సోమవారం, డిసెంబర్ 08, 2008

అనగనగా ఓ డిశంబర్ 6 !!!

ఈ తేదీ వినగానే చాలా మందికి గుర్తొచ్చేది బ్లాక్ డే... బాబ్రీ మసీదుని కూల్చివేసిన రోజు... ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఈ రోజు ఎక్కడ ఏ తీవ్రవాది విరుచుకు పడతాడో అని ప్రభుత్వం అప్రమత్తం గా ఉండే రోజు. అయితే సాధారణం గా పొలిటికల్ టపాలు రాసే అలవాటు లేని నీ బ్లాగ్ లో ఈ ప్రస్తావన ఎందుకు రా అంటారా... వస్తున్నా అక్కడికే వస్తున్నా... ఈ దుస్సంఘటన జరగడానికి చాలా కుంచెం సంవత్సరాలకి పూర్వం సరిగ్గా ఇదే రోజు నేను పుట్టాననమాట. నేను టీనేజ్ లో ఉన్నంతవరకూ కూడా ఈ రోజు నాకు మాత్రమే ప్రత్యేకం కానీ ఇది జరిగిన తర్వాత అందరూ ప్రత్యేకం గా గుర్తు పెట్టుకునే రోజయిపోయింది. ఈ రోజు ఇలాంటి సంఘటన జరగడం బాధాకరం. నా ఫ్రెండొకడు అన్నాడు ఇదీ బాగానే ఉంది లేరా వార్తల్లో బ్లాక్ డే గురించిన న్యూస్ తో నీ పుట్టినరోజన్న విషయం పేపరు వాళ్ళే నీ ఫ్రెండ్స్ కి గుర్తు చేస్తారు అని కానీ ఇలాంటి వార్త తో నా పుట్టిన రోజు గుర్తు చేయడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు కానీ ఏం చేస్తాం లైఫ్ ఈజ్ జిందగీ !!

సరే అసలు ఈ టపా ఎందుకు రాయాలనుకున్నా అంటే ఉదయం నా ఫ్రెండ్ ఒకరు విష్ చేస్తూ ఊరుకోకుండా చిన్నప్పుడు పుట్టిన రోజంటే అదో పెద్ద పండగ లా ఉండేది కనీసం ఒక నెల ముందు నుండే ప్లానింగ్ స్టార్ట్ చేసే వాళ్ళం కానీ ఇప్పుడు అదంతా ఏం లేదు... అంటే మనం ఇప్పుడు పిల్లలం కాదు కదా అనేం కాదు కానీ ఇప్పటి లైఫ్ రేస్ లో పుట్టిన రోజు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వెళ్ళిపోతుందో కూడా గుర్తుండటం లేదు అని ఒక్క సారి గా నన్ను బాల్యం లోకి తీసుకు వెళ్ళింది. ఆ తర్వాత రోజంతా అప్పుడప్పుడూ అదే ఆలోచిస్తూ టపా రాసేయాలని కూర్చున్నాను. తను చెప్పింది చాలా నిజం అనిపించింది చిన్నపుడు ఎంతో అనందం గా జరుపుకున్న రోజును వయసు పై బడే కొద్దీ ఎందుకు వదిలేయాలి. మరో సంవత్సరాన్ని సక్సెస్‌ఫుల్ గా పూర్తి చేయగలగడానికి మనకి దొరికిన అవకాశాన్ని మనం సెలెబ్రేట్ చేసుకోవడానికి ఎందుకు ఆలోచించాలి అనిపించింది. మనసులో ఏదో మూల మరో సంవత్సరం వయసు మీద పడుతుంది అన్న బాధ ఉన్నా నామటుకు నాకు మాత్రం నా పుట్టినరోజు ప్రత్యేకమే....

