గురువారం, అక్టోబర్ 21, 2010

మహేష్ ఖలేజా


పై సీన్ చూశారు కదా? అందులో "మరీ ఇంత over expectation తట్టుకోలేకపోతున్నాను భయ్యా" అంటూ మహేష్ చెప్పిన డైలాగ్ ఈ సినిమా ఏవరేజ్ టాక్ దగ్గర సెటిల్ అవడానికి కారణం చెప్పకనే చెప్పినట్లయింది. మూడేళ్ళ సమయం, నలభై కోట్లు, భారీ తారాగణం, గంభీరమైన టైటిల్ సరిపోవన్నట్లు ఏకంగా క్లైమాక్స్ సీన్ తో కూడిన టీజర్, స్పష్టత కొరవడిన మహేష్ ట్వీట్లు వెరసి ఈ సినిమా అంచనాలను ఆకాశానికెత్తేసి బాగున్న సినిమాను కూడా ఏవరేజ్ దగ్గర సెటిల్ అయ్యేలా చేసింది. హీరో, దర్శకుడు, నిర్మాత ముగ్గురూ కూడా సినిమా పై సరైన అంచనాలను ప్రేక్షకులకు చేరవేయడంలో విఫలమయ్యారు. వాళ్ళు రిలీజ్ చేసిన టీజర్ కాకుండా ఇక్కడ ఇచ్చిన రెండు ట్రైలర్స్ రిలీజ్ చేసుంటే మహేష్ చేసే కామెడీకి సిద్దపడి జనం సినిమాచూసేవారు. మరి వచ్చే ఓపెనింగ్ కలక్షన్స్ కూడా రావని భయపడ్డారో లేదా సర్‍ప్రైజ్ వర్క్ అవుతుందనుకున్నారో కానీ మొత్తానికి సినిమా చతికిల పడింది.


సరే ఇక విషయానికి వస్తే నాకు ఈ సినిమా నచ్చింది, పాటలను క్లైమాక్స్ ను ఫార్వార్డ్ చేస్తూ రెండో సారి చూడటానికి కూడా రెడీ. ఒక గొప్ప కళాఖండం కాకపోవచ్చు, రికార్డ్ బ్రేకర్ కాకపోవచ్చు కానీ ఒక పూర్తి ఎంటర్ టైనర్. మూస జోలికి వెళ్ళకుండా వైవిధ్యతతో చేసిన ఓ మంచి ప్రయత్నం. సునీల్ తో ఫస్ట్ సీన్ నుండి చివరి వరకూ మహేష్ క్యారెక్టరైజేషన్ ఎక్కడా తొణక్కుండా మిమ్మల్ని ఎంటర్ టైన్ చేస్తుంది. తీసిన ప్రతి సినిమా ఒక అతడు మరో పోకిరి కావాలని అనుకోవడం అత్యాశే అవుతుంది. ఏ సినిమా ప్రత్యేకత దానిదే. నిజానికి త్రివిక్రమ్ అతడు అనౌన్స్ చేసినపుడే నేనిలాంటి డైలాగ్ బేస్డ్ లైటర్ వీన్ సినిమా కోసం ఎదురు చూశాను. నేను గమనించినంతవరకూ త్రివిక్రమ్ కథల్లో హీరో సామాన్యమైన మనిషిలా ఉంటాడు అందుకే ఆ కథలను బేస్ చేసుకుని తీసే సినిమాలు(విజయభాస్కర్ సిన్మాలు కూడా కలిపి ఆలోచించండి) ఒక మంచి కథ చెప్తుంటే వింటున్నట్లు అనిపిస్తాయి. అలానే ఖలేజాలోకూడా మహేష్ కనిపించడు, ఒక సాథారణమైన ట్యాక్సీ డ్రైవర్ మాత్రమే కనిపిస్తాడు. అతనెంత సహజంగా ఉంటాడంటే ఊరంతా గొప్పగా చూసే రావురమేష్ ని సైతం ’వాడు/ఒరే’ అనడానికి ఏమాత్రం సంకోచించడు.

