శుక్రవారం, అక్టోబర్ 09, 2009

ఐస్..పుల్లైస్..పాలైస్..

వేసవి శలవల్లో మండే ఎండలలో మధ్యాహ్నం పన్నెండు గంటల సమయం లోనో లేదా మూడు గంటల సమయం లోనో చల్లని ఈ పుల్ల ఐస్ చప్పరిస్తుంటే ఆ ఆనందం మాటలలో చెప్పతరమా చెప్పండి. అసలు ఈ రుచి ఎరుగని జన్మ ఒక జన్మేనా అనిపిస్తుంది నిజంగా. తర్వాత తర్వాత ఐస్క్రీములు వచ్చి వీటి అమ్మకానికి గండి కొట్టాయ్ కానీ నా చిన్నతనం లో ఇవే రారాజులు. వీధిలో కేక వినబడగానే ఏ పని చేస్తున్నా వెంటనే అలర్ట్ అయిపోయే వాడిని. ఒకో రోజు కాస్త పెద్ద వాళ్ళు మాత్రమే తీసుకు రాగలిగే రెండు చక్రాల చిన్న తోపుడు బండి లో తెచ్చేవాడు. ఆ బండి భలే ఉండేది చెక్కతో చేసిన పెద్ద పెట్టె, దాని లోపల థర్మోకోల్ అట్టలూ, పింక్ లేదా ఎర్రని ప్లాస్టిక్ బబుల్ రాప్‍తో బాగా ఇన్సులేట్ చేసి వాటి సాయం తోనే పెట్టెని అరలు గా విభజించి ఆ అరల్లో రక రకాల ఐస్ఫ్రూట్ లు నింపి తెచ్చే వాడు. అంత పెద్ద పెట్టెకూ పైన ఒక వృత్తాకారపు చిన్న మూత మాత్రమే ఉండేది. ఆ మూత తీసి ప్లాస్టిక్ కాగితాలు అలా పక్కకి జరిపి కేవలం రెండు మూడు చేతులు మాత్రమే పట్టే ఖాళీ లో చేయిపెట్టి, వాడు డబ్బా లోకి చూడకుండ్ blindfold ఆడుతూ, మనం అడిగిన రకాన్నిబట్టి చేతిని ఒకో వైపు తిప్పి మనకి కావాల్సిన ఐస్ఫ్రూట్ బయటకి తీసి పట్టుకోగానే ఇక మన ఆనందానికి అవధులు ఉండవు. ఇదంతా ఒక ఎత్తైతే డబ్బా పై రంగు రంగుల ఆకర్షణీయమైన బొమ్మలూ కొన్ని బండ్లకు ఉండే చిన్న సైజ్ గంట ఒకటీ మరో ప్రత్యేకమైన ఆకర్షణ.

ఈ బండి దగ్గర కొనాలంటే మనం రోడ్డు మీదకి వెళ్ళాలి కదా అలా కాకుండా దాదాపు మన అంత వయసే ఉన్న ఓ చిన్న కుర్రాడు లోపల అంతా థర్మాకోల్ అట్టలతో ప్లాస్టిక్ కవర్ తో ఇన్సులేట్ చేసిన బ్రిటానియా బిస్కట్ డబ్బా లో పెట్టి దానికి ఒక తాడు కట్టుకుని భుజాన మోసుకుంటూ అమ్మటానికి తెచ్చే వాడు. వాడైతే చక్కగా మన గుమ్మం ముందుకే వచ్చిఇస్తాడు. ఎఱ్ఱ ఐస్, తెల్లని పాలైస్, ద్రాక్షా ఐస్, కొబ్బరి ఐస్, సేమ్యా ఐస్, ఇలాచీ ఐస్, మ్యాంగో ఐస్ ఇలా ఒకో సమ్మర్ కి ఒకో కొత్త రకం తెచ్చేవాడు. ఎన్ని రకాలు ఉన్నా గోల్డ్ స్పాట్(ఇది అప్పట్లో దొరికే కోలా, ఈ రుచి ఇప్పుడు దొరికే వాటిలో ఎక్కడా నాకు తగల్లేదు, కాస్త ఆరెంజ్ రుచి అనుకోవచ్చు, ఇప్పటి పిల్లలికి తెలియాలి అంటే మిరిండా రుచి అని చెప్పచ్చేమో!) లాంటి రుచితో వచ్చే ఎఱ్ఱ ఐస్ మాత్రం నా ఫేవరెట్, దాని తర్వాత ఇష్టమైనది పాలైస్, ఎప్పుడైనా వేరే ఫ్లేవర్ ప్రయత్నించాలి అంటే గోల్డ్ స్పాట్ ఐస్ మిస్ అవుతానే అని తెగ ఫీల్ అయ్యే వాడ్ని నా బాధ చూడ లేక అమ్మ "సరే రెండూ కొనుక్కో రా.." అని పర్మిషన్ ఇచ్చేది ఒకో సారి :-)

