బుధవారం, మే 21, 2008

బ్లాగు వెనుక కధ

అసలు ఈ బ్లాగు ఎందుకు? అని ఎవరైనా ప్రశ్నించక ముందు నేనే వివరించేస్తే "ఓ పనైపోతుంది బాబు" అనుకుని ఈ రోజు పోస్ట్ మొదలు పెట్టానండి. సరే ఇంక విషయానికి వస్తే ఈ బ్లాగు పేరు చెప్పినట్లు గా ఇది పూర్తి గా నా స్వగతం, నాతో నేను నా గురించి చెప్పుకునే కబుర్లు. డైరీ అనుకోవచ్చేమో కానీ అందులో ఏ రోజు కబుర్లు ఆ రోజే రాస్తామేమో కదా. ఇందులో మరి అలా కాదు కదా... ఎదేమైనా ప్రతి ఒక్కరికీ తన బాల్య స్మృతులు అంటె అపారమైన ఇష్టం వుంటుంది. అది కాదనలేని నిజం, ఆ స్మృతులు కష్టమైనవి కావచ్చు అందమైనవి కావచ్చు ఎలాంటివైనా, "కాకి పిల్ల కాకి కి ముద్దు" అన్న చందాన ఎవరి బాల్య స్మృతులు వాళ్ళకి ముద్దు.

కనుక అలాంటి నా బాల్య స్మృతులలో కొన్నిటిని ఈ మధ్యే పరిచయమైన ఒక నేస్తానికి వివరించాను తను చదివి ఆనందించడమే కాకుండా తన బాల్యం లో కూడా ఇంచు మించు ఇలాంటివే మధుర స్మృతులని నాకు చెప్పినపుడు అబ్బురపడ్డాను. మా బుడుగు గాడి భాషలో చెప్పాలి అంటే హశ్చర్య పడిపోయెస్తున్నా అనమాట. తనతో ఆ విషయాలు చెపుతూ కొన్ని సంఘటనలు ఙ్నప్తికి తెచ్చుకోడానికి ప్రయత్నించినపుడు కొన్ని విషయాలు పూర్తి గా మర్చిపొయాను అనిపించింది. అవి నాకు సంబందించిన విషయాలు మరి నేను గుర్తు పెట్టుకోక పోతే ఎలా చెప్పండి. కాని వయసు మీద పడే కొద్దీ మన మెదడు లొ మెమొరీ కి ఖాళీ లేక పాత ఙ్నాపకాలని చెరిపి వేసి కొత్త వాటిని నిక్షిప్త పరుస్తుందేమో అనిపించింది. అలా ఐతే మరి ఇన్ని మధుర స్మృతులు కాలక్రమం గా మాయమవ వలసిందేనా అని బాధ అనిపించింది.

దానికి తోడు ఇప్పటి గజిబిజి బిజీ వాతావరణం నుండి ఒక్క సారిగా బాల్యావస్థ లోకి వెళ్ళి ఒక పది నిముషాలు అలా అలోచనలొ పడి పోతే తక్కిన రోజంతా ఎంతో ఆహ్లాదం గా గడవడం గమనించాను. మరి అలాంటి స్మృతులని ఎదైన ఒక చోట పదిల పరచుకొని మళ్ళీ మళ్ళీ చదువుకో గలిగితే అన్న ఆలోచన నుండి పుట్టిందే ఈ బ్లాగు. నా ఈ ఆలోచనకి నా నేస్తం ప్రోత్సాహం కూడా తోడవడం తో ఇక ఎక్కువ ఆలోచించకుండా ఈ బ్లాగు మొదలు పెట్టాను.

మీకు ముందే చెప్పినట్లు ఇవి నా అనుభవాలు నా ద్రుక్కోణం నుండి చూసి నాకు తోచినట్లు గా వ్రాసుకుంటున్నవి. ఇవి అందరికీ నచ్చాలి అని నియమం ఏమీ లేదు. నచ్చిన కార్యక్రమం రాక పోతే టెలివిజన్ లో ఛానెల్ మార్చి నట్లుగా మీరు మీ అభిరుచికి తగ్గ బ్లాగు ని ఎన్నుకుని చదువుకునే స్వేచ్చ మీకు ఎప్పుడూ ఉంటుంది అనేవిషయం మరువకండి.

ఇక పోతే ఇందులో నేను వ్రాసే విషయాలు నాకు గుర్తున్నంత వరకూ వ్రాస్తున్నాను అక్కడక్కడ ఎమైనా తప్పులు అవాస్తవ సంఘటనలు దొర్లినట్లు మీకనిపిస్తే తెలియ జేయగలరు. ఈ బ్లాగ్గులో నేను ఇస్తున్న ఇవ్వబోయే పాటలు మరి ఇంకా ఎన్నో వందల తెలుగు పాటల సాహిత్యం కోసం Orkut లోని Telugu Song Lyrics అన్న community ని ఈ లింక్ లో "http://www.orkut.com/CommTopics.aspx?cmm=44911101" చూడగలరు.

ఈ రోజుకి ఇక శలవా మరి.

--వేణు.

2 కామెంట్‌లు:

  1. మీరు చెప్పింది అక్షాలా నిజం వేణూ.

    చాలా మందికి బాల్య స్మృతులు కాలం తో పాటే కనుమరుగైపోతాయి. వాటిని ఇలా భద్రపరచటం బాగుంది. మీరూ వ్రాసే శైలి కూడా సరళం గా, చక్కగా, ఆహ్లాదం గా ఉంది. వీలైతే మీ ఊరి ఫొటోలు, మీరు తిరిగిన ప్రదేశాల ఫొటోలు కూడ పెట్టండి. మరింత అందం వస్తుంది !

    రిప్లయితొలగించండి
  2. మీ సూచన చాలా బావుంది వేణు గారు కానీ ఫోటో ల కోసం నేను ఇండియా వెళ్ళి వచ్చే వరకు ఆగాలి. నా దగ్గర ఆ ఫోటో లు ఏమి లేవు.

    రిప్లయితొలగించండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.