ఆదివారం, మే 24, 2009

బదిలీ...

2009 కొత్త సంవత్సరం మొదటి రోజు నన్ను ఏమిటి రా విశేషాలు? అని అడిగిన వారికీ, అడగని వారికీ నేను ఒకటే జవాబు చెప్పాను."ఆ ఏముంది తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అదే రొటీన్ రోజూ, "లైఫ్ ఈజ్ బోరింగ్ యూనో..." అని. మరి శేషతల్పం పై విశ్రమిస్తున్న విష్ణుమూర్తి ఓ అరక్షణం కనులు అరమోడ్పులు చేసి, చెవులు రిక్కించి నా మాటలు విని ముసి ముసి నవ్వులు నవ్వుకున్నాడో... లేకా హిమగిరి పై తపస్సు చేసుకుంటున్న మహేశ్వరుడు ఓ క్షణం కనులు తెరిచి ఆహా అవునా అని వెటకారం గా అనుకున్నాడో కానీ...ఆ క్షణం నుండీ శివకేశవులు ఇద్దరూ కలిసి చెరో వైపూ నుండి నా జీవితం తో బంతాట ఆడేసుకుంటున్నారు... ఈ రెండువేల తొమ్మిది అంతా వరసగా బోర్ అనే మాట దరిచేరనివ్వకుండా ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. అచ్చం టెన్నిస్ కోర్ట్ లో ప్రత్యర్ధి ని చూస్తూ ఓ నువ్వు ఆ షాట్ కొట్టావా ఇప్పుడు నా షాట్ చూడు ఎలా కొడతానో అని ఒకర్ని మించి ఒకరు పోటీ పడి నా జీవితం లో ట్విస్ట్ లు ఇస్తున్నారనమాట.

అదుగో రమణారెడ్డి లా సన్నగా పొడవుగా తెల్లగా ఉన్న భవంతి పక్కనే రేలంగి లా లావుగా పొట్టిగా బులుగు రంగులో blue cross blue shield అని రాసి ఉన్న భవంతే నేను ఇన్ని రోజులూ చికాగో లో పని చేసిన ఆఫీస్.

సరే ఇంత ఉపోద్ఘాతం దేనికయ్యా అంటే... నేను ప్రస్తుతం (ఆదివారం మే 17) ఫ్రాంక్ఫర్ట్, జెర్మనీ విమానాశ్రయం నుండి ఈ బ్లాగ్ రాసుకుంటున్నాను. నిన్న శనివారం బయల్దేరి ఇండియా వచ్చేస్తున్నాను. ఈ గురువారం అనగా మే ఇరవైఒకటిన బెంగళూరు నుండి పని మొదలు పెట్టాలి... మధ్యలో ఓ మూడు రోజులు శలవు అనమాట. అదీ సంగతి.. ఈ టపా నాకు విషయం తెలిసిన దగ్గర నుండీ రాద్దాం అని అనుకుంటున్నాను కానీ గత రెండు మూడు వారాలుగా ఈ బదిలీ హడావిడి లొ పడి అస్సలు కుదరలేదు... ఇదే అనేమిటి లే ఈ మధ్య నా బ్లాగ్ కేవలం ముఖ్యమైన విషయాలను తెలియచేసే నోటీస్ బోర్డ్ లా ఉపయోగిస్తున్నానేమో కదా. చూడాలి బెంగళూరు నుండైనా తరచూ బ్లాగడానికి వీలు దొరుకుతుందేమో... కానీ సమస్యేమిటంటే బెంగళూరు వెళ్ళినా నాకు ఇదే ఆఫీసు పని అక్కడ నుండి కొనసాగించాలి సో ఏమాత్రం వీలు చిక్కుతుందో చూడాలి. ఏవిటో ఇదే పని సగం జీతానికి ఇండియానుండి చేయాలి అంటే కొంచెం కష్టమే కానీ మన అసలు జీతం అదే రా బాబు ఇప్పటి వరకు డబల్ జీతానికి పని చేసావు అంతే అని సర్ది చెప్పుకోటమే... జీతం ఎక్కువైనా ఖర్చులు కూడా అంతే ఉండి చస్తాయ్ లెండి అమెరికా లో ఒక మాదిరిగా బతకాలి అంటే...