ఎఱ్ఱని గోల్డ్ స్పాట్ ఐస్ సాదా గా ఉండేది, ఇలాటి సాదా ఐస్ ల లోనే తర్వాత తర్వాత ద్రాక్ష, ఆరెంజ్, మామిడి, యాలుకలు ఇలాటి రుచులు తెచ్చేవాడు ఇవన్ని రుచి వేరైనా ఆకారం ఒకే రకంగా దీర్ఘ చతురస్రాకారపు క్యూబ్ ల్లా ఉండేవి పైన బొమ్మ లో చూపినట్లు. వీటికి భిన్నంగా సన్నగా, షడ్బుజాకారం లో సిలిండర్ లా ఉండి తెల్లగా మెరిసి పోయే పాలైస్ రుచి మాత్రం అద్భుతం గా ఉండేది. అప్పట్లో ఇది ఖరీదు ఎక్కువ కూడా, మాములు ఐస్ అర్ధరూపాయి ఉంటే ఇది రూపాయి ఉండేది. కాని రుచి మాత్రం యమా ఉండేది లెండి ఆ ఆకారం కూడా ఇంక మళ్ళీ దేనికి ఉపయోగించలేదు. కొన్నాళ్ళ తర్వాత మాములు బార్ షేప్ లో కూడా పాలైస్ తెచ్చే వాడు. దీనికే ఒక చివర కొబ్బరి కోరు అద్దితే కొబ్బరి ఐస్, సేమ్యాలు అద్దితే సేమ్యా ఐస్, యాలుకల పొడి అద్దితే ఇలాచి ఐస్. ఇలా అద్దడం కాకుండా ఒకోసారి పొడవుగా కోసిన కొబ్బరి ముక్కలు రెండు పెట్టి కూడా చేసే వాడు కొబ్బరి ఐస్, అలాగే ద్రాక్ష రుచి ఉన్న ఐస్ లో చివర రెండు ద్రాక్షాలు వచ్చేలా చేసే వాడు. సేమ్యా ఐస్ లో కూడా చివర అద్దడం కాకుండా ఐస్ అంతా నిండుగా సేమ్యాలు నింపి చేసే వాడు.

నాకు ఈ సేమ్యా ఐస్ ఎలా చేస్తారో ఎప్పటికీ అర్ధమయ్యేది కాదు. నీళ్ళలో సేమ్యా వేయగానే నీళ్ళు ఐస్ లా గడ్డ కట్టే లోపే సేమ్యా అడుగుకి వెళ్ళి పోతుంది కదా ఐస్ అంతా పరుచుకుని ఉండేలా సేమ్యాలతో ఎలా తయారు చేస్తాడా అని తెగ ఆలోచించే వాడ్ని, బహుశా కాస్త గడ్డ కట్టడం మొదలయ్యాక కలుపుతాడేమో లే అని సరిపెట్టేసుకున్నా... తర్వాత కొన్ని రోజులకి ప్యాకెట్ ఐస్ బాగా ఫేమస్ అయింది. ఈ పక్కన చూపించినట్లు పొడవాటి సన్నని ప్లాస్టిక్ ప్యాకెట్ లో రక రకాల రుచులు గల నీరు నింపి ఫ్రీజ్ చేసి తెచ్చే వాడు మనకి ఇచ్చేటప్పుడు దానికి ఒక మూల బ్లేడ్ తో కోసి అందించే వాడు ఎందుకనో మా ఇంట్లో ఈ ఐస్ కొనుక్కోడానికి ఒప్పుకునే వారు కాదు. సో ఇది మనం డబ్బులు దాచుకుని సీక్రెట్ గా బడిదగ్గర ఇంటర్బెల్ లో మత్రమే కొనుక్కోవాలనమాట. కాని ఆ అవకాశం మనకొచ్చింది బహుస్వల్పం మొత్తం మీద దీని రుచి పెద్దగా చూడకుండానే నేను స్కూల్ దాటేశాను. ఆ తర్వాత ఇవన్నీ మోటైపోయి చిన్న చిన్న పేపర్ కప్పుల్లో నాజూకుగా చెక్క స్పూన్ లతో తినే ఐస్క్రీములు ఫేమస్ అయిపోయాయి. క్వాలిటీ ఈ ఐస్క్రీమ్ మార్కెట్టును దీర్ఘకాలం ఏలింది అనుకుంటా ఆ తర్వాత అరుణ్ వచ్చేది. అప్పట్లో వీటిని మార్కెట్ చేయడానికి మాములు కప్ లు కాకుండా వాలీ బాల్ ఆకారం లో చేసిన కప్ లు కూడా వచ్చేవి క్వాలిటీ వాడివి, కానీ ఎందుకో నాకు ఐస్ నచ్చినంతగా ఐస్క్రీమ్ లు నచ్చక పెద్దగా ఫాలో అవలేదు... ఏదేమైనా పుల్లైస్ కి ఉండే రుచి ఈ ఐస్క్రీములకి ఎక్కడిది చెప్పండి.

