వీడెవడండీ బాబు హిందీ శీర్షిక, అదీ తెలుగు స్క్రిప్ట్ లో పెట్టాడు అని ఆశ్చర్య పోతున్నారా.. చెప్తా చెప్తా అసలు ఎంత తెలుగు వాళ్ళమైనా హిందీ మన జాతీయ భాష అన్న విషయం మర్చిపోతే ఎలా? ఈ విషయం లో ఏ మాటకామాటే చెప్పుకోవాలి ఆటో డ్రైవర్ ల దేశభక్తి ని మాత్రం మెచ్చుకోవాల్సిందే... ఊరేదైనా కానివ్వండి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఏదైనా సరే వీళ్ళంతా మాట్లాడే ఏకైక భాష హిందీ. ప్రాంతీయ భాష మాట్లాడని వాళ్ళుంటారేమో కానీ ఆటో డ్రైవర్ల లో హిందీ మాట్లాడవాళ్ళని నేను ఇంత వరకూ చూడలేదు. మన జాతీయ భాష ని ఇంతగా గౌరవించి ప్రాచుర్యాన్ని పెంపొందిస్తున్న వీళ్ళ దేశభక్తిని గుర్తించక పోతే ఎలా చెప్పండి. సరే ఇక విషయానికి వస్తే నేను అమెరికా లో ఉన్నపుడు అన్నిటికన్నా ఎక్కువగా మిస్ అయింది ఆటోలని :-) నిజం అండీ బాబు అక్కడ ఎక్కడికి వెళ్ళాలన్నా ముందు ఎలా వెళ్ళాలి అనేది ప్లాన్ చేసుకోవాలి, డ్రైవింగా, టాక్సీనా, బస్సా, ట్రైనా ఇలా వీటిలో ఏదోఒకటి అని ప్లాన్ చేసుకోవాలి. అంతే కానీ బెంగళూరు లో లా ఆలోచన వచ్చిందే తడవు రోడ్ పైకి వచ్చి "ఆటో" అని చేయెత్తి ఆపి ఎక్కి కూర్చుని ఇంకో ఆలోచన లేకుండా గమ్యం చేరుకునే అవకాశం అక్కడ ఉండదు. అంటే ఇక్కడ ఇంకో ఆలోచన లేకుండా అని రాసే ముందు నేను కొంచెం ఆలోచించిన మాట వాస్తవమే :-)
ఆటోలలో పలురకాలు లేవేమో కానీ ఆటోవాలాలో చాలా రకాలు ఉంటారు... కొందరు సాధ్యమైనంత మేరా రౌడీ లుక్ కోసం ప్రయత్నిస్తే అతి కొందరు సాధారణ లుక్ తో సరిపెట్టుకుంటారు మరి కొందరు మాత్రం నీట్ గా డ్రెస్ చేసుకుని వాచీ గట్రాల తో డీసెంట్ గా ఉంటారు. ఇలాంటి డీసెంట్ బ్యాచ్ సాదారణంగా చదువుకున్న బ్యాచ్ అయి ఉంటుంది ఎక్కడో అరుదుగా తగిలే వీళ్లని చూడటం తోనే మనకి విషయం అర్ధం అవుతుంది వీళ్ల మీటర్లు సరిగా పని చేస్తాయి, మీటర్ ఎంత చూపిస్తే అంతే చార్జీ వసూలు చేస్తారు ఎక్కువ ఆడగరు, వీళ్ళు కష్టపడే బ్యాచ్ అనమాట. నాకు ఆమధ్య ఇలాంటి వ్యక్తే తగిలాడు. నేను వచ్చీ రాని కన్నడ లో కష్ట పడుతుంటే అతను స్పష్టమైన ఆంగ్లం మాట్లాడటం మొదలు పెట్టాడు, తర్వాత సంగతేంటి గురూ అని అడిగితే తన సమాధానం "ఇంట్లో అమ్మా నాన్న చదువుకోరా అని పంపిస్తే గాలికి తిరిగాను అప్పుడు తెలియలేదు ఇప్పుడు అనుభవిస్తున్నాను కాని నేను తప్పుడు పనులు చేయడం లేదు కష్టపడుతున్నాను ఉన్నంత లో హ్యాపీ సార్..." అని. అతని నిజాయితీ కి ముచ్చటేసింది ఓ క్షణం ఆవకాయ్ బిర్యాని లో హీరో గుర్తొచ్చాడు.