కథలోని మూలాంశం దైవం మానుషరూపేణా పూర్తి కొత్తది కాకపోయినా (కథ వినగానే నాకు ఒకప్పటి దేవానంద్ హిట్ సినిమా గైడ్ గుర్తొచ్చింది) కథనం కొత్తగా ప్రయత్నించాడు, థియేటర్ లో కూర్చుని సిన్సియర్ గా ఫాలో అయ్యేవారికి కథనం కూడా ఏమంత నిరుత్సాహ పరచదు. మొదట్లో కొన్ని సీన్లను చివర్లో వివరించి కథకు కనెక్ట్ చేసిన తీరు బాగుంది కానీ రివ్యూలలో సగటు ప్రేక్షకులు చివరి అరగంట వరకూ కథ అర్దం కాక కన్ఫ్యూజన్ ని కలగచేసిందన్నారు మరి నాకలా అన్పించలేదు. ఈ చిత్రాన్ని మొదటి సారి చూసేప్పుడు సగం అర్ధమయ్యీ కాని డైలాగులతో యధేచ్చగా చేసిన కట్స్ తో నిండి ఉన్న పైరసీ ప్రింట్లు చూడకండి. కుదిరితే థియేటర్ లో చూడండి లేదంటే డివిడి వచ్చే వరకూ ఆగండి. ఇక రివ్యూలలో నేను చూసిన మరో నెగటివ్ పాయింట్ విలన్ తో కేవలం క్లైమాక్స్ లో మాత్రమే ఎదురు పడటం. పరిశీలిస్తే త్రివిక్రమ్ సినిమాలన్నిటిలోనూ ఇదే ట్రెండ్ మీరు గమనించవచ్చు అతడు, జల్సా లలో సైతం సినిమా అంతా హీరో విలన్ లమధ్య పరోక్ష యుద్దమే కానీ ప్రత్యక్ష యుద్దం ఉండదు. పదినిముషాలకోసారి ఎదురు పడి ప్యాంటులు చిరిగేలా తొడలు చరుచుకుని పేజీలకు పేజీలు డైలాగులు చెప్పడం త్రివిక్రం హీరోలు చేయతగిన పని కాదు. ఆ మూస కొట్టుడు సినిమాలు తీసే వాళ్ళు వేరే చాలామందున్నారు.


ఇక ఈ సినిమాలో బూతులుగా చెప్పబడే పదాలు ఏమిటో పై ట్రైలర్ లో వినవచ్చు. మీరు మరీ ఎలీట్ క్రౌడ్ లో తిరుగుతుంటేనో లేదా ఏకాంతంగా గడుపుతుంటేనో తప్ప సామాన్యులు తిరిగే రోడ్దుమీదకో మార్కెట్టుకో వెళ్తే ఒక అరగంటలో ఈ మూడు పదాలు వినకుండా తిరిగి ఇంటికి రావడం అసాధ్యం. ఇక ఒక సారి కాలేజ్ స్టూడెంట్స్ ని కదిపిచూడండి ఇవి బూతులేంటి బాబు అని అంటారు. చదువబ్బని ఒక సాథారణమైన ట్యాక్సీ డ్రైవర్ నిజానికి అంతకన్నా ఘోరంగా మాట్లాడతాడు అలాంటిది మహేష్ భాష అలా ఉండటం తప్పేమీ కాదని నాకనిపించింది. ఇంతకన్నా ఘోరమైన పదాలు ఇప్పటికే చాలా తెలుగు సినిమాలలో వచ్చాయి. అంతెందుకు ఇంత తరచుగా కాకపోయినా ఫ్యామిలి ఎంటర్ టైనర్ గా చెప్పబడుతున్న బృందావనం లో సైతం ఈమాటలు ఉన్నాయి.

సరే బయట ఎలాగూ తప్పడంలేదు ఈ తద్దినాన్ని సినిమాకి తీసుకు వెళ్ళిమరీ మా పిల్లలకి అలవాటు చేయడం ఎందుకు నాయనా అంటారా అది మీ ఇష్టం. కానీ ఓ వారాంతం తీరుబడిగా ఉన్నపుడు సరదాగా ఎంజాయ్ చేయదగినది ఈ ఖలేజా సిన్మా. సినిమా తీయడానికి పట్టిన సమయం, బడ్జెట్, స్టార్ కాస్ట్ ఇత్యాది విషయాలు పక్కన పెట్టి త్రివిక్రమ్ చెప్పిన ఒకానొక కథ వినడానికి సిధ్దమై వెళ్ళండి. వైవిధ్యమైన డైలాగ్ డెలివరీ తో మహేష్ సైతం మిమ్మల్ని ఆకట్టుకుంటాడు. కామెడీ కోసం, మహేష్ కోసం, విజువల్స్ కోసం ఒక్కసారైనా చూడదగిన సినిమా ఖలేజా.

