సోమవారం, ఫిబ్రవరి 03, 2020

అల వైకుంఠపురములో...

సంక్రాంతి తెలుగు వాళ్ళందరికీ ఎంత ఇష్టమైన పెద్ద పండగో సినీ ప్రియులకి అంతకంత ఇష్టమైన పండగ. ఎందుకంటే ఈ సీజన్ లో కనీసం రెండు మూడు పెద్ద సినిమాలు విడుదలై అభిమానులని అలరిస్తూ సినిమాకి దాని చుట్టూ ఆధారపడే వాళ్ళందరికి నాలుగు డబ్బులు సంపాదించి పెట్టే పండగ కనుక.

ఐతే ఈ పండగను అడ్డం పెట్టుకుని టిక్కెట్ రేట్లు అడ్డగోలుగా పెంచేసి "ఐనా కలెక్షన్స్ వస్తున్నాయంటే డబ్బులు పెడుతున్నారు సో పండగరోజులే కాదు వీకెండ్ కూడా టిక్కెట్ రేట్లు పెంచుతాం" అనే నిర్మాతలని చూస్తే మాత్రం అలాగే మీరు పెంచుకోండి పైరసీని కూడా పెంచి పోషించుతారు ప్రేక్షకులు అని అనాలనిపిస్తుంది.

ఈ సంక్రాంతికి గుంటూరులో రెండు పెద్ద సినిమాలకీ రెండు వారాల పాటు 100రూ ఉండే సింగిల్ స్క్రీన్ టిక్కెట్స్ ని 200 కి అలాగే 138రూ ఉండే మల్టీప్లెక్స్ టిక్కెట్స్ ని 250 కి పెంచేశారు. రిలీజైన వీకెండ్ వరకూ పెంచడం ఓకేనేమో కానీ రెండువారాల పాటు ఈ విధమైన దోపిడీ మాత్రం ఆమోదయోగ్యం కాదు. నేనీ సినిమా ఎంత టాక్ వచ్చినా మొదటి రెండు వారాలపాటూ చూడక పోవడానికి కారణం ఈ పెంచిన టిక్కెట్ రేట్లను ఎంకరేజ్ చేయడం ఇష్టం లేకే.  

సరే ఇక ఆ విషయం పక్కన పెట్టేస్తే "అల వైకుంఠ పురములో" ఉన్నది కొత్త కథేం కాదు తెలుగు సినిమాలలో ఎన్నో దశాబ్దాలుగా నలుగుతున్న కథే కానీ కథనం మాత్రం కొత్తది. సంక్రాంతి సీజన్ లో కొత్త కథాంశాలు వైవిధ్యమైన సినిమాలకన్నా కూడా రొటీన్ అయినా కూడా ఎక్కడా బోర్ కొట్టనివ్వకుండా ఆహ్లాదకరంగా ఇంటిల్లిపాదినీ రంజింప చేయగల లైటర్ వీన్ సినిమాలే బాగా ఆకట్టుకుంటాయి. అలవైకుంఠపురములో సరిగ్గా అలాంటి సినిమానే.
 
హీరోయిన్ ఇంట్రడక్షన్ లోనూ తన మొదటి రెండు మూడు అప్పియరెన్సెస్ లోనూ హీరో గారు కళ్ళతోనే ఆవిడ కాళ్ళ సూప్ జుర్రేస్తున్న టైమ్ లో కాస్త ఇబ్బంది పడతాం తప్ప మిగిలిన సినిమా అంతా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. మీరింకా ఏవైనా సందేహాలతో సినిమా చూసుండక పోతే చూసేసి వచ్చి మిగిలిన సమీక్ష చదవండి.

