బుధవారం, డిసెంబర్ 16, 2009

జీవించడం ఓ కళ - ఆర్ట్ ఆఫ్ లివింగ్ - 1

బ్రతకడానికి జీవించడానికి మధ్య గల తేడాను చదువరులకు వివరించాల్సిన పనిలేదు అనుకుంటున్నాను. మనలో చాలా మందిమి బ్రతికేస్తుంటాం జీవించేవారు ఏ కొందరో ఉంటారు. నాకు ఇలా జీవించే అవకాశం మొన్న ఓ వారాంతం లో (డిశం 3 నుండి 6 వరకూ) దొరికింది. బెంగళూరు శివార్లలో కనకపుర రోడ్ లో ఉన్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమం గురించి నేను ఇదివరకు చాలా సార్లు విన్నాను. అహా అంత పెద్ద ఆశ్రమం కట్టించారంటే మహ కోటీశ్వరులై ఉంటారు బాగా డబ్బులు దండుకునే మరో సంస్థ అని అనుకునే వాడ్ని. నిజానికి ఒక పది పదేహేనేళ్ళ క్రితం నాకే కాదు చాలా మందికి రవిశంకర్ అంటే కేవలం ప్రముఖ సితార్ విద్వాంసుడు పండిట్ రవిశంకర్ గురించి మాత్రమే తెలుసు. కానీ తర్వాత ఆశ్రమంలో అందరూ గురూజీ గా పిలుచుకుని శ్రీ శ్రీ రవిశంకర్ గారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులుగా, ప్రముఖ మానవతావాది గా ప్రపంచానికి పరిచయమయ్యారు.

ఏవిటీ వీళ్ళు నాకు జీవించడం నేర్పేది నాకు రాదా.. నే ఇంతకాలం జీవించట్లేదా.. అన్ని మార్కెటింగ్ టెక్నిక్స్ వెళ్లడం అనవసరం అనే ఒక అభిప్రాయం కూడా ఉండేది నాకు కొన్నేళ్ల క్రితం వరకు. తర్వాత అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళని. బేసిక్ కోర్స్ చేసిన వారిలోనూ వచ్చిన మార్పును గమనించిన తర్వాత There may be some thing good అని అనిపించింది. దానికి తోడు ఎవర్ని అడిగినా "అది ఒక అద్భుతమైన అనుభవం మీ అంతట మీరు తెలుసుకోవాల్సిందే కానీ మేము ఏమీ చెప్పలేము" అంటూ కోర్స్ చేయమని చెప్పే వాళ్ళే కానీ అందులో ఏముంటుందో చెప్పే వారు ఎవరూ లేరు. అంతర్జాలం లో వెదికినా దానిలో ఏదో సుదర్శన క్రియ నేర్పుతారు అని మాత్రం ఉంది కానీ మిగిలిన వివరాలు ఏమీ లేవు. ఆఫీసుల్లో పని చేసి చేసి నాకు ఏదైనా మీటింగ్ కు వెళ్ళేముందు పూర్తిగా సిద్దమై వెళ్ళడం అలవాటైంది. అలాటిది ఇక్కడ ఏమి చెప్తారో ఏం చేస్తారో తెలియకుండా ఎలా వెళ్ళడం, ఏముంటుంది అక్కడ? ఇలాటి సవాలక్ష సందేహాలతో గురువారం సాయంత్రం  ఆశ్రమం లో అడుగుపెట్టాను.

రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో హెల్ప్ డెస్క్ దగ్గర చాలా వేగంగా వివరాలు తెలియ చేశారు. తర్వాత ఫోటో తీసే దగ్గర సైతం వెంటనే పని అయిపోయింది. పేమెంట్ డస్క్ దగ్గర ఒకావిడ తీరిగ్గా ఫోన్లో మాట్లాడుతూ నింపాదిగా పని చేస్తుంది కాస్త చిరాకు కలిగింది. కానీ అప్పటికే చాలా ఆలశ్యమైంది దానికి తోడు అలసిపోయి ఉన్నాను తనకి క్లాస్ పీకే ఓపిక లేదు అని మౌనంగా ఉండిపోయాను. మొత్తానికి అక్కడ పద్దతులగురించి ప్రత్యేకమైన తాళం కోడ్ తోఎలా ఓపెన్ చేయాలో తెలుసుకుని  రిసెప్షన్ నుండి బయటపడి నా రూమ్ వైపు మెల్లగా నడక ప్రారంభించాను. రాత్రి దగ్గర దగ్గర పదిగంటల సమయం చుట్టూ పచ్చని చెట్లు ప్రశాంతమైన వాతావరణం వీపున ఒక బ్యాగ్ చేతిలో మరో బ్యాగ్ ఉన్నా కూడా నడకలో ఏమాత్రం అలసట తెలియలేదు చాలా ఆహ్లాదకరంగా ఉంది.

