శనివారం, జూన్ 13, 2009

జర్మనీ లో... విమానం లో...

ఎయిర్ లైన్స్ కి నాకు ఎందుకో మొదటి నుండీ చుక్కెదురు, ఆహా ఎక్కితే ఈ విమానమే ఎక్కాలిరా అని అనిపించేలా నాకు నచ్చే అంతర్జాతీయ విమాన సర్వీసులు ఇంత వరకూ తారసపడలేదు. ఈ సారి చికాగో నుండి వచ్చేప్పుడు లుఫ్థాన్సా లో వచ్చాను, ఆది లోనే టిక్కట్టు రేటు విషయం లో చాలా ఎక్కువ అనిపించింది, సరేలే రిసెషన్ టైం ఇప్పుడు ఏది చూసినా రేట్లు ఇలానే ఉంటున్నాయ్ అని సరిపెట్టుకున్నాను. ఇక చికాగో విమానాశ్రయం కి చేరుకున్నాక, అంతర్జాతీయ విమానాలన్నీ ఒక టెర్మినల్ లో అయితే లుఫ్థాన్సా ఒకటే వేరే టెర్మినల్ మనకా విషయం తెలియక అంతర్జాతీయ టెర్మినల్ కి వెళ్ళి వాడు ఛీ కొడితే తిరిగి సామాను అంతా వేసుకుని అక్కడి నుండి వేరే టెర్మినల్ చేరుకునే సరికి తలప్రాణం తోకకొచ్చింది. ఎలాగో తంటాలు పడి చెక్ ఇన్ చేస్తే సీట్ నంబర్ ఇంకా కేటాయించ లేదు గేట్ దగ్గరకి వెళ్ళి మళ్ళీ మరో బోర్డింగ్ పాస్ తీసుకోండి అనే సరికి ఈ ఎయిర్‍లైన్స్ మీద అక్కడే సగం విసుగొచ్చింది. దీనికి తోడు బోర్డింగ్ సమయం లో ఒక పద్దతి పాడూ లేకుండా పిల్లా పెద్దా అంతా కలిసి ఓ చేంతాడంత క్యూ లో నుంచో పెట్టి ఎక్కించాడు పిల్లలతో అవస్థ పడుతున్న వాళ్ళని చూసి ఎఇర్లైన్స్ మీద నాకు ఒళ్ళుమండి పోయింది.సరే పోనీలే ని ఎక్కి కుర్చుంటే పర్సనల్ ఎంటర్ టైన్మెంట్ సిస్టం లేదు అంటే సీటు వెనక చిన్న వీడియో స్క్రీన్ లేదనమాట. పైన ఫోటోలో లాగ, అదుంటే ఎనిమిది గంటలు కాసేపు ఓ సినిమా చూసి, కాసేపు నిద్ర పోయి ఇలా శ్రమ తెలియకుండా ఎలాగో గడిచిపోతుంది. లేదంటే తంటాలే, సరే లే ఎలాగో అలా కానిచ్చేద్దాం అని అనుకుంటే టేకాఫ్ టైం లో విపరీతమైన టర్బులెన్స్, నా ఖర్మ కాలి నేను వింగ్ వెనకాల సీట్ లో కూర్చున్నాను సో కిటికీ నుండి చూస్తే వింగూ దాని ఇంజనూ గాలి వాన లో కొబ్బరాకు లా ఊగిపోతుంటే నా ప్రాణాలు అరచేతిలో పెట్టుకు కూర్చున్నాను అంటే నమ్మండి... ఛ ఛ ఇక ఈ ఎయిర్ లైన్స్ ఎప్పుడూ ఉపయోగించ కూడదు అని అప్పుడే శపధం చేసేసుకున్నాను. కాక పోతే అది అత్యంత పాత బోయింగ్ 747 విమానం కనుక వాడైనా చేయగలిగింది ఏమీ లేదు. అందరికన్నా ముందు ఎప్పటి నుండో చికాగో ఫ్రాంక్ఫర్ట్ మధ్య సర్వీస్ నడుపుతున్నాడు కనుక ప్రస్తుతపు సర్వీసుల అధునాతన సౌకర్యాలని సమకూర్చలేక ఇబ్బంది పడుతున్నాడు. ఇది వాడికి కూడా తెలుసు అందుకే ప్రయాణిస్తున్నంత సేపు వాడు త్వరలో ఉపయోగించ బోయే ఎయిర్‍బస్ A380 గురించి ఊదరగొట్టాడు.

