మంగళవారం, అక్టోబర్ 13, 2009

Wake Up SID !!

నేను సాధారణం గా హిందీ సినిమాలు చూసేది అతి తక్కువ... ఇంచుమించు రిలీజైన ప్రతి తెలుగు సినిమా చూసే అలవాటున్న నేను హిందీ సినిమా విషయానికి వచ్చేసరికి మరీ బాగుంది, ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయ్ అని తెలిస్తే కానీ చూడను. అలాంటిది కాస్త మంచి టాక్ వచ్చిందని తెలిసి ఈ వారాంతం wake up sid చూడటం తటస్థించింది. నేను చాలా సాధారణ ప్రేక్షకుడిని, సినిమా టెక్నికాలిటీస్ గురించి నాకు పెద్దగా అవగాహన లేదు. సినిమా అంటే బోలెడంత ఇష్టం మాత్రం నా సొంతం. స్క్రిప్ట్ తో కట్టి పడేసే సినిమాలు, థియేటర్ బయటకు వచ్చాక కూడా సినిమా గురించి ఆలోచించేలా చేసే థ్రిల్లర్స్ అంటే కూడా ప్రత్యేకమైన ఇష్టం ఉంది. సినిమా లో ఇంటర్వెల్ కార్డ్ పడగానే "హమ్మయ్య ఇంటర్వెల్ వచ్చింది రా బాబు.." అని కాకుండా "అరె అప్పుడే ఇంటర్వెల్ వచ్చిందా..." అనీ, శుభం కార్డ్ పడగానే "అపుడే అయిపోయిందా.." అనీ అనిపిస్తే నా దృష్టి లో ఆ దర్శకుడు విజయం సాధించినట్లే...



ఈ విషయం లో wake up Sid దర్శకుడు నూటికి నూరుపాళ్ళు విజయం సాధించాడు అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా నిస్సందేహంగా ఓ క్లీన్ ఎంటర్టైనర్. ఈ చిత్రం ప్రొమో లో చెప్పినట్లు గా it is story about a boy who refused to grow up. ప్రతి ఒక్కరి జీవితం లో ఈ సిద్ ఉంటాడు.. లేదంటే కనీసం మీరు దగ్గరగా చూసి ఉంటారు, ఇతను చేసే చేష్టలన్నీ ఎపుడో మనం చేసినట్లు గా అనిపించక మానవు. ఇక సినిమా లో మిగతా పాత్రలన్నీ మెలో డ్రామా జోలికి పోకుండా చాలా సహజంగా ప్రవర్తించాయి. సోదాహరణం గా వివరించాలని ఉంది కానీ చూసినపుడు ఆ ఫీల్ మిస్ అవుతారు అని నేనా పనికి పూనుకోవడం లేదు. సినిమా కాస్త పాత బడ్డాక మళ్ళీ రాయడానికి ప్రయత్నిస్తాను.

ఈ సినిమా లో తల్లిదండ్రులు పిల్లల మధ్య అనుబంధం ఉంది అలాగని అనవసర సెంటిమెంట్ సీన్స్ కానీ భారీ డైలాగులు కానీ లేవు. ఈ సినిమాలో కాలేజీ, స్నేహితులూ ఉన్నారు కానీ హాస్యం పేరు తో ఉపాధ్యాయులను అగౌరవ పరిచే సన్నివేశాలు లేవు. సినిమాలో అంతర్లీనంగా సునిశితమైన హాస్యం ఉంది కానీ హాస్యానికే ప్రత్యేకించి వేరే ట్రాక్ లేదు. ఇది సిద్ ప్రేమ కథ కూడా కానీ ప్రేక్షకుడి బలహీనతలు, ఉద్రేకాలతో ఆడుకునే సన్నివేశాలు లేవు. ఈ సినిమా జీవితానికి ఓ లక్ష్యం ఉండాలి అని చెప్తుంది అలా అని ఇందులో సినిమా కష్టాలు, భారీ సందేశాలు లేవు. సినిమా అంతా చాలా సహజంగా స్మూత్ గా సాగిపోతుంది.