మొత్తం మీద నా బదిలీ లో మొదటి అంకం పూర్తయింది... చికాగో బంధాలను వదిలించుకుని, రెండున్నరేళ్ళ గా సమకూర్చుకున్నవన్నీ రెండు వారాలలో ఒక్కోటీ పాతిక కేజీలు మించని రెండు సూట్కేస్ లలో సర్దేసుకుని, మళ్ళీ ఎప్పుడు పలకరించడానికి వీలు పడుతుందో అని భారమైన మనసుతో వీడ్కోలు తెలుపుతూ చికాగో నుండి బయటపడ్డాను. ఇక్కడ సమకూర్చుకున్నవన్నీ అలా ఒకటొకటి గా నన్ను వదిలి వెళ్తుంటే ఎంత దిగులేసిందో... ఏవిటో ఈ మనసు, ప్రాణం లేని వస్తువులపై కూడా ఇలా మమకారాన్ని పెంచేసుకుంటుంది. ముఖ్యంగా ఇష్టంగా కొనుక్కున్న నా కారు ను సమయాభావం వల్ల అతి తక్కువ ధరకి అమ్మేసి అప్పగించిన రోజు రాత్రి ఎంత ప్రయత్నించినా పొంగుకు వచ్చే కన్నీళ్ళకి ఆనకట్ట కట్ట లేకపోయాను. మా అమ్మ తను కొన్న ఏ వస్తువునైనా ఎందుకు అలా తిరిగి అమ్మటానికి ఒప్పుకోదో మొదటి సారిగా బోధ పడింది.


అసలు అమ్మా నాన్న ఇద్దరూ గవర్నమెంట్ ఉద్యోగాలు చేసినా మా కుటుంబం ఈ బదిలీల భారిన పడిన సందర్బాలు తక్కువే అని చెప్పాలి.. అమ్మ నాన్న మా చదువులు మిగిలిన విషయాలు అనవసరం గా ఇబ్బంది పడాల్సి వస్తుంది అని ఎలాగో అలా నయానో భయానో చెప్పి ఇలాంటి బదిలీలు ఆపేసేవారు, కొండొకచో రావాల్సిన పదోన్నతులు కూడా త్యాగం చేసిన సందర్భాలు లేకపోలేదు. రెండు సార్లు మాత్రం తప్ప లేదు ఒకసారి నరసరావుపేట వదిలి పిడుగురాళ్ళ వెళ్ళి ఒక రెండేళ్ళు ఉండి తిరిగి వస్తే రెండవసారి నరసరావుపేట నుండి గుంటూరు కు వచ్చి అక్కడే స్థిరపడిపోయాం. మాకు ఇళ్ళు కూడా ఎక్కువగా మారే అలవాటు ఉండేది కాదు. పిడుగురాళ్ళ నుండి వచ్చేసాక దదాపు పదమూడేళ్ళపైగా ఒకే ఇంట్లో ఉన్నాము. ఎంత మంది ఆ ఇంటి వాస్తు మంచిది కాదు అని చెప్పినా ఏం జరిగినా గుంటూరు వచ్చే వరకూ ఆ ఇల్లు మారకుండా అక్కడే ఉన్నాం.