ఈ సినిమా పై నిస్పాక్షికంగా రెంటాల జయదేవ గారు రాసిన సమీక్ష ఇక్కడ మొదటిభాగం మరియూ రెండవభాగం.

ఈ సినిమాలో మిమ్మల్ని అలరించే త్రివిక్రమ్ డైలాగులు ఇక్కడ నెలబాలుని బ్లాగ్ లో చూడచ్చు.

ఈ సినిమా గురించిన మరో రివ్యూ రేరాజ్ గారిది ఇప్పటివరకు చదవకపోతే ఇక్కడ చూడండి.

అలానే ఈ సినిమాలోని మరికొన్ని కామెడీ సన్నివేశాలను ఇక్కడ చూడవచ్చు.

32 కామెంట్‌లు:

  1. Excellent analysis !

    Not just publicity .. Releasing Timing also killed the movie.

    రిప్లయితొలగించండి
  2. అసలికి ఈ సినేమాని నేట్లో బాగా లేదు అని ప్రచారం చేసింది గ్రేట్ ఆంధ్రా.కాం వాడు. ఆ సైట్ వాడు ఎంత సేపటికి తనకు నచ్చిందే ఇతరులకు నచ్చాలి అనేవిధంగా రాశాడు. ఆయనని ఆయన తెగ ఓవర్ ఎస్టిమేషన్ వేసుకొన్నాడు. ఆ తరువాత నవతరంగం రివ్యు అక్కడ నేను రాసిన నా కామేంట్లకు ఒక్కడు ఖండించలేదు. నేట్ లో రివ్యు రాసినవారు ఈ సినేమాని ఎదో ఒక పనికిమాలిన సినేమాలా రాశారు. అది చదివితె రావణ్ సినేమా మనకు గుర్తుకు వచ్చేవిధం (యక్స్పేక్టేషన్ విషయంలో) గా రాశారు. ఒక్క రేంటాల జయదేవ్ గారు ఈ సినేమా గురించి బాగ రాసింది. మిగతావి ఎదో వారు ఊహించిన విధం గా సినేమా లేదని అభిమానులను దృష్టిలో ఉంచుకొని రివ్యులు రాశారి. ఇది బాక్స్ ఆఫీస్ బద్దలు కొడుతుందనుకొంటె ఆ విధంగా కొట్టేసినేమాకాదు కనుక ఈ సినేమా ఎమీ బాగా లేదు అని.

    రిప్లయితొలగించండి
  3. నేను సినిమా చూసాను. అదేమీ అంత చెత్తగా లేదు. కథ బాగున్నా అది అర్థం కాని విధంగా ఉంది. కథ అర్థం కానంతమాత్రాన చెత్త అనుకోలేము. ఒకవేళ చెత్త కావాలనుకుంటే కంటి చూపుతో చంపేస్తా లాంటి డైలాగులు ఉన్న ఫాక్షన్ సినిమాలు చూడొచ్చు.

    రిప్లయితొలగించండి
  4. వేణు,

    అధ్బుతమైన రివ్యూ. నేను వ్రాద్దామనుకున్న పాయింట్లన్నీ వ్రాసేశారు.

    అజ్ఞాత,
    గ్రేట్ ఆంధ్రా వాడు వ్రాసే పిచ్చి పిచ్చి రూమర్లలో ఒకటి చదివి మహేష్ వాడ్ని తిట్టుకుంటూ ట్వీట్ ఒకటి ఇచ్చాడు గతంలో, దాంతో వాడికి మహేష్ అంటే గంగ వెర్రులు.

    రిప్లయితొలగించండి
  5. a2zdreams గారు నెనర్లు, నిజమేనండి రిలీజ్ టైమింగ్ కూడా చాలానే దెబ్బకొట్టింది.