సిద్ గా రణ్బీర్ చక్కగా సరిపోయాడు చైల్డిష్ లుక్ తో అలరించాడు. హీరోయిన్ కొంకణ ని మొదట చూసి ఇంతకంటే గ్లామరస్ మొహాలు కనిపించలేదా ఈ దర్శకుడికి అనిపించింది కానీ కాసేపటికి తనలో ఏదో అట్రాక్షన్ ఉంది అనిపించింది, సినిమా ముందుకు నడిచి తను కేవలం గ్లామర్ కు పరిమితమైన పాత్ర కాదని తెలిసే కొద్దీ తను మనల్ని మరింత ఆకట్టుకుంటుంది (మొహానికి అలవాటు పడటం కూడా ఒక కారణమేమో:-). సిద్ స్నేహితురాలు లక్ష్మి గా చేసిన అమ్మాయి కూడా బాగుంది. సంగీతం విషయానికి వస్తే విన్నపుడు పాటలలో నాకు ’ఇక్‍తార..’ అన్న పాట తప్ప పెద్దగా నచ్చ లేదు ’లైఫ్ ఈజ్ క్రేజీ..’, టైటిల్ సాంగ్ కూడా పర్లేదు కానీ పాటలు అన్నీ శంకర్ ఎహ్‍సాన్ లాయ్ ల శైలి లోనే ఉంటూ వాళ్ళ ఇతర సినిమా పాటల్ని గుర్తు చేస్తాయి, సినిమా మూడ్ కి మాత్రం సంగీతం సరిపోయింది అనిపించింది.

సినిమా అంటే భారీ తారాగణం, గ్రాఫిక్ వర్క్, టెక్నికల్ బ్రిలియన్స్, మంచి సందేశం, ఊహించని మలుపులు, థ్రిల్స్ ఇలా ఏదో పెద్ద ప్రత్యేకత ఉండాలి అని కాక, సినిమా అంటే రెండున్నర గంటలు కదలకుండా కూర్చోపెట్టి ఆకట్టుకునే విధంగా ఆహ్లాదభరితమైన కథ చెప్పడం అని మీరు నమ్మే వారైతే ధైర్యం గా ఈ సినిమా చూడవచ్చు. ఒకటి రెండు చోట్ల వచ్చే కొన్ని అభ్యంతరకరమైన సంభాషణల వలన ఈ చిత్రానికి UA సర్టిఫికెట్ ఇచ్చి ఉండచ్చు. కానీ సినిమా మంచి ఎంటర్టైనర్, సిద్ అందరికీ నచ్చేస్తాడు. అబ్బాయిలూ మనలో మన మాట, ఈ సినిమా చూశాక మీ ఇష్ట సఖి మీతో సిద్/రణ్‍బీర్ ని "హీ ఈస్ సో క్యూట్... " అంటూ తెగ పొగిడేస్తుంటే కుళ్ళుకోకుండా నిమ్మళంగా ఉండటానికి ఇప్పటి నుండీ సిద్దంగా ఉండండేం:-) పో పోవోయ్ మేం బాపూ గారి పెళ్ళిపుస్తకం చూశాం కుళ్ళుకున్నా కూడా "అసూయ ఘాటైన ప్రేమకి థర్మామీటర్...." అని కవర్ చేయగలం అంటారా సరే మీ ఇష్టం.

33 కామెంట్‌లు:

  1. నాకైతే ఆ "ఎక్ తారా", లక్ష్మి తప్ప ఇంకేమీ నచ్చలేదు సినిమాలో. నేను మాత్రం interval కోసం ఎదురుచూడలేదు డైరెక్టుగా "The End" ఎప్పుడు పడుతుందా అని ఎదురుచూశాను. ఆ తరువాత ఇది ఒక "clean entertainer, mature love story,etc..." అని తెలిసాక అప్పుడనిపించింది అరెరె ఇదేదో ముందుగా తెలిసుంటే బాగుండేదే అందుకనుగుణంగా చూసి అదేవిధంగా అభిప్రాయం ఏర్పరుచుకొనే వాణ్ణనుకున్నాను. ఏ చేస్తాం నేనప్పటికే కమిటయ్యిపోయాను కానీ ఈ సారి సినిమా చూసేటప్పుడు దానికే లక్షణాలున్నాయో తెలుసుకొని మరీ చూస్తాను.

    రిప్లయితొలగించండి
  2. hindi artham kakapovadam kuda nachadaniki oka karanam ayyundochu kada

    రిప్లయితొలగించండి
  3. చాలా బాగా వ్రాసారు. దయచేసి నవతరంగం అనే చెత్తకు రాయకుండా ఇలాగే మీబ్లాగులో వ్రాస్తూండండి!!