మొదటి సారి బదిలీ నన్ను బాధ పెట్టింది నరసరావుపేట లో రామిరెడ్డి పేట కబీర్‍దాస్ గారి ఇంటి లో ఉన్నపుడు. అప్పుడు నేను తొమ్మిదో తరగతి చదువుతున్నాను. ఆ ఇంట్లో కింద మూడు వాటాలు అద్దెకి ఇచ్చి పైన ఇంటి ఓనర్స్ ఉండే వారు. కింద ఇళ్ళల్లో ఓ చివర మేము ఉండే వాళ్ళము ఇంకో చివర ఓ రైల్వే స్టేషన్ మాష్టారు ఉండే వారు. నేను అప్పుడు పేరుకు తొమ్మిదో తరగతి కానీ వయసు పదమూడో పద్నాలుగో ఉండేది అప్పుడే టీనేజికి వచ్చినా ఇంకా నిక్కర్లు వదలని వయసనమాట అందుకని వాళ్ళూ చిన్న వాళ్ళే అయినా నేను వాళ్ళని అంకుల్ ఆంటీ అంటే ఏమీ అనుకునే వాళ్ళు కాదు. నాకు వాళ్ళ ఇంట్లో బాగా కాలక్షేపం ఖాళీ దొరికినప్పుడల్లా వెళ్ళి కూర్చుని వాళ్ళ తో కబుర్లు చెప్పే వాడ్ని, నేను మొదటి సారి వాకెమన్ లో పాటలు విన్నది వాళ్లదగ్గరే. అప్పటి వరకూ మా ఇంట్లో ఫ్లాట్ గా ఉండే ఢిల్లీ మోనో సెట్ (దీని గురించి చెప్పాలంటే ఓ ప్రత్యేక టపా కావాలి మళ్ళీ చెప్తాను) లో పాటలు వినడం అలవాటు. మొదటి సారి స్టీరియో వాక్మన్ చెవులకి పెట్టుకుని బయటకి వినపడకుండా వినడం, ఆ హెడ్ సెట్ తలకి పెట్టుకుని పెద్దగా అరచినట్లు మాట్లాడటం ఇది ఎదుటి వాళ్ళు గుర్తించి చెప్తే నవ్వుకోడం అంతా ఓ వింత అనుభూతి. వాళ్ళ సొంత ఊరు వైజాగ్ అనమాట షిప్ యార్డ్ గురించి వైజాగ్ గురించీ వాళ్ళు కబుర్లు చెప్తుంటే అలా వింటుండేవాడ్ని. అలా నాకు మంచి ఫ్రెండ్స్ అయిన వాళ్ళు బదిలీ అయి వెళ్ళి పోయినప్పుడు నేను ఏడ్చేసాను. ఆంటీ కూడా వెళ్ళి పోతున్నందుకు ఏడ్చేశారు అప్పుడు. కాని తర్వాత వాళ్ళ తో కాంటాక్ట్ తప్పి పోయింది ఇప్పుడు ఎక్కడ ఉన్నారో మరి.

కౌలాలంపూర్ లోని పెట్రొనాస్ టవర్స్ పోలికతో హెబ్బాల్ కి దగ్గర లో నార్త్ బెంగళూరు కు చిహ్నం గా మారిన ట్విన్‌టవర్స్ అపార్ట్మెంట్స్ ఇవి. నేను ఇదివరకు అంతా సౌత్ బెంగళూర్ లో ఉండటం తో దీని గురించి అస్సలు తెలియదు. మొన్న మొదటి సారిగా ఆఫీస్ కి ఈ వైపు వచ్చినపుడు చూసి అవాక్కయ్యాను.

ఇక నా బదిలీ లో రెండవ అంకం బెంగళూరు లో స్థిరపడటం... అక్కడ మళ్ళీ ఇపుడు అద్దెఇళ్ళ కోసం వేట, దొరికాక వాటికి పదినెల్ల అడ్వాన్సు.. మంచినీళ్ళ నుండీ ఇంటర్‍నెట్ వరకూ అన్నీటికీ వెతుక్కొని సమకూర్చుకోడం అంతా చాలా పెద్ద పనే... ఆఫీసు కి దగ్గర్లో ఇల్లు దొరకకపోతే మళ్ళీ రోజు వెళ్ళి రావడం ఒకటి సమస్య, ఆఫీసు దగ్గర లో అంటే మరీ పల్లెటూరు అదీకాక మొన్నే ఎవరో మా కొలీగ్ ను రాత్రి పదకొండు గంటలప్పుడు ఆఫీసు నుండి ఇంటికి నడిచి వెళ్తుంటే పొడిచారట... అతని అదృష్టం కొద్దీ ప్రాణ హాని లేకపోయినా మన అదృష్టం ఎలా తగలడుతుందో ఏమి తెలుసు. ఏమిటో ఈ రౌడీ వెధవలకి లేటెస్ట్ న్యూస్ చేరుతున్నట్లు లేదు.. ఇంకా సాఫ్ట్వేర్ ఉద్యోగులు అంటే బోలెడు డబ్బుంటుంది అనే అపోహ లోనే ఉన్నట్లున్నారు... ప్రస్తుత పరిస్తితులలో ఈడ్చి తంతే దమ్మిడీ రాలట్లేదు అనే విషయం ఇంకా అర్ధమైనట్లు లేదు వాళ్ళకి. అన్నట్లు మా ఆఫీస్ ఐబీయం మాన్యతా లో ఉంది హెబ్బాల్ ఫ్లైఓవర్ దగ్గర లో నాగవరా అనే ఊరిలో అట ఆ చుట్టు పక్కల మీదో మీకు తెలిసిన వాళ్ళదో ఇల్లు అద్దెకి ఉంటే నాకో మాట చెప్పండి.. మీ సాయం మర్చిపోను. అన్నట్లు నేను ప్రస్తుతం సింగిల్ బెడ్రూం ఇల్లు కోసం వెదకాలి. మరీ గవర్నమెంట్ హాస్టళ్ళలా కాక కాస్త డీసెంట్ గా ప్రత్యేకమైన గది ఉండి సౌకర్యవంతమైన పేయింగ్ గెస్ట్ అయినా పర్లేదు అని చూస్తున్నాను.