ఇలా నేను కమ్మటి ఊహలలో ఉండగా హఠాత్తుగా వాస్తవం కరిచింది... ఈ ఐస్క్రీముల పుణ్యమో ఏమో కానీ అలాంటి ఐస్ అమ్మే చిన్న పిల్లలు తర్వాత కాలం లో ఎప్పుడూ కనిపించ లేదు, బహుశా ఇప్పుడు అసలు రావట్లేదేమో మరి. వాడు తెచ్చే ఐస్ రుచి గా ఉన్నా, వాడ్ని చూస్తే జాలేసేది. ఇప్పుడు తలచుకుంటే మరీ పాపం అనిపిస్తుంది. వాడిది మనలాగే వేసవి శలవలను ఆనందంగా ఆడుకుంటూ గడప వలసిన బాల్యం అన్న స్పృహ నాకు అప్పట్లో తక్కువే ఉండేది కానీ. ఐస్ లు నింపిన బరువైన బ్రిటానియా డబ్బాని భుజాన మోస్తూ, నిండు వేసవి మండుటెండ లో దదాపు కరిగిపోయిన తారు రోడ్, అరిగిపోయి చిల్లులు పడ్డ స్లిప్పర్స్ లో నుండి వాడి లేత అరికాళ్ళపై తన ప్రతాపాన్ని చూపిస్తుంటే, పరుగో నడకో అర్దం కాని నడక తో వాడు ఇంటింటికీ తిరిగే వాడు. పాపం భుజాన అన్ని ఐస్ఫ్రూట్ లు ఉన్నా దాహం తీర్చుకోవాలంటే ఎవరన్నా ఇంట్లో వాళ్ళు ఇచ్చే గుక్కెడు మంచినీళ్ళే గతయ్యేవి. ఒకోసారి నాతో పాటు మా వీధిబడి లో చదివే పిల్లలు కూడా ఇలా అమ్మడానికి వచ్చేవారు. వాళ్ళ అవస్థలు తలచుకుంటే ఈ పుల్లైస్ లు ఇపుడు తక్కువగా దొరకడమే మంచిదైందేమో అనిపిస్తుంటుంది.

31 వ్యాఖ్యలు:

 1. hm!!
  మంచి జ్ఞాపకాలు సోదరా!! మనవైపు ఐస్ కంపెనీలు ఉండేవి. ఓ పెద్ద ఎస్టాబ్లిష్మెంట్లు ఉండేవి గుర్తుందా? ప్రతీఊళ్ళో ఉంటాయి ఇవి.
  ఒకరకంగా పుల్లైస్ తగ్గిపోవటమే మంచిది. కారణం వాళ్ళు రకరకాల రంగులు వాడతారు, ఏ నీళ్ళు వాడతారో తెలవదు. పైగా నువ్వన్నట్టు పిల్లల్తో ఐస్ అమ్మిస్తారు.
  కొన్ని కొన్ని కేవలం జ్ఞపకాల్లో ఉంటమే మంచిది.
  నేను చిన్నప్పుడు పుల్లైస్ బాగనే తిన్నా, తర్వాత్తర్వాత ఎందుకో ఐస్ అన్నా ఐస్క్రీం అన్నా పెద్ద ఇష్టం ఉండేది కాదు. కారణం - ఐస్క్రీం తినేప్పుడు సల్లగా బానే ఉన్నా, తర్వాత దాహం ఎక్కువౌవుద్ది. గమనించావా?

  ప్రత్యుత్తరంతొలగించు
 2. అవున౦డి,పుల్ల ఐస్ రుచి ఏ ఐస్ క్రిమ్ కి రాదు.
  మా తతయ్య ఒ౦టికి మచిది కాదని వాళ్ళు మ౦చి నీళ్ళు వాడరని కారణ౦ తో కోనుకోనిచ్చెవారుకాదు.మేము రోడ్డు మీద ఎవరో ఒకరిని ప౦పి కొనుకునేవాళ్ళ౦.
  నాకు ,సేమ్య ఐసు తెగనచ్చెది.మాకు ఐసులు అమ్మే అబ్బాయి పేరు రా౦బాబు.
  ఇ౦క హర్లిక్స్,బార్నవిటా ప్లేవర్స్ కూడా ఉ౦డేవి.మీరు చెప్పే పాల ఐసునే మేము కుల్ఫి అనేవాళ్ళ౦.మా చిన్నాన్న ఉళ్ళొ ఉ౦టె మాత్ర౦ తిన్నన్ని కోనేవారు.కవరైస్ కుడా భలే ఉ౦డేది..ఇప్పుడు ఉన్నాయా???
  నేను పోస్టే రాసేస్తునట్లు ఉన్నాను.బాగు౦ది మీ ఐసు పొస్ట్.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. మాకు అప్పుడప్పుడు పుల్లైస్ తినే పర్మిషన్ దొరికేదండీ..."టింగ్ టింగ్.." అని బండివాడు కొట్టే గంట సందు చివరి నుంచో,పక్క సందులోంచో వినిపిస్తూ ఉండేది...

  ఆ రెండోది...సన్నగా పొడుగ్గా ఉన్న ఐస్ ని మా స్కూల్లో "లాలీస్" అనేవారు.స్కూల్ కేంటీన్లో అమ్మేవారు.నాకు చాలా నచ్చేది.పేకెట్కి ఓ చివర చిన్న చిల్లు పెట్టుకుని చప్పరించి చప్పరించి తినే వాళ్లం....భలే ఉండేవి అవి.ఆరెంజ్,మాంగో,ద్రాక్ష.. అలా మూడు నాలుగు ఫ్లేవర్స్ ఉండేవి.

  కాని అవేమీ మంచివి కావని పెద్దయ్యాకే తెలిసింది..but those are good memories..