కథ టూకీగా చెప్పుకోవాలంటే తనతోపాటే కంపెనీలో జాయినై బాస్ కూతుర్ని పెళ్ళాడి తనకే బాస్ స్థానంలో వచ్చిన రామచంద్ర(జయరామ్) అంటే విపరీతమైన జెలసీ వాల్మీకి(మురళీ శర్మ)కి. వీళ్ళిద్దరి భార్యలూ (టబు, రోహిణి) ఒకే సమయంలో ఒకే హాస్పటల్లో పురుడు పోసుకుంటారు. తన కొడుకు రాజాలా పెరగాలని పురిట్లోనే పిల్లలని మార్చేస్తాడు అసూయకి నిలువెత్తు ప్రతిరూపమైన వాల్మీకి. అలా మారిన పిల్లలు ఎలా పెరిగారు వారి భవిష్యత్తేమైంది, పిల్లల స్థానాన్ని మార్చగలిగిన వాల్మీకి వారి స్థాయిని కూడా నిర్దేశించ గలిగాడా అనేది మిగిలిన కథ. 

పైన చెప్పినట్లు కథ కొత్తది లేకపోయినా ట్రీట్మెంట్ కొత్తగా రాసుకుని సరైన నటీనటులని ఎన్నుకుని సన్నివేశాలను బ్రీజీగా అల్లుకుని అప్పటి కథలను కూడా ఎంత కొత్తగా చెప్పచ్చో ఈ సినిమాతో త్రివిక్రమ్ నిరూపించాడు. ఎక్కడా బోర్ కొట్టకుండా సరైన నటీనటులతో వారి చక్కని నటనతో అద్యంతం ఆహ్లాదకరంగా సాగిపోతుంది ఈ సినిమా.  

నటనలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వాల్మీకి గా నటించిన మురళీ శర్మ గారి గురించి. ఆల్రెడీ తెలుగు సినిమాల్లో తగిన గుర్తింపు తెచ్చుకున్న ఇతను ఈ సినిమాతో మరొక మెట్టు పైకెదిగిపోయాడు. వాల్మీకి తప్ప ఎక్కడా మనకి మురళీ శర్మ కనిపించరు. ఇక అల్లు అర్జున్ తన స్టైలిష్ పెర్ఫార్మెన్స్ తో కట్టి పడేస్తాడు. మాములుగా డాన్స్ బాగా చేస్తాడని అందరికి తెలిసిన విషయమే కానీ రెడ్ కోట్ తో అందరి హీరోల డాన్సులని ఇమిటేట్ చేస్తూ చేసిన డాన్స్ మెడ్లీ ఐతె సినీ పరిభాషలో చెప్పాలంటే ఇరగదీసేశాడంతే. అలాగే నిజం తెలిసేప్పుడు ఆ తర్వాత ఫ్లై ఓవర్ పై వాల్మీకి తో సన్నివేశాల్లో కూడా అద్భుతంగా చేశాడు. 

అమృతం ఫేమ్ హర్ష వర్థన్ లోని కామెడీ యాంగిల్ నే కాక క్యారెక్టర్ నటుడ్ని పరిచయం చేసే రోల్ చేశారు. అలాగే జయరామ్ రోల్ కూడా చాలా బావుంది టబుతో ఎమోషనల్ సీన్ లో ఇద్దరి నటన ఆకట్టుకుంటుంది ఆ సీన్ సూపర్. సచిన్ ఖేడేకర్ నటన కూడా బావుంది. సుశాంత్ సినిమా అంతా నవ్వుతూ గాల్లోకి చూస్తూ గడిపేసినా ఉన్న ఒక్క ముఖ్యమైన సీన్ తో మార్కులు కొట్టేశాడు. సునీల్, నవదీప్, రాహుల్ పాత్రలు కేవలం ఫ్రెండ్షిప్ కొద్దీ చేసినట్లున్నాయి. సముద్ర ఖని అప్పల్నాయుడుగా చిత్రమైన మానరిజంతో  అక్కడక్కడ మెప్పించాడు. మిగిలిన నటీనటులంతా వారి వారి పాత్రలకు తగిన న్యాయం చేశారు.  