ఇంకో బ్యాచ్ ఉంటుంది వీళ్ళు అస్సలు వొళ్ళు వంచరు, బద్దకం బ్యాచ్, సాధారణంగా ఆటో స్టాండ్ లలో ఇలాంటి వాళ్ళు ఎక్కువ తగుల్తారు, బాగ పొట్టలు పెంచి ఆటోలలో అడ్డంగా పడి నిద్ర పోడమో లేదా నలుగుర్ని కలేసి పేకాడటం, కబుర్లు చెప్పడం లాటివి చేస్తుంటారు. లోకల్ గా జరిగే గణేశ ఉత్సవాలలోనో మరో చోట తాగి తందనాలాడటం వీధుల్లో కొట్లాటల్లోనో వీళ్ళకి ఆసక్తి తప్ప కష్టపడదాం ఆటో తోలదాం సంపాదిద్దాం అనే అలోచన ఉండదు. వీళ్ళని మీరు బాడుగ అడగగానే వచ్చే మొదటి సమాధానం రాను... లేదా కనీసం పదింతలు రేటు చెప్తారు దానికి ఇష్టమైతే ఎక్కు లేదంటే నీ ఖర్మ అన్నట్లుంటుంది వీళ్ళ వ్యవహారం. ఇలాంటి వాళ్ళని చూసే నా నేస్తం వీళ్ళ తో ఇగో ప్రాబ్లం బాసు నా వల్ల కాదు కావాలంటే నడిచెళ్తా కాని అటో ఎక్కను అంటాడు. నాకూ ఒకోసారి చాలా చిరాకొస్తుంది వీళ్ళని చూసి కానీ మనకి కాస్త సహనం పాళ్ళు ఎక్కువ కనుక నెట్టుకొచ్చేస్తుంటాం.
సరే వీళ్ళ సంగతి ఇలా ఉంటే ఈక మీటర్ల గురించి అడగనే అక్కర్లేదు. అప్పుడెప్పుడో కొన్నేళ్ళ క్రితం "బెంగళూరు లో డిజిటల్ మీటర్ లు ప్రవేశ పెడుతున్నారుట, దూరం, చార్జీ, వెయిటింగ్ అని అన్నీ ప్రత్యేకంగ తెలుస్తాయిట ఇహ మోసాలు గట్రా ఉండవు కామోసు.." అని అనుకున్నాం కానీ వాటిలోనే ఇంకా అత్యాధునాతన పద్దతి లో మోసాలు చేయడానికి అవకాశముంది అనే విషయాన్ని మరిచాను. అప్పటికీ ఇంజినీరింగ్ లో మా చేత మైక్రో ప్రాసెసర్ ప్రోగ్రాం చేయించి మరీ నేర్పించారు అప్పుడు కూడా మేము ఇలాంటి యల్ఈడే లే వాడాం లెండి అందుకే ఈ డిజిటల్ మీటర్ లు చూడగానే నాకు అదే గుర్తొస్తుంది. మొన్నొక రోజు ఆటో ఎక్కితే నలభై కావాల్సిన దూరానికి అరవై అయింది.. సంగతేంటి గురూ అని అంటే ఏంటి సార్ అలా మాట్లాడతారు డిజిటల్ మీటర్ అని బుకాయించబోయాడు నేను కాస్త గట్టిగా అడిగి పద చెక్ చేయిద్దాం అనే సరికి సరే రోజు ఎంతవుతుందో అంతే ఇవ్వండి సార్ అని పట్టుకు పోయాడు. మాములు మీటర్ల లో అయితే ఇంతవరకూ ఏ రెండు మీటర్లు ఒకే రీడిం చూపించిన పాపాన పోలేదు. ఈ విషయం లో చెన్నై చానా నయం ఎందుకంటే అక్కడ మోసం చేయడానికి అసలు మీటర్లే ఉండవు మరి !! వాడెంతడిగితే అంత ఇవ్వాల్సిందే !!