  ప్రత్యుత్తరంతొలగించు
 4. సుభద్ర గారు ..
  పాల ఐస్ .. కుల్ఫీ రెండు వేరు వేరు అండి రెండు ఒకటి కాదు.. పాల ఐస్ తెల్లగా ఉంటుంది .. .కుల్ఫీ కొంచం క్రేఅమిష్ రంగు..కుల్ఫీ లో వాడే పదార్థాలు వేరు...

  వేణు గారు ...
  మీకు సబ్జా ఐస్ తెలిదు అనుకుంటా ... ఐస్ చివర సబ్జా ఇత్తులు ఉండే ఐస్ ఒకటి ఉండేది.. అది చలవ చేస్తుంది అని చెప్పేవారు.... ఆ వయసులో పిల్లలని అలా చూడటం నిజంగానే బాధ... క్వాలిటీ వాడి బాల్ ఐస్ కొంచం క్రేజ్ గానే ఉండేది మాకు...

  ప్రత్యుత్తరంతొలగించు
 5. సబ్జా ఐస్.. అంటే సగ్గుబియ్యం ఐసేనా? నాకు తెలుసు , నాకు తెలుసు :-) నా ఫేవరిట్. కొబ్బరైస్ కూడా.

  మా ఊర్లో ఐస్ బోయ్‌లు ఐసమ్మే పద్దతి కొంత రూడ్‌గా ఉండేది. కస్టమర్లంటే ఏ మాత్రం గౌరవం లేకుండా 'ఐస్ రోయ్, ఐస్ రోయ్' అని అరుచుకుంటూ వచ్చేవాళ్లు. బండ్లు నెట్టుకొచ్చే కొందరు 'ఐస్‌రోయ్'ల దగ్గర స్పెషల్ అట్రాక్షన్‌గా లాటరీ సదుపాయం కూడా ఉండేది - వీల్ ఆఫ్ ఫార్చూన్ అన్నమాట (అయితే bankrupt ఆప్షన్ ఉండేది కాదులెండి. చక్రం ఎంత చెత్తగా తిప్పినా మినిమమ్ 1 ఐస్ గ్యారంటీ)

  మంచి జ్ఞాపకాలు గుర్తు చేశారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. సబ్జా ఐస్.. అంటే సగ్గుబియ్యం ఐసేనా? నాకు తెలుసు , నాకు తెలుసు :-) >>> కాదు కాదు కాదు కదా ?
  సబ్జా ఐస్.. - అంటే ఇవి సబ్జా గింజలని నల్లని గింజలతో చేస్తారు . సగ్గుబియ్యం తెల్లగా ఉంటాయి.
  అబ్బ వేణు గారు ఇప్పుడు ఐస్ తినాలనిపిస్తుంది ఎలా ? పోస్టు సూపర్ !

  ప్రత్యుత్తరంతొలగించు
 7. ఏమో, ఇప్పుడైతే రంగులు మంచివి కాదు, నీళ్ళు మంచివి కాదు అని పిల్లల్ని ఏమీ తిననివ్వట్లేదు కానీ చిన్నప్పుడు ఆ పుల్ల అయిసు తినకుండా ఎవరమూ పెరగలేదు. మాకసలు ఏ రోగాలూ వచ్చేవి కాదు, కనీసం జలుబు కూడా వచ్చేది కాదు!

  ఇందులో పాలైసు,బాదాం ఐసు,సేమ్యా ఐసు..ఎన్నెన్ని రకాలు? వేసవి సెలవుల్లో పిల్లలంతా బండి చుట్టూ చేరి కలర్స్ సెలెక్ట్ చేసుకోవడంలో ఉన్న ఆనందం ఇంకెక్కడ దొరుకుతుంది? కాలే కాలే ఎండల్లో మధ్యాహ్నం వేళ "ఐసో "అంటూ కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా వచ్చే బండి వాడికి మా నాన్న ఒకసారి చెప్పులు కొనిపెట్టారు.

  శ్రీ,

  సబ్జా గింజలు చలవ చేస్తాయని వాటిని నీళ్ళలో వేసి చక్కెర కలిపి తాగేవాళ్లం మేము. అవి నీళ్లలో వేసిన కాసేపటికి తెల్లగా బెలూన్లలాగా ఉబ్బి గ్లాసంతా పరుచుకునేవి! భలే గుర్తుంది మీకు.

  అబ్రకదబ్ర,
  సబ్జా ఐసు, సగ్గుబియ్యం ఐసు ఒకటి కాదు!

  మా వూరెళ్ళినపుడు "జలుబు చేస్తే చేసిందిలే"అని మా అమ్మాయికి కూడా పుల్ల ఐసు కొనిపెడతాను నేను, ఆ మజా ఆమెకు మాత్రం తెలియద్దూ అని.(పన్లో పని నేను కూడా రెండో పన్నెండో కానిస్తా)

  ప్రత్యుత్తరంతొలగించు
 8. ఓ ఐసన్నా.. ఒకైసిత్తావా?

  "ఆహా ఇదొద్దు ఎర్రైసు కావాలి"
  "ఇదొద్దు ఇది కరిగి పోయింది"

  ఓ ఐదు నిమిషాల తరువాత

  " నా నాలిక ఎర్రగైందా?"