    అజ్ఞాత గారు నెనర్లు, గ్రేట్ ఆంధ్ర వాడు ఏదో హిడెన్ ఎజెండా తో కావాలనే అలా ప్రచారం చేశాడండీ. బహుశా కిరణ్ గారు చెప్పిన కారణం కూడా ఒకటై ఉండచ్చు. నవతరంగం లో మీకు సపోర్ట్ దొరకనందుకు నా సానుభూతి, బహుశా మీరు ఈ సైట్ కు కొత్త ఐఉంటారు అందుకే అసలు సమీక్షకు కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని చెప్పడానికి ప్రయత్నించారు. సమీక్షలకు వాళ్ళు ప్రాథాన్యం ఇవ్వరనీ చదివి ఊరుకోవడమే తప్ప పట్టించుకోవడం అనవసరమనీ వాటి గురించి ఎవరేం మాట్లాడినా అరణ్యఘోషేనని దాని నిర్వాహకులే స్పష్టం చేశారు.

    ఇక సూర్యప్రకాశ్ గారికి సమీక్షకు పేరు పెట్టడం పై ఉన్న శ్రద్ద సినిమా చూడటంపై కానీ సమీక్షపైకానీ ఉండవు. అదేమని వారి సమీక్షని విమర్శిస్తే మీరే ఓ సమీక్షరాసుకోండి అని అంటారు, వారిని మాత్రం సినిమాని విమర్శించే బదులు మీరే ఒక సినిమా తీయచ్చు కదా అని ఎవరూ అడగ కూడదు. నవతరంగం వెంకట్ గారు ఏక్టివ్ గా ఉన్నపుడు కాస్త బాగుండేది ఇపుడేదో అమావాస్యకో పున్నమికో ఒక మంచి వ్యాసం కనపడుతుంది అంతే.

    ప్రవీణ్ శర్మ గారు నెనర్లు, నిజమేనండి కథను విభిన్నమైన శైలి లో చెప్పడానికి ప్రయత్నించడం కొంత మంది ప్రేక్షకులను అయోమయానికి గురి చేసింది. సినిమా అయ్యాక సన్నివేశాలను కనెక్ట్ చేసుకుంటూ మరోసారి ఆలోచింప చేసే కథ కథనం ఇది.

    oremuna (కిరణ్) గారు నెనర్లు :-) ఈ సినిమా గురించి చాలా మందిమి ఒకే విథంగా ఆలోచిస్తున్నామని తెలుసుకోవడం సంతోషంగా ఉంది.

    ’చెప్పు దెబ్బలు-పూలదండలు’ గారు నెనర్లు, మీ రివ్యూ చదివాను కరెక్ట్ గా రాశారు.

    రిప్లయితొలగించండి
  6. అయితే, ఫర్లేదంటారా..? చూడచ్చనమాట..

    రిప్లయితొలగించండి
  7. ఈ మధ్యే చూశాము. నిజమే మరీ ఒవర్ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళితే బాగనే ఉంటుంది.

    ఒక్కొక్క సన్నివేశం చూస్తుంటే ఎంత బాగా తీశాడొ కదా అనిపిస్తుంది కానీ, అన్నిటినీ ఒకచోట కూర్చితేనే అసలు సమస్య ఈ సినిమాలో.

    >>>సరే ఇక విషయానికి వస్తే నాకు ఈ సినిమా నచ్చింది, పాటలను క్లైమాక్స్ ను ఫార్వార్డ్ చేస్తూ రెండో సారి చూడటానికి కూడా రెడీ.

    నాకూ అదే అనిపించింది

    రిప్లయితొలగించండి
  8. ఘటనల యొక్క సీక్వెన్స్ అటుదిటుగా చూపించడం కథలోని ప్రధాన లోపం. నాకు మాత్రం కథ నచ్చింది.

    రిప్లయితొలగించండి
  9. Nice Review వేణు గారు...నేను ఈ మూవీ చూసా.....ప్లస్సులు..మైనస్సులు...బాగా పసిగట్టి వ్రాసేసారుగా!! కామెడీ మాత్రం అదుర్స్ అండీ...కనీసం దానికోసమైనా ఇంకోసారి చూడోచ్చు..కానీ మీరు చెప్పినట్టుగా Action film అనే ఫీల్ తీసుకురాకుండా మహేష్ చేసిన మంచి Comedy Movie అని ప్రచారం చేసుంటే బాగుండేది...