దీనిని అరికట్టడానికి బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు నగరం లో అక్కడక్కడా ప్రీపెయిడ్ ఆటోస్టాండ్ లని పెట్టారు. ఇక్కడ పోలీసులే దూరాన్ని బట్టి ముందే రేటు వసూలు చేస్తారు ప్రీ పెయిడ్ టాక్సీ లాగ కాని తక్కువ దూరమైతే వాడి సణుగుడు భరించాల్సిందే... బెంగళూర్ లో ఆటోలకి పెట్రోల్ డీజిల్ వాడకం చాలా తక్కువే, ఎక్కువ భాగం CNG ఆటోలే ఈ ఆటోలని ప్రవేశ పెట్టిన కొత్త లో ఈ గ్యాస్ కొన్ని బంకుల లో మాత్రమే దొరకడం వలన వాటిలో విపరీతమైన్ రద్దీ ఉండేది, ఒకోసారి ట్రాఫిక్ జాం అయి ఆ ఏరియాలని తప్పించుకుని వెళ్ళాల్సిన అవసరం కూడా వచ్చేది.
సరే టపా పొడవు పెరుగుతున్నట్లుంది మరికొన్ని విషయాలు రేపు చెప్తాను అంత వరకూ శలవ్...
కుహు కుహూ.. కూసే..
-
డబ్బు డబ్బు డబ్బు చిత్రంలోని ఒక మధురమైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట
ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
ఎంబెడెడ్ వీడి...
3 సంవత్సరాల క్రితం
ఆటోల్లో కూడా రకాలు ఉంటాయండి.. తళతళలాడే కొత్తవి.. కాస్త రంగు వెలిసి, సీట్లు చిరిగినవి, బాగా బోరుకొచ్చినవి, వాతావరణ కాలుష్యం ప్రకటనకి పనికొచ్చేలా పొగ వదిలేవి, సెవెన్ సీటర్లు...అబ్బా ఒక టపా రాసేయొచ్చేమో... బాగుంది మీ టపా.. కొనసాగింపు రాసేయండి త్వరగా...
రిప్లయితొలగించండిభలే ఉంది మీ టపా! ఆటో వాళ్ల వర్గీకరణ కూడా! బెంగుళురులో ఆటో వాళ్ళలో చాలా మంది డిఫాల్ట్ గా తెలుగు, ఇంగ్లీషు కూడా మాట్లాడతారు, గమనించారా? అలాగే దురుసుగా మాట్లాడేవాళ్ళని తక్కువమందినే చూశాను నేను!
రిప్లయితొలగించండిమెజెస్టిక్ లో ప్రి పెయిడ్ ఆటో కావాలంటే గంటన్నర క్యూలో నిల్చోవాలండీ, ఎప్పుడైనా నిల్చున్నారా?
మీటర్ టాంపరింగ్ లు, దబాయింపులూ ఇవన్నే యూనివర్సల్! అలాగే అడిగినా రాకుండా చెట్లకింద ఆటో పెట్టి చల్లగాలికి నిద్రపోయే వాళ్లకోసం ఎక్కడిదాకానో అక్కర్లేదు, మా గేటు ముందే చూడొచ్చు!
ఏదైనా సరే ఆటోవాలా జిందాబాదు!
బాగుంది ! భలే రిసెర్చ్ చేసారే ఆటో డ్రైవర్ల మీద :)
రిప్లయితొలగించండిమురళి గారు నెనర్లు, నిజమేనండీ ఆటోల్లో రకాలు భలే చెప్పారు.. నేను కేవలం కంపెనీ మోడల్స్ గురించే ఆలోచించాను సుమీ :-)అన్నట్లు మీ నెమలికన్ను పై ఓ కన్నేసే భాగ్యం మాకు కూడా ప్రసాదించండి సార్.. ప్రస్తుతం ఆహ్వానితులకి మాత్రమే అని అంటుంది. నాకూ (venusrikanth@gmail.com) ఓ ఆహ్వానం పంపండి.
రిప్లయితొలగించండిసుజాత గారు నెనర్లు. అవునండీ మెజెస్టిక్ చుట్టుపక్కల రక రకాల భాషలు మాటాడతారు కానీ హెబ్బాల్ చుట్టు పక్కల్ వీళ్ళు తక్కువే.. అలాగే మీరు చెప్పిన క్యూ అక్కడ ఎక్కువే బ్రిగేడ్ లాటి చోట్ల కాస్త తక్కువ ఉంటుంది ప్రీపెయిడ్ క్యూ. ఏదేమైనా అటోవాలా జిందాబాద్..