  ప్రత్యుత్తరంతొలగించు
 9. వేణు గారు పోస్ట్ అదుర్స్ .. మీరు చెప్పిన ఐసులన్నీ నేను తిన్నానోచ్..
  @అబ్రకదబ్ర గారు ఐసురోయ్ నా :D
  భాస్కర్ రెడ్డి గారు ..నా నాలుక ఎర్రగా అయ్యిందా... హే హే సూపర్ ఇలా అనుకోని పిల్లలు ఉండరేమో :)

  ప్రత్యుత్తరంతొలగించు
 10. చక్కని టపా... ఎన్నో అనుభవాల తుట్టను కదిపారు.
  చిన్నప్పుడు తినని ఐసు లేదు. పెద్దయ్యాక తినని ఐస్‌క్రీము లేదు.

  అప్పటి నుంచి ఇప్పటివరకూ నిరాటంకంగా నా కృషి నేను చేస్తూనే ఉన్నాను :-)

  ప్రత్యుత్తరంతొలగించు
 11. ఐస్క్రీం ముచ్చట్లు భలే చల్ల చల్ల గా ఉన్నాయండి. వేసవికాలంలో అప్పుడప్పుడు చిన్నా తొపుడుబండిలో ఈ తరహ ఐస్ క్రీం అమ్మేవాళ్ళు ఇప్పటికీ మా ఇంటిముందు కనిపిస్తూనే ఉంటారు కాని నాకే భయం, రంగునీళ్ళు, ఐస్ కూడా మంచిదవునో కాదో తెలుసుకోలేక.... పిల్లలు ఎంత కొనిపెట్టమన్న కొనను. (ఏవో వింటూ ఉంటాము కదా.... చావుకీ పెళ్ళి కీ ఒకే మంత్రంలా ఒకే ఐస్ అని) అప్పట్లో మటుకు పావలాకి పాల ఐస్‌క్రీం అంటూ మధ్యాన్నం ఎదురుతెన్నులు కాచేవాళ్ళము అప్పుడు తిన్న రుచులు అవి ఇప్పుడు చూస్తుంటే కూడా రావడంలేదు.

  మీరు చెప్పిన అన్ని రుచులు నాకూ బాగా తెలుసోచ్ -::))

  ప్రత్యుత్తరంతొలగించు
 12. నాకు తినటం ఇష్టం వుండేదీ కాదు మా బన్నక్క తిన్నా కచ్చిగావుండేది, అందుకే అమ్మమ్మ గారు చూడకుండా అది నాల్గో ఐదో కొనుక్కుని ఓ పెద్ద ఉమ్మెత్త పువ్వు గ్లాసులో పెట్టుకుని సర్దుక్కూర్చుని తిమనే సమయానికి ఆవిణ్ణి తీసుకొచ్చేదాన్ని. అది గబ గబా దాచేసి ఆవిడ వెళ్ళక ఆ కరిగిన నీళ్ళు తాగుతూ నన్ను ఉరుమురుమి చూసేది. అలా అలా దానికి ఎవరూ చూడకపోయినా కరిగించి తాగటమ్ అలవాటైపోయింది. గడ్డిమేటు దగ్గర కాపలా కుక్క మాదిరిగా అలా నేను తినకా, వాళ్ళనీ తిననీక ఏమిటో కదా! ;) మన్చి జ్ఞాపకాల తుట్ట కదిపారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 13. నాక్కూడా చిన్నప్పుడు పుల్లైస్ అంటే పిచ్చి.. తాతయ్య కొనిపెట్టే వారు కానీ నాన్న ఒప్పుకునే వారు కాదు.. నాకూ నాన్నకీ సర్దిచెప్పలేక మధ్యేమార్గంగా అమ్మ 'ఆ ఐసులమ్మే తాత చుట్ట కాలుస్తాడు.. అతని దగ్గర కొనుక్కోకూడదు' అని నమ్మబలికింది.. మా ఊరోచ్చేది అతనొక్కడే మరి!! నాక్కూడా చాలా చాలా జ్ఞాపకాలున్నాయి.. మరో విషయం ఏమిటంటే.. మీ టపా చదువుతూ టీవీ చూస్తున్నా.. 'జీవన్ సరల్' యాడ్ వస్తోంది.. పిల్లలంతా ఐసులు కొనుక్కుంటున్నారు యాడ్లో...

  ప్రత్యుత్తరంతొలగించు
 14. భాస్కర్ గారు నెనర్లు. నిజమేనండీ పెద్ద ఎస్టాబ్లిష్మెంట్స్ ఉండేవి. నరసరావుపేట లో మా ఇంటి దగ్గర కూడా ఐస్ కంపెనీ ఉండేది. వాళ్ళు శుబ్రంగానే తయారు చేసెవాళ్ళు లెండి. నేను ఎపుడూ గమనించలేదండీ ఈ దాహం ఎక్కువ వేయడం గురించి.