    రిప్లయితొలగించండి
  10. ఈ వీకెండ్ వెళ్తున్నా, త్రివిక్రమ్ ని నమ్మి!

    రిప్లయితొలగించండి
  11. సినిమా చూడొచ్చు. ఫర్వా లేదు. కథలోని ఘటనలు చూపించిన సీక్వెన్స్ గజిబిజిగా ఉన్నంతమాత్రాన కథే బాగాలేదనడం సరి కాదు. ఆ సినిమా నేను రెండు సార్లు చూసాను. మా పట్టణంలో మూడు థియేటర్లలో విడుదల అయ్యింది. ఒక థియేటర్ లో విజయవంతమయ్యింది. కథలో ఇరిడియం, వ్యాపారం లాంటి సబ్జెక్ట్స్ కి వచ్చినప్పుడు మనం చదువుకున్నవాళ్లం కాబట్టి అర్థం అవుతుంది. సాధారణ పల్లెటూరివాళ్లకి అర్థం కాకపోవచ్చు.

    రిప్లయితొలగించండి
  12. బాగా చెప్పారు..
    సరదాగా త్రివిక్రమ్ కోసం చూడొచ్చు మరొకసారి
    పంచ్ లు బావున్నాయి ఎప్పటిలాగానే

    రిప్లయితొలగించండి
  13. మేధ గారు నెనర్లు, అవునండీ నిర్భయంగా చూడచ్చు. చదివిన రివ్యూలు ఖర్చూ ఇతరత్రా గురించి మీరు విన్న వార్తలు అన్ని మరచిపోయి క్లీన్ స్లేట్ తో వెళ్ళండి. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ఇప్పుడు వచ్చే చాలా సినిమాలకన్నా నయమే అనిపిస్తుంది. కొన్ని ప్రత్యేకతలతో శ్రద్దగా తీసిన తీరు ఆకట్టుకుంటుంది.

    సృజన గారు నెనర్లు >>"ఒక్కొక్క సన్నివేశం చూస్తుంటే ఎంత బాగా తీశాడొ కదా అనిపిస్తుంది కానీ, అన్నిటినీ ఒకచోట కూర్చితేనే అసలు సమస్య ఈ సినిమాలో."<< భలే చెప్పారండీ :-) కాని ఆ సమస్య కూడా అంత పెద్దదేం అనిపించలేదు ఒవర్ ఆల్ గా ఎంజాయ్ చేయచ్చు.

    ప్రవీణ్ గారు నెనర్లు, >>ఘటనల యొక్క సీక్వెన్స్ అటుదిటుగా చూపించడం కథలోని ప్రధాన లోపం.<< రొటీన్ స్క్రీన్ ప్లే కి కాస్త భిన్నంగా ప్రయత్నింఛారండి నాకు అలా చెప్పడమే బాగుందనిపించింది.

    ఇందుగారు నెనర్లు. నిజం సినిమా ప్రమోట్ చేసుకోవడంలో విఫలమయ్యారు. ఆ విషయంలో మాత్రం వర్మ గారి దగ్గర నేర్చుకోవాలి. పాటలు కామెడీ కోసం ఎదురు చూసే వాళ్ళు నా సినిమాకు రాకండి అని నిర్మొహమాటంగా చెప్పాడు.

    సుజాత గారు నెనర్లు, నిస్సందేహంగా వెళ్ళి వచ్చి ఎలా ఉందో చెప్పండి. పిల్లలతో వెళ్తే భాష విషయంలో కొంచెం అసౌకర్యం గా ఫీల్ అయ్యే అవకాశం ఉంది. ఏ విథమైన అంచనాలు లేకుండా చూడండి సినిమా నచ్చుతుంది కనీసం నిరుత్సాహ పరచదు.

    ప్రవీణ్ గారు మీ అభిప్రాయాలను మరోసారి పంచుకున్నందుకు ధన్యవాదాలు.