అద్దె ఇల్లంటే గుర్తొచ్చింది జిల్లా కి ముఖ్య పట్నం అయిన గుంటూర్ లో కూడా అద్దెకి ఇల్లు వెతుకుతుంటే మీరెవరు? మీ సామాజిక వర్గం ఏమిటీ, వెజ్జా నాన్వెజ్జా ఇత్యాది ప్రశ్నలు సర్వసాధారణం అయిపొయాయి ఒకరు చౌదర్లకి మాత్రమే అంటే ఇంకోరు రెడ్లకి మాత్రమే అంటారు మరొకరు క్రిస్టియన్సె కే అంటే ఇంకోరు హిందూస్ ఓన్లీ అంటారు అన్నీ నిరూపించుకుని ఇల్లు వెదకడం బోలెడు కష్టం అయిపోతుంది.. నా అదృష్టమో ఏజంట్ల ద్వారా వెళ్ళడం వలన వాళ్ళు అవన్నీ ముందే ఫిల్టర్ చేసారో కానీ నాకు ఇంతవరకూ బెంగళూరు లో ఎప్పుడూ ఆ సమస్య రాలేదు మరి, ప్రస్తుతం బెంగళూరు లో అదీ పల్లె వాతావరణం తో ఉండే నాగవరా లో నాకు ఎన్ని శల్య పరీక్షలు పెట్టనున్నారో ???

ఈ టపా నేను మే పదిహేడున ఎయిర్‍పోర్ట్ లో కూర్చుని రాసాను కాని అప్పటి నుండి ఇప్పటి వరకూ ఇంటరెనెట్ దొరకక పోస్ట్ చేయలేదు. అంటే అక్కడ ఎందుకో నెట్ పని చేయలేదు. నెట్‍సెంటర్ కి వెళ్ళాలంటే బద్దకం :-) ఆఫీసు లోనేమో చాలా బిజీ, హోటల్ లో ఇంటర్నెట్ వైఫై ఉంది కానీ నాలుగు రోజుల క్రితం కురిసిన వర్షాలకి బీయస్‍యన్‍యల్ తీగలు తెగాయిట అప్పటి నుండీ అది పని చేయడం లేదు, రిసెప్షన్ వాడికి కాల్ చేసిన ప్రతిసారీ "ఎవరో రావాలీ ఈ తీగలు సవరించాలీ..." అని అదే పాట పదే పదే పాడుతున్నాడు. అందుకే ఇక లాభం లేదు అని ఈ ఆదివారం ప్రత్యేకంగా ఆఫీసుకు వచ్చి బ్లాగ్ మరియూ కొన్ని ముఖ్యమైన ఈమెయిల్స్ కి జవాబివ్వాల్సిన పని ముగించాను. అన్నట్లు నాకు వెంటనే అన్ని విధాలా అనుకూలమైన వసతి దొరకాలని ఆశీర్వదించడం మరవకండేం, ఇంకా ఈ మధ్య దేవుళ్ళెవరూ నా మొర ఆలకించడం లేదల్లే ఉంది సో మీ రికమెండేషన్ పని చేస్తుందేమో మరి, కాస్త ప్రయత్నించి చూద్దురూ...

సరే త్వరలో మరో టపా లో మళ్ళీ కలుద్దాం అంతవరకూ శలవు.

21 వ్యాఖ్యలు:

 1. తప్పకుండా బ్రదర్. మీకు శీఘ్రమేవ సింగిలు బెద్రూము ఫ్లాట్ ప్రాప్తిరాస్తూ.