  సుభద్ర గారు నెనర్లు. ఓ హార్లిక్స్ బోర్న్ విటా ఫ్లేవర్స్ సూపర్ అండీ నేను ఎప్పుడూ చూడలేదు. పాలైస్ కుల్ఫీ వేరే అండీ నేను మొదటి సారి కుల్ఫీఐస్ జైపూర్ జంతర్మంతర్ దగ్గర తిన్నాను. వాడు ఐస్ ఒక చిన్న ఆకు కు గుచ్చి ఇచ్చేవాడు కారి మీద పడకుండ. కుల్ఫీ చాలా రుచిగా ఉంటుంది. రెస్టారెంట్లో దొరుకుతుంది కానీ వీడు కట్ చేసి బౌల్ లో తెస్తాడు తిన్నట్లు అనిపించదు.

  తృష్ణ గారు నెనర్లు. మీ ఙ్ఞాపకాలు మాతో పంచుకున్నందుకు నెనర్లు. ఓ లాలీస్ అనేవారా...

  శ్రీ గారు నెనర్లు. సబ్జా ఐస్ తెలుసండీ సమయానికి గుర్తు రాలేదు. మీ కామెంట్ చూశాక అరె ఇంత రుచికరమైన ఐస్ ఎలా మర్చిపోయాను అనుకున్నా... యా క్వాలిటీ బాల్ ఐస్ క్రేజే.. కలెక్ట్ చేసి చక్కగా ఆడుకోడానికి కూడా ఉపయోగ పడేవి కదా :-)

  అబ్రకదబ్ర గారు నెనర్లు. ఐస్ రోయ్ ఆ సూపరండి మీ ఊరి ఐస్ అమ్మేవాళ్ళు ఇంతకీ ఇదంతా గుంటూరు లోనేనా :-) సబ్జా గింజలు వేరేనండి సగ్గుబియ్యం కాదు కానీ సుజాత గారు అన్నట్లు ఇవి నీళ్ళల్లో నానాక ఉబ్బి తెల్లగా అయ్యి సగ్గుబియ్యం లానే అనిపిస్తాయి చాలా చలవ. మీ ఊర్లో ఈ సారి ఇండియన్ రెస్టారెంట్ కి వెళ్ళినపుడు ఫలూదా దొరుకుతుందేమో ప్రయత్నించండి. అందులో వాడతారు సబ్జా గింజలని. ఇవి దొరకడం కష్టమని మీ ఊర్లో సగ్గుబియ్యం తో ఫలూదా కానిచ్చేస్తే మాత్రం నన్ను తిట్టుకోకండేం.

  శ్రావ్య గారు నెనర్లు. హ హ దగ్గర్లో ఇండియన్ రెస్టారెంట్ కి వెళ్ళి కుల్ఫీ లాగించేయండి మరి ఇంకెందుకు ఆలశ్యం. నేను అమెరికాలో ఉన్నపుడు ఫ్రూట్ బార్స్ కొని ఈ సరదా తీర్చుకునే వాడ్ని. ఇవి కూడా ఇంచుమించు మన పుల్లైస్ లాగానే ఉంటాయి.

  సుజాత గారు నెనర్లు. నిజమేనండి ఇప్పుడు తెగ భయపడుతున్నాం కానీ అప్పట్లో ఇంత ఉండేది కాదు. నాకు చిన్నతనం లో జలుబు మాత్రం ఎప్పుడూ ఉండేది కానీ ఐస్ లు మాత్రం వదిలే వాడ్ని కాదు. దేని దారి దానిదే.
  "మా వూరెళ్ళినపుడు "జలుబు చేస్తే చేసిందిలే"అని మా అమ్మాయికి కూడా పుల్ల ఐసు కొనిపెడతాను నేను, ఆ మజా ఆమెకు మాత్రం తెలియద్దూ అని.(పన్లో పని నేను కూడా రెండో పన్నెండో కానిస్తా)"
  మంచి పని చేస్తున్నారు. మీ అమ్మాయ్ చాలా లక్కీ.

  ప్రత్యుత్తరంతొలగించు
 15. భరారె గారు నెనర్లు. భలే గుర్తు చేశారు.. మరే నాలుక ఎర్రగైందా అని చూసుకోని రోజు ఉండదు.

  నేస్తం గారు నెనర్లు. నిజమేనండీ ముందు తరాల వాళ్ళం అన్ని రుచులు చూశాం. నా బెంగంతా ఇప్పటి చిన్నారుల గురించే..

  ప్రవీణ్ గారు నెనర్లు. ఓ చాక్లెట్స్ గురించి ఓ టపా రాసినట్లు గుర్తు మరి మీ ఐస్క్రీమ్ కహానీ లగురించి కూడా త్వరలో టపాయించేయండి.

  రమణి గారు నెనర్లు. ఐస్ క్రీం విషయం లో మీ సంశయం కరెక్ట్ కాదేమోనండి యా ఇళ్ళ ముందు వచ్చే వాళ్ళని నమ్మకపోయినా కొంచెం మంచి పార్లర్ లో ధైర్యం చేయచ్చేమో అని అనిపిస్తుంటుంది.

  ఉష గారు నెనర్లు. ఇది అన్యాయం అండీ.. మీ అక్కయ్య గారికి నా పూర్తి మద్దతు తెలియజేసుకుంటున్నాను :-) పుల్లైస్ సరే కానీ మీకు ఇప్పటికీ ఐస్ క్రీం అంటే పడదా చాక్లెట్ లు ఐస్క్రీం లు పూలు నచ్చని అమ్మాయిలు కాస్త అరుదుగా ఉంటారు కదా అందుకనే అడుగుతున్నాను.