సరే ఇక విషయానికి వస్తే నేను పుట్టినప్పుడు అద్భుతాలేమీ జరగలేదు ఓ ప్రశాంతమైన గురువారం తెల్లవారు ఝామున పుట్టానుట. మరీ చిన్నతనం లో పుట్టిన రోజులు ఎలా జరుపుకున్నానో నేనెప్పుడూ అమ్మను అడగలేదు నాకేమీ గుర్తులేదు. కానీ కొంచెం ఊహ తెలిసాక పుట్టిన రోజంటే చాలా ప్రత్యేకం గా ఉండేది. కాస్త ఊహ తెలిసే టైం కి మేము నరసరావు పేట్ వచ్చేసాం. పండగలప్పుడు కొత్త బట్టలు కొంటే అచ్చి రాలేదు అని మా ఇంట్లో పండగలకి ప్రత్యేకం గా బట్టలు కొనే అలవాటు లేదు దాని బదులు శ్రావణ మాసం లో ఒకే సారి కొనే వారు, మళ్ళీ పుట్టినరోజుకి కొనే వారు. కాకపోతే శ్రావణం తోనే పండగల సీజన్ మొదలయ్యేది కాబట్టి పండగలకి కొత్త బట్టలు లేవనే బాధ ఎప్పుడూ ఉండేది కాదు సంక్రాంతి టైం కి కొంచెం పాత పడేవి కానీ మిగతా పండగల టైం కి బట్టలన్నీ కొత్తగానే ఉండేవి. నాకైతే పుట్టినరోజు బట్టలు సంక్రాంతి టైం కి కూడా కొత్తగా ఉండేవి. ఇప్పుడు ఆలోచిస్తుంటే అనిపిస్తుంది ఎందుకో కానీ నాకెప్పుడూ పండగలకి ప్రత్యేకం గా డ్రెస్ లు లేవనే బాధ అస్సలు ఉండేది కాదు, అమ్మా నాన్న లు చూపించే ప్రేమ ముందు ఇలాంటి చిన్న విషయాలు అన్నీ కొట్టుకు పోయేవనుకుంటా.

మా ఇంట్లో పుట్టిన రోజులు చాలా ప్రత్యేకం గా జరిపే అలవాటు ఉండేది మినిమం ఒక రెండు మూడు వారాల ముందు నుండే కొత్త బట్టల విషయం గురించి డిస్కషన్ జరుగుతుండేది మరి టైలర్ టైం కి కుట్టి ఇవ్వాలి కదా మా టైలరు ఒకో సారి వెంటనే ఇచ్చే వాడు కానీ ఒకో సారి చాలా టైం తీసుకునే వాడు అందుకని నాకు కాస్త టెన్షన్ ముందు ఇవ్వకపోతే టైం కి అందివ్వడేమో అని. కానీ పాపం తను ఎప్పుడూ లేట్ చేయలేదు అనుకోండి. సో బట్టలు సెలెక్షన్ అయ్యాక స్వీట్స్. ముందు రోజు సాయంత్రం అయిదింటి నుండే నాకు గాబరా మొదలయేది నాన్న గారు టైం కి వస్తారా లేదా వీలవుతుందా లేదా అని :-) తను వచ్చాక కాఫీ టిఫిన్ లు అయ్యక అమ్మా నాన్న మరోసారి ఏమేం తేవాలో మాట్లాడుకుని నేనేమన్నా మధ్య లో మార్పులు చేర్పులు చెప్తే అవి చేసి లిస్ట్ తయారయ్యాక ఒక పెద్ద గ్రీన్ కలర్ బుట్ట ఉండేది అది తీసుకుని బజారుకి వెళ్ళేవారు.

మా నరసరావు పేట లో మల్లమ్మ స్వీట్‌షాప్ అని ఒకటుంటుంది చాలా ఫేమస్. పసలపూడి కధలు చదివిన వారికి ఎర్రనూకరాజుగారి జంక్షన్ కధ గుర్తుండి ఉంటుంది. మా మల్లమ్మ గారికి ఆ కధకి బోలెడు పోలికలు ఉన్నాయి మా ఊరిలో ఆ స్వీట్ షాప్ ఉన్న చోటుకి మల్లమ్మ సెంటర్ అన్న పేరు వచ్చిందంటే అర్ధం చేసుకోండి. మొదట్లో ఆవిడ అక్కడ బజ్జీలు పుణుగు లూ లాంటి చిరుతిళ్ళు వేసి అమ్మేది ఆతర్వాత ఆ పక్కనే ఓ స్వీట్ షాప్ పెట్టి పెద్ద వ్యాపారం చేసి బాగా సంపాయించినా ఓపిక ఉన్నంతవరకు ఆ స్వీట్షాప్ పక్కనే బాండీ ముందు కూర్చునే ఉండేది. ఊపిరున్నంతవరకూ తనకి అన్నం పెట్టిన ఆ చిన్న వ్యాపారాన్ని మాత్రం వదల్లేదావిడ. ఆవిడ ఉన్నంత వరకూ ఆ స్వీట్ షాప్ వైభోగమే వేరు వాటి రుచి ఇంకేక్కడా దొరికేది కాదు, మరి ఏం జరిగిందో కానీ ఆవిడతో పాటే ఆ బజ్జీల కొట్టూ, స్వీట్స్ లోని రుచీ, షాప్ లో కళా అన్నీ వెళ్ళిపోయాయి, కొడుకులు అంత సమర్ధవంతం గా నిర్వహించలేకపోయారు. .

