సోమవారం, జనవరి 22, 2018

అమ్మ...

అమ్మ అంటే లాలనకూ నాన్నంటే క్రమశిక్షణకూ మారుపేరని లోకరీతి కానీ మా ఇంట్లో మాత్రం నాన్నారు మమ్మల్ని సాధారణంగా ఏమీ అనేవారు కాదు అమ్మ మాత్రం కొంచెం స్ట్రిక్ట్ గా ఉండేవారు. అదికూడా కోప్పడకుండానే ఓపికగా నెమ్మదిగా తియ్యగా చెప్తూనే మమ్మల్ని క్రమశిక్షణలో పెడుతుండేది. ఒకోసారి అబ్బా ఏంటో అమ్మ ఇన్ని రూల్స్ పెడుతుంది అసలు చెప్పకుండా ఎక్కడికైనా దూరంగా పారిపోతే బావుండు అప్పుడు తెలిసొస్తుంది అమ్మకి అని అనిపించేది కానీ హాస్టల్ పేరుతో మొదటిసారి దూరంగా ఉన్న రోజు నాన్న కంటే అమ్మే ఎక్కువ గుర్తొచ్చి బోలెడంత దిగులేసేది.

నాకు చిన్నపుడు అత్యంత కష్టమైన పని స్నానం చేయడం హహహహ అందులో అచ్చుతప్పులేం లేవండీ కష్టమైన పనే... మరీ చిన్నప్పుడు నీళ్ళలో ఆటలాడుకోడానికి బక్కెట్ మీద అరచేత్తో చరిచి నీళ్ళు చిందుతుంటే చూసి కేరింతలు కొట్టడానికి సరదాపడేవాడ్నని అమ్మ చెప్తుండేది కానీ కొంచెం పెద్దవాడినయ్యాక నాతో పాటు బద్దకం కూడా పెరిగి పెద్దదయ్యాక పొద్దున్నే లేచి రెడీ అవ్వడమంటే అస్సలు ఇష్టముండేది కాదు. స్కూల్ రోజుల్లో తప్పనిసరై ఎలాగోలా రెడీ అయినా కానీ శలవురోజులు వచ్చాయంటే వీడితో స్నానం చేయించాలంటే నాకు కంఠశోషతో నీరసమొస్తుందంటూ అమ్మ నాన్నారికి కంప్లైంట్లు చేసేది. అలా గొడవపెట్టకుండా బుద్దిగా స్నానం చేసి రెడీ అయ్యేది ఒక్క నా పుట్టినరోజునాడే అనమాట. నా పుట్టినరోజు మాంచి డిశంబర్ చలిలో వచ్చినా కానీ బుద్దిగా చేసేసేవాడ్ని కానీ మిగిలిన శలవు రోజుల్లో మాత్రం అమ్మతో చెప్పించుకోకపోతే స్నానానికి వెళ్ళబుద్దయ్యేది కాదు ఏవిటో.

అమ్మకి కూడా మరీ తెల్లవారు ఝూమునే లేచే అలవాటు లేకపోయినా కానీ ఇంటి ముందు కడిగి కళ్ళాపి చల్లి ముగ్గు వేయడం మాత్రం చీకటితోనే జరిగిపోవాలి పనిమనుషులు ఎవరైనా ముందురోజు సాయంత్రం వచ్చి వేసేసి వెళ్తామమ్మా అంటే ఆస్సలు ఒప్పుకునేది కాదు పొద్దున్నే ఆరింటిలోపే ముగ్గు పడాలి పెద్దయ్యాక కూడా ఓపిక తగ్గినా కూడా ఎపుడైనా ఆలశ్యమైనా ఒక వేళ పని మనిషి మానేసినా వెంటనే ఎలాగోలా లేచేసి ఓపికలేకపోతే ఆరుబయట చిన్న స్టూల్ వేసుకునైనా సరే నాలుగు గీతలు ముగ్గు గీస్తే కానీ తన మనసు శాంతించేది కాదు.

నేను బాగా చిన్నప్పుడు మా పిన్ని కూడా మా ఇంట్లోనే ఉండేవారు సో అమ్మకి పెద్ద పెద్ద ముగ్గులు వేయడం రాకపోయినా సంక్రాంతి నెల (ధనుర్మాసం) వచ్చిందంటే పిన్నీ అమ్మ కలిసి ముందు పుస్తకం మీద పెద్ద పెద్ద డిజైన్లు ముగ్గు మోడల్స్ గీస్కుని ఆ తర్వాత అమ్మ గైడ్ లైన్స్ ఇస్తుంటే నేనోపక్క కూర్చుని పొగడ్తలు ఇస్తు ముగ్గు గిన్నె నింపి అందిస్తూ సాయం చేస్తూంటే పిన్ని ఆ ముగ్గుని వాకిటముందు ముద్రించేసేది. అలా ఒకో రోజు రాత్రి పదకొండున్నర పన్నెండింటి వరకూ కూడా గీసిన సంధర్బాలుండేవి. మిగిలిన రోజులు పొద్దున్నే ముగ్గేయాలని రూల్ ఉన్నా సంక్రాంతి నెలలో మాత్రం రాత్రి పూటా గీస్కోడానికి ఎక్సెప్షన్ ఇచ్చేవారన్నమాట మరి గంటా గంటన్నర పట్టేసే పేద్ద ముగ్గులు కదా. 