  మురళి గారు నెనర్లు. హ హ మీ అమ్మగారి ఉపాయం బాగుంది. ఇలాటి పరిస్థితులలో మనల్ని రష్చించేయడానికే బడులు వాటికి ఇంటర్వెల్ లూ ఉన్నాయ్... అంటే మాష్టార్ల లో ఎవరన్నా మీ నాన్న గారికి నేస్తాలైతే ఇది కూడా రిస్కే అనుకోండి. జీవన్ సరళ్ యాడ్ బాగుంది, దీన్నే యాదృశ్చికం అంటారేమో :-)

  ప్రత్యుత్తరంతొలగించు
 16. వేణూ నిజమేనండి నేను ఆ అరుదైన కోవకి చెందినదాన్ని. నాకు పూలు తప్ప ఆ ముందు రెండూ పడవు. పూలు కూడా ఒకప్పుడు పెట్టుకోవటం ఇష్టం. ఇప్పుడు పూసిన వాటితో సంభాషించటం ఇష్టం. :) ఈ రోజే ఒక అరవై గులాబీలు అతి కష్టమ్మీద తప్పనిసరై ఒకరికి కోసి పంపాను. నా పూలతోట ఇదిగో.. http://picasaweb.google.com/ushaa.raani/PDZRDL?authkey=Gv1sRgCKukhcLq8o7NEA#

  ప్రత్యుత్తరంతొలగించు
 17. చాలా ఏళ్ళు వెనక్కి తీసుకెల్లిపోయారండీ ...చిన్నప్పటి సేమ్యా ఐస్ గుర్తుకొచ్చింది ....విషయం చెప్పి తినాలనిపిస్తుందని మా శ్రీవార్నడిగితే ....ఏమన్నారో తెలుసా ? పిల్ల తేగలా ఉందంటే తేగ కావాలందంట నీలాంటిదే ...అన్నారు :) :)

  ప్రత్యుత్తరంతొలగించు
 18. ఉష గారు... నా నోట మాట రావడం లేదండీ... చాక్లెట్ లు ఐస్ క్రీం లు నచ్చకపోవడం వల్ల కాదు కానీ మీరు నిజంగా చాలా అరుదైన వ్యక్తి. మీ తోట అద్భుతం, ఫోటోలు వేటికి అవే ప్రత్యేకం గా చాలా బాగున్నాయి ఇక వాటికి మీ వ్యాఖ్య లు మరింత వన్నె తెచ్చాయి. మన లొ మనమాట నిజం చెప్పండి మీరు ఆ దేవుడితో కుమ్మక్కై రోజుకి కనీసం 30 గంటలు సంపాదించారు కదూ... అదికాక పోతే, నాలాటి వాళ్ళు రోజుకి ఎనిమిది గంటలు నిద్ర పోతే బహుశా మీరే పది నిముషాలో నిద్ర పోతూ ఉండి ఉండాలి. ఇన్ని పనులు ఎలా చేయగలరండీ బాబు. అసలే చలి ప్రదేశం లో ఉంటూ అంత మంచు మధ్య లో ఇంత అందమైన తోట ని maintain చేయ గలుగుతున్నారంటే నిజంగా మీకు శిరసు వంచి నమస్కరించాలి. మనసుంటే మార్గముంటుంది అని నిరూపించడానికి ఇకపై నా నేస్తాలకు మీ ఆల్బం నే ఉదాహరణ గా చూపిస్తాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 19. ఉష నా మనసులో మాటలన్నీ వేణూ చెప్పెసారు పై కామెంట్లో ..నిజంగా మీరు అద్భుతమైన వ్యక్తే

  ప్రత్యుత్తరంతొలగించు
 20. పరిమళం గారు నెనర్లు, మరెందుకు ఆలశ్యం ఈ మధ్యాహ్నం నుండి వీధి వైపు ఓ కన్నేసి ఉంచండి ఐస్ వాడు వచ్చేస్తాడేమో... హ హ మీ శ్రీవారి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ని మెచ్చుకోకుండా ఉండలేకున్నాను :-))

  ప్రత్యుత్తరంతొలగించు
 21. వేణు గారు, భలేగున్నాయి మీ ఐస్ కబుర్లు. నాకు డబుల్ ధమాకా. సిటీ లో ఉంటే తాజ్ ఐస్, అందులో పావలా కి తెల్ల ఐసు, రూపాయికి క్రీం కలర్ ఐసు, స్కూల్ దగ్గర పావలా కి ఆరెంజ్ పెప్సీ అర్థ రూపాయి కి కోవా పెప్సీ. సాధారణం గా బడ్జెట్ ఎప్పుడో తప్పితే రూపాయి వాటికి ఒప్పుకునేది కాదనుకోండీ.

