బుధవారం, జులై 29, 2009

కలవరమాయేమదిలో !!

కనులే కలిపే కథలే తెలిపే నాలోని భావాలే
అలలై మెదిలే కలలే కదిపే వేవేల రాగాలే
పలికే.. స్వరాలే ఎదకే.. వరాలై
పదాలు పాడు వేళలో కలవరమాయే.. మదిలో...

కలవరమాయేమదిలో!! ఈ దశాబ్దపు ఉత్తమ చిత్రం అని ఖచ్చితంగా చెప్పను కానీ, మంచి తెలుగు చిత్రాలు రావాలి అని కోరుకుంటున్న ప్రతి ఒక్కరు తప్పని సరిగా చూసి ప్రోత్సహించ వలసిన చిత్రం. హీరో గా కమల్ కామరాజు అందం :-) అక్కడక్కడా స్క్రీన్ ప్లే లోపాలూ పంటి కింద రాళ్ళ లా తగుల్తూ ఉన్నా... ఆకట్టుకునే స్వాతి నటన, ఆహ్లాదకరమైన మంచి సంగీతం, చక్కని కథాంశం, ఆలోచింప చేసే కొన్ని సంభాషణలు, పాటలలో వనమాలి గారి అర్ధవంతమైన సాహిత్యం తో ఓ ప్రత్యేకమైన చిత్రం గా నిలబడుతుంది. ఈ చిత్ర నిర్మాత దర్శకుడు చేసిన ఈ మంచి ప్రయత్నానికి ప్రోత్సాహం అందించ వలసిన అవసరం ఎంతైనా ఉంది, ఆ ప్రోత్సాహం మరికొందరి నిర్మాతల/దర్శకుల ఆలోచనా ధోరణి ని ప్రభావితం చేయగలిగితే అంత కన్నా తెలుగు చలన చిత్ర అభిమానులకి కావలసినదేముంది.


స్వాతి కలర్స్ ప్రోగ్రాం చేసేప్పుడు ఒకోసారి ఈ అమ్మాయెవరో బాగా మాట్లడుతుంది అనుకున్నా ఒకోసారి మరీ ఇంత ఒవర్ యాక్షన్ అవసరమా అనుకునే వాడ్ని. మెల్లగా సినిమాలలో ప్రవేసించింది చూస్తున్నాం కానీ నన్ను అమితంగా ఆకట్టుకున్న పాత్ర మాత్రం ఆడవారి మాటలకి అర్ధాలే వేరు లే చిత్రం లో, ఆ సినిమా లో నాకు నచ్చిన అంశం కేవలం స్వాతి పాత్రే. చాలా బాగా చేసింది అనిపించుకుంది. ఇక అష్టాచెమ్మా చిత్రం లో అక్కడక్కడా బాగానే ఉందనిపించినా శ్రీనివాస్ డామినేట్ చేయడం, చాలా చోట్ల అతి గా అనిపించడం వల్ల పెద్దగా నచ్చ లేదు. ఇక ఈ సినిమా లో కొన్ని చోట్ల వెటకారం గా ఆహా!! అనిపించినా సినిమా మొత్తం మీద చాలా సార్లు ముచ్చట పడిపోయి సోక్యూట్ అనీ, మరి కొన్ని సార్లు వహ్వా!! అనీ అనిపించుకునే నటన ని ప్రదర్శించింది. మరి ఆ పాత్రని అలా మలిచారేమో ఆ ఎఫెక్టే ప్రతిఫలించిందేమో తెలియదు. హీరోతో పీకల్లోతు ప్రేమ లో మునిగి పోయిన సన్నివేశాల్లో ఎంత బబ్లీగా ఆకట్టుకుంటుందో.. తన లక్ష్య సాధన కోసం తపించి పట్టుదలగా ప్రయత్నించడం లోనూ, మరి కొన్ని బరువైన సెంటిమెంటి సన్నివేశాలలోనూ అంతగానే ఆకట్టుకుంది.