సరే స్నానాల గురించి చెప్తూ సడన్ గా తెల్లారు ఝూమున లేవడం ముగ్గుల దగ్గరికి వెళ్ళి పోయా కదా... సో అమ్మ బాధ చూడలేక పిల్లలు కొంచెం ముందుగా లేస్తే స్నానానికి బతిమిలాడే ఇబ్బందుండదు అని మమ్మల్ని నిద్ర లేపడానికి నాన్నారు ఓ ఉపాయం పన్నెవారు. అదేంటంటే తను లేచి బయటకి వెళ్తూ ఫ్యాన్ ఆపేసేసి వెళ్ళేవారు దాంతో కాసేపటికి ఆటోమాటిక్ గా పిల్లలంతా కనీసం ఫ్యాన్ వేస్కోడానికి లేచేస్తారని ఆయన ఐడియా అనమాట. కొన్నాళ్ళు అలా లేపేసి మేం లేచాక ఏంటండీ ఈ పని అని అడిగితే "అర్రే అలవాటులో మర్చిపోయానర్రా" అని అనేసేవారు కానీ తర్వాత్తర్వాత మాకు సూక్ష్మం బోధపడి ఫ్యాన్ లేకపోయినా నిద్రోవడం అలవాటు చేసేస్కున్నాం అనుకోండి :-)

అమ్మా నాన్నా ఇద్దరికీ రద్దీ అంటే భయం ఉండడంతో పుష్కరాల లాంటి వాటికి ఎప్పుడూ తీస్కెళ్ళేవాళ్ళు కాదు "పుణ్యం మాట దేవుడెరుగు బాబోయ్ ఆ రష్ లో పిల్లలు తట్టుకోలేరు" అనేవారు ఎవరైనా అడిగితే. చిన్నపుడు ఎపుడైనా అమ్మమ్మవాళ్ళింటికి వెళ్ళినపుడు తోటి పిల్లలతో కాలవగట్లకి వెళ్ళినా నీళ్ళలో దూకి కేరింతలాడే పిల్లలని దూరం నుండి చూసే వాడ్నే కానీ నీళ్ళలో దూకే ధైర్యం చేసేవాడ్ని కాదు. మేం మంత్రాలయం వెళ్ళడం అలవాటయ్యాక మాత్రం మొదటి సారి నదీ స్నానాలు అలవాటయ్యాయి. నదిలో దిగడమంటే అమ్మ ఎన్ని జాగ్రత్తలు చేప్పేదో అప్పటికి నేను కాస్త పెద్దవాణ్ణయిపోవడంతో కుదరలేదు కానీ లేదంటే అచ్చు ఈ బొమ్మలో చూపించినట్లే పట్టుకుని నదిలో దించి స్నానం చేయించినంత హైరానా పడిపోయేది.

సీజనల్ గా స్నానానికంటే ముందు ఇంకోటుండేదండోయ్ అంటే అది రెగ్యులర్ కాదు కానీ సీజనల్ గా అప్పుడప్పుడు గుర్తొచ్చి శలవల్లో ఖచ్చితంగా అమ్మ స్ట్రిక్ట్ గా చెప్తుండేదనమాట. ఇంతకీ ఏమిటది అంటారా? యోగాసనాలు వేయించడం. ఇప్పుడంటే రకరకాల గురువులు ప్రచార మాధ్యమాల్లో ఊదర గొట్టేసి యోగాడే అనీ అదనీ ఇదనీ తెగ ప్రాచుర్యంలోకి వచ్చేసింది కానీ ఇరవై ముప్పై ఏళ్ళ క్రితమే అమ్మకి ఎలా తెలిసిందో మరి ఈ యోగా పుస్తకాలు.. ఆసనాల చార్టులు కొనిపించి నాతో హైస్కూల్లో చేరక ముందు నుండే దగ్గరుండి యోగాసనాలు వేయించేది. అప్పట్లో ఓ ఆర్నెల్లో ఏడాదో బుద్దిగా అమ్మ చెప్పినట్లు యోగాసనాలు వేసిన ఫలితమే ఎంత వయసొచ్చినా ఒళ్ళొచ్చినా నాలో ఉన్న ఫ్లెక్సిబిలిటీకి కారణం అని నేను బలంగా నమ్ముతుంటాను. అమ్మ మాకెప్పుడూ చెప్తుండే ఫిలాసఫీ ఒకటే తినాలి పనిచేయాలిరా అప్పుడు ఏ ఆరోగ్య సమస్య రాదూ అని అంటూండేది కానీ నేను ఆ మొదటిది వంట పట్టించుకున్నంతగా రెండో సలహా వంటపట్టించుకోలెదనుకోండి అది వేరే విషయం.    