అన్నట్లు ఇంకో విషయం గమనించాను దీని వెనుక ఏమైనా ప్రత్యేకమైన రీజన్ ఉందేమో ఫ్రీక్వెంట్ ఫ్లయర్స్ కి తెలిస్తే కాస్త చెప్పండి. విమానం లో సీట్లు కుడి నుండి ఎడమ కి వరుస క్రమం లో 3+4+3 ఉన్నాయ్ వాటి నంబర్లు ABC-DEFG-HJK అని ఉన్నాయ్. అంటే వరుసక్రమం లో I మిస్ అయింది, 23H తర్వాత 23I లేకుండా 23J పెట్టేశాడు. మరి ఇది లుఫ్థాన్సా వాడి సెంటిమెంటా లేక అన్ని విమానాల్లోనూ ఇంతే ఉంటుందా.. ఆ "ఐ" ఉండక పోవడం వెనుక ఏదన్నా సాంకేతిక కారణాలు ఉన్నాయా లేక పదమూడో అంకె లా దీని వెనుక కూడా ఏమన్నా కధలు ఉన్నాయా అన్నది మా బుడుగు కు చెప్పి డికేస్టింగ్ చేయమనాలి. మీకేమన్నా తెలిస్తే చెప్పి పుణ్యం కట్టుకోండి.

సాధారణ ప్రయాణీకుల కోసం ఉపయోగిస్తున్న వాటిలో పూర్తి నిడివి డబల్ డెక్ కల అతి పెద్ద విమానం A380 ఇదే

సరే ఎలాగో తంటాలు పడి ఎనిమిది గంటలు గడిపేసి ఫ్రాంక్‍ఫర్ట్ లో దిగాను. ఇక్కడ అన్నీ కాస్త సక్రమంగానే జరిగాయ్... బోర్డింగ్, విమానం లో బుల్లితెరలతో సహా. ఇది కాస్త అధునాతనమైన విమానం, మరి కొత్త సర్వీసు మన హైదరాబాదు కి డైరక్ట్ ఫ్లైట్స్ ఈమధ్యనే మొదలు పెట్టారు కదా అందుకని అనుకున్నాను. సాధారణంగా విమానం బయలుదేరిన వెంటనే భద్రత ను గురించిన వివరాలు చెప్తారు. సాధారణం గా ఇది మొదటి సారి విమాన ప్రయాణం చేసే వారికి చాలా ఉపయోగంగా ఉంటుంది. సీట్ బెల్ట్ ఎలా పెట్టుకోవాలి, విమానం నీళ్ళలో పడి పోతే ఏం చేయాలి. ఒక వేళ ఆకాశం లో ఉన్నపుడు విమానానికి బొక్క పడి ఆక్సిజన్ అందక పోతే ఏంచేయాలి, విమానం లో నుండి పారిపోవాలంటే ఎక్కడెక్కడ మార్గాలు ఉన్నాయ్ ఇలాంటి విషయాలు చెప్తారు. నిజం చెప్పాలి అంటే విమానం లో ఎన్ని రకాల ప్రమాదాలు జరగచ్చో టూకీగా చెప్పి హడల కొడతారనమాట. సాధారణంగా ఇవి మూడు భాషలలో చెప్తారు. ఒకటి ఏ దేశం నుండి బయలుదేరుతుంటే ఆదేశ జాతీయభాష, మరొకటి గమ్యం ఏ దేశమైతే ఆ దేశ జాతీయభాష, మరొకటి ఆంగ్లం. అయితే ఫ్రాంక్‍ఫర్ట్ నుండి బయలుదేరిన లుఫ్థాన్సా లో జర్మన్, హిందీ లో చెప్పాడు. హిందీ లో ఒచ్చే ప్రజంటేషన్ లో ఆంగ్లం లో సబ్‍టైటిల్స్ వేస్తాం చూసుకోండి అన్నాడు. ఓరి వీడి దుంపతెగ ఆంగ్లం లో ప్రజంటేషన్ ఇవ్వడానికి కూడా డబ్బులు దండగ ఎందుకు అనుకుంటున్నాడా అని అనుకునేంతలో నన్ను బోలెడంత హాశ్చర్యానికి గురి చేస్తూ తెలుగు లో ప్రసంగం ప్రారంభమైంది.