అప్పట్లో నాన్న మల్లమ్మ స్వీట్‌షాప్ నుండే తెచ్చేవారు. రెండు మూడూ వెరైటీ లు కొంచెం ఎక్కువ తీసుకు వచ్చే వారు అంటే ఒకోటీ రెండు మూడూ కేజీ లు ఇవి అందరికీ పంచడానికి అనమాట. ఇక ఇంట్లోకి అని షాప్ లో ఉన్న అన్ని స్వీట్స్ రకానికి 150 / 200 గ్రాముల చొప్పున కనీసం ఒక 10 రకాలు తీసుకు వచ్చేవారు. అవన్నీ పుట్టిన రోజు నాడు ఒకో ప్యాక్ విప్పుతుంటే చూస్తుండటం ఒక గొప్ప సరదా. ఇక తను తెచ్చే స్వీట్స్ లో ప్రత్యేకం అంటే సోన్ హల్వా...(పక్కన ఫోటోలో ఉన్నది) చాలా గట్టిగా ఉండి పెద్ద చాక్లెట్ లాగా ఉంటుంది దాని తయారీకోసం ముడి సరుకు బాంబే నుండి తెప్పిస్తారట అని చెప్పేవారు నాన్న, బోలెడు నెయ్యి పోసి చాలా రుచిగా చేసే వాళ్ళు. ఇంకా వాటి పేరు తెలీదు కాని చిన్న చిన్న రసగుల్లాలాగా ఉంటాయ్ అవికూడా ప్రత్యేకం గా ఉండేవి. ఇంకా జీడిపప్పు తో చేసే మిఠాయి కూడా భలే ఉండేది. ఇక లడ్డూ, జాంగ్రీ మైసూర్పాక్ ఇలాంటివే కాకుండా ప్రతి ఏడూ ఏవో ఒక కొత్త రకాలు భలే చేసేవాళ్ళు ఆ షాప్ లో నాన్న కూడా మిస్ కాకుండా ప్రత్యేకం గా ఉన్నవి చూసి తెచ్చేవారు. కాని పాపం ఎంత జాగ్రత్త గా తెచ్చినా అమ్మ ఏదో ఒకటి కామెంట్ చేస్తూనే ఉండేది ఇవి తక్కువ తెచ్చావ్ ఇవి మర్చిపోయావ్ అని అంటూ కాని నాన్న ఎప్పటిలానే చిద్విలాసం గా నవ్వుతూ వింటుండేవారు. మా పుట్టిన రోజు నాడు పాపం నాన్న కి ఇవి తప్పని అక్షింతలు :-) అంటే అమ్మ గయ్యాళి అని కాదు పిల్లలకి ఇంకా బాగా చేయాలి అనే అతి ప్రేమ అనమాట.