  అయితే మేరు బెంగలూరు వచ్చారు కనుక ఒకసారి ఇక్కడ లుక్కేసి ఓ విషెస్ చెప్పండే. కుంబ్లే రికమెండ్ చేస్తాడు. :-)

  http://thinkquisistor.blogspot.com/2009/05/blog-post_23.html

  ప్రత్యుత్తరంతొలగించు
 2. బెంగళురుకు సుస్వాగతం

  ముందుగా చెప్పి ఉంటే స్వాగత కార్యక్రమాలు ఏర్పాటు చేసేవాడిని :)

  ప్రత్యుత్తరంతొలగించు
 3. మొత్తానికి మన స్వదేశానికి వచ్చేసారన్నమాట. సుస్వాగతం. కొన్నాళ్ళూగా ఉన్న పరిసరాలని, పరికరాలని వదలాలంటే నిజంగా బాదే. బాగుంది

  ప్రత్యుత్తరంతొలగించు
 4. వేణు గారు, మీ బదిలీ తెచ్చే మార్పులన్ని శుభారంభాలై మీకు ప్రశాంత జీవితం ఇవ్వాలని కోరుకుంటున్నాను. నేను గత 15 సం. లో రెండు సార్లు దేశాంతరయానం చేసాను. అనుబంధాలు [మనుష్యులు, ప్రదేశాలు...] ఎంతో బాధ పడ్డాను. కానీ, నాన్న గారి 35సం. జీవితంలో మేము దాదాపుగా 20 పైనే వూర్లు తిరిగిగాము. క్రొత్త క్రొత అనుభవాలు చవిచూసాము. మంచి మిత్రులని సంపాదించాము. నా అనుభవమూ అదే. మీరు త్వరలో అదే మాట అంటారు. అయినా కూడా ఇల్లినోయ్ నుండి వెళ్ళటం ఎంత బెంగగా వుంటుందో ఇంకా అక్కడే వున్న నాకు తెలుసు. శుక్రవారం నాడే మీ గురించి తలచుకుని, మీ బ్లాగొకసారి చూసివచ్చాను. బహుశా వేసవి ప్రయాణంగా ఇండియాకి వెళ్ళారనుకున్నాను. నేటితో నా అమెరికా ప్రవాస జీవితంకి 8సం. పూర్తి. ఉదయానే మీ టపా చదవటం. ఏదో బావన. ఎందుకంటే నా సన్నిహితులకి త్వరలో నేను మనదేశం వచ్చేస్తాను అని చెప్పాను కనుకేమో. ఇక పోతే ప్రస్తుత మీ సమస్యకి ఇక్కడున్న నేను పెద్దగా సహకారం ఇవ్వలేకపోయినా తెలిసిన వారిని వాకబు చేసి ఏదైనా సమాచారం దొరికితే మీకు తెలియజేస్తాను. జీతం కన్నా జీవితంలో తృప్తి కావాలి కదండి? ఇది నా వ్యక్తిగత అభిప్రాయం, అదే నేను ఆచరణలో పెట్టిందీను. ఐ టి రంగంలో వున్నా నాది ఇంకా సమతుల జీవితమే. త్వరలో అక్కడి విశేషాలతో మంచి మంచి టపాలు వ్రాస్తారని ఆశిస్తూ.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. "నా జన్మభూమీ.." అని పాడుకుంటూ భారత దేశంలో అడుగుపెట్టిన మీకు స్వాగతం.. సమస్యలన్నీ త్వరలోనే ఓ కొలిక్కి రావాలని కోరుకుంటున్నాను.. తపాల ద్వారా మీరు అందించే విశేషాల కోసం ఎదురు చూస్తూ..

  ప్రత్యుత్తరంతొలగించు
 6. మిమ్మల్ని రెండో, మూడో, మిగిలిన అన్ని అంకాల్లోనూ విజయాలు పలకరించాలని ఆశిస్తూ ..

  ప్రత్యుత్తరంతొలగించు
 7. వేణు,
  ప్రాణం లేని వస్తువుల మీద కూడా మమకారాన్ని, అనుబంధాన్ని పెంచుకోవడం సున్నిత మనస్తత్వానికి,ప్రేమించే తత్వానికి నిదర్శనం! అది ఎప్పుడూ జారిపోకుండా కాపాడుకోండి.