భళి రా !! ఈ ఒక్క విషయం తో నా మనసు దోచేశావ్ పో అనుకున్నా... సిబ్బంది అందరికీ తెలుగు నేర్పడం కష్టం కనుక ముందే రికార్డ్ చేయబడిన మెసేజ్ వినిపించాడు. ఎవరో కానీ మంచి అందమైన గొంతు ఉన్న వాళ్ళ కోసం వెతికినట్లున్నారు కానీ తెలుగు తెలిసిన వాళ్ళకోసం వెతికితే బాగుండేది. శ్రావ్యమైన ఆడ గొంతు కోసం తెంగ్లీష్ లో రాసిన స్క్రిప్ట్ ఇచ్చి చదివించినట్లున్నారు ఆవిడ ద్వారాలు అన వలసిన చోట "ద్వరలు" అని శక్తివంచన ని విరగేసి శక్తీ, వంచనా అని రెండు వేర్వేరు పదాలు గా పలికి అర్ధాన్ని మార్ఛేయడం లాంటి పొరపాట్లు చేసినా అసలంటూ తెలుగు లో చెప్పాలి అన్న స్పృహ కలిగినందుకు ఆనందించాను. భాష కూడా ఇటు వాడుక భాష అటు అధికార భాష కాని మధ్య రకమైన భాష ఉపయోగించి కాస్త బెదరగొట్టారు. ఇంతలా ఎందుకు రియాక్ట్ అయ్యనంటే అంతర్జాతీయ విమానాల్లో ఆయా దేశాల జాతీయభాషలలో అనౌన్స్ చేయడం ఓ పద్దతి కానీ మన దేశం లోనే వివిధ రాష్టాలమధ్య తిరిగే విమానాల్లో ప్రాంతీయ భాషలో చెప్పటం చాలా అవసరం అని నా ఉద్దేశ్యం. ఇంతకు ముందు హైదరాబాద్ వెళ్ళే జెట్ లో ఒకటి రెండు సార్లు ఈ విషయమై సజెస్ట్ చేశాను కూడా. అలాంటిది అంతర్జాతీయ విమానం లో, జర్మనీ లో కూర్చుని తెలుగు వింటూంటే మనసు ఆనందించదూ....

మీకోసం ఓ నమూనా ఫ్లైట్ సేఫ్టీ వీడియో ఇక్కడ చూడండి.ఈ రోజుకి బాగానే మీ బుర్ర తినేసాను కదా ... హ హ ఏంటీ..:-) "తినడమేంటి నాయనా స్ట్రా వేసుకుని జుర్రుకున్నావ్..." అంటారా సరే సరే, హైదరాబాద్ చేరుకున్నాక నేను అందుకున్న అరుదైన స్వాగతం గురించిన వివరాలతో మరో టపాలో కలుద్దాం, అంత వరకూ శలవా మరి.

మీ వేణూశ్రీకాంత్.

7 వ్యాఖ్యలు:

 1. ఇదేకాదు, నేను హైదరాబాదు నుండి స్వీడన్ వచేటప్పుడు ఎక్కిన కె.ఎల్.ఎమ్ వాళ్ళ విమానంముందు ఎదైనా బలాదూర్. దంట్లో సీటింగ్ ముందు మన ఎర్ర బస్సు అహా ఒహో

  ప్రత్యుత్తరంతొలగించు
 2. I trveled with family once by Lufthansa from Newyork to frankfurt and Hyd. i traveled with two children, we realized only after getting in that there was no entertainment system.
  I'll leave it your imagination my plight with two kids, getting bored and frustrated calling me all kinds of names, cheap, stinky...you name it for choosing Luthansa. It was not the cheapest either.
  Never ever...lufthansa.
  Next time we traveled by "Ethehad". great service. Since it is not that popular we were able to stretch across 4 seats. There were only 11 passengers from Abudhabi to Chenni.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. జర్మనీ లో తెలుగు...బహు బాగు... రాబోయే టపా కోసం ఎదురు చూస్తూ...

  ప్రత్యుత్తరంతొలగించు
 4. విశ్వక్శేనుడు, అజ్ఞాత, మురళి, నేస్తం గార్లు వ్యఖ్యానించినందుకు నెనర్లు.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. Singapore Airlines is good..
  German Flight lo Telugu!!!!! too good to hear abt it...!

  ప్రత్యుత్తరంతొలగించు

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.