స్వీట్స్‌తో పాటు కొన్ని రకాల హాట్ ఇంకా రెండు రకాల చాక్లెట్స్ తెచ్చేవారు బాగా చిన్నపుడు గ్రీన్ కలర్ రేపర్ లో ఉండే న్యూట్రిన్ చాక్లెట్స్ ఎక్కువ అందరికీ ఇవ్వడానికి తెస్తే మెలోడీ మాఇంట్లోకి ఇంకా కొందరు ప్రత్యేకమైన వారికి ఇవ్వడానికి తెచ్చేవారు. తర్వాత మహలాక్టో, ఆశా, మ్యాంగో బైట్, కాఫీ బైట్, క్యాడ్బరీస్, అల్పెన్లీబ్ ఇలా ఆ కాలం లో పేరు పొందిన వి అలా మారుతూ వచ్చాయి. ఇంక కేక్ విషయానికి వస్తే పుట్టిన రోజు పూట కత్తులూ కొయ్యడాలు ఏమిటి రా నో కేక్ అనేది అమ్మ. కాకపోతే చెల్లాయి తమ్ముడూ కొంచెం పెద్దయ్యే సరికి మెల్లగా దానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందనుకోండి. సరే ఆ స్వీట్స్ అన్నీ ఒక చిన్న పళ్ళెం లో దేవుడికి నైవేద్యం గా మరో పెద్ద పళ్ళెం లో మాకు సర్దేసి దేవుడికి కి నైవేద్యం గా పెట్టేసి అప్పటికే తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని రడీ గా ఉన్న నాతో దండం పెట్టించేసి పెద్ద పళ్ళెం ఎదురుగా కూర్చోబెట్టేవారు. ఆ తర్వాత నాన్న తో మొదలు పెట్టి వరసగా ఇంట్లో అందరూ ఒక్కొక్కరూ ఒకరి తర్వాత ఒకరు స్వీట్స్ హాట్ లలో నుండి కొన్ని రకాలు నోట్లో పెట్టి తినిపించే వారు అలాగే నేను వారికి తినిపించే వాడ్ని :-) నాన్న కొంచెం తక్కువ తక్కువ పెడితే అమ్మ చాలా పెట్టేది. ఇక చెల్లాయ్ తమ్ముడూ తో అయితే యే స్వీట్ బాగుందో చూసుకుని ఆ స్వీట్ ఎక్కువ తినిపించుకునే వాళ్ళం. ఇలా తినిపించుకోడం అయ్యాక అమ్మ ఇంటి దగ్గరి వాళ్ళకి ఇవ్వడానికి సర్ధడం లో మునిగిపోయేది మా పిల్లల బేచ్ ఏమో చాక్లేట్స్ వేసుకుని అందరికీ పంచడానికి వెళ్ళేవాళ్ళం. నాన్న పేపర్ అందుకుంటే మా పిన్ని ఏమో నాకు ఎంతో ఇష్టమైన సేమ్యా సగ్గుబియ్యం పాయసం చేయడం మొదలు పెట్టేది. కానీ అందరిలోకి యువరాజుని మాత్రం నేనే కర కరలాడే కొత్త బట్టలతో పొద్దున్నే పరగడుపున తిన్న స్వీట్స్ వల్ల వచ్చిన భుక్తాయాసం తో ఆపసోపాలు పడుతూ అటూ ఇటూ తిరుగుతూ ఉండేవాడ్ని :-)

స్కూల్ ఉన్న రోజులలో అయితే స్కూల్ కి, పిల్లలకోసం చాక్లెట్స్ ఇంకా టీచర్స్ కోసం స్వీట్ ప్యాకెట్ పట్టుకెళ్ళే వాడ్ని ప్రతీ పీరియడ్ లోనూ వచ్చిన టీచర్ కి లేచెళ్ళి స్వీట్ ప్యాకెట్ ఇవ్వడం ఆయన ఏంటి రా అని అడగడం పిల్లలంతా నాకన్నా ముందే ఈ రోజు వాడి పుట్టిన రోజు సార్ అని చెప్పడం నాకు ఇప్పటికీ గుర్తుంది. కానీ ఇప్పుడు తలచుకుంటే అనిపిస్తుంది ఆర్ధిక ఇబ్బందుల వల్ల నాలా చేసుకోలేని పిల్లలు బాధపడేవాళ్ళేమో పాపం. కానీ చాలా మంది చాక్లెట్స్ అయితే ఇచ్చేవారు లెండి. ఈ రోజు ఖచ్చితం గా చేసే ఇంకో పని అమ్మమ్మా వాళ్ళ ఇంటికి వెళ్ళడం. ప్రత్యేకం గా సర్దిన స్వీట్స్ పాయసం తో అమ్మమ్మా తాతయ్య ల దగ్గరికి వెళ్ళి ఆశీస్సులు తీసుకుని రావడం మాత్రం మర్చిపోకుండా ఖచ్చితం గా చేసేవాడ్ని. ఒకవేళ స్కూల్ లేకపోతే కొందరు ముఖ్యమైన ఫ్రెండ్స్ ని ఇంటికి పిలిచి స్వీటు హాటు కూల్ డ్రింక్ ఇచ్చేవాళ్ళం. కాకపోతే నేను ఇలా చేసింది తక్కువేలెండి. మా తమ్ముడూ చెల్లాయిలకి పాపం ఈ అవసరం పడేది. ఎందుకో తెలీదు పుట్టిన రోజుకి వచ్చిన బహుమతులు నాకు పెద్దగా గుర్తు లేవు. నేను ఇండియా లో ఉన్నంత కాలం ఎక్కడ ఉన్నా ఇంటికి వచ్చి పుట్టిన రోజు ఇంచు మించు ఇలాగే జరుపుకునే వాడ్ని. కాలేజ్ లో ఉన్నపుడు మిత్ర బృందం అంతా ఇక్కడే ఉండరా అనేవాళ్ళు కానీ నేను ముందో తర్వాతో పార్టీ ఇచ్చేవాడ్ని తప్పితే ఆ రోజు మాత్రం ఖచ్చితం గా ఇంట్లో ఉండే వాడ్ని. బాబ్రీ టైంలో కొంచెం అటూ ఇటూ తిరగడం ఇబ్బంది అయింది తప్పించి మిగతా అంతా బాగానే ఉండేది. బహుమతి అంటే గుర్తొచ్చింది నా ఇంజినీరింగ్ క్లాస్మేట్స్ ఓ పుట్టినరోజుకి ఇచ్చిన టైటన్ వాచ్ చాలా రోజులు వాడాను ఇప్పటికీ నా దగ్గరే ఎక్కడో ఉండాలి.