    హరేకృష్ణ నెనర్లు, నిజమండీ పంచ్ లు కామెడీ బాగున్నాయ్ కానీ కొందరు ఎందుకో అంతగా కనెక్ట్ అవలేకపోతున్నాం అంటున్నారు కామెడీ తో.

    రిప్లయితొలగించండి
  14. ‘ఖలేజా’లో వినోదం లేదని కాదు కానీ, ఓవరాల్ గా అసంతృప్తినే కలిగించింది నాకు.

    క్లయిమాక్స్ మరీ పేలవం. విలన్ చెయ్యి తెగి రక్తమోడుతూ నడుస్తూ గుట్టలెక్కుతూ, ఆంబులెన్స్ తెప్పించమని హీరోని అభ్యర్థిస్తుంటే ... కొంతమంది ప్రేక్షకులకైనా కాస్త జాలి కలిగిందంటే అది కథనంలో లోపమే!

    పల్లె రక్షకుడైన హీరోని గుర్తించటానికి ప్రకృతి పరమైన గుర్తులూ, హీరో అన్వేషణలో గవ్వలు వేసి దిక్కును కనిపెట్టటం, పల్లె జనసంఖ్య ఎప్పటికీ మారకపోవటం... ఇలా లాజిక్ లేని మూఢ నమ్మకాలు సాంఘిక కథల్లోకి చొచ్చుకురావటం సరికొత్త పాత ట్రెండులా అనిపిస్తోంది!

    రిప్లయితొలగించండి
  15. ఈ సినిమా నేను చూడలేదు ..కాని కాని మహేష్ బాబు ఫాన్ ని నేను ..ఇప్పుడేమి కామెంటను

    రిప్లయితొలగించండి
  16. శివరంజని గారు నెనర్లు, మీరు రివ్యూలకు భయపడి కనుక సినిమా చూడనట్లయితే ఆనందంగా వెళ్ళి చూడచ్చండి. చూసి వచ్చి ఎలా ఉందో చెప్పండి.

    వేణు గారు నెనర్లు,
    నిజమే క్లైమాక్స్ చాల వీక్ గా ఉంది. నాకు కూడా నచ్చలేదు, అసలు అలాంటి ఒక రోల్ కు ప్రకాష్ రాజ్ లాంటి నటుడు అవసరమా అనిపించింది.
    సినిమాలో మూఢనమ్మకాలు గురించి మీరు చెప్పింది కూడా కరెక్టే... కానీ పల్లెల్లో ఇలాంటి నమ్మకాలు చాలా సాథారణం అదీకాక ఒక ఉపద్రవం ముంచుకు వచ్చినపుడు విచక్షణ వెనకకు వెళ్ళడం సహజమే. ఊరంతా నమ్మినా రాజు తనే దేవుడ్ని అనే విషయం సినిమా అయ్యాక కూడా నమ్మడు, రావు రమేష్ కూడా నమ్మించాల్సిన అవసరం లేదు అంటాడు. స్వలాభం చూసుకోకుండా సాటిమనిషికి మేలు చేయగలిగిన ప్రతి మనిషి దేవుడే అని నమ్మి రాజు ఆ ఊరికి సాయం చేశాడు అంతే.
    పల్లె జనసంఖ్య ఎప్పటికీ మారదు అని చెప్పలేదండీ. ఫస్ట్ సీన్లోనే ఎందుకు ఇలా చనిపోతున్నారు అని అడిగినపుడు ఊరివాళ్ళలో 534 మంది మాత్రం రక్షింపబడతారు అని చెప్తాడు. అంతేకానీ ఇకపై జనాభా అంతకు మించి పెరగదనేది అతని ఉద్దేశ్యం కాదు.

    రిప్లయితొలగించండి
  17. మహేష్ నీరసపు నటనా, ఆ భయ్యా అన్న మా౨నరిజం మంటెక్కించాయి. అవొదలేస్తే, సినిమా అద్భుతమే. టేకింగ్ చాలా బాగుంది కానీ, స్పష్టతే అంతనిపించలేదు. బోరు కొట్టిన సందర్భాలూ ఉన్నాయి...