శ్రావ్య గారు నెనర్లు... నాకు టూవీలర్ నడపడం రాదండీ, కనుక ఆటో నా దైనందిన జీవితం లో ఓ ముఖ్య భాగం, రీసెర్చ్ చేయాల్సిన పని లేదు :-)
@సుజాత గారు
రిప్లయితొలగించండి>>మెజెస్టిక్ లో ప్రి పెయిడ్ ఆటో కావాలంటే గంటన్నర క్యూలో నిల్చోవాలండీ, ఎప్పుడైనా నిల్చున్నారా?
దీనికి నేను ఒక సొల్యూషన్ చెప్తా......
అక్కడక్కడా సెల్ఫ్ పేయింగ్ మెషీన్స్ పెడితే సరి......
సెల్ఫ్ పేయిగ్ మెషీన్స్ ....వీటినే టికెట్ వెండిగ్ మెషీన్స్ అంటారు అనుకుంటా.. అదే మా ఊల్లో భాషలో అయితే ఆటోమా అంటారు...
హహ... బెంగుళూరు ఆటోల గురించి మొదలెట్టారా ? ఇక కానీండి :-)
రిప్లయితొలగించండి@ సుజాత గారు:
మీరు ఏ సమయంలో ఇక్కడున్నారో కానీ ఇప్పుడు మాత్రం దురుసుగా మాట్లాడేవాళ్ళు సుబ్బరంగా దొరుకుతారు.
మెజెస్టిక్‌లో చాలా సార్లు ప్రీ పెయిడ్ ఆటో ఎక్కాను కానీ పదిహేను, ఇరవై నిమిషాల కంటే ఎక్కువ ఎప్పుడూ ఆగే అవసరం రాలేదు.
ఆటో - మా ఆఫీసు వైపునుంచీ దొరకదు. ఇంకెక్కడకైనా వెళ్తే, మా ఇంటి వైపు కి కూడా సగానికి సగం మంది రారు. మా ఇంటి దగ్గర ఆర్.టీ.వో ఆఫీసు బిల్డింగుకీ, ఆటో వాళ్ళకూ పడదనుకుంటా. వైజాగ్ ఆటోల్లో పాత రకం బజాజ్ ఆటోలు ఎక్కడం, చిన్నపుడూ కష్టం గానే ఉండేది. ఇపుడు పరిస్థితుల కారణంగా, పెద్దయ్యాక కూడా ఎక్కలేను. కొత్తగా వచ్చినవి, కొంచెం రోడ్డు కి దగ్గరగా వుండేవి (సుమో అనుకుంటా కంపెనీ పేరు) పెద్ద సీట్లవీ నాకిష్టం. ఆటో లో నిండాఎక్కి, ఒళ్ళో చెల్లిని కూర్చోబెట్టీసుకొని.. కిక్కిరిసిపోయి, సినిమా కి వెళ్ళడం అదిరిపోయే జ్ఞాపకం.
రిప్లయితొలగించండిఈ టపాకి పార్ట్ - టూ తో జరూర్ చాహియే ! హైద్రాబాడ్ భాష లో అయితే, 'ఆటో - పార్ట్ - టూ హోనా !'
రిప్లయితొలగించండిరాజమండ్రీ లో మీటర్లుండవు. మామూలుగా అయితే ఎక్కడకు వెళ్ళాల్సినా 20 రూపాయలు.షేర్ ఆతొ అయితే మనిషికి 5/-. ఆరుగురిని ఎక్కించుకుంటారు!!
రిప్లయితొలగించండిఇంతకీ బెంగుళూరులో ఆటొలలో ఒక హీరోగారి ఫోటో (ఆటొజానీ అనుకొంటా) గురించి రాయలేదే?
రిప్లయితొలగించండినేను చెప్పబోయిన మాట మొదటి వ్యాఖ్యలోనే మురళి గారు చెప్పేశారు.
రిప్లయితొలగించండిబాగుంది ఆటో డ్రైవర్ల మీద రిసెర్చ్ :)
రిప్లయితొలగించండిప్రవీణ్ గారు,
రిప్లయితొలగించండిమెజెస్టిక్ రైల్వే స్టేషన్లో నేను రెండు సార్లు నలభై నిమిషాల సేపు క్యూలో ఉంటేగానీ ఆటో దొరకలేదండీ నాకు! ప్రి పెయిడ్ టాక్సీ క్యూ ఆటోల క్యూ కటే కొంచెం తక్కువ ఉంటుందనిపించింది.
