శుక్రవారం, డిసెంబర్ 15, 2017

మళ్ళీ రావా...

నూతన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సుమంత్ అండ్ ఆకాంక్ష జంటగా నటించిన కొత్త సినిమా మళ్ళీ రావా. ఈ సినిమా ట్రైలర్ ఇక్కడ చూడండి, పాటలు ఇక్కడ వినండి. ఇవి చూశాక సినిమా గురించి ఒక పాజిటివ్ ఫీల్ వచ్చి ఉంటే కనుక ఈ రివ్యూతో సహా మరే రివ్యూలు చదవకుండా సినిమా చూడండి. ఓ చక్కని ప్రేమకథని ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే తో మనసుకు హత్తుకునేలా చెప్పాడు గౌతమ్. శ్రవణ్ భరద్వాజ్ అందించిన ఆహ్లాదకరమైన సంగీతం, గౌతమ్ రాసుకున్న సంభాషణలు ఈ అందమైన ప్రేమ కథకు చక్కని సపోర్ట్ ఇచ్చాయ్.

ఈ రోజు నుండీ రెండవ వారంలోకి అడుగుపెడుతున్న ఈ సినిమాకి మరికొన్ని థియేటర్స్ ను మల్టిప్లెక్స్ లో అదనపు షోస్ ను కలిపారంటే, ఈ సినిమా ఎంతగా అకట్టుకుంటుందో అంతకన్నా వేరే రుజువులేం కావాలి. కథాపరంగా ఇది అతి సాథారణ ప్రేమ కథ. ఓ సొగసరి అమ్మాయి, ఓ పోకిరి అబ్బాయి, ఒకరినొకరు చూసుకోవడం, ప్రేమించుకోవడం, ఆపై ఎడబాటు చివరికి పెళ్ళి ఏ ప్రేమ కథలోనైనా ఇంతకన్నా ఏముంటుంది చెప్పండి. ఐతే ఇదే కథను ఇప్పటికి కొన్ని వేల సినిమాల్లో చూసినా ఎప్పటికప్పుడు కొత్త దర్శకులు నేపథ్యాన్ని కథనాన్ని మార్చుకుంటూ అందంగా అకట్టుకునేలా మళ్ళీ మళ్ళీ చెబుతూనే ఉన్నారు. అలుపెరగకుండా ప్రేక్షకులు చూస్తూనే ఉన్నారు.

మళ్ళీరావా కథా కథనాలు కూడా అంత కొత్తవేం కావు ’సఖి’ సినిమాలో ’మణిరత్నం’, ’ఎటోవెళ్ళిపోయింది మనసు’ లో ’గౌతమ్ మీనన్’ లాంటి గొప్ప దర్శకులు ప్రయత్నించినవే అయితే ఈ చిత్ర దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కథ రాసుకున్న తీరు దాని చుట్టు అల్లిన అందమైన అతి సహజమైన సన్నివేశాలు, సునిశితమైన హాస్యం ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు దగ్గిర చేస్తుంది.

ఈ కథ ముఖ్యంగా మూడు కాలాల్లో జరుగుతుంది ఒకటి 1999 రెండవది 2012 చివరగా ప్రస్తుతం 2017. ఈ మూడు కాలాల కథను ఒకదానివెంట ఒకటిగా చెప్పకుండా ముఖ్యంగా హై స్కూల్ ఎపిసోడ్స్ ను ఫ్లాష్ బ్యాక్స్ తరహాలో హీరో హీరోయిన్ల జ్ఞాపకాలుగా చెప్పడానికి ప్రయత్నించారు. ఈ ప్రయత్నం మొదటిలో అంటే మనం కథలో లీనమయ్యేంత వరకూ కాస్త గందరగోళంగా అన్పించినా అదే ఒక ప్రత్యేకతగా నిలిచి మనం కథమీద పాత్రల మీద ఏకాగ్రత నిలపడానికి దోహదపడుతుంది. ఇలా ఫ్లాష్బాక్స్ చెప్పడంలో సన్నివేశాలను కనెక్ట్ చేసిన విధానం బావుంది. ఒక్కమాటలో చెప్పాలంటే తెలుగింటి ఆడపడుచు మూడు పాయలతో జడ అల్లుకున్నంత సులువుగా ఈ మూడు కాలాల సన్నివేశాలనూ అల్లుకుంటూ పోయాడు గౌతమ్.

