మంగళవారం, జూన్ 13, 2017

అమీ తుమీ..

సినిమా ఇండస్ట్రీ అంతా స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యే సక్సెస్ ఫార్ములా వెనక పరుగెట్టడమనే జాడ్యానికి దూరంగా ఉండే అతి కొద్దిమంది దర్శకులలో ఇంద్రగంటి మోహనకృష్ణ ఒకరు. అందుకే ఆయన తీసిన సినిమాలన్నీ వేటికవే వేరు వేరు జెనర్స్ లో ఉంటాయి. సినిమాని ఎలా సక్సెస్ చేయాలా అనే ఆలోచనతో కాక ఒక మంచి కథను ఎలా చెప్పాలా అని ఆలోచించే వ్యక్తి తను. తెలుగు సాహిత్యం తన వారసత్వం దానికి తోడు చిన్నప్పటి నుండీ తను చదివిన సాహిత్యం అతనిని ఒక విశిష్టమైన దర్శకునిగా నిలబెట్టింది. భాష మీద పదాల మీద తనకున్న పట్టు ఈ సినిమా మాటల్లో అలవోకగా చిలకరించిన హాస్యాన్ని చూస్తే తెలుస్తుంది. 

ఇంతకీ నేను దేని గురించి చెప్తున్నానో చెప్పనే లేదు కదూ ఇంద్రగంటి మోహనకృష్ణ గారి దర్శకత్వంలో మొన్ననే రిలీజ్ అయిన "అమీ తుమీ" సినిమా గురించండీ. అవడానికి అవసరాల శ్రీనివాస్, అడివి శేషు హీరోలైనా ఈ సినిమా అయ్యాక గుర్తుండేది మాత్రం శ్రీచిలిపి గా చేసిన వెన్నెల కిషోర్ మాత్రమే. తను మాటలు తక్కువ ఎక్సెప్రెషన్స్ ఎక్కువ ఉపయోగించి పండించిన హాస్యం చాలా కాలం గుర్తుంటుంది. తన డైలాగులు, మానరిజమ్స్, అక్కడక్కడా వాడే ఇంగ్లీష్ లైన్స్ అన్నీ కడుపుబ్బా నవ్విస్తాయ్. అలాగే ఈషా, అదితీ హీరోయిన్లైనా గుర్తుండి పోయేది మాత్రం కుమారి పాత్ర పోషించిన శ్యామల గారే. అసలు సినిమాకి వీళ్ళిద్దరే హీరో హీరోయిన్లన్నంతగా వారి నటనతో మెప్పించేస్తారు. 

అలా అని అసలు హీరో హీరోయిన్లని ఏమాత్రం తక్కువ చేయలేం. ఖతర్నాక్ పోరిగా ఈషా, నన్ అయితే పానీపూరీ, హృతిక్ రోషన్, ఇనార్బిట్ మాల్ లో షాపింగ్ లు వదిలేయాలా అని అమాయకంగా అడిగే పాత్రలో అదితి కూడా బాగానే మెప్పించారు. అలాగే ఎలాంటి పాత్రలో ఐనా ఇట్టే ఇమిడి పోగల అవసరాల అల్లుకుపోతే సీరియస్ పాత్రలే తప్ప సీరియస్ కామెడీ ఇంతవరకూ ప్రయత్నించని అడివి శేష్ కూడా తన టైమింగ్ తో మెప్పించాడు. 

ఇక మా తనికెళ్ళ భరణి గారి గురించి కొత్తగా చెప్పేదేముంది చెప్పండి అదరగొట్టేశారు అలాగే వెన్నెలకిషోర్ కి అసిస్టెంట్ కాశి గా చేసిన నటుడు కూడా ఆకట్టుకుంటాడు. తనికెళ్ళ భరణి గారి తెలంగాణా యాస అలవాటు కనుక బాగున్నా అవసరాల, ఈషా ల తెలంగాణా యాస మాత్రం కాస్త అలవాటయ్యే దాకా అబ్బా అవసరమా ఈ గోస అనుకునేలా కాస్త తలనొప్పి తెప్పిస్తుంది అదీ ఓ పావుగంట మాత్రమే ఆ తర్వాత సినిమాలో లీనమై వాళ్ళ యాస అలవాటైపోయి ఇక అంతగా పట్టించుకోం. 

మణిశర్మ గారు ఇచ్చిన రెండు పాటలూ చాలా బాగున్నాయ్ "అయ్ బాబోయ్" మెలోడీతో ఆకట్టుకుంటే "తకథిమి తాన" పాట ఫుట్ టాపింగ్.. మనతో స్టెప్పులు వేయించేస్తుంది. చివర్లో సినిమా అయ్యాక ఈ పాట వస్తుంటే లేచి వచ్చేస్తూ తనికెళ్ళ గారు ఈ పాటకి వేసిన స్టెప్పులు వేయకుండా కంట్రోల్ చేస్కోడం చాలా కష్టమైందంటే నమ్మండి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో మా మణిశర్మ గారిని కొట్టేవారు లేరు అది బాగుందని మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాలా చెప్పండి..