మేము ఏడాది క్రితం వరకూ బెంగుళూరులోనే ఉన్నాము బన్నేర్ ఘట్ట రోడ్ మంత్రి లో! వాహనాలు నడపటం మనకసలే దడ కాబట్టి,ఆటోలకు మహరాణి పోషకురాలుగా ఉండేదాన్ని. అయితే బీజీ రోడ్ ఆటోవాలాలు మంచి వాళ్ళన్నమాట. కానీ గుప్పు గుప్పున పొగవదలడం లో మాత్రం బెంగుళూరు ఆటోలతో హైద్రాబాదు ఆటోలు పోటీలు పడలేవండీ!
హైద్రాబాదులో మాత్రం నచ్చేవి షేరింగ్ ఆటోలు! దగ్గర దగ్గర దూరాలకు హాయిగా ఉంటాయి. పది రూపాయల లోపే గమ్యం చేరుస్తాయి.
బెంగళూరు ఆటొలా బాబూ... నేనెందుకూ పనికిరానివాణ్ణి అన్న అభిప్రాయం నాకెప్పుడైనా కలిగుతుందంటే, అది బెంగళూరులో ఆటో అవసరం కలిగినప్పుడుమాత్రమే.
రిప్లయితొలగించండిఇక ఆటో మీటర్లంటారా...అవి మీటర్లు కావండీ బాబూ, మోటర్లు!
నా అనుభవసారమేమిటంటే, ముంబై ఆటోవాలాలు, అదీ మరాఠీ ఆటోవాలాలు ప్రపంచంలోనే బెస్టు..తెల్ల డ్రస్సూ, నెత్తిన తెల్ల టోపీ కొండగుర్తులు. వీళ్ళు సాధారణంగా అస్సలు మోసం చెయ్యరు.
విశ్వక్శేనుడు గారు నెనర్లు.
రిప్లయితొలగించండిప్రవీణ్ గారు నెనర్లు. ఇరవైనిముషాలు మాత్రమే అంటే మీరు అదృష్టవంతులో లేదా వారం మధ్యలో అంతగా రద్దీ లేని సమయం లో వచ్చి ఉంటారండీ, ఇప్పుడేలా ఉందో తెలియదు కానీ ఇదివరకు మెజెస్టిక్ క్యూలు చాలా ఎక్కువే...
Sujata గారు నెనర్లు, మీ జ్ఞాపకం బాగుందండీ.. నాకు అలా మా నరసరావుపేట గూడు రిక్షాల లో ప్రయాణం చేసిన రోజులు గుర్తుకొచ్చాయి. హైదరాబాదీ భాషలోనే "ఆప్ కీ హుకుం పార్ట్ టూ జరూర్ హోగా.."
హరేఫల గారు నెనర్లు, నిజమేనండీ ఈ మధ్య షేర్ ఆటో లు ఎక్కువయ్యాయి.. అత్యాశ కి పోయి పరిమితి కి మించి ఎక్కించి ప్రమాదాలకి కారణం కానంత వరకూ ఇవి బాగానే ఉంటాయి.
చైతన్య గారు నెనర్లు, ఎవరండీ ఆ హీరో.. నేను ఎప్పుడూ గమనించలేదే.. అప్పుడప్పుడూ ఉపేంద్ర బొమ్మలు మాత్రం చూసాను.
కొత్తపాళి గారు నెనర్లు.
నేస్తం నెనర్లు.
సుజాత గారు బహుశా జెండర్ డిఫరెన్స్ అయి ఉంటుందేమో నండీ, పోన్లెండి కనీసం మహిళలకన్నా మర్యాద ఇస్తున్నారనమాట. నా ఆప్తమిత్రుడొకడు బన్నేర్ ఘట్ట రోడ్ షాపర్స్ స్టాప్ పక్కన ఉన్న మంత్రీ లోనే ఉండేవాడు. 2006 లో తరచూ వెళ్తుండేవాడ్ని అక్కడ ఆటోస్టాండ్ వాళ్ళ లెక్కలేని తనంతోనే నాకు విసుగొచ్చేది. నలుగురి లో ఇద్దరి సమాధానం గీరగానే ఉండేది. అప్పటికీ నేను గివ్ అండ్ టేక్ పాలసీ ని అనుసరించి చాలా మర్యాదగా మాటాడే వాడ్ని అయినా ఉపయోగం ఉండేది కాదు. బిజిరోడ్ ఐబియం దగ్గర కూడా నాది ఇంచు మించు ఇలాంటి అనుభవమే..