    ఓవరెక్స్పెక్టేషన్స్!!! అయినా మహేష్ తన సినిమా గురించి సరిగ్గా ఎప్పుడు చెప్పాడు చెప్పండి. అన్ని సినిమాలూ అద్భుతమైన... అన్నట్టే అంటాడు. అయ్యాక నాలుక కర్చుకుంటాడు. ఈ విషయంలో కృష్ణే నయం.

    సినిమా మాత్రం గీతాచార్య బ్లాగు టపాలా ఉందని మాత్రం చెప్పగలను ;-)

    రిప్లయితొలగించండి
  18. ఏమో బాబు నాకు నచ్చింది...కాని స్టోరీ కొంచెం తికమక అనిపించింది..ప్రకాష్ రాజ్ పాత్రని సరిగ్గా చూపలేకపోయాడు..నాకైతే అనుష్కా కంటే ఇంకో అమ్మాయి ఉంది ..లాస్ట్లో విలన్ చంపేస్తాడు (వేద) ఆ అమ్మాయి సూపర్ నచ్చింది..దాన్ని పెట్టినా బాగుండేది హీరొయిన్ గా ..అనుష్క ఉహు బాలేదు..

    రిప్లయితొలగించండి
  19. ఇంతకూ ఆ అమ్మాయి పేరు వేద యేనా??

    రిప్లయితొలగించండి
  20. Hello all, here are my two cents on Khaleja.
    http://tumbu-vk.blogspot.com/2010/10/mahesh-khaleja-my-2-cents.html

    రిప్లయితొలగించండి
  21. వేణు గారు నాకు కూడా ఈ సినిమా బగా నచ్చింది. గైడ్ సినిమా చాయలు ఉన్నాయి, త్రివిక్రం చక్కటి కామెడీతో ఆకట్టుకున్నాడు.

    రిప్లయితొలగించండి
  22. గీతాచార్య గారు నెనర్లు, మహేష్ నీరసపునటన ?? హుం!!... భయ్యా అన్న మా౨నరిజం మంటెక్కించాయా :-) నాకు అదే స్పెషల్ అట్రాక్షన్ అనిపించింది. అందుకేనేమో జిహ్వకోరుచి అన్నది. నిజమే కృష్ణగారి దమ్ము స్పష్టత ఆ నిజాయితీ ఇప్పటి తరం నటులలో వెదకడం వృథా శ్రమే..

    నేస్తం గారు నెనర్లు, హహ పాపం అండీ అనుష్క కన్నా వేదకే మార్కులు ఇచ్చారా... అనుష్క మరీ అంత ఘోరంగా ఏమీ లేదండీ కాకపోతే మహేష్ గ్లామర్ ముందు కాస్త చిన్నబోయింది అంతే... అవును ఆ అమ్మాయి పేరు వేద అని కొన్ని సినిమాలలోనూ అర్చన అని మరికొన్ని సినిమాలలోనూ ఉంటుంది.

    గీతూ గారు నెనర్లు, రెండు సెంట్లేంటండీ బాబు ఒక్కొ విభాగాన్ని చీల్చి చెండాడేశారు కదా మీ రివ్యూ లో :-)

    PBVSN రాజు గారు నెనర్లు.

    రిప్లయితొలగించండి
  23. వేణూశ్రీకాంత్ గారూ,
    మీ బ్లాగులు ఇప్పుడే చూస్తున్నా..ఖలేజా అంత గొప్పగా లేదని అందరూ అనేపాటికి లైట్ తీసుకున్నా..కాని మీ రివ్యూ చదివాక చూద్దాం అన్న ఆసక్తి కలిగింది...బాగుంది మీ విశ్లేషణ..మహేష్ నటన కోసమన్నా చూడాలని మా వాళ్ళు అన్నారు..చూడాలి...

    అలాగే మీ సరిగమల బ్లాగుకూడా చూశా..అది ప్రస్తుతం నడుపుతున్నట్టు లేరు..అందుకే ఆ కామెంట్ కూడా ఇక్కడే పెడుతున్నా....