హీరోయిన్ గా చేసిన పూజా హెగ్డే ని గ్లామర్ కి మాత్రమే పరిమితం చేయకుండా యంగ్ ఎంటర్ ప్రెన్యూర్ గానూ టబూని ఆత్మవిశ్వాసం తో కూడిన బలమైన వ్యక్తిత్వంగల ఇల్లాలు గానూ మంచి పాత్రలలో మలిచాడు త్రివిక్రమ్. వారి నటన అందుకు తగినట్టుగానే ఆకట్టుకుంటుంది. రోహిణి గారు సగటు మధ్య తరగతి అమ్మగా చక్కగా సరిపోయారు. నర్సుగా కథ కు కీలకమైన రోల్ లో ఈశ్వరి గారు మెప్పిస్తారు. 

సాంకేతిక విభాగంలో ముందుగా చెప్పుకోవలసింది థమన్ గురించి. ఈ సినిమాకి అందించిన అన్ని పాటలు సూపర్ హిట్స్ అనే చెప్పుకోవచ్చు. ఏపాటకాపాట వైవిధ్యంగా ఉండి ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్ లో వచ్చే సిత్తరాల సిరపడు పాట అద్భుతం. దానికి రామ్ లక్ష్మణ్ ల యాక్షన్ కొరియోగ్రఫీ దానిని అలవోకగా అభినయించిన అల్లు అర్జున్ వెరసి కొన్ని సంవత్సరాల పాటు నిలిచి పోయే పాట.

ఈ ఒక్కటనే కాదు మొదట్లో వచ్చే చున్నీ ఫైట్ కానీ స్టార్ హోటల్ లోని ఫైట్ కానీ, పోర్ట్ ఫైట్ కానీ ఈ సినిమా లో ఫైట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకునేలా ఉన్నాయి. స్టైలిష్ స్టార్ అని బన్నీని ఎందుకంటారో వీటిలో తన పెర్ఫార్మెన్స్ తో మరోసారి ఢంకా బజాయించి చూపెట్టేశాడు. ఇక కొన్ని ప్రొడక్షన్ హౌసెస్ లో నిర్మాణ విలువల గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు అవి బావుండడం సహజమైపోయింది అలానే సినిమాటోగ్రఫీ కూడా.
 
సినిమా అంటే వైవిధ్యమైన కథ సహజత్వం ఏదో ఒక కొత్తదనం ఉండాలని కోరుకునే వారికి ఈ సినిమా అంతగా నచ్చకపోవచ్చు కానీ ఇంటిల్లిపాది హాయిగా కూర్చుని ఆస్వాదించగలిగే కమర్షియల్ ఎంటర్టైనర్స్ ని ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది మిస్సవకండి. అలా అని అస్సలు కొత్తదనం లేదని కాదు కథనం కొన్ని సన్నివేశాలు కొత్తగా కూడా ఉండి మెప్పిస్తాయి.
 
సినిమాలో నాకు నచ్చిన కొన్ని సంభాషణలని ఇక్కడ పొందు పరుస్తున్నాను. సినిమా ఇంకా చూడని వాళ్ళు ఫీల్ మిస్సవకూడదనుకుంటే చూశాక చదువుకోవడం మంచిది.
"మేడమ్ సార్.. మేడమ్ అంతే" (ఎవరినైనా మెచ్చుకోడానికి ఈ డైలాగ్ ని ఇదివరకు ఎందరో వాడుండచ్చు కానీ బన్నీ చెప్తుంటే చూడాలి అంతే. కామెడీ షోస్ లోనూ చిన్న సినిమాల్లోనూ మళ్ళీ మళ్ళీ వినిపించే డైలాగ్ అవుతుంది)

"ఇంట్లో దీపం వెలిగితే ఒక్క కుటుంబానికే.. అదే గుళ్ళో వెలిగితే ఊరంతటికీ వెలుతురు.."