  ఇంక అమ్మమ్మ వాళ్ళ ఊరెళ్తే అక్కడ పుల్లైస్. అందులో నాకు సేమ్యా ఐసు, కొబ్బరైసు అంటే మహా ఇష్టం. పొట్టెక్కా అప్పుడే భోజనం చేసినా సరే ఆ గంట వినిపించగానే పావలా పట్టుకుని వీధిలో సిద్ధం. రంగైసు కొంటే అమ్మ వీపు చీరేసేది, అందుకని అది తిన్నాక నాలిక మీద రంగు పోయే దాకా చేదతో నీళ్ళు తోడుకోవటం, నోరు కడుక్కోవటం, మిగతా వాళ్ళ ఇళ్ళల్లో పెత్తనాలు చేసి రావటం. భలేగుండేవి లెండి ఆ రోజులు

  ప్రత్యుత్తరంతొలగించు
 22. లక్ష్మి గారు నెనర్లు. మీ డబుల్ ధమాకా బాగుందండీ...
  "అందుకని అది తిన్నాక నాలిక మీద రంగు పోయే దాకా చేదతో నీళ్ళు తోడుకోవటం, నోరు కడుక్కోవటం, మిగతా వాళ్ళ ఇళ్ళల్లో పెత్తనాలు చేసి రావటం. భలేగుండేవి లెండి ఆ రోజులు"
  హ హ సూపరు నాకు ఇల్లేరమ్మ ను గుర్తు చేశారు :-)

  ప్రత్యుత్తరంతొలగించు
 23. haha...very nice!
  పాలైస్,కలరైస్,సేమ్యా ఐస్,సబ్జా ఐస్...ఓహ్, కాళహస్తిలో సాగిన నా బాల్యాన్ని గుర్తుకు తెచ్చారు! థాంక్యూ...

  ప్రత్యుత్తరంతొలగించు
 24. బాగుంది మీ పుల్లైసుల ప్రహసనం మా అందరిలో ఎన్ని జ్ఞాపకాలను రేపిందో చూడండి, ఇక్కడ ఈ చలిలో కూడా నాకు ఇప్పుడు పుల్లైసు తినాలనిపిస్తుంది.. వా వా .వా... నాకు గోల్డ్ స్పాట్ ఐసు ఇష్టం, ఆరెంజ్ ఐసు ను మేము అలా అనే వాళ్ళము అన్నమాట.
  @సుజాత: రెండో పన్నెండో లాగిస్తారా.. హ హ హ

  ప్రత్యుత్తరంతొలగించు
 25. గిరీష్ గారు నెనర్లు. సబ్జా ఐస్ క్రెడిట్ శ్రీగారికి చెందాలండీ తనే గుర్తు చేశారు మొదట.

  భావన గారు నెనర్లు. ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నా నా ఫేవరెట్ కూడా గోల్డ్ స్పాట్ ఐసేనండీ..

  ప్రత్యుత్తరంతొలగించు
 26. అమ్ముంటే పాల ఐస్ తప్ప కొననిచ్చేది కాదు,packet ice అని మీరు అన్న దాన్ని పెప్సీ అనే వాళ్ళం అందులో ద్రాక్ష రంగు తినప్పుడు కచ్చితంగా నాలుక రంగు చూసుకో వలసిందే :)
  ఒక్క క్షణం మళ్లీశ్వరిలో వెంకీ పీకే క్లాసు గుర్తొచ్చింది :)

  ప్రత్యుత్తరంతొలగించు
 27. @నేను నెనర్లు, హ హ మల్లీశ్వరి సీన్ భలే గుర్తు చేశారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 28. భలే పోస్టు రాశారే. మిస్ అయాను!

  ఓ పెద్ద గ్రంథమే రాయచ్చు ఈ ఐస్ క్రీముల మీద. భలే తినేటోళ్ళం ఈ ఐస్ క్రీములు. రెండు తెచ్చుకుని, ఒకటి చిన్న గిన్నెలో పెట్టుకుని, మొదటిది ముగించిన తర్వాత మరోది.

  మా పిన్ని ఊరికి వెళితే (బెళ్ళారి), అక్కడ బాల్ ఐస్ అని ఒకటొచ్చేది. అది ఇంకా సూపరు....

  ఈ ఐస్ క్రీము మీద కిరసనాయిలు చుక్క పోస్తే, క్రిములు బయటకొచ్చి కనిపిస్తాయి అని ఒక మేధావి ప్రతిపాదించాడు. అయితే నాకు ఏమీ కనబడలేదు.

  ప్రత్యుత్తరంతొలగించు
 29. రవి గారు నెనర్లు. భలే చెప్పారు ఐస్ క్రీముల మీద గ్రంథమే రాసేయచ్చు. బాల్ ఐస్ అంటే జీవన్ సరళ్ యాడ్ లో పిల్లలు కొనేలాటిదేనా... కిరసనాయలు క్రిములూనా ఆయనెవరో మరీ టూమచ్...

  ప్రత్యుత్తరంతొలగించు
 30. http://maruvam.blogspot.com/2009/10/blog-post_15.html#comments

  "పేటరంగు కలిపి చేసిన పుల్లైస్ " check out the above for more details... :)

  tit for tat, ha ha hhaa..

  ప్రత్యుత్తరంతొలగించు

పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీకామెంట్ రెండు వారాలకు ముందు ప్రచురించిన టపాలో ఐతే పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. Google Chrome Browser లో కామెంట్స్ పబ్లిష్ అవడంలేదు అని కంప్లైంట్ వచ్చింది. సరిచేయడానికి ప్రయత్నిస్తున్నాను. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.