శనివారం, మే 24, 2008

విధాత తలపున

అప్పుడు నేను 9 వ తరగతి చదువుతున్నా అనుకుంటా. నాకో నేస్తం వుండే వారు చిత్తరంజన్ అనీ ఇప్పుడు ఎక్కడ వున్నారో తెలీదు. అప్పట్లో మా ఇంటికి దగ్గరలో ఒక రికార్డింగ్ షాపు పెట్టారు. నాకు పేరు పెట్టి పిలిచే చనువు వున్నా నాకంటే కొంచెం పెద్ద లెండి. తన గురించి తన కుటుంబం తో నా అనుబంధం గురించి తర్వాత వ్రాస్తాను. నాకు తీరిక దొరికినప్పుడల్లా నేను ఎక్కువ సమయం ఆ షాపు లోనే పాటలు వింటూ గడిపే వాడ్ని. తను రికార్డింగ్ తో పాటు చిన్న చిన్న రిపేర్లు కూడా చేస్తుండే వాడు. నేను చాలా ఆసక్తి గా గమనించే వాడ్ని. పాడైపోయిన టేప్ రికార్డరు మోటారు తో ఒక చిన్న ఫేన్ తయారు చేసారు తను అప్పట్లో అది నాకు ఓ అద్భుతం చాలా సరదాగా అనిపించేది.

నేను ఏదో ఒక మాస్ సినిమా పాటలు రికార్డ్ చేయించుకోడానికి వెళ్ళినప్పుడల్లా తను సిరివెన్నెల గ్రాం ఫోన్ రికార్డ్ చూపించి ఈ పాటలు చాలా బావున్నాయి తీసుకు వెళ్ళు వేణు అని చెప్పే వారు. మనకి చిన్న తనం గదా, ఏ చిరంజీవో ఇంకెవరో పెద్ద నటుడి బొమ్మో రికార్డు మీద వుంటే కానీ ఆనేది కాదు అలాంటిది బెనర్జీ ఉన్న రికార్డు ఎలా నచ్చుతుంది చెప్పండి. చాలా రోజులు దాన్ని అలానే వుంచేసాను. ఒక రోజు తనే "విధాత తలపున" పాట ఒక క్యాసెట్ లో ఖాళీ ఉంటే రికార్డ్ చేసి ఇచ్చారు. అది విన్న మరుసటి రోజే మిగిలిన అన్ని పాటలు రికార్డ్ చేయించుకుని విన్నాను అప్పుడు మొదలు పెట్టిన ఆ పాటలు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇంకా నా ప్లేలిస్ట్ లో మొదటి స్తానం లో వుంటూనే వున్నాయి. తను పరిచయం చేసిన పాటలలో నీరాజనం ఒకటి మర్చిపోలేని ఆల్బం.

సిరివెన్నెల నుండి విధాత తలపున గీత సాహిత్యం మన కోసం. సిరివెన్నెల

<p><a href="undefined?e">undefined</a></p>


గానం : బాలు, సుశీల
సంగీతం : కే వి మహదేవన్
సాహిత్యం : సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం...ఓం.మ్మ్..
ప్రాణ నాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవ నాదమ్...ఓం.మ్మ్..
కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం..
ఎదకనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానమ్....ఆఅ..

సరస స్వర సుర ఝారీగమనమౌ సామ వేద సార మిది...||2||
నేపాడిన జీవన గీతం ఈ... గీతం..

విరించినై విరచించితిని ఈ కవనం..
విపంచినై వినిపించితిని ఈ గీతం....

ప్రాగ్దిశ వీణియ పైన దినకర మయూఖ తంత్రులపైనా..
జాగృత విహంగ తతులె వినీల గగనపు వేదిక పైన... ||2||
పలికిన కిలకిల స్వరముల స్వరజతి జగతికి శ్రీకారము కాగా..
విశ్వకావ్యమునకిది భాష్యముగా....

||విరించినై..||

జనించు ప్రతి శిశు గళమున పలికిన జీవననాద తరంగం
చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం... ||2||
అనాది రాగం ఆది తాళమున అనంత జీవన వాహిని గా..
సాగిన సృష్టి విలాసము నే...

||విరించినై..||

నా ఉఛ్వాసం కవనం నా నిశ్వాసం గానం ||2||
సరస స్వర సుర ఝారీగమనమౌ సామ వేద సార మిది...
నేపాడిన జీవన గీతం ఈ... గీతం..

2 వ్యాఖ్యలు:

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.