    అక్కడ తిల్లాన రాశారు..మీ ఓపిక్కి మెచ్చుకోవచ్చు...నాక్కూడా తిల్లానాలంటే చాలా ఇష్టం....మాకు కూచిపూడిలో సంప్రదాయంగా చేసే తిల్లాన హిందోళంలో ఉంటుంది...ఆ తిల్లాన వింటున్నా, అభినయం చేస్తున్నా excellent అనుభూతి....foot work కూడా అద్భుతంగా వస్తుంది......ఇక బాలమురళిగారి తిల్లానల్లో కుంతలవరాళి కి మా లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రోగ్రామ్ అప్పుడు మా మాస్టారు నలుగురితో చేయించారు...అద్భుతంగా వచ్చింది...ఇక కదనకుతూహలం తిల్లాన అంటే నాకు ప్రాణం...వింటుంటే నా అడుగులు అస్సలు ఆగవు...లయబధ్ధ్దంగా ఆడుతూనే ఉంటాయి..ఈ సారి ప్రోగ్రామ్ కి అది నేర్చుకోవాలి.....

    ఇవన్నీ గుర్తుచేసినందుకు ధన్యవాదాలు...

    రిప్లయితొలగించండి
  24. కౌటిల్య గారు నెనర్లు,
    రివ్యూలు చదివి భయపడి చూడకుండా ఆగిన వాళ్ళకోసమే ఈ టపా రాసానండీ, నిరభ్యంతరంగా ఒక సారి చూడచ్చు ఈ సినిమా.

    తిల్లానా లు అన్నీ వేటికవే అన్నట్లు ఉంటాయండి. నాకు కూడా చాలా ఇష్టం తరచూ వింటూంటాను, అది రాసినపుడు మిగిలినవి కూడా రాయాలి అనుకున్నా కానీ కుదరడం లేదు మళ్ళీ

    ప్రయత్నించాలి. మీరు డాక్టర్ మాత్రమే అనుకున్నా డాన్సర్ కూడానా.. నా టపా మీ అనుభూతులని మళ్ళీ గుర్తు చేసుకునేలా చేసినందుకు సంతోషం.

    రిప్లయితొలగించండి
  25. ఎక్కడో చూసినట్టుందే, ఎక్కడో చూసినట్టుందే అని తెగ ఆలోచిస్తున్నాను. మహేష్ నీరసపు ఎక్స్ప్రెషన్లు కొన్ని ద ఫౌంటయిన్‍హెడ్ చెత్త్రరాజము లో గా౨రీ కూపరు వారివి ఏకంగా ఎత్తుకొచ్చేశాడు.

    అవొదిలేస్తే, ఫైట్లలో ఫర్లేదు :)

    రిప్లయితొలగించండి
  26. హ హ గీతచార్య ’చె’త్త్రరాజము టైపాటా లేక సృజనాత్మకతా ఏమైనా బాగుంది :-) ఆ సినిమా నే చూడలేదు లెండి కనుక నాకు తెలియదు.

    రిప్లయితొలగించండి
  27. టైపాటు కాదు, అంత గొప్ప నవలని చెత్తన్నర చెత్తగా, కొన్ని సీన్లైతే స్పూఫుల్లా అనిపించాయి నాకు. అలా తీశారు సినిమాని. అందుకే చెత్త్ర రాజమన్నది :)

    రిప్లయితొలగించండి
  28. ya i heard the similar feed back. అందుకే చూసే ధైర్యం చేయలా..

    రిప్లయితొలగించండి
  29. very good analysis. I agree with every word u wrote.
    ఫ్లాప్ టాక్ ఎందుకు వచ్చిందో నాకు తెలియదు కానీ నేను అయితే బాగా ఎంజాయ్ చేసాను. మహేష్ నటన చాలా బాగుంది. పంచ్ డైలాగుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కథ స్ట్రైట్ గా చెప్పకుండా ఇలా చెప్పడం చాలా బాగుందనిపించింది.

    రిప్లయితొలగించండి
  30. సాయి ప్రవీణ్ గారు నెనర్లు, పైన టపాలో చెప్పిన కారణాలు, చాలా కొత్త సినిమాలతో పాటు రిలీజ్ అవడం లాంటి వాటితో పాటు ఆ నిర్మాతదో హీరోదో అదృష్టం కూడా బాగాలేక ఫలితం ఇలా ఐఉంటుందండి.

    రిప్లయితొలగించండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.