  మీకు బెంగుళూరులొ మంచి వసతి తప్పకుండా దొరుకుతుంది. ఏదైనా సహాయం అవసరమైతే ఒక్క మెయిల్ కొట్టండి. బెంగుళూరుని విడిచి వచ్చినా బెంగుళూరు నిండా బోలెడంతమంది స్నేహితుల్ని మాత్రం వదిలే వచ్చాము. తప్పకుండా సహాయం చేసే ఫ్రెండ్స్!

  ప్రత్యుత్తరంతొలగించు
 8. మీ బదిలీ చాల భాద అన్పించిందండి ..కాని మానవుడికి భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం "మరుపు" ...మన ప్రమేయం లేకుండానే ప్రాణమున్న , ప్రాణం లేని వాటిపై మమకారం పెంచేసుకుంటాము..

  ప్రత్యుత్తరంతొలగించు
 9. ayyo venu srikanth garu india velli poyara, next month nenu chicago vastunnanu seminarki....mimmalni kaluddam anukunnanu.....kudaradnamata..any way good luk in india
  subbu

  ప్రత్యుత్తరంతొలగించు
 10. ayyo venu srikanth garu india velli poyara, next month nenu chicago vastunnanu seminarki....mimmalni kaluddam anukunnanu.....kudaradnamata..any way good luk in india
  subbu

  ప్రత్యుత్తరంతొలగించు
 11. ఇప్పుడే చూస్తున్నా ఈ టపాని, ఓహ్ బెంగళూరు వచ్చేశారా....
  మన ఉద్యాన నగరికి స్వాగతం.. సుస్వాగతం... :)
  సులేఖా లో వెతికారా ఇళ్ళ గురించి, కనీసం ఇల్లు దొరకకపోయినా, పి.జి అకామడేషన్ గురించి అయినా వివరాలు తెలుస్తాయి.. సో అయితే, నాగవారపాళ్యలో ఉండబోతున్నారా.. బాగు బాగు !!
  njoy madi :)

  ప్రత్యుత్తరంతొలగించు
 12. గీతాచార్య గారు నెనర్లు. మన దీవెనలు ఏవీ ఫలించినట్లు లేవు :-)

  చైతన్య గారు నెనర్లు. నాకంత సీన్ లేదండీ...

  రమణి గారు నెనర్లు.

  ఉష గారు మీ అనుభూతులని పంచుకున్నందుకు నెనర్లు. నేను మార్పు కు పూర్తి వ్యతిరేకం అని చెప్పలేను కానీ జీవితాన్ని ఒక గాడి లో పడేసి అలా దాన్లో వెళ్ళిపోతుంటాను (institutionalize చేయడం అనమాట) అది మారిన ప్రతి సారి నాకు భాధ తప్పదు. రెండున్నరేళ్ళ క్రితం చికాగో వచ్చిన మొదటి సారి కూడా ఇంతే బాధ పడ్డాను :-) ఇక జీతం జీవితం తృప్తి అంటారా వీటి మధ్య సమన్వయం కుదుర్చుకోడం కాస్త కష్టమైన పనే...

  మురళి గారు నెనర్లు.

  అబ్రకదబ్ర గారు నెనర్లు.

  సుజాత గారు తప్పకుండా నిలుపుకోడానికి ప్రయత్నిస్తానండీ కానీ మార్పు సహజం కదా, ఎన్నాళ్ళు నిలుపుకో గలనో తెలియదు మరి. తప్పకుండా ఏమైనా సహాయం కావల్సి వస్తే సంప్రదిస్తాను.

  చిన్ని గారు నెనర్లు, బదిలీ వలన కలిగిన కొన్ని అసౌకర్యాలు ఇబ్బంది పెట్టినా కొన్ని విషయాలలో చాలా సంతోషాన్ని కూడా అందించిందండీ, అంతా మన మంచికే అని పెద్దలు ఊరికే అనలేదు.

  సుబ్బు నెనర్లు, అయ్యో అవునా మనం కలిసే అవకాశం మిస్ అయ్యామనమాట సరే లెండి మీరు ఇండియా వచ్చినపుడు కలుద్దాం వీలుంటే.