ఈ రోజుల్లో ప్రెమ కథ లేని వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు, అయితే నిజ జీవితంలో అన్ని ప్రేమలూ ఒకేలా ఉండవు పుస్తకాలలో చెప్పే కొటేషన్స్ కి తగినట్లుగా ఉండే ఐడియల్ ప్రేమ కథలు నిజ జీవితంలో ఎక్కడో కానీ తారసపడవు. అయితే అసలైన, స్వచ్చమైన, నిజాయితీ అయిన ప్రేమంటే ఇలా ఉండాలి అని అందరికీ ఒక ఐడియా ఉంటుంది అది నిజజీవితంలో సాధ్యపడినా పడకపోయినా ఇలా ఉంటే బావుంటుంది అనిపిస్తుంది అలాంటి ప్రేమకథే ఈ "మళ్ళీ రావా". ("If you love some one set them free") నువ్వు ఎవరినైనా ప్రేమిస్తే వారికి పూర్తి స్వేచ్చనివ్వు, ఆ బంధాన్ని గుప్పిట బిగించి పట్టుకోవాలని ప్రయత్నించకు. అనే కొటేషన్ ను మనసా వాచా ఆచరించే ప్రేమ కథ "మళ్ళీ రావా".

ఇలాంటి ప్రేమ కథలకు సుమంత్ టైలర్ మేడ్, సత్యం, గోదావరి, ఆల్రెడీ ఈ విషయాన్ని ప్రూవ్ చేశాయ్, ఈ మళ్ళీ రావా లో కూడా అంతే ఈజ్ తో సులువుగా కార్తీక్ పాత్రలోకి ఒదిగిపోయాడు సుమంత్. నూతన నటి ’ఆకాంక్ష సింగ్’ అంజలి గా చూడడానికి అందంగా గ్రేస్ ఫుల్ గా కనిపించడమే కాక చక్కని నటనను ప్రదర్శించింది. ఈ సినిమాకి పెద్ద ఎస్సెట్స్ బాల(కౌమార) నటులు. చిన్నప్పటి కార్తీక్(సాత్విక్), అంజలి(ప్రీతి), డంబో గా చేసిన పిల్లలు ముగ్గురూ చాలా బాగా నటించారు ఆ సన్నివేశాలు అంత సహజంగా రావడంలో వీళ్ళ కృషి ఎంతో ఉంది. వాళ్ళతో పాటు టెంత్ ఫెయిల్ బుజ్జిగాడు గా చేసిన కుర్రాడు నానాజీ కూడా అమాయకమైన విలనిజంతో నవ్వించి గుర్తుండిపోతాడు. సెకండ్ ఎపిసోడ్ లో సాఫ్ట్వేర్ కంపెనీ మేనేజర్ గా చేసిన మిర్చీ కిరణ్ కూడా గుర్తుండిపోయే పాత్ర చేశారు, ఈయన చుట్టూ రాసిన సన్నివేశాలు నవ్వించాయి.   