అలా నడుస్తుంటే కుడివైపు పెద్ద కట్టడం అందంగా అలంకరించిన దీపాలతో గోపురం పైనుండి రంగు రంగుల కాంతులు విరజిమ్ముతూ ఠీవీగా నిలబడి చూస్తుంది. దానిని విశాలాక్షిమంటపం అంటారుట హెల్ప్ డెస్క్ లో ఇచ్చిన మ్యాప్లో చూసి మరోసారి నిర్ధారించుకుని రెండు కళ్ళలో తనివి తీరా దానిరూపాన్ని నింపుకుని ముందుకు కదిలాను. ఇదిగో ఈ పక్కన చూపించినది అదే రాత్రి వెలుగులో విశాలాక్షిమంటపం. నాకు కేటాయించిన బ్లాక్ దగ్గరకు రాగానే వ్రుత్తాకారపు ఆ కట్టడం చూసి ఒక్క సారి ఆంధ్రాయూనివర్సిటీ ఇంజనీరింగ్ హాస్టల్స్ గుర్తొచ్చాయి  మనసు కాలేజి రోజులలోనికి వెళ్ళిపోయింది. నా గది ముగ్గురు ఉండవలసినది మంచాలు, రగ్గులు, అటాచ్డ్ బాత్ అన్నీ చాలా సౌకర్యంగా బాగుంది అనిపించింది.

సరే రేపటి కోర్స్ లో ఏముండబోతోందో అనుకుంటూ నిద్రకుపక్రమించాను కానీ కొత్త ప్రదేశం వలన అనుకుంటాను అలసిపోయినా నిద్రమాత్రం పట్టడం లేదు. కిటికీకి ఆనుకుని ఉన్న మంచంమీద వెల్లకిలా పడుకుని రక రకాల భంగిమలలో నిద్ర పోవడానికి ప్రయత్నిస్తుంటే కిటికీకి ఉన్న కర్టన్ తగిలీ తగలనట్లు సుతారంగా చెంప నిమిరింది మూసిన కనురెప్పలు నుండి సైతం ఏదో వెలుగు కనిపించేసరికి మెల్లగా కళ్ళు తెరిచాను ఆ ముందురోజే పౌర్ణమి కాబోలు కిటికీకి పైన నిండుచందమామ చిరునవ్వుల వెన్నెలలు రువ్వుతూ నీకోసం నన్నిలా చూస్తూ నిద్రిస్తావు కదా అని ఇలాటి రూమ్ అలాట్ చేయించి కిటికీ పక్కన మంచం ఖాళీగా ఉంచి నే ఎదురు చూస్తుంటే నన్ను నిర్లక్ష్యం చేస్తూ అలా ఎలా నిద్రిస్తావోయ్ అని అడుగుతున్నట్లు అనిపించింది. మనసంతా గాలిలో తేలిపోతుంటే ఆహా స్వాగత సత్కారం అద్భుతం అనుకుంటూ అలా జాబిలిని వెన్నెలను చూస్తూ మెల్లగా నిదురలోకి జారుకున్నాను.

బేసిక్ కోర్స్ గురించీ, ఆశ్రమం గురించి మరికొన్ని వివరాలు నా తరువాతి టపాలో...

12 కామెంట్‌లు:

  1. మంచి సమాచారం అమ్దించారు. బొమ్మా, అక్షరాలూ కలిసిపోయినట్టున్నాయి. ఒకసారి చూస్తారా?

    రిప్లయితొలగించండి
  2. నాకు ఇంతకు ముందు పరిచయం లేదు. చాలా చక్కగా వివరించారు.
    అక్కడి నిండు చందమామను చూడాలని అప్పుడే మది ఉబలాటం పడుతోంది.
    మీ తదుపరి టాపా కోసం నీరీక్షిస్తూ
    ఉజ్జాయింపులతో ఉహలలో విక్షించమని బుజ్జగించాను

    రిప్లయితొలగించండి
  3. ప్చ్... నేను గత ఐదు నెలలుగా అనుకుంటూ కూడా బేసిక్ కోర్స్ కి వెళ్ళలేకపోయాను, సమయం ఇంకా రాలేదేమో అని సరిపుచ్చుకోవటమే తప్పించి అడుగు ముందుకు పడటం లేదు. బాగున్నాయి మీ అనుభవాలు

    రిప్లయితొలగించండి
  4. >>కిటికీకి పైన నిండుచందమామ చిరునవ్వుల వెన్నెలలు రువ్వుతూ నీకోసం నన్నిలా చూస్తూ నిద్రిస్తావు కదా అని ఇలాటి రూమ్ అలాట్ చేయించి కిటికీ పక్కన మంచం ఖాళీగా ఉంచి నే ఎదురు చూస్తుంటే నన్ను నిర్లక్ష్యం చేస్తూ అలా ఎలా నిద్రిస్తావోయ్ అని అడుగుతున్నట్లు అనిపించింది.