    రిప్లయితొలగించండి
  4. హిందీ సినిమాల విషయంలో నేనూ మీ పార్టీనే.. చూడాల్సిన సినిమా అంటారు..సరే అయితే... అవునండీ.. మనలో మన మాట.. చివర్లో అబ్బాయిలకి ఇచ్చిన సూచన కి ప్రేరణ మీ అనుభవం అనుకోవచ్చా :) :)

    రిప్లయితొలగించండి
  5. మురళి మాటె నాదికూడా!!
    గరల్ ప్రెండు - అనుభవం!! ఏంటి సోదరా? ఏంజరుగుతోంది?? నాకు వెంటనే తెలియాలి తెలియాలి తెలియాలి!!

    రిప్లయితొలగించండి
  6. హ్మ్మ్ బాగుంది ప్లెయిన్ గా రివ్యూ, నేను హింది నిశానినే ఇలా చదివి అరా కొరా చూడటమే. సొ ఐతే చూడొచ్చు అన్నమాట.

    రిప్లయితొలగించండి
  7. Indian Minerva గారు వ్యాఖ్యకు నెనర్లు, మీ వ్యంగ్యం అర్ధమైంది :-) మనలో మన మాట "రివ్యూలు చదివి సినిమాకి వెళ్ళడం ఎదుటివాడి చెప్పుతో మనల్ని మనమే కొట్టుకోవడం" వంటిది అని మన బ్లాగర్ల లోనే ఒకరు (లక్ష్మిగారు అనుకుంటాను) ఈ మధ్యనే చెప్పారు. అందుకని ఏ సినిమా అయినా ఇలా చూడాలి అనే ఉద్దేశ్యం తో వెళ్ళడం సరికాదు. మీరు చేసినదే రైట్, నేనూ రివ్యూ చదవకుండా కొందరు మితృల మాట విని చూశాను . ఇక జిహ్వకో రుచి అన్నారు కదా.. ఎవరి అభిరుచి వారిదీ వందకోట్ల జనాభాని మెప్పించడం సాధ్యమా సాధారణ విషయమా...

    మీ ఐడీ తెలియచేయడం ఇష్టం లేని అజ్ఞాత లు కనీసం వ్యాఖ్యలో పేరు చెప్తే బాగుంటుంది. అటువంటిది అసలు అజ్ఞాతలను ఎందుకు అనుమతించడం అని నాపై విరుచుకు పడకండి. మితృలు కొందరు వారి ఆఫీస్ నుండి లాగిన్ అవ్వలేని వారున్నారు అటువంటి వారి కోసం ఈ వెసులుబాటు.

    ఒకటవ అజ్ఞాత గారు వ్యాఖ్యకు నెనర్లు, మీరు చెప్పింది కొంతవరకూ నిజమే... కానీ ఎందుకో ఈ సినిమా విషయం లో భాష రాని వాళ్లకి సినిమా నచ్చకపోడానికే ఎక్కువ అవకాశం ఉంది అనిపిస్తుంది, ఎందుకంటే భాష తో పని లేకుండా ఆస్వాదించడానికి ఈ సినిమా లో గ్రాఫిక్ జిమ్మిక్కులు, ఛేజ్ లు, పోరాటాలు, సుమోలు ఎగరేయడాలు, బూతు సన్నివేశాలు లాంటివి లేవు కనుక.

    రెండవ అజ్ఞాత గారు టపా నచ్చినందుకు, వ్యాఖ్య రాసినందుకు నెనర్లు. మూసలో సాగుతున్న సినిమా వెబ్ సైట్ల కు భిన్నంగా సినీ అభిమానుల అభిప్రాయ వేదిక గా సాగుతున్న వెబ్ సైట్ గా నవతరంగం పై నాకు ప్రత్యేకమైన గౌరవం ఉందండీ.. నచ్చని ఒకటి రెండు వ్యాసాల వలన మొత్తం నవతరంగం వెబ్ సైట్ ని చెత్త అనడం సమర్ధనీయం కాదు.

    మురళి గారు నెనర్లు, ఒక సారి తప్పకుండా చూడచ్చు... నా డివిడి లైబ్రరీ లో దీని చోటు సుస్థిరం. మాహాశయా మీకు భలే అనుమానాలు వస్తాయి ఆ అనుభవం నాది కాదండి ఓ మితృనిది :-))

    భాస్కరా నెనర్లు, అంతలేదు సోదరా... తెలియడానికి ఏమీ లేదు సొ మీరు హరికృష్ణ లా ఆవేశ పడిపోకుండా రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్ :-)

    భావన గారు నెనర్లు. కంటిన్యుటీ పై దర్శకుడు పెట్టిన శ్రద్ద... ఆసక్తి కరంగా కధ చెప్పిన తీరు నన్ను ఆకట్టుకుందండీ.. చూసి ఎలా ఉందో చెప్పండి.