ఈ సినిమా మొదట చూసినపుడు మొదటి అరగంటలో నేను కాస్త ఇబ్బందిపడింది పద్నాలుగేళ్ళ ప్రాయంలో తొమ్మిదో తరగతి చదువుతూ ప్రేమేంట్రా బాబు ఇపుడు ఈ క్లాస్ పిల్లల్ని కూడా మొదలు పెట్టేయమనా అని. కానీ ఏ మాత్రం అసభ్యతకు తావులేకుండా చాలా కన్విన్సింగ్ గా అతి సహజంగా ఆ సన్నివేశాలను రాసుకున్న తీరు, ఆ ఎపిసోడ్ కు చివర్లో ఇచ్చిన హుందా అయిన కంక్లూజన్ చూశాక ఆ కాస్త ఇబ్బంది కూడా తొలగిపోయింది ఈ దర్శకుడిపై అభిమానం మరింత పెరిగింది. ఇక సినిమా క్లైమాక్స్ నన్ను మరింతగా ఆకట్టుకుంది అతి సహజంగా తీశాడని అనిపించడానికి సినిమా ముగిసాక ఒక మంచి ఫీల్ రావడానికి అది కూడా ఒక ముఖ్య కారణం.
 
ఈ సినిమా గురించి రాసిన కొన్ని విశ్లేషణలలో అంత చదువు చదివి ఉన్నతమైన ఉద్యోగం చేస్తూ కూడా అమ్మ చెప్పిన మాట వినో తండ్రీ చెప్పిన మాట వినో తన నిర్ణయాన్ని మార్చుకోవడమనే విషయమై అంజలి వ్యక్తిత్వం పై మెచ్యూరిటిపై కొన్ని కామెంట్స్ చదివాను. నాకు మాత్రం తను చిన్నతనం నుండీ పెరిగిన పరిస్థితులు చూసిన అనుభావల దృష్ట్యా తన సంధిగ్దత చాలా సహజమే అనిపించింది. దర్శకుడు ఆ విషయాన్ని బాగా కన్వే చేశాడు. అలాగె జీవితానికి సంబంధించిన అతి ముఖ్య నిర్ణయాలలో ఒకోసారి అంతే జరుగుతుంది మనం ఎన్ని ఆలోచించి ప్లాన్ చేసుకున్నా కూడా పాజిటివో నెగటివో ఒక చిన్న పుష్ వల్ల ప్రభావితమై తీసుకునే నిర్ణయాలు తారుమారు అవుతుండడం సహజం. జాగ్రత్తగా గమనిస్తే ఈ విషయం ప్రతి ఒక్కరూ తమ జీవితంలోనో లేదా తన చుట్టూ ఉన్న వారి జీవితాల్లోనో చూసే ఉంటారు.  

సోషల్ నెట్వర్కింగ్ రోజులలో పుట్టి పెరిగిన ఈ కాలం యువత ఈ సినిమాకి ఏమాత్రం కనెక్ట్ అవుతారనేది చెప్పలేను కానీ పాతికేళ్ళ పైబడిన ప్రతి ఒక్కరు తొంభైలలో అంటే సెల్ఫోన్ రాక ముందు కాలాన్ని చూసిన వారందరూ కూడా ఈ సినిమాకు అందులోని ప్రేమ సన్నివేశాలకూ ఎక్కడో అక్కడ కనెక్ట్ అవుతారు. సినిమా అంటే రెండు గంటల్లో బోల్డంత జరిగిపోవాలని ఆశించే వాళ్ళు కాకుండా పేస్ గురించి ఆలోచించకుండా ఆహ్లాదకరమైన ప్రేమకథలను ఆస్వాదించే ప్రతి ఒక్కరూ తప్పక చూడవలసిన సినిమా "మళ్ళీ రావా".


ఈ సినిమాలో నాకు నచ్చిన సంభాషణలను కొన్నిటిని క్రింద పొందుపరుస్తున్నాను. దయచేసి ఈ సినిమా చూడని వాళ్ళు సినిమా చూసేప్పుడు ఫీల్ మిస్ అవ్వకూడదంటే చదవకుండా ఉండటం శ్రేయస్కరం.

"నేను వెళ్ళిపోయినందుకు నామీద కోపం లేదా?"
"నువ్వు నా దగ్గర ఉన్నప్పుడు ఇష్టపడటం.. దూరంగా ఉన్నప్పుడు బాధపడటం దానికి మించి నాకింకేం తెలీదు.."