ఇక సంగీత ప్రధానమైన కథాంశం తో వెలువడిన ఈ చిత్రం లో శరత్ వాసుదేవన్ సంగీతం చక్కగా ఉంది. అన్నీ క్లాసికల్ సాంగ్స్ లేదా కీర్తనలు అందించాలి అని అలోచించకుండా సమ పాళ్ళ లో మామూలు పాటలు, "కరివరదుని", "గురుర్బ్రహ్మ", "పల్లవించని.." లాటి పాటలూ ఉంచి ఆకట్టుకునే సంగీతాన్ని అందించారు. సింగిల్ కార్డ్ గీతరచయిత గా వనమాలి గారు మంచి సాహిత్యాన్ని అందిస్తే... దాని కి సరైన ప్రాధాన్యతను ఇస్తూ వాయిద్యాల హోరు సాహిత్యాన్ని మింగేయకుండా జాగ్రత్త పడుతూ.. మంచి ఆర్కెస్టైజేషన్ తో వినసొంపైన బాణీలు కూర్చారు వాసుదేవన్. ఇక చిత్ర గారి గానం గురించి ప్రత్యేకించి నేచెప్పేది ఏముంది.

కమల్ కామరాజు ని భరించగలిగితే సినిమా చూడటానికి ఇక మీరు ఏమీ ఆలోచించ వలసిన అవసరం లేదు. అతను అందం తో కండల ప్రదర్శనతో విసిగించినా... స్వాతి కి క్లాస్ పీకే సన్నివేశాల్లో అతని ప్రాముఖ్యత అపారం. ముఖ్యం గా లక్ష్యం గురించి చెప్తూ చెప్పిన డ్యాష్ ఫిలాసఫీ (వివేకానందుడి ఫోటో చూపిస్తే ఆయన గురించి చెప్తారేమో అనుకున్నా..కానీ చిన్న సరెప్రైజ్ ఇచ్చాడు దర్శకుడు), ఇంకా అమ్మ గురించి చెప్తూ.. ఒకోసారి సింపతీ మన విచక్షణ ని ఎంతగా ప్రభావితం చేస్తుందో, ఓ అంశాన్ని లేదా సమస్యని ఇతరుల దృఃక్కోణం నుండి పరిశీలించడం ఎంత అవసరమో ఆలోచించేలా చెప్పే సంభాషణలు నన్ను చాలా ఆకట్టుకున్నాయి. నాకు అవకాశం దొరికిన వెంటనే ఈ చిత్రాన్ని మళ్ళీ థియేటర్ లో చూస్తాను, మీరూ చూడండి.

ఈ సినిమా లోని కొన్ని పాటల పల్లవులు మీకోసం. కేవలం సాహిత్యపు రుచి చూడటానికే అనమాట. "ఓ నేనే ఓ నువ్వని.." పాట మంచి మెలొడీ తో ఆకట్టుకుంటే.. "నీలో అణువంత.." అల్లరిగా ఆకట్టుకుంటుంది.. టైటిల్ సాంగ్ "కలవరమాయే మదిలో..." మన మదిని కలవరపరిస్తే.. "తొలి తొలి ఆశలెన్నో రేపుతున్న.." పాట హుషారుగా సాగిపోతుంది. ఇక ఈ టపా చివరలో ఇచ్చిన, చిత్రం క్లైమాక్స్ లో వచ్చే "పల్లవించనీ.. నా ప్రథమ కీర్తనం.." సాహిత్యం సినిమా అంతా చూశాక చాలా అర్ధవంతంగా అనిపించి మనసంతా ఆర్ధ్రతతో నింపేస్తుంది.

తొలి తొలి ఆశలెన్నో రేపుతున్న థిల్లాన
మనసును మీటుంతుంటే కొత్త పాటనవుతున్నా
ఏ చిన్ని సందళ్ళు విన్నా ఈ గుండె చాటున
నా గొంతు వాకిళ్ళలోన ఆ పాట దాగునా?
దరి చేరే స్వరము నాకో వరము
ప్రతి రోజూ పదము పాడే సమయాన
నన్నే నీలో కన్నా

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

నీలో అణువంత ప్రేమున్నా.. అనుమానం రేగేనా..నాతో తగువే తగునా...
చాల్లే తమ తీరు చూస్తున్నా.. మితి మీరి పోయేనా..అంతా ఒకటే నటనా..
నా ప్రేమ సంతకాల సాక్ష్యాలే చూపనా..
ఏం మాయ చేసినా నీమాటే చెల్లునా..
నాపై..కోపాలేనా..