సినిమాలో మిగిలిన టెక్నికాలిటీస్ అన్నీ కూడా వంకపెట్టలేనివిగా ఉన్నాయి. నిజం చెప్పాలంటే ఇంద్రగంటి గారి వరుస పంచ్ లను వేటినీ మిస్ అవ్వకుండా ఫాలో అవుతూ ఆనందించడంలో మిగిలినవేవీ పట్టించుకోం. నిజమండీ బాబు కొన్నిసార్లు ఒక జోక్ కి నవ్వుకునే లోపు మరి రెండు మిస్ అయ్యాయేమో అని అనిపించిందంటే అతిశయోక్తి కాదు మళ్ళీ ఓ సారి చూస్తే కానీ అన్నీ ఫాలో అయినదీ లేనిదీ నిర్ధారించుకోలేను. 

ఇంత చెప్పి కథేంటో చెప్పవేమయ్యా అంటారా... కథేం లేదండీ.. అప్పుడెపుడో ఎస్వీకృష్ణారెడ్డి గారు తీసిన వినోదం సినిమాలో ప్రకాష్ రాజ్ పెళ్ళి ఎపిసోడ్ ని రెండు గంటల సినిమాగా మారిస్తే అదే అమీతుమీ కానీ దీనికి ఇంద్రగంటి మోహన కృష్ణ గారు తన రచనతో ఇచ్చిన ట్రీట్మెంట్ మనల్ని కడుపుబ్బ నవ్విస్తుంది. ఇంద్రగంటి మోహన కృష్ణ గారి సినిమాలు ఇష్టపడేవారు మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమా. ఊహూ.. ఆయన అభిమానులే కాదండీ మనసారా హాయిగా నవ్వుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన సినిమా 'అమీ తుమీ' మిస్ అవ్వకండి. క్రింద ఎంబెడ్ చేసిన ట్రైలర్ ఇక్కడ చూడవచ్చు. ఈ సినిమా గురించి మిత్రులు "నెమలికన్ను మురళి" గారి మాటల్లో ఇక్కడ చదవవచ్చు. ఈ సినిమా గురించి నేనభిమానించే సమీక్షకులు సికందర్ గారి రివ్యూ ఇక్కడ చదవచ్చు. 


7 కామెంట్‌లు:

  1. మీ రివ్యూ చాలా బావుంది వేణూజీ..బట్ ఇంద్రగంటి మోహన కృష్ణ గారు వరల్డ్ మూవీ ని చదివినట్టుగా తెలుగు సాహిత్యాన్ని చదివారా అన్నది అనుమానమే..ఆయనకి తెలుగు భాష మీద అద్భుతమైన పట్టు ఉన్నదన్న మాటతో యేకీభవించలేమండీ..ఆయన ఇంటర్వ్యూస్ లో తెలుగు తీయగా ఉంటుంది గానీ చాలా పదాలు ప్రొనౌన్స్ చేయడానికే కష్ట పడుతుంటారు..బట్ నో డౌట్..హీ ఈజ్ డెఫ్నెట్లీ వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్స్..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఏమో శాంతిగారు.. ఇంటర్వ్యూల్లో తడబడడానికి బహుశా వేరే కారణాలున్నాయేమో కానీ ఆయన రాతలు చూస్తే మాత్రం నాకు కలిగిన అభిప్రాయమది. థాంక్స్ ఫర్ ద కామెంట్.

      తొలగించండి
  2. నాక్కుడా 'వినోదం' గుర్తొస్తూనే ఉందండీ, జనార్దన్ ఇంట్లో శ్రీ చిలిపి ఎంటర్ అయినప్పటినుంచీ.. నిజానికి వెన్నెల కిషోర్-శ్యామల దేవి లని హీరో-హీరోయిన్ అనాలేమో ఈ సినిమాకి.. మీ మార్కు టపా, ఎప్పటిలాగే..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అవునండీ వాళ్ళిద్దరిదే సినిమా అంతా.. థాంక్స్ ఫర్ ద కామెంట్ మురళి గారు :-)

      తొలగించండి
  3. చాలా బాగా వర్ణించారు సినిమా ని..వేణు శ్రీకాంత్ గారు..ఆద్యంతం నవ్వులు పూయించిన ఈ చిత్రాన్ని ఎన్ని సార్లైనా చూడాలనిపిస్తుంది.వెన్నెల కిషోర్ పాత్ర మీరన్నట్లుగానే హీరో లానే అనిపించింది.శ్రీ చిలిపి పాత్రని మర్చిపోవడం అంత తేలిక కాదు.సునాయాసంగా తన నటనతో అందరి హృదయాల్లో నిలిచిపోయారు.

    రిప్లయితొలగించండి
  4. నెట్ లో తవ్వుతుంటే బంగారం లాంటి మీ బ్లాగ్ దొరికింది... inspired...

    - మాధవ్

    రిప్లయితొలగించండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.