    నేస్తం గారు నెనర్లు. తప్పకుండా చూసి ఎలా ఉందో చెప్పండి.

    రిప్లయితొలగించండి
  8. హిందీ సినిమాలు హిట్టయినవి కూడా నాకు నచ్చవు. ఈ సినిమాకెళ్ళే అవకాశం ఒచ్చింది మొన్న వీకెండు. అయితే, వద్దని మరో హాలీవుడ్డు తల్నెప్పి సినిమాకెళ్ళి బుర్ర బద్దలు కొట్టించుకుని వచ్చాను.

    రిప్లయితొలగించండి
  9. నేను చూసేవే హిందీ సినిమాలు, అపుడూ అపుడూ ఇంగిలీషు. ఇహ తెలుగు అంటే ఎవరో ఒహరు బాగుందని చెప్పాలిసిందే . రణబీర్ కపూర్ చూడగానే Drug addict appearance తో ఉంటాడు. ఆయన సినిమాలకంటే మీడియాలోఆయన వంశం ఆయన కాలక్షేపాలే కనిపిస్తాయి . అందుకని కొంచం చిరాకు, కాకుంటే కొంకణా నాకు నచ్చుతుంది. ఓ సారి చూడొచ్చన్నమాట.

    రిప్లయితొలగించండి
  10. రవి గారు నెనర్లు. హ హ అదేదో హలీఉడ్ సినిమా పేరు చెప్తే మాలాటి వాళ్ళం కాస్త బతికి పోతాం కదండీ..

    సునీత గారు నెనర్లు. ఆహా డ్రగ్ ఆడిక్ట్ మొహమా :-) మరీ అంత ఘోరం గా ఉండడేమో లెండి. నేను హిందీ మీడియా పెద్దగా ఫాలో అవను కాబట్టి ఇతని వంశం గురించి తెలీదు.

    రిప్లయితొలగించండి
  11. సరోగేట్స్. అయితే చెత్త సినిమా కాబట్టి, ఫ్రెండ్స్ తో పాటు మరింత బాగా ఎన్జాయ్ చేశాము.:-)

    రిప్లయితొలగించండి
  12. హ హ నిజమే రవి గారు, మంచి కంపెనీ ఉండాలే కానీ ఎంత చెత్త సినిమా అయినా ఎంజాయ్ చేయచ్చు :-)

    రిప్లయితొలగించండి
  13. హమ్మయ్యా, ఈ చలికాలం కాస్త సరిగ్గా గడపాలెగా అనుకున్నాను, ఓ పూట వేడి వేడి పకోడీతో లాగించేయొచ్చీ సినిమా. ఈ మధ్య చూసివనవే మళ్ళీ చూస్తూ [కొత్తవి అన్నీ చూసే ధైర్యం చేయలేక] విసుగేసింది. థాంక్స్ ఒక పాయింటర్ ఇచ్చినందుకు. ;)

    రిప్లయితొలగించండి
  14. ఉష గారు నెనర్లు. మీకూ నచ్చుతుందనే అనుకుంటున్నాను :-) enjoy.

    రిప్లయితొలగించండి
  15. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  16. కిందటి వారం మొదటిసారి ఈ బ్లాగ్ ను చూసినప్పుడే మీ టపాలకు అభిమానిని అయ్యాను వేణుగారు.
    మీ మొదటి కలములో రాసినట్టు నాకు కూడా ఇంచుమించు ప్రతి కొత్త తెలుగు సినిమా, ఎప్పుడో ఒకసారి హిందీ సినిమా చూడటంతో పాటు , చూస్తునంత సేపు మరో ఆలోచన రాక పోయినట్టు ఐతే ఆ చిత్రం తెగ నచ్చడం, మళ్లీ మళ్లీ చుసేసే మహా చెడ్డ అలవాటు వుంది.
    మొత్తం మీద ఈ చిత్ర నిర్మాత మీకు రుణపడ్డారు. మీ టపా చదివి నేను గజినీ తర్వాత 2009లో మరో హిందీ సినిమా చూడబోతునాను

    రిప్లయితొలగించండి
  17. Phani గారు మీ అభిమానానికి ధన్యవాదాలు. సినిమాల విషయం లో మీది కూడా నాలాటి అభిరుచి అని తెలుసుకోడం ఆనందదాయకం. enjoy the movie.