సో చిన్నప్పటి పుట్టిన రోజులు అలా జరిగేవనమాట చిన్నపుడేంటి లెండి ఇంట్లో ఉంటే ఇప్పటికీ అంతే జరుపుకుంటా :-) కాని మరి నిన్న ఇక్కడ చికాగో లో ఉన్నా కదా ఇలాంటివి ఏవీ లేవు కొంచెం డిఫరెంట్ గా సెలెబ్రేట్ చేసుకున్నా, ఫోన్ లో అందరి విషెస్ ఆందుకున్నాను విషెస్ లో ప్రత్యేకత అంటే కొందరు బ్లాగరు ఫ్రెండ్స్ నుండి అందుకున్న విషెస్, తోటి చికాగో బ్లాగరి శరత్ గారితో మొదటి సారి మాట్లాడటం వారి విషెస్ అందుకోడం మంచి అనుభూతి, ఇంకా వేరెవరో ఓ అపరిచితుడు నా ఆర్కుట్ ప్రొఫైల్ నచ్చి నాకు కాల్ చేసి విష్ చేయడం ఆనందాన్నిచ్చింది. ఇంకా నాకోసం ఓ నేస్తం చేసిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ చాలా అనందపరిచింది It made me to feel very special in fact. అలానే కంప్యూటర్ తో పెద్దగా పరిచయం లేని నా తమ్ముడు అమ్మా నాన్న చెల్లాయి తరపున వకాల్తా పుచ్చుకుని పంపిన మొదటి ఈకార్డ్ కూడా సంతోషపెట్టింది.

ఇంకా నిన్న ఉదయం ముఖ్యమైన ఫోన్ కాల్స్ అయ్యాక తల స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని దేవుడికి ఓ దండం పెట్టుకుని, నేను ఇండియా నుండి వచ్చేప్పుడు అమ్మ వాళ్ళు ఎయిర్పోర్ట్ లో ఇచ్చిన క్రాకిల్ మరియూ డెయిరీ మిల్క్ చాక్లేట్ లూ ఇంకా ఓ నేస్తం ఇచ్చిన మెలోడీ చాక్లెట్స్ అన్నీ తినేసి బయట కొంచెం పని ఉంటే అది చూసుకుని ఆ తర్వాత మా రూమ్మేట్ తో నిన్న TGI Fridays లో లంచ్ చేసి "స్లండాగ్ మిలియనీర్" సినిమాకి వెళ్ళాను. దీని కోసం కొన్ని వారాలు గా నవతరంగం లో రివ్యూ చూసినప్పటి నుండి మా ఇంటి దగ్గర లో ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నాను నిన్నటికి కుదిరింది. సినిమా చాలా నచ్చింది బాగుంది తప్పకుండా వెళ్ళి చూడండి. ఊహ తెలిసిన పిల్లలుంటే వారితో కూర్చుని చూడటం వారి ప్రశ్నలకి జవాబివ్వడం కొంచెం కష్టం ఏమో because it's raw film about slum life in Mumbai కానీ ఓవరాల్ గా సినిమా నాకు చాలా నచ్చింది. సినిమా నుండి వస్తూ ఇంటికి కావాల్సిన సరుకుల షాపింగ్ చేసి వాటితో పాటు ఓ చిన్న కేక్ తెచ్చుకుని చివరగా కేక్ కట్టింగ్ తో పుట్టినరోజు సెలబ్రేషన్స్ ని ఈ సంవత్సరానికి ముగించాను :-)

