత విందులా వినిపిస్తుంది.


ఊల ఊలాలా/ సిడ్నీ నగరం : ఓ నగరం ఇన్ని రోజులు తన ప్రియురాలిని తనకి కనబడకుండా దాచి ఉంచి నేరం చేసిందని, ఐనా చివరికి తన తప్పు తాను తెలుసుకుని సిగ్గుపడుతూ ఈ రోజు నిన్ను నాకు చూపించింది ఇక ఆలస్యం చేయకుండా ప్రేమించేయమంటూ సాగే ఈ పాట కాన్సెప్ట్ నాకు భలే నచ్చేసింది. సురేంద్ర కృష్ణ/కేదారనాద్ పరిమి రచించిన ఈపాట కారుణ్య స్వరంలో స్టడీ బీట్ తో మెలొడీనా లేక బీట్ సాంగా అని కేటగరైజ్ చేయడానికి ఆలోచించేలా చేస్తుంది. మధ్య మధ్య వచ్చే ఇంగ్లీష్ బిట్స్ కాస్త అడ్డంపడతాయి కానీ అవికూడా ట్రెండీగా ఉన్నాయ్.

చిలిపిగ చూస్తావ్ అలా: ఇది మరో మంచి మెలోడీ, ప్రారంభంలో వచ్చే మ్యూజిక్ బిట్ చాలా హాయిగా మొదలై మన చేయి పట్టుకుని  పాటలోకి నడిపించుకు వెళ్తుంది. వనమాలి రచనలోని పదాలు కార్తీక్ స్వరంలో హేరీస్ ఆధ్వర్యంలో హొయలు పోయాయి. మధ్యలో వచ్చే "కొంచెం మధురము" బిట్ పాట విన్న వెంటనే మనసులో నిలిచిపోయి మనల్ని హమ్ చేసేలా చేస్తుంది. కథానాయకుడు ప్రేమ అనుకున్నది ప్రేమకాదని తేలాక నిజమైన ప్రేమను వెదికే ప్రయత్నంలో ప్రేమనే నిందిస్తూ ఈపాట కాన్సెప్ట్ సాగుతుంది.

నేను నువ్వంటూ : వనమాలి రచనలో నరేష్ అయ్యర్ స్వరంతో సాగే ఈ పాట మంచి మెలోడిగా మనసులో నిలిచిపోతుంది. తన ప్రేమని నిజాయితీనీ పొగుడుకుంటూ వాటిలోని ఘాడత మూలంగా తనని ప్రేమించకుండా ఉండటం నీ వల్లకాదు అని కథానాయికకి చెప్తూ సాగుతుంది ఈపాట. పాటంతా స్మూత్ గా చాలా హాయిగా సాగిపోతుంది. ఈ పాట గురించి నే చెప్పడం కన్నా మీరు విని ఆస్వాదించడం బెటర్. 


హలో రమ్మంటె : రామజోగయ్య శాస్త్రి రచనతో విజయ్ ప్రకాష్ పాడినది ఈ పాట. మంచి డ్యాన్స్ కు స్కోప్ ఉన్న పాట అనిపించింది. నువ్వు రమ్మంటే వచ్చిన ప్రేమ కాదు నువ్వు పొమ్మంటే పోడానికి అంటూ తన ప్రేమ గొప్పతనాన్ని చెప్తూ ఆ ప్రేమను ఒప్పుకొమ్మని అడిగే కాన్సెప్ట్ తో సాగుతుంది ఈ పాట. చరణానికి ముందు ర్యాప్ తర్వాత వచ్చే ఓ.ఓ అన్న ఆలాపన నాకు బాగా నచ్చింది.  

ఓ రేంజి లవ్ ఇది: పాట ముందు మొదలయ్యే డ్రం బీట్ పాట ఎలా సాగనుందో హింట్ ఇస్తూ ఒక మూడ్ క్రియేట్ చేస్తుంది. వనమాలి రచన లొ బెన్నీ పాడాడీపాటను. పల్లవిలో హిందీ ఇంగ్లీష్ తెలుగు కలిసిన సంకరభాష వాడినా స్టైల్ లో అది కొట్టుకుపోయింది. ఇది కూడా తన ప్రేమ గొప్పతనాన్ని తెలుపుతూ ఆ ప్రేమను పొందాలంటే డేరింగ్ కావాలను చెప్తూ మోసగాళ్ళ దగ్గర ప్రేమ కోసం ఎదురు చూడకు నిజాయితీ ఐన ప్రేమను గుర్తించమని తన ప్రియురాలిని అడుగుతూ సాగుతుంది. మంచి హుషారైన పాట.

రూబా రూబా: ప్రేమలో తన పరిస్థితి గురించి వివరిస్తూ సాగే ఈపాట వనమాలి సాహిత్యంతో సింపుల్ గా "ఎంత సేపు కలిసున్నా ఆశే తీరదే ", "నీతో ఉంటె సంతోషం కాదా నిత్యం నా సొంతం" లాంటి వాడుక మాటల లైన్స్ తో అలరిస్తుంది, అక్కడక్కడా హిందీ లైన్స్ ఉన్నా స్వరంలో కలిసిపోయి పెద్దగా ప్లోకు అడ్డం పడవు.

బుధవారం, నవంబర్ 03, 2010

రజని ఇష్టైల్ - సరదా యాడ్స్

రజనీ స్టైల్ యాడ్స్, టీవి అందుబాటులో లేని వారి కోసం, చూసి ఆనందించండి. మొదటిది ఈ మధ్య విడుదలైనది రెండవది చాలా పాతది మీరు ఇప్పటికే చూసి ఉండవచ్చు. కానీ మరో సారి చూసి నవ్వుకోదగిన వీడియో :-)



నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.