"చేతకాని ప్రతివాడూ చెప్పే మాటే అది ఎవడో మోసం చేశాడని."

"చచ్చిపోయిన కోడే కదరా ఎక్కడికీ పారిపోదు కాస్త నిదానంగా తిను."

"నేను ప్రేమవల్ల గుర్తున్నానా.. ద్వేషం వల్ల గుర్తున్నానా.. ఆ రెండోమాట తలచుకుంటేనే భయమేస్తుంది."

"గుర్తు పట్టలేదా.. గుర్తు కూడా లేనా.. రెండో మాట తలచుకుంటేనే భయమేస్తుంది."

"మనిషి శరీరంలో ఎన్నిమార్పులొచ్చినా పదమూడేళ్ళ వయసునుండి చివరివరకూ మారనిది కళ్ళొక్కటే.. కార్తీక్ విషయంలో తన కళ్ళే కాదు నాకోసం చూసే చూపు కూడా మారలేదు." 

"ఆ అమ్మాయిని చూస్తున్నప్పుడు ఇష్టం కాదు ప్రేమ కాదు ఆనందం కాదు, ఆ క్షణంలో నాకేమనిపిస్తుందో గుర్తు కూడా ఉండదు."

"పద్నాలుగేళ్ళకి నాకూతురు ఐఐటి ప్రిపేర్ అవుతుందనో, స్పోర్ట్స్ లో కప్పొచ్చిందనో, క్లాస్ లో ఫస్ట్ వచ్చిందనో నలుగురు చెప్పుకుంటే వింటానికి చాలా బాగుంటుంది కాని ఇంకో అబ్బాయితో తిరుగుతుందని తెలిస్తే చాలా అసహ్యంగా ఉంటుంది."

"పద్నాలుగేళ్ళకే నాకు క్రికెట్ అంటే ఇష్టం, మా అమ్మ అంటే ఇష్టం, డంబో అంటే ఇష్టం, అలానే నాకు అంజలి అంటే కూడా ఇష్టం. ఇవన్ని తప్పు కానప్పుడు అంజలిని ఇష్టపడితే తప్పేంటి."

"పెళ్ళి చేస్కోవాల్సింది ఈరోజు వరకూ ఎలా ఉన్నామనే సమాధానంతో కాదు, ముందు ఎలా ఉంటామనే ప్రశ్నతో."

"ఆ పిల్ల నిన్ను పెళ్ళి చేస్కోనన్నప్పుడు ఎందుకు అని ఒక్క మాట కూడా అడగలేదంటే ఒక ఆడపిల్లను ఇంతకంటే ఎక్కువగా ఎవరర్ధం చేస్కోగలరు."

"ఇష్టపడిన పిల్లని ఎలా పెళ్ళిచేస్కోవాలని మగపిల్లాడాలోచిస్తాడు, ఆడపిల్ల మాత్రం పెళ్ళయిన తర్వాత ఎలా అని ఆలోచిస్తుంది."  

"నేనడిగితే సిగరెట్ మానేస్తావా!.."
"అడిగి చూడు.."
"ఊహూ.. అడగను.. నాకామాట చాలు.."

"నువ్వు తప్ప నాకు వేరె ప్రపంచమే తెలీదు అంజలి.. నువ్వున్నప్పుడు గడిపిన క్షణాలు... నువ్వు లేనప్పుడు మిగిలిన జ్ఞాపకాలు..."

4 కామెంట్‌లు:

  1. చాలా బాగా వ్రాసారు. సినిమా ఎంత బాగుందో మీ వ్యాఖ్యానం అంత బాగుంది.

    రిప్లయితొలగించండి
  2. >>>తెలుగింటి ఆడపడుచు మూడు పాయలతో జడ అల్లుకున్నంత సులువుగా ఈ మూడు కాలాల సన్నివేశాలనూ అల్లుకుంటూ పోయాడు<<<

    Beautiful.

    రిప్లయితొలగించండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.