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఓ నేనే.. ఓ నువ్వని.. ఒక తీరే మన ప్రేమనీ..నీ గూటికే రానీ..
నేనంటూ ఇక లేననీ.. నీ వేంటే ఉన్నాననీ..చాటనీ..
చేశానే నీ స్నేహాన్నీ... పోల్చానే నా లోకాన్నీ..నీవాణ్ణీ..

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

మాతృదేవోభవ! పితృదేవోభవ!
ఆచార్యదేవోభవ!

పల్లవించనీ నా ప్రథమ కీర్తనం
ఒక మాతృప్రేమకే ఓంకారముగా
ప్రణమిల్లి పాడనీ నా హృదయ స్పందనం
ఒక తండ్రి కలలకే సాకారముగా
జన్మను పంచిన జననీ జనకుల
ఆలనలే ఆలాపనగా
అనురాగములే ఆలంబనగా

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

4 కామెంట్‌లు:

  1. నేను స్వాతి ఓవర్ యాక్షన్, కమల్ కామ్రాజ్ అండర్ యాక్షన్ తట్టుకోలేను అనుకునే ఈ సినిమా ని చూడకుండా దాటించేస్తున్నా. మీరు బాగుంది అన్నారంటే ఒక సారి ధైర్యం చేయవచ్చన్నమాట

    రిప్లయితొలగించండి
  2. నేను రెండుసార్లు చూశానండి.. ఓ టపా కూడా రాశాను.. నాకు కే.విశ్వనాధ్, శేఖర్ కమ్ముల సినిమాలు గుర్తొచ్చాయి.. ఇప్పుడున్న వాటిలో చూడదగ్గ సినిమా.. బాగుంది టపా, ముఖ్యంగా సాహిత్యం ఇవ్వడం.. చివరి పాట నాకు 'సాగర సంగమం' లో 'వేదం..' పాటని గుర్తు చేసింది..

    రిప్లయితొలగించండి
  3. అందరూ స్వాతి నటనను సావిత్రి తో పోలుస్తుంటే అలవాటు ప్రకారం ఎంత ఓవరాక్షన్ చేసిందో అని భయపడుతూ వెళ్ళాను గానీ స్వాతి చక్కగా చేసింది. డైలాగులు మరీ నాలిక్కింద రూపాయి బిళ్ళ పెట్టుకున్నట్లు కాకుండా(అది ఆమె స్టైలు కదా) బాగా చెప్పింది. అష్టా చెమ్మాలోని అతి ఇక్కడ కనపడలేదు.స్వాతి తర్వాత భరణి బాగా చేశాడు.

    కథ మరీ అన్యాయం కాదు. అసభ్యత లేదు. హీరోవిను ఓవరాక్షన్ చేయలేదు. పాటలు బాగున్నాయి. టైటిల్ సాంగ్ మరీనూ! చాలు! పాస్ చేసేశాను. ఇంతకంటే అత్యాశ లేదు బాబూ నాకు ఇవాళ్రేపు!

    రిప్లయితొలగించండి
  4. ధన్యవాదాలు లక్ష్మిగారు, అవునండీ ఒక సారి తప్పకుండా చూడచ్చు. నెమలికన్ను మురళి గారు ఇంకా సమగ్రమైన సమీక్ష రాశారు చదవండి ఇంకా ధైర్యం వస్తుంది చూడటానికి :-) అయినా సుజాత గారు అన్నట్లు ఇవ్వాళ్రేపు క్లీన్ సినిమానే గగనమైపోతుంది, ఇంక నటన మిగిలిన విషయలలో ఏమి ఆశపడతాం చెప్పండి.

    ధన్యవాదాలు మురళి గారు, నేను మీ టపా చదివానండీ.. నిజమే విశ్వనాధ్, కమ్ముల కాంబినేషన్ లా ఉంది కానీ మంచి ప్రయత్నం

    ధన్యవాదాలు సుజాత గారు, అంతే లెండి అంతకంటే ఆశించ లేము ఇవ్వాళ్రేపు. :-) "నాలిక్కింద రూపాయి బిళ్ళ ..." :-) మీరు సూపర్ అండీ బాబు.

    రిప్లయితొలగించండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.