ఆర్కుట్ లో చూసి తెలుసుకుని అందరికన్నా ముందు గా (అవును ఓ రెండ్రోజులు ముందుగానే:)

ధృవం తె రాజా వరుణొ ధ్రువం దెవొ బృహస్పతిహ్ |\\
ధృవం త ఇంద్రష్చాగ్నిష్చ రాశ్ట్రం ధారయతాం ధ్రువం ||\\
శీఘ్రమేవ కల్యాణ ప్రాప్తిరస్తు

అని అంటూ దీవించిన బ్లాగర్ నేస్తం, అందరికీ తెలిసిన నలభీమ, భాస్కర్ గారి దీవెనల గురించి చెప్పడం మరిచాను. ఈ సారి నేనందుకున్న బెస్ట్ విషెస్ ఇవే నిజానికి. ఈ సారికి క్షమించెయ్ అన్నాయ్.

33 కామెంట్‌లు:

  1. baagaa tapaayinchaaru malle okasaari reel rewind chesukoni :)

    రిప్లయితొలగించండి
  2. good post
    you have an art of making seemingly taken for granted things seem very special.
    busy running in the journey called life we seldom take a second look at the bus we climb every day or the path we walk. but if we go back to those wonderful days when papa used to take us by hand and say half ticket...the way we used to wonder at the colourful tickets, even collect them like very precious things..try desperately to imitate the cunductors whistle when he stops the bus ..the way we wonder why some buses are red and some are green..attempting to read the name plates without mistakes.....the jelousy on poeple who could travel sitting on the top of the bus...
    and look at every thing in wonder and awe the grass growing along the road..a litter of newborn pups cuddled together, wanting to take away one home but afraid of the snarling mother dog......the soap bubble maker at the exibition .......the gas balloons...the pony rides......pleading grandmother for a sip of tea while mama is not looking.....trying to catch dragonflies.....jumping in puddles of rain...the purpose of life was enjoyment...actually there was no purpose..whatever we did was done out of joy....
    and now............
    we r always busy looking at our watches and don't seem to notice any thing else around....targets, deadlines, gobbling up coffee, phew.....

    anyways that was just a feeling felt

    belated wishes
    HAPPY BIRTHDAY VENU SRIKANTH :)

    రిప్లయితొలగించండి
  3. వేణు గారు మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు (కొంచెం ఆలస్యంగా)
    మొదటి సారి మీ బ్లాగులోకి తొంగి చూశాను.
    నా బాల్యంలోకి ఒక సారి అలా అలా రెక్కలు కట్టుకొని వెళ్ళివచ్చాను. మీ భావాలను చదువుతూ ఉంటే
    మరచిపోలేని భావాలు,మరపురాని భావాలు నాకు ఉన్నాయే అని అనిపించింది.
    కాకపోతే మీలాగ భావ వ్యక్తీకరణ చేయలేను.
    కాని ఎదుటివారి భావాలను ఎంతో ఇష్టంగా, ఎంతో శ్రద్ధగా చదువుతాను.
    వారి భావాలలో నా భావాలు ఏమైన ఉంటే తెగ సంతోషిస్తాను.
    వీలు చూసుకొని మీ బ్లాగు మొత్తం ఒక సారి చదివి అభిప్రాయాలు తెలియచేస్తాను.
    సరళమైన,స్పష్ఠమైన "అనగనగా ఓ డిశంబర్ 6 " చాలాబావుంది.

    vani...

    రిప్లయితొలగించండి
  4. జన్మదిన శుభాకాంక్షలు.మీ ఆలోచనా స్రవంతిని అక్షరబద్ధం చేసిన శైలి బాగుంది.

    రిప్లయితొలగించండి
  5. బాగా రాసారు వేణు.
    మీకు పుట్టినరోజు శుభాంకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  6. బాగున్నాయ్ వేణూ మీ పుట్టినరోజు జ్ఞాపకాలు...

    Belated Birthday Wishes to you................ Enjoy life..

    రిప్లయితొలగించండి
  7. Belated birthday wishes venu!!!!!even my sister's birthday is also on december 6th.......

    రిప్లయితొలగించండి
  8. SORRY, I missed it too :((

    Belated happy birthday..
    Hope you have had a wonderful cold birthday :-)

    రిప్లయితొలగించండి
  9. నేను అలిగా!!!
    నా పసుపచ్చని తోక ఏది?