    ఇంటికి వెళ్ళేటప్పుడు పౌర్ణమి అయితే, బస్‌లో ఉన్నప్పుడు నాకు ఇలానే అనిపిస్తుంది.. చంద్రుడిని చూడడం కోసం, చాలాసేపు నిద్ర ఆపుకుని, ఇక ఎప్పటికో పడుకుంటా...

    రిప్లయితొలగించండి
  5. ఈ కోర్సు గురించి నాకు అనుకూలంగా గాని, ప్రతికూలంగా గాని అభిప్రాయాలు లేవు.. 'బతక నేర్చిన కళ' అని అంటూ ఉంటాను, మిత్రులతో సరదాగా.. మీ టపా చదివాక ఆసక్తి కలుగుతోంది.. తర్వాతి భాగం కోసం ఎదురు చూస్తూ..

    రిప్లయితొలగించండి
  6. మీకూ నాకూ వున్న భావనాధోరణి, భావసారూప్యతకి మచ్చుతునకలివి -

    >> కిటికీకి పైన నిండుచందమామ చిరునవ్వుల వెన్నెలలు రువ్వుతూ నీకోసం నన్నిలా చూస్తూ నిద్రిస్తావు కదా అని ఇలాటి రూమ్ అలాట్ చేయించి కిటికీ పక్కన మంచం ఖాళీగా ఉంచి నే ఎదురు చూస్తుంటే నన్ను నిర్లక్ష్యం చేస్తూ అలా ఎలా నిద్రిస్తావోయ్ అని అడుగుతున్నట్లు అనిపించింది. మనసంతా గాలిలో తేలిపోతుంటే ఆహా స్వాగత సత్కారం అద్భుతం అనుకుంటూ అలా జాబిలిని వెన్నెలను చూస్తూ మెల్లగా నిదురలోకి జారుకున్నాను.

    :) జీవితాన్ని ఇలాగే అనుభవించాలి, ప్రతి కదలికలో ఏదో అర్థాన్ని వెదుక్కుని అర్థవంతంగా...

    రిప్లయితొలగించండి
  7. ప్రియగారు నెనర్లు. గూగుల్ క్రోమ్ లో ఇలా బొమ్మ అక్షరాలు కలసిపోయి కనిపిస్తున్నాయండీ అది మరి ఎలా ఫిక్స్ చేయాలో తెలియదు ఫైర్ఫాక్స్ కానీ ఐ.ఈ లో కాని ఈ ఇబ్బందిలేదు. బ్లాగర్ కొత్త ఎడిటర్ లోపిక్చర్ హ్యాండ్లింగ్ కాస్తమార్చారు దాని వలన కలిగిన ఇబ్బంది అనుకుంటాను ఇది.

    ఫణిగారు నెనర్లు. హ హ అక్కడైనా ఎక్కడైనా నిండుచందమామ ఒకటేనండీ :-) ఇంకో పదిరోజుల్లో పౌర్ణమి వస్తుంది తనివితీరా ఆస్వాదించేయండి. నాకు అలా కిటికీ పక్కన పడుకుని జాబిలి చూసుకోవటం చాలా ఇష్టం.

    లక్ష్మిగారు నెనర్లు. మీరు వెంటనే సమయంతీసుకుని బేసిక్ చేసేయండి ఎలాగూ ప్రస్తుతం శలవల సీజన్ కదా. మనకోసం మనం ఆమాత్రం సమయం కేటాయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

    మేధగారు నెనర్లు. నేనుకూడా అంతేనండీ బస్ లో అలా జాబిలిని చూస్తూ నిద్రిస్తాను. పౌర్ణమి నాడో దగ్గరలోనో ప్రయాణమైతే నా ఆనందం చెప్పనలవి కాదు అలసట అసలే తెలియదు.

    మురళిగారు నెనర్లు. ఆశ్రమంలో కాకుండా బయట చేస్తే మరీ అంత ఖరీదు కూడా ఏమీ కాదనిపించిందండి పైగా ప్రాణాయామా, యోగా అన్నీ ఎప్పటినుండో ఉన్నవే ఆయన ఒక క్రమపద్దతిలో అందరికీ అర్ధమయ్యే రీతిలో వివరించి అందరినీ ఆచరించమని చెప్తున్నారు అంతే...

    అయినా అంతా మనం చూసే దృష్టిలో ఉంటుందండీ... ఉదాహరణకి అక్కడ భోజనానికి కంచంపట్టుకుని క్యూలో నుంచుని తెచ్చుకోని కింద కూచుని తినాలి. ఆ క్యూ చూసి దేవుడిప్రసాదంకోసం క్యూలోనిలబడినట్లుంది అని ఒకరంటే మరొకరు నాకు జల్లో క్యూలో నిలబడినట్లుంది అని ఇంకొకరు అంటం నే చెవులారా విని ఔరా అనుకున్నాను.

    ఉషగారు నెనర్లు.

    రిప్లయితొలగించండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.