"మనది మిడిల్ క్లాస్, లక్షపనులు కోటి వర్రీస్ ఉంటాయ్, తలొంచుకుని వెళ్ళిపోవాలి అంతే."

"అబద్దాలు చెప్తుంటే తలనొప్పొచ్చేస్తుండేది సార్.. నిజం చెప్పాక అవతలోళ్ళకి రాటం మొదలుపెట్టింది.. నాకు చాలా సుఖంగా ఉంది"

"నిజం చెప్పేప్పుడే భయమేస్తుంది, చెప్పక పోతే ఎప్పుడూ భయమేస్తుంది"

"బరువు పైనుంటే కిందకి చూళ్ళేవు.. ఎంత బరువు పెడితే అంత పైకి చూస్తావ్.. ఎంత కష్టపడితే అంత పైకి లేస్తావ్"

"వంటోడికీ.. వెయిటర్ కీ నో చెప్పడం ఈజీ.. కానీ పవర్ ఫుల్ వాడికి నో చెప్పడం చాలా కష్టం.. సో ఎంత పెద్దోడికి నో చెప్తే అంత గొప్పోడివి అవుతావ్."

"దేన్నైనా పుట్టించే శక్తి ఇద్దరికే ఉంది, ఒకటి నేలకి రెండు ఆడవాళ్ళకి అలాంటోళ్ళతో మనకి గొడవేంటి జస్ట్ సరెండర్ అయిపోవాలంతే"

"మనమొక ఆఫర్ ఇచ్చాక అవతలవాళ్ళు ’అయ్యా మాకొద్దు’ అన్నారంటే దానర్థం ఒద్దని. అందులోనూ అతి ప్రధానంగా మరీ ముఖ్యంగా ఒక స్త్రీ ఒద్దు అంటే మాత్రం దానర్థం అస్సలొద్దని."

"సేప బుర్రముక్క కలకత్తాల్లకిష్టమూ.. తోక ముక్క గోదారోళ్ళకిష్టమూ.. కానీ సేపకి మాత్రం బ్రతకడం ఇష్టం.. మరప్పుడది వలకి ఆవలుండాల వల్లోకొచ్చినాదనుకో ఇక ఒడ్డుకే.."

"గ్రేటెస్ట్ బ్యాటిల్స్ ఆర్ విత్ క్లోజెస్ట్ పీపుల్.. గొప్ప యుద్ధాలన్నీ నా అనుకున్న వాళ్ళతోనే"

"సంపాదించమనే పెళ్ళాం అందరికీ ఉంటుంది కానీ ఆపమనే పెళ్ళాం ఎవరికి ఉంటుంది"

"భార్యాభర్తలు పెళ్ళైన కొత్తలో తలుపులు వేస్కున్నారంటే వాళ్ళేం మాట్లాడుకున్నదీ నలుగురికీ తెలియకూడదని అదే వాళ్ళు పెళ్ళైన పాతికేళ్ళ తర్వాత కూడా తలుపులు వేస్కున్నారంటే వాళ్ళు మాట్లాడుకోవట్లేదని నలుగురికి తెలియకూడదని"

"దేవుడికి కూడా దక్షిణ కావాలి.. రాజుకి కూడా రక్షణ కావాలి"

"ప్రేమిస్తే అబద్దం విలువ తెలుస్తుంది కానీ నిజం చెప్తేనే కదా ఆ ప్రేమ ఎంత గట్టిదో తెలుస్తుంది."

"కష్టం అయినా నిజం మీద నిలబడే బంధం రాక్ సాలిడ్ గా ఉంటుంది"

"యుద్ధం వచ్చినపుడే దేశంలో ప్రజలు కులం, మతం, ప్రాంతం అనే తేడాల్లేకుండా కలిసిపోతారు. అలాగే కష్టం వచ్చినపుడే కుటుంబంలో వాళ్ళు స్వార్థం, ద్వేషం, పగ పక్కన పెట్టి ఒకటవుతారు."