  మేధా గారు నెనర్లు, విషయం తెలియగానే మొదట చేసిన పని సులేఖా లో వెతకడమేనండీ కానీ నచ్చినవేవీ దొరక లేదు. మగవాళ్ళ పీజీలు అంత సౌకర్యవంతంగా ఉండవండీ షేరింగ్ మరీ ఘోరంగా ఉంటాయి. సింగిల్ అంటే ఆరు వేలు చెప్తున్నారు నాగవరా లో కూడా.. ప్రస్తుతం హెబ్బాళ, కమ్మనహళ్ళి లో 1BHK చూస్తున్నాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 13. Prapancham chinnadi. Endukanta pedda baadha guruji?

  ప్రత్యుత్తరంతొలగించు
 14. ఏమిటో మీ టపాలన్నీ లేట్ గా నా కళ్ళబడతాయి :((

  మొత్తానికి సేఫ్ గా లాండ్ అయిపోయారన్నమాట.. డోంట్ వర్రీ, ఇంకో వారం పదిరోజుల్లో గృహప్రవేశం (అదేలేండి అద్దె ఇంటిదే) కూడా చేశేస్తారు.. మీరు కోరుకునే వసతి, కోరుకున్న రేంజ్ లోనే అతి తొందరలో దొరుకుతుందని దీవిస్తున్నాను.. :-)

  ప్రత్యుత్తరంతొలగించు
 15. చిన్నా
  హెబ్బెల్ కాదు చిన్నా - హెబ్బేళ. :):) తొందర్లో ఓ ఇల్లు తీస్కుని, లేక కొనుక్కుని ఓ ఇంటివాడివవ్వాలని కోరుకుంటా. ఎంచక్కా మేము ఎప్పుడైనా బంగళూరు వస్తే నీ దగ్గర దిగేయొచ్చు. :):)

  ప్రత్యుత్తరంతొలగించు
 16. అఙ్ఞాత శిష్యాజీ వ్యాఖ్యానించినందుకు నెనర్లు :-) మీరు చెప్పినట్లు ప్రపంచం చిన్నదే కాని అది చిన్నదయ్యే కొద్దీ మన ఆశలు కోరికలు పెద్దవవుతున్నాయ్ కదా అందుకే అంత పెద్ద బాధ.

  నిషిగంధ గారు వ్యాఖ్యకు, దీవెనకు నెనర్లు :-) "కోరుకునే వసతి కోరుకున్న రేంజి లో, త్వరలో.." బాగా చెప్పారు నేను సరిగా ఈ మూడిటి గురించే ఆలోచిస్తున్నాను. రెండు రోజులు పెద్ద ఆలశ్యమేముందిలేండి, ప్రస్తుతం బ్లాగులు బాగా పెరిగిపోడం తో కొత్త పోస్ట్ కూడలి హోమ్ పేజ్ లో ఎక్కువ సేపు ఉండటం లేదు అందుకే మిస్ అవుతూ ఉండుంటారు.

  భాస్కరా నెనర్లు, నిన్ననే నేను ఇక్కడ కన్నడ లో హెబ్బేళ అని చూసి ఓహో ఇలా రాయాలా అని అనుకున్నాను. కానీ అదేమిటో అది చూస్తే నాకు కబేళా గుర్తొస్తుంది మరి :-)

  ప్రత్యుత్తరంతొలగించు
 17. ఓ ఇండియా వచ్చేసారన్నమాట. వసతి దొరికిందా?

  ప్రత్యుత్తరంతొలగించు
 18. :) ఆలస్యం గా చూసాను మీ పోస్ట్ ..ఎలాఉంది బెంగుళూర్ లో జీవితం

  ప్రత్యుత్తరంతొలగించు
 19. సిరిసిరిమువ్వ గారు నెనర్లు. ప్రస్తుతానికి ఒక పీజీ లో కానిస్తున్నానండీ.. ఇంకా చూడాలి.

  నేస్తం నెనర్లు. బెంగళూరు అలవాటైన జీవితమేనండీ పెద్దగా మార్పుఏమీ లేదు. కేవలం దక్షిణ బెంగళూరు నుండి ఉత్తర బెంగళూరు కు మారాను అంతే.

  కధాసాగర్ గారు నెనర్లు.

  ప్రత్యుత్తరంతొలగించు

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.