    రిప్లయితొలగించండి
  18. ఇప్పుడే చూసానండి ఈ పోస్ట్..ఈ సినిమా చూద్దాం అనుకుని సీట్లు దొరకక ఆ మధ్యనొక కొత్త తెలుగు సినిమా చూసి బుక్కయిపోయాం.. ఆ పోస్ట్ చూసే ఉంటారు..2వారాల క్రితమేమో రాసాను..

    అప్పటిదాకా పేపర్లలోనే ఆవిద గురించి చదివిన నేను కొంకణా సేన్ ని మొదటిసారి "మిస్టర్ & మిస్సెస్ ఐయ్యర్" సినిమాలో చూసానండీ...నాకు తెగ నచ్చేసింది ఆవిడ నటన.తరువాత మధుర్ భండార్కర్ "పేజ్:3" ఇంకా నచ్చేసింది..ఇక ఆవిడని స్మితా పాటిల్,షబానా అజ్మీ మొదలైనవారి వరుసలో కలిపేసాను.

    ...చూడాల్సిన సినిమాల లిస్ట్ లోంచి బిక్కు బిక్కు మంటున్నాడు సిడ్.. టి.విలో 6నెలల తరువాత వేసేదాకా సిడ్ కు ఎదురుచూపు తప్పదేమో...

    రిప్లయితొలగించండి
  19. అరే,మీరు చూసే బ్లాగుల లిస్ట్ లో నాది కూడా చేరిందే..ఇప్పుడే చూస్తున్నా.. చాలా సంబరంగా ఉందండి...ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  20. రెండవ అజ్ఞాత గారి మాటే నామాట.
    సాహితీ మిత్రులకు
    ప్రపంచ కవితా దినోత్సవ శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  21. తృష్ణ గారు నెనర్లు, నిన్నుకలిశాక సినిమా గురించి మీరు రాసిన పోస్ట్ చూశానండి. సినిమా పేరు చెప్పకుండా భలేరాశారు :-) నేను హిందీ మీడియా అంతగా ఫాలో అవనండి కొంకణ సినిమా నేను ఇదే మొదట చూశాను. మిగిలిన సినిమాలు కూడా వీలు చూసుకుని చూడాలి.

    శ్రీనిక గారు నెనర్లు. మీకు కూడా కవితా దినోత్సవ శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  22. Brother, if u plz, will u add B&G button to your blog? If u would, I'l give u the code.

    రిప్లయితొలగించండి
  23. మాయం చేస్తానన్నాననా నిజంగానే మాయమైపోయారు. ఏమి మరువపు వనాన బొత్తిగా నల్లపూసైపోయారు. :)

    రిప్లయితొలగించండి
  24. ఉష గారు, నేను ఇలా మీ బ్లాగ్ ఓపెన్ చేసి వ్యాఖ్య రాసే సమయం లోనే మీరు నాగురించి తలచుకుని నా బ్లాగ్ లో వ్యాఖ్య రాసినది చూసి అచ్చెరువొందాను. టెలిపతీ! అనుకోవచ్చేమో :-)

    నేను మరువపు వనానికే కాదండీ బ్లాగువనానికే కాస్త దూరమయ్యాను. ఆఫీసులో కొన్ని చికాకులు అదే సమయం లో నాన్న గారికి కాస్త అస్వస్థత కారణంగా బ్లాగుల్లో ఎక్కువ సమయం గడపడం లేదు. మళ్ళీ ఈ రోజే, మీ బ్లాగుతోనే మొదలు పెట్టాను :-) నాన్న గారి ఆరోగ్యం ఇపుడు కాస్త మెరుగైంది లెండి.

    రిప్లయితొలగించండి
  25. చూడదగ్గ సినిమాని పరిచయం చేసినందుకు థాంక్సండి.
    కొంకనా సేన్ మంచి నటి...ఆమె సినిమాలు నేను luck by chance, page3 చూశాను. అవి చాలా బాగుంటాయి. మంచి పెర్ఫ్మామెన్స్ ఉన్న పాత్రల్లోనే తను కనిపిస్తుందన్నమాట...

    రిప్లయితొలగించండి
  26. శేఖర్ గారు నెనర్లు. ఈ సినిమాలో కూడా తన ఇండివిడ్యువాలిటీ తో ఆకట్టుకుంటుందండీ...

    రిప్లయితొలగించండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.