    నాకొద్దులే, నువ్వే ఉంచుకో!!

    రిప్లయితొలగించండి
  10. పుట్టినరోజు శుభాకాంక్షలు వేణు!

    రిప్లయితొలగించండి
  11. అబ్బ, ఎన్నెన్ని స్వీట్లు గుర్తు చేశారు!
    Happy birthday!
    -teresa

    రిప్లయితొలగించండి
  12. ఆలశ్యం గా పుట్టినరోజు శుభాకాంక్షలు.మా ఇంట్లో కూడా ఇలానే చేసుకునేవాళ్ళం.వీటితో పాటూ అక్షింతలు వేయించుకోవడం కూడా వుండేది.ఆ ప్రోగ్రాం అంటే నాకు చాలా ఇష్టం.ఎందుకంటే అక్షింతలు వేసాకా డబ్బులు ఇస్తారు గా :) ఇంటి చుట్టుపక్కలవాళ్లకి సేమ్యా,అమ్మ చేసిన కేకు,చాక్లెట్లు గారెలు పట్టుకెళ్ళి ఇవ్వడం...ఇంకా గుర్తు.స్కూల్లో అయితే పుట్టినరోజునాడు స్పెషల్ గా చూస్తారు.హోంవర్క్ చెయ్యకపోయినా,తప్పుచేసినా కొట్టరు :)తిట్టరు కూడా.ఎంత బర్త్ డే టపా అయితే మాత్రం అన్ని స్వీట్స్ ఫొటోలు పెట్టేయాలా?ఇదేమీ బాగోలేదు.నేను చికాగో వచ్చినప్పుడు ఆ స్వీట్లన్నీ నాకు పోట్టకపోవాలి అప్పుడుంటుంది మీ పని :)

    రిప్లయితొలగించండి
  13. వేణు శ్రీకాంత్ గారు, పుట్టిన రోజు శుభకాంక్షలు.

    మీరు చూపించిన చిన్న చిన్న రసగుల్లల్ని చమ్‌చమ్ అంటారు. మేము మాత్రం అంగూర్ అని పిలిచేవాళ్ళము. అమ్మమ్మ గారింటికి వెళ్తే ఇవి లెకుండ మా రొజు గదిసేది కాదు.

    ధన్యవాదములు చిన్నప్పటి విశేషలన్ని మాతొ పంచుకున్నందుకు, మాకు గుర్తు చేసినందుకు. - రాణీ

    రిప్లయితొలగించండి
  14. పుట్టినరోజు శుభాకాంక్షలు. మీజీవితం మూడు పాటలూ ఆరు రాగాలుగా సాగాలని కోరుకుంటూ

    రిప్లయితొలగించండి
  15. @ ఒకటవ Anonymous Thanks for your comments.

    @ రెండవ Anonymous Thanks for your wishes, what ever you said was true those were wonderful memories and at any point in life if you take a moment to revisit them, those memories will breath some life in to our otherwise boring routine. your comments made me to recollect several memories and gave topics for my next posts.

    @వాణి గారు థ్యాంక్యూ, మీ కామెంట్స్ నా బ్లాగ్ లో చూడటం సంతోషం గా ఉంది. భావ వ్యక్తీకరణ ఏమీ లేదండీ మనం మన ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నట్లు గా రాసేయడమే మీరూ త్వరలో ఓ బ్లాగ్ మొదలు పెట్టేయండి.

    మీనూ, శ్రావ్య, చైతన్య గారు, మహేష్ గారు, జ్యోతి గారు, రిషి గారు, ఉమాశంకర్ గారు, మీ అందరికీ నెనర్లు, Thanks a lot for your wishes. నా శైలి నచ్చినందుకు ధన్యవాదాలు నిన్న ఏదో ఆవేశం లో అలా వచ్చేసింది.

    @ దీప్తి గారు, Thanks for your wishes మీ సిస్టర్ కీ కూడా నా తరపున belated wishes తెలియచేయండి.

    @ నిషిగంధ గారు నెనర్లు, Thanks for your wishes, ya it was pretty cold కానీ చలిని లెక్క చేయకుండా తిరిగేసాను :-) అయ్యో సారీ ఎందుకండీ మికు తెలియదు కదా నా పుట్టినరోజు ఎప్పుడో, So no worries

    @భాస్కరా ముందు చెప్పడం వల్ల వచ్చిన తంటాలు బాబు అవి... అయినా మిస్ చేస్తే ఎలా అని వెంటనే తోక తగిలించేసా చూసారా.. మరో సారి thanks for your comments and wishes

    @ప్రవీణ్ thanks for your wishes

    @ తెరెసా గారు Thanks for the wishes మరి పుట్టిన రోజంటే స్వీట్లే కదండీ...