గిరీష్ గారు నెనర్లు. "ఎందుకు పనికి రాని వాడ్ని.." "అవి మోటార్లు.." అని అంటూ రెండే ముక్కల్లో భలే తేల్చి చెప్పారు సుమా...
బెంగళూరు, హైదరాబాదు, వంటి నగరాలలో ఆటోలు కాదు కాని...చక్కగా మా కాకినాడ లో ఐతే..ఎక్కడికైనా 20,30 రూపాయలు....ఎక్కువ స్కూలు పిల్లల్ని తిప్పే వళ్ళే ఉంటారు..అందుకు చెక్క కూడా ఉంటుంది.... పైగా పరీక్షలప్పుడు సెంటర్కి వెళ్ళాసివస్తే, అక్కడ దించాకా వాడికి టైము చెపితే చాలు....మనం పరీక్ష అయ్యాకా బయటకి వచి చూస్తే చక్కగా వేచివుంటాడు, డింగని ఇంటిదగ్గర దించేస్తాడు...కానీ అందరూ అలా కాదులే..రౌడీ బాచ్ కూడా వుంటారు..ఎక్కినప్పుడు 20 అని దిగిన తర్వతా నేను 40 అన్నాను మీకు వినిపించలేదు అని డబాయంచేస్తారు.....అలాంటప్పుడు మీటరే బెస్టు అనిపిస్తుంది..
రిప్లయితొలగించండి>>మాములు మీటర్ల లో అయితే ఇంతవరకూ ఏ రెండు మీటర్లు ఒకే రీడిం చూపించిన పాపాన పోలేదు
రిప్లయితొలగించండిthats true!!!
@సుజాత గారు: దురుసుగా మాట్లాడే వాళ్ళు తక్కువా!!! నాకైతే అంత మంచి వాళ్ళు ఎక్కువ తగల్లేదు!!
పైన ఎవరో అన్నట్లు, ఆటో ఎక్కాల్సి వస్తే నా మీద నాకే జాలేస్తుంది!!
ఆటోలు ఎక్కీ-ఎక్కీ ఆ మీటర్ చూడగానే ఏది రైటో, ఏది రాంగో అర్దమవుతోంది..!! :)
నేను గారు నెనర్లు. నిజమే దబాయించే బ్యాచ్ కూడా బాగానే ఉంటారు.. ఓ పరీక్ష లకి ఇలా డ్రాపింగ్ అండ్ పికప్ సర్వీసు భలే గుర్తు చేసారు, నాకూ అనుభవమే...
రిప్లయితొలగించండికత్తి మహేష్ గారు నెనర్లు.
మేధ గారు నెనర్లు, అయితే మీరు అర్జంట్ గా ఈ దొంగ మీటర్లు ఎలా పట్టుకోవాలో ఓ టపా రాసేసి పుణ్యం కట్టుకోవాలండి.
అర్రె, మీకూ, నాకూ చాలా సారూప్యాలు ఉన్నాయే? నేనూ ఆటోలకు మహారాజపోషకుణ్ణే. నాకూ టూ వీలర్ నడపడం రాదు. అన్నట్టు ఇదివరకు చాలా టపాలు వచ్చాయి బెంగళూరు ఆటోలమీద. వెతకండి.
రిప్లయితొలగించండిరవి గారు నెనర్లు, ఓ అవునా మన సారూప్యాల గురించి తెలుసుకోడం ఆసక్తికరంగా ఉంది. ఓ బెంగళూరు ఆటోల పై టపాలు వచ్చాయా, నేను చదవలేదండీ తప్పకుండా వెతుకుతాను.
రిప్లయితొలగించండివేణూ గారు చాలా బాగుంది.
రిప్లయితొలగించండిPlease watch my new posting
Thanks varma.
రిప్లయితొలగించండి