"ఎప్పుడూ పిల్లలు బావుండాలని అమ్మానాన్నలు అనుకోవడమేనా.. అమ్మా నాన్నా బావుండాలని పిల్లలు అనుకోరా."

14 కామెంట్‌లు:

  1. వేదం తరువాత అల్లు అర్జున్ నటన మళ్లీ పీక్స్ లో ఉందీ మూవీలో..ముఖ్యంగా..తన తండ్రి గురించి హాస్పిటల్ లో తెలిసినప్పుడు..త్రివిక్రంగారు ఆ సీన్ ని కన్సీవ్ చేసిన విధానం అద్భుతం..పాత థీమే యెంచుకున్నా దానిని అందరినీ మెప్పించేలా తీయాలి అని ముందు నించే అనుకున్నానని చెప్పిన త్రివిక్రంగారు..అక్షారాలా ఆ మాటని నిలబెట్టుకున్నారు..హ్యూమన్ రిలేషన్స్ ని తన అందమైన మాటలతో మనసుకి హత్తుకు పోయేలా చెప్పే త్రివిక్రంగారంటే మాకు చాలా చాలా ఇష్టమండీ..థాంక్యు ఫర్ ద ఆర్టికల్..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హండ్రెడ్ పర్సెంట్ ఇన్ అగ్రీమెంట్ విత్ యూ శాంతి గారూ.. అల్లు అర్జున్ చాలా బాగా చేశాడు అండ్ ఎస్ మీరు చెప్పిన సీన్ చాలా బాగా తీశారు. థాంక్స్ ఫర్ ద కామెంట్. త్రివిక్రమ్ అంటే నాక్కూడా చాలా ఇష్టమండీ..

      తొలగించండి
  2. మంచి టాక్ వచ్చిన సినిమాలు చూడటం ఎంత ఇష్టమో, వాటికి మీరు రాసిన రివ్యూస్ చదవటం కూడా అంతే ఇష్టం. అల్లు అర్జున్ మూవీస్ లో జులాయి మూవీ తర్వాత, మళ్ళీ ఆ రేంజ్ లో నచ్చిన సినిమా ఇదే నాకు.

    మొన్నీమధ్యే దొరసాని మూవీ చూసాను.. బావుంది మూవీ.. కానీ నెగటివ్ ట్రోలింగ్ వల్లనో ఏమో మూవీ అంతగా ఆడినట్టు లేదు. మీకు కుదిరితే మూవీ చూసి నచ్చితే రివ్యూ రాయండి.. మీ రివ్యూ వల్ల మూవీ ఇంకొంతమందికి చేరుతుందని అనుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. థ్యాంక్స్ ఫర్ ద కామెంట్ ప్రియరాగాలు గారూ.. దొరసాని గురించి నేనూ మంచి రివ్యూస్ విన్నానండీ చూడడం ఇంకా వీలు పడలేదు.. చూశాక రాస్తాను.

      తొలగించండి
    2. ఇక్కడ కామెంట్ చూశాక “దొరసాని” సినిమా చూశాను ఇవాళ (Netflix లో). బాగానే ఉంది వేణూశ్రీకాంత్ గారూ. సినిమా వాళ్ళ ఊతపదం అయిన “డిఫరెంట్ గా ఉంది” ఈ సినిమాకు చాలా వరకే వర్తిస్తుంది. ఊహించని ముగింపు. హీరోయిన్ శివాత్మిక రాజశేఖర్ మొదటి సినిమా అయినా చక్కగా నటించింది (తన అన్మానాన్నల కన్నా నయం ... jk 🙂).

      వీలు చేసుకుని తప్పక చూడండి. చూడదగిన చిత్రమే.

      తొలగించండి
    3. సినిమా చూసి మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు థ్యాంక్స్ నరసింహారావు గారు. తప్పకుండా చూస్తానండీ.

      తొలగించండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.