    @రాధిక గారు నెనర్లు, మా ఇంట్లో అక్షింతల ప్రోగ్రాం లేదు కానీ స్కూల్ లో ప్రత్యేకత గురించి మర్చిపోయానండోయ్ బాగ గుర్తు చేసారు ఆ రోజు ఆలశ్యం గా వెళ్ళచ్చు హోంవర్క్ లాటి వాటికీ కన్సెషన్ ఉండేది.

    @ రాణీ గారు Thanks for your wishes ఆ అవునండీ చం చం కరెక్టే... నాకు నిన్న గుర్తు రాలేదు.

    @కొత్తపాళీ గారు నెనర్లండీ... మ్ రాగాలతో సరిపెట్టేసుకోవాల్సిందే అంటారు :-)

    రిప్లయితొలగించండి
  16. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  17. వేణు గారు మీరు అన్న ఆ ఒక్క మాట నాతో బ్లాగు మొదలుపెట్టేలా చేసింది. అలాగే మీ బ్లాగులో ఉన్న అందరి బ్లాగులు చదివే పనిలో పడ్డాను. త్వరలోనే నేను వ్రాయగలను అని అనుకుంటున్నాను.

    thanks venu garu..

    vani

    రిప్లయితొలగించండి
  18. వేణూ శ్రీకాంత్ గారు... లేట్ గా చెబుతున్నందుకు అన్యధా భావించకండి...
    "జన్మదిన శుభాకాంక్షలు."... మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపులోవాలని కోరుకుంటూ...
    అన్నట్లు టపా చాలా బావుంది...

    రిప్లయితొలగించండి
  19. వేణు ,

    మీ మాట లాగే మీ రాత కూడా ముచ్చటగా వున్ది..అది చదువుతుంటే మనసులో ఎక్కడో గెలికినట్టణపించింది. ఇప్పుడు ఆ బర్త్‌డే లన్నీ తలుచు కోవాలంటే నే మనసు రావటం లేదు.. ఎందుకంటే ఆ రోజులు ఇంకా రావానే నిజాన్ని వొప్పుకోలేక
    :-(..
    భావాలన్నీ వ్యక్తీకరించడం కూడా ఒక కళె ...ఆది మీకు చక్కగా వచ్చింది సరస్వతీ పుత్రులు లాగా..

    మరొకసారి, చక్కగా రాసినందుకు...Congrats..

    God Bless you and wish you many more successful years.

    రిప్లయితొలగించండి
  20. వాణి గారు చాలా మంచి పని చేసారు. Good, Happy blogging.
    మేధ గారు నెనర్లు. టపా నచ్చిందనమాట. Thanks for your wishes.
    బాబా గారు Thanks for your wishes.
    Anonymous gaaru thanks for your wishes.

    రిప్లయితొలగించండి
  21. పుట్టిన రోజు శుభాకాంక్షలు బారసాల రోజు చెప్పినట్టు.... నేను చాలా ఆలస్యం గా చెప్పినా...

    పుట్టిన రోజు ఒక్కరోజుకే కాదు... సంవత్సరం మొత్తానికీ అందుకోండి. ;-0

    గీతాచార్య.

    రిప్లయితొలగించండి
  22. మల్లమ్మ షాపులో మైసూర్ పాక్ అంత స్వీట్ గా ఉన్నాయి మీ పుట్టిన రోజు జ్ఞాపకాలు!

    ఊర్లో లేకపోవడం వల్ల ఆలస్యంగా అందిస్తున్న శుభాకాంక్షలు అందుకోండి. మీరిలాగే బోలెడు పుట్టినరోజులు జరుపుకుంటూ, మా అందరితో ఇలా తీయని జ్ఞాపకాలు పంచుకోవాలని, కోరుకుంటున్నా!

    అన్నట్టు శీఘ్ర మేవ సుకన్యా ప్రాప్తిరస్తు! కళ్యాణ ప్రాప్తిరసు!

    రిప్లయితొలగించండి
  23. బోలెడు నెనర్లు సుజాత గారు, మీ కామెంట్స్ కీ మీ అశీస్సులకీ...

    రిప్లయితొలగించండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.