20 కామెంట్‌లు:

  1. అమ్మతో జ్ఞాపకాలు మీరెప్పుడు రాసినా బాగుంటాయి. బిడ్డ మాటల్లో అమ్మ కదా. అందుకే.

    రిప్లయితొలగించండి
  2. తినాలి.. పని చెయ్యాలి
    Exactly.. మా నానమ్మ కూడా ఎప్పుడూ ఇదే చెబుతుంది.

    చాలా రోజుల తర్వాత ఓ మంచి టపా చదివానన్న ఫీలింగ్ మాష్టారు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మన పెద్దవాళ్ళంతా అదే ఫార్ములా ఫాలో అయ్యేవారనుకుంటా గిరీష్.. థాంక్స్ ఫర్ యువర్ కామెంట్.

      తొలగించండి
  3. అమ్మ కదండీ... ఏమి చెప్పినా కమ్మగానే ఉంటుంది, ఏమి చేసినా అపురూపంగానే ఉంటుంది. అమ్మ గోరుముద్ద రుచి, అమ్మ చీరకొంగు సౌఖ్యం, అమ్మ వొళ్ళో తల పెట్టి పడుకుంటే వచ్చే ధీమా ఎన్ని కోట్లు కుమ్మరించినా దొరకవు. మీ జ్ఞాపకాలలో అమ్మ ఎప్పటికీ చిరంజీవే.... లక్ష్మి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాగా చెప్పారు లక్ష్మి గారు. థాంక్స్ ఫర్ యువర్ కామెంట్.

      తొలగించండి
  4. ఎన్నో మెమొరీస్. బాగా రాసారు. పన్లో పనిగా మా అమ్మ నిరంకుశత్వం (!) గుర్తు వచ్చి నవ్వొచ్చింది. మా అక్కయ్య, అమ్మగారు నన్ను ఎంత ప్రొటక్టివ్ గా పెంచారో తలచుకుని ఆనందించాను ఇదంతా చదివి. థాంక్స్ అండీ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నిరంకుశత్వం రైట్ వర్డ్ సుజాత గారు అప్పట్లో తెలియనితనంతో ఇలాగే అనుకునే వాళ్ళం :-) థాంక్స్ ఫర్ యువర్ కామెంట్.

      తొలగించండి


  5. తినాలి ! పనిచెయ్యవలెను ! తిండిపోతులై
    జనుల్ బతుక రాదు నరుడ ! జాగరూకులై
    త్సునామి యగు జీవితమున తూకమున్న జీ
    వనమ్ము నిలలో నెలకొలుపన్దగున్ సుమా!


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పద్యం బావుంది జిలేబి గారు.. థాంక్స్ ఫర్ యువర్ కామెంట్.

      తొలగించండి
  6. Lovely, as usual..your words are always full of honesty n love..anduke haayigaa chaduvukupotaamanukuntaanu..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. థాంక్స్ ఎ లాట్ మానస గారు.. అమ్మగురించి తలచుకుంటే అలా వచ్చేస్తాయండీ మాటలు..

      తొలగించండి
  7. వేణూజీ..వేటూరివారు చెప్పినట్టు అమ్మంటే మెరిసే మేఘం కురిసే వాన..అమ్మ వెళ్ళినా ఆ మాటలెప్పుడూ మదిలో మెరుస్తూనే ఉంటాయి.. జ్ఞాపకాల జల్లులతో మనసుని తడిచేస్తుంటాయి..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కరెక్ట్ గా చెప్పారు శాంతి గారు. థాంక్స్ ఫర్ యువర్ కామెంట్..

      తొలగించండి
  8. as usual touching....amma lekapote antaa soonyam anedi baagaa anubhavam loki vachindi

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అదెవరికీ అనుభవం కాకూడదని అనుకుంటూ ఉంటాను హిమబిందు గారు కానీ ఏదో సమయంలో ఎవరూ తప్పించుకోలేని బాధ అది. సారీ టు హియర్ దట్. ధైర్యంగా ఉండండి. థాంక్స్ ఫర్ యువర్ కామెంట్.

      తొలగించండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.