ఆదివారం, జనవరి 22, 2017

అమ్మ...


ఇంటికి పెద్ద నాన్నే అయినా అమ్మ ప్రేమ ముందు మాత్రం ఆయనతో సహా అందరం చిన్నవాళ్ళమైపోతాము కదా. ఎపుడైనా ఏ చిన్న అనారోగ్యం కానీ అసౌకర్యం కానీ కలిగితే అమ్మ తీసుకునే అన్ని జాగ్రత్తలు ఇంకెవరూ తీస్కోలేరు. అసలు అమ్మ అవగానే అమ్మాయిలకు ఆటోమాటిక్ గా ఒక ప్రత్యేకమైన ఆలోచనా విధానం అలవాటైపోతుందేమో.

మిగిలిన వాళ్ళందరూ తీస్కునే జాగ్రత్తలు ఒక ఎత్తైతే మన అమ్మ చేసే పనులు మాత్రం ప్రత్యేకం. బహుశా మన చిన్నతనం నుండీ మనని నిరంతరం దగ్గిరగా గమనిస్తూ నిత్యం మన సంతోషం గురించే ఆలోచించడం వలన అమ్మ అలా అన్నీ మనకి మాక్సిమమ్ సౌకర్యాన్ని ఇచ్చే విధంగా ఏర్పాటు చేయగలుగుతుందేమో.

నా చిన్నతనంలో స్కూల్లో ఎపుడైనా పొద్దున్న ఫస్ట్ ఇంటర్వెల్ లోనే గ్రౌండ్ లో పడిపోవడమో ఇంకేదో జరిగి దెబ్బతగిలించు కుంటే స్కూల్లో టీచర్స్ ఫస్ట్ ఎయిడ్ లాంటివి చేసి ఎన్ని జాగ్రత్తలు తీస్కున్నా సాయంత్రం ఇంటికి వెళ్ళగానే మళ్ళీ అమ్మ ఫ్రెష్ గా చేసే ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది. అసలు అమ్మ ఇచ్చే భరోసా ఇంకెవరూ ఇవ్వగలిగే వారు కారు. ఒక్క నాకే ఏంటిలెండి అమ్మలందరూ వాళ్ళ పిల్లలని అలానే చూసుకుంటారేమో కదా.

మా అమ్మ అయితే నన్నే కాదు మా ఇంట్లో అందర్నీ ఇలాగే చూస్కునేది. నాన్నారు కానీ మాలో ఎవరైనా కానీ ఒకోసారి బయటకి వెళ్ళినపుడు చెప్పిన టైమ్ కి ఇంటికి రాలేక కాస్త ఆలశ్యమైతే తన హడావిడి మాటల్లో చెప్పనలవి కాదు. ఇప్పుడంటే సెల్ఫోన్స్ ఉండడంతో అమ్మలకి ఈ బాధ తప్పింది కానీ లాండ్ ఫోన్లే కరువైన నా చిన్నతనంలో ఈ తిప్పలు మాములుగా ఉండేవి కావు. అందుకనే ఏ స్నేహితుడి ఇంట్లోనో కాస్త ఎక్కువ సేపు ఉండమంటే ఇంటిదగ్గర అమ్మ ఎదురు చూస్తుంటుందని వెంటనే బయల్దేరిపోవడం అలవాటు చేసేసుకున్నాం మేం.

నేను విజయవాడ హాస్టల్లో ఉంటూ ఇంటర్మీడియట్ చదువుకుంటున్నపుడు తరచుగా కడుపునొప్పి బాగా ఇబ్బంది పెడుతుండేది ఒకానొక సమయంలో హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరమొచ్చింది. అది ఎంత మంచి హాస్పటల్ అయినా ఎన్ని సౌకర్యాలున్నా చుట్టూ ఎంతమంది ఉన్నా అమ్మ వచ్చి మొత్తం మార్చేసిన విధానం అనితరసాధ్యం. తను వచ్చిన క్షణం నుండీ హాస్పటల్ లో ఉన్నా కూడా ఇంట్లో ఉన్నంత సౌకర్యంగా అనిపించేలా చేయడం ఒక్క అమ్మకే సాధ్యం.

ఆ హాస్పటల్ లో ఉన్నపుడు అక్కడ డాక్టర్ కి నేను హాస్టల్ లైఫ్ తప్పించుకోడానికి అబద్దం చెప్తున్నా అని అనుమానం వచ్చి పొట్ట ఓపెన్ చేసి చూద్దామమ్మా అసలు ఎందుకొస్తుందో లోపల ఏముందో అని నాతో అంటే అమ్మ ఆయనతో పోట్లాడిన వైనం నాకు ఇప్పటికీ గుర్తే. ఆ మరుక్షణమే తను నన్ను ఇంటికి తీస్కొచ్చి హోమియోపతి మందులతో తన ప్రేమతో రెండు వారాలలో మామూలు మనిషిని చేసేసింది.

ఇక అపుడపుడు మనకి వచ్చే చిన్న చిన్న అస్వస్థతలకి అమ్మ చేతి చిట్కా వైద్యం ఎంత బాగా పనిచేసేదో. ఇంటినుండి ఎంత దూరమెళ్ళినా ఎక్కడున్నా ఇలాంటి చిన్న చిన్న చిట్కాలకోసం అమ్మకి వెంటనే కాల్ చేయాల్సిందే. ఎంత పెద్దైనా ఎంత ఖరీదైన హాస్పటల్స్ లో వైద్యం అందుకున్నా అమ్మ తోడు, అమ్మ మాట ఇచ్చే భరోసా మరెవ్వరూ ఇవ్వలేరు అనేది మాత్రం సత్యం.

6 కామెంట్‌లు:

  1. నిజమేనండీ..మనం యెంత పెద్ద వాళ్ళమైనా మన కోసం ఖంగారు పడేదీ, అనుక్షణం తాపత్రయపడేదీ, తపన పడేదీ అమ్మే..ఈవెన్ ఐ మిస్ మై మదర్ వెరీ మచ్చ్..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అవును శాంతి గారు.. అమ్మలు ఎక్కడున్నా తన పిల్లల గురించే ఆలోచిస్తుంటారండీ... థాంక్స్ ఫర్ ద కామెంట్.

      తొలగించండి
  2. అమ్మ కనిపించే దేవుడు/దేవత. అమ్మ నిలువెత్తు ప్రేమ స్వరూపం. అమ్మ ఏమి ఆశించకుండా పిల్లలకి సర్వం ధారపోసేది. అమ్మ అన్ని ప్రాణులకి ప్రాణం నిలిపి జీవం పోసేది. అమ్మ గురించి ఎంత చెప్పిన తక్కువే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చాలా బాగా చెప్పారు అన్యగామి గారు.. థాంక్స్ ఫర్ యువర్ కామెంట్..

      తొలగించండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.